
మలక్‌పేట: భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం..సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతడు భార్యతో గొడవపడేవాడు.
ఉద్యోగానికి సెలవు పెట్టి నాలుగైదు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం సాయంత్రం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇరుగు పొరుగు వారు, బంధువులు అతన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.