
దర్శకుడి ఆహ్వానం అదిరింది..
హృదయాలను స్పృశించే కథనాలను విజయవంతంగా తెరకెక్కించే దర్శకుడు క్రిష్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. డాక్టర్ రమ్యతో ఇటీవలే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గండిపేటలో ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర ఉన్న గోల్కొండ రిసార్ట్లో ఆగస్టు 7 వ తేదీన వీరి వివాహం వైభవంగా జరుగనుంది. సినిమాల్లో తన మార్క్ వైవిధ్యతను చూపించే క్రిష్.. నిజ జీవితంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ఇప్పటికే సినీప్రముఖులతోపాటు సన్నిహితులంతా ఆయన వివాహ ఆహ్వానాన్ని అందుకున్నారు. పెళ్లిపత్రికను మళ్లీ మళ్లీ చదివి ముచ్చటపడుతున్నారు. క్రిష్ ఖరీదైన వెడ్డింగ్ కార్డ్కి బదులు.. కవితాత్మకంగా కదిలించే ఆహ్వాన పత్రికను రూపొందించాడు. ఆహ్వాన పత్రిక చదువుతున్నంతసేపు స్వయంగా వరుడు మాట్లాడుతున్నట్టు అనిపించడం విశేషం. 'నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైంది.. నిజమైన నా జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతుంది' అంటూ వధువు పేరుని తలచుకుంటూ పత్రికను ముగించడం అదిరింది.
మొదటి సినిమా 'గమ్యం' తోనే ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్న క్రిష్.. ఆ తరువాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన పాత్రలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.