ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి | kerala congress response on ola electric issue | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి

Published Tue, Oct 8 2024 12:12 PM | Last Updated on Tue, Oct 8 2024 12:12 PM

kerala congress response on ola electric issue

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్‌ 1, ఫేమ్‌ 2 ద్వారా అందించిన రాయితీలు దేశంలోని మొత్తం ప్రజల సొమ్మని కేరళ కాంగ్రెస్‌ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. ఇటీవల ఓలా వంటి ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీలు అందిస్తున్న సేవలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దాంతో కేరళ కాంగ్రెస్‌ స్పందించింది. ఈమేరకు తన ఎక్స్‌ ఖాతాలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీను ట్యాగ్‌ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది.

‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అయ్యే ఖర్చు భారత ప్రజలందరిది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, విక్రయాల పెంపునకు ప్రభుత్వం ఫేమ్‌ 1, ఫేమ్‌ 2 పథకాల ద్వారా రాయితీలిచ్చింది. మే 2023 కంటే ముందు విక్రయించిన ఓలా ఎస్‌1 ప్రో మోడల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్యాక్స్‌తో సహా రూ.1.16 లక్షలు రాయితీ అందించాయి. ఒక స్కూటర్‌కు ఇది భారీ రాయితీ. వినియోగదారులు, వారి భద్రత, సర్వీసును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందించిన రాయితీలు ఏమేరకు ప్రయోజనం కలిగించాయో ప్రభుత్వం తెలుసుకోవడం చాలాముఖ్యం’ అని తెలిపింది.

ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు

‘మన దేశాన్ని బ్రాండ్ ఇమేజ్ సమస్య వెంటాడుతోంది. చైనా చౌకైన, తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారీ చేస్తుందనే బ్రాండ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కొన్ని భారతీయ కంపెనీలు ఎలాంటి రెగ్యులేటర్ పరిశీలన లేకుండా కస్టమర్ భద్రతను విస్మరించి తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దాంతో దేశంలోని ఇతర బ్రాండ్‌లపై ప్రభావం పడుతోంది. అందువల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న నాణ్యమైన వాహనాలను ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంలో ‘చైనా బ్రాండ్‌’ ఇమేజ్‌నే మూటగట్టుకునే ప్రమాదముంది. కాబట్టి వాహనాల తయారీ, సర్వీసు అందించడంలో ప్రభుత్వం రెగ్యులేటర్‌గా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనదైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి’ అని కేరళ కాంగ్రెస్‌ పేర్కొంది.

ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్‌ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్‌ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్‌ పోస్టు’ అని అగర్వాల్‌ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement