ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం అన్ని రంగాల్లో ఏ మేరకు ఉంటుంది? కొందరు ఉపాధి కోల్పోయేలా చేస్తుందా? వంటి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా రంగంపైనా ఏఐ ప్రభావం భారీగా ఉంటుందన్నది కొందరి ఊహ. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంపై ఎక్కువ ప్రభావం పడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ అంశంపై ఇటీవల ‘సాక్షి’ సినిమా పేజీలో ఓ కథనం కూడా ప్రచురితమైంది. తాజాగా ‘స్టార్ రైటర్స్’ చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి ‘ఏఐ’ గురించి తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు.
అది మనకు బానిస.... మనం బాస్ – చంద్రబోస్
మనిషి కంటే.. మనిషి మేధస్సు కంటే ఏదీ గొప్పది కాదు. కాక΄ోతే కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా మనిషికి సాయం చేయడానికే కనిపెట్టబడుతున్నాయి. మనిషిని కొల్లగొట్టడానికి, కూల్చేయడానికి కాదు. ఈ కోణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆహ్వానిస్తే అన్నీ మంచి ఫలితాలే వస్తాయి. నిజమే... అన్నింటా ఏఐ పరిజ్ఞానంపై చర్చ జరుగుతోంది... కాదనడం లేదు. సెల్‌ఫోన్ చాలా రకాల పనుల్ని చేస్తోంది. అందులో ఉన్న కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాం. అయినా బయట ఫొటో, వీడియో స్టూడియోలు ఉన్నాయి. అందులో సరికొత్త నిపుణులు పుట్టుకొచ్చారు. ఇంకా పెద్దగా అది విస్తరించింది. చాలా మందికి ఉపాధి లభిస్తోంది. ఏ వస్తువొచ్చినా కూడా మనిషి మాత్రమే ప్రత్యేకంగా చేయగలిగింది ఒకటుంటుంది.
కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. దాంతో (టెక్నాలజీ) మనం చాకిరీ చేయించుకోవాలి. బానిసలాగా ఆ కొత్త పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. అక్కడే మనిషి ప్రతిభ తెలుస్తుంది. అది బాణీలు కట్టి సాహిత్యాన్నిస్తుంటే.. దాన్నుంచి వందల కొద్దీ బాణీలు తీసుకుని అందులోని ఆత్మను ఎంపిక చేసి దానికి మనం మెరుగులు అద్దుకోవాలి. ఉదాహరణకు కంప్యూటర్ వల్ల మనకు ఎంతో సమయం ఆదా అవుతోంంది. అలా ఆదా అయిన సమయాన్ని వేరే దానికి మళ్లిస్తున్నాం. అలాగే సంగీతంలో కూడా ఏఐ ఇచ్చే ట్యూన్ల నుంచి మంచిది ఎంపిక చేసుకుని దానికి మన సృజనాత్మకతను జోడించి ఏఐ కూడా చేయలేని సరికొత్త రాగాన్ని సృష్టించాలి. అంతే కానీ ఎవరి ఉద్యోగాలూపోవు. ఎవరి పనులూ ఆగిపోవు. అదేమీ దేవుడు కాదు.
కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ వచ్చినప్పుడు అందరి ఉద్యోగాలూపోతాయన్నారు.. మరి కంప్యూటరే లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు పేపర్ మీద పాట రాసుకునేవాడ్ని. ఇప్పుడు రిమార్కర్ అనే సాంకేతికత ద్వారా రాసుకుంటున్నా. ఒకప్పుడు తప్పులొస్తే తుడిచేయడానికి వైట్ మార్కర్‌తో కొట్టేయాల్సి వచ్చేది. ఇప్పుడు రిమార్కర్‌పైన ఆ సమస్యే లేదు. అందుకే ఏ సాంకేతికతనైనా విశాల హృదయంతో స్వీకరించినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. దానిని సరిగ్గా వాడుకోవడం తెలుసుకుంటే అది మనకు బానిసే అవుతుంది.. దానికి మనం బాసే అవుతాం.
ఏఐ ఆత్మను ఆవిష్కరించగలదా? – రామజోగయ్య శాస్త్రి
మనం సంధి కాలంలో ఉన్నాం. నేను రోళ్లు చూశాను.. మిక్సీలు చూశాను. మార్పును తిరస్కరించలేం. టెక్నాలజీ పరంగా ఎదగాల్సిందే. అయితే.. దేనిని ఎంత మేర వాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు పంచాంగం చూడాలంటే ఫోనులో ‘మెటా’ని అడిగినా చెబుతుంది. అదే ఫోన్‌ను మంచికీ చెడుకీ వాడొచ్చు. సో.. టెక్నాలజీని తప్పనిసరిగా స్వాగతించాల్సిందే. పాటలు లేకుండా సినిమాలు ఆడతాయని కొందరు అన్న సందర్భాలు ఉన్నాయి. మరి జరిగిందా? సో.. తెలుగువాళ్లను సినిమాల నుంచి వేరు చేయలేము... పాటల నుంచీ వేరు చేయలేము. పల్లెల్లో పని చేసుకునేవాళ్లు తమకొచ్చినది పాడుతుంటారు. వాటిల్లోనూ మంచి ట్యూన్లుంటాయి. అలాగే హైదరాబాద్‌లోనే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లున్నారు.
కూచోబెట్టి 15 ట్యూన్లు అలవోకగా పాడేవాళ్లుంటారు. అంతటితో అయి΄ోతుందా.. దానికి పరిపుష్టి చేకూర్చేలా వాయిద్యాల సహకారం ప్లాన్ చేయటం, పాడించడం వంటివన్నీ ఉంటాయి కదా. ఓ ట్యూన్ జనరేట్ చేసి ఆర్కెస్ట్రైజేషన్ చేస్తే సరిపోతుందా? అది నచ్చాలి కదా.. తుది మెరుగులు దిద్దితేనే అది బాగుంటుంది. ‘లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక...’ (‘శుభలగ్నం’లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ‘చిలుకా ఏ తోడు లేక...’ పాటను ఉద్దేశించి) అనే పాటను ఏఐ ఇవ్వగలదా? ఒక మనిషి తాలూకు భావనను పరికించి.. పరిశీలించి.. ప్రతిస్పందించి ఇవ్వగలిగేది మనిషి, మనసు మాత్రమే. ఆ మనసు ఏఐకి ఉందా? సినీ ఇండస్ట్రీలో పర్ఫెక్షన్ కోసం ఏమిచ్చినా ఇంకా ఏదో కావాలంటాం.
80 శాతం ఫలితమొచ్చినా దాన్ని వంద శాతం తీసుకొచ్చేందుకు మళ్లీ ఓ మనిషి కావాల్సిందే. యంత్రాలొచ్చినప్పుడు కార్మికులకు పనిపోతుందనుకున్నాం..పోయిందా..? ఏఐ కావాల్సిందే.. అదే పనిగా ఏఐతో పది పదిహేను సినిమాలు చేస్తే బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మళ్లీ మనుషులే కావాల్సి వస్తారు. పాట అనేది ఆత్మకు సంబంధించిన అంశం. ఇవాళ ఉన్న టెక్నాలజీతో ప్రతి శబ్దాన్ని వర్చ్యువల్‌గా సృష్టించవచ్చు. వయొలిన్, కీ బోర్డ్, మృదంగం ఇలా... కానీ దానిని లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ శబ్దాలతో మళ్లీ రీ ప్లేస్ చేస్తారు. అలాంటప్పుడు మృదంగం, వయొలిన్ విద్వాంసుల ఉద్యోగాలు ఎప్పుడోపోయుండాలి. ఏదైనా ఆర్గానిక్‌గా వచ్చే దాని అందమే వేరు. సాహిత్యం విషయంలోనూ అంతే. మనిషి అనుభవంతో పలికే పదాలుంటాయి. వాటిని ఏఐ నుంచి ఎలా ఆశించగలం? కొన్నింటిని మనిషే పుట్టించగలడు.. ఏదోప్రాస కోసం వెదుకుతున్నప్పుడు కొన్ని పదాలను ఏఐ ఇవ్వచ్చేమోగాని పాట యొక్క ఆత్మను ఏఐ ఆవిష్కరించలేదు కదా.
Comments
Please login to add a commentAdd a comment