AP Politics
-
‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’
కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్ చెప్పినట్లే. ఎవరైతే ఇన్నాళ్లూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. .. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్ డీలర్లు షాక్‌కు గురయ్యారు.‘‘ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే..!?
హైదరాబాద్: ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలుకొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప–2 బ్లాక్ బస్టర్‌గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే.. ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదల అయిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం.. అల్లు అర్జున్‌కు దగ్గరి బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో పవన్ కల్యాణ్ స్పందించకపోవడం.. అల్లు అర్జున్ అరెస్టైన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే.. ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఎన్నో అనుమానాలు..వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప–2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో... ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం.. అదీ కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా.. రెండు, మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం.. హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసినా అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం.. రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి పుష్ప–2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్.. పవన్‌కు దగ్గరి బంధువని తెలిసీ కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుష్ప–2 సినిమాను నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ముందు నుంచే దుష్ప్రచారం ‘అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారు మొదలైంది. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ‘అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. వారిని కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో.. ఎవడికి కావాలి?’ ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (టీడీపీ) ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్‌ని కలిగి ఉన్నట్లుగా మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంట్మెంట్ మాకు చాలా బాగా పని చేసింది. ఆ సెంట్మెంట్ మాదిరిగానే మీ పుష్ప–2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా.. నువ్వు ఒక కమెడియన్. చిరంజీవి, పవన్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు వ్యాఖ్యానించారు. -
#HBDYSJAGAN: మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది: వైఎస్ జగన్
నమ్మినవారికి అండగా నిలిచే జన హృదయ నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తోంది ఆ పార్టీ.. -
చంద్రబాబును మించిపోయేలా పవన్!
పవన్ కళ్యాణ్ తన నటనా కౌశలాన్ని వెండితెరపై నుంచి రాజకీయాలకు కూడా విస్తరించినట్లుంది. రాజకీయాల్లో నటన, వంచనా చాతుర్యం వంటివి జనాలకు పరిచయం చేసిన ఘనత చంద్రబాబుదైతే.. పవన్ ఆయన అడుగుజాడల్లో.. అతని కంటే ఘనుడు అనిపించుకునేలా నడుస్తున్నాడు. ‘స్వర్ణాంధ్ర2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగాన్ని గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. గతంలో ఆయన ఉపన్యాసాలకు, ఇప్పుడు చెబుతున్న సుద్దులకు ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. పదవి వస్తే అంతా సుభిక్షంగా ఉందని నేతలు ఫీల్ అవుతారట. పవన్ ప్రస్తుతం ఆ దశలో ఉన్నారు. పాతికేళ్లపాటు ఏపీలో రాజకీయ స్థిరత్వం ఉండాలని చంద్రబాబు నేతృత్వంలో పని చేస్తానని ఆయన చెప్పుకున్నారు. బాబును ఆకాశానికి ఎత్తేశారు. రాజకీయ అవసరాల కోసం పొగిడితే తప్పులేదు కానీ.. అతిగా చేస్తేనే వెగటు పుడుతుంది. 2019లో చంద్రబాబును ఉద్దేశించి పవన్ మాట్లాడిందేమిటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ’2020 విజన్ అంట.. రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు..అవి ఇచ్చారా? ఆ ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం సాగుతోంది. చంద్రబాబు దృతరాష్ట్రుడి మాదిరిగా కొడుకు లోకేష్ కోసమే పనిచేస్తున్నారు.‘ అని ఆయన అప్పట్లో ధ్వజమెత్తారు ఇప్పుడు మాత్రం.. ’2020 విజన్ అంటే ఆనాడు అర్థం చేసుకోలేక పోయారు..వెటకారం చేశారు. ఇప్పుడు వారికి అదే భిక్ష పెడుతోంది. చంద్రబాబు గారి అనుభవం, అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీస్ అమోఘం...‘ అంటున్నారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టారని పవన్ అనుకుంటూ ఉండవచ్చు కానీ.. ‘విజన్2020’తో ఒరిగిందేమిటో చెప్పకుండా ఒట్టిగా పొగిడితే చెవిలో పూలు పెడుతున్నారని జనం అనుకోరా? పవన్ కళ్యాణ్ విజన్2020 డాక్యుమెంట్‌ను అసలు చూశారా? 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ డాక్యుమెంట్‌తో ప్రచారం నిర్వహించారు. అందులోని అంశాలు పరిశీలించిన వారు ఇదేదో కాలక్షేపం వ్యవహారమని, హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. ప్రజలు ఈ డాక్యుమెంట్‌ను అస్సలు పట్టించుకోలేదు అనేందుకు ఆ తరువాతి రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడమే నిదర్శనం. ఈ సమయంలో కానీ.. రాష్ట్ర విభజన తరువాత 201419 మధ్యకాలంలో కానీ చంద్రబాబు ఈ విజన్ పేరెత్తితే ఒట్టు! ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్ అన్నారో.. బాబుగారికి ఠక్కున గుర్తొచ్చింది. తాను వెనుకబడకూడదన్నట్టు ‘స్వర్ణాంధ్ర2047’ను వదిలారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.. ’కులాలు, మతాలు, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. 21వ శతాబ్దంలో కూడా కులాలేమిటి..మతాలేమిటి ప్రాంతాలేమిటి?‘ అని ప్రశ్నించారు. ఆయన నిజంగానే ఇలా అనుకుంటూంటే... జనసేన తరపున తీసుకున్న మూడు మంత్రి పదవులలో ఇద్దరు కాపులు ఎందుకు ఉన్నారో చెప్పాలి కదా? మరో మంత్రి పదవిని కూడా కాపు వర్గానికి చెందిన తన సోదరుడు నాగబాబుకే ఎందుకు కట్టబెడుతున్నారు? కమ్మ వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్‌కు ఒక మంత్రి పదవి ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర వర్గాల వారికి పదవి ఇప్పించ లేకపోయారే అన్న ప్రశ్న వస్తే ఏం జవాబు ఇస్తారు? కొద్ది నెలల క్రితం వరకు కులం కావాలని, అందులోను కాపులు, బలిజలు అంతా ముందుకు రాకపోతే రాష్ట్రంలో మార్పు రాదని రెచ్చగొట్టే రీతిలో ఉపన్యాసాలు ఈయనే చేయడం విశేషం. కాపులు తనకు ఓటు వేసి ఉంటే భీమవరం, గాజువాకల్లో ఎందుకు ఓడిపోతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కుల భావన అన్నా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని కూడా అప్పట్లో సెలవిచ్చారు. పవన్ తమ కులం వాడని నమ్మి మద్దతిచ్చిన కాపులు, బలిజలు ఇప్పుడు కుల భావాన్ని వదులుకోవాలా? అందుకు వారు సిద్దం అవుతారా? లేక పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేయడంలో నైపుణ్యం సాధించారని సరిపెట్టుకుంటారా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఏది అవసరమైతే అది చెప్పి ప్రజలను మభ్య పెట్టడంలో ఆరితేరుతున్నారు. కొద్ది నెలల క్రితమే కదా! ‘‘ఐయామ్ సనాతన్ హిందూ’’ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని పవన్ అరిచింది? ఆ సందర్భంలో ముస్లింలతో పోల్చి హిందువులను రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ సడన్‌గా ఇంకా మత భావన ఏమిటని అంటే ఏపీ జనం నోట్లో వేలేసుకుని వినాలన్నమాట. పవన్ అసలు మతం గురించి ఎప్పుడు ఏమి మాట్లాడారో వివరించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవి వింటే ఇన్ని రకాలుగా మాటలు మార్చవచ్చా? అన్న భావన కలుగుతుంది. వాటి గురించి వివరణ ఇవ్వకుండా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడితే సరిపోతుందా?మరో వ్యాఖ్య చూద్దాం. పార్టీ పెట్టి నలిగిన తర్వాత చంద్రబాబుపై గౌరవం అపారంగా పెరిగిందని పవన్ అన్నారు. చంద్రబాబు తనకు చాలా గౌరవం ఇస్తున్నారని, కలిసే పని చేస్తామని కూడా పవన్ అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అలాగే కలిసి ఉండాలని, చిన్ని, చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చని అన్నారు. తను కోరిన విధంగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించినందుకు కృతజ్ఞతగా పవన్ ఈ మాట చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబుపై నిజంగానే అంత నమ్మకం ఉంటే నాగబాబు పదవి గురించి ఎందుకు లిఖిత పూర్వక హామీ తీసుకున్నారో కూడా చెప్పగలగాలి. విభజన నాటి నుంచి చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నారట పవన్. మరి 2018లో చంద్రబాబుతో విడిపోయి, వేరే కూటమి ఎందుకు పెట్టుకున్నారు? అప్పట్లో చంద్రబాబు, లోకేష్ లు అత్యంత అవినీతిపరులని గుంటూరులో సభ పెట్టి మరీ గొంతు అరిగేలా చెప్పింది పవన్ కళ్యాణే కదా? ఈ విషయంలో ఈయన కచ్చితంగా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు.చంద్రబాబు కూడా ఎవరినైనా పొగడగలరు.. తేడా వస్తే అంతకన్నా తీవ్రంగా తిట్టగలరు. పరిస్థితి బాగోలేదనుకుంటే తగ్గిపోయి ఎంతకైనా పొగడుతారు. ప్రధాని నరేంద్ర మోడీని గతంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా విమర్శించింది.. దూషణలు చేసింది.. గుర్తు చేసుకోండి. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. టీడీపీ ఓటమి తర్వాత పూర్తిగా రివర్స్ లో మోడి అంత గొప్పవాడు లేడని మెచ్చుకున్నది కూడా ఆయనే. పవన్ ఇప్పుడు అదే దారిలో ఉన్నారు. లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకే చంద్రబాబు మరో పాతికేళ్లు అధికారంలో ఉండాలని పవన్ అభిలషిస్తున్నట్లు ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.ఇంతకుముందు మరో సదేళ్లు సీఎంగా ఉండాలని చెప్పిన ఈయన ఈసారి పాతికేళ్లు అని అంటున్నారు. అప్పటికి చంద్రబాబుకు 99 ఏళ్లు వస్తాయి. అంటే పవన్ తాను సి.ఎమ్. కావాలన్న ఆశను వదలుకున్నట్లేనా? ఇది వ్యూహాత్మక వ్యాఖ్యా? లేక టీడీపీతో లేకపోతే తనకు రాజకీయ భవితవ్యం ఉండదని భయపడుతున్నారా? ఇది అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దందాలో వాటా ఇవ్వాల్సిందే.. టీడీపీ ఎంపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ ప్రజాప్రతినిధికి, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ ఎన్నికల ముందు అతి వినయం ప్రదర్శించి, నాయకులను, కార్యకర్తలను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారని.. ఎన్నికల్లో గెలుపొందాక ఆయన నిజస్వరూపం బయట పడుతోందని.. సొంత పార్టీ నాయకులకే చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య అంతరం పెరుగుతోందని వినికిడి. ఎన్నికల సమయంలో తనతో సన్నిహితంగా మెలిగిన నాయకులను సైతం పార్టీ ఆఫీసుకు వెళ్తే ఎందుకు వస్తున్నారని అక్కడి సిబ్బంది ముఖం మీదే అడుగుతుండటంతో.. ఇంతలోనే ఎంత తేడా అని వారు నిట్టూరుస్తున్నారు. ⇒ మైలవరం నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ నేతలకు కాసులు కురిపించే కల్ప వృక్షం. ఎన్నికల ముందు వరకు ఎంపీ, ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే చాలా సఖ్యతగానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. తీరా ఎన్నికలయ్యాక వాటాల విషయంలో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ తనకు అన్నింటిలోనూ వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. వీటీపీఎస్‌లో బూడిదపై ఇద్దరి మధ్య షేర్ కుదిరినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ‘ఎన్నికల సమయంలో ఖర్చంతా నేనే పెట్టుకున్నానని. నీకేం సంబంధం. మిగతా వాటిలో మీకు వాటా ఇవ్వలేను. నా నియోజకవర్గ సరిహద్దులోకి రావద్దు’ అని ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పడంతో వారి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోంది. ⇒ నందిగామ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇరువురు నేతలు పైకి బాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ రోజురోజుకు అంతరం పెరుగుతోందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రెండు ఇసుక రీచ్‌లను ఎంపీ తన కంట్రోల్లో ఉంచుకొని, పెద్ద ఎత్తున ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు చివరకు రైతుబజార్లలో కూరగాయల సరఫరా కాంట్రాక్టుకు సంబంధించి వచ్చే మామూళ్లలో సైతం ఇద్దరికీ తేడాలు వచ్చినట్లు ఆ నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. ⇒ తిరువూరులో నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఉప్పు, నిప్పు మాదిరి ఉన్నారు. అక్కడ అక్రమ మట్టి తవ్వకాలు, ఇసుక, మద్యం, పేకాట వంటి మామూళ్లకు సంబంధించిన విషయాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే తనను కేర్ చేయకపోవడంతో, ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీనే ఓ వర్గాన్ని రెచ్చగొట్టి, నియోజకవర్గ పెద్దలకు స్థానిక నేతలతో ఫిర్యాదులు చేయిస్తున్నట్లు, అక్కడ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ⇒ జగ్గయ్యపేటలో పాగా వేసేందుకు ఎంపీ ప్రయత్నించారు. అయితే అక్కడ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని స్థానిక ఎమ్మెల్యే వ్యతిరేకించారు. అయినప్పటికీ ఇసుక క్వారీల విషయంలో కొన్నింటిని తన వాటాగా తీసుకున్నారు. అక్కడ పరిశ్రమలు ఉండటంతో, ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకొనేందుకు ఎంపీ ప్రయతి్నస్తుండటంతో వారి మధ్య వివాదం చెలరేగుతోంది. ⇒ విజయవాడలోని ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, ఎంపీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాము సీనియర్లం అనే భావనలో ఎమ్మెల్యేలు ఉంటే, తన పెత్తనం సాగాల్సిందేనని రీతిలో ఎంపీ వ్యవహరిస్తున్నారు. చినబాబు అండతోనేనా? ఎన్నికల ముందు వరకు ఎంపీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలందరికీ ఆయన చుక్కలు చూపిస్తుండటంతో లోలోన వారి మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయంలో ఎంపీ జోక్యాన్ని వారు సహించలేకపోతున్నారు. కొంత మంది టీడీపీ నేతలైతే చినబాబు అండతోనే ఎంపీ తన ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. -
‘తిరుపతి పవిత్రత మంటగలుస్తుంటే.. పవన్ ఎక్కడ?’
తిరుపతి, సాక్షి: కూటమి ప్రభుత్వ ఏలుబడిలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రత మంటగలిసిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ.. భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదకద్రవ్యాల వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారాయన. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో బుధవారం భూమన మీడియాతో మాట్లాడుతూ.. దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్టసంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న తిరుమల తిరుపతిలో పబ్ తరహా ఈవెంట్ల నిర్వహణ వెనుక అధికారపార్టీ అండదండలు ఉండటం ఆందోళనకరం.సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటి సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి, కారకులపై చర్యలు తీసుకుంటాని ఆశిస్తున్నామని భూమన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నగరంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. మద్యం దుకాణాలను ఉదయం ఏడుగంటలకు తెరుస్తూ, రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయాలను కూడా పాటించకుండా మద్యం దుకాణాలు, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరికి తిరుపతిలో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలతో నృత్యాలు, డీజే పేరుతో పాశ్చాత్యసంగీతాలతో తిరుపతి ఔచిత్యాన్నే ప్రశ్నించేలా ఘటనలు ప్రారంభమయ్యాయి అంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ధర్మాన్ని కాపాడేందుకు ఉద్యమంతిరుపతి పవిత్రత కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్దంగా ఉందని భూమన ప్రకటించారు. గతంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా నూతన సంవత్సరం అర్థరాత్రి జరిపే హంగామాను కూడా తిరుపతిలో జరగకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తరువాత ఆయన ఆదేశాలతోనే తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతుంటే, ఈ నగరాన్ని ఇక ఆ భగవంతుడే కాపాడాలి అని భూమన అన్నారు. -
ధిక్కార స్వరాల అణచివేతే.. బాబు లక్ష్యమా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ ద్వంద్వ వైఖరే. ప్రతిపక్షంలో ఉంటే.. పూర్తి స్వేచ్ఛ కావాలంటారు. స్వయంగా కార్యకర్తలను రెచ్చగొడతారు. కళ్లేదుటే పార్టీ కార్యకర్తలు పోలీసులపై దాడులు చేసినా కిమ్మనరు. కానీ.. అధికారంలో ఉంటే మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది. ముఖ్యమంత్రిగా తనను ఎవరూ కించిత్ మాట అనకూడదు. సోషల్ మీడియా కూడా ఏ రకమైన విమర్శ చేయకూడదు. వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. తండ్రి ఇలా ఉంటే.. కుమారుడు ఇంకోలా ఉండేందుకు అవకాశం లేదన్నట్లు లోకేష్ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఐదురోజుల క్రితం వైస్సార్సీపీ రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సంకల్పించింది. కానీ.. ఈ కార్యక్రమం కోసం సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించేశారు. పలుచోట్ల నేతలను గృహ నిర్భంధంలో పెట్టారు. వీటిని ఎదుర్కొంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. రైతులూ వీరికి మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు పడుతున్న ఇక్కట్లు ఇన్ని,అన్నీ కావు. వరికి గిట్టుబాటు ధరలు లేవు సరికదా.. ధాన్యం కొనుగోళ్లలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా ధాన్యం వర్షానికి తడిచి మొలకెత్తి పోతూండటంతో రైతులు నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం దాచుకునేందుకు కనీసం గోనె సంచులను కూడా సమకూర్చ లేకపోతోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు తేమశాతం నెపం చెప్పి బస్తాకు రూ.200 నుంచి రూ.400లు తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు తాను వెళతానని బీరాలు పలికిన చంద్రబాబు రైతుల కళ్లాల వద్దకు మాత్రం వెళ్లడం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని చోట్ల పర్యటిస్తే రైతులు ఆయనను నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్యలు పెద్దగా లేవని, రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయని రైతులు వివరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలను విధ్వంసం చేసే క్రమంలో రైతు భరోసా కేంద్రాలను నీరుకారుస్తోంది. అలాగని ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులిప్పుడు మిల్లర్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ టైమ్ లో పెట్టుబడి సాయం రైతు భరోసా కింద రైతులకు రూ.13,500ల చొప్పున నిర్దిష్ట విడతలలో అందించేవారు. తాము అధికారంలోకి వస్తే రూ.20 వేలు ఇస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా బాబు, పవన్ కళ్యాణ్‌లు ఎవ్వరూ దీని ఊసే ఎత్తడం లేదు. గతంలో ఉన్న ఉచిత బీమా సదుపాయం కూడా ఇప్పుడు రైతులకు లేకుండా పోయింది. తుపానుకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అంతంతమాత్రంగానే అందుతోందని చెబుతున్నారు. టమోట రైతులు కూడా రూపాయికి కిలో చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. జగన్ పాలనలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు గణనీయంగా పడిపోకుండా అడ్డుకోగలిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలాంటి అనేక సమస్యలపై వైసీపీ నేతలు వినతిపత్రాలు ఇవ్వబోతే వాటిని స్వీకరించడానికి ఏమి ఇబ్బంది వచ్చిందో అర్థం కాదు. పార్టీ నేతలు వైఎస్ అవినాశ్ రెడ్డి, సతీష్ రెడ్డి మల్లాది విష్ణు తదితరులను గృహ నిర్భంధం చేసినట్లు వార్తలు వచ్చాయి. అనేక పోలీస్ స్టేషన్లలో వైసీపీ కార్యకర్తలు, నేతలను నిర్భంధించారు. పలు కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనినే ప్రజాస్వామ్యం అనుకోండని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. దీనినే స్వేచ్చ అని భావించాలని చెబుతున్నారు. ఈ పాటి చిన్న నిరసననే అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటే ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులలో ఉన్న అసంతృప్తి బయటపడుతోందని భయపడుతోందని అర్థం. హామీల అమలుపై నిలదీస్తారన్న ఆందోళన కావచ్చు. ఏపీలో పోలీసులు ఈ రకంగా అనేక సందర్భాలలో వైసీపీ వారిని అణచివేయాలని చూస్తున్నారు. పులివెందుల సమీపంలోని వేముల ఎమ్.ఆర్.ఓ. ఆఫీస్ వద్ద నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ వారి అరాచకాలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ వారు దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. రిపోర్టర్లపై దౌర్జన్యం చేశారు. ఇంతకాలం పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. ఇష్టారీతిన కేసులు పెట్టారు. వారిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులను కూడా వేధించడం ఆరంభించినట్లుగా ఉంది. చంద్రబాబు లక్షణం ఏమిటంటే తాను జర్నలిస్టులతో బాగున్నట్లు కనిపించడానికి యత్నిస్తారు. అదే టైమ్ లో తన వైఫల్యాలను రాసే జర్నలిస్టులను మాత్రం రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు. జగన్ టైమ్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు రాసినా, అదే మీడియా స్వేచ్ఛ అని ప్రచారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను, జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఈ సందర్భంలో పలువురిపై వ్యవస్థీకృత నేరాల సెక్షన్ లను కూడా ప్రయోగించడానికి వెనుకాడడం లేదు. నిజానికి సోషల్ మీడియాకు చట్టంలోని ఆ నిబంధనలు వర్తించవు. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. గత పదేళ్లలో ఒకటికి మించి ఛార్జిషీట్లు ఎవరిపైన అయినా ఉంటే, వాటిని మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకుంటే, అప్పుడు ఈ సెక్షన్లు వర్తిస్తాయని తెలిపింది. అయినా చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు మాత్రం చట్టంతో తమకు నిమిత్తం లేనట్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకుపోతున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరులో ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను తెల్లవారుజామున నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి భయపెట్టి తీసుకుపోయారట. దీని గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చూసినా, వైసీపీ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోలీసులను ఎదుర్కున్నారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట మాత్రంగా ప్రస్తావించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నది చంద్రబాబు ,పవన్ కళ్యాణ్‌ల ప్రభుత్వమేనేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘లోకేష్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా?’
గుంటూరు, సాక్షి: ఏపీలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న పోలీసుల తీరును వైఎస్సార్సీపీ ఎండగడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్న ఖాకీలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి నిరసన చేపట్టారు. ‘‘మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?..’’ అంటూ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని నేతలతో కలిసి పీఎస్ మెట్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. తమ ఫిర్యాదులపై ఎప్పుటిలోగా కేసులు నమోదు చేస్తారో? చెప్పాలంటూ పోలీసులను కోరుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.. ‘‘పట్టాభిపురం పీఎస్ ఎదుట నిరసన తెలియజేశాను. జగన్ తో పాటు నా కుటుంబంపై కూడా సోషల్ మీడియాలో ద్రుష్ప్రాచారం చేయడంపై ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదులపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. లోకేష్ నుండి ఆదేశాలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మా కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. మా ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే మరోసారి మా నిరసన తెలియజేస్తాం. మేము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాపై సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదు. తిరిగి ఎప్పుడైనా నిరసన తెలియజేస్తాం అని హెచ్చరించారాయన. -
పింఛన్లపై ‘కూటమి’ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐదేళ్ల పాటు ఏ సమస్యా లేకుండా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వృద్దులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు వాలంటీర్లు అండగా నిలిచారన్నారు.‘‘చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను బ్రేక్ చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారు. ఇది పెన్షన్‌దారులకు శరాఘాతంగా మారింది. చంద్రబాబు నిర్వాకంతో 44 మంది వృద్దులు పెన్షన్ల కోసం వెళ్లి మృతిచెందారు. ఎన్నికలకు ముందు పింఛన్లను వెయ్యి పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. ఒక చెత్తో ఇస్తున్నట్టు నటిస్తూ రెండో చేత్తో పెన్షన్లు తొలగిస్తున్నారు. 66 లక్షలకు పైగా పెన్షన్లు జగన్ హయాంలో అందించారు. ఇప్పుడు 3 లక్షలమంది పెన్షన్లను చంద్రబాబు తొలగించారు’’ అని విష్ణు మండిపడ్డారు.‘‘అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వృద్ధులు, వికలాంగుల ఆత్మగౌరవం దెబ్బ తీశారు. ఇంకా 2 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇవ్వకపోగా అదనంగా మరో మూడు లక్షల పెన్షన్లు తొలగించటం అన్యాయం. పెన్షన్‌దారుల మీద కూడా ఇలా కుట్రలు చేయటం అవసరమా?. పార్టీలు మారితేనే పెన్షన్ ఇస్తామని టీడీపీ వారు అంటున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదు’’ అని మల్లాది విష్ణు హితవు పలికారు‘‘వైఎస్ జగన్ హయాంలో అర్హులందరికీ పెన్షన్ అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పార్టీ మారితేనే పెన్షన్లు ఇస్తామనటం సరికాదు. అలా కాదంటే పక్క జిల్లాలకు పెన్షన్‌ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయటం సబబు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలమంది పెన్షన్లు తొలగించటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
క్షమాపణలు చెప్పించిన లోకేష్.. బీసీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, విజయవాడ: టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి, ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పించారు. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా, అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నుంచి మాజీమంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ.. తాజాగా పార్థసారథి, గౌతు శిరీషలను అవమానించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం! -
విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం!
ఆరు నెలల పాటు రకరకాల డైవర్షన్లతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇంకో నాలుగున్నరేళ్లు కాలం గడిపేందుకు కొత్త ఆయుధం చేతికి చిక్కింది! సూపర్‌సిక్స్ వాగ్ధానాల గురించి కాకుండా... తన ‘స్వర్ణాంధ్ర 2047’వైపునకు ప్రజల దృష్టి మరల్చేందుకు ప్లాన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది! దీన్ని తయారు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపునకే అమలు పర్యవేక్షణ బాధ్యతలూ అప్పగిస్తారట. ఇదే బోస్టన్ గ్రూప్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అధికార వికేంద్రీకరణపై ఒక దార్శనిక పత్రం తయారు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అందులో భాగంగా ఏపీకి మూడు రాజధానులతో మేలని ఈ కంపెనీ తేలిస్తే అప్పట్లో తెలుగుదేశం, ఇతర రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంకెలంటే మహా మోజు. ఏ విషయంలోనైనా పెద్ద పెద్ద అంకెలు చెప్పి చెప్పడం ఆయనకు రివాజు. తాజా డాక్యుమెంట్లోనూ ఈ అంకెల గారడీ కనిపిస్తుంది. ‘ఈనాడు’ వంటి అనుకూల మీడియానైతే.. స్వర్ణాంధ్ర-2047తో ఆంధ్రప్రదేశ్ సమూలంగా మారిపోతోందన్న కలరింగ్ ఇచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లయిన సందర్భంగా ప్రధాని మోడీ వికసిత్ భారత్ పేరుతో నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధేశించుకున్నట్లు చంద్రబాబు కూడా చేస్తే తప్పేమీ కాకపోవచ్చు కానీ.. కేవలం ప్రచారం యావతోనే, ప్రజల దృష్టిని ఏమార్చడమే ధ్యేయంగా పనిచేస్తే ఎన్ని విజన్లు రూపొందించినా ప్రయోజనం ఉండదు. 1995-2004 మధ్యకాలంలో చంద్రబాబు విజన్-202 డాక్యుమెంటే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అప్పట్లో ఆయన దక్షిణ కొరియాలో అమలు అవుతున్న ఒక డాక్యుమెంట్ తీసుకు వచ్చి, ఏపీలో కూడా అలాంటి పద్ధతులు అమలు చేస్తామని అనేవారు. ఆ తర్వాత విజన్ అన్నారు. జన్మభూమి పేరుతో ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి కొన్ని చిన్ని, చిన్న పనులు చేయించే వారు. ‘ఈనాడు’ మద్దతుతో ఆయన ఏమి చేసినా సాగిపోయింది. విజన్-2020లోనూ వివిధ శాఖలకు సంబంధించిన లక్ష్యాలు రాసుకున్నారు. కానీ అవి వాస్తవానికి, దూరంగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఉన్న అంచనాలు కొని రెట్లు ఎక్కువ చేసి లక్ష్యాలను నిర్దేశించేలా చంద్రబాబే ఆదేశించేవారని అధికారులు చెప్పేవారు.ఇలా వాస్తవికతకు దూరంగా ఉండటంతో ఆ విజన్ డాక్యుమెంట్ ఉత్తుత్తి కార్యక్రమంగా మిగిలిపోయింది. విజన్ 2020 డాక్యుమెంట్ విడుదల చేసిన నాలుగేళ్లకు ఉమ్మడి టీడీపీ ఓటమితో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ రెండు దఫాలు అధికారంలో కొనసాగింది. 2014 నాటికి ఉమ్మడి ఏపీ కాస్తా రెండు రాష్ట్రాలుగా చీలిపోయింది. తదుపరి ఆయన విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పదేళ్లు బాబు చెప్పిన విజన్ 2020ని ఎవరూ ప్రస్తావించే వారు కారు. చంద్రబాబును ఎద్దేవ చేయాలనుకుంటే మాత్రమే దీని గురించి మాట్లాడేవారు. 2014 టరమ్‌లో 2029 నాటికి ఏపీ దేశంలోనే నంబర్ ఒన్ అవుతుందని పబ్లిసిటీ చేసేవారు. అందుకోసం ఏవేవో చేస్తున్నట్లు అనేవారు. అవేవి జరగలేదు. 2019లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు 2047 నాటికి స్వర్ణాంధ్ర అంటున్నారు. ఏ ప్రభుత్వమైనా తమ ఎజెండాల ప్రకారం పాలన చేస్తాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకుడు గుంతలు, చెరువుల బాగు చేత తదితర చిన్న ,చిన్న కార్యక్రమాలకు పరిమితమైతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భారీ నీటిపారుదల స్కీములకు ప్రాధాన్యమిచ్చింది. ఫలితమే పులిచింతల, మల్యాల లిఫ్ట్, గుండికోట ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టులు. వై.ఎస్. చాలా దూరదృష్టితో పోలవరం ప్రాజెక్టు కింద కాల్వలు తవ్వించారు. విజన్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో కాల్వల తవ్వకాన్ని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కుడి కాల్వ, పట్టిసీమ లిఫ్్టల ద్వారా కృష్ణానదిలోకి నీటిని తీసుకువెళ్లి, నదుల అనుసంధానించినట్లు చెప్పుకున్నారు. తెలుగుదేశంకు చిత్తశుద్ది, ఆ డాక్యుమెంట్ లోని అంశాలపై నమ్మకం లేదూ అనేందుకు వీటిపై ఏరోజూ కనీస సమీక్షలు జరపకపోవడమే నిదర్శనం. ప్రచారం కోసం మాత్రం తన విజన్-2020 వల్లే హైదరాబాద్ అభివృద్ది అయినట్లు చెప్పుకుంటూంటారు. స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్‌లోని దశ సూత్రాలను చదివితే వాటిల్లో కొత్తేమిటి? అన్న సందేహం రాకమానదు. ‘అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం’ కాదనేది ఎవరు? కానీ ఇవన్నీ ఎలా వస్తాయి? పేదరిక నిర్మూలన వీటిల్లో ఒకటిగా చెప్పుకున్నారు. బాగానే ఉంది. కానీ ఇందుకు సంపన్నులు ముందుకు రావాలని పిలుపివ్వడం ఏమిటి? ఎంతమంది సంపన్నులు ఎందరు పేదలను ఉద్ధరిస్తారు? ఇంకో సంగతి. పూర్తిస్థాయి అక్షరాస్యతకు కూడా 2047నే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇంకో పాతికేళ్లు ఏపీలో నిరక్షరాస్యులు ఉంటారని చెప్పడమే కదా!ఇప్పుడు విజన్ 2047 అంటున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ సిక్స్ మాటేమిటి? వాటివల్ల వెల్త్, హెల్త్, హాపీనెస్ సమకూరవని తీర్మానించేసుకున్నారా? వాటిపై శాసనసభలో ఎలాంటి వివరణ ఇవ్వకుండా కొత్తగా ఈ నినాదాలు ఇవ్వడాన్ని జనం నమ్ముతారా? సూపర్ సిక్స్ లో ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీ దశ సూత్రాలలో ఎందుకు భాగం కాలేదు? రెండో పాయింట్ ఉద్యోగ, ఉపాధి కల్పన. సూపర్ సిక్స్‌లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంతవరకు నిరుద్యోగ భృతిగా నెలకు రూ.మూడు వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. కాని బడ్జెట్లో ఆ ఊసే లేదు. పైగా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు.నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ది మూడో అంశంగా ఉన్న దశ సూత్రాల్లో స్కిల్ స్కామ్ వంటివి జరక్కుండా జాగ్రత్త పడితే బాబుకే మేలు. నీటి భద్రత, రైతులకు వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ , ఇంధన వనరులు, నాణ్యమైన ఉత్పత్తులతో అంతర్జాతీయ బ్రాండింగ్, స్వచ్ఛ ఆంధ్ర మొదలైన వాటిని ప్రస్తావించారు. వీటి ద్వారానే ఏపీ అభివృద్ది చెందితే, తలసరి ఆదాయం 3200 పౌండ్ల నుంచి 42 వేల పౌండ్లకు పెరిగితే అంతకంటే కావల్సింది ఏమి ఉంటుంది? కాని వచ్చే ఇరవై ఏళ్లలో ప్రజల ఆదాయం 14 రెట్లు, అది కూడా పౌండ్లలో పెరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అంబానీ, అదాని తదితర భారీ పెట్టుబడిదారుల ఆదాయం పెరగవచ్చు. వారికి ఏపీకి సంబంధం ఉండదు. పేదవాడి ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడుతుదన్నది కీలకం.ఇదీ చదవండి: నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!ఒకవైపు జగన్ టైమ్ లో నిర్మాణం ఆరంభించిన పోర్టులను ప్రైవేటు పరం చేయాలని ఆలోచిస్తూ, ఇంకో వైపు కొత్తగా మెగా పోర్టులు ప్లాన్ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి అతిశయోక్తులు చాలానే ఉన్నాయి. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని, ఇది రాసి పెట్టుకోండని చంద్రబాబు చెబుతున్నారు.అప్పటికి ఈయనకు 99 ఏళ్లు వస్తాయి. గత ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపడితే అదంతా విధ్వంసం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత జగన్ స్కీములకు మూడు రెట్లు అదనంగా సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు.తీరా అధికారంలోకి వచ్చాక వాటికి మంగళం పాడే విధంగా ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా దాట వేస్తున్నారు.వాటికి బదులు స్వర్ణాంధ్ర 2047 అంటూ కొత్త రాగం తీస్తున్నారు.అంతేకాదు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని చెబుతున్నారు. అవి ఎంతవరకు ఆచరణ సాధ్యమో తెలియదు. ఈ నేపథ్యంలోనే ఈ స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్ ఒక డొల్ల అని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి డాక్యుమెంట్ల పేరుతో అబద్దాలాడితే తమ దేశంలో జైలుకో, ఆస్పత్రికో పంపుతారని ఏపీకి గతంలో వచ్చిన స్విస్ మంత్రి పాస్కల్ వ్యాఖ్యలను జగన్ గుర్తు చేశారు. ఒకవైపు అప్పులు అని ప్రచారం చేస్తూ, ఇంకో వైపు కొత్త, కొత్త వాగ్దానాలు, భారీ అంచనాలతో ప్రణాళికలు, విజన్ లు తయారు చేస్తే వినడానికి బాగానే ఉంటుంది కాని, సామాన్యుడికి ఏమి ఒరుగుతుంది?ఏది ఏమైనా స్వర్ణాంధ్ర 2047 పేరుతో వస్తున్న కొత్త సినిమాతో ఇక జనం తమకు సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల ప్రణాళికలోని సుమారు 200 వాగ్దానాలు అమలు చేయనవసరం లేదని చంద్రబాబు చెబుతారా! ఎందుకంటే ప్రజల అభిప్రాయాలను తీసుకుని దీనిని రూపొందిచామని అంటున్నారు కనుక. వారెవరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాగ్దానాల గురించి ప్రశ్నించలేదా? మొత్తం మీద సూపర్ సిక్స్ పోయే ఢాం... ఢాం.. ఢాం! కొత్త విజన్ 2047 వచ్చే ఢాం... ఢాం.. ఢాం! అన్నమాట!!- కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నాటి మంచికి కీడు చేయకుంటే అదే పదివేలు!
కొందరు మోసపూరిత ధోరణి అనవచ్చు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మాత్రం ఇది నేర్పరితనమే. చేసిన వాగ్ధానాలతో నిమిత్తం లేకుండా ఆయన ప్రభుత్వ స్కూళ్లకే వెళ్లి విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు సుద్దులు చెప్పి తిరిగి వచ్చారు. మెగా పేరెంట్స్, టీచర్స్ కమిటీల సమావేశాలతో రికార్డు సృష్టించామని ప్రకటించుకున్నారు కూడా. సహజంగానే ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఈ గొప్పలకు గొంతు కలిపారు. తామేం చేయబోతున్నామో చెప్పి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తే బాగుంటుంది కానీ.. ప్రచారం కోసం ఉత్తుత్తి మీటింగ్‌లు పెడితే ఏం లాభం? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే కొన్ని రోజుల క్రితం ఒక్కరోజు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు గొప్పలు చెప్పుకున్నారు. బహుశా వీటికి పోటీగానే లోకేష్ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినట్లుంది. ఒకరికొకరు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారన్నమాట!! పవన్ ,లోకేష్‌కు మధ్య సాగుతున్న ఈ అంతర్గత పోరు రాజకీయంలో చంద్రబాబు కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం ప్రభుత్వ స్కూళ్ల ఉద్ధరణకు సంకల్పం చెప్పుకున్నారు. కానీ ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఊరకే సమావేశాలు పెట్టామని చెబితే వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా ఇవే సమావేశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని తప్పుడు ఆరోపణలు సైతం గుప్పించారు. బాపట్లలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్, పేరెంట్స్‌తో భేటీ అయిన చంద్రబాబు, లోకేష్‌లకు అక్కడి పరిస్థితులను చూసిన వెంటనే జగన్ ప్రభుత్వం చేసిన మంచి కనిపించి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్‌బోర్డులు, మంచి బల్లలు, ఫ్యాన్లు, మంచినీటి వసతి, శుభ్రమైన మరుగుదొడ్లను చూసే ఉంటారు. స్కూల్ భవనాలు బాగుపడ్డ సంగతీ అర్థమై ఉంటుంది. అప్పటికే పవన్‌కళ్యాణ్ కూడా కొన్ని స్కూళ్లలో వచ్చిన మార్పులను ప్రత్యక్షంగా గమనించి ఆశ్చర్యపోయిన విషయం సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా వ్యాప్తి చెందింది. అధికారం చేపట్టిన తరువాత ఈ ఆరునెలల్లో స్కూళ్లను ఉద్ధరించేందుకు చేసిందేమీ లేకపోయినా తామూ ఏదో చేస్తున్నామని అనిపించుకునేందుకు మాత్రమే ఈ సమావేశాలను నిర్హించినట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఎదుట ఒక విద్యార్ధి తల్లి స్కూళ్లలో సమస్యలను వివరించిన ఉదంతమే అందుకు ఉదాహరణ అని చెప్పాలి. పారిశుద్ద్యం ఎలా కొరవడిందో, పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆమె చెబుతుంటే మంత్రి ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తమ ప్రచారం కోసం స్కూళ్లకు వెళ్లినా, వారు ఏమి తప్పు చేస్తున్నది వారికి తెలియకుండా ఉంటుందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్య, వైద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడునేడు పేరుతో అనేక కార్యక్రమాలు ప్లాన్ చేశారు. స్కూళ్ల రూపురేఖలను మార్చేశారు. ఇలా విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్లో జగన్ వేసిన ముద్రను చెరిపేసేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. జగన్ కంటే ఎక్కువ మంచి చేస్తే బాగుండేది కానీ.. ఒకపక్క ప్రభుత్వ స్కూళ్ల గురించి మాట్లాడుతూ, ఇంకోపక్క ప్రైవేటు స్కూళ్లకు ఉపయోగపడేలా వ్యవహరించడంతోనే వస్తుంది సమస్య. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో స్కూల్ తెరిచే జూన్ నెలలోనే తల్లుల ఖాతాలో రూ.15 వేల చొప్పున వేసేది. పిల్లలు స్కూళ్లు మానివేయకుండా ఉండడానికి చేసిన ఈ ప్రయత్నం జగన్‌కు పేరు తేవడంతో చంద్రబాబు అండ్ కో తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని, ప్రతి విద్యార్దికి రూ.15 వేల చొప్పున వేస్తామని నమ్మబలికారు. ‘‘ఓపిక ఉంటే ఎంతమంది పిల్లలనైనా కనండి’’ అని వారి బాధ్యత తనదని బొంకిన నేత ఇప్పుడు అసలు తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇచ్చేది చెప్పడం లేదు. అమ్మ ఒడి వల్ల జగన్ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించి ఉంటే, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం పేరుతో పిల్లలందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎందుకు చెప్పారో వివరించాలి కదా? రానున్న రోజుల్లో విద్యావ్యవస్థలో పెనుమార్పులు తెస్తామని చంద్రబాబు అన్నారు. అవేమిటో చెప్పాలి కదా? జగన్ ప్రభుత్వం పిల్లలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో ఏపీ ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే వరకు వెళ్లారు. విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమంటే ఇదే అని చంద్రబాబు చెబుతున్నారా? జగన్ టైమ్ లో పిల్లలు ఆంగ్ల మీడియంలో చదువుకుంటూ చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడేలా ఎదిగారు. అందువల్ల విద్యా వ్యవస్థ భ్రస్టు పట్టిందని చంద్రబాబు అంటారా? అప్పట్లో ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకంగా కూటమి నేతలంతా ప్రచారం చేశారు. వారి ప్రభుత్వం రాగానే ఆంగ్ల మీడియం ను నిరుత్సాహపరచే చర్యలు చేపట్టారు. తద్వారా ప్రైవేటు స్కూళ్లకు మేలు చేయడానికి చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నించారని అంటారు. ఇది కదా ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడం అంటే! అలాగే సీబీఎస్ఈ, ఐబి కోర్స్, టోఫెల్ వంటి విన్నూత్నమైన, ఖరీదైన కోర్సులను పేదలకు ఉచితంగా అందేలా జగన్ చేశారు. చంద్రబాబు భావనలో ఇది విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించడమేమో చెప్పాలి. ప్రతి ఏటా పిల్లలకు టాబ్ లు అందచేయడం తప్పని అనుకుంటున్నారా? ఈనాడు మీడియా అప్పట్లో నీచంగా పిల్లల ట్యాబ్ లపై ప్రచారం చేసి తన ఫ్యూడల్ ధోరణిని బయటపెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతోందేమో తెలియదు. స్కూళ్లలో పారిశుద్ద్యం, పిల్లకు భోజనం వంటి వాటిపై జగన్ ప్రభుత్వం అత్యంత శ్రద్ద వహించిందన్నది వాస్తవం.ఫైవ్ స్టార్ హెటల్ స్థాయిలో టాయిలెట్లను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ఇప్పుడు అవేమి అయిపోయాయో తెలియదు కాని, కర్నూలులో ఒక విద్యార్ధి తల్లి టాయిలెట్ల అధ్వాన్న పరిస్థితిపై వివరించడం వింటే ఎవరికైనా ఆవేదన కలుగుతుంది. జగన్ ఎన్ని సంస్కరణలు తీసుకు వచ్చినా వ్యతిరేకిస్తూ వికృతమైన కధనాలు రాసిన ఎల్లో మీడియా ఇప్పుడు విద్యా శాఖ నాలుగైదు రకాల బడులను ఏర్పాటు చేయబోతోందని చెబుతోంది. అంటే గత ప్రభుత్వ వ్యవస్థను దెబ్బ తీయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ తీరుతో రెండు లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లిపోయారని కొన్ని వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఈ విషయాలన్నిటిని జగన్ ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఆయనకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు.పైగా బుకాయిస్తున్నారు. ఈ జనవరి నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వచ్చే జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారని చెబుతున్నారు. మంత్రి లోకేష్ ఒక మాట అన్నారు. పిల్లలంతా తన కుమారుడు దేవాన్ష్ లానే అనిపిస్తారని చెప్పారు. మంచి మాటే. కానీ దేవాన్ష్‌కు వస్తున్న చదువు స్టాండర్ట్ తను మంత్రిగా బాధ్యత వహిస్తున్న ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు తీసుకు రావడం లేదు. జగన్ పై ఉన్న ద్వేషంతో ఉన్న కోర్సులను ఎందుకు తీసివేశారు.? ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నాం అని చెబుతున్న లోకేష్ ఎన్నికలకు ముందు టీచర్లను ఎలా రెచ్చగొట్టింది తెలియదా? ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో పిల్లలకు నైతిక విలువల గురించి బోధిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.మంచిదే! కానీ ముందుగా ప్రభుత్వానికి నైతిక విలువలు ఉండేలా ఏమి చర్యలు తీసుకుంటున్నారో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నైతిక విలువలు నేర్పడం వరకు బాగానే ఉంటుంది. అదే సమయంలో మూఢ విశ్వాసాలు పెరిగేలా ఉపన్యాసాలు చెప్పకుండా ఉండడం కూడా అవసరమే. చాగంటి నియామకాన్ని జనవిజ్ఞాన వేదికకు చెందిన పలువురు మేధావులు తప్పు పట్టారు. ఏది ఏమైనా జగన్ తీసుకు వచ్చిన విప్లవాత్మక మార్పులను ఒక వైపు ధ్వంసం చేస్తూ, మరో వైపు మెగా సమావేశాలు అంటూ కోటి ఇరవై లక్షల మందితో జరిగాయని చెబితే పిల్లలకు వచ్చే లాభం ఏమిటి? మీటింగ్ లతో తల్లికి వందనం చేసినట్లు అయిపోతుందా? అదేదో సామెత ఉంది. ఉత్తుత్తిగానే అన్నం పెట్టాం, కూర వేశాం.. మజ్జిగ వేశాం.. అంటూ పిల్లల ఆట మాదిరిగా విద్యావ్యవస్థను మేడిపండు చందంగా మార్చకుండా ఉంటే అదే పదివేలు!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజన్ 2047.. ఓ డొల్ల డాక్యుమెంట్: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విజన్ 2047 పేరిట ప్రజలను మభ్యపుచ్చి మాయ చేసేందుకు సీఎం చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం, ప్రజల అవసరాలకు చోటే లేదని ధ్వజమెత్తారు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు. ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్లలో మేనిఫెస్టో హామీల అమలుపై ఉండదని దుయ్యబట్టారు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం, మాయ చేయడం మీదనే ఆయన ధ్యాసంతా ఉంటుందని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో జగన్ పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే...⇒ 1998లో కూడా చంద్రబాబు విజన్–2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి లేక వలసలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగుల అష్టకష్టాలు.. వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రైవేటీకరణ పేరుతో విలువైన ప్రభుత్వ ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు.నాడు స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా విజన్ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని తమ దేశంలో జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్ 2020 కాదు.. 420 అంటూ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.⇒ 2014లో కూడా చంద్రబాబు విడుదల చేసిన విజన్ 2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. తన పరిపాలనలో మొత్తం విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క పోర్టుగానీ ఫిషింగ్ హార్బర్లుగానీ కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? స్కూళ్లు బాగు చేశారా? ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేశారా? వ్యవసాయ రంగాన్ని బాగు చేశారా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? మానవ వనరుల అభివృద్ధి మీద, యువత భవిష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశారా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. మరి ఇంకెందుకు ఈ విజన్ డాక్యుమెంట్లు?⇒ ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్ 2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్ కాదా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకుడిని చీటర్ అంటారు. అంతేగానీ విజనరీ అంటారా?⇒ చంద్రబాబు పాలనలో, ఆయన 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్న మాట వాస్తవం కాదా? మరి ఇంకెక్కడి సంపద సృష్టి? ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ఆయనకుసంపద సృష్టించే శక్తి లేదు. సమగ్ర ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్ 2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కట్టుకథ కాదా? ⇒ సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే 10 ఏళ్లు తీసుకున్నా లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని చంద్రబాబు.. ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపదను ఆవిరి చేసే ఈ బాబు.. ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే 420 అని అంటారు.మేం ఏం చేశామో చూడండి⇒ రాష్ట్రంలోని సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించి, సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్సార్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం. విద్యారంగంలో సీబీఎస్ఈ, ఐబీ, పిల్లలకు ట్యాబ్‌లు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థ, ఈ–క్రాప్, ఫామ్‌గేట్ వద్దే మద్దతు ధరకు పంటల కొనుగోళ్లు, నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల బలోపేతం, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌లు, ఉపాధి కల్పనా రంగంలో మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్‌తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ లాంటి పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాం. ⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు నీరు గారుస్తున్నారు, రద్దు చేస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బ తీశారు. ప్రభుత్వ రంగంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. ⇒ సమాజంలో అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి పేదలను మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తున్నారు. మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు? -
విజన్-2047.. చంద్రబాబు మరో పబ్లిసిటీ స్టంట్: వైఎస్ జగన్ చురకలు
సాక్షి, తాడేపల్లి: విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని.. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. ‘‘చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుంది’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘1998లో కూడా చంద్రబాబు విజన్-2020 పేరిట డాక్యుమెంట్ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రచరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు...ఆ రోజుల్లో స్విట్జర్లాండ్‌కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్లు పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్-2020 కాదు, “420’’ అంటూ చంద్రబాబును దుయ్యపట్టారు. 2014లోకూడా చంద్రబాబుగారు విజన్-2029 డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.‘‘తన పరిపాలనలో మొత్తం ౩ విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క పోర్టుకాని, ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? స్కూళ్లు బాగుచేశాడా? ఆస్పత్రులు బాగు చేశాడా? వ్యవసాయరంగాన్ని బాగుచేశాడా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఇచ్చాడా? మానవవనరుల అభివృద్ధి మీద, వారి భవిష్యత్తుమీద ఒక్కపైసా అయినా ఖర్చుచేశాడా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు...ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్-2047 పేరిట డాక్యుమెంట్ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్ కాదా? ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను గంగలో కలిపిన పాలకుడ్ని చీటర్ అంటారు కాని, విజనరీ అంటారా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.1.విజన్-2047 పేరిట @ncbn మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమే. చంద్రబాబుగారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2024 ‘‘చంద్రబాబు పాలనలో, ఆయన గత 14 ఏళ్లకాలంలో కూడా ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్నమాట వాస్తవం కాదా? మరి ఇంకెక్కడి సంపద సృష్టి. ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు, సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్-2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కూడా కట్టుకథ కాదా?..సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటినుంచి వచ్చే 10ఏళ్లు తీసుకున్నా లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధిచెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబు, ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపద ఆవిరిచేసే ఈ బాబు, ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే “420’’ అని అంటారు.’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘ఈ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి, అందరికీ సమాన అవకాశాలు కల్పించి, సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్సార్సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం. విద్యారంగంలో సీబీఎస్ఈ, ఐబీ, పిల్లలకు ట్యాబులు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్, ఫాంగేట్ వద్దే ఎంఎస్పీకి పంటల కొనుగోళ్లు, ఆరోగ్య రంగంలో నాడు నేడు ద్వారా ఆసుపత్రుల బలోపేతం, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌లు, ఉపాధికల్పనా రంగంలో మైక్రో సాప్ట్ తో నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్‌తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం...వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబుగారు నీరుగారుస్తున్నారు, రద్దుచేస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బతీశారు. ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో కింద ఉన్నవారికి చేయూత నిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలుచేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి, పేదలను మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడు. మరి చంద్రబాబుకు విజన్ ఉందని ఎలా అనుకుంటారు?’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట -
బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవిపై పులివెందుల వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారంటూ ధ్వజమెత్తారు. రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించకుండా అడ్డుకున్న హీన చరిత్ర బీటెక్ రవిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అప్రజాస్వామ్యంగా గెలిచిన వీటిని ఎన్నికలు అంటారా..? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించారు.గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీటెక్ రవిని పులివెందుల ప్రజలు ఓడించిన చరిత్ర మరిచిపోయావా? వైఎస్ వివేకా హత్యను రాజకీయంగా వాడుకోకపోతే బీటెక్ రవికి ఆ పార్టీలో మనుగడ కూడా లేదు. మీ సొంత గ్రామంలో ఇప్పటివరకు ఏ ఎలక్షన్లోనూ గెలవని చరిత్ర నీది. రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మేము ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాము’’ అని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
పెడన టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి యత్నం
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎలక్షన్ ఆఫీసర్‌పై కత్తితో దాడికి యత్నించారు. పామర్తి వెంకటేశ్వరావును పెడన మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ బలపరచగా, పామర్తి బ్రహ్మయ్యను నందిగామ సర్పంచ్ బొడ్డు సీతయ్య (చినబాబు) బలపర్చారు. ఎన్నికల్లో బ్రహ్మయ్యకు 10 ఓట్లు, వెంకటేశ్వరరావుకు 2 ఓట్లు వచ్చాయి.ఎన్నిక పూర్తయిన తర్వాత ఓటమిని తట్టుకోలేకపోయిన పామర్తి వెంకటేశ్వరరావు.. ఇంటికెళ్లి కత్తి తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి వద్ద ఉన్న పత్రాలు లాక్కునేందుకు యత్నించారు. పత్రాలు ఇవ్వకపోవడంతో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడికి యత్నించారు. దాడిని అడ్డుకోవడంతో మధుశేఖర్ చేతికి స్వల్పగాయమైంది. దాడి అనంతరం తన చేతిని గాయపరచుకుని పామర్తి వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. పామర్తి వెంకటేశ్వరరావుపై ఎన్నికల అధికారి మధుశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సీఐ ఓవరాక్షన్.. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసు ప్రవర్తన
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీవు ఎవరు మాకు చెప్పడానికంటూ మాజీ ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా వ్యవహరించారు. పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 123 నీటి వినియోగదారుల అసోసియేషన్లు, 10 డిస్ట్రిబ్యూటరీ, 2 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని మేజర్ చెరువుల కింద భూములు ఉన్న ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఎన్నికలకు కూటమి పార్టీ నేతలు రాజకీయ రంగులద్దారు. -
ఇక మరింత దూకుడుగా వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా..పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. తొలి విడతగా రైతులు, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.ఇదీ చదవండి: బాబు దగా పాలన.. తొలిపోరు విజయవంతంకూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో వైఎస్సార్సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్సీపీ పిలుపుఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలుప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వంఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటంజనవరి 3న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ధర్నాలు -
సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో–ఆర్డీనేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా, ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారు.కాన్ఫరెన్స్‌లో నేతలు ఏం చెప్పారంటే..సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగంకు పాల్పడుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిది. కానీ దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారుపోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని ప్రశ్నించిన పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్‌లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ పోరుబాట సక్సెస్.. వైఎస్ జగన్ కీలక ట్వీట్వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపైనా దాడులకు దిగడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతోంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేయొద్దని, కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసగా ఈ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల నుంచి వచ్చిన స్పందనను పార్టీ అధినేత వైయస్ జగన్‌కు నివేదించిన నేపథ్యంలో సాగునీటి ఎన్నికలను బహిష్కరించడం ద్వారా కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. కేసులు బనాయించి మరీ అతడ్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం సమ్మతం కాదని తీవ్రంగా ఖండించారాయన.హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనన్న వైఎస్ జగన్.. ఆ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి.. ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ను బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని వైఎస్జగన్ ప్రశ్నించారు. తన ప్రమేయం లేకున్నా నేరుగా ఆయన్ని అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని.. అరెస్టును ఖండించారు.హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్ -
వైఎస్సార్సీపీ పోరుబాట సక్సెస్.. వైఎస్ జగన్ కీలక ట్వీట్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం అయ్యిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. రైతులకు తోడుగా నిలిచిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.‘‘ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబూ.. ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఇ-క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300-400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? ..దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకు వస్తే, ఆ ఉచిత పంటలబీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డుపడ్డం చంద్రబాబుగారి రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ చెప్పారు.దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యింది. @ncbn గారు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024 ‘‘మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలిసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సర్టిఫికెట్లు వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహశీల్దార్ కార్యాలయాలకు రమ్మని చెప్పి, అక్కడ పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారిచేత దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు చేయడం మీ అరాచకపాలనకు నిదర్శనం కాదా?..ఎంపీ అవినాష్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు? అలాంటప్పుడు నీటిసంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? మీకు నచ్చినవారిని నామినేట్ చేసుకుంటే సరిపోతుందిగా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని ఓవైపు డప్పాలు కొట్టుకుంటూ మరోవైపు పోలీసులను దన్నుగా పెట్టుకుని దాడులు చేస్తున్నది నిజం కాదా? అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ, బహిష్కరించాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. రైతుల తరఫున ఎప్పుడూ వారికి అండగా ఉంటూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుంది’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం? -
ప్చ్... ఏంటో బాబు గారి మాటల అర్థం?
‘‘పాలనలో వేగం పెంచండి’’, ‘‘జనం మెచ్చేలా, మనం నచ్చేలా పాలన’’ అధికారుల వల్లే అసంతృప్తి’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలివి. ఎన్నికల హామీ అమలుపై చర్చ కాదు కదా.. కనీస ప్రస్తావన కూడా లేకుండా సాగిన ఈ సమావేశాన్ని గమనిస్తే దీనికో లక్ష్యమంటూ ఉందా? అన్న సందేహం రాకమానదు. నిర్దిష్ట సూచన, సలహాలు లేకుండా కలెక్టర్లదే బాధ్యతంతా అన్నట్టు చంద్రబాబు వ్యవహరించడం ఎవరిని మభ్యపెట్టేందుకు? వైసీపీ అధికారంలో ఉండగా జగన్ కలెక్టర్ల సమావేశం పెడితే ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీ పత్రాలను దగ్గర పెట్టుకుని వాటి అమలుపై సమీక్ష జరిగేది. అమలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చ జరిగేది. ఇప్పుడు అవేవీ లేవు. చంద్రబాబు తమ సూపర్ సిక్స్ హామీల గురించి కలెక్టర్లతో మాట్లాడే ధైర్యమూ చేయలేకపోతున్నారు. బాబే కాదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో సంబంధం లేని మాటలు నాలుగు మాట్లాడి సమావేశాలను మమ అనిపిస్తున్నారు.ఎస్పీలతో సమావేశాలు కానీ.. కలెక్టర్లతోనైనా కూడా తమ అధికారాన్ని ప్రదర్శించడం తప్ప వీరు చేసిందేమిటన్న ప్రశ్న వస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తే కదా.. జనం మెచ్చేది.. పాలకులు నచ్చేది? బదులుగా బాధ్యతంతా అధికారులదే అని చేతులు దులిపేసుకుంటే.. వారి వల్లే తాము ప్రజలకు నచ్చడం లేదూ అంటే ఎలా? రాష్ట్రస్థాయి కలెక్టర్ల సమావేశం ఎజెండాలో సూపర్ సిక్స్ లేకపోవడం గమనించాల్సిన విషయం. వీటి అమలుకు నిధులెన్ని కేటాయిస్తున్నారో చెప్పకుండా కలెక్టర్లు బాగా పనిచేయాలని అంటారు. ప్రజా ప్రతినిధులు చెప్పినట్లు నడుచుకోవాలని కూడా చెబుతున్నారు. ఇవి చేస్తే అది జనం మెచ్చే పాలన ఎలా అవుతుంది? ఈ నేపథ్యంలోనే జనంలో తిరుగుబాటు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే ఈయన ఒకసారి అంతా బాగున్నట్టు.. అప్పుడప్పుడూ ఇలా బాలేనట్లు పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగాల్లోని వైరుద్ధ్యాలు ఎంతో ఆసక్తికరం. చంద్రబాబేమో... ప్రజలతో గౌరవంగా ఉండండని అంటారు. అంతవరకూ ఓకే కానీ ఇది ఐఏఎస్‌లకే కాకుండా ఐపీఎస్‌లకూ వర్తిస్తుంది. టీడీపీ, జనసేన కూటమి నేతలు పోలీసులను తమ ఇష్టానురీతిలో వాడుకుంటూ పౌరులపై దాడులు చేయిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ వీటిని సమర్థిస్తూ.. ఇంకోపక్క సుభాషితాలు చెబుతూండటం విని కలెక్టర్లు నవ్వుకోవడం మినహా ఏమి చేస్తారు! రాష్ట్రం గాడిలో పడుతోందట..చీకట్లు తొలగిపోతున్నాయట. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చిందట.. చంద్రబాబు ఇలాంటి మాటలు ఎవరిని మాయ చేయడానికి చెబుతున్నారు? వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల హింస, అత్యాచారాలు, వేధింపులు జరుగుతుంటే ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అనడం అంటే ఎంత దారుణం! గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. అధికారులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు.ఇదే కలెక్టర్ ల సమావేశంలో పవన్ కళ్యాణ్ శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని చెప్పారు. సీఎంను అడిగి రూ.30 కోట్ల నిధులు తీసుకుని జీతాలు ఇప్పించామని అన్నారు. మున్సిపాల్టీలలో పారిశుద్ద్య కార్మికులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు ధర్నాలు చేస్తున్నాయి. పది లక్షల కోట్ల అప్పులు పేరుకున్నాయని చంద్రబాబు అన్నారు. కొద్దికాలం క్రితమే ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని శాసనసభలో చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం, మళ్లీ పాత పాటే పాడుతోంది. కొత్త అప్పులు చేద్దామంటే ఎఫ్ ఆర్ బిఎమ్ అనుమతించడం లేదట. ఇప్పటికి సుమారు డెబ్బై వేల కోట్ల అప్పు చేసి మరీ ఇంకా రుణాలు రావడం లేదని అంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా గతంలో ఎప్పుడూ తాను చూడలేదని పచ్చి అబద్దం చెబుతున్నారు.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో 1999 2004లో పనికి ఆహారం బియ్యం పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన ఏభై లక్షల టన్నుల బియ్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన విషయం శాసనసభలోనే పెద్ద రగడ జరిగింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆ పార్టీ, ఈ పార్టీ అని ఉండదు. అది తెలిసినా, వైఎస్సార్సీపీ పై బురద చల్లడం కోసం ఇలాంటి అసత్యాలు చెబుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమ రవాణా ఆగడం లేదని పవన్ కళ్యాణ్ అనడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పారు కదా! మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు ఎగుమతి చేసిన బియ్యంలో రేషన్ బియ్యం ఉన్నాయా? లేవా? అన్నది ఎందుకు తనిఖీ చేయలేదు? రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలలోను ఉందని కేశవ్ అన్న విషయంపై చంద్రబాబు ఏమి చెబుతారు? వైసీపీ ప్రభుత్వంలో పోర్టులు, సెజ్ లు కబ్జాకు గురయ్యాయట. జగన్ ప్రభుత్వపరంగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తుంటే వాటిని నిలిపి ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించాలని చూస్తున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడుతున్నారు.కాకినాడ సెజ్ లో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు చేసిన భూ దందాపై సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖకు చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా! అధికార యంత్రాంగంలో పాత వాసనలు పోవడం లేదట. ఆయనకు తెలియకుండా వారు పనులు చేస్తున్నారట. కుమారుడు లోకేష్ కనుసన్నలలో అన్నీ జరగుతున్నాయని టీడీపీలో టాక్. కాని తనకు చెప్పడం లేదని ముఖ్యమంత్రి అనడంలో ఆయన బలహీనత తెలుస్తూనే ఉంది కదా! అమరావతి ప్రారంభ దశలో రూ.ఏభై వేల కోట్ల అవసరం అని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఒక్క రూపాయి ఖర్చు చేయనవసరం లేదని, అది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రస్తావించరు. చంద్రబాబు ఒక్క నిజం చెప్పినట్లుగా ఉంది. ఇంతవరకు కేవలం నలభైవేల మందికే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయని తెలిపారు. ఎల్లో మీడియా ఇప్పటికే లక్షల మంది గ్యాస్ సిలిండర్లు పొందినట్లు ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు పొరపాటున వాస్తవం చెప్పేసినట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలలో జగన్ పాలనలో జీఎస్డీపీ సుమారు 12.5 పెరిగిందని పార్లమెంటులో ప్రకటిస్తే, చంద్రబాబు మాత్రం ఆదాయం తగ్గిందని చెబుతున్నారు.జగన్ టైమ్ లో కరోనా రెండేళ్లు సంక్షోభాన్ని సృష్టించినా, దానిని తట్టుకుని నిలబడితే ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ఎందుకు తగ్గిందో చెబితే ఒట్టు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం,తదితర సమస్యలపై మాత్రం నిర్దిష్ట హామీ ఇవ్వలేకపోయారు. వచ్చే సీజన్ లో చూద్దామని చెప్పి వదలి వేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా యథాప్రకారం తెలిసి, తెలియనట్లు మాట్లాడారనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు కనుక అక్రమాలను అడ్డుకుంటే మంత్రులు వెళ్లనవసరం లేదట. అదేమిటో అర్థం కాదు. ఒకవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్లు చేయాలని ముఖ్యమంత్రి చెబుతారు. ఇంకోవైపు అధికారులు నిస్సహాయంగా ఉండవద్దని అంటారు. వ్యవస్థ మూలాలను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని, పాత సినిమా డైలాగులనే ఆయన వల్లిస్తున్నారు.కాకపోతే ఒక్క వాస్తవం చెప్పారు. ప్రజలు ఆశలను నెరవేర్చలేకపోతున్నామని, తిరగబడే ప్రమాదం ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్ ల పరిస్థితి ఏపీలో ఉందని చెప్పడం మాత్రం విశేషమే. ఇదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా అంటున్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఒక్కదానిని కూడా సరిగా అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, దానివల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోందని జగన్ అంటున్నారు. చంద్రబాబు అబద్దాలు మోసాలుగా మారాయని, అదే ప్రజలలో కోపంగా మారుతున్నాయని, తమకు హామీ ఇచ్చిన విధంగా పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నెలకో రకంగా గోబెల్స్ ప్రచారం చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చిత్తశుద్ది ఉంటే, వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై సూపర్ సిక్స్, ఎన్నికల ప్రణాళికను దగ్గర పెట్టుకుని, ఎన్నికల సమయంలో ఏమి చెప్పాం? ఏమి చేస్తున్నామన్న దానిపై ఎన్నడైనా సమీక్ష చేసుకున్నారా? ఆ పని చేయకుండా కలెక్టర్ల సమావేశాలు పెట్టి డ్రామాల మాదిరి కబుర్లు చెబితే ప్రజలకు అర్థం కాదా? ఐఎఎస్ పాసై వచ్చిన కలెక్టర్లు, సెక్రటరీలకు ఇందులోని మోసం తెలియదా?. ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి, ఇప్పుడు డబ్బులు లేవని కథలు చెబుతూ తమను ప్రజలు మెచ్చుకోవాలని ఉపన్యాసాలు ఇస్తే మెచ్చుకోవడానికి ప్రజలు పిచ్చివాళ్లా? కొసమెరుపు ఏమిటంటే ఈ సమావేశంలో కలెక్టర్లు సోది చెబుతున్నారని ఎల్లో మీడియా ఒక స్టోరీ ఇచ్చింది. ప్రభుత్వంలో విషయం లేకపోతే సోది చెప్పక ఏమి చేస్తారు? అందులోను నేతల సోది విన్న తర్వాత వారు మాత్రం అందుకు బిన్నంగా వెళతారా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
YSRCP Poru bata: విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.విశాఖ కలెక్టరేట్ వద్దకు వైఎస్సార్సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.మరోవైపు.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి... సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు. -
‘రైతును రాజు చేస్తానన్న పవన్ ఎక్కడ?’
గుంటూరు, సాక్షి: ఏపీలో రోడ్డెక్కిన అన్నదాతలకు వైఎస్సార్సీపీ బాసటగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు పూర్తి చేసుకున్నా కూడా.. రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారామె. సాక్షితో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తోంది. రైతుల సంక్షేమం గాలికి వదిలేసింది. పెట్టుబడి సాయం ఊసే ఎత్తడం లేదు. పైగా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోంది. అకాల వర్షాలకు వరి ధాన్యం భారీగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలి.రైతును రాజు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదుకోవాల్సిందే. రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఇవాళ రైతు పోరుబాట అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగాల పేరుతో టీడీపీ ఎమ్మెల్యే భర్త మోసాలు! -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని గొల్లల గూడూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఈసీ మహేశ్వర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. నీటి సంఘాల ఎన్నికలలో పోటీ చేసేందుకు తాహసిల్దార్ కార్యాలయంలో నీటి పన్ను కట్టేందుకు వెళ్లగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. పన్ను కట్టేందుకు వెళ్లిన మహేశ్వర్ రెడ్డిని టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి, అతని అనుచరులు అడ్డుకుని బయటకు పంపించారు. మహేశ్వర్ రెడ్డి చేతిలోని కాగితాలను కూడా లాక్కున్న పార్థసారధిరెడ్డి చించివేశారు.అధికారులు సహకరించడం లేదు: వైఎస్సార్సీపీ ఫిర్యాదుజమ్మలమడుగు ఆర్డీవో, డీఎస్పీని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గురువారం కలిశారు. ఈ నెల 14న జరగనున్న నీటి సంఘాల ఎన్నికలకు అధికారులు సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నేతలకు సంబంధించిన నో డ్యూ సర్టిఫికెట్లను ఇవ్వకుండా కూటమి వర్గీయులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నీటి సంఘాల ఎన్నికల్లో లాండ్ ఆర్డర్ అదుపు తప్పే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు.కాగా, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామాల్లోని సాగునీటి సంఘం ఎన్నికలు ఈ నెల 14న నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి నోటీఫికేషన్‌ను ఆయా ఎన్నికల నిర్వహణ కేంద్రాల వద్ద ప్రదర్శించారు. మండల పరిధిలో 10 సాగునీటి సంఘాలు ఉన్నాయి. కెనాల్ పరిధిలోని దువ్వూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట మండలాలతో సంబంధం ఉన్న మండలంలోని నీటి సంఘాలకు సైతం ఒకే రోజున ఎన్నిక నిర్వహించనున్నారు.దువ్వూరు కేసీ కెనాల్ పరిధిలోని 62 అన్నశా్రస్తులపల్లె, 63 మడూరు, 64 చియ్యపాడు, మైదుకూరు కేసీ కెనాల్ పరిధిలో 67 మడూరు, 68 ఉప్పరపల్లె, 69 అనంతపురం, 70 అనంతపురం, 71 సోమాపురం, 74 అల్లాడుపల్లె, 75 మిడుతూరు సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక సంఘానికి ఒక్కో చైర్మన్‌ను ఓటర్లు ఎన్నుకుంటారని, సాగునీటి సంఘాల చైర్మన్లు అందరూ మండల చైర్మన్ ఎన్నుకోనున్నారు.63వ సంఘానికి అన్నవరం జెడ్పీ హైసూ్కల్లో, 64 సంఘానికి చియ్యపాడు జెడ్పీ హైసూ్కల్లో, 67 సంఘానికి మడూరు గ్రామ సచివాలయం, 69వ సంఘానికి చాపాడు ఎంపీడీఓ కార్యాలయం, 70వ సంఘానికి చాపాడు జెడ్పీహైసూ్కల్, 71వ సంఘానికి సోమాపురం గ్రామ సచివాలయం, 74వ సంఘానికి లక్ష్మీపేట జెడ్పీ హైస్కూల్లో ఎన్నిక నిర్వహిస్తారు. 68వ సంఘానికి ప్రొద్దుటూరులో, 75వ సంఘానికి ఖాజీపేట, 62వ సంఘానికి దువ్వూరు మండలంలో ఎన్నిక చేపట్టనున్నారు.