
శ్రవణ్‌రావును మూడోసారి విచారించిన సిట్ అధికారులు
సరైన సమాధానాలు ఇవ్వలేదంటున్న అధికారులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ చానల్ అధినేత శ్రవణ్‌రావు మంగళవారం మూడో సారి సిట్ ముందు విచారణకు వచ్చారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చిన శ్రవణ్‌రావు సిట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి ముందు హాజరయ్యారు. రాత్రి 10 గంటల వరకు.. అంటే 11 గంటల పాటు అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా శ్రవణ్‌ను ప్రశ్నించారు.
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో శ్రవణ్ సన్నిహితంగా మెలిగారు. 2023లో జరిగిన ఆయన ఫ్యామిలీ ఫంక్షన్‌కూ హాజరయ్యారు. అక్కడే ప్రభాకర్‌రావు ద్వారా శ్రవణ్‌రావుకు ప్రణీత్‌రావు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలుమార్లు ఎస్‌ఐబీ కార్యాలయానికి వెళ్లిన శ్రవణ్ అక్కడే ప్రణీత్‌ను కలిశారు. దీనిపై సిట్ ప్రశ్నించగా... తాను ఓ చానల్ అధినేత కావడంతో వృత్తిపరమైన సమాచారం కోసమే వెళ్లానని బదులిచ్చారు. శ్రవణ్ తనకున్న పరిచయాలతో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించేవారు. వీరిలో నాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న వారిని గుర్తించి, ఆ వివరాలను ప్రణీత్‌కు అందించారన్నది ఓ ఆరోపణ. దీనిపైనా సిట్ శ్రవణ్‌ను ప్రశ్నించింది.
శ్రవణ్ ఎంపిక చేసిన వారే టార్గెట్‌గా: 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు సాగిన ఫోన్ ట్యాపింగ్‌లో శ్రవణ్ ఎంపిక చేసిన వారినే టార్గెట్‌గా చేసుకున్నట్లు నిందితుల విచారణలో పోలీసులకు తెలిసింది. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చాలని భావించిన నాటి మంత్రి హరీశ్‌రావు ఓ కీలక సమావేశానికి సిఫార్సు చేశారన్నది పోలీసుల ఆరోపణ. ఆయన సూచనల మేరకే ప్రభాకర్‌రావు, ప్రణీత్, శ్రవణ్ సమావేశమై నిఘా ఉంచాల్సిన వ్యక్తుల పేర్లు ఖరారు చేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రణీత్ విచారణలోనూ ఇదే విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రవణ్‌రావుకు, హరీశ్‌రావుకు మధ్య ఉన్న సంబంధాల పైనా ఆరా తీశారు.
వీరంతా కలిసి ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడం,అధికారపక్షం నగదు రవాణాలోనూ కీలకంగా వ్యవహరించారన్న కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గాల వారీగా సర్వే చేసిన శ్రవణ్.. బీఆర్‌ఎస్‌కు 50 సీట్లు దాటడం కష్టమంటూ నివేదిక ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. కాగా, శ్రవణ్‌రావు నుంచి సహకారం లభించట్లేదని, తమ ప్రశ్నలకు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 2023లో శ్రవణ్ నుంచి స్వాదీనం చేసుకున్న రెండు సెల్ ఫోన్లలోని సమాచారం పోలీసులు రిట్రీవ్ చేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా శ్రవణ్‌ను మరోసారి విచారించాలని భావిస్తున్నారు.