
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్(work from home ).. ఆఫీస్ హాజరుకు (Return to office) సంబంధించిన కొత్త రూల్ జారీ చేసింది. తమ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు హాజరుకావాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు అవసరమయ్యే ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫోసిస్ స్పష్టత ఇచ్చింది.
ఉద్యోగుల్లో గందరగోళం
ఒక ఉద్యోగి నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుండి పనిచేయకపోతే "సిస్టమ్ ఇంటర్వెన్షన్"కు దారితీస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ పదం వాడకం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీసింది. ఏదైనా అత్యవసర కారణం లేదా ఉన్నతాధికారుల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే, అది యాప్‌లో నమోదు కాకపోతే తమ సెలవు కోతకు గురవుతుందని ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీ యాప్ పై స్పష్టత వచ్చింది.
మేనేజర్ అప్రూవల్ తప్పనిసరి
ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ హాజరును యాప్‌లో నమోదు చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) రిక్వెస్ట్‌లను ఈ యాప్ ఇకపై నేరుగా ఆమోదించదు. ఉద్యోగులు తప్పనిసరిగా తమ కార్యాలయంలో నెలకు 10 రోజులు హాజరు పంచ్ చేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది.
ఒక నెలలో అందుబాటులో ఉన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుల సంఖ్య, ఇప్పటికే ఉపయోగించిన రోజులు, అందుబాటులో ఉన్న రోజులను యాప్ చూపిస్తుంది. అదనపు డబ్ల్యూఎఫ్‌హెచ్ రోజులను మినహాయింపుగా చూపిస్తామని, వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్యోగి తన మేనేజర్‌కు అప్రూవల్ రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని యాప్‌లో అప్డేట్ చెబుతోంది.
దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో సుమారు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్‌ను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణను మేనేజర్లకు ఇవ్వడంపైనా ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
అమల్లోకి కొత్త హైబ్రిడ్ విధానం
ఇన్ఫోసిస్ కొత్త హైబ్రిడ్ విధానం మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకునే రోజుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు, నెలలో కనీసం 10 రోజులు లేదా వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుండి పనిచేయాలని కంపెనీ ఫంక్షనల్ హెడ్స్ గత వారం ఒక ఇ-మెయిల్లో ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కమ్యూనికేషన్ జాబ్ లెవల్ 5 (JL5) అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment