wedding card
-
'ఉండమీరి పెళ్లి జోడ'.. కోయ భాషలో శుభలేఖను చూశారా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మాతృభాషపై మమకారంతో ఓ ఆదివాసీ కుటుంబం పెళ్లి శుభలేఖ (ఉండమీరి పెళ్లి జోడ)ను కోయ భాషలో ముద్రించి ప్రత్యేకత చాటుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka Village) గ్రామానికి చెందిన సున్నం (ఉండం) సాధు సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌లో జీవనం సాగించేవారు. ఆయన మరణానంతరం పెద్ద కుమారుడు బాలరాజు కుటుంబ బాధ్యతలు చూస్తున్నాడు. కాగా, సోదరుడు శ్రీనివాస్ వివాహం లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన చింత వినీతతో మార్చి 2న జరగనుంది. దీంతో సోదరుడి వివాహ ఆహ్వాన పత్రికను కోయ భాషలో (Koya Language) ముద్రించి బంధు మిత్రులకు పంపిణీ చేశారు. కాగా, అంతరించిపోతున్న భాషను బతికించేందుకు బాలరాజు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.చదవండి: వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం -
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్‌పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్‌ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
వామ్మో...వెడ్డింగ్ ఇన్విటేషన్లు!
పలమనేరు: గతంలో ఎవరిదైనా వివాహ శుభకార్యమైతే ఇళ్లకు వెళ్లి పెళ్లిపత్రికలు ఇచ్చేవారు. ఇప్పుడంతా డిజిటల్ మయమైంది. అన్నింటికీ స్మార్ట్ ఫోనే దిక్కుగా మారింది. అందులోనే వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులు, స్నేహితులకు పంపుతున్నారు. వెడ్డింగ్ కార్డు కాబట్టి తప్పకుండా వాట్సాప్‌లో వచ్చిన మెసేజీని టచ్ చేసి చూడాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు హ్యాకర్ల పాలిట వరంలా మారింది. ఆయా ప్రాంతాల్లో బాగా తెలిసిన వారి పెళ్లి డిటిటల్ కార్డును హ్యాకర్లు డౌన్లోడ్ చేసుకుని దాన్ని డాట్ ఏపీకే ఫైల్‌గా మార్చి వేలాదిమందికి వాట్సాప్‌లో పంపుతున్నారు. కచ్చితంగా చూడాలి కాబట్టి మనం ఆ మెసేజ్‌ను టచ్ చేశామో అంతే సంగతులు. మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లి మన వ్యక్తిగత డేటా, మన బ్యాంకు వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు స్కామర్లకు చేరిపోతోంది.వెలుగు చూసిందిలా...చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలోని నంగిళిలో ఓ వ్యాపారి తన కుమార్తె పెళ్లి కార్డులను మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయించి దాన్ని బంధువులకు, స్నేహితులకు వాట్సాప్‌కు పంపారు. దీన్నే కొందరు హ్యాకర్లు కాపీ చేసి అందులో డాట్ ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజి కిట్) ఫైల్‌ను సెట్‌చేసి పలువురి మొబైళ్లకు పంపారు. దీన్ని ఓపెన్ చేసినవారి ఫోన్లలోకి డాట్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయి వారి మొబైళ్లు హ్యాక్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు మొబైల్లో డాట్ ఏపీకే ఫైల్‌ను రీసెట్ చేయడం ద్వారా మెయిల్, పాస్వర్డ్ మార్చుకుని టూస్టెప్ వ్యాలిడేషన్ చేసుకుని ఆపై డిలీట్ చేసుకున్నారు. మరికొందరి ఖాతాల్లోంచి దాదాపు 1.60లక్షల దాకా పోగొట్టుకున్నట్టు తెలిసింది. దీంతో కొందరు బాధితులు మాత్రం సైబర్‌సెల్‌కు సెల్‌ఫోన్ ద్వారానే ఫిర్యాదులు కూడా చేశారు. కానీ పోయిన నగదు వారికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యామిలీలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఈ పాటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. కొన్నిరోజుల క్రితం శోభిత పోస్ట్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. అమ్మాయి తరఫున వాళ్లు ఇచ్చే పెళ్లికార్డుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది.(ఇదీ చదవండి: 'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక)ఈ పెళ్లి కార్డులో శోభిత-నాగచైతన్యకు డిసెంబరు 4న పెళ్లి జరగనుందని, తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించాలని అని రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు అనే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డ్‌గా ఆహ్వానం అందించినట్లు వైరల్ అయిన ఫొటో చూస్తుంటే తెలుస్తోంది.ఈ పెళ్లి కార్డులో 4వ తేదీ అని ఉంది గానీ వేదిక ఎక్కడనేది కనిపించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా వేసే మండపం సెట్లో శుభకార్యం జరగనుంది. ఈ మేరకు త్వరలో ఏర్పాట్లు మొదలవుతాయి. ఆడపిల్ల తరఫున పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటే.. మరో రెండు మూడు రోజుల్లో అబ్బాయి తరఫు నుంచి కూడా పెళ్లి ఏర్పాటు షురూ అవుతాయని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) -
ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
'అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్'ల వివాహం జులై 12న జరగనుంది. ఇప్పటికే వివాహ వేడుకలు మొదలైపోయాయి. నీతా అంబానీ మొదటి శుభలేఖను కాశీ విశ్వనాధునికి సమర్పించారు. అనంత్ అంబానీ పలువురు సినీ తారలను, ఇతర ప్రముఖులను స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఈ తరుణంలో అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అద్భుతంగా ఉన్న అనంత్ & రాధికల వెడ్డింగ్ కార్డు ధర ఎంత ఉంటుందని సర్వత్రా ఉత్కంఠగా మారింది. అంబానీల ఒక్క వెడ్డింగ్ కార్డు ధర రూ. 6.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎందుకంటే ఇది మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు.గతంలో ముకేశ్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లి కార్డును కూడా రూ. 3 లక్షల ఖర్చు పోయేట్టు తయారు చేయించినట్లు సమాచారం. కాగా ఇప్పుడు కొడుకు వెడ్డింగ్ (ఒక్కొక్క వెడ్డింగ్ కార్డు) కార్డు కోసం ఏకంగా రూ. 6.50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంబానీ ఇంట జరగబోయే ఈ వివాహ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు, సినీతారలు హాజరు కానున్నారు. కాగా వీరి పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది.ఇదీ చదవండి: అనంత్ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రికUnboxing the wedding card for Anant Ambani and Radhika Merchant's world's costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2— DealzTrendz (@dealztrendz) June 26, 2024 -
వైరల్ వీడియో: అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మజాకా?
-
అనంత్ అంబానీ - రాధిక పెళ్లి : అపురూపంగా ఆహ్వాన పత్రిక
బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ఏడడుగుల వేడుకకు ముహూర్తం సమీపిస్తోంది. అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. అంబానీ కుటుంబం పెళ్లి పనుల్లో ఇప్పటికే బిజీగా ఉంది. వివాహ పత్రికను కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంత్ తల్లి నీతాఅంబానీ. ఆ తరువాత హితులు, సన్నిహితులు, సెలబ్రిటీలకు పెళ్లి ఆహ్వానాలను అందిస్తున్నారు కూడా. ఈ క్రమంలో అనంత్ -రాధిక వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.Unboxing the wedding card for Anant Ambani and Radhika Merchant's world's costliest wedding! pic.twitter.com/p3GnYSjkp2— DealzTrendz (@dealztrendz) June 26, 2024ప్రపంచంలోనే అతి ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది అనంత్-రాధిక పెళ్లి ముచ్చట. ఇక వివాహ ఆహ్వానం ప్రత్యేకంగా ఒక పెట్టెలో ఒక కళాఖండంగా తీర్చిదిద్దిన వైనం విశేషంగా నిలుస్తోంది. అనంత్-రాధిక పేర్లలోని తొలి అక్షరాలు, లైట్లు, ఎర్రని రంగుతో ఇన్విటేషన్ కార్డును అలంకరించారు. బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయగానే వెండితో చేసిన ఆలయం, ఈ ఆలయం లోపల వెండితోనే చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ముచ్చటగా ఉన్నాయి. అంతేకాదు వివాహ ఆహ్వాన అతిథులకు ఈ వెండి కార్డుతో పాటు పలు బహుమతులు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. దేశ, విదేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరుకానున్నారు. -
సమంతను పెళ్లికి ఆహ్వానించిన హనుమాన్ నటి..!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చేనెల 2వ తేదీన థాయ్‌లాండ్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి తన పెళ్లికి అతిథులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లకు వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించారు.తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను తన పెళ్లికి ఆహ్వానించింది. వ్యక్తిగతంగా కలిసి వారికి ఆహ్వాన పత్రికలు అందజేసింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కాగా... టాలీవుడ్లో ఇప్పటికే రవితేజ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కలిసి పెళ్లికి రావాలని కోరింది. ఇటీవల తన తండ్రి శరత్‌కుమార్, రాధికాతో పాటు కోలీవుడ్ ప్రముఖులను వివాహానికి ఆహ్వానించారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో వరలక్ష్మి, నికోలాయ్ల నిశ్చితార్థం జరిగింది. నికోలయ్ సచ్దేవ్తో దాదాపుగా 14 ఏళ్లుగా పరిచయం ఉన్నట్లు వరలక్ష్మి తెలిపింది. మరోవైపు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ధనుష్ నటిస్తోన్న రాయన్ చిత్రంలో వరలక్ష్మి కనిపించనుంది. -
Save the date అనంత్-రాధిక పెళ్లి ముహూర్తం ఫిక్స్, వెడ్డింగ్ కార్డు వైరల్
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మోస్ట్ ఎవైటెడ్ వెడ్డింగ్ డేట్ వచ్చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సాంప్రదాయ హిందూ వైదిక పద్ధతిలో వివాహ వేడుక జరగనుంది. ఏఎన్ఐ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన కార్డును షేర్ చేసింది. అంబానీ కుటుంబం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ 'సేవ్ ది డేట్' పేరుతో వీరి వెడ్డింగ్ ఆహ్వానాలు వైరల్‌గా మారాయి. మూడు రోజుల వేడుకకు సంబంధించిన వివరాలతో ఎరుపు, బంగారు రంగులో చూడముచ్చటగా ఉంది.బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12, 13 , 14 తేదీల్లో మూడు రోజుల పాటు గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ప్రధాన వేడుకలు జూలై 12వ తేదీ శుక్రవారం శుభ వివాహ్ లేదా వివాహ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. జూలై 13న, శుభ్ ఆశీర్వాదం లేదా దైవిక ఆశీర్వాద వేడుక, జూలై 14న మంగళ్ ఉత్సవ్ లేదా వివాహ రిసెప్షన్ జరుగుతుంది.కాగా లవ్ బర్డ్స్ అనంత్-రాధిక ఇప్పటికే నిశ్చితార్థాన్ని, తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా ముగించుకున్నారు. ఇక రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక లగ్జరీ క్రూయిజ్‌లో ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీరి వెళ్లి వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార ప్రముఖులు, దేశాధినేతలు, అలాగే పలువురు హాలీవుడ్ , బాలీవుడ్ తారలు హాజరుకానున్నారని తెలుస్తోంది. -
పెళ్లికార్డులో 'మోదీ' పేరు.. చిక్కుల్లో వరుడు
బెంగళూరు: పెళ్ళి కార్డులో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉండటం.. వరుణ్ణి చిక్కుల్లో పడేసింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు నియమాలను అతిక్రమించాడనే కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..దక్షిణ కన్నడలోని పుత్తూరు తాలూకాలోని వరుడు తన వెడ్డింగ్ కార్డులో 'మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడమే ఆ దంపతులకు మీరు ఇచ్చే అత్యుత్తమ బహుమతి' అని పేర్కొన్నారు. ఈ ట్యాగ్‌లైన్‌పై వరుడి బంధువుల్లో ఒకరు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఫిర్యాదు అందుకున్న తరువాత ఏప్రిల్ 14న పుత్తూరు తాలూకాలోని వరుడి నివాసానికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లారు. ఎన్నికల తేదీలు ప్రకటించకముందే మార్చి 1న ఆహ్వాన పత్రికలు ముద్రించారని వరుడు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానం, దేశం పట్ల ఉన్న శ్రద్ధ కారణంగా వరుడు ఇలా చేసినట్లు స్పష్టం చేశారు. -
క్రికెట్ లవర్స్ ఆహ్వాన పత్రిక వైరల్: సీఎస్కే ఫ్యాన్స్ ఫిదా!
ఒక పక్క ఐపీఎల్ ఫీవర్ జోరుగా నడుస్తోంది. మరోపక్క రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు దూసుకు పోయింది. ముఖ్యంగా ఇటీవలి మ్యాచ్‌లో ఇలా వచ్చి అలా సిక్సర్ల వర్షం కురిపించిన జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మేనియా ఫ్యాన్స్‌ను ఆనందో త్సాహాల్లో తేలి యాడించింది. స్టేడియం అంతా రికార్డ్ స్థాయిలో హోరెత్తిపోయింది. ఈ క్రమంలో తాజాగా సీఎస్కే అభిమాని పెళ్లి పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది. సీఎస్కే ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పెళ్లి పత్రిక క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది.తమిళనాడుకు చెందిన జంట చెన్నై సూపర్ కింగ్స్ థీమ్‌తో తమ పెళ్లి ఆహ్వాన పత్రిక రూపొందించడం విశేషంగా నిలిచింది. క్రియేటివ్‌గా సీఎస్కే లోగోను ఉపయోగించి వారి పేర్లను ముద్రించారు. అలాగే మ్యాచ్ నమూనా టికెట్‌పై పెళ్లి సమయం(ఏప్రిల్ 17), రిసెప్షన్ వంటి వివరాలను కూడా పొందుపర్చారు. (మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్) View this post on Instagram A post shared by Whistle Podu Army - CSK Fan Club (@cskfansofficial)అంతేనా మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్షన్ లాంటి పదాలను కూడా జోడించారు. అంతేకాదు సీఎస్కే ఐపీఎల్‌ను ఐదుసార్లు గెల్చుకున్న దానికి సూచికగా 5 స్టార్లను అందించడం మరో విశేషం. దాంతో ప్రస్తుతం ఈ వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నూతన దంపతులు గిఫ్ట్లీన్ పెర్సీ, మార్టిన్ రాబర్ట్ హృదయ పూర్వక శుభాకాంక్షాల వెల్లువ కురుస్తోంది.ఫెంటాస్టిక్ పార్టనర్షిప్ అంటూ కమెంట్స్ చేయడం విశేషం. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!)స్టార్ స్పోర్ట్స్ ఈ పోస్ట్‌పై స్టార్ స్పోర్ట్స్ ఇండియా కూడా కమెంట్ చేయడం విశేషం. మీ అభిమానంలాగే మీ జోడి కూడా బలంగా ఉండాలంటూవిషెస్ తెలిపింది. కాగా ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. (ముఖేష్ అంబానీ: ఏ వర్కౌట్స్ లేకుండానే 15 కిలోలు తగ్గాడట, ఎలా?) -
ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. వెడ్డింగ్ కార్డ్ లీక్!
బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్ చిఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతంత సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. అయితే గతనెల లవర్స్ డే రోజున బాయ్‌ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. తామిద్దరం కలిసి మార్చ్ చేయబోతున్నాం అంటూ తన పెళ్లి గురించి అభిమానులకు హింట్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది మార్చిలోనే ఈ జంట ఒక్కటి కాబోతుందని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరు మార్చి 13న వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన పెళ్లి పత్రిక నెట్టింట సందడి చేస్తోంది. వెడ్డింగ్ కార్డ్ చూస్తే ప్రముఖ బీచ్ వేదికగా వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే వివాహా వేడుక ఎక్కడ అనేది ఇంకా తెలియరాలేదు. కాగా.. ఇటీవల ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకున్నారు. దీంతో రకుల్ బాటలోనే వీరు కూడా గోవాలోనే ప్లాన్ చేశారా? అని అభిమానులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ జంట మార్చి 13న వీరి ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. కాగా..పుల్కిత్, కృతి వారి 2018 రొమాంటిక్ కామెడీ 'వీరే కి వెడ్డింగ్' సెట్స్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచే వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత పగల్పంటి (2019), తైష్ (2020) సినిమాల్లో స్క్రీన్ కూడా పంచుకున్నారు. ఈ ఏడాది జనవరిలో రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్‌తో ఈ జంట మార్చిలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ కార్డ్, వీడియో వైరల్
-
బీజేపీ-బీఆర్ఎస్ లగ్గం పిలుపు!!
వైరల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల విమర్శలు-ప్రతివిమర్శలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా.. సోషల్ మీడియాలో వెరైటీ క్యాంపెయిన్లు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ‘బీ టీం’ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డును విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంటూ క్రియేటివిటీని చూపించింది. అంతేకాదు వేదిక దగ్గరి నుంచి ముహూర్తం.. ఇలా ప్రతీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య సెటైర్ వేసింది. -
ముస్లిం యువకుడితో బీజేపీ నేత కుమార్తె పెళ్లి.. వెడ్డింగ్‌కార్డుపై దుమారం..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ నాయకుడు యశ్పాల్ బినాం.. తన కుమార్తెను ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. మే 28న ముహూర్తం ఖరారు చేశారు. వెడ్డింగ్‌కార్డులు కూడా ప్రింట్ చేయించేసి బంధు మిత్రులకు పంపారు. ఘనంగా వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బంధమిత్రులు, నెటినజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై వివాదం కూడా తలెత్తింది. కొందరు నిరసనలు కూడా చేపట్టారు. దీంతో తన కూతురు పెళ్లి పోలీసులు, పటిష్ఠ బందోబస్తు నడుమ చేయాలనుకోవడం లేదని యశ్పాల్ తెలిపారు. అందుకే మే 28న జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇరు కుటుంబాలు చర్చించుకుని పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి పెళ్లి రద్దు చేసుకున్నామని, అబ్బాయి కుటుంబంతో చర్చించిన తర్వాత తన కూతురు పెళ్లి విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పకొచ్చారు. ఇద్దరూ ఇష్టపడటంతో వాళ్ల భవిష్యత్తు ఆనందంగా ఉంటుందనే పెళ్లికి అంగీకరించామని, కానీ సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డు వివాదాస్పదం కావడం బాధించిందని యశ్పాల్ తెలిపారు. చదవండి: నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్‌పై మంత్రి సంచలన ఆరోపణలు.. -
వైరల్‌గా వెడ్డింగ్ కార్డు.. దయచేసి పెళ్లికి రావొద్దు.. ఇదేం పద్ధతి!
ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ పెళ్లి వేడుక అంటే కచ్చితంగా ఆహ్వాన పత్రికలు అచ్చేయిస్తున్నారు చాలా మంది. తమ బంధు మిత్రులు, స్నేహితులు, ప్రియమైన వారి ఇంటికి వెళ్లి లేదా పోస్టు ద్వారా పెళ్లి పత్రికను అందజేస్తారు. కుటుంబ సమేతంగా తప్పకుండా వివాహానికి రావాలని సంతోషంగా చెబుతుంటారు. అయితే ఈ పెళ్లి పత్రికే ఇప్పుడు ఓ కుటుంబం పరువు పోయేలా చేసింది. ప్రింటింగ్ కంపెనీ చేసిన చిన్నపొరపాటు వీరిని బంధమిత్రుల ఆగ్రహానికి గురి చేసింది. ఆహ్వాన పత్రికలో ఒక్క పదం మిస్ కావడం వల్ల మొత్తం అర్థమే మారిపోయింది. 'నేను ప్రేమతో ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తున్నాను. మీరు మా పెళ్లికి రావడం మర్చిపోండి' అని వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ అయింది. 'పెళ్లికి రావడం మర్చిపోకండి' అనే పదానికి బదులు ఒక్క అక్షరం మిస్ అయి మర్చిపోండి అని అచ్చయింది. దీంతో పెళ్లి కార్డు రిసీవ్ చేసుకుని చదివిన బంధువులు అవాక్కయై నోరెళ్లబెట్టారు. పెళ్లికి రావొద్దని పెళ్లి పత్రికలోనే చెప్పడం ఏంటి? బిత్తర పోయారు. ఈ పెళ్లి కార్డును ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. 'ఇదిగో నాకొక వివాహ ఆహ్వాన పత్రిక వచ్చింది. కానీ ఇది చూశాక పెళ్లికి వెళ్లాలో వద్దో ఏమీ అర్థం కావడం లేదు' అని అతడు రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ఆహ్వానితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లికి రావొద్దని మొహం మీదే చెప్పడం ఏంటి అని మండిపడ్డారు. ఇది నిజంగా అతిథులను అవమానించడమే, మీరు పెళ్లికి వెళ్లడం వారికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ప్రేమ మాత్రం వాళ్లింటి దగ్గర, విందు మాత్రం వేరే చోటనా? అసలు ఎవరు ఈ పత్రిక ఇచ్చింది. అని మరో నెటిజన్ స్పందించాడు. ఇది నిజంగా అమమానించడమే పెళ్లికి తప్పకుండా పిలవాల్సిందిపోయి, మోహం మీదే రావొద్దని చెబుతారా? అని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ పెళ్లికి రావడం మర్చిపో అని చెప్పడం మొట్టమొదటి సారి చూస్తున్నా..అని అన్నారు చదవండి: ఎండదెబ్బకు గబ్బిలాలు విలవిల.. వాటర్ స్ప్రే కొడుతున్న గ్రామస్థులు.. -
చిగురించే శుభలేఖ.. మీ ఇంటికి వచ్చిన తులసి.. ఆరోగ్యదాయిని!
ఒకప్పడు శుభలేఖ అంటే... పసుపు సుగంధాలతో అందే ఆహ్వానం. డిజిటల్ యుగంలో వాట్సాప్‌లోనే ఆహ్వానం. పెళ్లయ్యాక డిలీట్ చేయకపోతే మెమరీ చాలదు. ఆ తర్వాత ఆ పత్రిక మన మెమరీలోనూ ఉండదు. కానీ... ఈ శుభలేఖ ఎప్పటికీ నిలిచి ఉండే ఓ జ్ఞాపకం. మంచాల వారి పరిణయ ఆహ్వానం... ఏటా మనింటికి ఎన్నో పెళ్లిపత్రికలు వస్తూ ఉంటాయి. ‘అరె! నా పెళ్లిలో పట్టుపరికిణితో బుట్టబొమ్మలా తిరిగిన ఆ చిన్నమ్మాయికి పెళ్లా! కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తోందో? అనుకుంటూ పెళ్లి కార్డును మురిపెంగా చూస్తాం. పెళ్లయిన తర్వాత ఆ కార్డునుపాత పేపర్లలో వేసేయడానికి మనసొప్పదు. శుభలేఖను గౌరవించాలి, ఆ జంట వైవాహిక జీవితం కలకాలం లక్షణంగా సాగాలంటే పెళ్లికార్డును అగౌరవపరచకూడదనే సెంటిమెంట్ మనది. ఈ సెంటిమెంట్‌కు కొత్త నిర్వచనం చెప్తోంది డాక్టర్ శరణ్య. ఆహ్వాన పత్రిక ముద్రించిన పేపర్‌ను తులసి గింజలను కలిపి తయారు చేయించింది. ‘‘నా పెళ్లి తర్వాత ఈ కార్డును మట్టి కుండీలో వేసి నీరు పోయండి. నాలుగు రోజుల్లో కార్డు కరిగిపోతుంది, మరో నాలుగు రోజులకు పచ్చగా జీవం పోసుకున్న తులసి మొక్క మనల్ని పలకరిస్తుంది. మీ ఇంటికి వచ్చిన తులసి, మీ ఇంటి ఆరోగ్యదాయిని. భూమాతకు కొత్త ఊపిరినిచ్చే ఆరోగ్యలక్ష్మిని చూస్తూ మీ ముఖంలో విరిసే చిరునవ్వే మాకు మీరిచ్చే ఆశీర్వాదం’’ అంటోంది. శుక్రవారమే పెళ్లి! డాక్టర్ శరణ్యది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్. ఎంఎస్ ఆఫ్తాల్మాలజీ చేస్తోంది. ఈ నెల 24వ తేదీన పెళ్లి పీటల మీద కూర్చోనున్న శరణ్య తన వివాహాన్ని ఇలా పర్యావరణహితంగా మార్చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకుంది. ‘‘నేచర్ ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్ నాకిష్టం. నా పెళ్లి కూడా అలాగే జరిగితే బావుణ్ణనిపించి అదే మాట నాన్నతో చెప్పాను. పెళ్లి వేదిక అలంకరణ నుంచి భోజనాల వరకు మొత్తం ప్లాస్టిక్ రహితంగా ఉండాలని కూడా అనుకున్నాం. అది పెద్ద కష్టం కాలేదు. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం దొరికింది. కార్డుల కోసం చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ‘ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కార్డ్స్’ కోసం నేను ఇంటర్నెట్లో, నాన్న తన బిజినెస్ కాంటాక్ట్స్‌తో ప్రయత్నించాం. నాన్నకు తెలిసిన వాళ్ల ద్వారా అహ్మదాబాద్‌లో హ్యాండ్‌మేడ్ పేపర్ తయారీతో పాటు మనం కోరిన స్పెసిఫికేషన్లన్నీ వచ్చేటట్లు కస్టమైజ్డ్గా ప్రింట్ చేసిస్తారని తెలిసింది. మూడు నెలల ముందుగా ఆర్డర్ చేయాలి, ఈ ఎకో ఫ్రెండ్లీ ఆహ్వానపత్రికల ఆలోచన తెలిసి మా అత్తగారింట్లో కూడా అందరూ సంతోషించారు. భూమాత పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు నా పెళ్లికార్డుతో ఇంతమందికి తెలిశాయి. దీనికి మూలకారణం మా నాన్నే. ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీ కోసం చైతన్య సదస్సులు నిర్వహిస్తారు. మా చెల్లికి పక్షులంటే ఇష్టం. వేసవిలో పక్షుల కోసం ఒకపాత్రలో నీరు, గింజలు పెడుతుండేది. పక్షుల సంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో రెండు వేల బర్డ్ ఫీడర్ బాక్సులు పంచింది. మా ముత్తాత రాజేశం గారు ఫ్రీడమ్ ఫైటర్. మా తాత శంకరయ్య కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. అదే వారసత్వంతో నాన్న కూడా వేసవిలో నగరంలో వాటర్ ట్యాంకులతో నీటి పంపిణీ వంటి అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. బతుకమ్మ వేడుక కోసం గునుగుపువ్వు సేకరించి శుద్ధి చేసి పంచడం కూడా చాలా ఇష్టంగా చేస్తాం. మనం మన సంస్కృతికి వారసులం మాత్రమే కాదు వారధులం కూడా. ప్రతి సంప్రదాయాన్నీ ఇలా సృజనాత్మకంగా మలుచుకోగలిగితే మనం చేసిన పని మనకు ప్రత్యేకతను ఇస్తుంది. సాంస్కృతిక వారధులుగా సంతోషమూ కలుగుతుంది. పెళ్లి పత్రిక మీద దేవుడి బొమ్మలు, వధూవరుల ఫొటోలు ఉంటాయి. వాటినిపారేయలేక ఇంట్లోనే పెట్టుకుంటే దొంతర పెరిగిపోతూ ఉంటుంది. మా పెళ్లి పత్రిక మాత్రం తులసి మొక్కగా మీ కళ్ల ముందు ఉంటుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ’’ అని సంతోషంగా వివరించింది డాక్టర్ శరణ్య. – వాకా మంజులారెడ్డి -
Viral Wedding Card: వి‘వాహ్’ శుభలేఖ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్
రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఏడిద వెంకటేష్. తన చిన్న కుమార్తె పెళ్లికి పరిమాణంలో.. రూపంలో అచ్చం రెండు వేల రూపాయల నోటును పోలినట్లుంది పెళ్లి కార్డు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్ అనే పదముంది. ‘మేము ఇరువురం వివాహం చేసుకుంటున్నాం.. జీవితపు చివరి శ్వాసవరకూ కలసి ఉంటామని వాగ్దానం చేస్తున్నాం’ అని సింపుల్‌గా సారాంశం ఉంది. నోటుకు మరోవైపు పెళ్లి వివరాలు ముద్రించారు. కొందరికి శుభలేఖ చేతిలో పెడుతుంటే నిజంగా రెండు వేల నోటు అనుకుని నోటు తీసుకునేందుకు మొహమాటపడ్డారు. శుభలేఖేనని తెలుసుకుని వారి సృజనశైలిని మెచ్చుకున్నారు. కాగా, 2017లో వెంకటేష్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ఆహ్వాన పత్రికను బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ముద్రించి ఆకట్టుకున్నారు. తక్కువ ఖర్చు, సృజనాత్మకత కోసమే తాను ఇలా చేశానని వెంకటేష్ ‘సాక్షి’కి తెలిపారు. – రాజమహేంద్రవరం సిటీ -
వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!
ఇటీవలకాలంలో యువత తమ సృజనాత్మకతను జోడించి చాలా వినూతనంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా ఔరా! అనిపించేలా వివాహాలు జరుపుకుంటున్నారు. కొంతమంది హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది చాలా సింపుల్‌గా వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడోక జంట భావించింది కాబోలు. ఆ నవ దంపతుల వివాహా ఆహ్వాన పత్రికను చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు విషయమేమిటంటే...ఆ దంపతులు తమ వెడ్డింగ్ కార్డు వెరైటీగా ఉండాలనుకున్నారు కాబోలు. అందుకోసం వారి వివాహా ఆహ్వాన పత్రికనే ఒక ట్యాబ్లెట్ స్టిప్స్ ఆకారంలో రూపొందించారు. ట్యాబ్లెట్ వెనుకవైపు ఉండే విభాగంలో ఆయా ట్యాబ్లెట్‌కి సంబంధించిన వివరాలు మాదిరిగా.. హెచ్చరిక, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి తదితర అంశాలో వారి సమాచారం ఉంది. నిశితంగా చూస్తేనే అది ఆహ్వాన పత్రిక అని తెలుస్తుంది. పైగా చాలా ఫన్నీగా అనిపిస్తోంది కూడా. పెళ్లి పత్రికలో ఎలా అయితే వధువు, వరుడు వివరాలు ఉంటాయో అలానే అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఇలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్. అంతేకాదండోయ్ వరుడు పేరు ఎళిలరసన్ ఫార్మసీ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, వధువు వసంతకుమారి నర్సింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్. తరుచు సోష్ల్ మీడియాలో యాక్టివిగ్ ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయెంకాను ఎంతగానో ఇంప్రెస్ చేసింది ఈ వివాహ పత్రిక. ప్రజలు చాలా కొత్తదనం కోరుకోవడమే కాదు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని కొనియాడారు. ఇది ఫార్మసిస్ట్ వివాహా ఆహ్వాన పత్రిక అంటూ...ఆ జంట ఆలోచనని ప్రశంసించారు. A pharmacist’s wedding invitation! People have become so innovative these days…. pic.twitter.com/VrrlMCZut9 — Harsh Goenka (@hvgoenka) August 20, 2022 (చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!) -
కుమార్తె వివాహం.. సీఎంకు పెళ్లి పత్రిక అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన కుమార్తె శ్రీహర్షిత వివాహానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంను బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో కలిశారు. ఈనెల 26న హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో రాత్రి 9 గంటలకు జరగనున్న వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ సీఎంకు పెళ్లిపత్రిక అందజేశారు. Called on Hon’ble CM Sri KCR Garu at Pragathi Bhavan & invited to attend the wedding of my younger daughter Sri Harshitha on 26th May. pic.twitter.com/MQPbLJfGZY — V Srinivas Goud (@VSrinivasGoud) May 18, 2022 -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: వెడ్డింగ్ కార్డుపై 'వయలెన్స్' డైలాగ్.. వైరల్
Yash KGF 2 Movie Popular Violence Dialogue On Wedding Card: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో 'కేజీఎఫ్ 2' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో యశ్ చెప్పిన డైలాగ్‌లో పత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ విడుదలైనప్పటినుంచే యశ్ డైలాగ్‌లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇందులోని 'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్‌తో అనేక మీమ్స్, రీల్స్ వచ్చి ఎంతో అలరించాయి. అయితే తాజాగా ఈ డైలాగ్ తరహాలో తన మ్యారేజ్ గురించి వెడ్డింగ్ కార్డ్‌పై డైలాగ్ ప్రింట్ చేయించడం వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ తన పెళ్లి శుభలేఖపై 'మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవైడ్.' అని ముద్రించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది రాకీ భాయ్ క్రేజ్ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అలాగే మరోపక్క బాక్సాఫీస్ వద్ద 'కేజీఎఫ్ 2' వైలెన్స్ బీభత్సంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6 రోజుల్లో రూ. 645 కోట్లను వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చదవండి: కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: బాలీవుడ్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. చదవండి: రాకీభాయ్ ఊచకోత.. ‘కేజీయఫ్ 2’ కలెక్షన్స్ ఎంతంటే.. -
ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా
భువనేశ్వర్: కోవిడ్ నియంత్రణలో భాగంగా పండగలు, ఉత్సవాలు, వివాహాది శుభకార్యాల నిర్వహణపై ప్రభుత్వ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఏ కార్యక్రమం అయినా జనసమూహానికి తావులేకుండా పరిమిత వ్యక్తులతో కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుపుకోవాలనేది ప్రధానమైన నిబంధన. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఛత్తీస్‌గఢ్‌లోని యశ్‌పూర్ జిల్లా, ఫర్సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ కాస్త వినూత్నంగా ఆలోచించాడు. ఆధార్ తరహాలో తన పెళ్లి కార్డ్‌ను ప్రింట్ చేయించి, బంధుమిత్రులకు పంచిపెట్టాడు. పెళ్లికి విచ్చేసే వారంతా ముఖానికి మాస్క్ ధరించడమే కాకుండా భౌతికదూరం పాటించాలని పిలుపునిస్తూ శుభలేఖలో పేర్కొనడం విశేషం. బార్ కోడ్ సైతం కలిగి ఉన్న ఈ కార్డ్‌లో ఆధార్ నంబరు స్థానంలో పెళ్లి తేది, అడ్రస్ స్థానంలో ఆచరించాల్సిన కోవిడ్ నియమాలు ఉండడం ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో సైతం ఈ తరహా వెడ్డింగ్ కార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. -
ఆ పెళ్లి పత్రిక బరువు ఎంతో తెలుసా?
గాంధీనగర్: సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలనుకుంటారు. ఈ వివాహ కార్యక్రమాల కోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరనే విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ షో నుంచి ప్రతివేడుక ప్రత్యేకంగా ఉండాలనుకొని ప్లాన్లు వేస్తుంటారు. పెళ్లి వేడుకలకు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన పెళ్లి వేడుక ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి నిలిచింది. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త మౌలేష్బాయ్ ఉకానీ కుమారుడి వివాహం, సోనాల్బేన్ అనే యువతితో నిశ్చయమైంది. తాను.. బిజినెస్‌మ్యాన్ కావడంతో తన కొడుకు వివాహ వేడుక గ్రాండ్‌గా చేయాలనుకున్నాడు. తన కుమారుడి పెళ్లి కోసం జోధ్‌పూర్‌లోని ఉమెద్ భవన్ ప్యాలెస్‌ను బుక్ చేసుకున్నాడు. ఆ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటి. అక్కడ వేడుకలకు గాను.. ఒక రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు చార్జ్ చేస్తారు. ఆ కల్యాణ మండపంలో ప్లేట్ మీల్స్ ఖరీదు 18 వేల రూపాయలు. అయితే, మౌలేష్ బాయ్ తన కుమారుడి వెడ్డింగ్ కార్డును ప్రత్యేకంగా ముద్రించాడు. అది నాలుగు కేజీల బరువును కలిగి ఒక పెద్ద బాక్సు మాదిరిగా ఉంది. దానిలో పెళ్లి పత్రికతోపాటు.. పెళ్లి వేడుకలో జరిగే కార్యక్రమాలు ముద్రించారు. దానిపై కృష్ణుడి ప్రతీమను కూడా ప్రత్యేకంగా ఉండేలా చూశారు. ఆ పెళ్లి పత్రికలో ప్రత్యేకంగా కొన్ని బాక్సులను ఏర్పాటు చేశారు. దానిలో అతిథుల కోసం ప్రత్యేకంగా, డ్రైఫ్రూట్స్, చాక్లెట్లు, స్వీట్లను ఏర్పాటు చేశారు. ఆ కార్డు ధర ఏడు వేల రూపాయలు, దాన్ని ప్రత్యేకంగా పింక్ కలర్లో ముద్రించారు. దీంతో ఆ పెళ్లి బాక్సు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కాగా, వివాహ వేడుక బంధువులు, స్నేహితుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. గత నెలలోనే పెళ్లి జరిగిపోయినప్పటికీ ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
Special Wedding Card: వావ్! ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా ?
పెళ్లి వేడుకల్లో ఎన్నో కొత్త పద్దతులు వచ్చాయి. పెళ్లికి ఆహ్వానించే తీరులోనూ వెరైటీలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణ యాసలో ముద్రిస్తున్న పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అచ్చంగా ఇదే తరహాలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో బిజీగా ఉండే ఓ డాక్టర్ తన వివాహ ఆహ్వాన పత్రికను వ్యాపార పరిభాషలో.. స్టాక్ మార్కెట్ టర్మినాలజీ అచ్చేయించి పంచాడు. ప్రస్తుతం నెట్టింట ఈ వెడ్డింగ్ కార్డు నవ్వులు పూయిస్తోంది. మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాకు వజీరాబాద్కి చెందిన డాక్టర్ సందేశ్ 2021 డిసెంబర్ 7న అనస్థిషీయిస్ట్ డాక్టర్ దివ్యని మనువాడబోతున్నాడు. ఈ సందర్భంగా బంధుమిత్రులను ఆహ్వానిస్తూ కొత్త పద్దతిలో వెడ్డింగ్‌ను ప్రింట్ చేయించి పంచాడు. ఈ సందర్భంగా పలు చమత్కారాలకు తెర తీశాడు సందేశ్. మీరు ఓ సారి ఆ వెడ్డింగ్ కార్డుపై ఓ లుక్కేయ్యండి. - వివాహ ఆహ్వాన పత్రికను ఇన్షియల్ పబ్లిక ఆఫర్ (ఐపీవో)గా పేర్కొన్నాడు - వరుడు, వధువులను రెండు వేర్వేరు కంపెనీలుగా తెలిపాడు. అంతేకాడు ఈ రెండు కంపెనీలు కలిస్తే బాగుంటుందని ప్రమోటర్లు నిర్ణయించినందు వల్ల ఈ మెర్జ్ జరుగుతోందంటూ పెళ్లిని రెండు వ్యాపార సంస్థల కలయికతో పోల్చాడు. - పెళ్లి వేదికను స్టాక్ ఏక్సేంజీగా, పెళ్లికి వచ్చే బంధు మిత్రులకు ఇన్వెస్టర్ల హోదాని ఆపాదించాడు. - పెళ్లి రిసెప్షన్ జరిగే తేదీలను బిడ్డింగ్ డేట్లుగా సంగీత్ కార్యక్రమాన్ని రింగింగ్ బెల్ అంటూ చమత్కరించాడు - లంచ్‌ని డివిడెండ్‌గా వసతి కల్పించడాన్ని బోనస్‌గా పేర్కొంటూ పెళ్లి పత్రిక ఆద్యాంతం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై తనకున్న ఇష్టాన్ని పేర్కొన్నాడు డాక్టర్ సందేశ్ - తన తల్లిదండ్రులను ప్రమోటర్లుగా పేర్కొన్నాడు. - పెళ్లి పత్రిక బాటమ్ లైన్లో సైతం క్రియేటివిటీని పీక్స్‌కి తీసుకెళ్లాడు. మ్యూచువలఫండ్ సహీ హై, బంపర్ లిస్టింగ్, ఓవర్ సబ్స్క్రైబ్డ్ అంటూ సరికొత్త హిత వ్యాఖ్యాలను జోడించాడు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడో చెప్పలేదు కదూ.. 2021 డిసెంబరు 6వ తేదిన పెళ్లి 7వ తేదిన రిసెప్షన్ ఉంది. కళ్యాణ వేదిక కర్నాటకలోని గుల్బర్గా జిల్లాలోని హుమ్నాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్. -
టాలీవుడ్ యంగ్ హీరో వెడ్డింగ్ కార్డ్ వైరల్!
Karthikeya- Lohitha Wedding Card: ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ దద్దరిల్లేలా చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఒక్క హిట్టుతో బోలెడన్ని అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడీ హీరో. అటు పర్సనల్ లైఫ్‌లోనూ హుషారు మీదున్నాడు కార్తికేయ. త్వరలోనే తను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసి ఆమెను తన అర్ధాంగిగా మార్చుకోనున్నాడు. 'రాజా విక్రమార్క' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కాబోయే భార్య లోహితకు ప్రపోజ్ చేసి ఆమెను అందరికీ పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఎంతో గ్రాండ్‌గా నిశ్చితార్థం జరుపుకున్న కార్తికేయ పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్ చేశారట! ఈ నెల 21న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు హీరో తన ఇష్టసఖి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడట! ఈ మేరకు కార్తికేయ-లోహితల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకకు ఆయన బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా కార్తికేయ లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు. 2010లో మొట్టమొదటిసారి లోహితను కలిసిన ఈ హీరో 2012లో ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్‌గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లాడబోతున్నాడు. -
శ్రీవారికి శుభలేఖ పంపండి.. పెళ్లి కానుక అందుకోండి
తిరుమల: తెలుగు లోగిళ్లలో పెళ్లి శుభకార్యాలు జరుపుకునే సమయంలో విఘ్నేశ్వరుడిని మొదట పూజించి పనులు మొదలు పెడతారు. ఇక వివాహం జరిగే ఇంట్లోని మొదటి శుభలేఖ గుడిలో దేవుని పాదాల చెంత పెట్టి పూజించి బంధువులు, స్నేహితులకు పంచుతుంటారు. చాలామంది కలియుగదైవం తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. మరి దూరపు భక్తులు స్వామివారికి శుభలేఖను పంపించడమెలా? దీనికి టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. అదెలాగో తెలుసుకోండి.. మొదటి శుభలేఖ పంపవచ్చు.. ఇంట్లో వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం ‘శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయవచ్చు. కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. -
పెళ్లి పత్రికలో పేర్లు లేవని కత్తితో దాడి
సాక్షి, సికింద్రాబాద్: పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తి వివాహం జరిగింది. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని బంధువు సర్వేశ్ పెళ్లి రోజే కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. సురేష్ సోదరి బాలమణిని కూడా దూషించాడు. అయితే మిగతా బంధువులందరూ సర్ది చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడదామని ఆదివారం ఉదయం బలమణి తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్లింది. దీంతో సర్వేశ్, అతని సోదరుడు శేఖర్ ఇంటికి వచ్చిన వారిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బంధువులు ఎస్ ప్రవీణ్(30), నోముల పరశురాము(35), డి యాదగిరి (42), ఎన్ ప్రతాప్ కుమార్ (32) తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడినవారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితులు పరారయ్యారు. గాయపడినవారిలో ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను.. -
కరోనా ఎఫెక్ట్: వెరైటీ లగ్గం పిలుపు..
సాక్షి, కడెం(మంచిర్యాల): కరోనా మహమ్మారి వివాహలపై కూడా చాలా ప్రభావం చూపింది. దీనికారణంగా బంధులు, స్నేహితుల మధ్య ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లి .. కేవలం కొద్దిమందిలో మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ మధ్య పెళ్లే కాదు.. పెళ్లి పత్రికలు కూడా వెరైటిగా ముద్రిస్తున్నారు. తాజాగా, ‘జుట్టోల్ల లగ్గం పిలుపు.. పెద్దల దీవెనార్తులతో బెస్తారం పొద్దుపొడువంగ 6.52 గొట్టంక, నా లగ్గం’ అంటూ రూపొందించిన కడెం మండలంలోని నవబ్‌పేట్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జుట్టు మహిపాల్ వివాహ ఆహ్వాన పత్రిక ఆకట్టుకుంటోంది. పిల్లోల ఇంటికాడ లగ్గం, తలువాలు ఏసినంక బువ్వ అంటూ తెలంగాణ యాసతో.. యాదుంచుకుని మాస్కు పెట్టుకుని, శానిటైజర్ పట్టుకుని లగ్గం రావాలనే సూచనలతో.. కూడిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
వైరల్‌గా మారిన 'మై విలేజ్ షో' అనిల్ లగ్నపత్రిక
నంగునూరు (సిద్దిపేట): సాధారణంగా ఏ పెళ్లి పత్రికలో చూసినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ మొదలుపెడతారు. కానీ ఇది ఈ పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అని ఉంది. అసలే కరోనా టైంలో పెళ్లి కదా..అందుకే ఇలా వినూత్నంగా వెడ్డింగ్ కార్డును రూపొందించారు. 'వధూవరులకు కరోనా నెగిటివ్, మరువకుండా మీ ఫోన్ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్లైన్లో ఆశీర్వదించగలరు. విందు..లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి..దాన్ని వ్లోగ్‌లో పెడతాం. ఇక కట్నాలు, కానుకలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూఆర్ స్కాన్ చేసి పంపండి' అంటూ రూపొందించిన ఈ ఫన్నీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పెళ్లి పత్రిక మరెవరిదో కాదండీ..ప్రముఖ యూట్యూబర్, మై విలేజ్ షో సభ్యుడు అనిల్‌ది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్ జీల అనిల్..మే1న తన వివాహం ఉందని ఈ తంతును అందరూ ఆన్లైన్లో తప్పకుండా వీక్షించాలని కోరుతూ ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అంటూ క్రియేటివ్‌గా వెడ్డింగ్ కార్డును రూపొందించారు. అంతేకాకుండా పెళ్లికి సమర్పించే కట్న, కానుకలను కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుందని పేర్కొన్నారు. మై విలేజ్ షోతో పాపులర్ అయిన అనిల్ కరోనా కాలంలో తాము చేసుకునే పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావించి ఇలా క్రియేటివ్‌గా డిజైన్ చేయించారు. View this post on Instagram A post shared by ANIL GEELA (@myvillageshow_anil) -
గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్
శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు, స్నేహితుల ప్రేమ కావాలని ఆహ్వానాలు పంపుతున్నారు తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల. గత ఏడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఈ నెల 22న వివాహం చేసుకోనున్నారు. ఉగాది పర్వదినాన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ ప్రేమికులు వెల్లడించారు. కోవిడ్ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఓ పెళ్లిలో మొదలైన విష్ణు, జ్వాలల పరిచయం స్నేహంగా మారి, ప్రేమగా చిగురించి, ఇప్పుడు మూడు ముడుల బంధంగా మారనుంది. LIFE IS A JOURNEY.... EMBRACE IT... HAVE FAITH AND TAKE THE LEAP.... Need all your love and support as always...@Guttajwala#JWALAVISHED pic.twitter.com/eSFTvmPSE2 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) April 13, 2021 -
ఆధార్ కార్డులో పెళ్లి భోజనాల జాబితా..
కోల్కత్తా: డిజిటల్ ఇండియాకు మద్దుతునిచ్చేందుకు ఈ నూతన వధువరులు భిన్నంగా ఆలోచించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ జంట వివాహ విందు మెనును చూసి పెళ్లికి వచ్చిన బంధువలతో పాటు నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. అచ్చం ఆధార్ కార్డును పోలిన ఈ వెడ్డింగ్ మెను కార్డును మొదట ఫేస్బుక్ షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అచ్చం ఆధార్ కార్డును పోలీన ఈ కార్డులో పెళ్లి భోజనాల జాబితా ఉండటంతో ఇక అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం ఈ కార్డు చక్కర్లు కొడుతోంది. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వరుడు గోగోల్ షాహా, వధువు సుబర్ణ దాస్‌ల వివాహం ఫిబ్రవరిలో 1వ తేదీన(సోమవారం) జరిగింది. అయితే వీరి పెళ్లికి వచ్చిన అతిథుల కో సం విందు అంధించేందుకు ఈ జంట కాస్తా భిన్నంగా ఆలోచించింది. (చదవండి: గొంతులో ఇరుక్కున్న 14 సెం.మీ. కత్తి) అందుకే వారి పెళ్లి పత్రికను అచ్చం ఆధార్ కార్డుల తయారు చేయించి వివాహ భోజనాల జాబితాను ఉంచారు. దీనిపై నూతన వరుడు గోగోల్ స్పందిస్తూ.. ‘ఇది నా భార్య సుబర్ణ దాస్ ఆలోచన. డిజిటల్ ఇండియాకు మేము మద్దుతుగా నిలవాలనుకున్నాం. అయితే మాకు ఇంతకంటే ఉత్తమమైన మార్గం కనిపిచలేదు. అందుకే మా వెడ్డింగ్ మెను కార్డును ఆధార్ కార్డులా తయారు చేయించి డిజిటల్ ఇండియా మద్దతునిచ్చాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వారి పెళ్లి ఆధార్ కార్డు మెనును చూసి బంధువులంతా షాకవుతున్నారు. ‘ప్రస్తుత కాలంలో పెళ్లికి రావాలంటే కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది’ అంటూ ‘మా ఆధార్ కార్డును డైనింగ్ టెబుల్ దగ్గర మర్చిపోయాం’ అంటూ బంధువులంతా చమత్కరించారని చెప్పాడు. (చదవండి: వైరల్: ఫ్రెండ్‌తో కాఫీ షాపులో సారా టెండూల్కర్) -
వివాహ వేడుక.. వినూత్న ఆలోచన
ఎవరైనా పెళ్లికి పిలిస్తే, వారికి బహుమతి ఏమివ్వాలా అని ఆలోచిస్తారు. వస్తువు కొనాలా, డబ్బులు ఇవ్వాలా అని తర్జనభర్జనల తరవాత ఒక నిర్ణయానికి వస్తారు. వీలైనంతవరకు డబ్బు ఇవ్వడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. అలా ఇవ్వటం వల్ల కొత్త జంట వాళ్లకు కావలసింది వాళ్లు కొనుక్కోవచ్చు. అయితే పెళ్లికి బయలుదేరే ముందు కానీ కొన్ని విషయాలు గుర్తుకు రావు. ముఖ్యంగా నూతన వధూవరులకు ఇవ్వాలనుకునే నగదును ఉంచటానికి కావలసిన గిఫ్ట్ క్యాష్ కవర్. ఓ పక్కన ముహూర్తానికి సమయం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కవరు కోసం వెతుకులాట కొనసాగుతూ ఉంటుంది. చివరకు ఏమీ చేయలేక, వధూవరుల చేతిలో నేరుగా డబ్బు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంక కవరు కోసం వెతుకులాడవలసిన అవసరం లేదు. నేరుగా వారి అకౌంట్లోకి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు. ఇంకో అడుగు ముందుకు వేశారు. తమిళనాడులోని మదురైలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న టి. జె. జయంతి కుటుంబం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. శుభలేఖ మీద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా నూతన వధూవరులకు ఇవ్వాలనుకుంటున్న నగదు బహుమతిని ఈ కోడ్ ద్వారా బదిలీ చేసేందుకు వీలు కల్పించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా వివాహానికి హాజరు కాలేని వారి కోసం ఆ ఆలోచనను ఆచరణలో ఉంచారు. ‘‘30 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పెళ్లి కానుకను క్యూఆర్ కోడ్ ద్వారా పంపారు, మా కుటుంబంలో ఈ విధంగా క్యూఆర్ కోడ్ ప్రచురించటం ఇదే ప్రథమం. ఆదివారం నాడు వివాహం జరిగింది. మరుసటి రోజు నుంచి ఈ కార్డు వైరల్ అవుతోంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు’’ అంటున్నారు జయంతి. ఆన్లైన్ టెక్నాలజీ వల్ల కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ఒక వివాహం సందర్భంగా, ఇళ్ల దగ్గర నుంచి ఆన్లైన్లో వివాహం వీక్షిస్తున్న బంధువులు, స్నేహితులకి, వారివారి ఇళ్ల దగ్గరకే విందును ఆర్డర్ చేశారు. ఏ లోటూ రాకుండా, దేనినీ మిస్ అయ్యామనే భావన లేకుండా, ఆన్లైన్ ద్వారా అన్నీ సమకూరుతున్నాయి. టెక్నాలజీకి రెండు చేతులతో నమస్కరించాల్సిందే. -
ఐతారం నాడు లగ్గం.. అర్సుకునేటోల్లు వీళ్లే
పెళ్లి.. ఇప్పుడు పెద్ద ఇవెంట్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అంతా ఇప్పుడు వెరైటీ వైపు పరుగులు పెడుతున్నారు. తమ పెళ్లి ఇతరుల కంటే భిన్నంగా.. చాలా చాలా క్రియేటీవ్‌గా ఉండాలని భావిస్తున్నారు. ఎంగేజ్మెంట్ మొదలు.. రిసెప్షెన్ వరకు ఇతరుల కంటే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన శుఖలేఖనే వైరైటీగా ముద్రించాడు. బహుశా ఈ రీతిలో శుభలేఖ ఉండడం ఇదే మొదటిసారి కావచ్చు. ఎందుకంటే ఇది అచ్చమైన తెలంగాణ భాషలో ఉంది. ఇందులో పలానా వారి పెండ్లి పిలుపు, ఆహ్వానించువారు, విందు, స్వస్తిశ్రీ చాంద్రమాన సంవత్సర, ఆదివారం, కనిష్ఠ పుత్రుడు, గరిష్ఠ పుత్రిక, కల్యాణ వేదిక’’ వంటి పదాలేం లేవు. అంతా తెలంగాణ వాడుక భాషలోనే ‘‘లగ్గం పిలుపు, పిలిశెటోళ్లు, బువ్వ, ఐతారం అంబటాల్లకు 11.37 గొట్టంగ, మా సిన్న పిల్లగాడు, తొలుసూరి బిడ్డ, లగ్గం యాడనో ఎర్కనా’’ వంటి పదాలతో వినూత్నంగా రూపుదిద్దిన ఈ శుభలేఖ తెలంగాణ యాసను ప్రతిబింబించేలా ఉంది. ఇంతకీ పెళ్లి ఎవరిదంటే... ఈ వినూత్న శుఖలేఖ రాయించింది మై విలేజ్ షో’లో ఓ ఆర్టిస్ట్ అయిన చంద్రమౌళి (చందు). కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కొందరు యువకులు మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానెల్ నడిపే సంగతి తెలిసిందే. ఇందులో వచ్చే షార్ట్ ఫిల్ముల్లో చందు నటిస్తుంటారు. తన వివాహానికి ఇలా శుభలేఖను తయారు చేయించుకొని చందు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక ఈ శుఖలేఖను చూసిన నెటిజన్లు చందుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.‘అన్న, లగ్గం పత్రిక మస్తుగున్నదే’, ‘మన తెలంగాణ యాస, బాషాలో, ఇప్పటి దాక ఇట్లాంటి లగ్గం పత్రిక సూడలేదు’, ‘లగ్గం కారట మస్తుగుంది తమ్మి’ అంటూ తెలంగాణ భాషలో కామెంట్లు పెడుతూ చందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒల్లదో అనుకునేరు నాదే😜 pic.twitter.com/LmXnkWtaQJ — chandu_myvillageshow (@chandu_mvs) December 31, 2020 -
చూతము రారండి
అరవై నాలుగు కళల్లో పెళ్లి కళ లేదు (నవ్వులాటకు లెండి). కానీ పెళ్లిలో అరవై నాలుగేమిటి.. నూట అరవై నాలుగు కళకళలు ఉంటాయి. కళలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. పెళ్లికళ మాత్రం మారుతూ ఉంటుంది. మెరుగౌతుంది. తరుగౌతుంది. తరుగైనా, మెరుగైనా తళుక్కున మాత్రం ఒక మెరుపౌతుంది. ప్రస్తుతమిది పెళ్లిళ్ల సీజన్. మన పెళ్లి వేడుకలు కాలానుగుణంగా ఎలా మారుతున్నాయో చూతము రారండి. ఒకప్పుడు ఏడు రోజుల పెళ్లిళ్లు జరిగేవి. మెల్లగా ఐదు రోజులు, మూడు రోజులు, రెండు రోజుల పెళ్లిళ్లు అయ్యాయి. ఇంకా కుదించుకుపోయి ఒక్కరోజుకు పరిమితమయ్యాయి కూడా. నానమ్మ– తాతయ్య తరం నుంచి అమ్మా–నాన్న తరం వరకు వచ్చిన మార్పులవి. కారణాలు ఏమయితేనేం ఇండియా సంపన్నమైంది. అమెరికా ఉద్యోగాలతో ఇండియా చేతిలో డబ్బు గలగలలు పెరిగాయి. ఈ తరానికి పెళ్లి మళ్లీ వారం రోజుల వేడుకైంది. అంతరించిపోయిన వేడుకలను యథాతథంగా తిరిగి తోడడం కంటే మనకు నచ్చిన ఉత్తరాది సంప్రదాయాలను తెచ్చుకుంటే... ఎలా ఉంటుంది? భారతీయతలోని భిన్నత్వాన్ని ఏకత్వం చేసినట్లు ఉంటుంది. ఇంకేం... ఉత్తరాది, దక్షిణాది సంప్రదాయాలు కలిసిపోయాయి. మెహందీ, సంగీత్లకే రెండు రోజులు! మన దగ్గరెలాగూ ఓ రోజు ప్రదానం. ఓ రోజు పెళ్లి కూతుర్ని చేయడం. ఓ రోజు గంధపు నలుగు. తాళికి, తలంబ్రాలకు ఎటూ ఒకరోజు ఉంటుంది. మరుసటి రోజు అమ్మాయిని అత్తవారింటికి తోడ్కొని వెళ్లడం... ఏడు రోజులు సరిపోయాయి. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం. అదయ్యాక పదహారు రోజుల పండగ ఎలాగూ ఉంటుంది. ఒక పెళ్లి ఇన్ని పండుగలను తెస్తుంది. పండగలతో ఆగదు, పనులనూ తెస్తుంది. ఇన్ని పనులా! ఎన్ని పనులైతేనేమి? ఒకప్పుడు ధాన్యం పట్టడం నుంచి విస్తరాకులు వేయడం వరకు అన్ని పనులనూ ఇంట్లో వాళ్లు చేసుకునేవాళ్లు. ఇంటిల్లిపాదీ పెళ్లి పనులు చేసేవాళ్లు. బంధువులు కూడా పెళ్లి పనుల్లో సాయం చేసేవాళ్లు. ఇప్పుడు ప్రతిదీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేతుల్లోనే. ఇప్పటి సంపన్న పెళ్లిళ్ల ట్రెండ్ చూస్తుంటే మూడుముడులు వేయడానికి నచ్చిన వేదిక కోసం ముల్లోకాలను గాలిస్తున్నట్లే ఉంది. ఈ వెకేషన్ మ్యారేజ్‌లకు కేరళ కొబ్బరితోటలు, బాలిలోని పగడపు దీవులలోపాటు అరబ్ ఎమిరేట్స్ కూడా భారతీయ పెళ్లి కళను సంతరించుకుంటున్నాయి. ఇటీవలే ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడి కొడుకు పెళ్లి అబుదాబిలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌కి ఖమ్మంలో డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో కళాత్మక నిర్మాణాలు, వాటర్ ఫౌంటెయిన్లను, బాహుబలి సెట్టింగులను మించిన సెట్టింగులను వేశారు. ఇలా శుభలేఖల నుంచి దుస్తులు, ఆభరణాలు, అలంకరణ, విందు భోజనాలు, పెళ్లి ఫొటోల వరకు ప్రతిదీ కొత్తదనం– సంపన్నతల కలబోత అయింది. పెళ్లి పిలుపు 50 ఏళ్లనాటి ఒక పెళ్లిపత్రిక పంతొమ్మిది వందల అరవైల నాటి పెళ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండ ధారుడై క్రీగంటి చూపులతో సీతను చూస్తుండేవాడు. క్రమంగా వాళ్ల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు! పెళ్లికి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కాకుండా, ఫొటోస్టూడియోల నుంచి ఫొటోల రూపంలోనే వచ్చేశాయి. రాజుల కాలం నాటి చుట్ట చుట్టిన వర్తమాన వస్త్రం నమూనాలోకి పెళ్లిపత్రికను తెచ్చుకున్నారు కొందరు. చిన్న బ్యాటరీని అమర్చిన పెళ్లి పత్రికలూ వచ్చాయి. కార్డు తెరవగానే సంగీతం వినిపించేది. కొన్ని కార్డులు ఫొటో ఫ్రేమ్‌తో వస్తున్నాయి. పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పత్రికను తీసేసి ఎవరికి వాళ్లు తమకు ఇష్టమైన ఫొటోను అమర్చుకుని డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పటి పెళ్లి కార్డు ఈ మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెళ్లి పత్రికను (పెళ్లి ఫైల్ అనాలేమో) ఓపెన్ చేయగానే వధూవరుల ఫొటోలతో ఉన్న చిన్న వీడియో ప్లే అవుతోంది. ఆ ఆహ్వానం చూస్తుంటే పెళ్లి చూసినట్లే ఉంటోంది. పెళ్లి పందిరి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత పసుపు దంచడానికి, పందిరి వేయడానికి కూడా ముహూర్తం పెట్టుకుంటారు. మామిడాకులు కట్టిన ఒక రాటను నాటుతారు. ఆ తర్వాత పందిరి కోసం కొబ్బరి ఆకులు, తాటాకులు తేవడం కూడా ముఖ్యమైన ఘట్టమే. వధువు తండ్రి బండి కట్టి ఎడ్లను అదిలిస్తుంటే తల్లి నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని ఎదురు రావడం ఓ సంతోషకరమైన ఘట్టం. తాజా కొబ్బరాకుల పచ్చి వాసనతో పచ్చటి పందిరి సిద్ధమయ్యేది. గెలవేసిన అరటి చెట్లు ద్వారపాలకుల్లా ఠీవిగా కొలువుదీరేవి. మామిడి తోరణాలు ఆరడుగుల ఆజానుబాహుల నుదుటిని తాకి పలకరిస్తుంటే.. అంతగా ఎదిగిన సంగతి గుర్తొచ్చి మురిసిపోతూ, మామిడి తోరణం కింద ఒదిగి నడిచేవాళ్లు. అలాంటి పందిరిని రంగుల షామియానా మింగేసింది. ఇప్పుడు మళ్లీ సంప్రదాయపు ట్రెండులో భాగంగా పెళ్లికి ఇంటి ముందు పందిరి వేయడం అనే ముచ్చట అందరినీ మురిపిస్తోంది. తన గంగడోలుతో ఆడుకున్న పాపాయి పెళ్లి కూతురవుతోందని ఆ ఇంటి ఎడ్లకు ఎలా తెలుస్తుందో ఏమో! ఎప్పుడూ మొరాయించే ఎడ్లు కూడా ఆ రోజు తలలూపుతూ ఉల్లాసంగా కదిలేవి! పెళ్లి మండపం ఒకప్పుడు ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరే పెళ్లి మండపం. వచ్చేవారు ఎక్కువ మంది ఉంటే ఊరి ఆలయంలోని దేవుని మండపమే కల్యాణవేదిక. ఇప్పుడు కల్యాణ వేదిక ఫంక్షన్ హాల్‌కు తరలిపోయింది. మండపం అలంకరణలో మన దగ్గర పూచే పూలకు ఆదరణ తగ్గి, కార్నేషన్, ఆర్చిడ్ వంటి పరదేశీ పూలు వచ్చి చేరాయి. పెళ్లితోపాటు నిశ్చితార్థం, రిసెప్షన్ వేదికలు కూడా ఇప్పుడు ఫంక్షన్ హాల్లే. పెళ్లి దండలు పెళ్లి సీజన్‌ను బట్టి మల్లెపూలు, చేమంతులు, మరువం, కనకాంబరాలతో చిక్కగా మాలలు కట్టి, ఐదారు మాలలను కలిపి ఒత్తుగా దండ అల్లేవాళ్లు. మన దగ్గర గులాబీ తోటలు విస్తరించిన తర్వాత వధూవరుల మెడలను గులాబీ దండలు అలంకరించాయి. పీటల మీదకు వచ్చేటప్పుడు ధరించిన ఆ దండలు.. పెళ్లి పూర్తయ్యేలోపు రెక్కలు రాలి కాడలుగా మిగిలేవి. బెంగళూరు హైబ్రీడ్ గులాబీలు ఈ సమస్యని తప్పించాయి. కానీ మెడలు లాగేసేటంతటి బరువుగా ఉండేవి. పువ్వు మొత్తంతో పనేంటి రెక్కలుంటే చాలుగా అంటూ పూలరెక్కలతో దండలు అల్లే ట్రెండ్ కూడా వచ్చింది. అలాగే మెడలో ఉండీ లేనట్లుంటే ఆర్చిడ్స్, బరువైన కలువపూల దండలు వచ్చాయి. సన్నటి మల్లెల మాలలు కూడా కనిపిస్తున్నాయి. వధూవరుల దుస్తులకు మ్యాచింగ్ దండలు వచ్చేశాయి. ఇక్కడ వధువు చీర, జాకెట్ రంగులకే ప్రాధాన్యం. వధూవరుల దుస్తులు కనుక కాంబినేషన్లో ఉంటే పూలదండలు కూడా అదే రంగుల్లో ఉంటున్నాయి. పెళ్లి దుస్తులు ఒకప్పుడు వధువు పెళ్లి దుస్తుల ఎంపిక కూడా వరుడి తరఫు వాళ్లదే. ‘మా అమ్మాయికి ఈ రంగు ఇష్టం’ అని వధువు తల్లి ఒక చీర చేతికి తీసుకుంటే... ‘ఆ చీరతో పెళ్లి పీటల మీద కూర్చుంటే మా బంధువులు నవ్వుతారు’ అని అబ్బాయి తరఫున ఎవరో నోరుజారేవాళ్లు. ఇప్పటి వధువు.. తనకు కూడా ఇష్టాయిష్టాలున్నాయని ప్రకటించింది. కొత్తదనంలో ఎన్ని రకాల దుస్తులు మారినా.. పెళ్లి చీర ప్రత్యేకత మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అబ్బాయిలే పెళ్లి దుస్తుల శైలిని మారుస్తూ వస్తున్నారు. యాభై– అరవై ఏళ్ల కిందట అందరూ పంచెలు కట్టుకున్నారు. కాలేజ్‌లో చదివిన వాళ్లు ప్యాంటు ధరించడం అనే ట్రెండ్‌ని సెట్ చేశారు. ఎనభైల నాటికి సూట్లు ధరించారు. కొత్త మిలీనియంలో మన సంప్రదాయాన్ని పాటించడం అనే ఫ్యాషన్‌లో జారి పోతున్న పట్టు పంచెలతో కుస్తీలు పడుతూ, రాజస్థానీ షేర్వాణీలను ఆశ్రయిస్తున్నారు. మగపెళ్లి వాళ్లు హుందాగా ‘మీరే వెళ్లి అమ్మాయికి నచ్చినవి తీసుకోండి’ అని వధువు తల్లిదండ్రుల చేతిలో డబ్బు పెట్టేస్తున్నారు. పెళ్లి దుస్తుల షాపింగ్‌కి వధువు కూడా వెళ్లడం మొదలైంది. పెళ్లి అలంకరణ పెళ్లి అలంకరణలో కాళ్లకు పారాణితోపాటు నుదుట బాసికానికి అగ్రస్థానం ఉండేది. అందుకు తగ్గట్లే కిరీటం మీద కలికితురాయిలాగ వరుడికి పెద్ద బాసికం ఉండేది. ఆ బాసికానికి రెండు వైపులా చెంపల మీద జారుతూ పట్టుకుచ్చులు, ముఖమల్ కుచ్చులు వేళ్లాడుతుండేవి. ఇప్పుడు బాసికం నుదుటి బొట్టంత చిన్నదిగా మారిపోయింది. అప్పట్లో పెళ్లి కూతురి అలంకరణ బంధువులే చేసేవాళ్లు. కొత్తగా పెళ్లయిన యువతులు, అలంకరణ మీద ఆసక్తి ఉన్న మహిళలు చొరవగా ముందుకు వచ్చేవాళ్లు. ఇక పూలజడల్లో కనకాంబరాలు, మల్లెలు, మరువాలుండేవి. ఇప్పుడవి కనుమరుగయ్యాయి. ఆర్చిడ్స్, పేపర్ ఫ్లవర్స్, గోల్డ్ రిబ్బన్ ఫ్లవర్స్ జడలుగా అమరుతున్నాయి. ఇప్పుడు వధువు అలంకరణ ఒక పరిశ్రమగా మారిపోయింది. బ్రైడల్ మేకప్ బ్యూటీపార్లర్‌లో కానీ బ్యూటీషియనే మండపానికి వచ్చి మేకప్ చేయడం కానీ జరుగుతోంది. పెళ్లి వంటలు అరిసెలు, బొబ్బట్లు, కజ్జికాయలు, బూందీ లడ్డు, జిలేబీ, వడలు, సుగీలు, పులిహోర, పాయసం, పప్పు, నెయ్యి, కాయగూరల వంటలను అరిటాకులో వడ్డించేవాళ్లు. చివరగా అరటిపండు, తమలపాకులు, వక్కపొడితో భోజనం పూర్తయ్యేది. పీటల మీద కూర్చుని ప్రశాంతంగా తినేవాళ్లు. బంతి చాపలు, టేబుళ్లు– కుర్చీలు వచ్చాయి వచ్చి వెళ్లిపోయాయి. ఇప్పుడు బరువైన ప్లేట్ చేత్తో పట్టుకుని, బరువు మోయగలిగినంత సేపు ఎంత తిన్నామో అదే భోజనం. పదార్థాలు మాత్రం బారులు తీరి ఉంటున్నాయి. మూడు రకాల స్వీట్లు, రోటీ, నాన్, పుల్కా, పూరీ, వెజ్‌టబుల్ బిరియానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, చైనీస్, థాయ్, కాంటినెంటల్ వంటకాలు, ఆవకాయ అన్నం, కరివేపాకు అన్నం, పనీర్ కర్రీ, జీడిపప్పు కూర, వేపుళ్లు, వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఊరగాయలు, పొడులు... నోరూరిస్తుంటాయి. భోజనానికి ముందు సలాడ్లు, భోజనం తర్వాత డెజర్ట్‌లు. పెళ్లి పెద్దకి మాత్రం తిన్న వారికి తిన్నంత పెట్టాలనే ఉంటుంది. అయితే కేటరింగ్ సప్లయర్లకు ట్రైనింగ్‌లో భాగంగా గరిటెలోకి కూర రాకుండా వడ్డించే నైపుణ్యం అలవడి ఉంటోంది. పెళ్లెప్పుడు అని అడగడానికి ‘పప్పన్నం ఎప్పుడు’ అని అడిగేవాళ్లు అప్పట్లో. పెళ్లితో అంతగా కలగలిసిపోయిన ముద్దపప్పు మాత్రం పెళ్లి భోజనాల్లో కనిపించడం లేదిప్పుడు! పెళ్లి ఊరేగింపు వరుడు మోతుబరి అయితే ఏనుగు అంబారీ మీద, మిగిలిన వాళ్లు గుర్రం మీద ఊరేగేవాళ్లు. వరుడి వెంట అతడి బంధువులు గుర్రం వెంట నడిచేవాళ్లు. గ్రామంలో ప్రతి గుడి దగ్గర ఆగి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి ముందుకు సాగేవాడు వరుడు. వధువు పల్లకిలో ప్రయాణమవుతుంది. పల్లకి వెంట వధువు బంధువులు తరలి వెళ్లేవాళ్లు. నడవగలిగిన వాళ్లు నడిచి వస్తుంటే, మిగిలిన వాళ్లు ఎడ్ల బండిలో అనుసరించేవాళ్లు. పెళ్లి కోసం ప్రత్యేకంగా సవారి బండ్లు ఉండేవి. పెళ్లి బండి ఎడ్లను మువ్వలు, గజ్జెలు, నల్లతాళ్లతో అలంకరించేవాళ్లు. ఇప్పుడు పూలతో అలంకరించిన టాప్‌లెస్ కారులో వధూవరుల ఊరేగింపు జరుగుతోంది. అది కూడా ఊరంతా కాదు, విడిది ఇంటి నుంచి కల్యాణ మండపం వరకే. పెళ్లి కూతురి వెంట పది– ఇరవై బండ్లు ఉండేవి. పెళ్లి బండ్ల సంఖ్య పెద్దదయితే... అది, వధువుకి ఆత్మీయుల బలగం అంత పెద్దదని చెప్పకుండా చెప్పడం. పెళ్లి ఫొటోలు ఓ యాభై ఏళ్ల కిందట పెళ్లికి ఫొటోలు తీయించుకోవడం ఓ లగ్జరీ. అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలే. ఓ పది ఫొటోలు... తీయించుకుంటే అదే ఎక్కువ. ఎనభైలకు కలర్ రీల్ వచ్చింది. పెళ్లి చీరను ఫొటోలో చూసుకుని మురిసిపోయే చాన్స్ పెళ్లి కూతురికి వచ్చింది. వీడియో కూడా వచ్చింది. కెమెరామన్ చెప్పినట్లు పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి పురోహితుడికి ఎదురైంది. అతిథులు కెమెరా టీమ్ వీపులను చూసి చూసి బోరు కొట్టి, పక్కన కూర్చున్న వాళ్లతో కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయేవాళ్లు. అప్పుడొచ్చాయి స్క్రీన్లు. అతిథులకు పెళ్లిని స్క్రీన్ మీద చూసే భాగ్యం కలిగింది. డ్రోన్ కెమెరాతో కూడా పెళ్లి తంతును షూట్ చేయించుకుంటున్నారిప్పుడు. ‘పెళ్లిని సినిమా కూడా తీయించారా’ అని అడగడంలో అమాయకత్వం, ‘తీయించాం’ అని చెప్పడంలో ఆడంబరం కొంతకాలం రాజ్యమేలాయి. క్రమంగా పెళ్లి తంతు మొత్తంలో కెమెరా టీమ్‌దే పై చేయిగా మారింది. -
పెళ్లి పత్రికలో పేరు వేయలేదని..
చెన్నై,అన్నానగర్: ఏలుమలై సమీపంలో బుధవారం పెళ్లి ఆహ్వాన పత్రికలో పేరు వేసే విషయంలో ఏర్పడిన తగాదాలో మహిళ మృతి చెందింది. తండ్రి, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా, ఏలుమలై సమీపంలో ఉన్న తుళ్లుకూట్టి నాయకనూరుకు చెందిన రామర్ (60), చిన్నస్వామి బంధువులు. వీరి గృహాలు పక్కపక్కనే ఉన్నాయి. రామర్ కుమారుడు సతీష్‌కుమార్ (29) వివాహానికి అమ్మాయి ఇంటి వారు ఆహ్వాన కార్డును అచ్చుకొట్టారు. ఆ కార్డులో చిన్నస్వామి పేరు వేయకూడదని రామర్ తరఫున వారు చెప్పారు. రామర్, చిన్నస్వామి మధ్య తగాదా ఏర్పడింది. బుధవారం చిన్నస్వామి భార్య అంగమ్మాల్ (66) సతీష్‌కుమార్‌ను చూసి తిట్టింది. ఇరు కుటుంబాల మధ్య తగదా ఏర్పడింది. అంగమ్మాల్ కిందపడి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స కోసం మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంగమ్మాల్ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామర్, సతీష్‌కుమార్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
సెకండ్ ఎడిషన్
కథకుడు, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ తన ఇద్దరు అబ్బాయిల పెళ్లిళ్లు ఒకేసారి చేశారట. పెళ్లి పత్రికలు వేయించి ఇవ్వడానికి ఒక మిత్రుని ఇంటికి వెళ్లారు. ఇవ్వడంలో కొంచెం ఆలస్యమైంది. దానికి వివరణగా– ‘‘ఫస్ట్ ఎడిషన్ అయిపోతే మరో ఎడిషన్ వెయ్యవలసి వచ్చింది’’ అని జోక్ చేశారట పురాణం. ‘‘నా రచనల్లో ఇప్పటివరకూ సెకండ్ ఎడిషన్‌కి వచ్చింది ఈ శుభలేఖే’ అని కూడా ముక్తాయించారు. -
పుచ్చకాయ పత్రిక తీసుకోండి.. పెళ్లికి రండి!
వెండి బంగారుతో నగిషీలు చెక్కి నవరత్నాలు పొదిగిన పెళ్లిపత్రికలను పంచే సంపన్నుల గురించి వార్తలొచ్చాయి. బంగారు నగలు, పట్టుచీరలు వంటి ఖరీదైన కానుకలతో కూడిన పెళ్లిపత్రికలను ఇచ్చినవారూ ఉన్నారు. పెళ్లిపత్రిక అంటే వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఎంతో ఖరీదైనవి ముద్రించి పంచడం చూస్తుంటాం. కానీ బళ్లారినగరవాసి పెళ్లి ఆహ్వానపత్రికను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. సాక్షి, బళ్లారి : నగరంలోని ఎస్పీ సర్కిల్ సమీపంలో సాయిగోపాల్, వాణికుమారిల కుమారుడు సాయి సందీప్ ఎస్జీ కాలేజీలో బాటనీ హెచ్ఓడీగా పని చేస్తున్నారు. ఈయన పెళ్లి అదే కాలేజీలో వృక్షశాస్త్రం లెక్చరర్‌గా పని చేస్తున్న తేజస్వినితో కుదిరింది. పెళ్లి ఆహ్వాన పత్రికలను వినూత్న తరహాలో ముద్రించాలని భావించిన సాయి సందీప్ మండుటెండల్లో తీయగా ఉపశమనం కలిగించే పుచ్చకాయ మీద పెళ్లి పత్రికను ముద్రించి, బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు. వెయ్యి పుచ్చకాయ పత్రికల పంపిణీకి ఏర్పాట్లు ఇప్పటివరకు 400 వరకు పుచ్చకాయలను పంపిణీ చేశానని, మొత్తం వెయ్యి మందికి ఆహ్వానం పలకనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయమే మార్కెట్లో 100కు పైగా పుచ్చకాయలను కొనుగోలు చేసి బంధుమిత్రులకు అందజేస్తున్నామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు కూడా తొలుత వ్యతిరేకత వ్యక్తం చేశారని, కొంత మందికి పెళ్లి ఆహ్వానాలు పలికిన తర్వాత పుచ్చకాయలపై పెళ్లి ఆహ్వానం పలకడంతో సంతోషించారని, దీంతో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వృథా కాకూడదనే ఈ ప్రయత్నం సాయి సందీప్ సాక్షితో మాట్లాడుతూ మే 9న పెళ్లి సత్యనారాయణ పేటలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మంటపంలో పెళ్లి ముహూర్తమని తెలిపారు. ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేసి పంపిణీ చేసినా ఇలా చూసి అలా పడేస్తారని, దీంతో తాను అందించిన ఆహ్వాన పత్రిక వృథా కాకూడదని, గుర్తుండాలన్న సంకల్పంతో పాటు కళింగర కాయపై పెళ్లి వివరాలను రాసిన కాగితాన్ని అంటించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికను చూసిన తర్వాత చల్లని పుచ్చకాయను ఆరగించాలన్నదే తన ఉద్దేశమన్నారు. -
ఓటరు గుర్తింపు కార్డు కాదు పెళ్లి పత్రిక
బొమ్మనహళ్లి : ఓటు హక్కుపై తమ వంతు జాగృతి కల్పించేందుకు ఓ జంట తమ పెళ్లి పత్రికను ఎన్నికల గుర్తింపు కార్డులా ప్రచురించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ధార్వాడలో బెస్కాం అధికారి మంజునాథ్ కుమారుడు సునీల్‌కు, హెస్కాంలో పనిచేస్తున్న మరో ఇంజనీర్ మహేశ్ సోదరి అన్నపూర్ణలకు వివాహం నిశ్చయించారు. ఈనెల 26న వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు వినియోగం ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ కాబోయే జంట తమ పెళ్లి కార్డును ఓటరు కార్డుల ముద్రించి అందరికి ఆహ్వానం పంపారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ నూతన జంటను అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
కొత్త సందేశాలకు వేదికలవుతున్న లగ్నపత్రికలు
ఒకప్పుడు పెళ్లి పత్రిక అంటే వ్యక్తిగత విషయంగా ఉండేది. ఇప్పుడది పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంటోంది. సామాజిక సందేశాలతో పెళ్లి పత్రికలు కొత్తబాట పట్టాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయపరమైన ప్రచార హోరులోనూ అవి భాగమవుతుండడం విశేషం. సాక్షి, సిటీబ్యూరో :మీ రాక మా కోరిక. మాకు ఆనందదాయకం అనీ, కానుకలు వద్దు.. మీరు రావడమే మాకు సంతోషం. వధూవరులకు ఆశీర్వచనాలివ్వండి లాంటి విన్నపాల స్థానంలో ఇప్పుడు ఫలానా పార్టీకి ఓటేయండి అంటూ అభ్యర్థనలు చోటు చేసుకుంటున్నాయి. ‘అవును నేను మోదీ భక్తుణ్నే’ అని సగర్వంగా చెబుతున్నారు శంషాబాద్ నివాసి వై.ముఖేష్‌రావు (27). మహాత్మా గాంధీ తర్వాత మోదీ మాత్రమే అంత గొప్ప నేత అని నిస్సందేహంగా విశ్వసించే ముఖేష్.. ఆ విశ్వాసాన్ని చూపించడంలో అందరికంటే వినూత్నమైన దారిని ఎంచుకున్నారు. కానుకలొద్దు..ఓటే ముద్దు.. అని అభ్యర్థిస్తున్నారు ముఖేష్. తన పెళ్లికి వచ్చేవారెవరూ ఎటువంటి కానుకలూ తేవద్దని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా ప్రధాని మోదీకి మద్దతుగా ఓటేయడమే తమకు అతిథులు ఇచ్చే కానుక అంటూ ఆయన త్వరలో జరగనున్న తన పెళ్లి పత్రికపై ముద్రించడం విశేషం. ‘పెళ్లి పత్రిక ద్వారా ఓటు వేయమని అడగడం గురించి మొదట్లో మా బంధుమిత్రులు అభ్యంతరం పెట్టారు. నేను వాళ్లని కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది’ అంటారు ముఖేష్. మనం రోజువారీ జీవితపు హడావుడిలో పడి దేశం కోసం ఏమీ చేయలేకపోతున్నా ప్రజల పురోభివృద్ధికి పనిచేస్తున్న నేతకు మద్దతు తెలపడం మన కనీస బాధ్యత అంటున్నారీ మోదీ భక్తుడు. దేశవ్యాప్తంగానూ.. పెళ్లి పత్రికలు సామాజిక సందేశాలను మోసుకురావడమనేది కొంతకాలంగా ఉందని బల్కంపేటలోని వెంకటరమణ గ్రాఫిక్స్‌కు నిర్వాహకులు వి.వి.గిరి చెప్పారు. ఆహారాన్ని వృథా చేయొద్దనీ, కొంతమంది మొక్కలు పెంచమని పర్యావరణానికి మద్దతుగా, కొన్ని పత్రికల్లో స్వచ్ఛభారత్‌ను ప్రోత్సహిస్తూ కొంత మంది క్లయింట్లు వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయమని అడుగుతుంటారని ఆయన చెప్పారు. అయితే రాజకీయ పార్టీల ప్రచారం గురించి ఇప్పటిదాకా తమను ఎవరూ సంప్రదించలేదన్నారు. పెళ్లి పత్రికలు పార్టీల ప్రచార మార్గాలు కావడమనేది తాజాగా మొదలైన ట్రెండ్. ఇటీవలే దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. జైపూర్‌కి చెందిన భన్వర్‌లాల్ గత జనవరి 22న కుమార్తె పెళ్లి పత్రికలో బేటీ బచావో, బేటీ పడావో అంటూ సందేశాన్ని ప్రచురించి దాంతోపాటే రానున్న ఎన్నికల్లో మోదీకి ఓటేయమంటూ అభ్యర్థనను ముద్రించడం మీడియాను ఆకర్షించింది. అలాగే గుజరాత్‌కి చెందిన ఓ పెళ్లి ఆహ్వాన పత్రికలో కూడా ఇలాంటి అభ్యర్థనే చోటుచేసుకోవడంతో అది వైరల్‌గా మారింది. అలాగే మరో వెడ్డింగ్ కార్డ్ మీద రాఫేల్ డీల్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ, మోదీకి మద్దతుగా జరిగిన ప్రచారం కూడా సంచలనం సృష్టించింది. -
వైరల్: ఆకాశ్ అంబానీ పెళ్లి పత్రిక
-
ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి కదా..!
ముంబై: ‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ బహుశా ప్రస్తుతం ఇలాంటి పాటలనే అంబానీ కుటుంబ సభ్యులు పాడుకుంటున్నారనుకుంటా. ఎందుకంటే అంబానీ ఇంట వివాహమంటే అందరిలోనూ భారీగానే అంచనాలే ఉంటాయి. దీంతో ఆహ్వాన పత్రికల నుంచి మొదలు వివాహ వస్త్రాలు, ఆభరణాలు, పెళ్లి పందిరి, సంగీత్, మెహందీ, వివాహ వేడుకలు ఇవన్నీ వార్తల్లో నిలిచేవే. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతాల గారాల పట్టి ఈశా వివాహ వేడుకలను జనం మరువకముందే మరో వేడుకకు అంబానీ కుటుంబం సిద్దమైంది. ఆకాశ్ అంబానీ వివాహం వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో మార్చి 9న జియో వరల్డ్ సెంటర్ వేదిక జరగనున్న విషయం తెలిసిందే. (అంబానీ ఇంటి వివాహం : మొదటి ఆహ్వానం ఆయనకే!) ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలు కాగా.. అతిథులను ప్రత్యేకంగా పిలిచే పనిలో పడ్డారు. ఇక తొలి వివాహ ఆహ్వాన పత్రికకు సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే వీరి పెళ్లి పత్రికకు సంబంధించి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఇప్పడు దానికి సంబంధించి మరో వీడియో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత గ్రాండ్ డిజైన్ చేసిన ఈ పత్రికలో ముఖేశ్-నీతా అంబానీలు స్వహస్త్రాలతో రాసిన లేఖ తొలుత దర్శనమిస్తుంది. అనంతరం వివాహానికి సంబంధించిన వివరాలు, అతిథలుకు ఇచ్చే బహుమతులు కనిపిస్తాయి. కృష్ణుడు, గణపతి పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంటాయి. దీంతో ఈ పత్రిక చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి కదా.. ఆ మాత్రమైనా ఉండాలి’ అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. (అంబానీ ఇంట వివాహం : స్టాలిన్‌కు ఆహ్వానం) -
క్యూఆర్.. అదిరింది యార్!
పెళ్లి.. జీవితంలో మరుపురాని ఓ మహాఘట్టం. దీన్ని సరికొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. పెళ్లికి సంబంధించిన అన్ని అంశాల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. పెళ్లి ఘట్టంలో నిశ్చితార్థం తర్వాత పెళ్లి పిలుపు ప్రధాన ఘట్టం. దాంట్లోనే తమ హోదా చూపించుకోవాలని భావిస్తారు. ఇప్పుడు నెలరోజులుగా తగ్గిన శుభముహూర్తాలు తాజాగా ఊపందుకున్నాయి. మాఘమాసంతో పాటు ఫాల్గుణ మాసంలోనూ మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల సందడి గ్రేటర్లో జోరందుకుంది. అతిథులను ఆహ్వానించేందుకు పెళ్లి పిలుపులో ‘క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్’అనే నయాట్రెండ్ వచ్చిచేరింది. హైదరాబాద్‌లో ఇప్పుడు అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు. సాధారణంగా వేడుకలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వేదిక ఎక్కడున్నది త్వరగా తెలియదు. ఇందుకోసం తమను ఆహ్వానించిన వారికి ఫోన్ చేయటం లేదా దారిన పోయే వారిని అడగాల్సి రావటం మనందరికీ అనుభవమే. అయితే వేడుకల హడావుడిలో ఉన్న వారు ఇలా కాల్స్ రిసీవ్ చేసుకోవటం కొంత ఇబ్బందికరమే. ఇప్పుడు ఇలాంటి వాటికి చెక్ పెడుతూ వేదిక ఎక్కడో ఈ కోడ్‌లో నిక్షిప్తం చేసేస్తున్నారు. అతిథులు తమ వద్ద ఉన్న ఆహ్వానపత్రికలోని క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్ చేస్తే తాము ఉన్న ప్రాంతం నుంచి వేదిక వద్దకు చేరడానికి మార్గం, పట్టే సమయం అంతా గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. ఉదాహరణకు లండన్‌లోని బంధువు దీనిని స్కాన్ చేస్తే అక్కడి నుంచి విమాన మార్గంలో దగ్గరి ప్రాంతానికి ఎంత సమయం పడుతుంది. అక్కడి నుంచి కార్ వంటి వాటిల్లో నేరుగా వేదిక వద్దకు రావటానికి పట్టే సమయాన్ని సైతం ఇది సూచిస్తుంది. రూపాయే ఎక్కువ.. సాధారణ కార్డుతో పోలిస్తే క్యూఆర్ కోడ్‌ను జత చేసిన కార్డు కేవలం ఒక్క రూపాయి మాత్రమే అధికమని భాగ్యనగరంలో ఈ తరహా కార్డును ఇటీవల ముద్రించిన వారు అంటున్నారు. అంతేకాక దీనిలో వేడుక సందడి గురించి తెలియజేస్తూ రూపొందించిన వీడియో ప్రోమో సైతం కోడ్ స్కాన్ చేసుకున్న వారిని పలకరిస్తుంది. నేరుగా తమ వారు తమను ఆహ్వానిస్తూ వీడియోలో కనిపించటం విశేషం. విదేశాల్లో ఈ ట్రెండ్ ఏళ్ల క్రితమే ప్రారంభమవ్వగా.. మన దేశంలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. – సాక్షి, హైదరాబాద్ -
ఫిబ్రవరి 5న పెళ్లి.. వస్తే క్వార్టర్ ఫ్రీ
సాక్షి, చెన్నై : తమిళనాడు కోయంబత్తూరులో ఓ జంట విభిన్నమైన రీతిలో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది. తమ పెళ్లికి వస్తే క్వార్టర్ ఇస్తామంటూ పెళ్లి పత్రికలో ముద్రించారు. ఇది సోషల్ మీడియాలో శనివారం నుంచి వైరల్‌గా మారింది. వివాహ ఆహ్వాన పత్రికలను ఇటీవల విభిన్నమైన ఆలోచనలు, వ్యతాసమైన డిజైన్లతో తయారుచేస్తున్నారు. ఇలా ఉండగా కోయంబత్తూరులో వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ జరగనున్న ఈ వివాహ మహోత్సవానికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. ‘‘మా పెళ్లికి రండి.. వచ్చే వివాహితులకు సైడ్ డిష్‌తో పాటు ఒక క్వార్టర్, అవివాహితులకు రెండు క్వార్టర్లు అందజేస్తాం’’ అంటూ ఆహ్వానం పలికారు. అయితే ఈ ఆహ్వాన పత్రిక అసలైనదా లేదా నకిలీదా అనే విషయం తెలియలేదు. -
వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ చూశారా..!
సూరత్ : ఈ వాళ, రేపు వాట్సాప్ గురించి తెలయని వారు ఉండరు. ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్సాప్ తప్పనసరి. ఈ క్రమంలో తమ పెళ్లి కార్డును వాట్సాప్ రూపంలో డిజైన్ చేయించారో దంపతులు. ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు తెగ వైరల్ అవుతోంది. వివరాలు.. సురత్‌కు చెందిన చింతన్ అనే వ్యక్తి వెబ్ డిజైనర్. తన పెళ్లి కార్డును వెరైటిగా డిజైన్ చేయించాలని భావించాడు. ఈ క్రమంలో వాట్సాప్ రూపంలో తన పెళ్లి కార్డును డిజైన్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నాడు. స్వతహగా వెబ్ డిజైనర్ కావడంతో వాట్సాప్ రూపంలో తన పెళ్లి కార్డును డిజైన్ చేశాడు. గుజరాతీ, ఇంగ్లీష్ భాషల్లో నాలుగు పేజీల్లో కార్డ్‌ను ప్రింట్ చేశారు. స్టేటస్ దగ్గర తాను, తన కాబోయే భార్య అర్జూ, కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి మా పెళ్లికి రాకపోతే మా వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేస్తామని ప్రింట్ చేశారు. వాట్సాప్ లోగో మీద గణపతి బొమ్మను ముద్రించారు. -
ఇషా అంబానీ ఖరీదైన శుభలేఖ
-
ఇషా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కార్డు.. వైరల్
వివాహ ఆహ్వాన పత్రికలను వినూత్నంగా తయారు చేయించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తమ సంపదను చాటుకోవడానికి, తమ గొప్పతనాన్ని నలుగురి ముందు ప్రదర్శించడానికి శుభలేఖలను గ్రాండ్‌గా రూపొందించడం తెలిసిందే. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం వేడుక సందర్భంగా అత్యంత గ్రాండ్‌గా రూపొందించిన ఆహ్వాన పత్రిక వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అంబానీ ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. ముకేశ్, నీతాల కూతురు ఈషా అంబానీ, ఆనంద్ పిరమిల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. అత్యంత రిచ్‌గా రూపొందిన వీరి వెడ్డింగ్ కార్డు ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. అత్యంత అట్టహాసంగా భారీ వ్యయంతో రూపొందిన ఈ శుభలేఖను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వెడ్డింగ్ కార్డు విశేషాలు.. రిచ్ లుక్‌తో అందంగా అలంకరించిన ఓ బాక్స్ రూపంలో ఉన్న వీరి వెడ్డింగ్ కార్డు వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. బాక్స్‌పైన ఇషా, ఆనంద్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలు ఉబ్బెత్తుగా ముద్రించారు. బాక్స్‌లో వధువరూల వివరాలు, వివాహ ముహూర్తంతోపాటు.. అందులోని పలు బాక్స్‌ల్లో కానుకలు ఉన్నాయి. డైరీ రూపంలో ఉన్న పేజీల్లో దేవతల ఫోటోలతోపాటు విలువైన గాజులు కూడా ఇందులో ఉన్నాయి. -
నవంబరు 14, 15వ తేదీల్లో మా పెళ్లి
-
తన వెడ్డింగ్ కార్డు షేర్ చేసిన దీపికా
‘ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నవంబరు 14, 15వ తేదీల్లో మా వివాహ వేడుక జరగనుంది. ఇన్నేళ్లుగా మాపై ప్రేమ కురిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రేమతో దీపికా- రణ్వీర్’ అంటూ బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ తన పెళ్లి తేదీని ప్రకటించేశారు. తమ వివాహాన్ని ధ్రువీకరిస్తూ పెళ్లి కార్డును కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా బాలీవుడ్ హాట్ కపుల్ దీపికా పదుకోన్- రణ్వీర్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని చాలా కాలంగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్ దగ్గర ప్రస్తావించగా...‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను’ అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఆ ప్రచారం నిజమేనేమోనని దీప్‌వీర్ అభిమానులు నిరాశ పడ్డారు. అయితే వెడ్డింగ్ కార్డును పోస్ట్ చేసి దీపిక అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. pic.twitter.com/E0IbjQTnYI — Deepika Padukone (@deepikapadukone) October 21, 2018 -
వైరల్ : సీఎస్కే అభిమాని వినూత్న ప్రయోగం
చెన్నై : మన దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ కోసం ఏడాది పొడవునా నిరీక్షిస్తుంటారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, టీమిండియా సీనియర్ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీఎస్కే, ధోని మీద ఉన్న అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి ఓ అభిమాని చేసిన వినూత్న ప్రయోగం క్రికెట్ ప్రియులనే కాక నెటిజన్లను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. వివరాలు.. కె. వినోద్ అనే వ్యక్తికి సీఎస్కే జట్టుకి, ధోనికి వీరాభిమాని. తన అభిమానాన్ని ప్రదిర్శించుకోవడానికి వినోద్ తన వివాహ వేడుకనే అవకాశంగా మలచుకున్నాడు. ఈ ఆలోచనను గ్రాఫిక్ డిజైనర్ అయిన తన స్నేహితుడితో పంచుకున్నాడు. దీంతో ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి పెళ్లి కార్డును సీఎస్కే టికెట్ మోడల్లో ప్రింట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వినోద్ ‘చెన్నై సూపర్ కింగ్’గా తన పేరును, ‘చెన్నై సూపర్ క్వీన్’గా తన కాబోయే భార్య సాధన పేరును రాయించాడు. వివాహ సమయం, వేదిక గురించి మ్యాచ్ 2018 సెప్టెంబరు 12 బుధవారం అని కార్డులో ప్రింట్ చేయించాడు. సోషల్ మీడయాలో వైరల్‌గా మారిన ఈ కార్డు సీఎస్కే జట్టు అధికారులకు దృష్టికి వచ్చింది. దాంతో వారు వినోద్ పెళ్లి పత్రికతో పాటు అతని పెళ్లి ఫోటోను కూడా తమ అధికారిక ట్విటర్లో షేర్ చేయడమే కాక అతనికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ విషయం గురించి వినోద్ ‘2015 ఐపీఎల్ సందర్భంగా సీఎస్కే అధికారులు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. చివరి రోజున వారు నన్ను ఆహ్వానించడమే కాక ధోని సంతకం చేసిన బ్యాట్‌ను నాకు బహుకరించారు’ అంటూ గుర్తు చేసుకున్నాడు. Wishing the Super fan in Vinod Buddy a very happy married life ahead! The invite is a special #Yellove from the super fan! Read More - https://t.co/VcTPPCGqbb #WhistlePodu 🦁💛 pic.twitter.com/TKOsxqVPDr — Chennai Super Kings (@ChennaiIPL) September 12, 2018 -
పూవై పూచే పెళ్లిపత్రిక!
ఎంతో ప్రయాసపడి, దూరతీరాల నుంచి ఇల్లిల్లూ వెతుక్కుంటూ వచ్చి పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాక దాన్ని మనమేం చేస్తాం. అదెంత ఖరీదైనదైనా మహా అయితే పెళ్లి రోజు వరకూ ఉంచి ఆ తరువాత ఊడ్చి పారేస్తాం. అలా కాకుండా అందరూ భద్రంగా దాచుకునేలా తన కూతురి పెళ్లి పత్రికను తయారుచేయాలనుకున్నారు కేరళకు చెందిన ఓ ఎమ్మెల్యే. కేరళ తానూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుర్ రహ్మాన్ తన కుమార్తె రిజ్వానా షేరిన్ రిసెప్షన్‌కు వచ్చే అతిథులను ప్రత్యేకంగా ఆహ్వనించాలనుకున్నారు. తమ ఇంటి పెళ్లి పిలుపు వాళ్లింట్లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతే బావుంటుందని భావించారు. అందుకే స్క్రీన్ ప్రింటెడ్ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. అన్ని రంగులూ అద్దుకొని గుండెలనిండా ఆహ్వానించే నిండైన పెళ్లి పత్రికను తయారు చేశారు. కాకపోతే మీరు చదివాక లేదా పెళ్లి అయిపోయాక దాన్ని పూడ్చిపెట్టాలని రాసి మరీ ఇచ్చారు. ఎందుకంటే అందులోని రకరకాల పూల విత్తనాలు లేదా కూరగాయల విత్తనాలు ప్రేమతో మొలకెత్తాలంటే పత్రికను మట్టిలో పెట్టి సూర్యరశ్మి పడేలా కుండీలో ఉంచి నీళ్లు పోస్తే సరి. ఎమ్మెల్యేగారి పెళ్లి పత్రిక మీ ఇంట్లో ఏ గులాబీ మొక్కగానో లేక చామంతిగానో మొలుస్తుంది. క్యారెట్టో, పాలకూరగానో పెళ్లి జ్ఞాపకాన్ని పదే పదే గుర్తుచేస్తుంది. అది పూచిన ప్రతిసారీ ఆ జ్ఞాపకం మీ మదిలో ఆనందమై విరుస్తుంది. అయితే ఇది తయారు చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే. రీసైకిల్ చేసేందుకు వీలైన అట్టలో పలు రకాల విత్తనాలు పొందుపరిచి మరీ ఈ పెళ్లి పత్రికను రూపొందించాలి మరి. అయితేనేం ఈ పత్రిక తయారీ కుటీర పరిశ్రమ ద్వారా పది మందికి అన్నంపెడుతున్నప్పుడు అంటారు ఎమ్మెల్యే సారు. -
వినూత్నంగా ఆకాశ్, శ్లోకాల పెళ్లి కార్డు
-
అదరగొడుతున్న ఆకాశ్, శ్లోకాల పెళ్లి కార్డు
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. తన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ, డైమాండ్ వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను మనువాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం అధికారికంగా ఈ నెల 30న ముంబైలో 39 అట్లామౌంట్ రోడ్లో జరుగబోతోంది. మరోవైపు వీరి పెళ్లి కూడా డిసెంబర్లో జరుగబోతున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన కార్డు తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ కార్డు అంబానీ ఫ్యామిలీ స్థాయిని మించి ఉంది. ఆకర్షణీయమైన తెల్లటి రంగు బాక్స్.. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే చిన్న ఆలయం.. గ్లాస్ డోర్‌తో ఉన్న ఆ ఆలయంలో, అన్ని శుభకార్యాలకు ఫలప్రదమైన వినాయకుడి విగ్రహం ఉన్నాయి. ఆ చిన్ని ఆలయంపైనే ఆకాశ్, శ్లోకాల వెడ్డింగ్ కార్డు ఉంది. కొన్ని రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కూడా ఆన్లైన్లో హల్చల్ చేసింది. ప్రస్తుతం వివాహ ఆహ్వాన పత్రిక ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. కాగా ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, ఆకాశ్, శ్లోకాల నిశ్చితార్థానికి అతిథులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక దేవాలయంలో ఆమె బుధవారం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. నిశ్చితార్థపు తొలి ఆహ్వాన పత్రికను వినాయకుడి చెంత ఉంచారు. నీతా వెంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ముఖేశ్ అంబానీ కుటుంబంలో ఏ వేడుక జరిగిన ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. గోవా పార్టీ తర్వాత కూడా అకాశ్, శ్లోకా జంటతోపాటు అంబానీ కుటుంబసభ్యులు ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేశ్ దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ, బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ వారసుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థ వేడుక కూడా గత నెల 7వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ట్రెండీగా నిలుస్తున్న నటీనటుల వెడ్డింగ్ కార్డు
న్యూఢిల్లీ : ఎంతో కాలంగా రిలేషన్లో ఉన్న బుల్లితెర నటీనటులు రుబినా దిలాయక్, అభినవ్ శుక్లాలు ఈ నెల 21న ఒకటవ్వబోతున్నారు. వీరిద్దరూ తమ వివాహ ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్డులో ప్రతి ఒక్కటీ చూడముచ్చటగా నిలుస్తోందని సోషల్ మీడియా యూజర్లంటున్నారు. వెడ్డింగ్ కార్డు చాలా ట్రెండీగా, అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కార్డు ఎలా డిజైన్ చేయించారో తెలుసా..? పర్యావరణ పరిరక్షణగా రీసైకిల్ పేపర్‌తో ఈ కార్డును డిజైన్ చేయించారట. ఆ కార్డుపై రుబినా, అభినవ్ పేర్లలోని తొలి పదాలతో పాటు వివాహ తేదీ కూడా ఉంది. కార్డు పక్కనే ఒక చిన్న గాజు పాత్ర, దానిలో ఉంచిన ప్రకృతితో మమేకమైన పూలు, మొక్కలు ఇవన్నీ కార్డుకు ట్రెండీగా నిలుస్తున్నాయి. ‘ నిజమైన ప్రేమ మన ఆత్మను పెంపొందిస్తోంది. ఈ కార్డుతో మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తూ.. మా స్నేహితులకు ‘జీవితం’గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాం. మాతో కలిసి ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు’ అని రుబియా పోస్టు చేశారు. తమ ఆహ్వానం పూర్తిగా ఆర్గానిక్, బయోడిగ్రేడబుల్ లాగా ఉందని, ఈ కార్డును ఎండీఎఫ్ చెక్క, రీసైకిల్ పేపర్‌తో తయారు చేయించామని చెప్పారు. పెళ్లిళ్లు ఎంతో సంతోషభరితంగా, ప్రకృతికి అనుకూలంగా ఉండాలనే భావనను తాము ప్రోత్సహిస్తామని అన్నారు. తమ అద్భుతమైన ఈ వెడ్డింగ్ కార్డు డిజైన్ క్రెడిట్ అంతా రుబినాదే అంటూ అభినవ్, కాబోయే భార్యను పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇదే ఉన్నతమైన ఆలోచన. మొక్కలే పెళ్లికి ఆహ్వానం! సేంద్రియ, ప్రకృతికి అనుకూలమైన విధంగా, ఓ ప్రత్యేకమైన ఆలోచనతో రావడం నీకు మాత్రమే సొంతం’ అని అభినవ్ అభినందించారు. తన ఆలోచనకు తగ్గట్టు కార్డును డిజైన్ చేసిన వారికి రుబియా కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్యూ మై లవ్ అంటూ అభినవ్ శుక్లాపై కూడా ప్రేమ వర్షం కురిపించారు. రుబియా, అభివన్ ఎన్నో ఏళ్లుగా పరిచయస్తులు. మార్చిలో వీరిద్దరూ తమ వివాహాన్ని ప్రకటించారు. సిమ్లాలో వీరి వివాహం జరగనుంది. అయితే అభినవ్, రుబియాలు తమ వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కోహ్లి, అనుష్క శర్మలను కాపీ కొట్టారని తెలుస్తోంది. కోహ్లి, అనుష్కల వివాహ పత్రిక కూడా ఈ విధంగానే ఉండటం గమనార్హం. -
12వ తేదీ ఓటు పెళ్లి..మీరు తప్పక రావాలి
రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ ఓటేయాలనే ఎన్నికల యంత్రాంగం ప్రచారం కొన్నిచోట్ల వింతగానూ జరుగుతోంది. రాయచూరు జిల్లాలో ఒకడుగు ముందుకేసి పెళ్లి తంతు మాదిరిగా అవగాహనను మార్చేశారు. సమాజంలో మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకొనే ఓటు హక్కుపై జాగ్రత వహించాలని ల్లా స్త్రీ శిశు సంరక్షణాధికారి నాగరాజు పిలుపు ఇచ్చారు. శనివారం రాయచూరు నగరంలోని యల్‌బియస్ కాలనీలో జిల్లాధి యంత్రాంగం ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రచారాందోళన వినూత్నంగా జరిగింది. అవగాహన పత్రాలను పెళ్లిపత్రికల మాదిరిగా ముద్రించి ప్రజలకు పంచారు. అందరూ ఎన్నికలో నిర్భయంగా ఓటు వేయాలని, ఓటును అమ్ముకోరాదని పెళ్లి పత్రికల ద్వారా ప్రచారం చేశారు. శుభ లగ్న పత్రిక.... ⇔ ఓటర్ మహాశయులకు పెళ్లి పిలుపు ⇔ భారత ఎన్నికల కమిషన్ నిశ్చయం మేరకు శనివారం అనగా 12–05–2018 ఉదయం 7 గం. నుండి సాయంత్రం 6 గంటల వరకు శుభ ముహూర్తం ⇔ భారత మాతా సుపుత్రుడు ⇔ చి: ఓటరుతో చి.కుం.సౌ: ప్రజా ప్రతినిధి వివాహ నిర్ణయం ⇔ స్థలం: ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం ⇔ ఆహ్వానం: ఈ మంగళకార్యానికి ప్రతి ఓక్కరూ వచ్చి తమ ఓటును వేయాలని ఆకాంక్ష. -
పెళ్లి కొడుకు ఒకరే.. పెళ్లి కూతుళ్లు ఇద్దరు.!
ఇండోనేషియా: పెళ్లి పత్రికలో ఒక వధువు, ఒక వరుడు పేర్లు ఉండటం కామన్. కానీ ఒక పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లి కూతుళ్ల పేర్లు ఉన్న శుభలేఖ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని దక్షిణ సుమత్ర దీవుల్లోని తెలుక్ కిజింగ్ గ్రామానికి చెందిన చింద్ర అనే యువకుడు ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నాడు. వారిద్దరి పేర్లనూ జోడిస్తూ వధువులతో విడివిడిగా దిగిన ఫొటోలతో ఒకే పెళ్లి శుభలేఖను ప్రింట్ చేయించి అందరికీ పంచేశాడు. దీనిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కంటే ఎక్కువ మంది భార్యలున్న వారు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా ఇండోనేషియాలో బహుభార్యత్వం తప్పు కాదు. అయితే వారి సంప్రదాయం ప్రకారం రెండో వివాహానికి ముందు కేవలం ఒక భార్య మాత్రమే ఉండాలి. దీనిపై స్థానిక వెబ్సైట్ ఒకటి.. ఎంక్వైరీ చేసి ఈ పెళ్లి పత్రిక నిజమేనని తేల్చింది. ఈ పెళ్లి ఆచార సంప్రదాయాల ప్రకారమే జరుగుతోందని అన్నారు ఓ గ్రామ పెద్ద. ఇద్దరి పెళ్లి కూతుళ్లతో ఇందాహ్ లెస్తారిని నవంబర్ 5న, పెరావతిని నవంబర్ 8న వరుడు చింద్ర వివాహం చేసుకోబోతున్నాడని వివరించారు. రెండు వివాహాల మధ్య గడువు రెండు రోజులే ఉండటం వల్ల వేర్వేరు శుభలేఖలు ముద్రించడం వృథా అనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలిపారు. -
వైరల్ : సమంత, నాగచైతన్యల పెళ్లి శుభలేఖ
ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా గమనిస్తున్న ఈవెంట్.. సమంత, నాగచైతన్యల పెళ్లి వేడుక. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట శుక్రవారం పెద్దల సమక్షంలో ఒక్కటవుతున్నారు. కేవలం మూడు కుంటుబాలకు చెందిన వారు మాత్రమే హజరవుతున్న ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల ఆశీస్సులతో గోవాలోని డబ్ల్యూ హోటల్ లో పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. శుక్రవారం (అక్టోబర్ 6) మద్యాహ్నం నుంచి వేడుక మొదలుకానుంది. మద్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మెహందీ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత 8 గంటల 30 నిమిషాలకు విందు, రాత్రి 11 గంటల 52 నిమిషాలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది. ఇక శనివారం(అక్టోబర్ 6) రోజున క్రిస్టియన్సాంప్రదాయ ప్రకారం జరగనున్న వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరోజు మద్యాహ్నం 12 గంటలనుంచి మూడు గంటల వరకు విందు ఏర్పాట్లు చేసిన అక్కినేని కుటుంబ సభ్యులు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి విందుతో పాటు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు. -
పెళ్లి కార్డు చూపించినా కనికరించలేదు..
ఈ చిత్రంలో పెళ్లికార్డు చూపిస్తున్న వ్యక్తి పేరు మధుభూపాల్. కల్లూరు మండలం కె.మార్కపురం గ్రామానికి చెందిన ఇతనికి గూడూరు ఎస్బీఐలో ఖాతా ఉంది. పెద్ద నోట్ల రద్దుతో తన దగ్గరున్న రూ. 30 వేలను బ్యాంక్ ఖాతాలో పది రోజుల కిందట జమ చేసుకున్నాడు. తమ్ముడి పెళ్లి శనివారం ఉండడంతో.. శుభలేఖ చేత పట్టుకుని గురువారం బ్యాంక్‌కు వచ్చాడు. సిబ్బంది డబ్బులు లేవని వెనక్కి పంపారని.. ఏటీఎం వద్దన్నా రూ.2వేలు వస్తాయనకుంటే అవీ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. - గూడూరు -
పెళ్లికి వెళ్లాలి.. కొత్త నోట్లు ఇవ్వండి!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రూ. 500, రూ. వెయ్యి నోట్లను మార్చుకోవడానికి ప్రజలు పెద్దసంఖ్యలో బ్యాంకులు ముందు బారులు తీరుతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోనూ చాలా బ్యాంకుల ముందు వేలమంది బారులు తీరి.. పెద్దనోట్లను మార్చుకోవడానికి పలు అవస్థలు పడ్డారు. చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎదుట వేలమంది నోట్లు మార్చుకోవడానికి క్యూ కట్టారు. ఇక్కడ పెద్దసంఖ్యలో జనం బారులు తీరడంతో నోట్లు మార్చుకోవడానికి వారికి చాలా సమయం పడుతోంది. కాగా, ఓ వ్యక్తి పెళ్లికార్డు తీసుకొని బ్యాంకు వద్దకు వచ్చాడు. తన స్నేహితుడి కూతురు పెళ్లి రేపు ఉందని, ఈ రోజు సాయంత్రం పెళ్లి రిసెప్షన్ జరుగుతుందని, కాబట్టి తనకు అర్జెంటుగా రూ. 4వేల అధికంగా డబ్బు అవసరముందని అతను శుభలేఖను చూపించి మరీ బ్యాంకు అధికారులను వేడుకున్నాడు. అతను ఎంత బతిమాలుకున్నా బ్యాంకు అధికారులు రూ. నాలుగువేల కన్నా అధికంగా పెద్దనోట్లు మార్చుకోవడానికి అనుమతించలేదు. దీంతో నిరాశ చెందిన అతను మీడియాకు తనగోడు వెళ్లబోసుకున్నాడు. -
పెళ్లంటే ఇరవై పేజీల శుభలేఖంటా...
అశ్వారావుపేట: పెళ్లి శుభలేఖను సాధ్యమైనంత తక్కువ పేజీలు... కుదిరితే చిన్న కార్డుపై ముద్రిస్తున్నారు. కానీ జిల్లాలోని అశ్వారావుపేటకు చెందిన జల్లిపల్లి శ్రీరామమూర్తి కుమారుడు మణికంఠ వివాహ శుభలేఖను 20 పేజీలతో ముద్రించాడు. వివాహంలో రకాలు, వివాహంలో పఠించే వినాయక ప్రార్థన, శివానందలహరి తాత్పర్యాలను, కల్యాణ సమయంలో వేదపండితులు పఠించే సంస్కృత స్లోకాల సారాంశాలను వివరించారు. వివాహంలో ప్రతి ఘట్టాన్ని సంపూర్ణంగా వివరిస్తూ శుభలేఖలో పొందుపర్చారు. ఈ శుభలేఖ అందిన ప్రతి కుటుంబంలో ఒక ప్రత్యేక వస్తువుగా భావిస్తూ భద్రపరుచుకుంటున్నారు. -
దర్శకుడి ఆహ్వానం అదిరింది..
హృదయాలను స్పృశించే కథనాలను విజయవంతంగా తెరకెక్కించే దర్శకుడు క్రిష్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. డాక్టర్ రమ్యతో ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గండిపేటలో ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర ఉన్న గోల్కొండ రిసార్ట్‌లో ఆగస్టు 7 వ తేదీన వీరి వివాహం వైభవంగా జరుగనుంది. సినిమాల్లో తన మార్క్ వైవిధ్యతను చూపించే క్రిష్.. నిజ జీవితంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పటికే సినీప్రముఖులతోపాటు సన్నిహితులంతా ఆయన వివాహ ఆహ్వానాన్ని అందుకున్నారు. పెళ్లిపత్రికను మళ్లీ మళ్లీ చదివి ముచ్చటపడుతున్నారు. క్రిష్ ఖరీదైన వెడ్డింగ్ కార్డ్‌కి బదులు.. కవితాత్మకంగా కదిలించే ఆహ్వాన పత్రికను రూపొందించాడు. ఆహ్వాన పత్రిక చదువుతున్నంతసేపు స్వయంగా వరుడు మాట్లాడుతున్నట్టు అనిపించడం విశేషం. 'నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైంది.. నిజమైన నా జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతుంది' అంటూ వధువు పేరుని తలచుకుంటూ పత్రికను ముగించడం అదిరింది. మొదటి సినిమా 'గమ్యం' తోనే ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్న క్రిష్.. ఆ తరువాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన పాత్రలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. -
చంద్రబాబును కలిసిన జయప్రద
విజయవాడ: సినీనటి జయప్రద సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. క్యాంప్ కార్యాలయంలో ఆమె...చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే తన కుమారుడు సిద్ధార్థ వివాహానికి రావాల్సిందిగా జయప్రద ఈ సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించారు. కాగా నిన్న ఆమె...రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివాహ పత్రిక అందచేశారు. కాగా హైదరాబాద్ కు చెందిన ప్రవల్లికా రెడ్డితో సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతడిని దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఇక సిద్ధార్ధ్ హీరోగా తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' చిత్రానికి రీమేక్ కాగా అందులో అతడి సరసన. హన్సిక కథానాయికగా నటించింది. -
వెరైటీగా మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్
-
వెరైటీగా మంచు మనోజ్ వెడ్డింగ్ కార్డ్
హైదరాబాద్: మంచు వారింట మరి కొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు మనోజ్ వివాహం మే 20న జరగనుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే శుభలేఖలు పంచిపెట్టడం మొదలు పెట్టారు. ఇక ప్రత్యేకంగా తయారు చేసిన వెడ్డింగ్ కార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాషాయ, ఊదారంగు కాంబినేషన్ లో కళంకారి తరహా బొమ్మలతో రూపొందించిన శుభలేఖ ఆకర్షణీయంగా ఉంది. వివాహ మహోత్సవం గొప్పతనాన్ని తెలిపేలా కార్డు డిజైన్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్డు చూసి మెచ్చుకున్నారు. తనకు ఇలాంటి కార్డు కావాలని ఆయన స్వయంగా అడిగారని మనోజ్ చెప్పారు. మనోజ్- ప్రణతిరెడ్డి వివాహం మే 20న ఉదయం 9.10 గంటలకు హైటెక్స్ లో జరగనుంది. ఈ వివాహానికి సినిమా, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆహ్వానించారు. మంచు మనోజ్- ప్రణతిరెడ్డిల నిశ్చితార్థ వేడుక మార్చి 4న జరిగింది. -
చంద్రబాబును కలిసిన టీ. మంత్రి జోగు రామన్న
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సోమవారం తెలంగాణ మంత్రి జోగు రామన్న కలిశారు. జోగు రామన్న ఈ సందర్భంగా తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. కుమారుడి వివాహ పత్రికను చంద్రబాబుకు అందజేశారు. భేటీ అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ తన కొడుకు పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కలిసినట్లు చెప్పారు. -
శ్లోకం... భావం
జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః ముక్తా తా శుభదా భవంతు భవతామ్ శ్రీరామ వైవాహికాః ఈ శ్లోకం తెలియని తెలుగువారు అరుదు. పెళ్లిశుభలేఖలలో కొన్ని తరాలుగా పునర్ముద్రణ పొందుతూనే ఉంది ఈ శ్లోకం. ఇది చూడగానే సీతారాముల తలంబ్రాల ఘట్టం మనసులో మెదిలి ఆనందం, ఆహ్లాదం కలుగుతాయి. తాత్పర్యం: సీతారామకల్యాణంలో తలంబ్రాల ఘట్టం... జనక మహారాజు ముత్యాల తలంబ్రాలు తెప్పించాడు. సీతమ్మ మహదానందంతో రాముడి తలపైన తలంబ్రాలు పోస్తోంది. ఆ తెల్లని ముత్యాల తలంబ్రాలు... ఎర్ర తామరపువ్వులా వెలిగే సీతమ్మ దోసిట్లో ఉన్నప్పుడు పద్మరాగమణుల్లా కనిపించాయి. ఆమె వాటిని శ్రీరాముడి శిరస్సు మీద పోసినప్పుడు, ఆ నల్లని కేశాల మీద అవి తెల్లని మల్లెపూలల్లా ప్రకాశించాయి. తలమీది నుంచి కొంచెం జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద జాలువారినప్పుడు, ఆయన శరీరకాంతిలో అవి ఇంద్రనీలమణుల్లా భాసించాయి. అలాంటి ముత్యాల తలంబ్రాలు మీకందరకూ శుభం కలుగజేయుగాక! అంటున్నాడు కవి. రామకర్ణామృతమ్లో ఈ శ్లోకం కనిపిస్తుంది. - మల్లాది హనుమంతరావు