డిప్యూటీ సీఎం భట్టికి వినతిపత్రం అందిస్తున్న నిరుద్యోగులు. చిత్రంలో ఎంపీలు మల్లురవి, బలరాం నాయక్
నిరుద్యోగుల అభ్యర్థనకు సర్కారు అంగీకారం
పోస్టుల సంఖ్య పెంచేందుకు, కొత్త నోటిఫికేషన్ జారీకి ఆమోదం
ఓవర్ లాపింగ్ లేకుండా నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌తో కలిసి నిరుద్యోగులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయడానికి అంగీకరించింది. దీంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచేందుకు, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌లు నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఆయా అంశాలపై చర్చించిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు గ్రూప్–2 పరీక్షల వాయిదాపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితోనూ ప్రభుత్వం మాట్లాడింది. చర్చల సందర్భంగా నిరుద్యోగుల డిమాండ్లను సానుకూలంగా సానుకూలంగా ఆలకించిన తర్వాత డిప్యూటీ సీఎం స్పందించారు.
3 నెలల్లో 54 వేల ఉద్యోగాలకు మోక్షం: భట్టి
గ్రూప్–2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని భట్టి చెప్పారు. డిసెంబర్‌లో పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 నెలల వ్యవధిలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించిందని అన్నారు. మరిన్ని ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ కేలండర్‌ను ప్రకటించే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైందని వెల్లడించారు.
ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు ఇప్పటికే స్థిరపడేవన్నారు. ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుంది కానీ, ప్రజా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించదని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు స్థిరపడాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. కొందరు వారి స్వలాభం కోసం నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్
విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని భట్టి చెప్పారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అధునాతన టెక్నాలజీతో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ పద్ధతిలో శిక్షణ ఇస్తామని, దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారని చెప్పారు.
ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వం: ఎంపీలు
గ్రూప్–2 పరీక్షల పోస్టులను పెంచుతూ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తెలిపారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంతో సమావేశం తర్వాత మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు.
పరీక్షలకు సమయం ఇవ్వాలి: గ్రూప్–2 అభ్యర్థులు
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని గ్రూప్–2 అభ్యర్థులు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ విజ్ఞప్తిని మన్నించారంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్ పోస్టులను వీలైనంత వరకూ పెంచాలని, అలాగే పరీక్షలకు వీలైనంత సమయాన్ని ఇవ్వాలని విద్యార్థులు సుఖేష్ (సిద్దిపేట జిల్లా), నవీన్ (హుస్నాబాద్), మహేష్ (ఖమ్మం) కోరారు. డీఎస్సీ పరీక్షలు రాసేవారు కూడా చాలామంది గ్రూప్ పరీక్షలు రాస్తున్నారని, అందువల్ల కనీసం మూడు నెలలైనా పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్ పరీక్షల కోసం రూ.5 భోజనం చేస్తూ సిద్ధమవుతున్నామని, ప్రభుత్వం నిరుద్యోగులపై కరుణ చూపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment