యువై ఎల్లప్ప ,వేణుగోపాలన్ ,అహోబిల దేవస్థానం
అనగనగా ఓ వజ్రపుటుంగరం చేతి వేలు నుంచి దారి తప్పింది. ఓ రక్షణ భటుడి చేతిలో పడింది. దానిని ఆయన ఓ అర్చకుడికి ఇచ్చారు. అక్కడ ఇక్కడా ఆరా తీసిన అర్చకుడు..ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆలయ అధికారికి అప్పజెప్పారు. అటుఇటుగా నెల రోజులైంది. ఎవరూ దాని కోసం రాలేదు. భద్రంగా దాచిన అధికారి సైతం ఈ విషయమే మరచినట్లు వ్యహహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉంగరం విషయం ఆరా తీయడానికి వచ్చిన రక్షక భటునికి గట్టి సమాధానమే ఎదురైంది. ఎవరు నువ్వు అనడంతో ఖంగుతినడం ఆయన వంతైంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అహోబిలం(ఆళ్లగడ్డ) :
తనకు దొరికిన లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు ఉంగరం ఓ కానిస్టేబుల్ నిజాయితీతో ఆలయ అధికారులకు అప్పగిస్తే దానిని గుట్టుచప్పుడు నొక్కేసే ప్రయత్నం కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో చోటు చేసుకుంది. దిగువ అహోబిలం క్షేత్రంలో గత నెల 27వ తేదీ స్వాతి ఉత్సవ సందర్భంగా హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉభయదారులు ఈ హోమంలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సమయంలో ఓ భక్తుని ఉంగరం హోమం నిర్వహించే ప్రదేశంలో పడిపోయింది. రద్దీ ఎక్కవగా ఉండటంతో ఎవరూ గమనించలేదు. అక్కడే భక్తుల సమక్షంలో హోమం దగ్గర కూర్చుని స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ యువై యల్లప్పకు ఈ ఉంగరం కనిపించింది. అది వజ్రాలు, కెంపులు పొదిగిన ఉంగరంగా గుర్తించిన యల్లప్ప.. నిజాయతీతో అక్కడ హోమం నిర్వహిస్తున్న ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌కు ఇచ్చారు. ఉంగరం పోగొట్టుకున్న వ్యక్తులు రావాలని మైకులో అనౌన్స్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆలయ ఈఓకు దానిని అప్పగించారు.
ఒకటి రెండు రోజులు చూసి విచారించి ఎవరూ రాక పోతే అందరి సమక్షంలో స్వామి హుండీలో వేద్దామని నిర్ణయించుకున్నారు. వారం, పదిరోజులైనా ఎవరూ రాలేదు. అధికారులు, అర్చకులు ఆ ఉంగరం గురించి పట్టించుకోకపోవడంతో పాటు ఈఓకు సన్నిహితులైన సిబ్బంది దొరికిన ఉంగరం సాధారణమైనదనే ప్రచారం మొదలుపెట్టింది. దీంతో ఉంగరం దొరికిన కానిస్టేబుల్ యుల్లప్ప.. అధికారి దగ్గరకు వెళ్లి దానిని అందరి సమక్షంలో హుండీలో వేద్దామని సూచించారు. రెండ్రోజుల తరువాత ఆలోచిస్తామని ఆయన చెఆప్పరు. మరో పది రోజులు తరువాత ఆ అధికారి దగ్గరకు వెళ్లి ఉంగరం గురించి అడగ్గా ఆగ్రహంతో ఎవరు నువ్వు..అని ప్రశ్నించడంతో ఆయన తెల్లబోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ప్రధాన అర్చకులతో పాటు స్థానిక సీఐకి కూడా తెలిపినట్లు హెడ్ కానిస్టేబుల్ యల్లప్ప తెలిపారు. ఇదే విషయమై ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ మాట్లాడుతూ..ఉంగరం దొరికిన మాట వాస్తమేనని..దానిని ఆలయంలోనే భద్రపరిచామన్నారు. పోగొట్టుకున్న వారు వస్తే ఇస్తామని చెబుతున్నారు.