![strong possibility that the Reserve Bank of India might cut interest rates soon](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/9/rbi01.jpg.webp?itok=WCWemCcG)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరగబోయే ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లలో కోత విధిస్తారని పరిశ్రమల సంఘం సీఐఐ అంచనా వేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(US Fed) యూఎస్‌లో వడ్డీరేట్లను తగ్గించింది. ఈ తరుణంలో భారత్‌లోనూ వడ్డీరేట్లను తగ్గించాలనే డిమాండ్ ఉంది.
భారత వృద్ధికి ఊతమిచ్చేందుకు వచ్చే ఆర్‌బీఐ మానిటరీ సమావేశంలో వడ్డీరేట్ల కోత ఉండే అవకాశం ఉందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అన్నారు. కార్మికుల అవసరం అధికంగా ఉండే రంగాల్లో ఉద్యోగ కల్పన ఉండవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. దానివల్ల భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడుతాయని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 5-7 తేదీల్లో ఆర్‌బీఐ ఎంపీసీ(MPC) సమావేశం జరగనుంది. చైనా వంటి దేశాల నుంచి భారీగా వస్తువులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో యాండీ డంపింగ్ డ్యూటీని పెంచే యోచనలో ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉక్కు, పేపర్‌బోర్డు, రసాయనాలు, పాలిమర్స్ వంటి ప్రత్యేక రంగాలకు దీనిని అమలు చేయబోతున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరిక
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఎంపీసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఆర్‌బీఐ దేశంలో పెట్టుబడులు పెంచేలా నిర్ణయం తీసుకోవాలి. అందులో భాగంగా వడ్డీరేట్లను తగ్గించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment