ఇండియా ఇంత బలహీనమైనదా? | Sakshi Editorial On Donald Trump | Sakshi
Sakshi News home page

ఇండియా ఇంత బలహీనమైనదా?

May 19 2025 6:11 AM | Updated on May 19 2025 1:25 PM

Sakshi Editorial On Donald Trump

అభిప్రాయం

ఈ మధ్య కాలంలో ప్రపంచం యుద్ధాల భూమిగా మారింది. గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఏడాదిన్నర నుండి ఇజ్రాయెల్‌ – పాలస్తీనా యుద్ధం భీకర నష్టానికి కారణమైంది. ఏప్రిల్‌ 22న అమా యక భారతీయులను కశ్మీర్‌లో టెర్రరిస్టులు దారుణంగా హత్య చెయ్యడంతో దేశం ఉడికిపోయింది. మే 7న పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపు మీద ఇండియా దాడి చేసింది. అది ఒక మినీ వార్‌కు దారి తీసింది. అందులో రెండు యుద్ధాలు టెర్రరిస్టులు అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడంతో మొదలయ్యాయి. ఒకటి భూభాగ సమస్యగా మొదలైంది.

టెర్రరిజంపై యుద్ధాలు
గత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిస్టులు ప్లాన్‌ చేసి అమాయక ప్రజలను చంపడంతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి దేశాలను సైతం ధ్వంసం చేయడానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు ఇండియా–పాకిస్తాన్‌ మధ్య అటువంటి టెర్రరిస్టు దాడి వల్ల నాలుగు రోజులు కాల్పులు జరిగాయి. చివరికి మే 12న విరమణ జరిగింది. అయితే దీన్ని ఇండియా–పాకిస్తాన్‌ అధికారులు ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అదీ యుద్ధం విరమించకపోతే ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పాననీ, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారనీ అన్నారు. ఇది చాలా తీవ్రమైన ప్రకటన.

అంతేకాదు, ఆ రెండు దేశాలు ఒక తటస్థ ప్రదేశంలో కశ్మీర్‌ సమస్యను చర్చించి, పరిష్కరించుకోవడానికి అంగీకరించారని కూడా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని ఆపానని కూడా అన్నారు. ట్రంప్‌ ప్రకటనలు పాక్‌ కంటే ఎక్కువగా ఇండియాను ఇరకాటంలో పెట్టాయి. అయితే పాక్‌ కూడా ట్రంప్‌ మధ్యవర్తిత్వానికి పాకులాడి ఎందుకు లొంగిపోయిందని చైనా నిలదీస్తున్నది. చైనా పాకిస్తాన్‌కు చాలా ఆయుధాలను ఇచ్చిందనేది తెలిసిందే. ఈ నాలుగు రోజుల ఇండియా–పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు... చైనా, యూరప్, అమెరికా ఆయుధాల అమ్మకపు మార్కెట్‌ బలాబలాలను మార్చేసింది అనే చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.

దౌత్య విలువలను మంటగలిపిన ట్రంప్‌
ట్రంప్‌ భారత ప్రభుత్వానికి దగ్గరి మిత్రుడని బీజేపీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్‌ రెండోసారి గెలిచాక భారత్‌ను అవమానపరిచే అనేక ప్రకట నలు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్‌ పర్యటనలో ఉండగానే మన దేశ పౌరులను అక్రమ వలసదారులు అనే నెపంతో చేతు లకు బేడీలు వేసి, మిలిటరీ విమానంలో చండీగఢ్‌ విమానాశ్రయంలో వదిలారు.

అలాగే ఇండియా–పాక్‌ రెండు దేశాలనూ అవమానపరిచేలా, ఆయా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పకముందే తాను చేయబట్టే యుద్ధం ఆగిపోతోంది అని ట్వీట్‌ చేశారు. ఇది అన్ని విధాలుగా అంతర్జాతీయ దౌత్య విలువలకూ, యుద్ధ నీతికీ వ్యతిరేకం. ఆయా ప్రభుత్వాలు చెప్పాల్సిన విషయమది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా దాన్ని ఆపేందుకు అటు ఐక్యరాజ్యసమితి(యూఎన్‌ఓ), లేదా ఇతర దేశాలు రాయబారాలు జరిపి రెండు దేశాలనూ ఒప్పించి యుద్ధం ఆగేట్లు చూడటం దౌత్య నీతిలో భాగమే.

అందులో ఇండియా–పాక్‌ న్యూక్లియర్‌ ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు కనుక ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధం ఆపాలని చూడటం అవసరం. కానీ మొన్న యూఎన్‌ఓ ఎక్కడా కనిపించలేదు. అది నిజానికి ఉక్రెయిన్‌ – రష్యా, ఇజ్రాయెల్‌ – పాలస్తీనా యుద్ధాలను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ఇండియా–పాక్‌ ఉద్రిక్తతల సమయంలో దాని ఉనికి కనిపించలేదు. యూరోపియన్‌ దేశాలు కూడా ఇండియా–పాక్‌ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్‌–పాలస్తీనా యుద్ధంలాగా ఘోరంగా అమాయక ప్రజలను టెర్రరిస్టులు చంపడంతో మొదలైనా పెద్దగా పట్టించుకోలేదు. రష్యా కూడా బహిరంగంగా ఇండియాకు మద్దతు పలుకలేదు. చైనా, టర్కీ, ఇరాన్‌... పాకిస్తాన్‌కు అండగా ఉన్నాయనేది స్పష్టంగానే కనిపించింది.

వీటన్నింటినీ మించి యూఎస్, ముఖ్యంగా ట్రంప్‌ పాత్ర అన్ని యుద్ధ సమయపు దౌత్య విలువలనూ నాశనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ కొద్ది రోజుల ముందే ఇండియా వచ్చి మిత్రగానం చేసి ‘ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం మా పని కా’దన్నాడు.  కానీ పాక్‌కు 2.3 బిలియన్‌ డాలర్లు ఐఎంఎఫ్‌ ద్వారా ఇప్పించారు. పైగా ట్రంప్‌ కశ్మీర్‌ను మళ్ళీ చర్చల తెర మీదకి తెచ్చి ఒక తటస్థ స్థలంలో ‘వెయ్యి ఏండ్ల’ సమస్యగా ఉన్న కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తామనడం, కాల్పుల విరమణను వాణిజ్య లావాదేవీలతో ముడిపెట్టి ప్రకటించడం చూస్తే, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని తన డొమినియన్‌ స్టేట్‌గా భావిస్తున్నట్టు కనబడుతుంది.

ఈ ప్రశ్నలకు జవాబుందా?
భారతదేశం నుండి అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్‌ పర్మిట్‌లో 3–5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్‌ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో! ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదల్చుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి. కానీ ఆయన గెలిచే నాటికే ఆ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో, చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు.

పైగా కాల్పుల విరమణ పేరుతో ట్రంప్‌ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి డిప్లమాటిక్‌ ఇమ్మోరాలిటీని ఈ దేశం ఎదిరించలేదా? భారతదేశం ఇంత బలహీనమైనదా? జాతీయవాదం, ఆత్మగౌరవం అని చెప్పే, బలమైన ఆర్థిక వ్యవస్థగా యుద్ధశక్తిగా ఎదుగుతున్నామని చెప్పే బీజేపీ/ఆరెస్సెస్‌ ట్రంప్‌కు ఎందుకు భయపడుతున్నాయి? అమెరికా మద్దతు లేకపోతే దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది? భారతదేశంలోని పెద్ద వ్యాపారులందరికీ అమెరికన్‌ ఆర్థిక పెట్టుబడులతో ఉన్న అనుబంధంతో ఈ స్థితి వచ్చిందా? అయినా ఈ సంక్షోభ సమయంలో అమెరికా, ముఖ్యంగా ట్రంప్‌ పాకిస్తాన్‌కే ఎక్కువ మేలు చేసినట్టు కనిపించింది కదా! టెర్రరిజాన్ని పోషించే పాక్‌కు ఇన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి అంటే అర్థమేమిటి?

గత పదేళ్ళుగా బీజేపీ/ఆరెస్సెస్‌ గ్లోబల్‌ డిప్లమసీలో మన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టామని చెబుతూ వచ్చాయి కదా! అమెరికాలోని ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు ట్రంప్‌కు ఎంతో సపోర్టు చేస్తూ వచ్చాయి కదా! మరి ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదే! ఆఖరికి పాక్‌ అక్రమ వలసదారులకు కూడా ఆ స్థితి వచ్చిన దాఖలాలే లేవే! ఇప్పుడు బీజేపీ/ఆరెస్సెస్‌ 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ను సంపూర్ణంగా దేశంలో విలీనం చేశామని చెబుతుంటే ట్రంప్‌ ఆ సమస్యను మళ్ళీ ప్రపంచ సమస్య చేశారు కదా! ఇది కూడా ఆరెస్సెస్‌/బీజేపీ అనుకూల అంశమేనా? ఇది కూడా ఈ దేశ సమగ్రతను కాపాడే చర్చయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?
 

- ప్రొఫెస‌ర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌
ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement