నారా లోకేష్ యువగళం-నవశకం సభ అట్టర్ ప్లాప్. ఈ మాట రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్ కాదు.. స్వయంగా టీడీపీ హార్డ్‌కోర్ అభిమానులే చెబుతున్న మాట. అంతకు మించి సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అభిమానులు చర్చించుకుంటున్న విషయం. అందుకు కారణాల్ని విశ్లేషిస్తే..
సహాజంగా వేదిక ఎక్కితే ఊగిపోయే పవన్.. నిన్నటి సభలో తగ్గి మాట్లాడాడు. బహుశా తాను చంద్రబాబుకి బానిసే అని విషయం ఇలా చెప్పాలనుకున్నారో ఏమో. ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదు అంటూనే.. చంద్రబాబు అరెస్ట్ తనను ఎంతో బాధించిందని తెగ ఫీలైపోయారు. నమ్ముకున్నవాళ్లు ఏమైపోతే నాకేంటి.. బాబు కోసమే తాను పని చేసేది, చేయబోయేది అని తన స్పీచ్ ద్వారా పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఇదే వేదిక నుంచి జనసైనికులు, అభిమానులకు ఊరట ఇచ్చేలా ఏదైనా సందేశం ఇస్తాడా? అని ఆశిస్తే.. అదీ జరగలేదు.
ఇక బాలయ్య స్పీచ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉచితాలకు, సంక్షేమ పథకాలకు తేడా గుర్తించలేకపోతున్నారాయన. పవన్ కల్యాణా? అతనెవరో తెలియదు!. అలగా బలగా పార్టీలు, సంకర పార్టీలు అంటూ పలికిన నోరు.. ఇప్పుడు ‘తమ్ముడు పవన్ కళ్యాణ్.. ఇక తెగిద్దాం’.. ‘మా ఇద్దరికీ చాలా పోలికలు ఉన్నాయి’’.. అనే సరికి వినలేక ‘‘అయ్య బాబోయ్..’’ అనుకున్నాయి. అక్కడి నుంచి తెలుగుదేశం కార్యకర్తలు నవ్వుతూ బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఇక జనసేన సైనికుల ముఖచిత్రాల్లో ఎక్స్‌ప్రెషన్ గురించి చెప్పనక్కర్లేదు.
పాదయాత్ర అనుభవాలతో ఎంతో నేర్చుకున్నాడట నారా లోకేష్. గతంలో పలువురు నాయకులు చేసిన యాత్రకు.. ఆగి ఆగి సాగిన చినబాబు యాత్రకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. లోకేష్ తన యాత్రలో ఎక్కువ సమూహాలను కలిసిందే లేదు. కేవలం ప్రభుత్వాన్ని తిట్టాలి.. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని ఆలోచనతో త్వరగతిన ముగించారే తప్పా.. సీరియస్‌గా సాగని ఆ యాత్రను, నిన్న జరిగిన ముగింపు సభలో లోకేష్ ప్రసంగాన్ని ఏపీ ప్రజలు కూడా అంతే లైట్ తీసుకున్నారు. లోకేశ్ ప్రసంగం.. రోజూ వారీ యాత్రలో చేసిన ప్రసంగంలానే సాగింది. మాట తీరులో ఎలాంటి మార్పూ రాలేదు. మొత్తంగా.. టీడీపీకి తెల్లజెండా ఎత్తేంత వరకు నిద్రపోను అనే రీతిలో సాగింది లోకేష్ స్పీచ్.
ఇక జనసేనలో నెంబర్ టూగా చెప్పుకునే నాదెండ్ల అయితే ఏకంగా, ఊహించని రీతిలో లోకేష్ భజన చేశారు. పొరపాటున పొత్తు ప్రభుత్వం గెలిస్తే.. నారా లోకేష్ సీఎం!! అవుతాడంటూ అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ మాటలకు ‘ష్..’ విస్తుపోవడం చాలామంది వంతు అయ్యింది.
ఇక నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం గురించి చెప్పాలి. ఎన్నికల నిమిత్తం తాను గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి గుర్తుచేశారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి.. మంచిని మచ్చుకైనా ప్రస్తావించలేదు. ఎందుకంటే.. అక్కడ ఏం లేదు కాబట్టి. గత వారం పదిరోజులుగా పొత్తుపై అసంతృప్తిగా ఉంటూ వస్తున్న పవన్‌ను ఊరడించేలా మాట్లాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం ఉందంటూనే.. వ్యక్తిగతం దూషణలతో దిగజారి ప్రసంగించారు. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నేతగా చంద్రబాబు అంత పేలవంగా మాట్లాడతారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.
నారా లోకేష్ బాబు ఒక ఐరన్ లెగ్.. కాలు పెట్టాడు. కాస్త దూరం నడిచాడు. ఇంక ఏముంది.. ఫసక్!. కట్ చేస్తే.. భోగాపురం మండలం పోలిపల్లి సభ వేదికపై ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదు. చంద్రబాబు సహా ఒక్కరి ప్రసంగంలో పస లేదు. ఒంటరిగా వచ్చి 151 సీట్లు కొట్టి బాహుబలిలా ఎదిగారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నాలుగున్నరేళ్లలో ప్రజలకు చేరువలోనే ఉన్నారాయన. అలాంటిది ఇప్పుడు జగన్‌ను ఓడించగలమా? ఇంతమంది కలిసినా ఓడిపోతే తల ఎక్కడ పెట్టుకోవాలి?.. ఇదే భయం వాళ్ల కళ్లలో స్పష్టంగా కనిపించింది.
::: సాక్షి వెబ్, పొలిటికల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment