
దర్యాప్తు పరిణామాలను ముందే ఊహించారా?
అమెరికాలో ఎవరి వద్ద ఆశ్రయం పొందారు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావుకు సిట్ ప్రశ్నలు
ఆయన విచారణకు సహకరించలేదన్న పోలీసులు
ఏప్రిల్ 2న మరోసారి విచారణకు రావాలని పోలీసుల ఆదేశం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి నుంచి అమెరికాలో తలదాచుకున్న ఆయన.. శనివారం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుటికి వచ్చారు. ఉదయం 11.20 గంటలకు విచారణాధికారి ముందు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించారు.
‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మారకముందే దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఫోన్ ట్యాపింగ్‌లో మీ పాత్ర ఉన్నందుకే దర్యాప్తు పరిణామాలను ఊహించి పారిపోయారా? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుతో మీకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు? అక్కడ ఎవరి వద్ద తలదాచుకున్నారు?’అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది.
కీలకంగా శ్రవణ్‌రావు?
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదు కాగా... మే మొదటి వారంలో శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేర్చారు. అయితే ఆయన అప్పటికే అమెరికా పారిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రణీత్‌కు.. శ్రవణ్ కీలక ఇన్‌ఫార్మర్‌గా పనిచేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను ఇప్పటికే నిందితుల ఫోన్ల నుంచి రిట్రీవ్ చేశారు. ముగ్గురు బీఆర్‌ఎస్ నాయకుల ఆదేశాల మేరకే శ్రవణ్‌రావు ఈ పాత్ర పోషించారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్‌వర్క్ ద్వారా సేకరించిన శ్రవణ్.. ఆ వివరాలను వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుకు పంపాడని ఆధారాలు సేకరించారు. గత ఏడాది మార్చి 22న దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని శ్రవణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అప్పట్లో అత్యాధునిక ట్యాపింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించి పలు చోట్ల మినీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
వాటిలో ఒకటి శ్రవణ్ కార్యాలయం కేంద్రంగానూ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు వెనుక శ్రవణ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ విచారించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు సెల్‌ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలీదు అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని శ్రవణ్‌రావును పోలీసులు ఆదేశించారు.
రహస్యంగా రావటం.. రహస్యంగానే పోవటం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా గతంలో ఎప్పుడూ కనిపించని గోప్యతను శ్రవణ్‌రావు విషయంలో పోలీసులు పాటించారు. ఆయన మీడియా కంటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రవణ్ రాక విషయం తెలుసుకున్న మీడియా.. ఉదయం 10 గంటల నుంచే సిట్ కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది.
అయితే, మీడియాను పోలీసులు ఠాణా ప్రధాన గేటు దాటి లోపలికి అనుమతించలేదు. శ్రవణ్‌రావు విచారణకు వచ్చిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన చుట్టూ పోలీసులు నిలబడి కెమెరా కంటికి దొరకనివ్వలేదు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అయినా ఫొటోలు తీసుకుందామని భావించిన మీడియా సాయంత్రం 6 వరకు వేచి చూసింది.
ఈసారి మరో ఎత్తు వేసిన పోలీసులు.. శ్రవణ్‌రావును వెనుక గేటు నుంచి చాటుగా పంపించారు. దీంతో మిగిలిన నిందితుల విషయంలో లేని గోప్యత శ్రవణ్‌రావు విషయంలోనే ఎందుకు పాటించారని పోలీసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం కరువైంది.