Passport Canceled
-
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గత ఏడాది జూలై–ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో దేశ విమోచన పోరాటయోధుల కుటుంబాలు, వారసులకు నియామకాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణిచేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించడం తెల్సిందే. ఆమె పాస్ట్‌పోర్ట్‌ను రద్దుచేస్తున్నట్లు మొహమ్మద్ యూనుస్ సర్కార్ మంగళవారం ప్రకటించిన వేళ ఆమె వీసా గడువను భారత్ తాజాగా పొడిగించడం గమనార్హం. ఆమెతోపాటు 75 మంది పాస్ట్‌పోర్ట్‌లను రద్దుచేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. ప్రభాకర్, శ్రవణ్ రావుకు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. దీంతో, వారిద్దరూ దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది.తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. కాగా, అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్ట్ రద్దు చేయాలని పోలీసులు.. పాస్‌పోర్టు అథారిటీకి లేఖ రాశారు. దీంతో, పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఇదే సమయంలో నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు సిటీ పోలీసులు. మరోవైపు.. అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను డిపోర్ట్ చేసే అవకాశం ఉంది. పాస్‌పార్ట్ రద్దు, రెడ్ కార్నర్(ఇంటర్‌పోల్) నోటీసులు కీలకంగా మారనున్నాయి. ఇక, ఇప్పటికే ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు దేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా హైదరాబాద్ పోలీసులకు సమాచారం రానుంది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1 నిందితుడు ప్రభాకర్ రావు హైదరాబాద్‌లో ఉన్నాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఏ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు అడుగు పెట్టగానే ముందుగా మాకు సమాచారం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. -
నిత్యానంద పాస్‌పోర్టు రద్దు
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో ఆరోపణలెదుర్కొంటున్న స్వామి నిత్యానంద పాస్‌పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా ఆయనకు ఈక్వెడార్ దేశం ఆశ్రయం కల్పించిందన్న వార్తల్ని ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. నిత్యానందను పట్టుకోవాలని విదేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు, అధికారులను స్థానిక ప్రభుత్వాన్ని భారత్ అప్రమత్తం చేసింది. అత్యాచార కేసులో ఆరోపణలతోపాటుగా అపహరణ వంటి అనేక కేసులు నిత్యానందపై ఉన్నాయని వెల్లడించింది. -
ఇంటర్‌పోల్ కన్నుగప్పి నీరవ్ రాకపోకలు
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పాస్‌పోర్టును రద్దు చేసినట్లు ఇంటర్‌పోల్ ద్వారా సమాచారం ఇచ్చాక కూడా అతను వివిధ దేశాల మధ్య రాకపోకలు సాగించాడని సీబీఐ వెల్లడించింది. పాస్‌పోర్టు రద్దు విషయాన్ని ఇంటర్‌పోల్ డిఫ్యూజన్ నోటీసు జారీ ద్వారా ఫిబ్రవరి 15న సభ్య దేశాలతో పంచుకున్నామని సీబీఐ ప్రతినిధి అభిషేక్ దయాల్ చెప్పారు. ఆ విషయం ఇంటర్‌పోల్ కేంద్రీకృత సమాచార కేంద్రంలో నమోదైనప్పటికీ అతను యథేచ్ఛగా పర్యటనలు కొనసాగించాడన్నారు. ‘విదేశాంగ శాఖ నీరవ్ పాస్‌పోర్టును రద్దు చేశాక.. డిఫ్యూజన్ నోటీసు ద్వారా ఆ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్నాం. పాస్‌పోర్టును రద్దు చేసిన సమాచారం ఇంటర్‌పోల్ సమాచార కేంద్రంలో ఫిబ్రవరి 24 నుంచి అన్ని సభ్య దేశాలకు అందుబాటులో ఉంది’ అని దయాల్ వెల్లడించారు. నీరవ్‌కు భారత ప్రభుత్వం జారీచేసిన ఐదు పాస్‌పోర్టుల పూర్తి వివరాల్ని ఇంటర్‌పోల్‌కు తెలియచేశామన్నారు. ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం భారత్‌తో పంచు కున్న సమాచారం.. నీరవ్ మార్చి 15న లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి హాంకాంగ్‌కు, మార్చి 28న న్యూయార్క్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు, మార్చి 31న లండన్ నుంచి పారిస్‌కు ప్రయాణం చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం నీరవ్ ఎక్కడున్నారో అన్న దానిపై విశ్వసనీయ సమాచారం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
అవినీతి అధికారులకు పాస్‌పోర్ట్ నో
న్యూఢిల్లీ: నేరారోపణలు లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సివిల్ సర్వీసెస్ అధికారులకు పాస్‌పోర్టు క్లియరెన్స్ ఇవ్వరాదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నిర్ణయించింది. వైద్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సివస్తే నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అవినీతి కేసులో దొరికిపోయి, విచారణ పెండింగ్‌లో ఉన్నా.. ప్రభుత్వ విభాగం కేసు పెట్టినా, ఎఫ్ఐఆర్ నమోదైనా, సదరు అధికారి ప్రాథమిక విచారణ అనంతరం సస్పెన్షన్‌కు గురై ఉన్నా విజిలెన్స్ క్లియరెన్స్ నిరాకరిస్తారని పేర్కొంది. ఏదైనా క్రిమినల్ కేసులో ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేసినా, అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు ఆదేశాలు జారీ అయిన సందర్భాల్లో, సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి చార్జిషీట్ పెండింగ్‌లో ఉన్నా పాస్‌పోర్టు విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వబోరంది. -
భారత్ రావాలంటే నా డిమాండ్ నెరవేర్చండి
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.12,700 కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రదారుల్లో నీరవ్ మోదీతో పాటు మెహుల్ చౌక్సి కూడా ఒకరు. గీతాంజలి జెమ్స్‌కి ఇతను ప్రమోటర్. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సిలు విదేశాలకు చెక్కేశారు. అనంతరం స్కాం వెలుగులోకి రావడం, భారత్‌లో వీరి సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు దాడులు జరపడం, నీరవ్, మెహుల్ పాస్‌పోర్టులు రద్దవడం వంటివన్నీ జరిగాయి. ప్రస్తుతం గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ అయిన మెహుల్ చౌక్సి భారత్‌కు రాదలుచుకున్నాడ. అయితే పాస్‌పోర్టు రద్దును వెనక్కి తీసుకుంటే, తాను భారత్‌కు వస్తానంటూ మెహుల్ చౌక్సి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను డిమాండ్ చేస్తున్నాడు. ఈ రద్దు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయమని కోరుతున్నాడు. ఇదే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కోర్టుకు తెలిపింది. అతనికి వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీచేయమని, ఈడీ కౌన్సిల్ హిటెన్ వెంగోకర్ కోరారు. చౌక్సి డిమాండ్‌ను తోసిపుచ్చిన వెంగోకర్, పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినవసరం లేదని, భారత్‌కు తిరిగి రావడానికి తాత్కాలిక ప్రయాణ అనుమతి చాలని పేర్కొన్నారు. ఇదే ఆదేశాలను రేపు కోర్టు కూడా జారీచేయనుంది. అతని పేరుపై ఇప్పటికే మూడుసార్లు సమన్లు పంపినప్పటికీ, దర్యాప్తు సంస్థల ముందు అతను విచారణకు హాజరు కాలేదు. చౌక్సికి వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా దాఖలైంది. పీఎన్బీ స్కాం నేపథ్యంలో మెహుల్ చౌక్సికి చెందిన 41 స్థిర ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. అతనికి వ్యతిరేకంగా బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీచేసింది. భారత్‌లో భారీ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేంగా ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు పేరుతో దీన్ని పాస్ చేసింది. ఈ బిల్లు ద్వారా విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారుల బినామీ ఆస్తులపై చర్యలు తీసుకోనుంది. -
మరో బ్యాంకు కుంభకోణం
న్యూఢిల్లీ/ముంబై: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.390కోట్లకు ముంచేసిన ఓ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ, రొటొమ్యాక్ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఢిల్లీలో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల నగల ఎగుమతిదారు ద్వారకాదాస్ సేథ్.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రూ.389.85కోట్ల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ‘ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రుణఎగవేతకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితమే బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తాజాగా సంస్థ డైరెక్టర్లుగా ఉన్న సభ్య సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవిసింగ్లతోపాటుగా ద్వారకాదాస్ సేథ్ సెజ్ ఇన్ కార్పొరేషన్ సంస్థపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2007–12 మధ్య రూ.389 కోట్లమేర ఓబీసీ నుంచి రుణాలు పొందింది. ఆ తర్వాత గుర్తుతెలియని సంస్థలతో ఈ సంస్థ లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ క్రెడిట్స్’ను అడ్డం పెట్టుకుని బయటి వ్యక్తుల దగ్గర బంగారం, వజ్రాభరణాలపై మరిన్ని రుణాలు తీసుకున్నారని, విదేశాలతో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని బ్యాంకు అధికారులు సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకుల ఫిర్యాదుతో మరో మూడు కేసులు ద్వారకాదాస్ సేథ్తో పాటుగా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ఓ బ్యాంకు అధికారి మోసం చేశారంటూ మూడు వేర్వేరు బ్యాంకులు ఈవారం ప్రారంభంలోనే సీబీఐకి ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. బుధ, గురువారాల్లోనే ఈ కేసులు నమోదైనా ఆలస్యంగా వెలుగుచూశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, నేరపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేసి రుణాలు పొందారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన ఫిర్యాదుమేరకు అమిత్ సింగ్లా అనే వ్యాపారవేత్తపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పీఎన్బీ బార్మర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ ఇందర్‌చంద్ చుండావత్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రూ.523కోట్ల ఆస్తులు అటాచ్ పీఎన్బీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీకి సంబంధించిన రూ.523 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ అటాచ్ చేసింది. ఇందులో ఓ పెంట్‌హౌస్, ఫామ్‌హౌస్‌లున్నాయని పేర్కొంది. ‘ముంబైలోని సముద్ర మహల్ అపార్ట్మెంట్లోని రూ.15.45 కోట్ల విలువైన ఫ్లాట్, మూడు ఫ్లాట్లు ఉన్న రూ.81.16కోట్ల విలువైన పెంట్‌హౌస్, ఆరు రెసిడెన్షియల్ ఆస్తులు, 10 ఆఫీసులు, ఓ సోలార్ పవర్ ప్లాంట్, అలీబాగ్‌లోని ఫామ్‌హౌస్, అహ్మద్‌నగర్ జిల్లాలోని 135 ఎకరాల స్థలాలను అటాచ్ చేసుకున్నాం. వీటి మార్కెట్ విలువ రూ. 523కోట్లు ఉంటుంది’ అని ఈడీ పేర్కొంది. నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు ఈడీ ఫిర్యాదుతో నీరవ్ మోదీతోపాటు ఆయన మామ మెహుల్ చోక్సీల పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈడీ సూచన మేరకు ఫిబ్రవరి 16 నుంచి నాలుగువారాలపాటు వీరిద్దరి పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ సస్పెండ్ చేసింది. దీంతోపాటుగా వారం రోజుల్లో వారి పాస్‌పోర్టులను ఎందుకు జప్తు, రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘నీరవ్, చోక్సీలనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకే ఇద్దరి పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నాం’ అని రవీశ్ కుమార్ తెలిపారు. పాస్‌పోర్టుల రద్దుపై నీరవ్ న్యాయవాది విజయ్ అగర్వాల్ మండిపడ్డారు. ‘నీరవ్, చోక్సీలు విచారణకు హాజరవ్వాలని ఈడీ పిలుస్తోంది. అటు విదేశాంగ శాఖ మొదట పాస్‌పోర్టును సస్పెండ్ చేసింది.. ఇప్పుడు రద్దు చేసింది. పాస్‌పోర్టు లేకుండా విదేశాలనుంచి ఎలా రాగలరు?’ అని విజయ్ ప్రశ్నించారు. మరోవైపు, గీతాంజలి జెమ్స్, రొటొమ్యాక్ కంపెనీల ఆస్తులపై ఈడీ, ఆదాయపుపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రొటొమ్యాక్ కంపెనీ ఇంతవరకు చెల్లించాల్సిన పన్ను బకాయి రూ.106కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. విక్రమ్ కొఠారీపై పన్ను ఎగవేతకు సంబంధించిన మరో ఆరు ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది ‘జన్‌ధన్ లూటీ’ యోజన ప్రధానిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ: తాజాగా మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రావటంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీపై విమర్శల పదును పెంచింది. ‘ఊహించినట్లే నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల్లాగే మరో సంస్థ ప్రమోటర్ ప్రభుత్వం కన్నుగప్పి పారిపోయాడు. మోదీ పాలనలతో జన్‌ధన్ లూటీ పథకం నడుస్తోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీటర్లో విమర్శించారు. పీఎన్బీ కుంభకోణంలో ఆర్బీఐ ద్వారా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బ్యాంకులను మోసం చేసే కేసుల్లో 60 రోజుల్లో నేరగాళ్లను అదుపులోకి తీసుకునే వ్యవస్థను ఏర్పాటుచేయాలని మోదీని కోరారు. ‘ఈ కొద్ది రోజుల్లోనే భారత బ్యాంకులు రూ.21వేల కోట్లమేర నష్టపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకు మోసాలు బయటపడొచ్చు. ప్రపంచంలోనే ప్రధాని మోదీ ఖరీదైన కాపలాదారు’ అని సిబల్ విమర్శించారు. ‘ప్రధాని ఈ అంశంపై ప్రజలకు భరోసా ఇవ్వనంతవరకు ప్రభుత్వమే ఈ నేరస్తులు పారిపోయేందుకు మద్దతిచ్చిందని దేశమంతా భావిస్తుంది. అందుకే పీఎన్బీ కుంభకోణంపై ఆర్బీఐ దర్యాప్తుకు వీలైనంత త్వరగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అని సిబల్ పేర్కొన్నారు. -
నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని కుటుంబ సభ్యులు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు శుక్రవారం తనిఖీలు కొనసాగించాయి. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ. 549 కోట్ల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈడీ సలహా మేరకు నీరవ్, చోక్సీల పాస్‌పోర్టుల్ని విదేశాంగ శాఖ 4 వారాల పాటు రద్దు చేసింది. వారంలోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ వారిద్దరికీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ సమన్లు జారీ చేసింది. నీరవ్, చోక్సీలు దేశం విడిచి పారిపోవడంతో.. ఆ ఇద్దరి కంపెనీల డైరెక్టర్లకు నోటీసులను పంపింది. నీరవ్ మోదీ తన పేరు మీదే నగల దుకాణాల్ని నిర్వహిస్తుండగా, గీతాంజలి జెమ్స్‌కు చోక్సీ ప్రమోటర్‌గా ఉన్నారు. మరోవైపు శుక్రవారం ఈడీ ముంబై, ఢిల్లీ, సూరత్, హైదరాబాద్, జైపూర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీల్ని కొనసాగించగా, సీబీఐ దేశ వ్యాప్తంగా 6 నగరాల్లోని 26 ప్రాంతాల్లో దాడులు చేసింది. నీరవ్ మోదీ కేసులో గురువారం రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, విలువైన రాళ్లు, బంగారం స్వాధీనం చేసుకున్న ఈడీ.. వాటి విలువను అంచనావేసే పనిలో ఉంది. రూ. 4,886 కోట్ల నష్టం ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ పీఎన్బీ ఫిర్యాదు మేరకు నీరవ్ మోదీ మామ, గీతాంజలి గ్రూపు ప్రమోటర్ మెహుల్ చోక్సీపై సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఫిబ్రవరి 13 నాటి ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2017–18లో చోక్సీ కంపెనీకి చెందిన గీతాంజలి జెమ్స్, నక్షత్ర, గిలి కంపెనీలు 143 ఎల్వోయూ(లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్)లతో రూ. 4,886 కోట్ల నష్టం కలిగించారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. ముంబై, పుణే, సూరత్, జైపూర్, హైదరాబాద్, కోయంబత్తూర్‌లోని గీతాంజలి గ్రూపు దుకాణాలు, కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ‘మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూపు కార్యాలయాలు, ఎఫ్ఐఆర్లోని కంపెనీలకు చెందిన ఇతర డైరెక్టర్లకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు చేశాం’ అని సీబీఐ ప్రతినిధి చెప్పారు. నీరవ్, చోక్సీలు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు డిఫ్యూజన్ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరింది. మరోవైపు చోక్సీతో పాటు ఇతరులపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ... నీరవ్‌కు చెందిన విదేశీ దుకాణాల్లో లావాదేవీలు జరగకుండా నిషేధించింది. న్యూయార్క్‌లో నీరవ్? నీరవ్ మోదీ, అతని వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీల పాస్‌పోర్టుల్ని విదేశాంగ శాఖ తాత్కాలికంగా నాలుగు వారాల పాటు రద్దు చేసింది. పాస్‌పోర్టుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పేందుకు వారిద్దరికీ వారం గడువు నిచ్చామని ఆ శాఖ తెలిపింది. గడువులోగా వారు స్పందించకపోతే పాస్‌పోర్టుల్ని పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం నీరవ్ న్యూయార్క్‌లో ఉన్నాడంటూ వార్తలొచ్చినా, అతను ఎక్కడున్నాడో తెలియదని విదేశాంగ శాఖ పేర్కొంది. మరో 8 మంది పీఎన్బీ అధికారులపై వేటు ఈ కేసుతో ప్రమేయమున్న మరో 8 మంది అధికారుల్ని పీఎన్బీ శుక్రవారం సస్పెండ్ చేసింది. వీరిలో జనరల్ మేనేజర్ స్థాయి అధికారి కూడా ఉన్నారని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. బుధవారం 10 మంది అధికారుల్ని పీఎన్బీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకులకు మార్చి 31లోపు బకాయిల్ని పీఎన్బీ చెల్లిస్తుందని, అంతర్గత వనరుల నుంచి ఆ బ్యాంకు నిధుల్ని సమకూర్చుకుంటుందని ఆ అధికారి తెలిపారు. ట్విటర్ వేదికగా మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు ప్రధాని మోదీపైనా, కేంద్ర ప్రభుత్వం పైనా కాంగ్రెస్ విమర్శల పర్వం కొనసాగించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందిస్తూ.. ‘మోసగాడి పలాయన సూత్రం.. ల(మో) + నీ(మో)––– న(మో)తో–––> భా(గో)’ అంటూ "# ModiRobsIndia హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. ‘లలిత్ మోదీ, నీరవ్ మోదీ... నరేంద్ర మోదీతో పారిపోవడం’ అని అర్థం వచ్చేలా ఈ ట్వీట్ ఉంది. యూపీఏ కుంభకోణాన్ని బయటపెట్టాం: బీజేపీ యూపీఏ హయాంలో జరిగిన పీఎన్బీ కుంభకోణాన్ని బీజేపీ ప్రభుత్వం బయటపెట్టిందని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. 2013 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలోని నీరవ్ మోదీ నగల దుకాణాన్ని అప్పటి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సందర్శించారని, ఆ మరునాడే మోదీకి అలహాబాద్ బ్యాంక్ రుణం మంజూరయిందని వెల్లడించారు. ఆ బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరైన దినేశ్ దుబే వ్యతిరేకించినప్పటికీ, యూపీఏ పెద్దల ఒత్తిడితోనే నీరవ్ మోదీకి రుణం మంజూరయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని రావిర్యాల సెజ్, పహాడీషరీఫ్‌లోని గీతాంజలి జెమ్స్‌తో పాటు నీరవ్‌కు చెందిన 4 సహచర కంపెనీల్లో ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. ఈ సోదాల్లో వజ్రాలతో పాటు అత్యంత విలువైన తయారీ ముడిసరుకును స్వాధీనం చేసుకుంది. రావిర్యాలలోని సెజ్‌లో గీతాంజలి గ్రూప్ చైర్మన్ మెహుల్ చోక్సీ రూ.500 కోట్లతో వజ్రాభరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా నీరవ్, చోక్సీలకున్న తయారీ కేంద్రాల్లో హైదరాబాద్ కేంద్రమే అతి పెద్దదని ఈడీ అధికారులు తెలిపారు. రావిర్యాల తయారీ యూనిట్లో మెషినరీ, వజ్రాభరణాల ముడిసరుకు మొత్తం కలిపి రూ.3వేల కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వర్గాల సమాచారం. కుటుంబసభ్యుల ఆస్తుల అటాచ్ నీరవ్ మోదీకి ఆదాయపు పన్ను శాఖ గట్టి షాకిచ్చింది. అతని కుటుంబ సభ్యులు, వారి కంపెనీలకు చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాల్ని తాత్కాలికంగా అటాచ్ చేసింది. విదేశాల్లో అక్రమాస్తులు కలిగి ఉన్నందుకు నీరవ్‌పై ఐటీ శాఖ నల్లధన నిరోధక చట్టాన్ని ప్రయోగించింది. ఈ అక్రమాస్తులు సింగపూర్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ముంబైలోని ప్రత్యేక కోర్టులో నీరవ్‌పై పలు ఐటీ సెక్షన్ల కింద చార్జ్‌షీట్ దాఖలు చేసింది. శుక్రవారం ఢిల్లీలో నీరవ్ మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు -
మాల్యా పాస్‌పోర్టు రద్దు
► రుణ ఎగవేత కేసుల నేపథ్యంలో విదేశాంగ శాఖ నిర్ణయం ► డిపోర్టేషన్‌కు చర్యలు వేగవంతం! న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల రుణ ఎగవేత కేసుల్లో చిక్కుకుని దేశం విడిచిపోయిన విజయ్ మాల్యా పాస్ట్‌పోర్టును ఆదివారం భారత్ రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను వెనక్కిరప్పించే(డిపోర్టేషన్) ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఐడీబీఐ బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ముంబై కోర్టు మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా.. దీనికి మూడుసార్లు కూడా నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఈడీ విదేశాంగ శాఖను కోరింది. దీంతో ఈ నెల 15న విదేశాంగ శాఖ మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాస్‌పోర్టును ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసును కూడా జారీచేసింది. దీనికి మాల్యా ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో చివరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ చెప్పారు. రుణ ఎగవేత కేసులు చుట్టుముట్టడంతో మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, రూ.900 కోట్ల ఐడీబీఐ రుణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు(డిపోర్టేషన్) ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ మాల్యా డిపోర్టేషన్‌కు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైతే.. మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ సర్కారు.. బ్రిటన్ ప్రభుత్వ సహకారాన్ని కోరనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు రద్దు, ముంబై కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా మాల్యా డిపోర్టేషన్‌ను భారత్ కోరనుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టు రద్దవటంతో విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం అవుతుందని.. తప్పకుండా భారత్‌కు రావాల్సిందేననేది విదేశాంగ శాఖ వర్గాల వాదన. కాగా, ఇప్పుడు మాల్యా తనను బ్రిటన్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా బ్రిటిష్ అధికారులను సంప్రదించే అవకాశం ఉంది. అదేవిధంగా పాస్‌పోర్టు రద్దును సవాలు చేస్తూ భారత్‌లోని కోర్టులను కూడా ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. రుణ ఎగవేత, మోసపూరిత కుట్ర, మనీలాండరింగ్ వంటి ఆరోపణలకు సంబంధించి ఈడీతోపాటు సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ ఇతరత్రా దర్యాప్తు సంస్థలు కూడా మాల్యాపై విచారణ జరుపుతున్నాయి. యూకే ఓటర్ల జాబితాలో మాల్యా... రుణ ఎగవేత కేసుల కారణంగా బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన మాల్యా... అక్కడి పౌరుడిగా ఓటర్ల లిస్టులో కూడా ఉన్నారు. భారత్ నుంచి తానేమీ పరారైపోలేదని.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ వాదిస్తున్న మాల్యా.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని టెవిన్ గ్రామంలో ఉన్న మూడంతస్తుల భవంతి(లేడీవాక్)ని ప్రస్తుతం తన అధికారిక అడ్రస్‌గా ధ్రువీకరించినట్లు సండేటైమ్స్ పత్రిక పేర్కొంది. ఉత్తర లండన్ నుంచి గంటన్నర ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చని తెలిపింది. కాగా, ఇక్కడున్న తన చిరునామా సమాచారాన్ని భారతీయ అధికారులకు కూడా తెలియజేసినట్లు మాల్యా చెప్పారని సండేటైమ్స్ వెల్లడించింది. బ్రిటిష్ ఫార్ములా వన్ చాంపియన్ లెవిస్ హామిల్టన్ తండ్రి వద్దనుంచి మాల్యా ఈ భవంతిని 11.5 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశారు. విదేశీ మూలాలున్న తన కంపెనీ ద్వారా ఆయన ఈ ప్రాపర్టీని దక్కించుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.