‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరిక | Due to violations of regulations Ola Electric issued a stern warning by SEBI | Sakshi
Sakshi News home page

‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరిక

Published Wed, Jan 8 2025 2:13 PM | Last Updated on Wed, Jan 8 2025 3:14 PM

Due to violations of regulations Ola Electric issued a stern warning by SEBI

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) హెచ్చరిక లేఖ జారీ చేసింది. సెబీకి ముందస్తు సమాచారం లేకుండా భవిష్‌ అగర్వాల్‌ తన ఎక్స్‌ వేదికలోనే కంపెనీకి చెందిన కీలక సమాచారాన్ని పంచుకున్నారని లేఖలో తెలిపింది.

భవిష్‌ అగర్వాల్ డిసెంబర్ 2, 2024న కంపెనీ స్టోర్ల సంఖ్యను నెలలో 800 నుంచి 4,000కు విస్తరించాలనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. ఉదయం 9:58 సమయంలో ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. అయితే, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు మాత్రం మధ్యాహ్నం 1:36 గంటలకు, 1:41 గంటలకు సమాచారాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం.

ముందు ఎక్స్‌లో.. తర్వాత ఎక్స్చేంజీలకు..

సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్‌ ఆవశ్యకతలు) రెగ్యులేషన్స్, 2015 నిబంధనలను ఓలా ఉల్లంఘించినట్లు హెచ్చరిక లేఖలో సెబీ తెలియజేసింది. సోషల్ మీడియా ప్రకటనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడిదారులందరికీ ఏకకాలంలో, నియమాల ప్రకారం సకాలంలో సమాచారాన్ని అందించడంలో ఓలా ఎలక్ట్రిక్ విఫలమైందని నొక్కి చెప్పింది. మార్కెట్‌లో ఎలాంటి సమాచారాన్నైనా ముందుగా ఎక్స్చేంజీలకు తెలియజేయాలి. కానీ అందుకు విరుద్ధంగా భవిష్‌ అగర్వాల్‌ ముందుగా ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన తర్వాత రెగ్యులేటర్లకు సమాచారం అందించారు.

అనైతికంగా లాభాలు..

సామాజిక మాధ్యమాల్లో సీఈఓ స్థాయి వ్యక్తి ఏదైనా సమాచారాన్ని తెలియజేశాడంటే అది చూసిన పెట్టుబడిదారులు నమ్మి వెంటనే అందులో ఇన్వెస్ట్‌ చేసి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకొందరు ఇన్వెస్టర్లు అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూంటారు. అలా ముందుగా సమాచారం పొందిన వారు అనైతికంగా లాభాలు సంపాదించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రతి సమాచారాన్ని ఎక్స్చేంజీలకు తెలియజేయాలి.

ఇదీ చదవండి: ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ప్రోగ్రామ్‌ను నిలిపేసిన మెటా

‘మళ్లీ పునరావృతం అవ్వదు’

సెబీ హెచ్చరిక లేఖపై ఓలా ఎలక్ట్రిక్ స్పందిస్తూ.. సెబీ ప్రమాణాలను మెరుగుపరచడానికి కంపెనీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహిస్తామని తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలకు ప్రతి కంపెనీ కట్టుబడి ఉండాలని ఈ వ్యవహారం ద్వారా తెలుస్తుంది. కార్పొరేట్ సమాచారాన్ని పారదర్శకతతో నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని కొనసాగించేందుకు కంపెనీ కృషి చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement