సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచన లు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్‌పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అభ్యర్థుల ఆందోళనకు చెక్
ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఐదు నెలల క్రితమే తెలిపింది. కమిషన్ షెడ్యూల్ ఆధారంగా ఆగస్టులో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలకు గురుకుల బోర్డు సన్నద్ధమై పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించి నిర్వహిస్తోంది. వరుసగా ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తుండటం... ఆ తర్వాత 29, 30 తేదీల్లో 5.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే గ్రూప్–2 పరీక్షలుండటంతో అభ్యర్థులపై ఒత్తిడి తీవ్రమవుతుందనే వాదన తెరపైకి వచ్చింది.
ఈక్రమంలో పలు రకాలుగా కమిషన్‌కు వినతులు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కమిషన్ కార్యాలయ ముట్టడికి సైతం అభ్యర్థులు దిగడం... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం... మరోవైపు కొందరు అభ్యర్థులు న్యాయపోరాటానికి సైతం ఉపక్రమించడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పరీక్ష నిర్వహణను వాయిదా వేయడంతో అభ్యర్థుల ఆందోళనకు చెక్ పడింది.
Comments
Please login to add a commentAdd a comment