
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ కార్యకర్తపై అమనుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ కొన్నిరోజులుగా వ్యవసాయ వర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైకోర్టుకు భూకేటాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 23న వర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ హాజరయ్యారు.
ఆందోళన విషయం తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని, నిరసన తెలుపుతున్నవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకుని ముందుకు పరుగెత్తారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. ఝాన్సీ జుట్టుపట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కిందపడిపోయింది. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఝాన్సీతోపాటు 15మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు.
ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కూడా స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి.. ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది.