sravan rao
-
11 గంటలు.. పలు ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ చానల్ అధినేత శ్రవణ్‌రావు మంగళవారం మూడో సారి సిట్ ముందు విచారణకు వచ్చారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చిన శ్రవణ్‌రావు సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి ముందు హాజరయ్యారు. రాత్రి 10 గంటల వరకు.. అంటే 11 గంటల పాటు అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా శ్రవణ్‌ను ప్రశ్నించారు.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో శ్రవణ్ సన్నిహితంగా మెలిగారు. 2023లో జరిగిన ఆయన ఫ్యామిలీ ఫంక్షన్‌కూ హాజరయ్యారు. అక్కడే ప్రభాకర్‌రావు ద్వారా శ్రవణ్‌రావుకు ప్రణీత్‌రావు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలుమార్లు ఎస్ఐబీ కార్యాలయానికి వెళ్లిన శ్రవణ్ అక్కడే ప్రణీత్‌ను కలిశారు. దీనిపై సిట్ ప్రశ్నించగా... తాను ఓ చానల్ అధినేత కావడంతో వృత్తిపరమైన సమాచారం కోసమే వెళ్లానని బదులిచ్చారు. శ్రవణ్ తనకున్న పరిచయాలతో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించేవారు. వీరిలో నాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న వారిని గుర్తించి, ఆ వివరాలను ప్రణీత్‌కు అందించారన్నది ఓ ఆరోపణ. దీనిపైనా సిట్ శ్రవణ్‌ను ప్రశ్నించింది. శ్రవణ్ ఎంపిక చేసిన వారే టార్గెట్‌గా: 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు సాగిన ఫోన్ ట్యాపింగ్‌లో శ్రవణ్ ఎంపిక చేసిన వారినే టార్గెట్‌గా చేసుకున్నట్లు నిందితుల విచారణలో పోలీసులకు తెలిసింది. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చాలని భావించిన నాటి మంత్రి హరీశ్‌రావు ఓ కీలక సమావేశానికి సిఫార్సు చేశారన్నది పోలీసుల ఆరోపణ. ఆయన సూచనల మేరకే ప్రభాకర్‌రావు, ప్రణీత్, శ్రవణ్ సమావేశమై నిఘా ఉంచాల్సిన వ్యక్తుల పేర్లు ఖరారు చేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రణీత్ విచారణలోనూ ఇదే విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రవణ్‌రావుకు, హరీశ్‌రావుకు మధ్య ఉన్న సంబంధాల పైనా ఆరా తీశారు.వీరంతా కలిసి ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడం,అధికారపక్షం నగదు రవాణాలోనూ కీలకంగా వ్యవహరించారన్న కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గాల వారీగా సర్వే చేసిన శ్రవణ్.. బీఆర్ఎస్కు 50 సీట్లు దాటడం కష్టమంటూ నివేదిక ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. కాగా, శ్రవణ్‌రావు నుంచి సహకారం లభించట్లేదని, తమ ప్రశ్నలకు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 2023లో శ్రవణ్ నుంచి స్వాదీనం చేసుకున్న రెండు సెల్ ఫోన్లలోని సమాచారం పోలీసులు రిట్రీవ్ చేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా శ్రవణ్‌ను మరోసారి విచారించాలని భావిస్తున్నారు. -
శ్రవణ్ ఫోన్లపైనే సిట్ ఫోకస్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ!
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ6గా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన రెండు ఫోన్లు కీలకం కానున్నాయి.ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది.దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పు పట్టిన ఫోన్‌ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. తాము అడిగిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. -
రెండోసారి గంట సేపు విచారణ!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌రావు బుధవారం రెండోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు వచ్చిన ఆయనను అధికారులు దాదాపు గంటపాటు ప్రశ్నించారు. శనివారం మొదటిసారి సిట్ ముందు హాజరైనప్పుడు అధికారులు, శ్రవణ్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. బుధవారం సైతం సుదీర్ఘంగానే విచారించాలని భావించారు. అయితే హెచ్‌సీయూ పరిణామాల నేపథ్యంలో పోలీసులు బిజీ అయ్యారు. దీంతో కేవలం గంట మాత్రమే ప్రశ్నించి పంపిస్తూ.. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. శ్రవణ్‌రావు గతంలో ఓ టీవీ చానల్‌ను నిర్వహించారు. ఆ చానల్‌ను ఎందుకు తీసుకున్నారు? దానికి పెట్టుబడులు ఎవరు పెట్టారు? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరోపక్క దుబాయ్‌లో సొంత ఫ్లాట్ ఉన్న శ్రవణ్, ఇటీవల రెండు నెలల పాటు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ఫ్లాట్ ఎప్పుడు? ఎలా? ఖరీదు చేశారనే అంశంతో పాటు ఆ ఐదుగురు ఎవరని పోలీసులు అడిగారు. కాగా, పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా శ్రవణ్‌రావు నుంచి సరైన సమాధానం రాలేదని తెలు స్తోంది. శనివారం విచారణ సందర్భంగా శ్రవణ్‌రావు తాను 2023 ఎన్నికల సమయంలో ఓ సర్వే చేశానని. దాని వివరాలను ప్రభాకర్‌రావుతో పంచుకున్నానని చెప్పారు. ఆయనతో పాటు ఆయన ద్వారా పరిచయమైన ప్రణీత్‌తో తప్ప మరే ఇతర అధికారి, నాటి ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం లేదంటూ శ్రవణ్‌రావు వాదిస్తున్నారు. అయితే ఆ సర్వే ఎవరి సూచనల మేరకు చేశారు? అందుకు సంబంధించిన నగదు ఎవరు చెల్లించారు? అనే అంశంపై పోలీసులు ప్రశ్నించినా.. శ్రవణ్ నుంచి సామాధానం రాలేదని తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ 2 ఫోన్లు వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని తీసుకువచ్చి అప్పగించాలని శనివారమే స్పష్టం చేశారు. అయితే బుధవారం ఆయన ఓ పాత సెల్‌ఫోన్ తీసుకువచ్చి ఇచ్చారు. అది చూసి షాక్‌కు గురైన పోలీసులు గతంలో వాడినవి కావాలని స్పష్టం చేశారు. ఆ రెండు సెల్ఫోన్లను ఎనిమిదో తేదీన విచారణకు వచ్చే సమయంలో తీసుకురావాలని స్పష్టం చేశారు. సెల్ఫోన్లను మార్చే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఆయన నుంచి సరైన సహకారం లభించడం లేదని పోలీసులు చెపుతున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ.. శ్రవణ్ రావుకు మళ్లీ నోటీసులు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు(Shravan Rao) విచారణ ముగిసింది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. అధికారులు అడిగిన పత్రాలను సమర్పించగా.. ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా.. అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే గత విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కీలకంగా శ్రవణ్ రావుతొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సిరిసిల్ల డీసీఆర్బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను సుదీర్ఘంగా విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
ముందుగానే ఎందుకు పారిపోయారు?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా ఛానల్ అధినేత శ్రవణ్‌రావు ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి నుంచి అమెరికాలో తలదాచుకున్న ఆయన.. శనివారం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుటికి వచ్చారు. ఉదయం 11.20 గంటలకు విచారణాధికారి ముందు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించారు. ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా మారకముందే దేశం విడిచి ఎందుకు పారిపోయారు? ఫోన్ ట్యాపింగ్‌లో మీ పాత్ర ఉన్నందుకే దర్యాప్తు పరిణామాలను ఊహించి పారిపోయారా? ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుతో మీకు ఉన్న సంబంధాలు ఎలాంటివి? విదేశాలకు పారిపోయేందుకు ఎవరు సహకరించారు? అక్కడ ఎవరి వద్ద తలదాచుకున్నారు?’అని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. కీలకంగా శ్రవణ్‌రావు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10న నమోదు కాగా... మే మొదటి వారంలో శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేర్చారు. అయితే ఆయన అప్పటికే అమెరికా పారిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల నగదు లావాదేవీలపై దృష్టి పెట్టిన ప్రణీత్‌కు.. శ్రవణ్ కీలక ఇన్ఫార్మర్గా పనిచేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్‌లను ఇప్పటికే నిందితుల ఫోన్ల నుంచి రిట్రీవ్ చేశారు. ముగ్గురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే శ్రవణ్‌రావు ఈ పాత్ర పోషించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, వీరికి అండగా నిలుస్తున్న వారి వివరాలను తన నెట్వర్క్ ద్వారా సేకరించిన శ్రవణ్.. ఆ వివరాలను వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావుకు పంపాడని ఆధారాలు సేకరించారు. గత ఏడాది మార్చి 22న దర్యాప్తు అధికారులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని శ్రవణ్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అప్పట్లో అత్యాధునిక ట్యాపింగ్ పరికరాలను విదేశాల నుంచి తెప్పించి పలు చోట్ల మినీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి శ్రవణ్ కార్యాలయం కేంద్రంగానూ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరికరాల కొనుగోలు వెనుక శ్రవణ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ విచారించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు సెల్ఫోన్ల నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగానూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. అయితే, ఆయన విచారణకు సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదు, తెలీదు అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీన మరోసారి విచారణకు రావాలని శ్రవణ్‌రావును పోలీసులు ఆదేశించారు. రహస్యంగా రావటం.. రహస్యంగానే పోవటం అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సందర్భంగా గతంలో ఎప్పుడూ కనిపించని గోప్యతను శ్రవణ్‌రావు విషయంలో పోలీసులు పాటించారు. ఆయన మీడియా కంటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రవణ్ రాక విషయం తెలుసుకున్న మీడియా.. ఉదయం 10 గంటల నుంచే సిట్ కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. అయితే, మీడియాను పోలీసులు ఠాణా ప్రధాన గేటు దాటి లోపలికి అనుమతించలేదు. శ్రవణ్‌రావు విచారణకు వచ్చిన సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ఆయన చుట్టూ పోలీసులు నిలబడి కెమెరా కంటికి దొరకనివ్వలేదు. విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో అయినా ఫొటోలు తీసుకుందామని భావించిన మీడియా సాయంత్రం 6 వరకు వేచి చూసింది. ఈసారి మరో ఎత్తు వేసిన పోలీసులు.. శ్రవణ్‌రావును వెనుక గేటు నుంచి చాటుగా పంపించారు. దీంతో మిగిలిన నిందితుల విషయంలో లేని గోప్యత శ్రవణ్‌రావు విషయంలోనే ఎందుకు పాటించారని పోలీసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం కరువైంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 శ్రవణ్ రావుకు పోలీసుల నోటీసులు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్‌రావు సిట్ విచారణ
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావు విచారణ ముగిసింది ఏడు గంటలకుపైగా శ్రవణ్‌రావును సిట్ అధికారులు ప్రశ్నించారు.ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. కెనడాలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping case) కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ద్వారా ఇంటర్ పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ సంతృప్తి చెందారు. దీంతో, కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ.. ఇంటర్ పోల్‌ను కోరింది. దీంతో, సీబీఐ ద్వారా ఇంటర్ పోల్(Interpol )కు రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు చేరుకున్నాయి.అనంతరం స్పందించిన ఇంటర్ పోల్ అధికారులు.. 196 దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు. అయితే, ఇప్పటికే నిందితులు ఇద్దరూ అమెరికాను వీడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఉన్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. ప్రభాకర్, శ్రవణ్ రావుకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. దీంతో, వారిద్దరూ దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. కాగా, అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు.. పాస్‌పోర్టు అథారిటీకి లేఖ రాశారు. దీంతో, పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఇదే సమయంలో నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు సిటీ పోలీసులు. మరోవైపు.. అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. పాస్‌పార్ట్ రద్దు, రెడ్ కార్నర్(ఇంటర్‌పోల్) నోటీసులు కీలకంగా మారనున్నాయి. ఇక, ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. -
శ్రవణ్ రావు అద్భుత సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో రాజూస్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్‌మెన్ ఎ. శ్రవణ్ రావు (149) అద్భుత సెంచరీతో చెలరేగాడు. దీంతో సత్య సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 164 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజూస్ క్లబ్ 37 ఓవర్లలో 294 పరుగులు చేసింది. శ్రవణ్ రావు త్రుటిలో 150 పరుగుల మార్క్‌ను కోల్పోయాడు. కమల్ యాదవ్ (39) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో కె. రిత్విక్ రెడ్డి 5, హర్ష 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ జట్టు 33.2 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రిత్విక్ రెడ్డి (30), గౌరీ శంకర్ (39) పోరాడారు. రాజూస్ క్లబ్ బౌలర్లలో శ్రవణ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రోషనారా సీసీ: 341/6 (ముకేశ్ 76, సయ్యద్ జీషాన్ 53, బిజయ్ కల్యాణ్ 56 నాటౌట్), ఎల్‌ఎన్‌సీసీ: 88 (అమీర్ 3/25, కునాల్ 3/20, విను 3/29). రంగారెడ్డి జిల్లా: 87 (నదీమ్ ఖాన్ 3/10), షాలిమార్ సీసీ: 92/1 (నదీమ్ ఖాన్ 51 నాటౌట్). హైదరాబాద్ వాండరర్స్: 167 (జమీల్ 62; భరద్వాజ్ 4/40), అక్షిత్ సీసీ: 168/3 (రిత్విక్ 61 నాటౌట్, శ్రునోత్ 43). మహేశ్ సీసీ: 209 (పి. వినయ్ 43, కె. శ్రవణ్ 55 నాటౌట్; రాజశేఖర్ 7/68), కాకతీయ సీసీ: 181 (అనంత్ 54; వినయ్ 4/20). సాక్రెడ్ హార్ట్: 244 (లెస్లీ 102, జెరోమ్ 42; చైతన్య 4/50, స్వామి 3/36), ఎంపీ బ్లూస్: 247/8 (రాజు 59, యేసుదాస్ 3; లెస్లీ 5/52). ఎస్ఎన్ గ్రూప్: 127 (శ్రీనివాస్ 3/28, భరత్ 4/9), అంబర్పేట్ సీసీ: 128/6 (రిజ్వాన్ 39 నాటౌట్). అక్షిత్ సీసీ: 319 (శ్రునోత్ 79, షహాంక్ 63; సంజయ్ 3/78), యూనివర్సల్ సీసీ: 149 (యశ్వంత్ 47).