ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా తగ్గించాయి. ఈ విషయంలో ఎస్‌బీఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే, ఓబీసీ 10 బేసిస్ పాయింట్ల రేటును తగ్గించింది. 100 బేసిస్ పాయింట్లంటే ఒక శాతం. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 5.75 శాతంగా ఉంది.
ఆర్‌బీఐ గవర్నర్ ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం నాడు జరిగిన బడ్జెట్ అనంతర సంప్రదాయక సమావేశం సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ, ‘‘జూన్ 6వ తేదీకి ముందు పాలసీ నిర్ణయం వరకూ చూస్తే, రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గింది (నాటి నిర్ణయం కూడా కలుపుకుంటే 75 బేసిస్ పాయింట్లు). అయితే బ్యాంకర్లు మాత్రం ఇందులో కేవలం 21 బేసిస్ పాయింట్ల రేటును కస్టమర్లకు బదలాయించారు. ఈ విధానం మారాలి. వేగంగా రెపో ప్రయోజనం కస్టమర్‌కు అందాలి. వృద్ధికి ఇది అవసరం. ఏది ఏమైనా ఇప్పుడు ఒక సానుకూల అంశం ఉంది. రేటు బదలాయింపునకు ఇంతక్రితం ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు రెండు, మూడు నెలల సమయం మాత్రమే పడుతోంది’’ అని అన్నారు.
ఎస్‌బీఐ.. ఆర్థిక సంవత్సరంలో మూడవసారి
► ఎస్‌బీఐ తగ్గించిన తాజా ఐదు బేసిస్ పాయింట్ల రుణ రేటు తగ్గింపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ మూడుసార్లు రుణ రేటును తగ్గించింది. ఇంతక్రితం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఎస్‌బీఐ రుణ రేటు ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మొత్తంగా ఈ కాలంలో గృహ రుణాలపై ఎస్‌బీఐ వడ్డీరేటు 20 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. అయితే ఇది ఆర్‌బీఐ తగ్గించిన రెపో రేటుకన్నా తక్కువగా ఉండడం గమనార్హం.
► నిధుల సమీకరణ వ్యయభారం ప్రాతిపదికన ఉండే మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీ ఎల్‌ఆర్) ప్రస్తుతం 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది.
► జూలై 1 నుంచే బ్యాంక్ రెపో ఆధారిత గృహరుణ పథకాలను ప్రవేశపెట్టింది.
ఇప్పటికే కొన్ని బ్యాంకులు..
జూన్ 6 పాలసీ సమీక్ష, పావుశాతం రేటు కోత అనంతరం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు కూడా తమ ఎంసీఎల్‌ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్లు తగ్గించాయి.
మరో రేటు కోత!
ఆగస్టు 5 నుంచి 9వ తేదీల మధ్య ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా వృద్ధే లక్ష్యంగా మరో పావుశాతం రెపో రేటు కోత ఉంటుందని అంచనా. ఇదే జరిగితే, రెపో రేటు 5.5 శాతానికి తగ్గుతుంది. ఇది ఆరు సంవత్సరాల గరిష్టస్థాయి. పారిశ్రామిక రంగం ఊపునకు సైతం రేటు తగ్గింపు తప్పనిసరన్న డిమాండ్ ఉంది.
నేటి నుంచే తగ్గిన ఓబీసీ రేటు అమలు
వివిధ కాలపరిమితుల రుణ రేట్లను ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. తాజా రేట్లు గురువారం నుంచే అమల్లోకి వస్తాయి. బ్యాంక్ తాజా నిర్ణయం ప్రకారం– ఓవర్‌నైట్, నెల ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గి 8.20 శాతం, 8.25 శాతానికి తగ్గాయి. అలాగే మూడు, ఆరు, ఏడాది రేట్లు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి 8.45 శాతం, 8.55 శాతం, 8.65 శాతాలకు దిగివచ్చాయి.
వడ్డీ రేటు తగ్గిస్తున్న బ్యాంకులు
Published Thu, Jul 11 2019 4:40 AM | Last Updated on Thu, Jul 11 2019 5:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment