
న్యూఢిల్లీ: సుమారు రూ. 5,740 కోట్ల బాకీలను రాబట్టుకునే క్రమంలో వాటికి సంబంధించిన మొండిపద్దులను విక్రయించడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) దృష్టి సారించాయి. సుమారు రూ. 4,975 కోట్ల రికవరీకోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. వీటిలో సింహభాగం వాటా (సుమారు రూ. 4,667 కోట్లు) చిన్న, మధ్య తరహా సంస్థలదే ఉంది.
ఎక్కువగా రూ. 50 కోట్ల దాకా బాకీపడిన సంస్థలు దాదాపు 281 దాకా ఉన్నాయి. మరోవైపు, 13 ఖాతాల నుంచి రూ. 764.44 కోట్లు రాబట్టుకునేందుకు ఓబీసీ కూడా బిడ్లను ఆహ్వానించింది. విక్రయించబోయే ఖాతాల్లో మిట్టల్ కార్పొరేషన్ (రూ. 207 కోట్లు), జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ (రూ. 157 కోట్లు) మహాలక్ష్మి టీఎంటీ (రూ. 78 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. ఎస్‌బీఐ ఖాతాలకు సంబంధించి ఈ–బిడ్డింగ్ ఫిబ్రవరి 27న, ఓబీసీ ఖాతాలకు ఫిబ్రవరి 25న జరగనుంది.