
సాక్షి, కొవ్వూరు: ఇటీవలి కాలంలో పెళ్లి వేడుక అంటే.. ఏదో కొత్తగా ఉండాలని చాలా మంది భావిస్తున్నారు. పెళ్లి కుదిరింది మొదలు.. తాళికట్టే వరకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఫొటో షూట్, ఆహ్వాన పత్రికలు, పెళ్లిలో ఆహార మెను విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీకి చెందిన బీజేపీ నాయకుడు ఒకరు.. విందు విషయంలో సరికొత్తగా ఆలోచించారు. ఆహారం వృథా చేయవద్దని అందులో చెప్పుకొచ్చారు.

వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోడూరి లక్ష్మీనారాయణ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించారు. పెళ్లి విందులో వడ్డించే వంటకాల జాబితాను అందులో ప్రచురించారు. విందు సమయంలో ఆహార పదార్థాల వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ ప్రచురించారు. ‘దయచేసి ఎవరూ అన్యథా భావించవద్దు అని వినయపూర్వక ప్రార్థన’ అంటూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
