
సాక్షి, సికింద్రాబాద్: పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తి వివాహం జరిగింది. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని బంధువు సర్వేశ్ పెళ్లి రోజే కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు.
సురేష్ సోదరి బాలమణిని కూడా దూషించాడు. అయితే మిగతా బంధువులందరూ సర్ది చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడదామని ఆదివారం ఉదయం బలమణి తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్లింది. దీంతో సర్వేశ్, అతని సోదరుడు శేఖర్ ఇంటికి వచ్చిన వారిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో బంధువులు ఎస్ ప్రవీణ్(30), నోముల పరశురాము(35), డి యాదగిరి (42), ఎన్ ప్రతాప్ కుమార్ (32) తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడినవారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితులు పరారయ్యారు. గాయపడినవారిలో ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను..
Comments
Please login to add a commentAdd a comment