OBC bank
-
వడ్డీ రేటు తగ్గిస్తున్న బ్యాంకులు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా తగ్గించాయి. ఈ విషయంలో ఎస్బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే, ఓబీసీ 10 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. 100 బేసిస్ పాయింట్లంటే ఒక శాతం. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 5.75 శాతంగా ఉంది. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నాడు జరిగిన బడ్జెట్ అనంతర సంప్రదాయక సమావేశం సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ‘‘జూన్ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. ఈ విధానం మారాలి. వేగంగా రెపో ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. వృద్ధికి ఇది అవసరం. ఏది ఏమైనా ఇప్పుడు ఒక సానుకూల అంశం ఉంది. రేటు బదలాయింపునకు ఇంతక్రితం ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతోంది’’ అని అన్నారు. ఎస్బీఐ.. ఆర్థిక సంవత్సరంలో మూడవసారి ► ఎస్బీఐ తగ్గించిన తాజా ఐదు బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మూడుసార్లు రుణ రేటును తగ్గించింది. ఇంతక్రితం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఎస్బీఐ రుణ రేటు ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మొత్తంగా ఈ కాలంలో గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీరేటు 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. అయితే ఇది ఆర్బీఐ తగ్గించిన రెపో రేటుకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. ► నిధుల సమీకరణ వ్యయభారం ప్రాతిపదికన ఉండే మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీ ఎల్ఆర్) ప్రస్తుతం 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది. ► జూలై 1 నుంచే బ్యాంక్ రెపో ఆధారిత గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు.. జూన్ 6 పాలసీ సమీక్ష, పావుశాతం రేటు కోత అనంతరం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా తమ ఎంసీఎల్ఆర్ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. మరో రేటు కోత! ఆగస్టు 5 నుంచి 9వ తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా వృద్ధే లక్ష్యంగా మరో పావుశాతం రెపో రేటు కోత ఉంటుందని అంచనా. ఇదే జరిగితే, రెపో రేటు 5.5 శాతానికి తగ్గుతుంది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. పారిశ్రామిక రంగం ఊపునకు సైతం రేటు తగ్గింపు తప్పనిసరన్న డిమాండ్ ఉంది. నేటి నుంచే తగ్గిన ఓబీసీ రేటు అమలు వివిధ కాలపరిమితుల రుణ రేట్లను ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. తాజా రేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. బ్యాంక్ తాజా నిర్ణయం ప్రకారం– ఓవర్‌నైట్, నెల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గి 8.20 శాతం, 8.25 శాతానికి తగ్గాయి. అలాగే మూడు, ఆరు, ఏడాది రేట్లు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి 8.45 శాతం, 8.55 శాతం, 8.65 శాతాలకు దిగివచ్చాయి. -
మెగా బ్యాంకుల సందడి!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎస్బీఐ, బీవోబీ తర్వాత మరో రెండు మెగా బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దఫా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్‌లలో ప్రభుత్వ రంగంలోని మరికొన్ని బ్యాంకులను విలీనం చేయడంపై కసరత్తు ఆరంభమయింది. పీఎన్బీలో రెండు లేదా మూడు చిన్న సైజు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. విలీనమయ్యే బ్యాంకుల లిస్టులో ఆంధ్రా బ్యాంకుతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అలహాబాద్ బ్యాంక్‌ల పేర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో ఈ బ్యాంకులను టేకోవర్ చేసే ప్రక్రియను పీఎన్బీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొండిబాకీల భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విలీనాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో గట్టి పట్టున్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు పీఎన్బీ గతేడాదే ప్రయత్నాలు చేసింది. విజయ బ్యాంకుపై కూడా దృష్టి పెట్టింది. అయితే, మొండి బాకీలు ఏకంగా 18 శాతానికి ఎగియడం, నీరవ్ మోదీ కుంభకోణాల ప్రభావం తీవ్రంగా పడటం వంటి పరిణామాలతో ఇతర బ్యాంకులను విలీనం చేసుకునే యత్నాలు తాత్కాలికంగా విరమించుకుంది. ప్రస్తుతం కోలుకుంటూ ఉండటంతో విలీన ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అధికార పార్టీతో పాటు విపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న దరిమిలా ఈ విలీన ప్రక్రియ జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు భారీ బ్యాంకులు.. 2017లో ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో ఎస్బీఐ చోటు దక్కించుకుంది. ఇక ఈ ఏడాది తొలినాళ్లలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయ బ్యాంక్‌లను కలిపేశారు. దీంతో 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 ఉద్యోగులతో ఎస్బీఐ తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది. ఇక గతేడాది మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టేకోవర్ చేసింది. ఇందులో కేంద్రమే కీలకపాత్ర పోషించింది. పెద్ద బ్యాంకులతో.. ఎక్కువ ప్రయోజనాలు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 159 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఏకంగా 1,44,952 శాఖలతో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిలుస్తోంది. అయితే, చిన్నా చితకా బ్యాంకులు పెద్ద సంఖ్యలో ఉండటం కన్నా.. మెరుగైన భారీ బ్యాంకులు కొన్ని ఉండటం ఎకానమీకి శ్రేయస్కరమని కేంద్రం భావిస్తోంది. ఇందుకు తగినట్లుగానే.. బీవోబీలో రెండు బ్యాంకుల విలీనం తర్వాత ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్య 21 నుంచి 18కి దిగి వచ్చింది. వీటిని కూడా కుదించి దాదాపు 6 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం, ఆర్థిక నిపుణుల అభిప్రాయం. తదనుగుణంగానే కొన్ని మధ్య స్థాయి బ్యాంకులు కేంద్రం దృష్టిలోకి వచ్చాయి. ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంకులను కాస్త పెద్దవైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లలో విలీనం చేసే అంశం తెరపైకి వచ్చింది. విలీనాలకు అనేక కారణాలు.. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను విలీనం చేసి భారీ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వెనుక చాలా కారణాలే ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. ►చిన్న బ్యాంకులు ఇటు మొండిబాకీల సమస్యలను అటు రుణ వృద్ధి సవాళ్లను (ముఖ్యంగా పారిశ్రామిక రంగాలకు రుణాలు) సమర్ధంగా ఎదుర్కొనలేకపోతున్నాయి. దీంతో వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. వాటిని గాడిన పెట్టేందుకు, నిధుల సమీకరణ సామర్థ్యాలను పెంచేందుకు మెరుగైన ఇతర బ్యాంకులో విలీనం చేయొచ్చన్నది ఒక అభిప్రాయం. ► చిన్న బ్యాంకుల వ్యాపార కార్యకలాపాలు కొంత స్థాయికి మాత్రమే పరిమితం అవుతాయి. అదే పెద్ద బ్యాంకులైతే భారీ స్థాయిలో కార్యకలాపాలు ఉండటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వీటిలో విలీనం కావడం వల్ల చిన్న బ్యాంకులు తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ సమస్యలను అధిగమించేందుకు వీలుంటుంది. ► విలీనంతో బ్యాంకింగ్ కార్యకలాపాల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు మొండిబాకీల నిర్వహణ, రిస్కు మేనేజ్మెంట్ మెరుగుపర్చుకోవచ్చు. ► అధిక మూలధనం, అధిక లిక్విడిటీ అందుబాటులో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం పదే పదే అదనపు మూలధనం సమకూర్చాల్సిన భారం తగ్గుతుంది. ► ఇక భారీ బ్యాంకులో భాగంకావడం వల్ల భౌగోళికంగా సేవలను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. పెద్ద బ్యాంకులు మరిన్ని పథకాలు, సర్వీసులు అందించడం ద్వారా ప్రొఫెషనల్ ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ బ్యాంకింగ్ రంగ వృద్ధికి తోడ్పడవచ్చు. అలాగే, భారీ భారతీయ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మెరుగైన రేటింగ్ లభించవచ్చు. మరో తెలుగు బ్యాంకు కనుమరుగు.. ఒకవేళ ఈ విలీన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో బ్యాంకు కనుమరుగు కానుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఉనికి కోల్పోయింది. అదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్బీ) విలీనమైతే ఆంధ్రా బ్యాంకు కూడా కనుమరుగు కావచ్చు. -
ఎస్బీఐ, ఓబీసీ మొండిబాకీల విక్రయం
న్యూఢిల్లీ: సుమారు రూ. 5,740 కోట్ల బాకీలను రాబట్టుకునే క్రమంలో వాటికి సంబంధించిన మొండిపద్దులను విక్రయించడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) దృష్టి సారించాయి. సుమారు రూ. 4,975 కోట్ల రికవరీకోసం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. వీటిలో సింహభాగం వాటా (సుమారు రూ. 4,667 కోట్లు) చిన్న, మధ్య తరహా సంస్థలదే ఉంది. ఎక్కువగా రూ. 50 కోట్ల దాకా బాకీపడిన సంస్థలు దాదాపు 281 దాకా ఉన్నాయి. మరోవైపు, 13 ఖాతాల నుంచి రూ. 764.44 కోట్లు రాబట్టుకునేందుకు ఓబీసీ కూడా బిడ్లను ఆహ్వానించింది. విక్రయించబోయే ఖాతాల్లో మిట్టల్ కార్పొరేషన్ (రూ. 207 కోట్లు), జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ (రూ. 157 కోట్లు) మహాలక్ష్మి టీఎంటీ (రూ. 78 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. ఎస్బీఐ ఖాతాలకు సంబంధించి ఈ–బిడ్డింగ్ ఫిబ్రవరి 27న, ఓబీసీ ఖాతాలకు ఫిబ్రవరి 25న జరగనుంది. -
ఓబీసీ కుంభకోణంలో పంజాబ్ సీఎం అల్లుడు
న్యూఢిల్లీ: దాదాపు రూ.109 కోట్ల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) కుంభకోణం కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ అల్లుడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఘజియాబాద్‌లోని సింభావోలీ షుగర్స్ లిమిటెడ్ చైర్పర్సన్ గుర్మిత్ సింగ్ మన్, సీఎం అల్లుడు, కంపెనీ డిప్యూటీ ఎండీ గుర్పాల్ సింగ్‌లపై కేసులు పెట్టింది. రైతులకు రుణాలు అందిస్తామంటూ ఓబీసీ నుంచి ఈ సంస్థ 2011లో రూ.148 కోట్ల రుణం పొందింది. దానిని రైతులకు చెల్లించకుండా సంస్థ ఖాతాకు మళ్లించారు. ఈ రుణం చెల్లించటానికి గాను ఓబీసీ నుంచి 2015లో మరో రూ.110 కోట్ల రుణం పొందింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.109 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సీబీఐ ఆదివారం గుర్పాల్పై కేసులు పెట్టి కొన్ని చోట్ల సోదాలు కూడా నిర్వహించింది. -
మరో బ్యాంకు కుంభకోణం
న్యూఢిల్లీ/ముంబై: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.390కోట్లకు ముంచేసిన ఓ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ, రొటొమ్యాక్ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఢిల్లీలో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల నగల ఎగుమతిదారు ద్వారకాదాస్ సేథ్.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రూ.389.85కోట్ల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ‘ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రుణఎగవేతకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితమే బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తాజాగా సంస్థ డైరెక్టర్లుగా ఉన్న సభ్య సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవిసింగ్లతోపాటుగా ద్వారకాదాస్ సేథ్ సెజ్ ఇన్ కార్పొరేషన్ సంస్థపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2007–12 మధ్య రూ.389 కోట్లమేర ఓబీసీ నుంచి రుణాలు పొందింది. ఆ తర్వాత గుర్తుతెలియని సంస్థలతో ఈ సంస్థ లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ క్రెడిట్స్’ను అడ్డం పెట్టుకుని బయటి వ్యక్తుల దగ్గర బంగారం, వజ్రాభరణాలపై మరిన్ని రుణాలు తీసుకున్నారని, విదేశాలతో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని బ్యాంకు అధికారులు సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకుల ఫిర్యాదుతో మరో మూడు కేసులు ద్వారకాదాస్ సేథ్తో పాటుగా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ఓ బ్యాంకు అధికారి మోసం చేశారంటూ మూడు వేర్వేరు బ్యాంకులు ఈవారం ప్రారంభంలోనే సీబీఐకి ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. బుధ, గురువారాల్లోనే ఈ కేసులు నమోదైనా ఆలస్యంగా వెలుగుచూశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, నేరపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేసి రుణాలు పొందారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన ఫిర్యాదుమేరకు అమిత్ సింగ్లా అనే వ్యాపారవేత్తపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పీఎన్బీ బార్మర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ ఇందర్‌చంద్ చుండావత్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రూ.523కోట్ల ఆస్తులు అటాచ్ పీఎన్బీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీకి సంబంధించిన రూ.523 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ అటాచ్ చేసింది. ఇందులో ఓ పెంట్‌హౌస్, ఫామ్‌హౌస్‌లున్నాయని పేర్కొంది. ‘ముంబైలోని సముద్ర మహల్ అపార్ట్మెంట్లోని రూ.15.45 కోట్ల విలువైన ఫ్లాట్, మూడు ఫ్లాట్లు ఉన్న రూ.81.16కోట్ల విలువైన పెంట్‌హౌస్, ఆరు రెసిడెన్షియల్ ఆస్తులు, 10 ఆఫీసులు, ఓ సోలార్ పవర్ ప్లాంట్, అలీబాగ్‌లోని ఫామ్‌హౌస్, అహ్మద్‌నగర్ జిల్లాలోని 135 ఎకరాల స్థలాలను అటాచ్ చేసుకున్నాం. వీటి మార్కెట్ విలువ రూ. 523కోట్లు ఉంటుంది’ అని ఈడీ పేర్కొంది. నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు ఈడీ ఫిర్యాదుతో నీరవ్ మోదీతోపాటు ఆయన మామ మెహుల్ చోక్సీల పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈడీ సూచన మేరకు ఫిబ్రవరి 16 నుంచి నాలుగువారాలపాటు వీరిద్దరి పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ సస్పెండ్ చేసింది. దీంతోపాటుగా వారం రోజుల్లో వారి పాస్‌పోర్టులను ఎందుకు జప్తు, రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘నీరవ్, చోక్సీలనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకే ఇద్దరి పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నాం’ అని రవీశ్ కుమార్ తెలిపారు. పాస్‌పోర్టుల రద్దుపై నీరవ్ న్యాయవాది విజయ్ అగర్వాల్ మండిపడ్డారు. ‘నీరవ్, చోక్సీలు విచారణకు హాజరవ్వాలని ఈడీ పిలుస్తోంది. అటు విదేశాంగ శాఖ మొదట పాస్‌పోర్టును సస్పెండ్ చేసింది.. ఇప్పుడు రద్దు చేసింది. పాస్‌పోర్టు లేకుండా విదేశాలనుంచి ఎలా రాగలరు?’ అని విజయ్ ప్రశ్నించారు. మరోవైపు, గీతాంజలి జెమ్స్, రొటొమ్యాక్ కంపెనీల ఆస్తులపై ఈడీ, ఆదాయపుపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రొటొమ్యాక్ కంపెనీ ఇంతవరకు చెల్లించాల్సిన పన్ను బకాయి రూ.106కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. విక్రమ్ కొఠారీపై పన్ను ఎగవేతకు సంబంధించిన మరో ఆరు ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది ‘జన్‌ధన్ లూటీ’ యోజన ప్రధానిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ: తాజాగా మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రావటంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీపై విమర్శల పదును పెంచింది. ‘ఊహించినట్లే నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల్లాగే మరో సంస్థ ప్రమోటర్ ప్రభుత్వం కన్నుగప్పి పారిపోయాడు. మోదీ పాలనలతో జన్‌ధన్ లూటీ పథకం నడుస్తోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీటర్లో విమర్శించారు. పీఎన్బీ కుంభకోణంలో ఆర్బీఐ ద్వారా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బ్యాంకులను మోసం చేసే కేసుల్లో 60 రోజుల్లో నేరగాళ్లను అదుపులోకి తీసుకునే వ్యవస్థను ఏర్పాటుచేయాలని మోదీని కోరారు. ‘ఈ కొద్ది రోజుల్లోనే భారత బ్యాంకులు రూ.21వేల కోట్లమేర నష్టపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకు మోసాలు బయటపడొచ్చు. ప్రపంచంలోనే ప్రధాని మోదీ ఖరీదైన కాపలాదారు’ అని సిబల్ విమర్శించారు. ‘ప్రధాని ఈ అంశంపై ప్రజలకు భరోసా ఇవ్వనంతవరకు ప్రభుత్వమే ఈ నేరస్తులు పారిపోయేందుకు మద్దతిచ్చిందని దేశమంతా భావిస్తుంది. అందుకే పీఎన్బీ కుంభకోణంపై ఆర్బీఐ దర్యాప్తుకు వీలైనంత త్వరగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అని సిబల్ పేర్కొన్నారు. -
ఓబీసీ బ్యాంక్ ఏటీఎంలో అగ్నిప్రమాదం
-
ఓబీసీ బ్యాంక్ ఏటీఎంలో అగ్నిప్రమాదం
విజయవాడ : విజయవాడ ఎంజీ రోడ్డులోని ఓబీసీ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభివించింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఏటీఎం మిషన్‌కు మంటలు వ్యాపించకపోవటంతో నష్టం తప్పింది. కాగా ఏసీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.