
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా... మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’.. అని సింహగిరికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించేసరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా... స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా’.. అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు.
‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి’.. అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగడంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి. తాము ఉంగరం తీయలేదని ఎంతచెబుతున్నా వినకుండా మీరే దొంగ అని పదే పదే ప్రశ్నించడంతో వారంతా కోపోద్రేకాలతో చిందులు వేశారు.
పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని... దొంగిలించిన ఉంగరం ఇలాగే ఉంటుందంటూ స్థానాచార్యులు నిలదీయడంతో భక్తులు నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ.. సింహగిరిపై ఆదివారం సందడిగా జరిగిన స్వామి వినోదోత్సవం. సింహగిరిపై జరుగుతున్న స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.
ఉత్సవం సాగిందిలా...
ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టంపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాడుతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యంతం చెందారు. ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది.
విశాఖలోని గాయత్రి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న లాస్య, తనుశ్రీ, సుమేధలను, కొత్తవలసకి చెందిన భార్గవి, మోహిత, శ్రావణ్ అనే విద్యార్థులను, విజయనగరానికి చెందిన ఎంబీఏ విద్యార్థినులు రూప, కుసుమ, పుష్ప, సౌమ్యలను, పలాసకి చెందిన ఫైనలియర్ లా విద్యార్థినులు శశిరేఖ, తమనశ్రీ, నరేణ్యలను, మర్రిపాలెంలోని ఓ గోల్డ్ షాపులో పనిచేస్తున్న వడ్డాదికి చెందిన వీర వెంకట సత్యనారాయణ అనే భక్తుడుని పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌కి చెందిన భక్తులను, ఎకై ్సజ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న యలమంచిలికి చెందిన సత్యనారాయణమూర్తి కుటుంబాన్ని, పెళ్లి చేసుకొని స్వామి దర్శనానికి వచ్చిన నూతన జంటలను తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం..
దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమానం వ్యక్తం చేయడంతో వారందతా వాదనకు దిగారు. ఆ తర్వాత నవ్వుతూ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుగుపయనం అయ్యారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు దొంగలుగా పట్టుబడ్డారు. తొలుత స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ని, ఆఖరులో పురోహిత్ అలంకారి సీతారామాచార్యులను తాడుతో బంధించి తీసుకురావడం విశేషం.