![IT companies likely to roll out 3 to 6pc Salary hikes this year HR experts](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/salary.jpg.webp?itok=3vvX0mda)
ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్‌ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.
ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించింది
ఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.
మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఐటీ పరిశ్రమలో అప్రైజల్ సైకిల్ సాధారణంగా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment