ఎవరైనా పెళ్లికి పిలిస్తే, వారికి బహుమతి ఏమివ్వాలా అని ఆలోచిస్తారు. వస్తువు కొనాలా, డబ్బులు ఇవ్వాలా అని తర్జనభర్జనల తరవాత ఒక నిర్ణయానికి వస్తారు. వీలైనంతవరకు డబ్బు ఇవ్వడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. అలా ఇవ్వటం వల్ల కొత్త జంట వాళ్లకు కావలసింది వాళ్లు కొనుక్కోవచ్చు. అయితే పెళ్లికి బయలుదేరే ముందు కానీ కొన్ని విషయాలు గుర్తుకు రావు. ముఖ్యంగా నూతన వధూవరులకు ఇవ్వాలనుకునే నగదును ఉంచటానికి కావలసిన గిఫ్ట్ క్యాష్ కవర్. ఓ పక్కన ముహూర్తానికి సమయం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కవరు కోసం వెతుకులాట కొనసాగుతూ ఉంటుంది. చివరకు ఏమీ చేయలేక, వధూవరుల చేతిలో నేరుగా డబ్బు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంక కవరు కోసం వెతుకులాడవలసిన అవసరం లేదు. నేరుగా వారి అకౌంట్‌లోకి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చు. ఇంకో అడుగు ముందుకు వేశారు. తమిళనాడులోని మదురైలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న టి. జె. జయంతి కుటుంబం ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
శుభలేఖ మీద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి, గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా నూతన వధూవరులకు ఇవ్వాలనుకుంటున్న నగదు బహుమతిని ఈ కోడ్ ద్వారా బదిలీ చేసేందుకు వీలు కల్పించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా వివాహానికి హాజరు కాలేని వారి కోసం ఆ ఆలోచనను ఆచరణలో ఉంచారు. ‘‘30 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. పెళ్లి కానుకను క్యూఆర్ కోడ్ ద్వారా పంపారు, మా కుటుంబంలో ఈ విధంగా క్యూఆర్ కోడ్ ప్రచురించటం ఇదే ప్రథమం. ఆదివారం నాడు వివాహం జరిగింది. మరుసటి రోజు నుంచి ఈ కార్డు వైరల్ అవుతోంది. చాలామంది ఫోన్‌లు చేస్తున్నారు’’ అంటున్నారు జయంతి. ఆన్‌లైన్ టెక్నాలజీ వల్ల కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే ఒక వివాహం సందర్భంగా, ఇళ్ల దగ్గర నుంచి ఆన్‌లైన్‌లో వివాహం వీక్షిస్తున్న బంధువులు, స్నేహితులకి, వారివారి ఇళ్ల దగ్గరకే విందును ఆర్డర్ చేశారు. ఏ లోటూ రాకుండా, దేనినీ మిస్ అయ్యామనే భావన లేకుండా, ఆన్‌లైన్ ద్వారా అన్నీ సమకూరుతున్నాయి. టెక్నాలజీకి రెండు చేతులతో నమస్కరించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment