
సాక్షి, కర్నూలు: కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వివరాల ప్రకారం.. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో కూటమి కుట్రలు ఫలించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు. దీంతో, ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. లోకేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా..
మరోవైపు.. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైఎస్సార్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.

శ్రీ సత్యసాయి జిల్లా..
రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్‌సీపీకి-8, టీడీపీకి-1 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు.