గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్
సాక్షి, చిత్తూరు/గంగాధర నెల్లూరు/ పాలసముద్రం: మొన్న చంద్రబాబు సభలు పలువురు ప్రజలను బలి తీసుకోగా, నేడు ఆయన కుమారుడు లోకేశ్ సభ ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకుంది. రహదారులు, ఇరుకు రోడ్లు, మార్జిన్లు తదితర ప్రాంతాల్లో సభలు, ర్యాలీల వల్ల జరిగే విపరిణామాలకు ఇటీవలి చంద్రబాబు సభలే ఉదాహరణలు. ఇటువంటి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం విశాలమైన మైదానాల్లో సభలు పెట్టుకోవాలని జీవో తెచ్చింది.
అయినా, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో భద్రతాపరమైన అంశాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేదు. కార్యకర్తలు కూడా నామమాత్రంగా వస్తున్నారు. జనం రాకపోవడంతో లోకేశ్ అనుమతుల్లేకుండానే ఎక్కడపడితే అక్కడ పాదయాత్ర ఆపి మాట్లాడుతున్నారు. జనం ఎక్కువగా ఉన్నట్లు కనిపించేందుకు ఇరుకు రోడ్లు, మార్కెట్ ప్రాంతాల్లో లోకేశ్ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించేలా నిర్వహిస్తున్న ఈ సభలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ పెరిగిన టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. ఈ సందర్భంగా తోపులాటలు జరుగుతున్నాయి.
ఇలాంటి సభే హెడ్ కానిస్టేబుల్ మరణానికి కారణమైంది. గురువారం గంగాధర నెల్లూరు మండలం సంశిరెడ్డిపల్లెలో నిర్వహించిన పాదయాత్రలో ఈ విషాద ఘటన జరిగింది. సంశిరెడ్డిపల్లెలో లోకేశ్ అనుమతుల్లేకుండానే, జాగ్రత్తలు తీసుకోకుండానే మాట్లాడటం ప్రారంభించారు. దీంతో పోలీసులు అడ్డు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ సమయంలో అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న చిత్తూరు జిల్లా ఐరాల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎ.రమేష్ (54) తీవ్ర అస్వస్థతతో గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు వెంటనే ఆయన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసు కుటుంబాలు, ఆయన స్వస్థలమైన యాదమరి మండలంలోని కుచుంపల్లెలో విషాదం నెలకొంది. హెడ్‌కానిస్టేబుల్ మృతికి పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. టీడీపీ సభల్లో ఇది మరో దుర్ఘటన అని, నిబంధనలు పాటించకుండా టీడీపీ నేతలు మూర్ఖంగా ప్రవర్తించడంవల్లే హెడ్ కానిస్టేబుల్ మరణం సంభవించిందని పలువురు వ్యాఖ్యానించారు.
శూలం గుచ్చుకొని కార్యకర్తకు గాయాలు
ఎండీ మంగళం సమీపంలోని ఆలయం వద్ద లోకేశ్ మరో సభ నిర్వహించారు. ఇదీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగింది. ఇక్కడ ఆలయం వద్ద ఉన్న శూలం గుచ్చుకుని మండలంలోని టీడీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈసారైనా గెలిపించండి: లోకేశ్ వేడుకోలు
గంగాధర నెల్లూరులో 2009 నుంచి టీడీపీని గెలిపించలేదని, ఈసారైనా గెలిపించండి అంటూ నారా లోకేశ్ ప్రజలను అభ్యర్థించారు. ఆయన గురువారం గంగాధర నెల్లూరు మండలం దేవళంమిట్ట నుంచి పాలసముద్రం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కడపగుంటలో మాట్లాడుతూ చంద్రబాబు పాలిచ్చే ఆవులాంటివాడని అన్నారు. మూడున్నరేళ్లుగా జగన్ రెడ్డి హయాంలో ఎస్సీలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే నారాయణస్వామి ఏం పీకారని ప్రశ్నించారు. సమిసిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై పర్మిషన్ లేకుండా మాట్లాడొద్దన్న పోలీసుల్ని యూజ్‌లెస్‌ఫెలోస్ అంటూ దుర్భాషలాడాడు. తనకు చట్టం తెలుసంటూ రాజ్యాంగం పుస్తకాన్ని చూపించారు.
రంగాపురంలో మద్యం సీన్
పాలసముద్రం మండలం రంగాపురంలో గురువారం సాయంత్రం లోకేశ్ సభకు జనాలను తరలించేందుకు చుట్టుపక్కల పల్లెలతోపాటు తమిళనాడుకు కూడా వాహనాలు ఏర్పాటుచేశారు. అయినా జనం రాలేదు. వచ్చిన వారు కూడా చాలా మంది టీడీపీ నేతలిచ్చిన మద్యం తాగి, బిర్యానీ తిని అక్కడే పడిపోయారు. రెండు గంటలు ఆలస్యంగా సభకు వచ్చిన లోకేశ్ జనం లేకపోవడంతో చిర్రుబుర్రులాడారు.
Comments
Please login to add a commentAdd a comment