business news
-
భారత్ బంగారం.. 882 టన్నులు
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అక్టోబర్‌లో 27 టన్నుల పసిడిని జోడించింది. దీనితో దేశం మొత్తం పసిడి నిల్వ 882 టన్నులకు చేరింది. ఇందులో భారత్‌లో 510 టన్నుల బంగారం నిల్వ ఉండగా, మిగిలిన పరిమాణాన్ని న్యూయార్క్, లండన్‌సహా మరికొన్ని చోట్ల ఉన్న గోల్డ్ వాల్ట్‌లలో రిజర్వ్ చేసింది.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ తాజా వివరాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో 60 టన్నులు జోడించడం విశేషం. కాగా, జనవరి నుంచి అక్టోబర్ వరకూ భారత్ మొత్తం 77 టన్నుల బంగారాన్ని సమకూర్చుకుంది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే ఆర్బీఐ బంగారం జోడింపు ఐదు రెట్లు పెరిగిందని డబ్ల్యూజీసీ తెలిపింది.భారత్ తర్వాత టర్కీ, పోలాండ్ సెంట్రల్ బ్యాంకులు అక్టోబర్‌లో వరుసగా 17, 8 టన్నుల బంగారాన్ని తమ నిల్వలకు జోడించాయి. జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఈ రెండు దేశాలూ వరుసగా 72, 69 టన్నులను తమ బంగారు నిల్వలకు జోడించి మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించాయని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
ఎంఎస్ఎంఈలకు సులభంగా రుణ వితరణ
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు పొందడంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కోరారు. ఎంఎస్ఎంఈలకు ప్రత్యామ్నాయ రుణ వితరణ నమూనాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పట్టణాల్లో ఎంఎస్ఎంఈలకు స్థలాలు కేటాయిస్తామన్నారు.‘‘బ్యాంకు రుణాల విషయంలో ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పండి. అధిక తనఖాలు కోరుతున్నాయా? ఎగుమతుల రుణ హామీ కార్పొరేషన్ (ఈసీజీసీ) ఉన్నప్పటికీ, బ్యాంక్‌లు తనఖా ఇవ్వాలని అడుగుతున్నాయా? ఎగుమతి రుణాల్లో వైఫల్యాలు ఎదురైతే 90 శాతం హామీ బాధ్యతను ఈసీజీసీ తీసుకుంటున్న తరుణంలో బ్యాంక్‌లు రుణాలపై ఎంత మేర వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి? అంశాల వారీ మరింత స్పష్టమైన సమాచారం పంచుకుంటే దాన్ని బ్యాంక్‌ల దృష్టికి తీసుకెళ్లగలం. ఇప్పటికీ బ్యాంక్‌లకు వెళ్లి రుణాలు తీసుకునేందుకుకే అధిక శాతం ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ రుణ నమూనా ఆలోచనల పట్ల అనుకూలంగా ఉన్నాం’’అని గోయల్ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా చెప్పారు. స్థలాలు కేటాయిస్తాం.. ఎంఎస్ఎంఈలు లేకుండా పెద్ద పరిశ్రమలు మనుగడ సాగించలేవని వాణిజ్య మంత్రి గోయల్ పేర్కొన్నారు. కనుక వాటికంటూ ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో షెంద్రాబిడ్కిన్ పారిశ్రామిక టౌన్షిప్లో టయోటా రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా సుమారు 100 ఎంఎస్ఎంఈల అవసరం ఉంటుంది’’అని వివరించారు. -
ఆర్సెడో సిస్టమ్స్‌తో సైయంట్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ సొల్యూషన్స్ అందించే ఆర్సెడో సిస్టమ్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సైయంట్ డీఎల్ఎం వెల్లడించింది. దీని ప్రకారం, సైయంట్ డీఎల్ఎంకి చెందిన మైసూర్ యూనిట్లో ఆర్సెడో 500 కేడబ్ల్యూపీ సామర్ద్యం గల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.ప్లాంటు డిజైన్, ఇంజినీరింగ్, ఇన్స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇందులో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను సైయంట్ డీఎల్ఎం కొనుగోలు చేస్తుంది. విద్యుత్ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునేందుకు, పర్యావరణ అనుకూల విధానాల వినియోగాన్ని పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సైయంట్ డీఎల్ఎం సీఈవో ఆంథోనీ మోంటల్బానో, ఆర్సెడో సిస్టమ్స్ సీఈవో సందీప్ వంగపల్లి తెలిపారు. -
ఐటీ ఉద్యోగ నియామకాల పరిస్థితి ఇదీ..
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు నవంబర్ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఎఫ్ఎంసీజీ రంగాల్లో నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ విడుదల చేసింది.నౌకరీ ప్లాట్‌ఫామ్‌పై వైట్‌కాలర్ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్ రంగంలో 7 శాతం, ఎఫ్ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం చొప్పున వైట్ కాలర్ నియామకాలు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ విభాగంలో 30 శాతం, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.ఐటీ రంగంలో వైట్ కాలర్ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నమోదైంది. పండుగల సీజన్ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్ ముందుంది. జైపూర్ 14 శాతం, ఉదయ్‌పూర్ 24 శాతం, కోటలో 15 శాతం వైట్ కాలర్ నియామకాలు పెరిగాయి. జైపూర్‌లో విదేశీ ఎంఎన్సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్‌లో 21 శాతం వృద్ధి కనిపించింది. -
హోండా అమేజ్ థర్డ్ జనరేషన్ వచ్చేసింది..
కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా మూడవ తరం అమేజ్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఎక్స్ షోరూమ్‌లో ధర రూ.7.99 లక్షల నుండి రూ.10.89 లక్షల వరకు ఉంది. ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో తయారైంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మారుతీ డిజైర్, హ్యుండై ఆరా వంటి మోడళ్లతో ఇది పోటీపడుతోంది.దేశంలో అడాస్ భద్రతా ఫీచర్లను కలిగిన అత్యంత సరసమైన కారు అమేజ్ అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర చెప్పారు.హోండా దేశంలో ఇప్పటివరకు 5.8 లక్షల యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించింది. అమేజ్ మొదటి తరం 2013లో, రెండవ తరం 2018లో ప్రవేశించింది. అమేజ్ కస్టమర్లలో 50% మంది మొదటిసారి కారును సొంతం చేసుకున్నవారేనని సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ పేర్కొన్నారు. 2027 నాటికి మరో మూడు మోడళ్లు హోండా 2027 మార్చి నాటికి భారత్‌లో మూడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బలంగా అభివృద్ధి చెందుతున్న ఎస్యూవీ విభాగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర తెలిపారు. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో ఎలివేట్ ఎస్‌యూవీతోపాటు సెడాన్స్ అయిన అమేజ్, సిటీ మోడళ్లను విక్రయిస్తోంది.2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్టు సుమూర తెలిపారు. తద్వారా ఎస్యూవీ విభాగంలో కంపెనీ ఉనికిని విస్తరిస్తుందని చెప్పా రు. భారతీయ మార్కెట్‌కు సరిపోయే హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వంటి మోడళ్లను హోండా అభివృద్ధి చేస్తూనే ఉందని వెల్లడించారు. -
ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌వో సొమ్ము!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్‌గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.ఏటీఎం తరహా కార్డుఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్‌కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
మారిన బంగారం ధరలు.. కొత్త మార్కుకు వెండి
Gold Price Today: దేశంలో క్రితం రోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 5) స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,400 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.77,890 లకు ఎగిసింది. చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,550 లకు చేరగా, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.78,040 లకు చేరింది.ఇదీ చదవండి: సిప్‌తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?మళ్లీ రూ.లక్ష దాటిన వెండిమరోవైపు వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా ఎగిశాయి. హైదరాబాద్‌లో వెండి కేజీకి రూ.1500 పెరగడంతో మళ్లీ రూ.లక్షను దాటింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
యూపీఐ లైట్ వాలెట్ పరిమితి పెంపు
యూపీఐ లైట్ వాలెట్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాలెట్ పరిమితిని రూ. 5,000కు, ఒక్కో లావాదేవీ పరిమితిని రూ. 1,000కి పెంచింది. ఇందుకు సంబంధించి 2022 జనవరిలో జారీ చేసిన ’ఆఫ్‌లైన్ ఫ్రేమ్‌వర్క్’ను సవరించింది. ప్రస్తుతం ఈ విధానంలో ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 500గా, మొత్తం వాలెట్ లిమిట్ రూ. 2,000గా ఉంది. గత అక్టోబర్‌లో ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో భాగంగా ఈ పరిమితులను సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న లేదా అందుబాటులో లేని పరిస్థితుల్లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేయగలిగే సాంకేతికతలను ఆర్బీఐ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.యూపీఐ పిన్ని ఉపయోగించకుండా తక్కువ-విలువ లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులను యూపీఐ లైట్ అనుమతిస్తుంది. ఇది రియల్ టైమ్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లపై ఆధారపడకుండా కస్టమర్-ఫ్రెండ్లీ విధానంలో పనిచేస్తుంది. దీని ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి, వ్యాపారులకు ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు. -
ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టేసిన బిట్‌కాయిన్
ప్రముఖ క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్ ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను కొట్టేసింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన పరిపాలన క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణాన్ని సృష్టిస్తుందనే అంచనాల క్రమంలో గురువారం మొదటిసారిగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు పైగా పెరిగింది.బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాదిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ఈ నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం ఎగిసింది. "మనం ఒక నమూనా మార్పును చూస్తున్నాం. నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రక్షాళన తర్వాత, బిట్‌కాయిన్‌తోపాటు మొత్తం డిజిటల్ అసెట్ ఎకోసిస్టమ్ ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి ప్రవేశించే అంచున ఉన్నాయి" అని యూఎస్ క్రిప్టో సంస్థ గెలాక్సీ డిజిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ అన్నారు."బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఫైనాన్స్, టెక్నాలజీ, జియోపాలిటిక్స్‌లో మారుతున్న ఆటుపోట్లకు ఇది నిదర్శనం" అని హాంకాంగ్‌కు చెందిన స్వతంత్ర క్రిప్టో విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ అన్నారు. చాలా కాలం క్రితం ఫాంటసీగా కొట్టేసిన ఈ ఫిగర్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు.ట్రంప్ తన ప్రచార సమయంలో డిజిటల్ అసెట్స్‌ను ప్రోత్సహిస్తామని, యునైటెడ్ స్టేట్స్ను "క్రిప్టో రాజధాని"గా చేస్తానని వాగ్దానం చేశారు. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. కాగా ప్రస్తుతం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న గ్యారీ జెన్స్లర్.. ట్రంప్ అధికారం చేపట్టాక జనవరిలో పదవీవిరమణ చేస్తానని గత వారం చెప్పారు. ఈ పదవికి ఎస్ఈసీ మాజీ కమిషనర్ పాల్ అట్కిన్స్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. -
ఆ బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష కోట్లు.. ఆర్బీఐ ఆదేశాలు
ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాల సంఖ్యను సత్వరమే తగ్గించుకోవాలని బ్యాంక్‌లను ఆర్బీఐ కోరింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇనాపరేటివ్ ఖాతాలకు సంబంధించి గణాంకాలను ప్రతీ త్రైమాసికానికి ఒకసారి ఆర్బీఐకి నివేదించాలని కోరింది.ఈ తరహా ఇనాపరేటివ్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉండిపోవడం పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సమస్యల కారణంగా ఖాతాలు నిరుపయోగంగా లేదా స్తంభించిపోయినట్టు తమ తనిఖీల్లో తెలిసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల సంఖ్య అధికంగా ఉండడం, వాటిల్లో నిధులు ఉండిపోవడాన్ని ఆర్బీఐ గుర్తించింది.దీంతో వాటిని తగ్గించుకోవాలని, సులభంగా యాక్టివేట్ చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని సైతం పరిశీలించాలని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 చివరి నాటికి ఇనాపరేటివ్ ఖాతాలలో రూ. లక్ష కోట్లకు పైగా డిపాజిట్లు స్తంభించాయి. వీటిలో రూ. 42,270 కోట్లు అన్‌క్లెయిమ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐలో అకౌంట్ ఉందా..?ప్రభుత్వరంగ ఎస్బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనార్హం. ఇక కస్టమర్లకు సంబంధించి ఆధార్ అప్డేటెషన్ సేవలను సైతం అందించాలని, ఆధార్ ఆధారిత సేవలకు వీలు కల్పించాలని బ్యాంక్‌లను ఆర్బీఐ కోరింది. ఇనాపరేటివ్ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేందుకు కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదించినప్పటికీ, పేరు ఇతర వివరాలు సరిపోకపోవడం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. -
ప్రతి 6 నిమిషాలకో కొత్త టెక్నాలజీ.. పేటెంట్ దరఖాస్తుల వెల్లువ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 92,000 పేటెంట్ దరఖాస్తులు నమోదయ్యాయి. ఇది సాంకేతిక, శాస్త్రీయ అభివృద్ధికి కేంద్రంగా భారత్‌లో పెరుగుతున్న పరిపక్వతను సూచిస్తుందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్స్ ఉన్నత్ పండిట్ తెలిపారు.ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ భారత్‌లో ఐపీ రక్షణను కోరుతోందని అసోచాం సదస్సులో చెప్పారు. మేధో సంపత్తి (ఐపీ) హక్కులకు సంబంధించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నామని, కొత్త నిబంధనల కోసం వివిధ వాటాదారుల నుండి అభిప్రాయాలను కోరుతున్నామని అన్నారు.‘వివిధ రంగాలలో ఐపీ రక్షణ కోసం రూపొందించిన మార్గదర్శకాలను పునరుద్ధరిస్తున్నాం. ఈ కసరత్తు జరుగుతోంది. అటువంటి మార్గదర్శకాల ప్రభావాన్ని మరింత బలోపేతం చేయడానికి పరిశ్రమ సంఘాలు, ఐపీ వాటాదారులు కూడా సహకారం అందించవచ్చు. శక్తివంతమైన మేధో సంపత్తి (ఐపీ) హక్కుల వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన ఐపీ ఫైలింగ్‌ల దిశగా మేము పని చేస్తున్నాం. మంజూరైన పేటెంట్లలో ఈ వేగవంతమైన పెరుగుదల దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో, ఐపీ హక్కులను మంజూరు చేయడంలో భారత పేటెంట్ కార్యాలయ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అనేక ఆవిష్కరణలతో దరఖాస్తుల నాణ్యత పెరగడాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోంది’ అని ఆయన అన్నారు. -
థాయ్‌లాండ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా థాయ్‌లాండ్‌లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్ మోటార్స్ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్ చేస్తారు.‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్‌లాండ్ అసెంబ్లీ ప్లాంట్ ఈ విజన్‌ను అందిస్తుంది’ అని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్కు ఇటువంటి అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్‌లాండ్‌లో మిడ్–సెగ్మెంట్ మార్కెట్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ సీసీవో యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్‌ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్‌లాండ్ మార్కెట్‌తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. -
250 కొత్త డీలర్‌షిప్‌లు.. ప్యూర్ ఈవీ విస్తరణ ప్రణాళిక
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ తన విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. సుస్థిర రవాణా కోసం వినూత్న పరిష్కారాలను పరిచయం చేస్తూ దేశవ్యాప్తంగా ఉనికిని పెంచుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తోంది.లాంగ్-రేంజ్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే 30 నెలల్లో 250 కొత్త డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దేశవ్యాప్తంగా తమ మొత్తం నెట్‌వర్క్‌ను 320కి పైగా పెంచుకోవాలని యోచిస్తోంది.నూతన ఆవిష్కరణలు, వాహనదారుల భద్రతకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ నిశాంత్ దొంగరి తెలిపారు. నానో పీసీఎం (ఫేజ్ చేంజ్ మెటీరియల్) టెక్నాలజీని బ్యాటరీ సిస్టమ్‌లలో ఉపయోగించిన మొదటి కంపెనీ తమదే అని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీతో ప్రమాదాల శాతం తగ్గడమే కాకుండా బ్యాటరీల సామర్థ్యం కూడా పెరిగిందంటున్నారు. -
మొబైల్ ముట్టుకుంటే ముప్పే!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ మాల్వేర్ దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా, కెనడాలను కూడా దాటేసింది. జీస్కేలర్ థ్రెట్‌ల్యాబ్జ్ రూపొందించిన ’మొబైల్, ఐవోటీ, ఓటీ థ్రెట్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది.2023 జూన్ నుంచి 2024 మే వరకు 2000 కోట్ల పైచిలుకు మాల్వేర్ ముప్పు సంబంధిత మొబైల్ లావాదేవీలు, ఇతరత్రా సైబర్ ముప్పుల గణాంకాలను విశ్లేషించిన మీదట ఈ రిపోర్ట్ రూపొందింది. ‘అంతర్జాతీయంగా మొబైల్ మాల్వేర్ దాడుల విషయంలో భారత్ టాప్ టార్గెట్‌గా మారింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత్ ఈసారి మొదటి స్థానానికి చేరింది. ఇలాంటి మొత్తం అటాక్స్‌లో 28 శాతం దాడులు భారత్ లక్ష్యంగా జరిగాయి. అమెరికా (27.3 శాతం), కెనడా (15.9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డిజిటల్ పరివర్తన వేగవంతమవుతుండటం, సైబర్ ముప్పులు పెరుగుతుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత సంస్థలు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తోంది‘ అని నివేదిక వివరించింది.గూగుల్ ప్లే స్టోర్‌లో 200 పైచిలుకు హానికారక యాప్స్‌ను గుర్తించినట్లు, ఐవోటీ మాల్వేర్ లావాదేవీలు వార్షికంగా 45 శాతం పెరిగినట్లు తెలిపింది. ఇది సైబర్ దాడుల ముప్పు తీవ్రతను తెలియజేస్తుందని వివరించింది. అత్యధికంగా సైబర్ దాడులకు గురవుతున్నప్పటికీ.. మాల్వేర్ ఆరిజిన్ పాయింట్ (ప్రారంభ స్థానం) విషయంలో మాత్రం భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అయిదో స్థానం నుంచి ఏడో స్థానానికి చేరింది.రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. మొబైల్ అటాక్స్‌లో సగభాగం ట్రోజన్ల రూపంలో (హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకుని, రన్ చేసేలా ప్రేరేపించే మోసపూరిత మాల్ వేర్) ఉంటున్నాయి. ఆర్థిక రంగంలో ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయి. బ్యాంకింగ్ మాల్వేర్ దాడులు 29% పెరగ్గా, మొబైల్ స్పైవేర్ దాడులు ఏకంగా 111% ఎగిశాయి. ఆర్థికంగా మోసగించే లక్ష్యంతో చేసే మాల్వేర్ దాడులు, మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్లాంటి (ఎంఎఫ్ఏ) వివిధ అంచెల భద్రతా వలయాలను కూడా ఛేదించే విధంగా ఉంటున్నాయి. వివిధ ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా సైట్లు, క్రిప్టో వాలెట్లకు సంబంధించి ఫేక్ లాగిన్ పేజీలను సృష్టించి సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి దిగ్గజ భారతీయ బ్యాంకుల మొబైల్ కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. అచ్చం సిసలైన బ్యాంకింగ్ వెబ్సైట్లను పోలి ఉండే ఫేక్ సైట్లలో.. బ్యాంకుల కస్టమర్లు కీలక వివరాలను పొందుపర్చేలా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తూ, మోసగిస్తున్నారు. గతంలోనూ నకిలీ కార్డ్ అప్డేట్ సైట్ల ద్వారా ఆండ్రాయిడ్ ఆధారిత ఫిషింగ్ మాల్వేర్ను జొప్పించేందుకు ఇలాంటి మోసాలే జరిగాయి. పోస్టల్ సర్వీసులను కూడా సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. యూజర్‌కు రావాల్సిన ప్యాకేజీ మిస్సయ్యిందనో లేక డెలివరీ అడ్రెస్ సరిగ్గా లేదనో ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా వారిని కంగారుపెట్టి, తక్షణం స్పందించాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఫేక్ సైట్ల లింకులను ఎస్ఎంఎస్ల ద్వారా పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. అంతగా రక్షణ లేని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ (ఐవోటీ/ఓటీ) మొదలైనవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన టార్గెట్‌గా ఉంటున్నాయి. కాబట్టి భారతీయ సంస్థలు సురక్షితంగా కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు సెక్యూరిటీ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
తెలుగు రాష్ట్రాల్లో బంగారం తగ్గిందా.. పెరిగిందా?
Gold Price Today: దేశంలో రోజుకో రకంగా మారుతున్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 4) నిలకడగా కొనసాగుతన్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.71,300 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.77,780 వద్ద స్థిరంగా ఉన్నాయి.మరోవైపు చెన్నైలో మాత్రంలో 22 క్యారెట్ల బంగారం ధరలో అత్యంత స్వల్ప పెరుగుదల కనిపించింది. 10 గ్రాములకు రూ.10 పెరుగుదల నమోదైంది. ఇక్కడ 22, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.71,310, రూ.77,780 వద్ద ఉన్నాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలను చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,450, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,930 లుగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు నిలకడగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగడం ఇది వరుసగా రెండో రోజు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నలుగురు నామినీలు.. కీలక మార్పులు..
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభ ఆమోదించింది. ప్రధానంగా బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాలకు గరిష్టంగా నలుగురు నామినీలను కలిగి ఉండేలా ఈ బిల్లు అనుమతిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది."ప్రతిపాదిత సవరణలు బ్యాంకింగ్ రంగంలో పాలనను బలోపేతం చేస్తాయి. నామినేషన్, డిపాజిట్‌దారుల రక్షణకు సంబంధించి కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి" అని సీతారామన్ బిల్లును ప్రవేశ పెడుతూ చెప్పారు. బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం బ్యాంకులో ఖాతాదారు గరిష్టంగా నలుగురు నామినీలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరిని ఒకేసారి కానీ, వివిధ సందర్భాల్లో గానీ చేర్చుకోవచ్చు. ఎవరెవరికి ఎంత వాటా అన్నది కూడా ఖాతాదారు పేర్కొనవచ్చు.పాలనా ప్రమాణాలను మెరుగుపరచడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు నివేదించడంలో స్థిరత్వాన్ని అందించడం, డిపాజిటర్లకు, ఇన్వెస్టర్లకు మెరుగైన రక్షణ కల్పించడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం, నామినీల విషయంలో కస్టమర్ సౌలభ్యాన్ని పెంచడం, సహకార బ్యాంకుల్లో డైరెక్టర్ల పదవీకాలం పెంచడం వంటి వాటికి సంబంధించి 19 సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.ప్రతిపాదిత కీలక మార్పులుబ్యాంకు ఖాతాలకు నామినీల సంఖ్య పెంపుతోపాటు మరికొన్ని కీలక మార్పులు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024లో ఉన్నాయి.బ్యాంకులకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డివిడెండ్లు, షేర్, వడ్డీ లేదా బాండ్ల రిడెమ్షన్ను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (IEPF)కి బదిలీ చేస్తారు. సంబంధిత వ్యక్తులు ఎకరైనా ఉంటే అక్కడి నుంచి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.డైరెక్టర్షిప్స్కు సంబంధించి సబ్‌స్టాన్షియల్ ఇంట్రస్ట్ పరిమితి రూ.2 కోట్లకు పెరుగుతుంది. ఇది ప్రస్తుత రూ.5 లక్షలుగా ఉంది. దీన్ని సుమారు 6 దశాబ్దాల కిందట నిర్ణయించారు.సహకార బ్యాంకుల డైరెక్టర్ల (ఛైర్మన్, ఫుల్‌టైమ్ డైరెక్టర్ మినహా) పదవీ కాలం ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెరుగుతుంది.కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరు రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కూడా సభ్యుడిగా ఉండేందుకు అనుమతి. -
విదేశీ స్టీల్‌పై ‘ఉక్కు’పాదం.. దిగుమతులపై 25 శాతం సుంకం
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధింపునకు కేంద్ర ఉక్కు శాఖ ప్రతిపాదించింది. కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మధ్య ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి సెయిల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏఎంఎన్ఎస్ ఇండియా కంపెనీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు.దీనిపై మంత్రి గోయల్ ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు. ‘‘స్టీల్, మెటలర్జికల్ కోక్ పరిశ్రమల భాగస్వాములు, నా సహచరుడు, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో కలసి సమావేశం నిర్వహించాం. దేశాభివృద్ధిలో ఈ రెండు శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తి, నాణ్యత పెంపుతోపాటు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచే మార్గాలపై చర్చించాం’’అని గోయల్ తన ట్వీట్లో వెల్లడించారు.మంత్రి కుమారస్వామి సైతం ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై స్పందించారు. రెండు శాఖల మధ్య సహకారం, దేశీ స్టీల్, భారీ పరిశ్రమలకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభతరం చేసే మార్గాలపై చర్చించినట్టు చెప్పారు. ఇదే భేటీలో స్టీల్ దిగుమతులపై 25 శాతం రక్షణాత్మక సుంకం విధించాలని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కోరింది. కొన్ని దేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులు తమకు సమస్యగా మారినట్టు దేశీ కంపెనీలు ఎప్పటి నుంచో కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నాయి. దిగుమతి సుంకాల పెంపుతో దేశీ పరిశ్రమను కాపాడాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉక్కు శాఖ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందేమో చూడాల్సి ఉంది. పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు.. దేశంలోకి వస్తున్న స్టీల్ దిగుమతుల్లో 62 శాతం మేర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కలిగిన దేశాల నుంచే ఉంటున్నాయని, వీటికి ఎలాంటి సుంకం వర్తించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ గత నెలలో చెప్పడం గమనార్హం. కనుక దిగుమతి సుంకాలను పెంచినప్పటికీ ఈ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఎంలాంటి ప్రభావం ఉండదన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యపై తమకు అవగాహన ఉన్నట్టు చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 5.51 మిలియన్ టన్నుల స్టీల్ దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 3.66 మిలియన్ టన్నుల కంటే 60 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి స్టీల్ దిగుమతులు 1.85 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో చైనా నుంచి 1.0 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు దిగుమతయ్యాయి. -
ఎస్బీఐలో అకౌంట్ ఉందా..?
న్యూఢిల్లీ: ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాలను పునరుద్ధరించేందుకు ఎస్బీఐ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీ లేని సేవింగ్స్, కరెంట్ ఖాతాలను ఇనాపరేటివ్‌గా (నిర్వహణలో లేని) బ్యాంకులు పరిగణిస్తుంటాయి. ఈ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలంటే తాజా కేవైసీ పూర్తి చేయాలి.లావాదేవీల నిర్వహణతో ఖాతాలు ఇనాపరేటివ్‌గా మారకుండా చూసుకోవచ్చన్నది ఈ కార్యక్రమం ద్వారా తాము ఇచ్చే కీలక సందేశమని ఎస్బీఐ తెలిపింది. జన్‌ధన్ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడం, కస్టమర్లు నిరంతరం లావాదేవీలు నిర్వహించేలా చూసేందుకు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరాన్ని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి ముందు ఎస్బీఐ తమ బిజినెస్ కరస్పాండెంట్లకు గురుగ్రామ్‌లో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ ఆపరేటివ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రాముఖ్యత గురించి పాల్గొనేవారికి అవగాహన కల్పించడంపై ఈ వర్క్‌షాప్ దృష్టి సారించింది. -
ఎంజీ తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ‘సైబర్‌స్టర్’ వస్తోంది
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఆల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కన్వర్టబుల్ సైబర్‌స్టర్ మోడల్‌ను 2025 జనవరి–మార్చి మధ్య భారత్‌లో ప్రవేశపెడుతోంది. ధర రూ.65–70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.ఎంజీ సెలెక్ట్ ఔట్లెట్లలో విక్రయానికి రానున్న తొలి మోడల్ ఇదేనని కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు. వచ్చే రెండేళ్లలో నాలుగు ఎలక్ట్రిక్ మోడళ్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. సైబర్స్టర్తోపాటు మరో మోడల్ సైతం మార్చిలోగా అడుగుపెట్టనుందని గుప్తా వెల్లడించారు.భారత్‌లో లగ్జరీ కార్ల విభాగం గత నాలుగేళ్లలో మాస్ సెగ్మెంట్ కార్ల కంటే రెండింతలై దాదాపు 25 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. కంపెనీ పట్ల సానుకూల ప్రభావంతోపాటు సైబర్‌స్టర్ మొత్తం ఈవీలు, బ్రాండ్‌కు మరింత ఆకర్షణను జోడిస్తుందని అన్నారు. ఇది బ్రాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు అదనపు గుర్తింపును ఇస్తుందని వివరించారు. -
మూడు ఐఐటీలతో హ్యుందాయ్ ఒప్పందం.. భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: బ్యాటరీలు, విద్యుదీకరణ రంగాలలో సహకార పరిశోధనా వ్యవస్థను నెలకొల్పేందుకు మూడు ఐఐటీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుండై మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం ఐదేళ్లలో 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ వీటిలో ఉన్నాయి.సహకారంలో భాగంగా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఐఐటీ ఢిల్లీలో ఏర్పాటు చేస్తామని, హ్యుండై మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్‌షిప్‌ల ద్వారా నిర్వహిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాటరీలు, విద్యుదీకరణలో పురోగతిని నడిపించడం హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాథమిక లక్ష్యం. ప్రధానంగా భారతీయ మార్కెట్ యొక్క విభిన్న అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.ఈ సెంటర్ భారత విద్యా వ్యవస్థ నుండి ప్రతిభావంతులైన వ్యక్తులతో బలమైన నెట్‌వర్క్‌ను పెంపొందించగలదని నమ్ముతున్నామని, ఆవిష్కరణలు, భవిష్యత్తు వృద్ధిని ప్రోత్సహిస్తుందని హ్యుండై మోటార్ గ్రూప్ రిసర్చ్, డెవలప్మెంట్, ప్లానింగ్, కోఆర్డినేషన్ సెంటర్ హెడ్ నక్సప్ సంగ్ వివరించారు. హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకడమిక్–పారిశ్రామిక సహకార ప్రాజెక్టులపై సంయుక్త పరిశోధనలను నిర్వహించడమే కాకుండా.. కొరియా, భారత్‌కు చెందిన బ్యాటరీ, విద్యుద్దీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ వనరుల మార్పిడిని సులభతరం చేస్తుందని సంస్థ తెలిపింది. -
స్విగ్గీ నష్టాలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ నష్టాలు స్వల్పంగా తగ్గాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 626 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2023–24) ఇదేకాలంలో రూ. 657 కోట్ల నష్టం ప్రకటించింది.మొత్తం ఆదాయం రూ. 2,763 కోట్ల నుంచి రూ. 3,601 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,507 కోట్ల నుంచి రూ. 4,310 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇటీవలే స్టాక్ ఎక్చ్సేంజీలలో లిస్ట్‌కావడంతో తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.కాగా.. సొంత అనుబంధ సంస్థ స్కూట్సీ లాజిస్టిక్స్ ప్రయివేట్‌లో రైట్స్ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా రూ. 1,600 కోట్లకు మించకుండా ఇన్వెస్ట్ చేసేందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు స్విగ్గీ వెల్లడించింది. స్కూట్సీ ప్రస్తుతం సప్లైచైన్ సర్వీసులు, పంపిణీ బిజినెస్ నిర్వహిస్తోంది. -
ఉదయపూర్ యువరాజు వాహన ప్రపంచం - తప్పకుండా చూడాల్సిందే (ఫోటోలు)
-
ఈ యువరాజు దగ్గర లేని కారు లేదు!
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో ఉండే ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ (Lakshyaraj Singh Mewar) ఖరీదైన కార్ల భారీ కలెక్షన్‌కు కూడా ప్రసిద్ధి చెందారు. వింటేజ్ కార్ల దగ్గర నుంచి లేటెస్ట్ రోల్స్ రాయిస్ కార్ల వరకూ ఆయన దగ్గర లేని కారు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో..లేటెస్ట్ లగ్జరీ కార్లను ఇష్టపడే లక్ష్యరాజ్ సింగ్‌కు పాతకాలపు కార్ల పట్ల కూడా మక్కువ ఎక్కువే. తన విస్తారమైన కార్ల కలెక్షన్‌ను చూస్తే ఇది తెలుస్తుంది. ఇంకా తన కార్ల కలెక్షన్లో వలసరాజ్యాల కాలం నాటి క్లాసిక్ కార్లతోపాటు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి.ఆనంద్ మహీంద్రా నుంచి..విదేశీ లగ్జరీ కార్ల పట్ల అభిమానంతోపాటు లక్ష్యరాజ్ సింగ్‌కు కొన్ని మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ముఖ్యంగా మహీంద్రా థార్ ఎస్యూవీ అంటే అమితమైన ఇష్టం. 2019లో మహీంద్రా థార్ 700 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయినప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వాహనాన్ని యువరాజుకు అందించారు. ఈ పరిమిత ఎడిషన్ ఈ వాహనాలు 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.విస్తృతమైన కార్ల సేకరణతో పాటు లక్ష్యరాజ్ సింగ్ మోటార్ సైకిళ్లను కూడా ఇష్టపడతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్‌ని కొన్న తొలి వ్యక్తి ఆయనే. భారత్‌లో ఈ క్రూయిజర్ మోటార్‌బైక్ ధర సుమారు రూ. 3.37 లక్షలు.లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఉదయ్‌పూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ, రాజ సింహాసనానికి సరైన వారసుడి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇటీవల రాజకుటుంబీకుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాజస్థాన్‌లోని మేవార్ల సంపద దాదాపు రూ. 10,000 కోట్లని మీడియా నివేదికల అంచనా. -
దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం..
Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (డిసెంబర్ 2) చెప్పుకోదగ్గ స్థాయిలో క్షీణించాయి. మూడు రోజుల్లో తులానికి (10 గ్రాములు) రూ.700 పైగా రేటు దిగిరావడం పసిడి కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.70,900 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.650 క్షీణించి రూ.77,350 వద్దకు తగ్గింది.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.71,050 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.650 తగ్గి రూ.77,500 వద్దకు దిగొచ్చాయి.ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.500 మేర క్షీణించింది. దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,500 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
సిప్‌తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?
డెట్ ఫండ్స్ ఈల్డ్ టు మెచ్యూరిటీ (వైటీఎం), యావరేజ్ మెచ్యూరిటీ అంటే ఏంటి? – చంద్ర గుణ శేఖర్డెట్ ఫండ్స్ విశ్లేషణకు వైటీఎం, యావరేజ్ మెచ్యూరిటీ రెండూ కీలక కొలమానాలు. ఫండ్ పనితీరు సామర్థ్యాలు, రిస్క్‌ను వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వైటీఎం: మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియోలో బాండ్లను గడువు తీరే వరకు కొనసాగిస్తే వచ్చే రాబడిని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డెట్ ఫండ్ వైటీఎం 8గా ఉంటే.. రాబడులు సుమారుగా ఆ స్థాయిలో ఉంటాయని అర్థం. కానీ, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో మేనేజర్ చేసే మార్పులతో వాస్తవ రాబడులు వేరుగా ఉండొచ్చు. రోజువారీ ఎక్స్పెన్స్ రేషియో మినహాయింపులు, పెట్టుబడుల రాక, పోక ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చేస్తాయి. ఒక డెట్ ఫండ్‌లో ప్రస్తుత పోర్ట్‌ఫోలియో ప్రకారం ఎంత రాబడులు వస్తాయన్నది వైటీఎం తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ: ఫండ్ పోర్ట్‌ఫోలియోలో వివిధ బాండ్లు వివిధ కాలాలకు మెచ్యూరిటీ అవుతాయి. అన్ని బాండ్ల మెచ్యూరిటీల సగటు మెచ్యూరిటీని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పోర్ట్‌ఫోలియోలో రెండు బాండ్లు ఉండి, ఒకటి 10 ఏళ్లు, మరొకటి 5 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుందని అనుకుందాం. అప్పుడు వీటి సగటు మెచ్యూరిటీ 7.5 ఏళ్లు అవుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియో వడ్డీ రేట్ల సున్నితత్వాన్ని ఇది తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ ఎంత దీర్ఘకాలానికి ఉంటే అంతగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. యావరేజ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే ఈ ప్రభావం తక్కువ. వైటీఎం ద్వారా ఫండ్ సగటు రాబడిని, యావరేజ్ మెచ్యూరిటీ ద్వారా ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోపై వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవచ్చు. నా వయసు 35 ఏళ్లు. వచ్చే మూడేళ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు ఎక్కువ పెట్టుబడిని కేటాయించాలని అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ రాబడులు ఇస్తాయని విన్నాను. నా లక్ష్యానికి ఇది మెరుగైన పెట్టుబడుల వ్యూహమేనా? – జిగ్నేష్మీ లక్ష్యం రాజీపడకూడనిది అయితే, కచ్చితంగా మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడుల ఎంపిక సరైనది కాదు. 2000 సంవత్సరం నుంచి చారిత్రక రాబడుల గణాంకాలను పరిశీలిస్తే.. సెన్సెక్స్‌లో మూడేళ్ల సిప్ రాబడి మైనస్ 15 శాతంగా ఉంది. అందుకే స్వల్పకాలానికి ఈక్విటీ పెట్టుబడులు ఎంతో రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాలానికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాల విషయంలో భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. కనుక ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను మీరు పరిశీలించొచ్చు.వీటిల్లో ఎంతో స్థిరత్వం, ఊహించతగిన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ మీ లక్ష్యంలో కొంత వెసులుబాటు ఉండి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించొచ్చు. అది కూడా కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో సిప్ రాబడులు ప్రతికూలం నుంచి సానుకూలంలోకి మారి, సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతలను అధిగమించి వృద్ధిని చూపించగలవు.