
2025–26లో 2–3 శాతం
అమెరికా టారిఫ్‌లలో అనిశ్చితులు
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–3 శాతం వృద్ధికి (డాలర్ మారకంలో) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఐటీ సేవల రంగానికి స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. పరిశ్రమలో 60 శాతం ఆదాయం వాటా కలిగిన 15 ప్రముఖ ఐటీ కంపెనీలను విశ్లేషించి ఇక్రా ఈ వివరాలు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం ఆదాయంలో 2.9 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. అమెరికా టారిఫ్‌ల విధింపుతో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు కీలక మార్కెట్లలో కంపెనీల ఐటీ బడ్జెట్‌లపై ప్రభావం చూపిస్తాయని ఇక్రా తెలిపింది.
ఇటీవలి త్రైమాసికాల్లో కంపెనీల నిర్వహణ ఆదాయం కొంత కోలుకున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకోకపోవచ్చని పేర్కొంది. అమెరికా టారిఫ్‌లనే ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘భారత ఐటీ సేవల ఆదాయంలో 80–90 శాతం వాటాతో యూఎస్, యూరప్ కీలక మార్కెట్లుగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వృద్ధి 2024–25లో మోస్తరుగా మారింది. తుది త్రైమాసికంలో కొంత క్షీణత కనిపించింది. 2025–26 మొదటి త్రైమాసికం అంచనాలపై అప్రమత్తత నెలకొంది. అమెరికా టారిఫ్‌లపై ఏర్పడిన అనిశ్చితులు ఐటీ వ్యయాలను నియంత్రిస్తున్నాయి. ఇది పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా వివరించింది.
నియామకాలూ తక్కువే..
డిమాండ్ మెరుగుపడేంత వరకు ఐటీ రంగంలో నియామకాలు తక్కువగానే ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. ఏఐ, జెనరేటివ్ ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీలను కంపెనీలు అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో.. నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం భవిష్యత్ నియామకాలను ప్రభావిం చేస్తుందనిని తెలిపింది. యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత ఐటీ సేవల రంగానికి వచ్చే ప్రయోజనాలను ప్రస్తావించింది. ఇందులో బ్రిటన్‌లో పనిచేసే తాత్కాలిక బారత ఐటీ ఉద్యోగులకు మూడేళ్ల పాటు సామాజిక భద్రతా ప్రయోజలను అందించే నిబంధన ఉండడాన్ని సానుకూలంగా పేర్కొంది.