పదోసారి స్థిరంగానే కీలక వడ్డీరేట్లు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను ఈసారీ యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా పదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతం రెపోరేటునే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుతున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ సమావేశంలోని ముఖ్యాంశాలను దాస్ వెల్లడించారు.
రూపాయి విలువలో ఎక్కువ ఒడిదొడుకులు ఉండకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది.
ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం.
ఎన్‌బీఎఫ్‌సీలు రిస్క్ మేనేజ్‌మెంట్ లేకుండా వృద్ధిని కొనసాగిస్తున్నాయి.
సెప్టెంబరులో సీపీఐ గణనీయంగా పెరగవచ్చు.
ద్రవ్యోల్బణం:
> సీపీఐ ద్రవ్యోల్బణం క్యూ2లో 4.1%గా ఉంటుందని అంచనా.
> క్యూ3లో 4.8 శాతానికి పెరగొచ్చు.
> క్యూ4లో 4.2 శాతంగా ఉండవచ్చు.
> క్యూ1 2026 ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతంగా ఉండబోతుంది.2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది.
జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని అంచనా.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 6.7 శాతం పెరిగింది.
కూ1లో జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతంగా ఉంది.
యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు.
‘యూపీఐ 123పే’ ఐవీఆర్ ఆధారిత లావాదేవీలను రూ.5000 నుంచి రూ.10000కు పెంచారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయానికి కారణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్‌బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు గతంలో గవర్నర్ పలు సమావేశాల్లో స్పష్టంగా అందించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్‌లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!
2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అందుకు అనువుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కీలక వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని సూచిస్తోంది. కానీ దీనివల్ల ఆర్‌బీఐ పనితీరుపై ప్రజలకు విశ్వాసం కోల్పోతుందని ఇటీవల రఘురామ్‌రాజన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment