RBI MONETARY POLICY
-
అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను ఈసారీ యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా పదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతం రెపోరేటునే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుతున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ సమావేశంలోని ముఖ్యాంశాలను దాస్ వెల్లడించారు.రూపాయి విలువలో ఎక్కువ ఒడిదొడుకులు ఉండకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం.ఎన్బీఎఫ్సీలు రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వృద్ధిని కొనసాగిస్తున్నాయి.సెప్టెంబరులో సీపీఐ గణనీయంగా పెరగవచ్చు.ద్రవ్యోల్బణం: > సీపీఐ ద్రవ్యోల్బణం క్యూ2లో 4.1%గా ఉంటుందని అంచనా.> క్యూ3లో 4.8 శాతానికి పెరగొచ్చు.> క్యూ4లో 4.2 శాతంగా ఉండవచ్చు.> క్యూ1 2026 ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతంగా ఉండబోతుంది.2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది.జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని అంచనా.ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 6.7 శాతం పెరిగింది.కూ1లో జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతంగా ఉంది.యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు.‘యూపీఐ 123పే’ ఐవీఆర్ ఆధారిత లావాదేవీలను రూ.5000 నుంచి రూ.10000కు పెంచారు.పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కారణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు గతంలో గవర్నర్ పలు సమావేశాల్లో స్పష్టంగా అందించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అందుకు అనువుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కీలక వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని సూచిస్తోంది. కానీ దీనివల్ల ఆర్బీఐ పనితీరుపై ప్రజలకు విశ్వాసం కోల్పోతుందని ఇటీవల రఘురామ్‌రాజన్ తెలిపారు. -
రేటు తగ్గించి.. వృద్ధికి ఊతమివాల్సిన సమయం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యం 4 శాతానికి చేరుకోవడంతో ఇక సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధానం.. వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలని ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ స్పష్టం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికన్నా (4 శాతం) అరశాతమే ఎక్కువగా ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ వెలువరిస్తున్న నేపథ్యంలో దీనిపై ఇక పెద్దగా ఆందోళన చెందాల్సింది ఏదీ లేదన్నారు. ‘‘తట్టుకోలేని అధిక ద్రవ్యోల్బణం సమస్య ముగుస్తోంది. రాబోయే కొద్ది త్రైమాసికాలలో మనం ద్రవ్యోల్బణం మరింత తగ్గుదలను చూస్తాము. ద్రవ్యోల్బణం స్థిరమైన ప్రాతిపదికన 4 శాతం లక్ష్యాన్ని చేరుకుంటుంది’’ అని ఆయన అన్నారు. దీర్ఘకాలం వడ్డీరేటు అధికస్థాయిలో ఉండడం ఆర్ధికవృద్ధికి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. పాలసీ సమీక్షలోనూ ఇదే మాట... ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి ఈ నెల 5 నుంచి 7వ తేదీ మధ్య మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో మెజారిటీ 4 శాతం దిగువకు రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ వరుసగా ఎనిమిదవసారి కీలక రేటు– రెపోను (6.5 శాతం) యథాతథంగా ఉంచింది. కాగా, వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు ఆషిమా గోయల్‌తో పాటు జయంత్ వర్మ కూడా వీరిలో ఉండడం గమనార్హం. రెపో రేటును తగ్గించి వృద్ధి ఊతానికి తగిన నిర్ణయం తీసుకోవాలని జయంత్ వర్మ పాలసీ సమీక్షాలో ఓటువేశారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ దీన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. కాగా, వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆహార ధరలపరంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసే రిస్కులను ఎంపీసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాలసీ సమీక్ష సందర్భంగా చెప్పారు. ధరలు నిలకడగా ఉండే విధంగా స్థిరత్వాన్ని సాధించగలిగితేనే అధిక వృద్ధి సాధనకు పటిష్టమైన పునాదులు వేయడానికి సాధ్యపడగలదని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా పొంచే ఉన్నాయని ఎంపీసీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీసీ సభ్యులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం, అహ్మదాబాద్) ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ ఒక ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → 2023–24లో భారత్ వృద్ధి 8.2 శాతం. 2024–25లో అంతకన్నా 0.75 శాతం నుంచి 1 శాతం వరకూ వృద్ధి స్పీడ్ తగ్గవచ్చు. భారత్‌కు 8 శాతం వృద్ధి సాధన సామర్థ్యం ఉంది. అధిక వడ్డీరేటు వ్యవస్థ వృద్ధి స్పీడ్‌కు అడ్డంకు కాకూడదు. → ఆర్థిక వృద్ధి రేటును 8 శాతానికి పెంచేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం డిజిటలైజేషన్, పన్ను సంస్కరణలు, అధిక మౌలిక సదుపాయాల పెట్టుబడులతో సహా అనేక విధానపరమైన చర్యలను చేపట్టింది.ద్రవ్యోల్బణ లక్ష్యం ఇదీ.. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2024–25లో 4.5 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ పాలసీ అంచనా. క్యూ1 (ఏప్రిల్–జూన్) 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్నదాని ప్రకారం ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. అంటే ఎగువముఖంగా 6 శాతంగా ఉండవచ్చన్నమాట. అయితే 4 శాతమే లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఆహార ధరల తీవ్రతవల్లే రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు రావడం లేదని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష పేర్కొంది. మేలో ఏడాది కనిష్ట స్థాయిలో 4.75 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, ఆర్బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తీవ్ర స్థాయిలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల మేలో పట్టణ ప్రాంతాల్లో 4.15 శాతం ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది. సగటుకన్నా ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. -
5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5 శాతం దిగువనే కొనసాగింది. సూచీ సమీక్షానెల్లో 4.83 శాతంగా నమోదయ్యింది. మార్చిలో నమోదయిన 4.85 శాతంతో పోలి్చతే స్వల్పంగా తగ్గింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. అయితే 2023 ఇదే నెలతో పోల్చితే (4.7 శాతం) అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే, ఒక్క ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతం (2024 మార్చి) నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2తో 4 శాతంగా ఉండాలి. -
కీలక వడ్డీరేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్‌బ్యాంక్ వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈమేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (ఆర్బీఐ మానిటరీ పాలసీ) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్బీఐ మానిటరీ పాలసీలోని ముఖ్యాంశాలు.. బెంచ్‌మార్క్ వడ్డీరేటు, రెపోరేటు స్థిరంగా 6.5శాతంగా ఉంది. 2024-25 ఏడాదికిగాను జీడీపీ వృద్ధి 7 శాతం నమోదుకానుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం చేరే అవకాశం ఉంది. తొలి త్రైమాసికంలో 4.9%, రెండో త్రైమాసికంలో 3.8%, మూడో త్రైమాసికంలో 4.6%, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉంటుందని అంచనా. 2023-24కుగాను భారత్‌కు వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు 625 బిలియన్డాలర్లుగా ఉన్నాయి. ఇవి 2014-15 తర్వాత వచ్చిన రెండో అత్యధిక పెట్టుబడులుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. ప్రపంచ వృద్ధి నేపథ్యంలో ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొంటున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమొడిటీ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్‌పై ట్రేడింగ్ కోసం ఆర్బీఐ త్వరలో స్కీమ్‌ను నోటిఫై చేయనుంది. కీలక రేట్లు ఇలా.. రెపోరేటు: 6.5 శాతం ఎస్డీఎఫ్ రేటు: 6.25 శాతం ఎంఎస్ఎఫ్ రేటు: 6.75 శాతం బ్యాంక్ రేటు: 6.75 శాతం -
ఇప్పుడు 7.2 శాతం.. వచ్చేది 7 శాతం!
దావోస్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకోగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యస్తం చేశారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న భరోసాను ఇచ్చారు. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2023–24 జీడీపీ అంచనాలు 7 శాతంకన్నా... వ్యక్తిగతంగా దాస్ అంచనా 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా గమనార్హం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఐఐ వార్షిక సమావేశంలో ‘అధిక వృద్ధి తీరు–తక్కువ స్థాయిలో ఇబ్బందులు: ది ఇండియా స్టోరీ’ అనే అంశంపై దాస్ మాట్లాడుతూ, వృద్ధి స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలకు సంబంధించి ద్రవ్యోల్బణం ప్రమాదం ఇటీవల తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఇది భవిష్యత్ వృద్ధి పటిష్టతకు సంకేతమని పేర్కొన్నారు. సమావేశంలో ఇంకా ఆయన ఏమన్నారంటే... ► ఇటీవలి సంవత్సరాలలో భారత్ ప్రభుత్వం చేపట్టిన పటిష్ట నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయి. ► సవాలుతో కూడిన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్... పటిష్ట వృద్ధి, స్థిరత్వ బాటన పయనిస్తోంది. ► ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు, మార్కెట్ల సానుకూల వాతావారణం ఉన్నప్పటికీ, భౌగోళిక ఇబ్బందులు, వాతావరణ మార్పులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ► బలమైన దేశీయ డిమాండ్‌తో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇటీవలి ప్రపంచ అనిశ్చితి పరిణామాల నుంచి భారత్ మరింత బలంగా బయటపడింది. ► అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనగలిగిన స్థాయిలో భారత్ చెల్లింపుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశానికి తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ► 2022 మే నుంచి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతూ వచి్చంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య లభ్యత నిర్వహణా పరిస్థితులు ఇందుకు దోహదపడ్డాయి. (2022 మే నుంచి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటు 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.) సరఫరాల వైపు సమస్యలు కూడా తొలిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది. ► వచ్చే ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నా. ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా ఆర్బీఐ 4 శాతం లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలదనే విశ్వాసంతో ఉంది. -
RBI Monetary policy: అయిదోసారీ అక్కడే..!
ముంబై: ద్రవ్యోల్బణంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ వరుసగా అయిదోసారీ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం హోదాను నిలబెట్టుకుంటూ భారత్ మరింత వృద్ధి నమోదు చేయగలదని అంచనా వేసింది. అటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. మరోవైపు, రికరింగ్ చెల్లింపుల ఈ–మ్యాండేట్ పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6–8 మధ్య ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మళ్లీ సమావేశం అవుతుంది. ఆర్బీఐ నిర్ణయాలు అధిక వృద్ధి సాధనకు దోహదపడగలవని బ్యాంకర్లు, కార్పొరేట్లు వ్యాఖ్యానించగా .. రేటును తగ్గించి ఉంటే ప్రయోజనకరంగా ఉండేదని రియల్టీ రంగం అభిప్రాయపడింది. వచ్చే సమీక్షలోనైనా తగ్గించాలని కోరింది. వివరాల్లోకి వెడితే.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ప్రామాణిక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటు) యధాతథంగా 6.5%గా కొనసాగించాలని కమిటీలోని సభ్యులందరూ (ఆరుగురు) ఏకగ్రీవంగా తీర్మానించారు. ధరలను కట్టడి చేసే దిశగా 2022 మే నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 2.5% పెంచింది. యూపీఐ పరిమితులు పెంపు.. ► ఆస్పత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా జరిపే చెల్లింపుల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు. ► మళ్లీ మళ్లీ చేసే (రికరింగ్) చెల్లింపులకు సంబంధించి ఈ–మ్యాండేట్ పరిమితి రూ. 15 వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలు 6.5 శాతం నుంచి 7%కి పెంపు. జీడీపీ డిసెంబర్ త్రైమాసికంలో 6.5%గా, మార్చి క్వార్టర్లో 6 శాతంగా ఉంటుందని అంచనా. ► వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం క్యూ3లో 5.6%గా, క్యూ4లో 5.2%గా ఉండొచ్చని అంచనా. 2024–25 జూన్ క్వార్టర్లో ఇది 5.2 శాతంగా, సెపె్టంబర్ త్రైమాసికంలో 4 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 4.7 శాతంగా ఉండవచ్చు. ► డేటా భద్రత, గోప్యతను మరింతగా పెంచే దిశగా ఆర్థిక రంగం కోసం ఆర్బీఐ క్లౌడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ► ఆర్థిక రంగ పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పంచేలా ‘‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2024 ఏప్రిల్‌లో లేదా అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ దీన్ని అందుబాటులోకి తేనుంది. ఫిన్‌టెక్ సంస్థలు స్వచ్ఛందంగా సంబంధిత వివరాలను రిపాజిటరీకి సమర్పించవచ్చు. ► డిసెంబర్ 1 నాటికి విదేశీ మారక నిల్వలు 604 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఇతర వర్దమాన దేశాలతో పోలిస్తే రూపాయి మారకంలో ఒడిదుడుకులు తక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణంపై ఆహార ధరల ఎఫెక్ట్.. సెపె్టంబర్ క్వార్టర్ వృద్ధి గణాంకాలు పటిష్టంగా ఉండి, అందర్నీ ఆశ్చర్యపర్చాయి. ఆహార ధరల్లో నెలకొన్న అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణ అంచనాలపై గణనీయంగా ప్రభావం చూపవచ్చు. వేగంగా మారిపోయే ఆహార ధరల సూచీలన్నీ కూడా కీలక కూరగాయల రేట్ల పెరుగుదలను సూచిస్తున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగొచ్చు. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంచనాల పెంపు సముచితమే.. ప్రథమార్ధంలో సాధించిన వృద్ధి, ఆ తర్వాత రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గణాంకాలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం సముచితమే. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి రేటు తగ్గించాల్సింది.. వడ్డీరేట్లను య«థాతథంగా కొనసాగించడం మంచి నిర్ణయమే. అయితే, ప్రస్తుతం స్థూల–ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున రేటును తగ్గించి ఉంటే రియల్టీ రంగం, ఎకానమీకి గణనీయంగా ప్రయోజనం కలిగేది. – »ొమన్ ఇరానీ, నేషనల్ ప్రెసిడెంట్, క్రెడాయ్ సానుకూల సంకేతాలు ద్రవ్యోల్బణం స్థిర స్థాయిలో ఉంటూ, ఎకానమీ అధిక వృద్ధి సాధించే దిశగా ముందుకెడుతుందని పాలసీ స్పష్టమైన, సానుకూల సంకేతాలిస్తోంది. వరుసగా మూడో ఏడాది 7 శాతం వృద్ధిని సాధించే అవకాశాలను సూచిస్తోంది. – దినేష్ ఖారా, చైర్మన్, ఎస్బీఐ -
భారత్ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–24మార్చి) జీడీపీ వృద్ధి రేటు తొలి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్వల్పంగా తగ్గించింది. 2023 ఏప్రిల్ అవుట్‌లుక్ 6.4 శాతం అంచనాలను తాజాగా 10 బేసిస్ పాయింట్లు తగ్గి స్తున్నట్లు తెలిపింది. దీనితో ఈ అంచనా 6.3 శాతానికి తగ్గినట్లయ్యింది. ఎగుమతుల్లో మందగమనం, తగిన వర్షపాతం లేక వ్యవసాయంపై ప్రభావం వంటి అంశాలు తమ అంచనాల కోతకు కారణ మని తన 2023 సెపె్టంబర్ అవుట్‌లుక్‌లో తెలిపింది. కాగా 2024–25 అంచనాలను 6.7 శాతంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రైవేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ప్రభ్తువ మూలధన వ్యయాలు వృద్ధికి భరోసాను ఇస్తున్నట్లు తెలిపింది. 5.9 శాతం నుంచి 6.2 శాతానికి అప్: ఇండియా రేటింగ్స్ మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5.9 శాతం వృద్ధి అంచనాలను 6.2 శాతానికి పెంచుతున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరగడం, బ్యాంకులు, కార్పొరేట్ల మెరుగైన బ్యాలెన్స్ షీట్లు, గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గడం, ప్రైవేటు పెట్టుబడుల్లో ఉత్తేజం తన రేటింగ్ మెరుగుదలకు కారణమని ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో ఇండియా రేటింగ్స్ ప్రధాన ఎకనమిస్ట్ సునిల్ కుమార్ పేర్కొన్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) మన ఎకానమీకి ఢోకా లేదు: అషీమా గోయెల్ ఇదిలావుండగా, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ చక్కని పనితీరు ప్రదర్శిస్తోందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధన కమిటీ (ఎంపీసీ) సభ్యుల్లో ఒకరైన అషీమా గోయెల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్చలు, ఆర్బీఐ విధానాలు దేశ ఎకానమీకి తగిన బాటన నడుపుతున్నట్లు వివరించారు. -
2023–24 ఎంపీసీ భేటీ షెడ్యూల్ విడుదల
ముంబై: కీలక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు తీసుకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలకు సంబంధించి 2023–24 ఆర్థిక సంవత్సరం షెడ్యూల్ విడుదలైంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయంసహాపలు కీలక ద్రవ్య, పరపతి నిర్ణయాలు ఈ సమావేశాల్లో తీసుకునే సంగతి తెలిసిందే. -
Stock Market: ఒడిదుడుకులు కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ – అదానీ గ్రూప్ పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఎఐక్స్ ఇండెక్స్ 17.32% నుంచి 14.4శాతానికి దిగిరావడం కలిసొచ్చే అంశంగా ఉంది. వీటితో పాటు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇటీవల భారీ దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారం సూచీలు రెండున్నరశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1534 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు లాభపడ్డాయి. అయితే హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ సంక్షోభంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కేంద్ర ప్రకటించిన సంతులిత బడ్జెట్ సైతం అస్థిరతలను తగ్గించలేకపోయింది. ‘‘వారాంతాపు బౌన్స్‌బ్యాక్ కాస్త ఒత్తిడిని తగ్గించింది. అయితే సంకేతాలు ఇప్పటికీ మిశ్రమంగానే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలోని స్థిరత్వం కలిసొచ్చే అంశమే. ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, అదానీ గ్రూప్ సంక్షోభం పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. నిఫ్టీ 17,900 స్థాయిని అధిగమించగలితే ఎగువస్థాయిలో 18,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,550 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం వారాంతాపు రోజైన శుక్రవారం డిసెంబర్ పారిశ్రామిక, తయారీ రంగ డేటా విడుదల కానుంది. అదేరోజున ఫిబ్రవరి మూడో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల జనవరి 27 వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. జనవరి యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ కన్స్ట్రక్షన్ పీఎంఐ డేటా, బ్రిటన్ సీఐపీఎస్ కన్స్ట్రక్షన్ పీఎంఐ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. యూఎస్ వాణిజ్యలోటు రేపు(మంగళవారం) వెల్లడికానుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. ఆర్బీఐ ఎంసీపీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు బుధవారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గానూ ఆర్బీఐ నిర్వహించే చివరి ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఇది. వడ్డీరేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని అంచనా. గతేడాది డిసెంబర్లో వరుసగా ఐదో విడత కీలక రెపో రేటును 0.35 శాతం పెంచడంతో 6.25 శాతానికి చేరింది. భవిష్యత్తులో వడ్డీరేట్ల పెంపు/తగ్గింపు, బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థ పై విధాన కమిటీ అభిప్రాయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఈ కొత్త ఏడాది తొలి నెలలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శించారు. ఈ జనవరిలో మొత్తం రూ.28,852 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గతేడాది జూన్ తర్వాత ఒక నెలలో ఎఫ్ఐఐల జరిపిన అత్యధిక విక్రయాలు ఇవే. కొనసాగింపుగా ఈ ఫిబ్రవరి మొదటివారంలోనూ రూ.5,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఎఫ్ఐఐలు భారత్ మార్కెట్లో షార్ట్ పోజిషన్లతో భారీ లాభపడ్డారు. తక్కువ విలువ వద్ద ట్రేడ్ అవుతున్న చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మార్కెట్లపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, జొమాటో, లుపిన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. -
Budget 2023: క్లిష్ట పరిస్థితుల్లో కఠిన ద్రవ్య విధానం తగదు
న్యూఢిల్లీ: ప్రపంచం తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లోనే కొనసాగుతున్నందున ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం), రుణ సమీకరణల కట్టడి వంటి అంశాల్లో దూకుడు ప్రదర్శించరాదని కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ సూచించారు. రానున్న 2023–24 వార్షిక బడ్జెట్లో ఈ మేరకు కఠిన ద్రవ్య విధానాలను అనుసరించవద్దని ఆమె సలహాఇచ్చారు. 2021–22లో 6.71 శాతంగా ఉన్న ద్రవ్యలోటు 2022–23లో 6.4 శాతానికి తగ్గాలని, 2025–26 నాటికి 4.5 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన 2023–24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావిస్తున్న సంగతి తెలిసిందే. వ్యయాలు ఆర్థిక పురోగమనానికి బాట వేయాలి.. ప్రభుత్వం చేసే వ్యయాలు పన్ను రాబడులు పెంచే విధంగా కాకుండా, ఆర్థిక వ్యవస్థ పురోగమనమే ప్రధాన ధ్యేయంగా జరగాలని అన్నారు. ప్రభుత్వ రుణాలు కూడా అభివృద్ధికి బాటలు వేయడం లక్ష్యంగా ఉండాలన్నారు. భారం మోపని పన్ను విధానాలను అనుసరించాలని, తద్వారా పన్ను బేస్ విస్తరణకు కృషి జరగాలని ఆమె సూచించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమంటే, భవిష్యత్ తరాలపై భారం మోపడమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని ప్రతిపక్ష పాలక రాష్ట్రాల నుంచి వస్తున్న ‘పాత పెన్షన్ పథకాలను పునరుద్ధరణ డిమాండ్’ నేపథ్యంలో అషిమా ఈ వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వడానికి సంబంధించిన పాత పెన్షన్ పథకాలను 2003లో ఎన్డీఏ ప్రభుత్వం నిలిపివేసింది. 2004 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కింద ఉద్యోగులు తమ ప్రాథమిక (బేసిస్) వేతనంలో 10 శాతం పెన్షన్‌కు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు ఇప్పటికే ఓపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. జార్ఖండ్ కూడా ఓపీఎస్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ ఇటీవలే పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడానికి ఆమోదముద్ర వేసింది. ద్రవ్యోల్బణం కట్టడికి మనమే బెటర్... నవంబర్‌ను మినహాయిస్తే అంతకుముందు గడచిన 10 వరుస నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు రాకపోవడానికి కారణం... ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల, సరఫరాల సమస్య, ఆహార ధరలు పెరగడం వంటి అంశాలు కారణమని అన్నారు. సరఫరాలవైపు తొలగుతున్న సమస్యలు నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు రావడానికి కారణమని అన్నారు. వృద్ధికి విఘాతం కలుగకుండా ద్రవ్యోల్బణం నిర్దేశిత 6 శాతం దిగురావడం హర్షణీయ పరిణామని పేర్కొన్న ఆమె, ‘‘పలు ఇతర దిగ్గజ ఎకానమీలతో పోల్చితే సవాళ్లను భారత్ సమర్థవంతంగా అధిగమించగలిగింది’’ అని అన్నారు. -
వడ్డీ రేట్లవైపు మార్కెట్ చూపు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకోనున్న పరపతి నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. గత కొన్ని నెలలుగా ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపును బలపరుస్తోంది. ధరల అదుపునకే తొలి ప్రాధాన్యమిస్తూ కీలక రేటు రెపోను పెంచుతూ వస్తోంది. గత పాలసీ సమీక్షలో చేపట్టిన 0.5 శాతం పెంపుతో ప్రస్తుతం వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 5.9 శాతానికి చేరింది. తిరిగి ఈ నెల 5–7 మధ్య ఎంపీసీ పరపతి సమీక్షను నిర్వహించనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి మరోసారి 0.25–0.35 శాతం స్థాయిలో రెపోను పెంచే వీలున్నట్లు అత్యధిక శాతం మంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఫలితాలపై కన్ను కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి(5)తో పూర్తికానుంది. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు 8న వెలువడనున్నాయి. 7న ఆర్బీఐ నిర్ణయాలు, 8న ఎన్నికల ఫలితాలు మార్కెట్ల దిశను నిర్ధారించవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు దీపక్ జసానీ పేర్కొంటున్నారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం సెంటిమెంటుపై ప్రభావం చూపగలవని భావిస్తున్నారు. పెట్టుబడులు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో కొద్ది రోజులుగా ప్రపంచస్థాయిలో ధరలు అదుపు తప్పుతున్న సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు తదితర కఠిన పరపతి విధానాలను అమలు చేస్తున్నాయి. దీంతో డాలరు బలపడుతుంటే దేశీ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. అయితే ఇకపై ఫెడ్ వడ్డీ పెంపు వేగం మందగించవచ్చన్న అంచనాలతో ట్రెజరీ ఈల్డ్స్, డాలరు కొంతమేర వెనకడుగు వేస్తున్నాయి. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లకు కీలకంకానున్నాయి. ఇటీవల ఎఫ్‌పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను సాధిస్తున్న విషయం విదితమే. రికార్డుల వారం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో పరుగు తీశాయి. సెన్సెక్స్ నికరంగా 575 పాయింట్లు బలపడి 62,869 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు పుంజుకుని 18,696 వద్ద స్థిరపడ్డాయి. గురువారం(1న) సెన్సెక్స్ 63,583, నిఫ్టీ 18,888 పాయింట్లను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాలను సాధించాయి. కాగా.. సమీప కాలంలో దేశీ మార్కెట్లకు ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలు మార్గనిర్దేశం చేయనున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ షేత్, కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అమోల్ అథవాలే, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. -
ధరల స్పీడ్‌కు వడ్డీ రేటు పెంపు బ్రేక్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 5.9 శాతం) పెంపు చర్యలు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కట్డికి దోహదపడుతుందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ స్పష్టం చేశారు. 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివస్తుందన్న బరోసా ఇచ్చారు. వ్యవస్థలో ప్రస్తుత వడ్డీరేట్లు వృద్ధి రికవరీకి ఎటువంటి విఘాతం ఏర్పడని స్థాయిలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గుముఖం పడతాయని, సరఫరాల చైన్ మున్ముందు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఆమె ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో తెలిపారు. సరఫరాల వైపు సమస్యలను తగ్గించడానికి భారత్ ప్రభుత్వం నుంచి సైతం తగిన చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇవన్నీ వచ్చే ఐదారు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని మరో ఎంపీసీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. కరెన్సీ విషయంలో మనం బెస్ట్ డాలర్ మారకంలో భారత్ రూపాయి ఎప్పటికప్పుడు చరిత్రాత్మక కనిష్టాలను తాకుతున్న అంశానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఎంపీసీ ఆరుగురు సభ్యుల్లో ఒకరైన గోయల్ సమాధానం చెబుతూ, ‘క్షీణించిన రూపాయి దిగుమతుల బిల్లును మరింత పెంచుతుంది. విదేశాలలో రుణాలు తీసుకున్న వారిని సమస్యల్లోకి నెడుతుంది. అయితే కొంతమంది ఎగుమతిదారులకు రాబడిని పెంచుతుంది’ అని అన్నారు. ఫెడ్ రేట్లు పెరగడం వల్ల అమెరికా తిరిగి వెళుతున్న డాలర్ల వల్ల ఈ రిజర్వ్ కరెన్సీ విలువ పెరుగతోందని అన్నారు. అన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోందని వివరించారు. ఇతర అభివృద్ధి చెందిన, వర్థమాన మార్కెట్లతో పోల్చితే రూపాయి విలువ పతనం తక్కువగా ఉందని అన్నారు. ఇటీవల ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ కూడా తిరిగి పెరుగుతున్నట్లు తెలిపారు. భారత్ ఈక్విటీల ధరల పతనం తక్కువగా పలు దేశాలతో పోల్చితే తక్కువగా ఉందని స్పష్టం చేశారు. భారత్ మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొన్నారు. వాల్యుయేషన్ ప్రభావాల వల్లే భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) ఎక్కువగా పడిపోయాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ ఫారెక్స్ ఏడాది కాలంలో దాదాపు 100 డాలర్ల తగ్గి 544 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో 77 శాతం వ్యాల్యుయేషన్ల ప్రభావం వల్లే తగ్గాయని ఆర్బీఐ సెప్టెంబర్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా వివరించిన సంగతి తెలిసిందే. తక్కువ దిగుమతులు– అధిక ఎగుమతులు కరెంట్ ఖాతా (భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసం) లోటును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్న ఆమె, ఎగుమతుల పెంపు ఆవశ్యకతను ఉద్ఘాటించారు. అంతర్జాతీయ మందగమనం ప్రతికూలమే, కానీ... ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయంపై అడిగిన ప్రశ్నకు గోయల్ సమాధానం చెబుతూ, ప్రపంచ మందగమనం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ‘కానీ భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉంది. దాని పరిమాణం, వైవిధ్యం, వైశాల్యం, ఆర్థిక రంగం బలం మంచి సానుకూల వృద్ధినే అందిస్తుంది’’ అని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కార్పొరేట్లు రుణాన్ని తగ్గించుకున్నారని, ఆర్థిక రంగం బాగా మూలధనం పొందిందని గోయల్ తెలిపారు. ఇవన్నీ భారతదేశానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే ‘మందగమన’ సవాళ్లను తగ్గిస్తాయని వివరించారు. డిసెంబర్లో మరో అరశాతం పెంపు అవకాశం అషిమా గోయల్ ప్రకటన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకూ జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటును కనీసం అరశాతం పెంచే అవకాశం కనిపిస్తోంది. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. -
సానుకూల సెంటిమెంటు కొనసాగొచ్చు
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పరపతి నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. జూన్ కార్పొరేట్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. ‘‘మార్కెట్ పరిస్థితులను గమనిస్తే సానుకూల సెంటిమెంట్ మరికొంత కాలం కొనసాగవచ్చు. నిఫ్టీ 17వేల కీలక నిరోధాన్ని అధిగమించి 17,158 వద్ద స్థిరపడింది. సానుకూల సెంటిమెంట్ కొనసాగితే 17,350 – 17,500 శ్రేణిలో నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. వరుస లాభాల నేపథ్యంలో మార్కెట్ కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 16,950–16,800 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. రానున్న రోజుల్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై దూకుడును ప్రదర్శించకపోవచ్చనే అంచనాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో గతవారం సూచీలు దాదాపు మూడుశాతం ర్యాలీ చేశాయి. మెటల్, ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 1500 పాయింట్లు, నిఫ్టీ 439 పాయింట్లు లాభపడ్డాయి. తొమ్మిది నెలల తర్వాత కొనుగోళ్లు కొంతకాలంగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. తొమ్మిది నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ జూలైలో రూ.4,989 కోట్ల విలువైన షేర్లను కొన్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, దేశీయ కార్పొరేట్ జూన్ క్వార్టర్ ఫలితాలు మెప్పించడం ఇందుకు కారణమని నిపుణులంటున్నారు. గత నెల జూన్‌లో రూ. 50,203 కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘రూపాయి రికవరీ, అందుబాటు ధరల వద్ద క్రూడాయిల్ లభ్యత తదితర అంశాల నేపథ్యంలో మరికొంతకాలం పాటు ఎఫ్ఐఐలు ధోరణి సానుకూలంగా ఉండొచ్చు’’ అని యస్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు హితేశ్ జైన్ తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను విశ్లేషిస్తే.., ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు వెల్లడి తర్వాత మార్కెట్ వర్గాలు తాజాగా ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలపై దృష్టి సారించాయి. సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించనున్నారు. ఈ జూన్ ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రిటైల్ ద్రవ్యోల్బణ ఇప్పటికీ గరిష్టస్థాయిలో కొనుసాగుతున్న నేపథ్యంలో, ఈ సమీక్షలో రెపోరేటు పెంపు 0.25 – 0.50% మధ్య ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పాలసీ వెల్లడి సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులు, ద్రవ్యోల్బణ, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్ వ్యాఖ్యలను పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం జూలైతో సహా ఈ ఏడాది తొలి ఆరునెలలకు సంబంధించి కేంద్రం జీఎస్టీ వసూళ్లను, ఆటో కంపెనీలు వాహన అమ్మక గణాంకాలు నేడు విడుదల చేయనున్నాయి. తయారీ రంగ పీఎంఐ నేడు, సేవారంగ గణాంకాలు (బుధవారం) మూడో తేదీన విడుదల అవుతాయి. వాణిజ్యలోటు డేటా మంగళవారం వెల్లడి కానుంది. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూలై 29 వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వలను విడుదల చేయనుంది. దేశ ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ స్థూల గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించనున్నారు. క్యూ1 ఆర్థిక ఫలితాలు ఇప్పటికే ప్రధాన కంపెనీల తమ క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. అయితే ఈ వారంలో సుమారు 560కి పైగా కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను ప్రకటించనున్నాయి. ఐటీసీ, యూపీఎల్, బ్రిటానియా, గెయిల్, టైటాన్, ఎంఅండ్ఎం, వరణ్ బేవరీజెస్, జొమాటో, ఎస్కార్ట్స్, అదానీ గ్రీన్, సిమెన్స్, భాష్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్, అదానీ విల్మర్, ఇండిగో, నైకా, పెట్రోనెట్ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా సంబంధిత కంపెనీ షేర్లు ఒడిదుడులకు లోనయ్యే అవకాశం ఉంది. అలాగే యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు. -
డిజిటల్ పేమెంట్లపై వడ్డన.. ఆర్బీఐ ‘నో’ క్లారిటీ
RBI Monetary Policy | UPI for Feature Phone Users: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు. ఫీచర్ ఫోన్లకు సైతం(స్మార్ట్ ఫోన్లు కాకుండా బేసిక్ ఫోన్లు) యూపీఐ ఆధారిత పేమెంట్ పద్దతులను.. అదీ ఆర్బీఐ పర్యవేక్షణ నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తద్వారా చిన్నాచితకా ట్రాన్జాక్షన్లు జరిగే అవకాశం ఉందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే యూపీఐ ఆధారిత ఫీచర్ ఫోన్ ప్రొడక్టులు ఎలా పని చేయనున్నాయనేది ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు. అలాగే పేమెంట్ వ్యవస్థలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ తీరును మరింత సరళీకరించే ఉద్దేశంతో ఆర్బీఐ ఉంది. ఇందుకోసం కార్డులు, వాలెట్లు, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఛార్జీల మీద చర్చా పత్రాన్ని విడుదల చేయబోతోంది. కార్డులు, వాలెట్ల వరకు ఓకే. కానీ, యూపీఐ చెల్లింపులకు సంబంధించిన బేసిక్ పేమెంట్ యాప్స్ ఏవీ ఇప్పటివరకు పేమెంట్ల మీద పైసా ఛార్జీ వసూలు చేయలేదు. దీంతో భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్ ఆధారిత డిజిటల్ చెల్లింపుల మీద ఛార్జీలు వసూలు చేస్తారా? అనే కోణంలో చర్చ మొదలైంది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో యూపీఐ మోస్ట్ పాపులర్ పేమెంట్ మెథడ్‌గా ఉంది. ఒక్క నవంబర్లోనే 4.1 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ ద్వారా 6.68 లక్షల కోట్లు యూపీఐ ద్వారా జరిగింది. ప్రస్తుతం యూపీఐ పరిధిలోని గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఏవీ కూడా ట్రాన్జాక్షన్స్కి యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ, నాన్ యూపీఐ పరిధిలోని కొన్ని మాత్రం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు యూపీఐ పరిధిలోని ప్లేయర్స్(గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లాంటివి).. మర్చంట్ డిస్కౌంట్ రేటు విధించాలని ఎప్పటి నుంచో ఆర్బీఐను డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఫోన్ ఫే ఫౌండర్ సమీర్ నిగమ్ గతంలో ఓ సదస్సులో మాట్లాడుతూ.. యూపీఐ పరిధిలోని ప్లేయర్స్ ‘జీరో ఎండీఆర్’తోనే 85 నుంచి 90 శాతం ట్రాన్జాక్షన్స్ చేస్తున్నాయని ప్రస్తావించారు. మరి ఆర్బీఐ యూపీఐ ప్లేయర్ల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా?.. ఒకవేళ తీసుకుంటే డిజిటల్ ట్రాన్జాక్షన్స్పై సామాన్యుల మీదే భారం వేస్తుందా? ఆ చర్చా పత్రంలో ఎలాంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటారు? అనే విషయాలపై బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తే బాదుడే.. ఎప్పటినుంచంటే.. -
ఐఎంపీఎస్ చెల్లింపులు.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ
RBI Monetary Policy Updates: డిజిటల్ చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) చెల్లింపుల పరిమితిని 2 లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచేసింది. ఈ మేరకు రెండురోజులపాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, శుక్రవారం మీడియాకు వెల్లడించారు. యూపీఐలాగే ఐఎంపీఎస్ కూడా ఇన్స్టంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీస్. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎం, ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో ఉపయోగించుకోవచ్చు. 2014 జనవరిలో ఐఎంపీఎస్ చెల్లింపు పరిమితిని 2 లక్షలుగా నిర్ణయించింది ఆర్బీఐ. ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ సర్వీసులతో మాత్రం ఇది 5 వేలుగానే కొనసాగుతోంది. ఈరోజుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రామాణికంగా మారిన తరుణంలో.. ఊరటనిస్తూ ఐదు లక్షలకు ఆర్బీఐ పెంచడం విశేషం. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాల్ని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వరుసగా ఎనిమిదోసారి తర్వాత కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రకటించారాయన. రెపోరేట్, రివర్స్ రెపోరేట్లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి, ఎస్ఎఫ్ కూడా 4.25 శాతానికే పరిమితం చేసినట్లు వెల్లడించారాయన. ఇక యూజర్లకు ఊరటనిస్తూ ఐఎంపీఎస్ ట్రాన్జాక్షన్ లిమిట్‌ను 2 లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచే ప్రతిపాదనను Immediate Payment Service (IMPS) యాప్స్ ముందు ఉంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది. దీంతో పాటు ఎన్బీఎఫ్సీల్లో పెద్ద కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత అంబుడ్స్‌మన్ ఏర్పాటునకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆఫ్‌లైన్‌పేమెంట్ మెకానిజంను త్వరలో తీసుకురాబోతున్నట్లు, దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ, ఆర్బీఐ మరోసారి సర్దుబాటు వైపే మొగ్గుచూపింది. ఇక కరోనాతో ప్రభావితమైన భారత ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడానికి ఆర్బీఐ రెపోరేటును 2020 మేలో 4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎంపీసీలోని కీలకాంశాలు ►చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉంది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ►ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని శక్తికాంత దాస్ అన్నారు. ►పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. ►పండగ సీజన్లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తోంది. ►కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు. ►జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు. ► క్యాపిటల్ గూడ్స్‌కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది. ►ఈ ఆర్థిక సంవత్సర రిటైల్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి సవరణ. ►జులై-సెప్టెంబరులో అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ►అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని సైతం 5.3 శాతం నుంచి 4.5 శాతానికి కుదించారు. ►రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నేపథ్యంలో వచ్చే నెల ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండనుంది. ►పేమెంట్ యాక్సెప్టెన్సీ కోసం పీవోఎస్ point of sale (PoS), క్యూఆర్ కోడ్ల తరహాలోనే జియో ట్యాగింగ్ టెక్నాలజీ తీసుకురావాలనే ఆలోచన ►2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది ఆర్బీఐ. చదవండి: మరింత సులభతరం కానున్న లావాదేవీలు -
బడ్జెట్ బ్రదరూ.. జర భద్రం..!
ముంబై: కేంద్ర బడ్జెట్–2021 ప్రభావిత అంశాలు, ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు బడ్జెట్ కార్యక్రమంతో పాటు జనవరి వాహన విక్రయ గణాంకాలు, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. బుధవారం నుండి ఆర్బీఐ ద్రవ్యపాలసీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ అంశాలే ఈ వారం రోజుల్లో మార్కెట్‌కు కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, కంపెనీల క్యూ3 ఆర్థిక గణాంకాలు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. ఇక గడిచిన ఆరురోజుల్లో సెన్సెక్స్ 3056 పాయింట్లు, నిప్టీ 1010 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉపసంహరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు, బడ్జెట్ నేపథ్యంలో అప్రమత్తత ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాల గురించి మరింత లోతుగా పరిశీలిస్తే..., స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావమెంత..? నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్–2021ను ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితులు, దిగజారిన ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకొని ప్రవేశపెట్టే బడ్జెట్ ఇది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్న వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే విధంగా ఈ బడ్జెట్లో ఉద్దీపన చర్యలుండొచ్చని ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు. ప్రభుత్వం మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు మౌలిక సదుపాయాల వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందా..? లేదా ఆర్థిక విధానాలకు నిధుల కేటాయింపు ద్వారా వృద్ధిని కోరుకుంటుందా..? అనే అంశాలు మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయి. మొదటి నిర్ణయంతో మార్కెట్ పరుగు తిరిగి ప్రారంభం అవుతుంది. రెండో ఎంపికతో మార్కెట్లో మరింత కరెక్షన్కు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం సంపన్న వర్గాలపై కొత్త పన్నులను విధించడంతో పాటు కార్పోరేట్ ఆదాయాలపై సెస్సును పెంచుతాయనే అంచనాలు దలాల్ స్ట్రీట్‌ను కలవరపెడుతున్నాయి. మొత్తంగా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. ఫిబ్రవరి 3న ఆర్బీఐ పాలసీ సమావేశం ... బడ్జెట్ ఒకరోజు తర్వాత ఫిబ్రవరి 3న (బుధవారం) ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు శుక్రవారం (ఫిబ్రవరి 5న) వెలువడనున్నాయి. నాలుగుశాతం రెపో రేటును యథాతథంగా కొనసాగించవచ్చన్నది అంచనా. విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు..! గతేడాది సెప్టెంబర్ తర్వాత ఈ జనవరి 29న ముగిసిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారిగా నికర అమ్మకందారులుగా మారారు. ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటంతో చివరి వారంలో ఎఫ్ఐఐలు మొత్తం రూ.12 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు ఎస్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు దాదాపు నాలుగునెలల తర్వాత దేశీ ఫండ్లు(డీఐఐలు) నికర కొనుగోలుదారులుగా మారారు. గడచిన వారంలో డీఐఐలు రూ.3,789 కోట్ల షేర్లను కొన్నారు. తుది అంకానికి క్యూ3 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, హెచ్‌పీసీఎల్, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, దీవిస్ ల్యాబ్, ఎన్టీపీసీలతో సహా ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. జనవరి ఆటో అమ్మక గణాంకాల విడుదల... నేడు బడ్జెట్ కార్యక్రమంతో పాటు ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్యాసింజర్, మధ్య–భారీ వాణిజ్య వాహన, ట్రాక్టర్ విభాగపు అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ద్వి–చక్ర వాహన విభాగపు విక్రయాలు బలహీనంగా ఉండొచ్చని వారంటున్నారు. అంచనాలకు మించి అమ్మకాలు ఉంటే రానున్న రోజుల్లో ఆటో రంగానికి డిమాండ్ ఉంటుందని ఇన్వెస్టర్లు భావించే అవకాశం ఉంది. గణాంకాల ప్రభావం.... నేడు మెర్కిట్ తయారీ పీఎంఐ గణాంకాలతో పాటు ఇదే జనవరి వాణిజ్యలోటు లాంటి స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్నాయి. అలాగే అగ్రరాజ్యం అమెరికా మెర్కిట్ తయారీ గణాంకాలు కూడా ఈరోజే విడుదల అవుతాయి. ఈ బుధవారం మెర్కిట్ సేవల పీఎంఐ గణాంకాలు వెల్లడవుతాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. ఊగిసలాట కొనసాగొచ్చు పలు దేశాల కేంద్ర బ్యాంకుల సరళతర వైఖరితో అంతర్జాతీయంగా లిక్విడిటీ మెండుగా ఉంది. ఈ అధిక లిక్విడిటీ వర్ధమాన దేశాల ఈక్విటీల్లో ప్రవహించడంతో పలు దేశాల స్టాక్‌మార్కెట్లు అధిక వ్యాల్యుయేషన్‌తో ట్రేడ్ అవుతున్నాయి. సూచీలను పరుగులు పెట్టిస్తున్న ఈ లిక్విడిటీ ఆధారిత ర్యాలీ ఆధారంగా మన బెంచ్‌మార్క్ సూచీలు కనీసం 10 నుంచి 15 శాతం దిద్దుబాటు కావాల్సిన అవసరం ఉంది. మార్కెట్ అస్థిరతను సూచించే వొలటాలటీ ఇండెక్స్ 3 శాతం పెరిగి 25.34 వద్ద స్థిరపడింది. ఇది మార్కెట్లోని అస్థిరతను సూచిస్తుంది. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ -
ఆర్బీఐ... బంగారం భరోసా!
ముంబై: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆర్థిక రంగానికి ఊతం అందించడానికి తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను పావుశాతం తగ్గిస్తుందన్న అంచనాలకు భిన్నంగా గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని మూడు రోజుల పాటు జరిగిన సమావేశం గురు వారం నిర్ణయించింది. అయితే వృద్ధికి ఊపును అందించే క్రమంలో సరళతర ఆర్థిక విధానాలకే మొగ్గుచూపుతున్నట్లూ ప్రకటించింది. తద్వారా భవిష్యత్తులో రేటు కోతలు ఉండవచ్చని సూచించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం 2020–21 ద్వితీయార్థంలో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని పేర్కొంటూ, ధరల స్పీడ్‌ను కేంద్రం నిర్దేశిత 4 శాతం కట్టడే లక్ష్యంగా (2 ప్లస్ లేదా 2 మైనస్) ప్రస్తుతానికి కీలక రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4%) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇక కరోనా పరిస్థితుల నేపథ్యంలో డబ్బు అందక ఇబ్బందులు పడుతున్న చిన్న సంస్థలు, వ్యాపారులు, మధ్య, సామాన్యుని కి ఊరట కల్పించే నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. దీనిప్రకారం... తన వద్ద ఉన్న పసిడిని బ్యాంకింగ్‌లో హామీగా పెట్టి రుణం తీసుకునే వ్యక్తులు ఇకపై ఆ విలువలో 90% రుణాన్ని పొందగలుగుతారు. తాజా నిర్ణయం 2021 మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకూ (పసిడి రుణాలకు లో¯Œ టు వ్యాల్యూ నిష్పత్తి) ఇది 75 శాతంగా ఉంది. పాలసీలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఏకగ్రీవ నిర్ణయం: ఫిబ్రవరి నుంచి 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. తాజాగా ఈ రేటు యథాతథ స్థితిలో కొనసాగించాలని పరపతి విధాన కమిటీలోని మొత్తం ఆరుగురు సభ్యులూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. జూ¯Œ లో ద్రవ్యోల్బణం 6.09 శాతం నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నా... అటు తర్వాత తగ్గవచ్చనే అభిప్రాయాన్ని పరపతి కమిటీ వ్యక్తం చేసింది. ► 20 యేళ్ల కనిష్ట స్థాయిలోనే రేట్లు: రేట్లను యథాతథంగా కొనసాగిస్తుండడంతో రెపో రేటు (4 శాతం) 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. ఇక రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే అదనపు నిధులపై లభించే వడ్డీరేటు) 3.35 శాతంగా కొనసాగుతుంది. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన కనీస మొత్తం నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 3 శాతంగా కొనసాగనుంది. ► ధరల పెరుగుదలకు అవకాశం: కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల పెరుగుదల అవకాశాలు, ఇందుకు సంబంధించి అనిశ్చితి ధోరణి నెలకొందని ఆర్బీఐ అభిప్రాయపడింది. సరఫరాల సమస్య ఇందుకు సంబంధించి ప్రధానంగా ఉందని పేర్కొంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న విషయాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల తీవ్రంగా ఉందని వెల్లడించింది. 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్న పాలసీ, మధ్య కాలికంగా ద్రవ్యోల్బణం శ్రేణిపై అంచనాలను మాత్రం వెలువరించలేదు. ► నాబార్డ్, ఎన్‌హెచ్‌బీకి వెసులుబాటు: వ్యవసాయ రంగానికి సాయం అందించే క్రమంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)కు రూ.5,000 కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ను ఆర్బీఐ కల్పించింది. అలాగే హౌసింగ్ సెక్టార్ విషయంలో ద్రవ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎ¯Œ హెచ్‌బీ)కి కూడా రూ.5,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌలభ్యత కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఆయా రంగాలకు రుణాలను అందించే విషయంలో నా¯Œ –బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్య లభ్యత విషయంలో కొంత వెసులుబాటు కలుగుతుంది. ► డిజిటల్ లావాదేవీలకు దన్ను: కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణాన్ని పెంచడానికి ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రతా చర్యలే ధ్యేయంగా ఈ దిశలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఒక పైలట్ స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో ఇందుకు సంబంధించి విధివిధానాలు వెలువడతాయని తెలిపింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్పీడ్ తక్కువగా ఉండడంసహా ఇప్పటివరకూ డిజిటల్ పేమెంట్లలో నెలకొంటున్న ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ విభాగంలో మరింత ముందుకు వెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ¯Œ లై¯Œ డిస్ప్యూట్ రిజల్యూష¯Œ (ఓడీఆర్) ఏర్పాటు ప్రతిపాదన కూడా ఈ విభాగంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒకటి. రుణ గ్రహీతకు వరం అటు కార్పొరేట్లకు, ఇతర వ్యక్తులకు వ¯Œ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణకు బ్యాంకింగ్‌కు ఆర్బీఐ అనుమతినిచ్చింది. 7 జూ¯Œ 2019లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ పునర్వ్యవస్థీకరణ జరపాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామ¯Œ కూడా ఈ మేరకు బహిరంగంగానే సూచనలు చేశారు. అకౌంట్లను ‘స్టాండర్డ్’గా వర్గీకరించిన లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకూ రుణ పునర్వ్యవస్థీకరణ వర్తిస్తుందని పేర్కొంది. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరంగా ఆయా సంస్థలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడాలని సూచించింది. రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రంగాల వారీగా అవసరాల పరిశీలన, ప్రణాళికలకు బ్రిక్స్ బ్యాంక్ మాజీ చైర్మన్, బ్యాంకింగ్ నిపుణులు కేవీ కామత్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు మరో ముఖ్యాంశం. ► ఇన్నోవేష¯Œ హబ్ ఏర్పాటు: అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, బ్యాంకింగ్ సేవల పటిష్టత లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేష¯Œ హబ్) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఎప్పటికప్పు డు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. ► స్టార్టప్స్‌కు ప్రాధాన్యత: ఇక స్టార్టప్స్ విషయానికి వస్తే, వీటికి ప్రాధాన్యతా రంగం హోదాను కల్పిస్తున్నట్లు పేర్కొంది. తద్వారా ఈ తరహా యూనిట్లు తగిన రుణ సౌలభ్యతను సకాలంలో అందుకోగలుగుతాయి. ► పునరుత్పాదకతకు ‘ఇంధనం’: ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్ఎల్) పునరుత్పాదకత ఇంధన రంగాలకు రుణ పరిమితులను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సోలార్ పవర్, కంప్రెస్డ్ బయోగ్యాస్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ► చిన్న రైతులు, బలహీన వర్గాలకూ ఊరట: ప్రాధాన్యతా రంగాలకు రుణం కింద (పీఎస్ఎల్) పరిధిలో చిన్న, సన్నకారు రైతులకు, అలాగే బలహీన వర్గాలకు కూడా రుణ పరిమితులను పెంచాలని ఆర్బీఐ పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ► అకౌంట్ల విషయంలో భద్రతా ప్రమాణాలు: కస్టమర్లకు కరెంట్ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్ల ప్రారంభంలో భద్రతా ప్రమాణాలు మరింత పెంపు. బహుళ బ్యాంకుల నుంచి ఆయా కస్టమర్లకు క్రెడిట్ సౌలభ్యం పొందేందుకు అవకాశాల కల్పన వంటి ప్రతిపాదనలు పాలసీ నిర్ణయాల్లో ఉన్నాయి. కరోనాతో కష్టాలే.. కరోనా వైరస్ విస్తరిస్తుండడం, దీనిపై నెలకొన్న అస్పష్టత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) దేశ ఆర్థిక వ్యవస్థను క్షీణబాటలోకి తీసుకువెళుతుందని భావిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థలో రికవరీ జాడలు కనిపిస్తున్నా... కోవిడ్–19 ప్రభావం దీనిని అనిశ్చితి వాతావరణంలోకి నెడుతోంది. వృద్ధి అవుట్‌లుక్ చూస్తే, ఖరీఫ్ సాగు పురోగతి బాగుంది. అందువల్ల స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం కొంత పురోగతి కనబరుస్తుందని భావిస్తున్నాం. ఇక తయారీ సంస్థల విషయానికి వస్తే, ఫార్మా మినహా అన్ని తయారీ సబ్–సెక్టార్లూ ప్రస్తుతానికి ప్రతికూలతలోనే ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి పరిస్థితిలో కొంత పురోగతి లభించవచ్చు. నిర్మాణ రంగం మెరుగుపడాల్సి ఉంది. సేవల రంగం విషయానికి వస్తే, మే, జూ¯Œ లలో కొంత రికవరీ ఉన్నా... గత ఏడాది స్థాయికన్నా ఎంతో దిగువనే ఆయా సూచీలు కదలాడుతున్నాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణతలోనే కొనసాగుతున్నాయి. దేశీయ ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్, రవాణా క్షీణతలోనే ఉన్నాయి. ఆర్బీఐ సర్వే ప్రకారం, వినియోగదారువైపు నుంచి చూస్తే, జూలైలో ఇంకా వినియోగ విశ్వాసం ప్రతికూలతలోనే ఉంది. అంతర్జాతీయ డిమాండ్ కూడా అంతంతమాత్రంగానే కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందగమన పరిస్థితులు, వాణిజ్య క్షీణత వంటి అంశాలు నెలకొని ఉన్నాయి. పరపతి విధాన కమిటీ అంచనా ప్రకారం, ప్రపంచ ఆర్థిక క్రియాశీలత ఇంకా బలహీనంగానే ఉంది. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలు పటిష్టంగా ఉన్నాయి. తగిన ద్రవ్యపరమైన చర్యలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ చర్యలు కొనసాగుతాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం లక్ష్యాలను మీరకుండా తగిన చర్యలు ఉంటాయి. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ వివేకవంతమైన నిర్ణయం ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బ ణం, డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ వివేకవంతమైన నిర్ణయం తీసుకుంది. రుణ పునర్‌వ్యవస్థీకరణపరమైన ఊరట చర్యలను తగు రక్షణాత్మక విధానాలతో .. భారీ కార్పొరేట్లు, ఎస్ఎంఈలు, వ్యక్తిగత రుణగ్రహీతలకు కూడా వర్తింపచేయడం స్వాగతించతగ్గది. – రజనీష్ కుమార్, చైర్మన్, ఎస్బీఐ లిక్విడిటీ బాగున్న నేపథ్యం... ఇప్పటికే రెపో రేటును గణనీయంగా తగ్గించేయడం వల్ల లిక్విడిటీ పెరిగిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా సమీక్షలో పాలసీ రేటును యథాతథంగా ఉంచడాన్ని అర్థం చేసుకోవచ్చు. – ఉదయ్ కొటక్, ప్రెసిడెంట్, సీఐఐ రుణ పునర్వ్యవస్థీకరణ హర్షణీయం ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ, కేవీ కామత్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు తదితర అంశాలు స్వాగతిస్తున్నాం. వీటి అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. – సంగీతా రెడ్డి, ప్రెసిడెంట్, ఫిక్కీ కుటుంబాలకు ఊరట రుణాల పునర్వ్యవస్థీకరణను ప్రకటించడంతో పాటు ఈ క్రమంలో బ్యాంకర్లకు కూడా తోడ్పాటునిచ్చేటటు వంటి చర్యలతో ఆర్బీఐ పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించింది. బంగారం రుణాలపై పరిమితి పెంచడం వల్ల ఆదాయాలు నష్టపోయి తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు గణనీయంగా ఊరట లభించగలదు. – దీపక్ సూద్, సెక్రటరీ జనరల్, అసోచాం రేటు ప్రయోజనం బదలాయించాలి... గడిచిన నాలుగు నెలలుగా రెపో రేటును ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలి. – డీకే అగర్వాల్, ప్రెసిడెంట్, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. -
మరో 3 నెలలు... వాయిదా!
ముంబై: కరోనా వైరస్ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్డౌన్ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి. ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రుణగ్రహీతలపై పన్నీరు లాక్‌డౌన్‌ను చాలా వరకు సడలించినప్పడికీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి ఎంతో సమయం పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపులపై మే వరకు ఇచ్చిన మారటోరియం (తాత్కాలిక విరామం)ను మరో 3 నెలల పాటు.. ఈ ఏడాది ఆగస్టు చివరి వరకు ఆర్బీఐ పొడిగించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలు, కోఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్‌కార్డు సంస్థలు జారీ చేసిన రుణాలకు ఇది అమలవుతుంది. కాకపోతే మారటోరియంను మే తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆయా సంస్థల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మారటోరియం కాలంలో చేయాల్సిన చెల్లింపులు తర్వాతి కాలంలో అసలుకు కలుస్తాయి. దీనివల్ల రుణ చెల్లింపుల కాల వ్యవధి పెరుగుతుంది. కంపెనీలకు మూలధన అవసరాకు ఇచ్చిన క్యాష్ క్రెడిట్/ఓవర్ డ్రాఫ్ట్‌లకు కూడా 3 నెలల మారటోరియం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. వృద్ధి ప్రతికూలం.. అంచనాల కంటే కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయపడింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రతికూల దిశలోనే (జీడీపీ వృద్ధి క్షీణత) ప్రయాణించొచ్చని పేర్కొంది. కాకపోతే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్–మార్చి)లో వృద్ధి పుంజుకోవచ్చన్నారు. డిమాండ్ క్షీణత, సరఫరా వ్యవస్థలో అవరోధాలు కలసి 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధిని తగ్గించేస్తాయని.. క్రమంగా ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం, ద్రవ్య, పరపతి, పాలనాపరమైన చర్యల వల్ల వృద్ధి రేటు రెటు ఆర్థిక సంవత్సరం ద్విదీయ అర్ధ భాగంలో క్రమంగా పుంజుకోవచ్చని చెప్పారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అగ్రగామి రాష్ట్రాలు రెడ్/ఆరెంజ్ జోన్లోనే ఉన్నాయని ఎంపీసీ పేర్కొంది. కార్పొరేట్ గ్రూపులకు మరిన్ని రుణాలు ఒక కార్పొరేట్ గ్రూపునకు ఒక బ్యాంకు ఇచ్చే రుణ పరిమితిని 25 శాతం నుంచి 30 శాతానికి ఆర్బీఐ పెంచింది. దీనివల్ల కార్పొరేట్ కంపెనీలకు ఒకే బ్యాంకు పరిధిలో మరింత రుణ వితరణకు వీలు కలుగుతుంది. డెట్, ఇతర క్యాపిటల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నిధులు సమీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.15 వేల కోట్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు)కు 15,000 కోట్ల క్రెడిట్లైన్ (అదనపు రుణం) సదుపాయాన్ని (90 రోజులకు) ఆర్బీఐ ప్రకటించింది. ‘‘ఎగ్జిమ్ బ్యాంకు తన కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీపై ఆధారపడుతుంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా నిధులు సమీకరించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుక నిధుల సదుపాయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్బీఐ పేర్కొంది. రాష్ట్రాలకు మరో 13 వేల కోట్లు కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్ (సీఎస్ఎఫ్) నుంచి రాష్ట్రాలు మరిన్ని నిధులను తీసుకునేందుకు వీలుగా ఆర్బీఐ నిబంధనలను సడలించింది. దీనివల్ల రాష్ట్రాలకు మరో రూ.13 వేల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయి. రుణాలకు చెల్లింపులు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్బీఐ వద్ద సీఎస్‌ఎఫ్‌ను నిర్వహిస్తుంటాయి. ద్రవ్యోల్బణంపై అస్పష్టత కరోనా మహమ్మారి కారణంగా ద్రవ్యోల్బణ గమనంపై తీవ్ర అస్పష్టత ఉందన్న అభిప్రాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. పప్పు ధాన్యాల ధరల పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను తగ్గించేందుకు దిగుమతి సుంకాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. 2020–21 మొదటి ఆరు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే ఉండొచ్చంటూ.. ద్వితీయ ఆరు నెలల కాలంలో లక్షి్యత 4 శాతానికి దిగువకు రావొచ్చన్నారు. దివాలా చర్యలకు మరింత వ్యవధి ఇక మారటోరియం కాలానికి దివాలా చట్టంలోని నిబంధనల నుంచి ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. ఐబీసీ చట్టంలోని నిబంధనల కింద రుణ గ్రహీత సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. 30 రోజుల సమీక్షాకాలం, 180 రోజుల పరిష్కార కాలం ఉంటుంది. ఇవి మారటోరియం కాలం ముగిసిన తర్వాతే అమల్లోకి వస్తాయి. మరిన్ని నిర్ణయాలకు సదా సిద్ధం 2020 మార్చి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతిన్నట్టు సంకేతాలు తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ ఇక ముందూ చురుగ్గానే వ్యవహరిస్తుంది. అవసరం ఏర్పడితే భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల సాధనాలను, ఇటీవల తీసుకున్న విధంగా కొత్తవి సైతం అమలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ అసాధారణ నిర్ణయాలు ► మార్చి 3: కరోనా వైరస్ ప్రవేశంతో, పరిస్థితులు సమీక్షిస్తున్నామని, తగి న నిర్ణయాలకు సిద్ధమని ప్రకటన. ► మార్చి 27: రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధింపు. ► ఏప్రిల్ 3: రోజువారీ మనీ మార్కెట్ ట్రేడింగ్ వేళలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరిమితం చేసింది. ► ఏప్రిల్ 17: రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు. నాబార్డ్, సిడ్బి, నేషనల్హౌసింగ్ బ్యాంకులకు రూ.50వేల కోట్ల నిధుల వెసులుబాటు. 90 రోజుల్లోపు రుణ చెల్లింపుల్లేని ఖాతాలను ఎన్పీఏలుగా గుర్తించాలన్న నిబంధనల నుంచి మారటోరియం రుణాలకు మినహాయింపు. ► ఏప్రిల్ 27: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండడంతో (డెట్ ఫండ్స్‌కు సంబంధించి) వాటికి రూ.50వేల కోట్ల ప్రత్యేక విండోను (బ్యాంకుల ద్వారా) తీసుకొచ్చింది. ► మే 22: రెపో, రివర్స్ రెపో 40 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గింపు. మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు. ఇతర కీలక అంశాలు ► ఎగుమతులకు సంబంధించి ఇచ్చే రుణాల కాల వ్యవధిని ఏడాది నుంచి 15 నెలలకు ఎంపీసీ పొడిగించింది. ► దిగుమతులకు సంబంధించిన రెమిటెన్స్‌ల పూర్తికి సమయాన్ని 6 నెలల నుంచి 12 నెలలకు పొడిగించింది. ► 2020–21లో మే 15వరకు విదేశీ మారక నిల్వలు 9.2 బిలియన్ డాలర్లు పెరిగి 487 బిలియన్ డాలర్లకు చేరాయి. ► ఆరుగురు సభ్యులున్న ఎంపీసీలో గవర్నర్ దాస్ సహా ఐదుగురు 40 బేసిస్ పాయింట్లకు ఆమోదం తెలిపితే, చేతన్ ఘటే మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. ► రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ భేటీ వాస్తవానికి జూన్ 3–5 తేదీల మధ్య జరగాల్సి ఉంది. కాకపోతే తక్షణ అవసరాల నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 20–22 తేదీల మధ్య సమావేశమై నిర్ణయాలు తీసుకుంది. మారటోరియం తీసుకున్నది 20 శాతమే మా రుణ గ్రహీతల్లో 20 శాతం మందే మారటోరియం ఎంచుకున్నారు. వీరిలో అందరూ నిధుల సమస్యను ఎదుర్కోవడం లేదు. నగదును కాపాడుకునే వ్యూహాంలో భాగంగానే వారు మారటోరియం అవకాశాన్ని వినియోగించుకున్నారు నిధుల పరంగా ఎటువంటి సమస్యల్లేని వారు చెల్లింపులు చేయడమే మంచిది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ మరిన్ని చర్యలు... భవిష్యత్తు ఆర్థిక వృద్ధిపై ఎంతో అనిశ్చితి ఉందన్న అంచనాలు, ఆర్బీఐ సైతం జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల ధోరణిలో ఉం డొచ్చని అంగీకరిం చినందున.. ఆర్బీఐ, ప్రభుత్వం నుంచి ఇక ముందూ మరిన్ని మద్దతు చర్యలు అవసరం అవుతాయి. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ -
పావుశాతానికే ఉర్జిత్ మొగ్గు
♦ బ్యాంకులు ఇంకా ఎక్కువే తగ్గించొచ్చని అభిప్రాయం ♦ఎంపీసీ భేటీ మినిట్స్‌తో వెల్లడి ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల 1–2వ తేదీల్లో జరిగిన సమావేశంలో గవర్నర్ ఉర్జిత్ పటేల్ కేవలం 0.25 శాతం వరకే రేట్ల తగ్గింపు ఉండాలని తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. ఆహార ధాన్యాల ధరలు తక్కువగా ఉండడం అసాధారణమని, ఇవి పెరిగేందుకు ఒత్తిళ్లు ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన మోస్తరు రేట్ల కోతనే ఎంచుకున్నారు. నాటి సమావేశపు వివరాలు (మినిట్స్) తాజాగా వెల్లడయ్యాయి. ద్రవ్యోల్బణేతర వృద్ధికి పాలసీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కచ్చితంగా బదిలీ చేయడం ఎంతో ముఖ్యమని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. బ్యాంకులకు ఇప్పటికీ రేట్లు తగ్గించేందుకు అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఎంపీసీ సమావేశంలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా కీలకమైన రెపో, రివర్స్ రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. ఆరుగురు సభ్యులకు గాను నలుగురు పావు శాతం తగ్గింపునకు ఓటేయగా, ఒకరు అర శాతం తగ్గింపునకు అనుకూలంగా ఉన్నారు. మరొకరు తటస్థంగా ఉండిపోయారు. అయితే, పారిశ్రామిక, ఇతర వర్గాలు ఇంతకంటే ఎక్కువ తగ్గింపునే ఆశించాయి. ఇటీవలి కాలంలో ఆహార విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, సాధారణ వర్షాలే ఉన్నప్పటికీ ఈ విషయంలో మరింత సమాచారం అవసరమని పటేల్ అభిప్రాయపడ్డారు. రుణాల వృద్ధి కూడా తక్కువగా ఉండడానికి, మొండి బకాయిల ఒత్తిడే కారణమన్నారు. రుణ వృద్ధికి, పెట్టుబడుల పురోగతికి ఒత్తిడితో కూడిన బ్యాంకుల బ్యాలన్స్ షీట్లకు పరిష్కారం కనుగొనడం కీలకమైన అంశంగా పేర్కొన్నారు. -
రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధాన సమీక్ష నేడు
న్యూఢిల్లీ: నేటికీ అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే వ్యూహంతో రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశముంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై స్థూల ఆర్థిక స్థితిగతులపై చర్చించారని తెలిసింది. గత ఏప్రిల్ 1న నిర్వహించిన ద్రవ్య విధాన సమీక్షలో పాలసీ రేటును 8 శాతంగా కొనసాగించారు. ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8 శాతానికిపైగా ఉండడం ఇందుకు ముఖ్యకారణం. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 9.66 శాతం, రిటైల్ ద్రవ్యోల్బణం 8.59 శాతంగా నమోదయ్యాయి. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్బీఐ తొలి ద్రవ్య విధాన సమీక్ష నేడు జరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసి, ఆర్థిక ప్రగతిని పునరుద్ధరించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్ పోస్టింగ్‌లో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.7 శాతంగా ఉంది. మోడీ సారథ్యంలో సుస్థిర ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినందువల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పారిశ్రామికవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చకపోవచ్చని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా సీనియర్ ఎకనామిస్ట్ అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండడంతో పాటు వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉండడంతో కీలక వడ్డీ రేట్లలో యథాతథ స్థితిని రిజర్వు బ్యాంకు కొనసాగించవచ్చని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి కీలక రెపో రేటును మూడు సార్లు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేస్తూనే వృద్ధిని ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంకు యత్నిస్తోందని గత వారం జైట్లీని కలసిన అనంతరం రాజన్ చెప్పారు. -
ప్రతిభకు పట్టం... రాజన్ నియామకం
అస్తానా/న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా రఘురామ్ జీ రాజన్ నియామకం ప్రతిభాపాటవాలకు పట్టంఅని ఆర్థికమంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. ఆయన నియమకాన్ని కొత్త ప్రభుత్వం గౌరవించాలని కూడా అన్నారు. కజికిస్తాన్ రాజధాని అస్తానాలో జరుగుతున్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశాల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి చిదంబరం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ కామెంట్ చేశారు. రాజన్ ఆర్థిక విధానాలను కొందరు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని, ఒకవేళ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమే అధికారంలోనికి వస్తే- ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ కొనసాగడాన్ని ఇష్టపడకపోవచ్చని పుకార్లు వెలువడిన నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజన్ ఏమన్నారంటే...: గవర్నర్‌గా తనను తొలగించే అవకాశం ఉందన్న పుకార్లు షికార్లపై రాజన్ ఇప్పటికే కామెంట్ చేశారు. బీజేపీతో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు మీడియా సృష్టి మాత్రమేనని ఆయన అన్నారు. సెప్టెంబర్ 4న ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్, తన ఎనిమిది నెలల కాలంలో ద్రవ్యోల్బణం కారణంగా చూపెడుతూ, కీలక పాలసీ రేటు-రెపోను పావుశాతం చొప్పున మూడుసార్లు పెంచారు. రాజన్‌కు అనుకూలంగా బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా ఇప్పటికే ఒక ప్రకటన చేయడం ఈ అంశానికి సంబంధించి మరో కోణం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా తనకు సాధ్యపడితే రాజన్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించేందుకే మొగ్గు చూపుతానని ఆయన శనివారం పేర్కొన్నారు. రాజన్ మంచి గవర్నర్‌గా నిరూపించుకున్నారని, ఆ పదవిలో ఆయన కొనసాగాలన్నది తన అభిప్రాయమని పేర్కొన్నారు. -
బ్యాంకింగ్‌లో సంస్కరణల మోత!
వాషింగ్టన్: బ్యాంకింగ్ రంగంలో త్వరలో భారీ సంస్కరణలను తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. విదేశీ బ్యాంకులు భారత్‌లోకి పెద్దయెత్తున ప్రవేశించేందుకు వీలవడంతోపాటు దేశీ బ్యాంకులను కొనుగోలు చేసేందుకు కూడా దోహదం చేసేలా ఈ సంస్కరణలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ నిర్వహించిన కార్యక్రమంలో రాజన్ మాట్లాడారు. భారత్‌లోకి విదేశీ బ్యాంకుల ప్రవేశానికి సంబంధించి విధానపరమైన కార్యాచరణను వచ్చే కొద్దివారాల్లో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. విదేశీ బ్యాంకులకు కూడా దాదాపు దేశీ బ్యాంకుల స్థాయిలోనే అనుమతులు ఇస్తామని, అయితే ఇందుకు రెండు షరతులు వర్తిస్తాయని రాజన్ పేర్కొన్నారు. ‘విదేశీ బ్యాంకులకు భారత్ ఏవిధంగా అనుమతులు ఇస్తుందో.. అదేవిధంగా ఆయా దేశాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఇక రెండోది... ఏదైనా విదేశీ బ్యాంక్ భారత్‌లో బ్రాంచ్‌ల ఏర్పాటు రూట్, అనుబంధ సంస్థ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు... రెండింటిలో ఏదోఒక విధానాన్నే ఎంచుకోవాలి. నియంత్రణ ప్రక్రియ సరళీకరణ, పారదర్శకతే మా ఉద్దేశం’ అని రాజన్ వివరించారు. పరపతి విధానానికి ధరలే ప్రాతిపదిక... ఆర్బీఐ సాధారణ పరపతి విధాన సమీక్షలో ఎప్పుడూ ధరల పరిస్థితినే పరిగణనలోకి తీసుకుంటామని రాజన్ చెప్పారు. ఈ నెల 29న ఆర్బీఐ రెండో త్రైమాసిక పాలసీ సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అమెరికా షట్డౌన్పై..: అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్)పై స్పందిస్తూ... అక్కడి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేంత పరిస్థితులేవీ లేవని రాజన్ అభిప్రాయపడ్డారు. అక్కడి ఎకానమీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, యూఎస్ బాండ్(ట్రెజరీ బిల్స్)లలో భారత్ పెట్టుబడులను(దాదాపు 59.1 బిలియన్ డాలర్లు) విక్రయించే అవకాశమే లేదన్నారు. నేనేమీ సూపర్‌మేన్‌ను కాదు ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంపై ప్రపంచవ్యాప్తంగా మీడియా వ్యాఖ్యానాలపై రాజన్ తనదైన శైలిలో స్పందించారు. ‘నా కొత్త బాధ్యతలపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కొంత అమితోత్సాహం నెలకొంది. నాపై అంచనాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి. అయితే, నేనేమీ సూపర్‌మేన్‌ను కాదని మీకు స్పష్టం చేయదలచుకున్నా’ అన్నారు. రాజన్‌ను మీడియా ‘రాక్‌స్టార్’గా అభివర్ణించడం తెలిసిందే. -
రాజన్.. వడ్డించెన్!
ఎవరుకొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో... అన్నట్లు ఆర్బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా వస్తూవస్తూనే షాకిచ్చారు. అందరి అంచనాలూ తలకిందులు చేస్తూ అటు కార్పొరేట్లు, ఇటు సామాన్యులపై కూడా వడ్డీరేట్ల పిడుగు వేశారు. వడ్డీరేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం ఎంతగా గొంతుచించుకున్నప్పటికీ తొలి పాలసీ సమీక్షలోనే తన రూటే సెప‘రేటు’ అని నిరూపించారు. కీలకమైన రెపో రేటును పావు శాతం పెంచుతూ రాజన్ నిర్ణయం తీసుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు అడ్డుకట్టవేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టీకరించారు. దీంతో కార్పొరేట్, గృహ, వాహన రుణాలన్నింటిపైనా వడ్డీరేట్లు మరింత ఎగబాకనున్నాయి. రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) గుదిబండగా మారనున్నాయి. ముంబై: అంచనాలకు అందనిరీతిలో ఆర్బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం చేపట్టిన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది ఇప్పుడున్న 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. గడచిన రెండేళ్లలో రెపో పెంపు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం అంటే.. 2011 ఆక్టోబర్‌లో చివరిసారిగా రెపో రేటు పావు శాతం పెరిగింది (8.5 శాతానికి). ధరల పెరుగుదల ఆందోళనలు, దీనికితోడు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయిన నేపథ్యంలో రాజన్ కఠిన పాలసీకే కట్టుబడ్డారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, రెపో పెంపుతో దీనితో ముడిపడిఉన్న రివర్స్ రెపో కూడా పావు శాతం పెరిగి.. 6.5 శాతానికి చేరింది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని రాజన్ ముట్టుకోలేదు. ఇప్పుడున్నట్లుగానే 4 శాతాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడిన తక్షణం బ్యాంకర్లు కూడా వడ్డీరేట్ల పెంపు పల్లవి అందుకున్నారు. పండుగ సీజన్లో రుణాలు, ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) డిమాండ్లు పెరగనున్న నేపథ్యంలో డిపాజిట్, రుణ రేట్లు ఎగబాకుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి వ్యాఖ్యానించారు. కాగా, ఆర్బీఐ చర్యపై కార్పొరేట్లు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. దువ్వూరి బాటలోనే... ధరల కట్టడిపై అలుపెరుగని పోరు జరిపిన మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి కూడా చాలావరకూ కఠిన పాలసీనే అనుసరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్లను పక్కనబెడుతూ దువ్వూరి గడచిన రెండు సమీక్షల్లో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు రాజన్ కూడా దువ్వూరి బాటలో నడవడమే కాకుండా ఆయనకంటే మరింత కఠినంగా వ్యవహరించడం గమనార్హం.ఏకంగా రెపో రేటును పెంచడం అటు కార్పొరేట్లు ఇటు మార్కెట్ వర్గాలను నిశ్చేష్టుల్ని చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా శుక్రవారం కుప్పకూలాయి. వాస్తవానికి పాలసీ రేట్లను తగ్గించకపోయినా... కనీసం యథాతథంగానైనా ఉంచుతారని కార్పొరేట్లు, విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆర్బీఐ పాలసీ సడలింపునకు ఆస్కారం ఉందనే వాదనలు వెల్లువెత్తాయి. దీనికి పూర్తి భిన్నంగా ఆర్బీఐ చర్యలు వెలువడటంతో అందరూ అవాక్కయ్యారు. ద్రవ్యసరఫరాపై స్పల్ప ఊరట... బ్యాంకులపై రెపో రేటు భారాన్ని తగ్గించే విధంగా రాజన్ లిక్విడిటీ పెంచేవిధంగా కొద్దిగా ఊరటనిచ్చారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్ఎఫ్) రేటును ముప్పావు శాతం తగ్గించి 9.75 శాతానికి పరిమితం చేశారు. అదేవిధంగా సీఆర్ఆర్లో బ్యాంకులు రోజువారీ అవసరాలకు వినియోగించే నిధులను కూడా కొద్దిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, రూపాయి పతనం చికిత్స కోసం ద్రవ్య సరఫరా కట్టడిలో భాగంగా ఆర్బీఐ ఈ ఏడాది జూలైలో బ్యాంక్ రేటు, ఎంఎస్‌ఎఫ్‌లను చెరో రెండు శాతం పెంచి 10.25 శాతానికి చేర్చింది. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత భారంగా మారింది. బ్యాంకులకు ద్రవ్యసరఫరా కొరత భారీగా తలెత్తినప్పుడు అధిక వడ్డీరేటుకు ఆర్బీఐ నుంచి నిధులను తీసుకోవడం కోసం ఎంఎస్ఎఫ్ను ఆర్బీఐ 2011-12లో కొత్తగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. కాగా, ఎంఎస్ఎఫ్ తగ్గింపువల్ల రెపో పెంపు ప్రభావం ఉండకపోవచ్చని రాజన్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా బ్యాంకులు తమ నిధుల సమీకరణ వ్యయాలను దృష్టిలోపెట్టుకొని వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవాలేతప్ప.. భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయని తాను భావించడం లేదని కూడా రాజన్ పేర్కొన్నారు. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 9.52 శాతంగా నమోదుకాగా.. టోకు ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి (6.1 శాతం) ఎగబాకడం తెలిసిందే. ముఖ్యంగా నిత్యావసరాలు, ఆహారోత్పత్తుల ధరలు తీవ్రస్థాయికి దూసుకెళ్తుండటం ఆర్బీఐ పాలసీ సడలింపునకు అడ్డంకిగా మారింది. పాలసీలో ఇతర ముఖ్యాంశాలివీ... ద్రవ్యోల్బణం రిస్క్‌లు పొంచి ఉన్నాయి. గత అంచనాలతో పోలిస్తే ఈ ఏడాది చివరికల్లా ద్రవ్యోల్బణం పెరగవచ్చు. మౌలికరంగ ప్రాజెక్టుల నిర్మాణం చాలా మందకొడిగా ఉంది. కొత్త ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కడం లేదు. మెరుగైన రుతుపవనాలు, వర్షాలు బాగుండటంతో ఖరీఫ్ సీజన్లో వ్యవసాయోత్పత్తి పుంజుకోనుంది. దీంతో మొత్తం జీడీపీ వృద్ధికి కాస్త చేదోడుగా నిలవొచ్చు. ఎగుమతులు మెరుగుపడుతుండటం కూడా సానుకూలాంశం. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా కాస్త శాంతించే అవకాశాలున్నాయి. గతేడాది క్యాడ్ రికార్డు స్థాయిలో 4.8 శాతానికి(88.8 బిలియన్ డాలర్లు) ఎగబాకడం తెలిసిందే. దీన్ని ఈ ఏడాది 3.7 శాతానికి(70 బిలియన్ డాలర్లు) కట్టడి చేయాలనేది కేంద్రం లక్ష్యం. తదుపరి పాలసీ సమీక్ష అక్టోబర్ 29న ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడే ముఖ్యం: రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పనిచేస్తుందని రఘురామ్ రాజన్ స్పష్టీకరించారు. తన తొలిపాలసీ సమీక్షలో రెపో రేటు పెంపును సమర్థించుకున్నారు. ద్రవ్యసరఫరా మెరుగుపరిచే చర్యలతోపాటు రెపో రేటు పెంచడం అనేది వృద్ధికి చేయూతనిచ్చేదేనని రాజన్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి పరిమితం చేయడమే మా ప్రధాన కర్తవ్యం. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు రెండూ కీలకమే. భవిష్యత్తులో వీటిపైనే పాలసీ ఆధారపడిఉంటుంది. అయితే, వృద్ధి మందగమనంపైనా ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. రెపో పెంపు వల్ల వృద్ధిపైన ప్రభావం పట్ల అప్రమత్తంగానే ఉన్నాం. అయితే కొన్నిసార్లు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం వల్ల కూడావృద్ధికి చేయూత లభించవచ్చు. రెపో, ఎంఎస్ఎఫ్ల మధ్య వ్యత్యాసాన్ని క్రమంగా 1 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది(ప్రస్తుతం ఈ వ్యత్యాసం 2%). తాజా సమీక్షలో ద్రవ్యసరఫరాను మెరుగుపరచడం వల్ల బ్యాంకులకు నిధుల సమీకరణ భారం కొంత తగ్గుతుంది. అమెరికా సహాయ ప్యాకేజీ కోతపై భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభావం మనపై పడకుండా పటిష్టమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఫెడ్ దీన్ని వాయిదా మాత్రమే వేసింది. రానున్న రోజుల్లో ఎప్పుడైనా ప్యాకేజీల కోత మొదలవుతుంది. ఇది జరిగే సమయానికి తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉండేవిధంగా మనం సర్వ సన్నద్ధంగా ఉండాలి. ముందే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. రూపాయి పతనం నేపథ్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీల డాలర్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయం(విండో) శాశ్వతమేమీ కాదు. రూపాయి విలువ స్థిరీకరణ జరిగితే దీన్ని కూడా క్రమంగా సడలిస్తాం. డాలరుతో రూపాయి మారకం విలువలో ఇటీవలి రికవరీ కాస్త మంచి పరిణామమే. కరెన్సీ కదలికలను అత్యంత నిశితంగా గమనిస్తున్నాం. ఇంకా స్థిరీకరణ రావాల్సి ఉంది.