రాష్ట్రమంతా నడుస్తానంటూ నానా హంగామా చేసిన నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను మరో పది రోజుల్లో ముగించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నడవాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎంతగా సూచించినా.. లోకేష్ మాత్రం తన వల్ల కాదని తేల్చిచెప్పినట్టు సమాచారం. పాదయాత్రకు పార్టీ చాలా ప్రచారం చేసిందని, ఇప్పుడు మధ్యలోనే నిలిపివేస్తే మైలేజీ రాదని పార్టీ సీనియర్లు చెప్పినా.. లోకేష్ ససేమిరా అన్నట్టు తెలిసింది. ఇప్పటికే చాలా నడిచాను, ఇంకా నడవాలంటే తన వల్ల కాదని తేల్చిచెప్పినట్టు తెలిసింది.
అవకాశం దొరికితే పాదయాత్రకు బ్రేక్
ఏ నాయకుడికయినా జనంలో ఉండడం గొప్ప అవకాశం. దాన్ని సరిగా నిర్వహించుకోగలిగితే.. అన్ని వర్గాలకు చేరువ కావడం సులభం. పైగా తెలుగునాట ఇప్పటివరకు పాదయాత్రలు చేసిన వారందరికి అద్భుతమైన అవకాశాలు వచ్చాయి, ప్రజలు అంతేస్థాయిలో ఆదరించారు. అదే ఉద్దేశ్యంతో లోకేష్‌ను పాదయాత్రకు దించారు చంద్రబాబు. కానీ, ఆరంభం నుంచి ఈ పాదయాత్రను ఎప్పుడు ఆపేద్దామా అన్నట్టు సాగింది. చంద్రబాబు అరెస్టయినప్పుడు లోకేష్ వెంటనే పాదయాత్ర నిలిపివేశారు. నిజానికి పార్టీ కార్యకలపాలు స్తంభించినప్పుడు.. లోకేష్ జనంలోకి వెళ్లి నడిచి ఉంటే.. మంచి మైలేజీ వచ్చేదేమో. అయితే పాదయాత్ర ఆపేసి ఢిల్లీ వెళ్లిపోవడంతో లోకేష్ నాయకత్వంపై సందేహాలొచ్చాయి.
బెయిల్ తర్వాతా అదే పరిస్థితి
చంద్రబాబు అక్టోబర్ 31న విడుదలయ్యాడు. ఆ తర్వాతయినా లోకేష్ కదులుతాడా.. అంటే అతి కష్టమ్మీద నెట్టాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తీరా ఎన్నికల సమయంలో ఇచ్ఛాపురం వరకు నడిచి ఉంటే.. కనీసం డ్యామేజీకంట్రోల్ అయ్యేది. కానీ మొదటి నుంచి ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు చూసే లోకేష్.. తన యాత్రను పోలిపల్లితో సరిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
పోలిపల్లిలో యువగళానికి మంగళం
మరో పది రోజుల్లో, డిసెంబర్ 17న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం పాదయాత్రను ముగించాలని లోకేష్ నిర్ణయించారు. విశాఖ నుంచి భోగాపురం మద్య దూరం దాదాపు 60 కిలోమీటర్లు. అదే ఇచ్ఛాపురం నుంచి భోగాపురం మధ్య దూరం దాదాపు 200 కిలోమీటర్లు. అంటే చివరి 200 కిలోమీటర్లను లోకేష్ తన యాత్ర నుంచి కత్తిరించేశారు. ఇక ఇప్పటివరకు చేసిందేమీ లేకున్నా.. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ముగింపు సభ నుంచే చంద్రబాబు రాజకీయం ప్రారంభం
52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు.. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు పాటు కోర్టు ఆంక్షల వల్ల ఇంటికే పరిమితమయ్యారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెరవెనక మంత్రాంగాలతో సరిపెట్టారు. ఆ తర్వాత ఆంక్షలు ముగిసినా.. ఆధ్యాత్మిక యాత్రలతో పర్యటనలు జరిపారు. ఒక భారీ బహిరంగ సభ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ముగింపు సభను అవకాశంగా తీసుకుని మళ్లీ రాజకీయాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభకు పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వానం పంపారు. డిసెంబర్ 17న ఆదివారం రానుంది. ఇన్నాళ్లు మ్యానిఫెస్టోను ఆలస్యం చేసిన చంద్రబాబు, పవన్ ఆ రోజు కనీసం మినీ మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని చెబుతున్నారు.
ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment