దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.
అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారి
సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్‌లను దాటవేశాయి.
క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్‌రాజ్కా తెలిపారు.
లాభం మెరుగు
రెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్‌సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా మార్జిన్‌లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.
వేతనాల్లో భారీ వ్యత్యాసం
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.
2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.
ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!
ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్‌లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.
ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment