
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున కౌంటర్ దాఖలు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వివిధ కారణాలను ప్రస్తావిస్తూ నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.
కౌంటర్ కాపీలో ఏముందంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావే కీలకం. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీ(Special Operations Team)ని నెలకొల్పింది ఇతనే. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఎస్‌వోటీ పనిచేసింది. ఫోన్‌ట్యాపింగ్‌కే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించింది. ట్యాపింగ్ బాధితుల్లో ప్రతిపక్షాలకు చెందిన వాళ్లను, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారు. అంతేకాదు..
.. ఓఎస్‌డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇప్పించారు. ఐపీఎస్ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో విధిలేక హైకోర్టుకు వచ్చారు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్‌కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు తొమ్మిది నెలలు గడిచినా నిందితుడు భారత్‌కు రాలేదు’’ అని ఉంది.
బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్ దర్యాప్తునకు సహకరించేలా నిందితుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టైన నిందితులందరికీ దాదాపుగా బెయిల్ లభించింది.