ద్వారకాదాస్ సేథ్ వజ్రాభరణాల షోరూం
న్యూఢిల్లీ/ముంబై: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.390కోట్లకు ముంచేసిన ఓ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎన్‌బీ, రొటొమ్యాక్ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఢిల్లీలో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల నగల ఎగుమతిదారు ద్వారకాదాస్ సేథ్.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రూ.389.85కోట్ల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ‘ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రుణఎగవేతకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితమే బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా తాజాగా సంస్థ డైరెక్టర్లుగా ఉన్న సభ్య సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవిసింగ్‌లతోపాటుగా ద్వారకాదాస్ సేథ్ సెజ్ ఇన్ కార్పొరేషన్ సంస్థపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2007–12 మధ్య రూ.389 కోట్లమేర ఓబీసీ నుంచి రుణాలు పొందింది. ఆ తర్వాత గుర్తుతెలియని సంస్థలతో ఈ సంస్థ లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ క్రెడిట్స్’ను అడ్డం పెట్టుకుని బయటి వ్యక్తుల దగ్గర బంగారం, వజ్రాభరణాలపై మరిన్ని రుణాలు తీసుకున్నారని, విదేశాలతో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని బ్యాంకు అధికారులు సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బ్యాంకుల ఫిర్యాదుతో మరో మూడు కేసులు
ద్వారకాదాస్ సేథ్‌తో పాటుగా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ఓ బ్యాంకు అధికారి మోసం చేశారంటూ మూడు వేర్వేరు బ్యాంకులు ఈవారం ప్రారంభంలోనే సీబీఐకి ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. బుధ, గురువారాల్లోనే ఈ కేసులు నమోదైనా ఆలస్యంగా వెలుగుచూశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, నేరపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేసి రుణాలు పొందారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన ఫిర్యాదుమేరకు అమిత్ సింగ్లా అనే వ్యాపారవేత్తపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పీఎన్‌బీ బార్మర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ ఇందర్‌చంద్ చుండావత్‌ను సీబీఐ అరెస్టు చేసింది.
రూ.523కోట్ల ఆస్తులు అటాచ్
పీఎన్‌బీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీకి సంబంధించిన రూ.523 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ అటాచ్ చేసింది. ఇందులో ఓ పెంట్‌హౌస్, ఫామ్‌హౌస్‌లున్నాయని పేర్కొంది. ‘ముంబైలోని సముద్ర మహల్ అపార్ట్‌మెంట్‌లోని రూ.15.45 కోట్ల విలువైన ఫ్లాట్, మూడు ఫ్లాట్లు ఉన్న రూ.81.16కోట్ల విలువైన పెంట్‌హౌస్, ఆరు రెసిడెన్షియల్ ఆస్తులు, 10 ఆఫీసులు, ఓ సోలార్ పవర్ ప్లాంట్, అలీబాగ్‌లోని ఫామ్‌హౌస్, అహ్మద్‌నగర్ జిల్లాలోని 135 ఎకరాల స్థలాలను అటాచ్ చేసుకున్నాం. వీటి మార్కెట్ విలువ రూ. 523కోట్లు ఉంటుంది’ అని ఈడీ పేర్కొంది.
నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు
ఈడీ ఫిర్యాదుతో నీరవ్ మోదీతోపాటు ఆయన మామ మెహుల్ చోక్సీల పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈడీ సూచన మేరకు ఫిబ్రవరి 16 నుంచి నాలుగువారాలపాటు వీరిద్దరి పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ సస్పెండ్ చేసింది. దీంతోపాటుగా వారం రోజుల్లో వారి పాస్‌పోర్టులను ఎందుకు జప్తు, రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘నీరవ్, చోక్సీలనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకే ఇద్దరి పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నాం’ అని రవీశ్ కుమార్ తెలిపారు. పాస్‌పోర్టుల రద్దుపై నీరవ్ న్యాయవాది విజయ్ అగర్వాల్ మండిపడ్డారు. ‘నీరవ్, చోక్సీలు విచారణకు హాజరవ్వాలని ఈడీ పిలుస్తోంది. అటు విదేశాంగ శాఖ మొదట పాస్‌పోర్టును సస్పెండ్ చేసింది.. ఇప్పుడు రద్దు చేసింది. పాస్‌పోర్టు లేకుండా విదేశాలనుంచి ఎలా రాగలరు?’ అని విజయ్ ప్రశ్నించారు. మరోవైపు, గీతాంజలి జెమ్స్, రొటొమ్యాక్ కంపెనీల ఆస్తులపై ఈడీ, ఆదాయపుపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రొటొమ్యాక్ కంపెనీ ఇంతవరకు చెల్లించాల్సిన పన్ను బకాయి రూ.106కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. విక్రమ్ కొఠారీపై పన్ను ఎగవేతకు సంబంధించిన మరో ఆరు ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇది ‘జన్‌ధన్ లూటీ’ యోజన ప్రధానిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: తాజాగా మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రావటంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీపై విమర్శల పదును పెంచింది. ‘ఊహించినట్లే నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల్లాగే మరో సంస్థ ప్రమోటర్ ప్రభుత్వం కన్నుగప్పి పారిపోయాడు. మోదీ పాలనలతో జన్‌ధన్ లూటీ పథకం నడుస్తోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీటర్‌లో విమర్శించారు. పీఎన్‌బీ కుంభకోణంలో ఆర్బీఐ ద్వారా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బ్యాంకులను మోసం చేసే కేసుల్లో 60 రోజుల్లో నేరగాళ్లను అదుపులోకి తీసుకునే వ్యవస్థను ఏర్పాటుచేయాలని మోదీని కోరారు. ‘ఈ కొద్ది రోజుల్లోనే భారత బ్యాంకులు రూ.21వేల కోట్లమేర నష్టపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకు మోసాలు బయటపడొచ్చు. ప్రపంచంలోనే ప్రధాని మోదీ ఖరీదైన కాపలాదారు’ అని సిబల్ విమర్శించారు. ‘ప్రధాని ఈ అంశంపై ప్రజలకు భరోసా ఇవ్వనంతవరకు ప్రభుత్వమే ఈ నేరస్తులు పారిపోయేందుకు మద్దతిచ్చిందని దేశమంతా భావిస్తుంది. అందుకే పీఎన్‌బీ కుంభకోణంపై ఆర్‌బీఐ దర్యాప్తుకు వీలైనంత త్వరగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అని సిబల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment