వాట్‌ నెక్ట్స్‌? | What usually happens to the director when a movie flop | Sakshi
Sakshi News home page

వాట్‌ నెక్ట్స్‌?

Published Fri, Apr 11 2025 11:12 PM | Last Updated on Fri, Apr 11 2025 11:39 PM

What usually happens to the director when a movie flop

చిత్ర పరిశ్రమలో విజయాలను బట్టి కొత్త అవకాశాలు వరిస్తుంటాయి. ఈ విషయంలో నటీనటులకు కొంత మినహాయింపు ఉంటుందని చెప్పాచ్చు. కానీ దర్శకుల పరిస్థితి అలా కాదు. హిట్స్‌ అనేవి వారి కెరీర్‌ని నిర్ణయిస్తుంటాయన్నది ఇండస్ట్రీ టాక్‌. ఒక్క హిట్టు పడితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి. 

అదే ఫ్లాపులొస్తే మాత్రం వాట్‌ నెక్ట్స్‌? మనకు అవకాశం ఇచ్చే హీరో ఎవరు? నిర్మాత ఎవరు? వంటి ప్రశ్నలు వారిలో మెదులుతుంటాయి. మరికొందరు దర్శకులు హిట్‌ ఇచ్చినా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నిరీక్షణ సమయం కొందరికి ఆరేళ్లు, నాలుగేళ్లు, మరికొందరికి మూడేళ్లు, ఇంకొందరికి రెండేళ్లు, ఏడాదిన్నర ఉంటోంది. మరి... ‘వాట్‌ నెక్ట్స్‌’ అంటే... ప్రస్తుతానికి ‘నో ఆన్సర్‌’.  

రెండేళ్లు దాటినా...  
కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో అందంగా తెరకెక్కించే క్రియేటివ్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘చందమామ’ (2007) సినిమా తర్వాత కృష్ణవంశీకి చెప్పుకోదగ్గ హిట్‌ పడలేదు. 2017లో వచ్చిన ‘నక్షత్రం’ సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్‌ తీసుకున్న అనంతరం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. 2023 మార్చి 22న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా కృష్ణవంశీ తర్వాతిప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.  

నాలుగు సంవత్సరాలు దాటినా... 
తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్‌గా పేరు సొంతం చేసుకున్నారు చంద్రశేఖర్‌ ఏలేటి. ‘ఐతే’ (2003) మూవీ ద్వారా డైరెక్టర్‌గా పరిచయయ్యారాయన. ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్‌ పూర్తి చేసుకున్న చంద్రశేఖర్‌ తీసింది కేవలం ఏడు సినిమాలు (ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా, చెక్‌) మాత్రమే.  వీటిలో ‘ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం’ సినిమాలు విజయాలు అందుకున్నాయి. ‘ఒక్కడున్నాడు, ప్రయాణం, మనమంతా’ వంటివి మంచి చిత్రాలుగా నిలిచాయి. ఇక నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్‌’ సినిమా 2021 ఫిబ్రవరి 26న విడుదలై ప్రేక్షకులను నిరాశపరచింది. ఈ చిత్రం విడుదలై నాలుగు సంవత్సరాలు దాటినా ఆయన తర్వాతి సినిమాపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు.  

ఆరేళ్లు అవుతున్నా.... 
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పద్దెనిమిదేళ్ల ప్రయాణం వంశీ పైడిపల్లిది. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారాయన. ఇన్నేళ్ల కెరీర్‌లో తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అయినా అన్నీ విజయాలు అందుకున్నాయి. తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన విజయ్‌తో తమిళంలో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా చేశారు. ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచింది. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ (2019) వంటి హిట్‌ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరో తెలుగు సినిమా చేయలేదు. 

అలాగే తమిళంలోనూ ‘వారిసు’ తర్వాత అక్కడ కూడా ఏ మూవీ కమిట్‌ కాలేదు. తెలుగులో ఆయన సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తున్నా తర్వాతిప్రాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య మహేశ్‌బాబుతో మరో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా షాహిద్‌ కపూర్‌ హీరోగా హిందీలో వంశీ పైడిపల్లి ఓ మూవీ తెరకెక్కించనున్నారని బాలీవుడ్‌లో వినిపించినా ఈప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి... వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం తెలుగులోనా? తమిళంలోనా? బాలీవుడ్‌లోనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజలు వేచి చూడకతప్పదు.  

మూడేళ్లయినా...  
మాస్‌ సినిమాలు తీయడంలో, హీరోలకు మాస్‌ ఎలివేషన్స్‌ ఇవ్వడంలోనూ సురేందర్‌ రెడ్డి శైలి ప్రత్యేకమనే చె΄్పాలి. కల్యాణ్‌రామ్‌ హీరోగా రూ΄÷ందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్‌ రెడ్డి. ‘అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన తర్వాతిప్రాజెక్ట్‌ ఏంటి? అనేదానిపై స్పష్టత లేదు.

అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్‌’ సినిమా 2023 ఏప్రిల్‌ 28న రిలీజైంది. భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది.  ప్రస్తుతం ‘లెనిన్‌’ అనే సినిమా చేస్తున్నారు అఖిల్‌. అయితే ‘ఏజెంట్‌’ తర్వాత సురేందర్‌ రెడ్డి తెరకెక్కించనున్న మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఫలానా హీరోతో ఆయన తర్వాతి సినిమా ఉంటుందనే టాక్‌ కూడా ఇప్పటివరకూ రాలేదు.

ఏడాది దాటినా....  
టాలీవుడ్‌లో దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం పరశురామ్‌ది. నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన ‘యువత’ (2008) సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారాయన. ఆ తర్వాత ‘ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం, సర్కారువారి పాట, ఫ్యామిలీ స్టార్‌’ వంటి సినిమాలు తీశారు పరశురామ్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘గీతగోవిందం’ (2018) సినిమా బ్లాక్‌బస్టర్‌ అందుకోవడంతో పాటు వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా హిట్‌ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్‌ బాబుతో ‘సర్కారువారి పాట’ (2022) సినిమా తీసి, హిట్‌ అందుకున్నారు.

‘గీత గోవిందం’ వంటి హిట్‌ మూవీ తర్వాత విజయ్‌ దేవరకొండ హీరోగా ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే చక్కని కుటుంబ కథా చిత్రం తీశారు పరశురామ్‌. 2024 ఏప్రిల్‌ 5న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాది దాటినా ఆయన తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. ‘ఫ్యామిలీ స్టార్‌’ నిర్మించిన నిర్మాత ‘దిల్‌’ రాజు బ్యానర్‌లోనే పర శురామ్‌ మరో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలొచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా కార్తీ హీరోగా పరశురామ్‌ ఓ సినిమా చేయనున్నారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. కానీ, ఈప్రాజెక్ట్‌పైనా ఎలాంటి అప్‌డేట్‌ లేదు.  

మూడేళ్లు పూర్తయినా....  
అందమైన కుటుంబ కథా చిత్రాలతో పాటు సున్నితమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో కిశోర్‌ తిరుమల శైలే వేరు. రామ్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘నేను శైలజ’ (2016) మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత కిశోర్‌ తిరుమలని మరో హిట్‌ వరించలేదు. శర్వానంద్, రష్మికా మందన్నా జోడీగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం 2022 మార్చి 4న రిలీజైంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయినా ఆయన నెక్ట్స్‌ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రకటన లేదు. హీరో రవితేజతో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ ఇప్పటికీ స్పష్టత లేదు.  

ఒకటిన్నర సంవత్సరమైనా... 
అందమైన ప్రేమకథలే కాదు... చక్కని కుటుంబ కథా చిత్రాలు తీయడంలో దిట్ట శ్రీకాంత్‌ అడ్డాల. ‘కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల తర్వాత తన పంథా మార్చి ‘నారప్ప, పెదకాపు 1’ వంటి మాస్‌ సినిమాలు తీశారాయన. ఆ చిత్రాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. ‘పెదకాపు 1’ చిత్రం 2023 సెప్టెంబర్‌ 29న రిలీజైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్‌ గతంలో ప్రకటించింది. అయితే రెండో భాగంపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మరి శ్రీకాంత్‌ అడ్డాల తర్వాతి చిత్రంగా ‘పెదకాపు 2’ ఉంటుందా? లేకుంటే మరోప్రాజెక్ట్‌ని ప్రకటిస్తారా? అనేది వేచి చూడాలి.    

ఏడాదిన్నర దాటినా... 
‘నిన్ను కోరి, మజిలీ’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ అందుకున్నారు శివ నిర్వాణ. ఆ తర్వాత ‘టక్‌ జగదీష్, ఖుషి’ సినిమాలు తీశారాయన. విజయ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలై విజయం అందుకుంది. ఆ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటిపోయినా శివ నిర్వాణ నెక్ట్స్‌ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. 

తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ (2018) సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఆ తర్వాత ‘మహాసముద్రం’ (2021) సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచన ఆయన ‘మంగళవారం’ (2023) సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని, ఈ మూవీ ప్రీప్రోడక్షన్‌ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.  వీరే కాదు... మరికొందరు దర్శకుల తర్వాతి సినిమాలపైనా ఎలాంటి ప్రకటన లేదు.  

ఏడాదిన్నరగా...
‘ఆంధ్రావాలా’ (వీర కన్నడిగ), ‘ఒక్కడు’ (అజయ్‌) వంటి తెలుగు సినిమాల కన్నడ రీమేక్‌తో శాండిల్‌వుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యారు మెహర్‌ రమేశ్‌. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన ‘కంత్రీ’ (2008) చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారాయన. ఆ తర్వాత ప్రభాస్‌ హీరోగా ‘బిల్లా’ (2009) చిత్రాన్ని తెరకెక్కించారు మెహర్‌ రమేశ్‌. తెలుగులో ‘శక్తి, షాడో, భోళా శంకర్‌’ వంటి సినిమాలు, కన్నడలో ‘వీర రణచండి’ (2017) మూవీ తెరకెక్కించారు.

 వెంకటేశ్‌ హీరోగా ఆయన తీసిన ‘షాడో’ (2013) సినిమా డిజాస్టర్‌ కావడంతో దాదాపు పదేళ్లు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తెలుగు స్టార్‌ హీరోల్లో ఒకరైన చిరంజీవితో ‘భోళా శంకర్‌’ సినిమా చేసే అవకాశం అందుకున్నారు మెహర్‌ రమేశ్‌. 2023 ఆగస్టు 11న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా రిలీజై ఏడాదిన్నరకుపైగా అయినా ఇప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు మెహర్‌ రమేశ్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement