Gold ring
-
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా... మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’.. అని సింహగిరికి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించేసరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా... స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా’.. అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి’.. అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగడంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి. తాము ఉంగరం తీయలేదని ఎంతచెబుతున్నా వినకుండా మీరే దొంగ అని పదే పదే ప్రశ్నించడంతో వారంతా కోపోద్రేకాలతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని... దొంగిలించిన ఉంగరం ఇలాగే ఉంటుందంటూ స్థానాచార్యులు నిలదీయడంతో భక్తులు నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ.. సింహగిరిపై ఆదివారం సందడిగా జరిగిన స్వామి వినోదోత్సవం. సింహగిరిపై జరుగుతున్న స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఉత్సవం సాగిందిలా...ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టంపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాడుతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యంతం చెందారు. ఉత్సవం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. విశాఖలోని గాయత్రి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న లాస్య, తనుశ్రీ, సుమేధలను, కొత్తవలసకి చెందిన భార్గవి, మోహిత, శ్రావణ్ అనే విద్యార్థులను, విజయనగరానికి చెందిన ఎంబీఏ విద్యార్థినులు రూప, కుసుమ, పుష్ప, సౌమ్యలను, పలాసకి చెందిన ఫైనలియర్ లా విద్యార్థినులు శశిరేఖ, తమనశ్రీ, నరేణ్యలను, మర్రిపాలెంలోని ఓ గోల్డ్ షాపులో పనిచేస్తున్న వడ్డాదికి చెందిన వీర వెంకట సత్యనారాయణ అనే భక్తుడుని పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌కి చెందిన భక్తులను, ఎకై ్సజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యలమంచిలికి చెందిన సత్యనారాయణమూర్తి కుటుంబాన్ని, పెళ్లి చేసుకొని స్వామి దర్శనానికి వచ్చిన నూతన జంటలను తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమానం వ్యక్తం చేయడంతో వారందతా వాదనకు దిగారు. ఆ తర్వాత నవ్వుతూ స్వామి ఆశీస్సులు తీసుకుని తిరుగుపయనం అయ్యారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు దొంగలుగా పట్టుబడ్డారు. తొలుత స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ని, ఆఖరులో పురోహిత్ అలంకారి సీతారామాచార్యులను తాడుతో బంధించి తీసుకురావడం విశేషం. -
వడ్డీ కాసులవాడా... గోవిందా..!
కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న ఆడిటర్ అతడు. డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత ఒక్కటే పీడిస్తోంది. దాంతో ఏడుకొండల వాడిని ప్రార్థించాడు. మగ పిల్లవాడు పుడితే తన చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు... ఏడాదికే మగ పిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు ఆ ఆడిటర్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే, ‘ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము’ అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు.ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టు పట్టేసరికి కొడుకు ఐదో పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఈ ఉంగరం ఖరీదు పది హేనువేలు, ఇప్పుడు దీని ఖరీదు ఇరవై వేలు. ఈ ఉంగరం ఉంచేసుకుని స్వామి వారి హుండీలో పదిహేను వేలు వేద్దామనుకున్నాడు. కొడుకును తీసుకుని తిరుమల కొండ చేరాడు. ఆరోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ, ఎలాంటి తొడుగు లేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆపాదమస్తకం కన్నులారా తిలకించి ‘‘ధన్యుడిని స్వామీ...’’ అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకును తీసుకుని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే పదిహేనువేల నూట పదహార్లు హుండీలో వేసి ‘‘మొక్కు చెల్లించేశాను స్వామీ... బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను. రుణ విముక్తుడినైనాను’’ అని హుండీకి దండం పెట్టుకుని అక్కడినుంచి కదిలాడు.తండ్రీ కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్నచిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికి లాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తియ్య తియ్యగా ఉన్న లడ్డును ఆ అయిదేళ్ళ పిల్లవాడు గబగబా తినేశాడు. ‘‘అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్నా వీళ్ళు?’’ అని ఆశగా అడిగాడు. ‘ఒక్కరికి ఒక్కటే బాబూ... కావాల్సి ఉంటే నా లడ్డు తీసుకో!’’ అని కొడుకు చేతికి ఇచ్చాడు.తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా ‘‘నీ ఉంగరం ఏది నాన్నా?’’ అని అడిగాడు.అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ‘ఏమి జరిగిందా...’ అని లిప్తపాటు కళ్ళు మూసుకుని ఆలోచించాడు.ఆరు నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్డుల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది.‘అంటే... హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్న మాట. నిద్ర లేచింది మొదలు, రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ వడ్డీ కాసులవాడు... ఎంత తప్పు చేశాను... స్వామీ నన్ను క్షమించు!!’’ అని తలెత్తి ధ్వజ స్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
చెత్త బుట్టలో ఉంగరాన్ని పడేసుకున్న మహిళ.. ‘స్పందన’తో స్పందన
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ చిత్రమైన ఫిర్యాదు అందింది. ఒక మహిళ ఫోన్ చేసి తన ఉంగరం పొరపాటున ప్రభుత్వ చెత్త బుట్టలో పడిపోయిందని చెప్పింది. ఆ ఉంగరాన్ని వెతికించి.. ఇవ్వాలని కోరింది. దీంతో శానిటేషన్ సిబ్బంది చెత్తనంతా జల్లెడ పట్టి.. చివరకు ఉంగరాన్ని ఆమెకు అప్పగించారు. వివరాలు.. ఇన్నీస్‌పేటకు చెందిన నాగలక్ష్మి సోమవారం తన ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి.. సమీపంలోని ప్రభుత్వ చెత్త తొట్టెలో వేసింది. ఆ తర్వాత కొంతసేపటికి.. తన చేతికి ఉన్న 6 గ్రాముల బంగారు ఉంగరం కనబడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. చెత్త బుట్టలో జారిపోయి ఉంటుందన్న సందేహంతో.. అక్కడకు వెళ్లింది. కానీ అదంతా చెత్తతో నిండిపోయి ఉండటంతో.. నాగలక్ష్మి ‘స్పందన’ కార్యక్రమాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ దినేశ్‌కుమార్.. స్థానిక సచివాలయ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను అప్రమత్తం చేశారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుద్ధ శ్రీను, శానిటేషన్ సెక్రటరీ ఎం.రాజేశ్, పారిశుధ్య కార్మికులు బంగారు శ్రీను, జయకుమార్, మేస్త్రీ శ్రీను దాదాపు 5 గంటల పాటు చెత్తనంతా వెతికి.. ఉంగరాన్ని బాధితురాలికి అందజేశారు. దీంతో నాగలక్ష్మి వారికి కృతజ్ఞతలు తెలిపింది. -
ఆ రోజు పుట్టే శిశువులకు బంగారు ఉంగరం: డీఎంకే నేత
తిరుత్తణి: ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదినమైన మార్చి1వ తేదీన తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరాన్ని కానుకగా అందజేయనున్నట్లు డీఎంకే జిల్లా కన్వీనర్ భూపతి తెలిపారు. తిరుత్తణిలో ఆదివారం డీఎంకే జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో కన్వీనర్ భూపతి, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జన్మదినం రోజున భారీగా వేడుకలు నిర్వహించి పేదలకు సహాయకాలు పంపిణీ చేయాలని సూచించారు. మరో ఘటనలో.. కయోజెనిక్ ఇంజిన్ ప్రయోగం విజయవంతం సాక్షి, చెన్నై : తిరునల్వేలి జిల్లా మహేంద్ర గిరి ఇస్రో కేంద్రంలో ఆదివారం క్రయోజెనిక్ ఇంజిన్ ప్రయో గం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఇస్త్రో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రూ. 10 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2023లో అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఉపయోగించే క్రయోజెనియ్ ఇంజిన్‌ను మహేంద్రగిరిలోని ఇస్రో కేంద్రంలో రూపొందించి పరీక్షిస్తున్నారు. సీఈ –20 పేరిట సిద్ధం చేసిన ఈ ఇంజిన్‌ను ఇప్పటికే మూడు విడతలుగా పరీక్షించినట్లు వెల్లడించారు. తాజాగా నాలుగో విడతలో 100 సెకన్ల పాటూ ఈ ఇంజిన్ పనితీరును పరిశీలించారు. -
ఉం‘గరం..గరం’
అనగనగా ఓ వజ్రపుటుంగరం చేతి వేలు నుంచి దారి తప్పింది. ఓ రక్షణ భటుడి చేతిలో పడింది. దానిని ఆయన ఓ అర్చకుడికి ఇచ్చారు. అక్కడ ఇక్కడా ఆరా తీసిన అర్చకుడు..ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆలయ అధికారికి అప్పజెప్పారు. అటుఇటుగా నెల రోజులైంది. ఎవరూ దాని కోసం రాలేదు. భద్రంగా దాచిన అధికారి సైతం ఈ విషయమే మరచినట్లు వ్యహహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉంగరం విషయం ఆరా తీయడానికి వచ్చిన రక్షక భటునికి గట్టి సమాధానమే ఎదురైంది. ఎవరు నువ్వు అనడంతో ఖంగుతినడం ఆయన వంతైంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అహోబిలం(ఆళ్లగడ్డ) : తనకు దొరికిన లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు ఉంగరం ఓ కానిస్టేబుల్ నిజాయితీతో ఆలయ అధికారులకు అప్పగిస్తే దానిని గుట్టుచప్పుడు నొక్కేసే ప్రయత్నం కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో చోటు చేసుకుంది. దిగువ అహోబిలం క్షేత్రంలో గత నెల 27వ తేదీ స్వాతి ఉత్సవ సందర్భంగా హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉభయదారులు ఈ హోమంలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సమయంలో ఓ భక్తుని ఉంగరం హోమం నిర్వహించే ప్రదేశంలో పడిపోయింది. రద్దీ ఎక్కవగా ఉండటంతో ఎవరూ గమనించలేదు. అక్కడే భక్తుల సమక్షంలో హోమం దగ్గర కూర్చుని స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ యువై యల్లప్పకు ఈ ఉంగరం కనిపించింది. అది వజ్రాలు, కెంపులు పొదిగిన ఉంగరంగా గుర్తించిన యల్లప్ప.. నిజాయతీతో అక్కడ హోమం నిర్వహిస్తున్న ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌కు ఇచ్చారు. ఉంగరం పోగొట్టుకున్న వ్యక్తులు రావాలని మైకులో అనౌన్స్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆలయ ఈఓకు దానిని అప్పగించారు. ఒకటి రెండు రోజులు చూసి విచారించి ఎవరూ రాక పోతే అందరి సమక్షంలో స్వామి హుండీలో వేద్దామని నిర్ణయించుకున్నారు. వారం, పదిరోజులైనా ఎవరూ రాలేదు. అధికారులు, అర్చకులు ఆ ఉంగరం గురించి పట్టించుకోకపోవడంతో పాటు ఈఓకు సన్నిహితులైన సిబ్బంది దొరికిన ఉంగరం సాధారణమైనదనే ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఉంగరం దొరికిన కానిస్టేబుల్ యుల్లప్ప.. అధికారి దగ్గరకు వెళ్లి దానిని అందరి సమక్షంలో హుండీలో వేద్దామని సూచించారు. రెండ్రోజుల తరువాత ఆలోచిస్తామని ఆయన చెఆప్పరు. మరో పది రోజులు తరువాత ఆ అధికారి దగ్గరకు వెళ్లి ఉంగరం గురించి అడగ్గా ఆగ్రహంతో ఎవరు నువ్వు..అని ప్రశ్నించడంతో ఆయన తెల్లబోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ప్రధాన అర్చకులతో పాటు స్థానిక సీఐకి కూడా తెలిపినట్లు హెడ్ కానిస్టేబుల్ యల్లప్ప తెలిపారు. ఇదే విషయమై ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ మాట్లాడుతూ..ఉంగరం దొరికిన మాట వాస్తమేనని..దానిని ఆలయంలోనే భద్రపరిచామన్నారు. పోగొట్టుకున్న వారు వస్తే ఇస్తామని చెబుతున్నారు. -
ఉంగరం కోసం చేతినే కోసేశారు
విశాఖ: నిద్రపోతున్న వ్యక్తి ఉంగరాన్ని అపహరించేందుకు ప్రయత్నించిన దొంగలు ఉంగరం రాకపోవడంతో ఏకంగా కత్తితో చేతినే గాయపరిచి పరారైన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. విశాఖపట్నం రైల్వే న్యూకాలనీకి చెందిన మాణిక్యం.. ఉత్సవం సందర్భంగా కశింకోటలోని అత్తమామల ఇంటికి వచ్చాడు. ఆరుబయట పడుకున్న మాణిక్యంపై రాత్రి 2 గంటల సమయంలో దొంగలు అతని చేతి ఉంగరాన్ని అపహరించేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఉంగరం రాకపోవడంతో మత్తు మందు చల్లి కత్తితో ఉంగరపు వేలు కోశారు. అయినప్పటికీ రాకపోవడంతో వేళ్ల దిగువ భాగాన్ని కత్తితో కోసి చీల్చేశారు. ఇంతలో మెలకువవచ్చి కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారని బాధితుడు తెలిపాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించాడు. వరుస దొంగతనాలతో కశింకోట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉంగరం కోసం కిడ్నాప్..!
హైదరాబాద్ : సోమవారం మధ్యాహ్నం నగరంలో కలకలం రేపిన కిడ్నాప్ ఘటన చిన్నారి వేలికి ఉన్న బంగారు ఉంగరం కోసం జరిగిందని స్పష్టం అయింది. చింతల సాయినగర్ కాలనీకి చెందిన సాయి నవదీప్(4) అనే చిన్నారిని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు మూడు గంటల అనంతరం సుచిత్ర వద్ద వదలివెళ్లారు. బాబు కిడ్నాప్ కావడానికి ముందు చేతి వేలికి ఉన్న ఉంగరం మాయమవడంతో.. బంగారం కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడికి సరిగ్గా మాటలు రాకపోవడంతో.. కిడ్నాపర్ల వివరాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది.