ముంబై: ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ వరుసగా అయిదోసారీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను నిలబెట్టుకుంటూ భారత్ మరింత వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేసింది. అటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది.
మరోవైపు, రికరింగ్ చెల్లింపుల ఈ–మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6–8 మధ్య ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మళ్లీ సమావేశం అవుతుంది. ఆర్‌బీఐ నిర్ణయాలు అధిక వృద్ధి సాధనకు దోహదపడగలవని బ్యాంకర్లు, కార్పొరేట్లు వ్యాఖ్యానించగా .. రేటును తగ్గించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని రియల్టీ రంగం అభిప్రాయపడింది. వచ్చే సమీక్షలోనైనా తగ్గించాలని కోరింది.
వివరాల్లోకి వెడితే.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రామాణిక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) యధాతథంగా 6.5%గా కొనసాగించాలని కమిటీలోని సభ్యులందరూ (ఆరుగురు) ఏకగ్రీవంగా తీర్మానించారు. ధరలను కట్టడి చేసే దిశగా 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ రెపో రేటును 2.5% పెంచింది.
యూపీఐ పరిమితులు పెంపు..
► ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితి
రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు.
► మళ్లీ మళ్లీ చేసే (రికరింగ్) చెల్లింపులకు సంబంధించి ఈ–మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలు 6.5 శాతం నుంచి 7%కి పెంపు. జీడీపీ డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా, మార్చి క్వార్టర్‌లో 6 శాతంగా ఉంటుందని అంచనా.
► వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం క్యూ3లో 5.6%గా, క్యూ4లో 5.2%గా ఉండొచ్చని అంచనా. 2024–25 జూన్ క్వార్టర్‌లో ఇది 5.2 శాతంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్‌లో 4.7 శాతంగా ఉండవచ్చు.
► డేటా భద్రత, గోప్యతను మరింతగా పెంచే దిశగా ఆర్థిక రంగం కోసం ఆర్‌బీఐ క్లౌడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది.
► ఆర్థిక రంగ పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా ‘‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 2024 ఏప్రిల్‌లో లేదా అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఫిన్‌టెక్ సంస్థలు స్వచ్ఛందంగా సంబంధిత వివరాలను రిపాజిటరీకి సమర్పించవచ్చు.
► డిసెంబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
► ఇతర వర్దమాన దేశాలతో పోలిస్తే రూపాయి మారకంలో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి.
ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఎఫెక్ట్..
సెపె్టంబర్ క్వార్టర్ వృద్ధి గణాంకాలు పటిష్టంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆహార ధరల్లో నెలకొన్న అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ అంచనాలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. వేగంగా మారిపోయే ఆహార ధరల సూచీలన్నీ కూడా కీలక కూరగాయల రేట్ల పెరుగుదలను సూచిస్తున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగొచ్చు.
– శక్తికాంత దాస్, ఆర్‌బీఐ గవర్నర్
అంచనాల పెంపు సముచితమే..
ప్రథమార్ధంలో సాధించిన వృద్ధి, ఆ తర్వాత రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గణాంకాలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ పెంచడం సముచితమే.
– నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
రేటు తగ్గించాల్సింది..
వడ్డీరేట్లను య«థాతథంగా కొనసాగించడం మంచి నిర్ణయమే. అయితే, ప్రస్తుతం స్థూల–ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున రేటును తగ్గించి ఉంటే రియల్టీ రంగం, ఎకానమీకి గణనీయంగా ప్రయోజనం కలిగేది.
– »ొమన్ ఇరానీ, నేషనల్ ప్రెసిడెంట్, క్రెడాయ్
సానుకూల సంకేతాలు
ద్రవ్యోల్బణం స్థిర స్థాయిలో ఉంటూ, ఎకానమీ అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకెడుతుందని పాలసీ స్పష్టమైన, సానుకూల సంకేతాలిస్తోంది. వరుసగా మూడో ఏడాది 7 శాతం వృద్ధిని సాధించే అవకాశాలను సూచిస్తోంది.
– దినేష్ ఖారా, చైర్మన్, ఎస్‌బీఐ
Comments
Please login to add a commentAdd a comment