Police Constable
-
బళ్లారిలో కీచక ఖాకీలు
సాక్షి,బళ్లారి: భర్త వేధింపుల నుంచి రక్షణ కోరుతూ పోలీసు స్టేషన్ గడప తొక్కిందామె. కానీ, అక్కడ రక్షక భటులే కీచకులయ్యారు. ఆమెను భర్త నుంచి విడగొట్టి.. ఒంటరిని చేసి మరీ లైంగిక దాడుకు దిగారు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఇద్దరు కీచక కానిస్టేబుళ్ల గుట్టు రట్టయింది. నగరంలోని బండిహట్టిలోని పద్మశ్రీ కాలనీకి చెందిన ఓ మహిళ 2023 ఏప్రిల్‌లో తన భర్త ప్రతి రోజు చిత్రహింసకు గురి చేస్తున్నారని, అతని బారి నుంచి రక్షణ కల్పించాలని కౌల్‌బజార్ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అనే కానిస్టేబుల్ సానుభూతిగా మాట్లాడుతూ ఫోన్ నంబరు తీసుకున్నాడు. మరుసటి రోజు భర్త సతాయించడంతో ఆమె ఇమ్రాన్‌ఖాన్‌కి కాల్ చేసి చెప్పింది. అతడు ఫోన్ చేసి ఆమె భర్తను గదమాయించాడు. అప్పటినుంచి ఆమెతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆమెకు డబ్బులు ఆశ చూపి, ప్రత్యేకంగా ఓ ఇల్లు బాడుగకు ఇప్పించి సహ జీవనం ప్రారంభించాడు. కొన్నాళ్లపాటు వ్యవహారం సాగించిన ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నాడు. కేసు నమోదు, ఒకరి అరెస్టు హిళ విషయం తెలిసి ఆజాద్ అనే మరో కానిస్టేబుల్.. ఆమెకు దగ్గరయ్యాడు. ఇంతలో ఇమ్రాన్‌ఖాన్ కూడా వారి మధ్యకు వచ్చాడు. తాము చెప్పినట్లు వినకపోతే యాసిడ్‌తో దాడి చేస్తామని కూడా బెదిరించారట. చివరకు వారి నరకయాతనను తట్టుకోలేని బాధితురాలు ఇద్దరు కానిస్టేబుళ్లు తనను నమ్మించి మోసం చేశారని మహిళా పోలీసు స్టేషన్లో లైంగికదాడి కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ బాగోతం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ పరీక్షల(స్టేజ్–2) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్టికెట్లనువెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో సూచించింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం
గజ్వేల్‌రూరల్: మారథాన్ పోటీలో పాల్గొనేందుకు వెళుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటనతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన వర్కల్ పరంధాములు(46) రాయపోల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, గాడిచర్లపల్లికి చెందిన పూసల వెంకటేశ్(38) దౌల్తాబాద్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు హైదరాబాద్‌లోని ఈసీఎల్ ప్రాంతంలో మారథాన్(రన్) కార్యక్రమం ఉండడంతో వీరు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.ఈ క్రమంలో పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు మార్గంలో రాంగ్రూట్లో వెళుతుండగా, ఇదే సమయంలో గజ్వేల్ నుంచి దౌల్తాబాద్ వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెల్మెట్లు ధరించినా, తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరమని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణంలోనూ వీడని స్నేహం: మరణంలోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ మృతుల కుటుంబసభ్యులు చెప్పారు. పరంధాములుది 2004 బ్యాచ్ కాగా, వెంకటేష్ 2007 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ఎక్కడ మారథాన్ పోటీలు జరిగినా పోలీస్‌శాఖ తరపున వెళ్లి పాల్గొనే వారని తోటి పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. పోలీస్‌శాఖలో మారథాన్ పోటీల్లో పాల్గొనేవారు ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సభ్యులుగా ఉన్న వెంకటే‹Ù, పరంధాముల మధ్య స్నేహం ఏర్పడింది. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తోపాటు ముంబయి, న్యూఢిల్లీలో సైతం జరిగిన మారథాన్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
పరువు, ఆస్తి కోసమే హత్య
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు ఆస్తి కోసం బెదిరిస్తోందనే కారణంతో సొంత అక్కను చంపిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలను సీఐ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారంతోనే కానిస్టేబుల్ నాగమణిని ఆమె సొంత తమ్ముడు కొంగర పరమేశ్(26) హత్య చేశాడని పేర్కొన్నారు. నాగమణి కదలికలపై నిందితుడికి సమాచారం ఇచ్చిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మృతురాలు నాగమణికి అక్క హైమావతి, తమ్ముడు పరమేశ్ ఉన్నారు. 2009లో అక్క వివాహం జరగ్గా ఆమె భర్తతో కలిసి తుర్కయంజాల్‌లో నివసిస్తోంది. పదేళ్ల క్రితమే తల్లిదండ్రులు చనిపోవడంతో నాగమణి, పరమేశ్ రాయపోల్‌లోని పెద్దనాన్న సంరక్షణలో పెరిగారు. 2014లో నాగమణికి పటేల్‌గూడ వాసితో వివాహం జరిగింది. ఈ సమయంలో పసుపుకుంకుమల కింద ఎకరా భూమి రాసిచ్చారు. అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నాగమణి అతన్ని వదిలేసి, రాయపోల్ వచ్చేసింది. హయత్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికై కుషాయిగూడ, హయత్‌నగర్ పీఎస్‌లలో పనిచేసింది. 2022లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. రాయపోల్‌లో ఉన్నప్పుడే ఆ గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా ఆమె వినలేదు. దీంతో మొదటి పెళ్లి జరిగిన సమయంలో ఆమెకు ఇచ్చిన ఎకరా భూమిని తిరిగి ఇచ్చేసింది. గత నెల 10న యాదగిరిగుట్టలో శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకుంది. ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్‌గా పనిచేసే శ్రీకాంత్‌తో కలిసి వనస్థలిపురం సహారా ఎస్టేట్స్‌లోని ఓ అద్దెంట్లో కాపు రం పెట్టారు. ఈ క్రమంలో తన ఎకరం తనకు తిరిగివ్వాలని తమ్ముడిని డిమాండ్ చేసింది. కులాంతర వివాహం చేసుకొని తమ పరువు తీయడమేగాకుండా, భూమి ఇవ్వాలని పేచీ పెడుతోందని పరమేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఓ కత్తి (కమ్మ కత్తి)కొని కారులో దాచిపెట్టి అవకాశం కోసం ఎదురుచూడసా గాడు. ఆదివారం భర్తతో కలిసి వచి్చందని తెలియడంతో హత్యకు సిద్ధమయ్యాడు. నాగమణి కదలికలను తెలిపేందుకు స్నేహితుడు అచ్చన శివను ఉపయోగించుకున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై విధులకు బయలుదేరిన విషయాన్ని శివ ఫోన్లో చేరవేశాడు. దీంతో పరమేశ్ కారులో ఆమెను వెంబడించాడు. మన్నె గూడ రోడ్డు జంక్షన్ వద్ద వెనకనుంచి ఢీకొట్టి, కిందపడగానే∙వెంటనే కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు మంగళవారం రాయపోల్ సమీపంలోని జనహర్ష వద్ద పరమేశ్‌ను పట్టుకున్నారు. అతని నుంచి కారుతోపాటు ఐ ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతనికి సహకరించిన శివ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. -
హగ్ ఇస్తేనే పాస్‌పోర్టు ఇస్తా: కానిస్టేబుల్ వేధింపులు
బొమ్మనహళ్లి: యువతి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, తనిఖీ కోసం ఆమె ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె షాకైంది. ఫిర్యాదు చేయడంతో అతనిని సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరు నగరంలోని బ్యాటరాయనపుర ఠాణా పరిధిలో జరిగింది.కోరిక తీర్చమంటూ..ఫిర్యాదు మేరకు వివరాలు.. ఠాణా పరిధిలోని బాపూజీ నగరలో ఉండే ఓ యువతి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంది. ఇందుకోసం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె గురించి తనిఖీ చేయాలని పాస్‌పోర్టు ఆఫీసు నుంచి ఠాణాకు సిఫార్సు వచ్చింది. దీంతో కానిస్టేబుల్ కిరణ్ యువతి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి, నీ సోదరునిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందువలన నీకు పాస్‌పోర్టు రాదు. నీవు నాకు సహకరిస్తే చాలు అని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో ఒక్కసారి కౌగిలించుకుంటా అని వేధించాడని యువతి ఆరోపించింది. మరో గదిలో ఉన్న సోదరుడు ఏమిటీ గొడవ అని రాగా, కానిస్టేబుల్ మాట మార్చి అక్కడి నుంచి జారుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ నంబర్ ఇవ్వకుండా బ్లాక్ చేశాడు. దాంతో బాధితురాలు పశ్చిమ డీసీపీ ఎస్. గిరీష్‌ని కలిసి గోడు వెళ్లబోసుకుంది. పోలీసు తప్పు చేసినట్లు గమనించి అతన్ని సస్పెండ్ చేశారు.ముడుపుల గోలకాగా, నగరమే కాకుండా రాష్ట్రమంతటా పాస్‌పోర్టు కోసం పెద్దసంఖ్యలో ప్రజలు దరఖాస్తులు చేస్తుంటారు. తనిఖీల సమయంలో పెద్దమొత్తంలో ముడుపులు అడుగుతారని, ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో పెండింగ్‌లో పెడతారని ఆరోపణలు ఉన్నాయి. గొడవ ఎందుకని చాలామంది డబ్బులు ఇచ్చేస్తారు. -
హయత్ నగర్ పీఎస్ కానిస్టేబుల్ నాగమణి హత్య
-
తల్లిని హత్య చేసిన కానిస్టేబుల్
చిత్తూరు అర్బన్: నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని ఓ కుమారుడు హత్య చేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదంలో తల్లిని కాలితో తన్నడంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. తలను గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ తల్లి... మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు... చిత్తూరు దుర్గానగర్ సమీపంలోని రోసీనగర్‌లో ఉంటున్న వసంతమ్మ (63)కు ఇద్దరు కుమారులు.భర్త పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెద్ద కొడుకు శంకర్ చిత్తూరు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా, మరో కొడుకు జ్యోతికుమార్ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శంకర్ ప్రవర్తన నచ్చని తండ్రి బాలసుబ్రమణ్యం రెండేళ్ల క్రితం తన సోదరి ఊరికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. పనిచేసిన స్టేషన్లో ఆరోపణలు రావడంతో శంకర్ కొన్నాళ్లుగా వేకెంట్ రిజర్వు (ఏఆర్)లో ఉన్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం శంకర్ మద్యం మత్తులో తన తల్లితో గొడవకు దిగాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని సతాయించాడు. తల్లితో మాటా మాటా పెరిగి వాగ్వావాదానికి దిగాడు. ఒక్కసారిగా కోపానికిలోనైన శంకర్.. వసంతమ్మను చావ బాదాడు. తలను గోడకేసి కొట్టాడు. కింద పడేసి కాలితో తన్నుతూ, మొహంపై దాడి చేశాడు. ఒక్కసారిగా స్పృహతప్పిన వసంతమ్మ కిందపడిపోయింది. అప్పటికే కేకలు విన్న ఇరుగుపొరుగువాళ్లు ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షల అనంతరం వసంతమ్మ మెదడులో రక్తం గడ్డకట్టిందని, కాలుతో తన్నడంతో పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు.ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. వసంతమ్మ రెండో కుమారుడు జ్యోతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తొలుత దాడి కేసు నమోదుచేసి, ఆపై హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
TGSP: ఎందుకీ వివాదం.. ఏమిటీ ‘ఏక్ పోలీస్’?
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో కొనసాగుతూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆర్టికల్ 311ను తెలంగాణ పోలీస్ శాఖ ప్రయోగించింది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏక్ పోలీస్’? అంటే ఏంటి? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్‌శాఖలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారు. పోలీస్స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారు. అయితే తమను ఐదేళ్లలో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్‌గా మార్చాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయి. జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాంతి భద్రతల అంశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో అప్పగించిన బాధ్యతలను సైతం అద్భుతంగా నిర్వహించిన ఘనత టీజీఎస్పీ సిబ్బందికి ఉంది.దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశాము. పండుగలు, సెలవుల సందర్భాలలో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నాము. వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సమంజసం కాదు’’ అంటూ ప్రకటనలో డీజీపీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కులగణనకు ఇంటింటి సర్వే‘‘యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ తో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట ను పెంచాలి.. కానీ సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. సమస్యలను సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధులను నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న "దర్బార్" కార్యక్రమం ద్వారా వారి అధికారులకు తెలియజేయాలి. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది’’ అంటూ డీజీపీ హెచ్చరించారు. -
బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్ల ఆందోళనలపై రాష్ట్ర పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళన చేయడంపై సరికాదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసింది. బెటాలియన్స్‌లో ఆందోళన చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుళ్ల ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని అనుమానం ఉందన్నారు.కాగా తెలంగాణలో ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలోలనూ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారువరంగల్ జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్ చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు. అయితే మామునూరు బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. టీజీఎస్పీ వద్దు ఏక్ పోలీస్ ముద్దు, టీజీఎస్పీకో హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. -
రౌడీ షీటర్ కిరాతకం: కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్య
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దారుణం చోటు చేసుకుంది. బెయిల్‌పై విడుదలైన ఓ రౌడీ షీటర్.. సూరజ్‌పూర్ జిల్లాలోని మార్కెట్ ఏరియాలో ఓ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలోకి చొరబడ్డాడు. హెడ కానిస్టేబుల్ భార్య, మైనర్ కుమార్తెను హత్యచేశారు. సూరజ్‌పూర్ ఎస్పీ ఎంఆర్ అహిరే తెలిపిన వివారాల ప్రకారం.. ‘‘హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడైన హిస్టరీ-షీటర్ కుల్దీప్ సాహు. ఆదివారం సాయంత్రం మార్కెట్ ప్రాంతంలో కానిస్టేబుల్ ఘన్‌శ్యాం సోన్వానీతో వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా ఆ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశాడు. సోన్వానీకి కాలిన గాయాలయ్యాయి. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. తర్వాత నిందితుడు దుర్గా ఊరేగింపులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆయన మైనర్ కుమార్తె , భార్యను హత్య చేశాడు. షేక్ తన ఇంటికి అర్థరాత్రి చేరుకొని చూడగా.. ఇంట్లో దోపిడి జరిగినట్లు, భార్య, కుమార్తె మృతి చెంది కనిపించారు. దీంతో తాలిబ్ పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం ఉదయం పిధా గ్రామంలో పోలీసులు మహిళ హెడ్ కానిస్టేబుల్ కుమార్తె, భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు’’ అని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. సూరజ్‌పూర్ పట్టణంలోని హెడ్ కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్యలను నిరసిస్తూ నిందితుడు సాహు నివాసం, బయట ఉన్న వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టారు. ఈ హత్య ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. -
Police Constable suicide: ఇద్దరు పోలీసుల ఆత్మహత్య
బూర్గంపాడు/ఏన్కూరు/మహబూబాబాద్ రూరల్: ఓ కేసులో ఉన్నతాధికారులు తనను బలి పశువును చేశారన్న ఆవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాలతో మరో కాని స్టేబుల్ తుపాకీతో కాల్చుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ (34) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో, ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పని చేసినప్పుడు గంజాయి అక్రమ రవాణా కేసులో సాగర్ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులు ఆయనను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేసి ఏడూళ్ల బయ్యారంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన తప్పు లేకున్నా ఎస్సైలు సంతోష్, రాజ్‌కుమా ర్, బీఆర్ఎస్ నాయకుడు నాని తనను గంజాయి కేసులో ఇరికించారని.. ఆ నింద మోయలేకపోతున్నా.. చచి్చపోతున్నా అంటూ సాగర్ ఏన్కూరులోని ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయిని బయట విక్రయించేందుకు ఎస్సైలు త నపై ఒత్తిడి చేశారని, తన సెల్ నుంచే గంజాయి కొనుగోలుదారులకు ఫోన్లు చేయించారని తెలిపాడు. ఇది బయటపడుతుందన్న భయంతోనే తనను అరెస్ట్ చేయించారని ఆరోపించాడు. కాగా, పురుగు మందు తాగిన సాగర్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సా యంత్రం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా ‘రేవంతన్నా.. నా కుటుంబానికి న్యాయం చేయండి’అని మరో సెల్ఫీ వీడియో తీశాడు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలు, ఒక సీఐ, బీఆర్ఎస్ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్సై రఫీ తెలిపారు. కుటుంబ విభేదాలతో.. మరో ఘటనలో తుపాకీతో కాల్చుకుని ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఎన్జీఓస్ కాలనీకి చెందిన గుడిబోయిన శ్రీనివాస్ (59)కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే, విబేధాల కారణంగా ఐదేళ్ల నుంచి వారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ ఐడీఓసీ ఆవరణలోని స్ట్రాంగ్‌రూం వద్ద ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం నల్లబెల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ధరణికి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, వరంగల్ జిల్లా నల్లబెల్లి లోని పోలీస్ క్వార్టర్స్‌లో నివనిస్తోంది. నాలుగు నెలల క్రితం తన పెద్దన్నకు వివాహం అయింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన పెళ్లి విషయమై తరచుగా ఆలోచిస్తూ మనస్తాపానికి గురైన ధరణి.. పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన పోలీసులు మంటలార్పి.. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
దసరా వేడుకల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం...
-
‘అందరూ ఒక్కటై నన్ను బలిపశువును చేశారు’.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలిస్కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది.జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో బుక్యాసాగర్ విధులు నిర్వహించారు. అయితే గంజాయి కేసులో తనని బలిపశువుని చేశారని, చేయని నేరాన్ని తనపై మోపారని, నిందను భరించలేక పురుగులు మంది తాగి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయాడు కానిస్టేబుల్ బుక్యా సాగర్. గతంలో బూర్గంపాడులో పనిచేసిన ఇద్దరు ఎస్ఐలు సంతోష్ ,రాజకుమార్,బీఆర్ఎస్ నాయకుడు నాని తనని బలిపశువుని చేశాడని వాపోయాడు. పురుగులు మందు తాగిన తర్వాత సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపాడు బుక్యాసాగర్. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధిత కానిస్టేబుల్. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
రంగారెడ్డి: తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్‌లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల కాగా, 2018 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాదాస్పదమైన ‘మధురానగర్ ఠాణా’ వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: ‘చట్టం ముందు అంతా సమానులే... కొందరు మాత్రం ఎక్కువ సమానులు’ ఈ మాటను తరచూ వింటూనే ఉంటాం. ప్రస్తుతం నగర కమిషనరేట్‌లో మరో మాట జోరుగా వినిపిస్తోంది. అదే ‘పోలీసు విభాగం క్రమశిక్షణ కలిగిన ఫోర్స్... ఆ క్రమశిక్షణ కింది స్థాయి వారికే పరిమితం’. 👉పశ్చిమ మండల పరిధిలోని మధురానగర్ ఠాణాలో గత నెల 28న చోటు చేసుకున్న పరిణామం, దీనిపై అత్యున్నతాధికారి వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. దీనిపై కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉన్నతాధికారి–కానిస్టేబుల్ పరస్పరం దూషించుకుంటే కేవలం కింది స్థాయి సిబ్బంది పైనే చర్యలు తీసుకున్నా పోలీసు అధికారుల సంఘం పట్టించుకోకపోవడాన్ని తప్పు పడుతున్నారు. కొత్త కొత్వాల్ సీవీ ఆనంద్ మధురానగర్ ఠాణా కానిస్టేబుల్‌తో పాటు ఇలా అన్యాయమైన ఇతర సిబ్బంది, అధికారులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి విధులూ ఆయనే నిర్వర్తిస్తూ... వెస్ట్‌జోన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘అన్ని హోదాల ఉద్యోగాలూ’ ఆయనే చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇందులో భాగంగా మధురానగర్ పోలీస్ స్టేషన్లో గత నెలలో రోల్‌కాల్ నిర్వహించారు. సాధారణంగా ఇలాంటివి ఆ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండే ఇన్స్పెక్టర్.. కీలక సందర్భాల్లో డివిజన్ ఏసీపీ నిర్వహిస్తుంటారు. దీనికి భిన్నంగా ఈ డ్యూటీ చేయడానికీ రంగంలోకి దిగిన ఉన్నతాధికారి ఆ రోజు ఉదయం 10.30 గంటలకు రోల్‌కాల్ అంటూ సిబ్బందికి ఉదయం 9.19 నిమిషాలకు సమాచారం పంపారు. నిర్దేశిత సమయానికి ఉన్నతాధికారి ఠాణాకు చేరుకున్నారు. అయితే డి.తిరుపాల్ నాయక్ అనే కానిస్టేబుల్ మాత్రం అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు ఉన్నతాధికారి ‘యూజ్ లెస్ ఫెలో... డ్యూటీ ఇలాగేనా చేసేది.. పోలీసు డ్యూటీ అనుకున్నావా..? గాడిదలు కాసే పని అనుకున్నావా..?’ అంటూ తనదైన పంథాలో ఊగిపోతూ దూషించారు. పేరుకు విచారణ... వేటు కానిస్టేబుల్ పైనే... ఈ వ్యవహారం అప్పటి అత్యున్నత అధికారి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అయితే ఈ విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. తిరుపాల్‌ను మొదట ఉన్నతాధికారి దూషించారని, ఆ తర్వాతే తిరుపాల్ ఎదురు తిరిగాడని తెలిసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. కేవలం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం తెలిసినప్పటికీ నగర పోలీసు అధికారుల సంఘం కూడా పట్టించుకోలేదు. కేవలం ఉన్నతాధికారులను అభినందించడానికి, అత్యున్నతాధికారికి బొకేలు ఇవ్వడానికే సంఘం నేతలు పరిమితం అయ్యారని విమర్శిస్తున్నారు. కనీసం కానిస్టేబుల్‌కు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయని సంఘం నేతల వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై కొత్త కమిషనర్ అయినా దృష్టి పెట్టాలని, కానిస్టేబుల్ తిరుపాల్‌తో పాటు ఇలా ఇబ్బందులు పాలైన అనేక మంది సిబ్బంది, అధికారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సంజాయిషీ ఇస్తున్నా పట్టించుకోకుండా... అప్పటి వరకు సాధారణ దుస్తుల్లో ఉన్న సదరు కానిస్టేబుల్ సంజాయిషీ ఇవ్వడానికి ప్రయతి్నంచినా ఆయన పట్టించుకోలేదు. దీంతో తిరుపాల్ నాయక్ స్టేషన్ గదిలోకి వెళ్లి యూనిఫాం వేసుకుని బయటకు వచ్చారు. అప్పటికే ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. వెస్ట్‌జోన్‌లో కానిస్టేబుల్ నుంచి అదనపు డీసీపీ వరకు ఆయన పేరు చెప్తే హడలిపోతారు. ఈ పరిణామాలకు తోడు తీవ్ర ఆవేదనలో ఉన్న తిరుపాల్... ‘నువ్వే యూజ్లెస్ ఫెలోరా..! ఎన్ని మాటలు అంటావురా నన్ను... బయట పని చేస్తే ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుందిరా.. నా భార్యకు డెలివరీ అయితే ఆమెను చూసుకుంటున్నారా. ఆమెను నేను కాకుంటే ఎవరు చూసుకుంటార్రా..? చెప్తే అర్థం చేసుకోకుండా దూషిస్తున్నావు’ అంటూ తిరిగి ఘాటుగా సమాధానం ఇచ్చారు. -
కానిస్టేబుల్ నిర్వాకం అడ్డంగా దొరికిపోయాడు
-
యువతితో షీటీమ్ వాహన డ్రైవర్ అసభ్య ప్రవర్తన
మూసాపేట: మహిళలకు రక్షణ కలి్పంచే షీటీమ్ వృత్తిలో ఉంటూ.. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఏఆర్ కానిస్టేబుల్, షీ టీమ్ డ్రైవర్‌పై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లో ఉంటున్న 36 ఏళ్ల నర్సింగ్ బాలానగర్ షీటీమ్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి వివేకానందనగర్‌లోని బంధువు ఇంటికి దశదిన కర్మ కోసం నర్సింగ్ వెళ్లాడు. సెల్లార్లో మద్యం తాగుతూ అక్కడి బాత్రూంను ఉపయోగించుకున్నాడు. సెల్లార్లోనే ఇద్దరు యువతులు కిరాయికి ఉంటున్నారు. బాత్రూమ్ వాసన వస్తోందని సర్ఫ్ నీళ్లు చల్లడంతో నర్సింగ్ ఆ యువతులతో వాదనకు దిగాడు. మద్యం మత్తులో యువతిని చెంపపై కొట్టి, భుజంపై చేయి వేసి నెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను కత్తితో పొడిచిన కానిస్టేబుల్
దొడ్డబళ్లాపురం: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘోర సంఘటన హాసన్‌లో చోటుచేసుకుంది. హాసన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే లోకనాథ్ తన భార్య మమతను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. దంపతుల మధ్య గత నాలుగైదు రోజులుగా గొడవలు జరుగుతుండగా ఆదివారం ఉదయం మమత ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. దీంతో ఆగ్రహం పట్టలేని లోకనాథ్ భార్యపై కత్తితో దాడిచేసి ప్రాణాలు తీశాడు. 17 ఏళ్ల క్రితం హాసన్ శివారులోని చెన్నపట్టణ కాలసీ నివాసి అయిన మమతను కేఆర్‌పుర నివాసి లోకనాథ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కట్నం కింద అరకేజీ బంగారం, రూ.50 లక్షలు నగదు ఇచ్చినా లోకనాథ్ తరచూ అదనపు కట్నం కోసం మమతను వేధించేవాడని, అయితే ఆమె కట్నం తీసుకురావడానికి నిరాకరించేదని అందుకే లోకనాథ్ ఈ హత్యకు పాల్పడ్డాడని మమత తల్లిదండ్రులు ఆరోపించారు. హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ ఆఫీసులోనే, పోలీసు హత్య చేయడంపై విమర్శలు వెల్లువత్తాయి. -
ఆల్ ఇండియా రైఫిల్ షూటింగ్‌కు ‘ఇందూరు’ రేఖారాణి
నిజామాబాద్, నాగారం/సాక్షి: ఆల్ ఇండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఇందూరు(నిజామాబాద్)వాసి ఎంపికైంది. నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రేఖారాణి (డబ్ల్యూ పీసీ 325) ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రేఖారాణి రాణించారు. ఈనెల 15 నుంచి తమిళనాడులోని ఒతీవాకం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున రేఖారాణి పాల్గొననున్నారు. 2002 లో ఉద్యోగంలో చేరిన రేఖారాణి.. ఫుట్‌బాల్, మాస్టర్ అథ్లెటిక్స్‌లో సైతం రాణించి పతకాలు సాధించారు. ఆమె ఎంపికపై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. -
కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. తెలంగాణ కోసం కిష్టయ్య ప్రాణత్యాగం చేసిన విషయం తెలిసిందే. పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానంటూ కేసీఆర్ ఆనాడే అండగా నిలిచారు. కిష్టయ్య మరణించిన నాటికి, ఆయన కొడుకు, కూతురు చిన్నపిల్లలు కావడంతో వారి చదువుతో సహా కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారు. కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఎంబీబీఎస్ చేయడానికి అవసరమైన ఆర్థికసాయం కేసీఆర్ గతంలోనే అందించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతోంది. మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకు అవసరమైన రూ.24 లక్షలను చెక్కురూపంలో ఆదివారం నందినగర్‌లోని తన నివాసంలో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మకు కష్టం కలిగించొద్దు : కేసీఆర్ ‘రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్నపిల్లలు. కష్టకాలంలో కూడా అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి సాదుకుంది..చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటుంది.’అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు. నా కుటుంబానికి అండగా ఉన్న దేవుడు కేసీఆర్ :కిష్టయ్య భార్య పద్మావతి ‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు పూర్తయ్యింది. నా భర్త పోలీస్ కిష్టయ్య దూరమై 15 సంవత్సరాలు గడిచాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నానని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చాడు. నువ్వు బాధపడకమ్మా... నీ పిల్లలను నేను చూసుకుంటా అని ఇచ్చిన మాట ప్రకారమే, మా పిల్లలు, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్నారు. 6వ తరగతి నుంచి ఇప్పటివరకు అన్ని విధాలా ఆసరా అందిస్తున్నారు’అని భావోద్వేగంతో కేసీఆర్‌ను దేవుడంటూ కొనియాడారు. -
పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి..
పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. విద్యే ఆయుధంగా చేసుకొని జీవితంపై పోరాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారే హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్. తండ్రి హమాలీ కారి్మకుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. పట్టణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హుస్నాబాద్: పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్ సంతానం. పెద్ద కుమారుడు రాజ్‌కుమార్ అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్ నెల రోజుల క్రితం ఫైర్‌స్టేషన్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కాల్ లెటర్ రాగానే జూలైలో ఫైర్ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందనున్నాడు. తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకలి్పంచారు. భవిష్యత్‌లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. -
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్‌గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్‌కుమార్ -
2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా నియమించబడిన పోలీసు కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు జారీచేసే కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీని ప్రక్షాలన చేశాం. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. పదేళ్లు అధికారంలో ఉంటూ.. ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లుగా అధికారంలో ఉంటాం. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. కానీ.. నల్గొండలో సభకు మాత్రం కేసీఆర్ వెళ్లారు. .. అసెంబ్లీ రానివారికి అధికారం ఎందుకు? ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చు కదా అని హరీశ్‌రావు అంటున్నారు. కేసీఆర్.. తన బంధువులకు అనే పదవులు కట్టబెట్టారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ కార్యకర్తపై అమనుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ కొన్నిరోజులుగా వ్యవసాయ వర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైకోర్టుకు భూకేటాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 23న వర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ హాజరయ్యారు. ఆందోళన విషయం తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని, నిరసన తెలుపుతున్నవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకుని ముందుకు పరుగెత్తారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. ఝాన్సీ జుట్టుపట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కిందపడిపోయింది. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఝాన్సీతోపాటు 15మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కూడా స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి.. ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది.