సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. దీంతో, వారిద్దరూ దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. కాగా, అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు.. పాస్‌పోర్టు అథారిటీకి లేఖ రాశారు. దీంతో, పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను అధికారులు రద్దు చేశారు.
ఇదే సమయంలో నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు సిటీ పోలీసులు. మరోవైపు.. అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. పాస్‌పార్ట్ రద్దు, రెడ్ కార్నర్(ఇంటర్‌పోల్) నోటీసులు కీలకంగా మారనున్నాయి. ఇక, ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది.
ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment