Chandra Bose
-
కొంచెం కొత్తగా ఉందాం
క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు. మనం ఏం మారామనేది ముఖ్యం. అవే పాత అలవాట్లు.. పాత తలపోతలు పాత బలహీనతలు.. పాత అనవసర భారాలు... వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు. కొత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి పబ్బం గడిపే వారుంటారు. మబ్బు వీడండి.. కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి. హ్యాపీ న్యూ ఇయర్.రొటీన్లో ఉండే పెద్ద ప్రమాదం ఏమిటంటే... మనం సత్యాన్ని కనుగొనలేము. అవే రక్తసంబంధాలు, బంధువులు, స్నేహితులు... మన చుట్టూ ఉంటారు. రొటీన్లో ఉంచుతారు. వారు చేసే మంచి, చెడు... మనం క్షమించుకుంటూ, బాధపడుతూ ముందుకెళ్లిపోతూ ఉంటాం. కాని ఆగాలి. దూరంగా జరగాలి. కొన్నాళ్లు కలవకుండా ఉండి, స్థిమితంగా ఆలోచించి, వీరిలో నిజంగా మీకు సంతోష ఆనందాలు ఇస్తున్నది ఎవరు, మీ అభిమానాన్ని ప్రేమని దుర్వినియోగం చేయకుండా ఉన్నది ఎవరు, మీకు అపకారం లేదా అవమానం చేస్తున్నది ఎవరు... అనేది మీరు గమనించి చూసుకుంటే, కాస్త కఠినంగా మారి, వీరితో ఎడంగా ఉండాలని ఈ సంవత్సరం మీరు నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు.⇒ మంచి ఆలవాట్లు చేసుకోవడం తర్వాత. కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి మనకు తెలుసు. వాటి వల్ల ప్రమాదమూ తెలుసు. గిల్ట్ అనిపించడమూ తెలుసు. వాటిని వదిలించుకోవాలి. మీ ఎంపికే మీ ఫలితం. మీరు చెడు అలవాటు ఎంచుకుంటే చెడు ఫలితం వస్తుంది. దానిని వదిలించుకుంటే చెడు వదిలిపోతుంది. గట్టిగా నిశ్చయించుకుంటే మీరు కొత్త మనిషిగా మారతారు.⇒ వాయిదా వేయడం వల్లే మనిషి జీవితంలో మంచి వాయిదా పడుతూ ఉంటుంది. రేపు చేద్దాం, తొందరేముందిలే, ఇవాళ బద్దకం అంటూ మీరు పోస్ట్‌పోన్ చేసిన ప్రతిదీ మీకు సరైన సమయంలో సరైన రైలు అందకుండా చేస్తుంది. రైలు మిస్సయ్యాక మరో రైలు కోసం స్టేషన్లో పడి ఉండే ధోరణి మీలో ఉన్నంత కాలం మీరు కొత్త మనిషిగా మారలేరు... ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా. రోజూ ఉదయం ఇవాళ చేయాల్సిన పనులు అని రాసుకోవడం... చేశాకే నిద్రపోవడం మీకో కొత్త జీవితాన్ని తప్పక ఇస్తుంది.⇒ మీ భౌతిక, మానసిక ఎదుగుదల గత సంవత్సరం ఎలా సాగింది? ప్రశ్నించుకోండి. మీ మేధస్సు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వీటిని ఎంతమేరకు పెంచుకున్నారో చూసుకోండి. చిల్లర విషయాలకు నెలలు నెలలు ఎలా తగలెట్టారో మీకే తెలుసు. మంచి పుస్తకాలు, సంగీతం, మంచి సినిమాలు, ఆధ్యాతికత, విహారం, కొత్త ప్రాంతాల... మనుషుల సాంగత్యం... ఇవి మిమ్మల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. డిసెంబర్ 31 పార్టీ చేసుకుని మళ్లీ డిసెంబర్ 31 పార్టీ మధ్యలో గతంలోలా ఉంటే న్యూ ఇయర్ రావడం ఎందుకు? పార్టీ చేసుకోవడం ఎందుకు?⇒ కుటుంబ సభ్యులను చూసుకోవడం వేరు. వారిని ‘తెలుసుకోవడం’ వేరు. వారి మనసుల్లో ఏముంది, ఆకాంక్షలు ఏమిటి, ఒకరితో మరొకరికి ఉన్న అభ్యంతరాలు ఏమిటి, ప్రేమాభిమానాల కొలమానం ఎలా ఉంది... సరిగ్గా సమయం గడిపితే తెలుస్తుంది. షేర్లు, బంగారం పెరుగుదల తెలుసుకోవడం కంటే కూడా ఒక కుటుంబ సభ్యుడి మనసు తెలుసుకోవడం కుటుంబ వికాసానికి ముఖ్యం.⇒ చట్టాన్ని, నియమ నిబంధలను, ΄ûర బాధ్యతను, కాలుష్యం పట్ల చైతన్యాన్ని కలిగి ఉంటే రుతువులు గతి తప్పవు. ఎండా వానల వెర్రి ఇంట్లో జొరబడదు.కొత్త అంటే పాతను, పాతలోని చెడును తొలగించుకోవడమే.వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిజీవితం వరకు గుర్తుంచుకోదగిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, కొత్త సంవత్సర లక్ష్యాలు మన వెండి తెర వెలుగుల మాటల్లో...జ్ఞాపకాల పునాదిపై స్వప్నాల మేడగతం అనేది జ్ఞాపకం. అలాగే భవిష్యత్ అనేది స్వప్నం. జీవితం ఎప్పుడూ జ్ఞాపకాలకు, స్వప్నాలకు మధ్యలో ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. గతానికీ, భవిష్యత్‌కు మధ్యలో ఉండేదే మన జీవితం. అయితే గతాల పునాదిపై భవిష్యత్ భవనాన్ని కట్టుకోవాలి. జ్ఞాపకాల పునాదిపైన స్వప్నాల మేడ నిర్మించుకోవాలి. జ్ఞాపకాలను కేవలం పునాదిలాగా మాత్రమే వాడుకోవాలి. పునాది ఎప్పుడూ మేడ కాదు.. పునాది ఎప్పుడూ భవనం కాదు. కాకపోతే ఆ భవనం పటిష్టంగా ఉండాలనే పునాది మాత్ర గట్టిగా ఉండాలి. అంటే గతమనేది గట్టిగా ఉండాలి. గతంలోని మంచి విషయాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలన్నింటిని కూడా పోగుచేస్తేనే భవిష్యత్ భవనం పటిష్టంగా ఉంటుంది. చాలా కాలం నిలిచి ఉంటుంది.మనల్ని నిలబెడుతుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే.. ఆత్రేయగారు ఒకమాట చె΄్పారు. ‘వచ్చునప్పుడు కొత్తవే వచ్చరాలు.. పాతబడిపోవు మన పాత పనుల వలన’ అన్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ, మనం చేసే పాత పనుల వల్ల ఆ కొత్త సంవత్సరం కాస్తా పాతబడిపోతుంది. మనం కొత్త పనులు చేయాలి.. కొత్త ఆలోచనలు చేసుకోవాలి. కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు, కొత్త ధ్యేయాలను మనం పెట్టుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా ఆ రోజుల్లోనే మంచిది, మా చిన్నప్పుడు బాగుండేది అంటూ గతంతో ఎప్పుడూ కాలయాపన చేయకూడదు.కొత్త విషయాలు ఏంటి? కొత్త పరిజ్ఞానం ఏంటి? కొత్త సాంకేతికత ఏంటి... వంటి వాటిని ఆమోదించాలి, ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. దాని ద్వారా మనం సంపూర్ణ ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ కేవలం మనం గతాన్ని పొగుడుతూ.. ఈ తరాన్ని, ఈ కాలాన్ని నిందించకూడదు, నిరసన తెలియచేయకూడదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త ఆలోచనలతో, కొత్త తరాన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎప్పుడూ విజేతలం కాగలం. ముందు ఆ విషయాన్ని మనం ఆమోదించాలి. అప్పుడే దానిద్వారా మనం ముందుకెళ్లేలా నిచ్చెనలాగా, వారధిలాగా పనికొస్తుంది. అప్పుడే జీవితం కొత్తగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు.. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు. కొత్తగా మనం జీవితాన్ని మలచుకొనే అవకాశం ఉంటుంది. కొత్త తరాన్ని, కొత్త భావజాలాన్ని మనం అర్థం చేసుకుని ఆమోదిస్తే గనక ఏ గొడవా ఉండదు, ఏ పేచీ ఉండదు.. చక్కగా ముందుకు వెళ్లొచ్చు.⇒ ప్రతి పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో, నిజాయితీతో చేయాలి. అట్లాగే... ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించే కోణంలో నాదొక సూచన ఏంటంటే... నేడు పొందే ఆనందం.. రేపటి ఆనందాన్ని హరించకూడదు. ఈ రోజు ఎంత ఆనందాన్నైతే అనుభవిస్తున్నామో... ఈ ఆనందం వల్ల..రేపటి ఆ ఆనందానికి అది హాని కలుగ చేయకూడదు. రేపటి ఆనందానికి ఏ రకంగానూ ప్రభావం చూపకూడదు. రేపటి ఆనందాన్ని అనుభవించగలిగేలాగే ఉండాలి ఈ రోజుటి ఆనందం. అంటే ఓ హద్దులో.. పరిమితిలో.. ప్రతిరోజూ మనం పని చేస్తూ, ఆనందాన్ని అనుభవిస్తుంటే గనక రేపటి ని మరింత ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. సంపాదన కోసం కొంత సమయం, సమాజం కోసం కొంత సమయం, నీ శరీరం కోసం కొంత సమయం, నీ సొంత కుటుంబం కోసం కొంత సమయం... ఇంతే..! – చంద్రబోస్హెల్త్... హార్డ్వర్క్మనం ప్రతి ఒక్కరం కెరీర్ కోసం చాలా కష్టపడతాం. హార్డ్‌వర్క్ చేస్తాం. ఆ కష్టం వృథా కాదు. మన కష్టమే మనల్ని ఓ స్థాయికి చేర్చుతుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఇంకా కష్టపడి పని చేద్దాం... అయితే కెరీర్ గ్రోత్ మాత్రమే కాదు... మన వ్యక్తిగత ఆనందానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. హార్డ్ వర్క్... హెల్త్... హ్యాపీనెస్... ఈ మూడూ ముఖ్యం. వీటికి అనుగుణంగా లైఫ్‌ని ప్లాన్ చేసుకుని పాజిటివ్‌గా ముందుకెళ్లడమే. కెరీర్ కోసం హ్యాపీగా కష్టపడదాం... మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండి... హ్యాపీగా ఉందాం.2024 గురించి చెప్పుకోవాలంటే... నేను ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించానన్నది పక్కనపెడితే, నాకు తెలియనివి అన్నీ నేర్చుకునేందుకు సహకరించిన సంవత్సరంగా అనిపించింది. సినిమా ఇండస్ట్రీలో సహనమే కీలకం అనే విషయాన్ని నాకు నేర్పించింది. అంతేకాదు నేను గమనించిన మరో ముఖ్య విషయం ఏమిటంటే... ఎన్ని సినిమాలు చేశాం, నా తరువాత సినిమా ఏంటి, ఎప్పుడు అని ఎదురు చూడటం కన్నా, సెట్స్‌లో ఎంత క్రమశిక్షణగా ఉన్నాం, షూటింగ్లో ఎంత సక్సెస్‌పుల్‌గా .. ఎంత టీమ్ స్పిరిట్‌తో.. ఎంత ఎఫర్ట్ఫుల్గా పనిచేశామన్నది ముఖ్యం.రేటింగ్ విషయానికొస్తే... 1 నుంచి పది పాయింట్లలో నేను 2024కు 6 పాయింట్లు ఇస్తాను. ఎందుకంటే, 2024 నాకెంతో నేర్పించింది. దాంతోపాటు అనేక సవాళ్లను కూడా ఇచ్చింది మరి!2024లో నాకు సంతోషం కలిగించిన విషయాలు... మొదటిసారిగా నేను నా ఫ్యామిలీతో యూఎస్ ట్రిప్‌కు వెళ్లడం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగలగడం.2025 మీద నా అంచనాలు: షూటింగ్‌లతో బిజీగా ఉండటం, చాలా ఎగై్జటింగ్ స్టోరీస్, అద్భుతమైన టీమ్ నా చేతిలో ఉన్నాయి. వాటితో కనీసం రెండు మూవీస్ అయినా 2025లో రిలీజ్ కావాలి. ఇంకా కష్టపడటం, పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేయడం, నా గోల్స్. – ఆనంద్ దేవరకొండస్ట్రాంగ్గా... పాజిటివ్‌గా...మన ఎదుగుదలకు ఓ కారణం ‘సెల్ఫ్ లవ్’. ముందు మనల్ని మనం ఇష్టపడాలి... గౌరవించుకోవాలి. 2025 సౌండింగ్ చాలా బాగుంది. ఏదో పాజిటివిటీ కనబడుతోంది. ఓ పాజటివ్ ఫీలింగ్‌తో ఈ ఇయర్లో మనం హ్యాపీగా, హెల్దీగా, పాజిటివ్‌గా ముందుకు సాగుదాం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. అందుకని ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. యోగా చేయాలి... రోజూ కొంచెం సేపు ధ్యానానికి కేటాయించాలి. ఆరోగ్యంగా ఉండాలి... కష్టపడి పని చేయాలి. ఆత్యవిశాస్వంతో బతకాలి.నాకు డైరీ రాసే అలవాటు ఉంది. 2024లో పుషప్స్, ఫులప్స్, హ్యాండ్స్ట్రెంగ్త్పై దృష్టి పెట్టాలనుకున్నాను. కాని అది అవ్వలేదు. ఒక లవ్‌స్టోరీలో నటించాలనుకున్నాను. అఫ్కోర్స్ అది మన చేతుల్లో లేదనుకోండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవి ఫలించాలని కోరుకుంటున్నాను.ప్రొఫెషన్ విషయానికి వస్తే... ఈ సంవత్సరం నాలుగు సినిమాల్లో నటించాను. హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఇక పర్సనల్ విషయానికి వస్తే టఫ్ పరిస్తితులను ఎదుర్కొన్నాను. వాటి నుంచి బయటపడగలిగాను. టఫ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమోషనల్‌గా ఇతరుల మీద ఆధారపడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది నేర్చుకున్నాను. ఒంటరితనంగా అనిపించే పరిస్థితులు కూడా వస్తుంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను.కొత్త సంవత్సరం తీర్మానాల విషయానికి వస్తే... కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. యోగాను మరింత ప్రాక్ట్రిస్ చేయాలనుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ చేయాలనుకుంటున్నాను. 2023 చివరిలో కూడా కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాను. వాటిలో చాలా వరకు ఈ సంవత్సరం పూర్తి చేశాను.ఆడియెన్స్ సినిమాను ఎలా చూస్తున్నారు, సినిమాల రిజల్ట్ నుంచి సినిమా మేకింగ్ ప్రాసెస్ వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటాను. – అనన్య నాగళ్లప్రశాంతతకు ప్రాధాన్యంరోజు రోజుకీ నెగటివిటీ పెరిగిపోతోంది. అందుకే కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలి. కెరీర్ కోసం పరుగులు... డబ్బు కోసం పరుగులు... ఈ పరుగులో ప్రశాంతత ఉందా? అని ఆగి ఆలోచించుకోవాలి. లేనట్లు అనిపిస్తే పరుగు కాస్త తగ్గించి ప్రశాంతతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏం చేసినా కుటుంబం కోసమే కాబట్టి... కుటుంబంతో గడపడానికి వీలు లేనంత బిజీ అయిపోవడం సరి కాదు. అందుకే ఫ్యామిలీకి తగిన సమయం వెచ్చించండి... పాజిటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి... ప్రశాంతంగా ఉండండి.ప్రొఫెషన్‌గా, కెరీర్‌పరంగా కూడా 2024 నాకు చాలా మంచి సంవత్సరం అనే చెబుతాను నేను. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నా పెళ్లి, రెండు నా సినిమా గ్రాండ్ సక్సెస్ కావడం. ఐదు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న మా ప్రేమ కాస్తా పెళ్లి పట్టాలెక్కింది 2024లోనే. సంవత్సరమున్నరపాటు నేను, మా టీమ్ అంతా ఎంతో హార్డ్‌వర్క్ చేసిన నా సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం నా కెరీర్లో మెమరబుల్ మూమెంట్‌గా చెప్పుకుంటాను.1 నుంచి 10 పాయింట్లలో2024 కు నేను 9 పాయింట్లు ఇస్తాను. నా పెళ్లి చాలా గ్రాండ్‌గా జరగటం, ఆ పెళ్లికి పిలవడం కోసం చాలాకాలం నుంచి దూరంగా ఉన్న మా బంధువులందరినీ కలవడం, వారితో సంబం«ధాలు కలుపుకోవడం, అందరూ పెళ్లికి రావటం, అందరితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయగలగటం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, మా పెళ్లి తర్వాత మా ఊళ్లో మేము ఆంజనేయస్వామి తిరునాళ్ల చేసుకున్నాం. అది మాకు చాలా ప్రత్యేకం. మా చిన్నప్పుడెప్పుడో చేశాం అది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పుడు చేశాం. ఇంక న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటారా.. బీ గుడ్ టు అదర్స్. అంటే అందరితో ఇంకా మంచిగా ఉండటం. దాంతోపాటు 2024లో నేను రెండు సినిమాలు హిట్ కొట్టాలనుకున్నాను. అయితే అది చేయలేకపోయాను. 2025లో కచ్చితంగా రెండు మంచి సినిమాలు అందించాలి. ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాను. అదే నా గోల్. ఇంకా.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్. మేము ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేకపోయినా, కనీసం అదే రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేయాలనుకుంటున్నాం. – కిరణ్ అబ్బవరంప్రతి టైమ్ మంచిదేజీవితంలో మనకు దక్కిన ‘మంచి’ని గ్రహించాలి. ఆ మంచికి కృతజ్ఞతగా ఉండాలి. మన ఉరుకు పరుగుల జీవితంలో మనకు జరిగే మంచిని పట్టించుకునే స్థితిలో కూడా కొందరం ఉండము. జరిగే చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించుకుని బాధపడుతుంటాం. అయితే మంచిని గ్రహించి, పాజిటివ్‌గా ముందుకెళ్లాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక్కసారి మనకు దక్కిన మంచి విషయాలను గుర్తు చేసుకుని, ఆనందంగా ముందుకెళదాం.2024లో మొత్తం చూస్తే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. వాటి ఫలితాలు 2025 అందుకోబోతున్నాను. 2024లో వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా ఏ అంచనాలు పెట్టుకోకుండా సహనంతో వర్క్ చేశాను. నా వరకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ని ఇచ్చాను. ప్రతి టైమ్ మంచిదే. ప్రతి సందర్భం నాకు విలువైన బెస్ట్ మూమెంట్‌ని ఇచ్చింది. ఏడాది మొత్తంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నా మూవీస్‌కు డబుల్ షిఫ్ట్స్‌లో వర్క్ చేశాను. హార్డ్ వర్క్ ఉన్న ఆ రోజులన్నీ చాలా గొప్పవి. 2025లో కూడా బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చేయదగిన వర్క్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేయాలనుకుంటున్నాను. – నిధీ అగర్వాల్ -
ఏఐ టెక్నాలజీ వస్తే చిత్రపరిశ్రమలో జరిగేది ఇదే: రామజోగయ్య శాస్త్రి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం అన్ని రంగాల్లో ఏ మేరకు ఉంటుంది? కొందరు ఉపాధి కోల్పోయేలా చేస్తుందా? వంటి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా రంగంపైనా ఏఐ ప్రభావం భారీగా ఉంటుందన్నది కొందరి ఊహ. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంపై ఎక్కువ ప్రభావం పడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ అంశంపై ఇటీవల ‘సాక్షి’ సినిమా పేజీలో ఓ కథనం కూడా ప్రచురితమైంది. తాజాగా ‘స్టార్ రైటర్స్’ చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి ‘ఏఐ’ గురించి తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు.అది మనకు బానిస.... మనం బాస్ – చంద్రబోస్ మనిషి కంటే.. మనిషి మేధస్సు కంటే ఏదీ గొప్పది కాదు. కాక΄ోతే కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా మనిషికి సాయం చేయడానికే కనిపెట్టబడుతున్నాయి. మనిషిని కొల్లగొట్టడానికి, కూల్చేయడానికి కాదు. ఈ కోణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆహ్వానిస్తే అన్నీ మంచి ఫలితాలే వస్తాయి. నిజమే... అన్నింటా ఏఐ పరిజ్ఞానంపై చర్చ జరుగుతోంది... కాదనడం లేదు. సెల్‌ఫోన్ చాలా రకాల పనుల్ని చేస్తోంది. అందులో ఉన్న కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాం. అయినా బయట ఫొటో, వీడియో స్టూడియోలు ఉన్నాయి. అందులో సరికొత్త నిపుణులు పుట్టుకొచ్చారు. ఇంకా పెద్దగా అది విస్తరించింది. చాలా మందికి ఉపాధి లభిస్తోంది. ఏ వస్తువొచ్చినా కూడా మనిషి మాత్రమే ప్రత్యేకంగా చేయగలిగింది ఒకటుంటుంది.కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. దాంతో (టెక్నాలజీ) మనం చాకిరీ చేయించుకోవాలి. బానిసలాగా ఆ కొత్త పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. అక్కడే మనిషి ప్రతిభ తెలుస్తుంది. అది బాణీలు కట్టి సాహిత్యాన్నిస్తుంటే.. దాన్నుంచి వందల కొద్దీ బాణీలు తీసుకుని అందులోని ఆత్మను ఎంపిక చేసి దానికి మనం మెరుగులు అద్దుకోవాలి. ఉదాహరణకు కంప్యూటర్ వల్ల మనకు ఎంతో సమయం ఆదా అవుతోంంది. అలా ఆదా అయిన సమయాన్ని వేరే దానికి మళ్లిస్తున్నాం. అలాగే సంగీతంలో కూడా ఏఐ ఇచ్చే ట్యూన్ల నుంచి మంచిది ఎంపిక చేసుకుని దానికి మన సృజనాత్మకతను జోడించి ఏఐ కూడా చేయలేని సరికొత్త రాగాన్ని సృష్టించాలి. అంతే కానీ ఎవరి ఉద్యోగాలూపోవు. ఎవరి పనులూ ఆగిపోవు. అదేమీ దేవుడు కాదు.కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ వచ్చినప్పుడు అందరి ఉద్యోగాలూపోతాయన్నారు.. మరి కంప్యూటరే లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు పేపర్ మీద పాట రాసుకునేవాడ్ని. ఇప్పుడు రిమార్కర్ అనే సాంకేతికత ద్వారా రాసుకుంటున్నా. ఒకప్పుడు తప్పులొస్తే తుడిచేయడానికి వైట్ మార్కర్‌తో కొట్టేయాల్సి వచ్చేది. ఇప్పుడు రిమార్కర్పైన ఆ సమస్యే లేదు. అందుకే ఏ సాంకేతికతనైనా విశాల హృదయంతో స్వీకరించినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. దానిని సరిగ్గా వాడుకోవడం తెలుసుకుంటే అది మనకు బానిసే అవుతుంది.. దానికి మనం బాసే అవుతాం. ఏఐ ఆత్మను ఆవిష్కరించగలదా? – రామజోగయ్య శాస్త్రి మనం సంధి కాలంలో ఉన్నాం. నేను రోళ్లు చూశాను.. మిక్సీలు చూశాను. మార్పును తిరస్కరించలేం. టెక్నాలజీ పరంగా ఎదగాల్సిందే. అయితే.. దేనిని ఎంత మేర వాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు పంచాంగం చూడాలంటే ఫోనులో ‘మెటా’ని అడిగినా చెబుతుంది. అదే ఫోన్‌ను మంచికీ చెడుకీ వాడొచ్చు. సో.. టెక్నాలజీని తప్పనిసరిగా స్వాగతించాల్సిందే. పాటలు లేకుండా సినిమాలు ఆడతాయని కొందరు అన్న సందర్భాలు ఉన్నాయి. మరి జరిగిందా? సో.. తెలుగువాళ్లను సినిమాల నుంచి వేరు చేయలేము... పాటల నుంచీ వేరు చేయలేము. పల్లెల్లో పని చేసుకునేవాళ్లు తమకొచ్చినది పాడుతుంటారు. వాటిల్లోనూ మంచి ట్యూన్లుంటాయి. అలాగే హైదరాబాద్‌లోనే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లున్నారు.కూచోబెట్టి 15 ట్యూన్లు అలవోకగా పాడేవాళ్లుంటారు. అంతటితో అయి΄ోతుందా.. దానికి పరిపుష్టి చేకూర్చేలా వాయిద్యాల సహకారం ప్లాన్ చేయటం, పాడించడం వంటివన్నీ ఉంటాయి కదా. ఓ ట్యూన్ జనరేట్ చేసి ఆర్కెస్ట్రైజేషన్ చేస్తే సరిపోతుందా? అది నచ్చాలి కదా.. తుది మెరుగులు దిద్దితేనే అది బాగుంటుంది. ‘లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక...’ (‘శుభలగ్నం’లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ‘చిలుకా ఏ తోడు లేక...’ పాటను ఉద్దేశించి) అనే పాటను ఏఐ ఇవ్వగలదా? ఒక మనిషి తాలూకు భావనను పరికించి.. పరిశీలించి.. ప్రతిస్పందించి ఇవ్వగలిగేది మనిషి, మనసు మాత్రమే. ఆ మనసు ఏఐకి ఉందా? సినీ ఇండస్ట్రీలో పర్ఫెక్షన్ కోసం ఏమిచ్చినా ఇంకా ఏదో కావాలంటాం.80 శాతం ఫలితమొచ్చినా దాన్ని వంద శాతం తీసుకొచ్చేందుకు మళ్లీ ఓ మనిషి కావాల్సిందే. యంత్రాలొచ్చినప్పుడు కార్మికులకు పనిపోతుందనుకున్నాం..పోయిందా..? ఏఐ కావాల్సిందే.. అదే పనిగా ఏఐతో పది పదిహేను సినిమాలు చేస్తే బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మళ్లీ మనుషులే కావాల్సి వస్తారు. పాట అనేది ఆత్మకు సంబంధించిన అంశం. ఇవాళ ఉన్న టెక్నాలజీతో ప్రతి శబ్దాన్ని వర్చ్యువల్‌గా సృష్టించవచ్చు. వయొలిన్, కీ బోర్డ్, మృదంగం ఇలా... కానీ దానిని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ శబ్దాలతో మళ్లీ రీ ప్లేస్ చేస్తారు. అలాంటప్పుడు మృదంగం, వయొలిన్ విద్వాంసుల ఉద్యోగాలు ఎప్పుడోపోయుండాలి. ఏదైనా ఆర్గానిక్‌గా వచ్చే దాని అందమే వేరు. సాహిత్యం విషయంలోనూ అంతే. మనిషి అనుభవంతో పలికే పదాలుంటాయి. వాటిని ఏఐ నుంచి ఎలా ఆశించగలం? కొన్నింటిని మనిషే పుట్టించగలడు.. ఏదోప్రాస కోసం వెదుకుతున్నప్పుడు కొన్ని పదాలను ఏఐ ఇవ్వచ్చేమోగాని పాట యొక్క ఆత్మను ఏఐ ఆవిష్కరించలేదు కదా. -
నాలాంటి స్టూడెంట్స్‌కి సహాయం చేయాలి!
‘‘ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘సైంధవ్’ నా 75వ చిత్రం. యాక్షన్, భావోద్వేగాలు చాలా అద్భుతంగా వచ్చాయి. నా మనసుకు దగ్గరైన సినిమా ఇది. సంక్రాంతి పండక్కి ఫ్యామిలీతో కలిసి అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. చిత్ర సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రాంగ్ యూసేజ్..’ అంటూ సాగే తొలిపాటని సీఎంఆర్ గ్రూప్ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను నకాష్ అజీజ్పాడారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘కళాశాల దశలో నేను బ్యాక్ బెంచర్‌ని. ఇప్పుడున్న నాలాంటి విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులు, అధ్యాపకులు సహకారం అందించాలి. 35 ఏళ్లుగా నా సినీ జర్నీ కొనసాగుతోంది. నా మొదటి చిత్రం విడుదల అప్పటినుంచి ఇప్పుడున్న యువత తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు యువత ఆదరిస్తున్నారు. ఈ తరం వారిని కూడా నా సినిమాలు రీచ్ అవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. -
అందుకే భావోద్వేగానికి లోనయ్యాను: చంద్రబోస్
‘‘నేనిప్పటివరకు 3700 పాటలు రాశాను. ఈ రోజు నా మీద పాట రాసి, పాడారు. ఆ పాటను నాకు బహుమతిగా ఇచ్చిన ‘పర్ఫ్యూమ్’ టీమ్‌కి కృతజ్ఞతలు. నేను ఆస్కార్ అందుకున్న వీడియోను మళ్లీ ఇక్కడ చూడటంతో భావోద్వేగానికి లోనయ్యాను. ‘పర్ఫ్యూమ్’ పెద్ద విజయం సాధించాలి. నా భార్య సుచిత్ర ఈ చిత్రంలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు’’ అని రచయిత చంద్రబోస్ అన్నారు. చేనాగ్,ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వం వహించిన చిత్రం ‘పర్ఫ్యూమ్’. శ్రీమాన్ మూవీస్ సమర్పణలో జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఆస్కార్ అవార్డుగ్రహీత చంద్రబోస్‌ను యూనిట్ సత్కరించింది. ఈ వేడుకకి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్. విష్ణుమూర్తి, ఐఆర్ఎస్ అధికారి మురళీమోహన్, గ్రీన్ హార్స్ కంపెనీ అధినేత ప్రవీణ్ రెడ్డి, ఆచార్య భట్టు రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘‘కొత్త పాయింట్‌తో రూపొందిన చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి, చేనాగ్. -
ఈ ఏడాది నా జీవితం పూరిపూర్ణమైంది
‘‘ఈ వేదికపై (శిల్ప కళా వేదిక) జరిగిన వందల ఆడియో ఫంక్షన్లకు వచ్చాను. నా పాటలు కూడా ఆవిష్కరించబడ్డాయి. కానీ ఆ ఫంక్షన్స్‌లో హీరోలను చూసేందుకు ప్రేక్షకులు వచ్చేవారు. కానీ ఈ రోజు ఇక్కడ పాట హీరో.. సంగీతం హీరో.. సాహిత్యం హీరో. ‘తాజ్‌మహల్’ సినిమాతో నన్ను రామానాయుడుగారు పరిచయం చేశారు. 1995లో మొదలైన నా ప్రయాణం 2023 వరకూ.. 28 సంవత్సరాలు.. 860కి పైగా సినిమాలు.. 3600లకు పైగా పాటలు రాశాను. ఈ ఏడాది నాకు, నా జీవితానికి, నా సాహిత్యానికి పరిపూర్ణతను తీసుకొచ్చింది. ఈ ఏడాది నాపై పురస్కారాల వర్షం కురిసింది. ఫిబ్రవరిలో గోల్డెన్‌గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్, క్రిటిక్స్ అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, బాంబే హంగామా అవార్డు, ఉత్తమ జాతీయ గీతరచయిత అవార్డు.. ఇలా వరుసగా ఒకే సంవత్సరం నన్ను ఆరు పురస్కారాలు వరించాయి. మన తెలుగుకు వెయ్యేళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాషా చరిత్ర ఉంది. నా మిత్రుడు ఒకరు ‘సంకల్పం’ అనే పుస్తకం తెలుగులో రాసి, ఈ పుస్తకం కోసం వారం రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి వచ్చారు. ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు ఆయన సహోద్యోగి ఎందుకు సెలవు పెట్టారని అడగ్గా... తెలుగు భాష పుస్తకం కోసం అని చెప్పగా.. ఆవిడ తెలుగు అంటే.. ఆ నాటు నాటు లాంగ్వేజ్ అన్నారట. ప్రపంచంలో తెలుగు అనేది ఒకటి ఉందని చాలామందికి తెలియదు. కానీ మొట్టమొదటిసారి ‘నాటు పాట’తో ఇది నాటు భాష అని తెలిసింది. ఈ పాట సృష్టికర్తల్లో నేను ఒకడిని. నా జన్మ చరితార్థమైంది. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించిన నిహారిక, ప్రదీప్, సరస్వతిలకు, వారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ ఏడాది ఆస్కార్, జాతీయ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్న రచయిత చంద్రబోస్‌ని సత్కరించడానికి ‘తెలుగు జాతీయ చంద్రబోస్’ పేరిట శనివారం హైదరాబాద్‌లో నటుడు ప్రదీప్ ఓ వేడుక నిర్వహించారు. ఈ వేదికపై చంద్రబోస్‌ని, ఆయçన సతీమణి, నృత్యదర్శకురాలు, దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్‌ని సత్కరించారు. ఈ సందర్భంగా రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఆస్కార్, జాతీయ అవార్డు అందుకున్న చంద్రబోస్‌గారికి మా కవి కులం తరఫున అభినందనలు. బోస్‌గారి ప్రయాణం, ప్రస్థానం ఆదర్శవంతంగా ఉంటాయి. ఈ గొప్పదనం, ఆదర్శం ఒక్కరోజులో రాదు. తొలి రోజు నుంచే కష్టపడుతూ ఉండాలి. ఓ రచయితకు జరిగిన ఈ సన్మానాన్ని అక్షరానికి జరిగిన సన్మానంలా భావిస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు కళాకారులను సన్మానించారు. మురళీమోహన్, ముప్పలనేని శివ, ఎంఎం శ్రీలేఖ, చంద్రబోస్ సోదరుడు రాజేందర్‌తో పాటు పలువురు సినీ, టీవీ నటీనటులు పాల్గొన్నారు. -
పాటలు.. నా సామి రంగ
కొత్త సినిమా కోసం మ్యూజిక్ ఆన్ చేశారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం ‘నా సామిరంగ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, విజయ్ బిన్ని ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ‘నా సామిరంగ’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాటు నాటు పాట రాయడానికి 19 నెలలు పట్టింది.. చంద్రబోస్
-
ఆయన రాజమౌళి కాదు.. రాజముని
‘‘ఆస్కార్’ అవార్డు సాధించి ఎంతో మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన రాజమౌళి కాదు.. రాజముని. ఆయన చేసిన గొప్ప ప్రయోగం (ఆర్ఆర్ఆర్) తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ–‘‘ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌లకు అభినందనలు. తెలుగువారు గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపిన వారికి ఏపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున అభినందనలు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ రావాలని లక్షల మంది ఎదురు చూశారు.. ఆ అవార్డు రానే వచ్చింది. ఈ విజయాన్ని సాధించిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్గార్లకు అభినందనలు’’అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ–‘‘ఒక సినిమాకి నంది అవార్డు వచ్చిందంటే చాలా గొప్పగా అనుకుంటున్నాం. అలాంటిది తొలిసారి ఒక తెలుగు పాటకి ప్రపంచంలో అత్యున్నతమైన ‘ఆస్కార్’ అవార్డు రావడం తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సమయం. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ అవార్డు రావడం వెనుక రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్ డ్యాన్సర్స్ కృషి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నచ్చింది కాబట్టే ‘నాటు నాటు..’ పాట నచ్చింది, అవార్డు వచ్చింది. ఇది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సమిష్టి కృషికి లభించిన విజయం’’ అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘తమ్ముడూ.. నువ్వు పాడటంపై దృష్టి పెట్టొద్దు.. రాయడంపై దృష్టి పెట్టు’ అని చెప్పిన గుర్రా శ్రీనాథ్ అన్న, ‘పెళ్లిసందడి’ సమయంలో ‘బోస్‌ని మనతోపాటు చెన్నై తీసుకెళదాం’ అంటూ రాఘవేంద్రరావుగారితో చెప్పిన కీరవాణిగార్ల మాటలు నా జీవిత గమనాన్ని మార్చి ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆస్కార్‌ని చేతిలో పట్టుకున్నప్పుడు భారత సాహిత్య పతాకాన్ని పట్టుకున్నంత ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆస్కార్ సంబరాలు ఆరంభం.. ‘లంచ్ మీట్’లో కీరవాణి, చంద్రబోస్
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి దాదాపు నెల రోజులు ఉంది. ఈలోపు ఎప్పటిలానే ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నవారికి ‘లంచ్ మీట్’ ఏర్పాటు చేసింది అవార్డ్ కమిటీ. ఈ విందుకి సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు కమిటీ నుంచి విందు కార్యక్రమానికి ఆహ్వానం అందగా ఈ ఇద్దరూ వెళ్లారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ని నిర్మించారు. ఇక ‘లంచ్ మీట్’ విషయానికొస్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ది బెవర్లీ హిల్టన్ బాల్ రూమ్‌లో విందు కార్యక్రమం జరిగింది. ఈ విందులో దాదాపు 200మంది పాల్గొన్నారని సమాచారం. అక్కడ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు కీరవాణి, చంద్రబోస్. ఆ ఫోటోలను చంద్రబోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హుందాగా ఉందాం: జానెట్ యాంగ్ గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకకు ఓ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ ఆ వేదికపై నటుడు విల్ స్మిత్ భార్య జాన్ పిన్కెట్ హెయిర్ స్టయిల్ గురించి కామెడీగా మాట్లాడారు. అది నచ్చక విల్‌స్మిత్ అతన్ని చెంపదెబ్బ కొట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రపంచం మొత్తం చూస్తున్న వేడుకలో విల్ స్మిత్ ఇలా చేయడం సరికాదని అవార్డు కమిటీ భావించింది. ఇదే విషయం గురించి తాజాగా ‘లంచ్ మీట్’లో అకాడమీ చైర్మన్ జానెట్ యాంగ్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. గత ఏడాది ఆస్కార్ వేడుకలో జరిగిన ఘటన (క్రిస్‌ని విల్ చెంప చెళ్లుమనిపించడం) సరైనది కాదు. అందరం బాధ్యతా యుతంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలను ఆస్కార్ కమిటీ ఉపేక్షించదు’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ని ఆస్వాదించా! ఈ నెల 17న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ‘యాంట్–మ్యాన్ మరియు ది వాస్ప్: క్వాంటుమేనియా’లో సూపర్ విలన్ కాంగ్ ది కాంకరర్ పాత్ర చేసిన జోనాథన్ మేజర్స్ ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాట్లాడుతూ– ‘‘నేను భారతీయ చిత్రానికి అభిమానిని. ‘ఆర్ఆర్ఆర్’ని చాలాసార్లు చూశాను. మూడు గంటల ఈ సినిమాని ఆస్వాదించాను. ఇద్దరు నటులను (ఎన్టీఆర్, రామ్‌చరణ్) తెరపై చూడటం నాకు చాలా నచ్చింది. మరిన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నాను’’ అన్నారు. -
Chandrabose: పుష్ప నా కెరీర్‌కే సవాల్ విసిరింది
‘‘పుష్ప’ పాటలు విడుదలయ్యాక ఇండస్ట్రీ నుంచి చాలామంది అభినందిస్తూ మెసేజ్‌లు పంపించారు. అమెరికా నుంచి కొందరు యువకులు ఫోన్ చేసి ‘పుష్ప’ పాటల పల్లవులు, చరణాలు పాడి వినిపించారు. దాంతో నేటి యువత కూడా సాహిత్యాన్ని ఇంతలా ఓన్ చేసుకున్నారా? అని చెప్పలేని సంతోషం కలిగింది’’ అని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాటల రచయిత చంద్రబోస్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► సుకుమార్‌గారితో ‘ఆర్య’ నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన స్వతహాగా కవి కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడం మరింత సవాల్ అనిపించింది. మనం ఏం రాయాలి అనే దానిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. ► ‘పుష్ప’ సినిమాకు పాటలు రాయటం చాలా కష్టం అనిపించింది. ఈ సినిమా పూర్తీగా చిత్తూరు జిల్లా యాసలో నడుస్తుంది కాబట్టి పాటల్లో కూడా ఆ ప్రాంత స్లాంగ్‌ను, పదాలను వాడాల్సి వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్ గార్లు చిత్తూరు యాసను కష్టపడి ఒంట బట్టించు కుని అందులో లీనం అయిపోయిన విధానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. వారి స్ఫూర్తితో నేను కూడా కష్టపడి రాశాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌కే చాలెంజ్ విసిరాయి. ► ‘పుష్ప’లోని ‘దాక్కో దాక్కో మేక, ‘శ్రీవల్లీ’, ‘సామీ సామీ’, ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..’ పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, నా కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల్లానే ఇందులో కూడా ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా..’ అనే ఈ ఐటెమ్ సాంగ్ ప్రేక్షకుల అంచనాల కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. ► ‘రంగస్థలం’ సినిమాకి నేను పాటలు రాయలేదు. కేవలం ఆ సందర్భాలు మాటలను పలికాయి.. అవే పాటలై పోయాయి. నేను వాటిని పేపర్‌పైన పాటల రూపంలో రాసుకోలేదు. లిరికల్ షీట్ విడుదల చేయాలనుకున్నప్పుడు మాత్రమే పేపర్ మీద పాటల రూపాన్ని పెట్టాను. నా 27 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ► మేం ఆమ్స్టర్డ్యామ్లో ఓ బ్రిడ్జి ఎక్కుతున్నప్పుడు వచ్చిన ఆలోచనే ‘చూపే బంగారమాయెనే..’ పాట. 15 రోజుల మేథో మధనం తర్వాత తిరుపతి హోటల్ రూమ్‌లో పుట్టిందే ‘దాక్కో దాక్కో మేక..’ పాట. మా ‘పుష్ప’లోని పాటలు ప్రేక్షకుల హృదయాలను గంపగుత్తగా దోచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ తరంలోనూ నా పాటలు కూడా ట్రెండింగ్‌లో ఉండటం మరింత సంతోషాన్నిస్తోంది. -
పెళ్లి పీటలు కలిపాయి!
వేళా విశేషం అంటారు. చంద్రబోస్, సుచిత్ర కలవడం అలాంటి విశేషమే! ఇద్దరూ చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే ఫ్లయిట్లో పక్క పక్క సీట్లొచ్చాయి.. ‘హలో’ చెప్పుకున్నారు.. తర్వాతేం జరిగిందో.. ఈ ఇంటర్వ్యూలో ఉంది. చూపులో, మనసులో, పెద్దలో కలిపితే.. వధూవరులు పెళ్లి పీటలపై కూర్చుంటారు. వీళ్లిద్దర్ని మాత్రం.. పెళ్లి పీటలు కలిపాయి! అవును.. పెళ్లి పీటలు వీళ్లకు ముడివేశాయి. చదవండి... ఒక చక్కటి పాటను వింటున్నట్లో.. హుషారైన ఒక డాన్సును చూస్తున్నట్లో ఉంటుంది. ►ఆటా పాటలది విడదీయలేని అనుబంధం.. మీరు పాటల రచయిత.. సుచిత్రగారు డ్యాన్స్ మాస్టర్.. మీ ఇద్దరి ప్రేమ ఎలా మొదలైంది? చంద్రబోస్: 1998లో ‘పెళ్లి పీటలు’ సినిమా రికార్డింగ్ కోసం చెన్నై వెళ్లాను. పని పూర్తయ్యాక హైదరాబాద్ వస్తున్నాను. ఆ పాటల్ని షూట్ చేయడానికి కొరియోగ్రాఫర్‌గా సుచిత్ర హైదరాబాద్ వస్తోంది. మేమిద్దరం ఒకే సినిమాకు పని చేస్తున్నాం కాబట్టి ఫ్లయిట్లో పక్కపక్క సీట్లు వచ్చాయి. ‘హలో’ అని ఆమెను పలకరించాను. అప్పటికే విడుదలైన ‘పరదేశీ’ సినిమాలో నేను రాసిన పాటల గురించి చెబుతూ, కొన్ని వాక్యాల గురించి ప్రస్తావించింది. కొరియోగ్రాఫర్లు విన్యాసాలకు మాత్రమే అనుకుంటున్న తరుణంలో మనసుకు సంబంధించిన సాహిత్యాన్ని కూడా గుర్తుపెట్టుకుని చెప్పడంతో తనంటే నాలో మంచి భావన కలిగింది. కవితాత్మకంగా చెప్పాలంటే... కవిత్వాన్నే అర్థం చేసుకున్నది కవిని కూడా అర్థం చేసుకుంటుందని అర్ధాంగిని చేసుకోవాలనుకున్నాను. ఫ్లయిట్ ప్రయాణం మరుసటి రోజు నా బర్త్‌డే. మాటల మధ్యలో ఆ విషయం చెప్పాను. మరుసటి రోజు నాకో పుష్పగుచ్చం, గ్రీటింగ్ కార్డ్ పంపింది. ►మీరు గ్రీటింగ్ కార్డ్ పంపేటప్పుడు చంద్రబోస్‌గారి మీద ఏదైనా ఫీలింగ్ ఉందా? సుచిత్ర: ఫీలింగ్ ఏం లేదు. నిజానికి మగవాళ్లంటే సరైన అభిప్రాయం ఉండేది కాదు. బాగా మాట్లాడుతూ సందర్భం చూసుకుని ‘ప్రేమ’ అంటూ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారనుకునేదాన్ని. అందుకే ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉండేదాన్ని. బోస్‌గారి విషయంలో ఆయన వర్క్ నాకు చాలా నచ్చింది. ►ఫ్లయిట్ జర్నీ తర్వాత మళ్లీ ఎప్పుడు కలిశారు? బోస్: ‘పెళ్లి పీటలు’ పాటలు తీస్తుంటే ఆ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాను. మేమిద్దరం ఒకర్నొకరం జస్ట్ అలా చూసుకున్నాం. ఆ తర్వాత ఆ సినిమా ఆడియో ఫంక్షన్లోను, వేరే సినిమాల షూటింగ్స్‌లోనూ కలుసుకున్నాం. సుచిత్ర: ఎక్కువ ఫోన్లు చేసేవారు. అలాగే లొకేషన్లో పాట పాడుతున్నప్పుడు నన్నే చూసి పాడేవారు. ఆడియో ఫంక్షన్లో క్యాసెట్స్ ఇస్తారు కదా.. నాకు ఇచ్చిన క్యాసెట్‌ను లాగేసుకొని తన క్యాసెట్ నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆ క్యాసెట్లో ఆయన ఫొటో ఉంది. అందుకే నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆయన్ని నా చేతిలో పెట్టినట్టుగా ఫీలయ్యారు. నాకు అప్పటికి ఓ కన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ‘మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మానాన్నలను ఒప్పించండి. మా ఇంట్లోవాళ్లతో మాట్లాడండి’ అన్నాను. ►అంటే అప్పటికి బోస్గారంటే మంచి అభిప్రాయం ఏర్పడిందా? సుచిత్ర: మనల్ని ఒకరు ఇష్టపడుతున్నారంటే మనకు సహజంగానే వాళ్లంటే ఒకలాంటి మర్యాద ఏర్పడుతుంది కదా. బోస్: అప్పటికే నా కెరీర్ ప్రారంభమై మూడేళ్లయింది. 95లో కెరీర్ స్టార్ట్ చేశాను. నెలకి 15–20 పాటలు రాసేవాణ్ణి. ప్రేమ అని సమయం వృథా చేయడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకుని కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకున్నాను. అప్పటికి నాకు రెండుమూడు సంబంధాలు చూశారు. సినిమా పాటలు రాస్తానని చెబితే వాళ్లకు అర్థం కాలేదు. హీరోలే పాటలు రాసుకుని పాడతారని వాళ్ల అభిప్రాయం. ఎన్టీఆర్, చిరంజీవి వాళ్లు రాసుకుంటారు కదా. మీరు రాయడమేంటి? అన్నారు. అబద్ధం చెబుతున్నామనుకున్నారు. మన పని, మన కష్టం, మన ఆనందం.. వాళ్లకు అర్థం కావు. ఈ పరిశ్రమ గురించి తెలిసినవాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది. అందుకని బయట పెళ్లి ప్రయత్నాలు చేయొద్దని ఇంట్లో చెప్పాను. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి నా సమీపం వరకూ వచ్చింది, వదులుకోకూడదనుకున్నాను. సుచీ గురించి ఇంట్లో చెప్పాను. సినిమా ఫీల్డ్, డ్యాన్స్ మాస్టర్ అని వాళ్లు భయపడ్డారు. నేను ఇష్టపడుతున్నానని ఇంట్లో ఒప్పించాను. ►వాళ్ల ఇంట్లో ఏమన్నారు? సుచిత్ర: ముందు మా అక్క ఒప్పుకుంది. తర్వాత వద్దంది. బోస్: సుచిత్ర ఇంట్లో వాళ్ల అక్కే అన్నీ చూసుకునేవారు. ఆమె పెళ్లి చేసుకోలేదు. మేం నిశ్చింతగా పని చేసుకుంటున్నాం అంటే తన వల్లే. అయితే ముందు పెళ్లికి ఒప్పుకుని, ఆ తర్వాత నాకంటే వయసులో సుచీ పెద్ద కాబట్టి వద్దన్నారు. ‘ఆరో ప్రాణం’ సినిమా కథ సుచిత్రదే. ఆ సినిమాలో వినీత్ కంటే సౌందర్య పెద్దది. మా విషయంలో ఆ కథ నిజమైంది. సుచిత్ర: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే విజయం ఉందని నమ్ముతా. అందుకే తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇంటి నుంచి వచ్చేశాను. తిరుపతిలో పెళ్లి చేసుకుందామనుకున్నాం. కరెక్ట్ కాదనిపించింది. మా ఇంట్లో వాళ్లు ఎలాగూ లేరు. మీ వాళ్ల సమక్షంలో పెళ్లి చేసుకుందాం అన్నాను ఆయనతో. బోస్: వరంగల్ మా సిస్టర్ వాళ్ల ఇంటికి వెళ్లాం.. ఆ తర్వాత మేమంతా కలసి భద్రాచలం వెళ్లాం. అక్కడ పెళ్లి చేసుకున్నాం. సుచిత్ర: ఆయన ఇంట్లోవాళ్లను పరిచయం చేసుకున్నాక నా జీవితం అంతా వీళ్లే అని నిర్ణయించుకున్నాను. ►ఆ తర్వాత మీ ఇంట్లోవాళ్లు అంగీకరించారా? సుచిత్ర: పెళ్లయిన నెలకి మా వాడు కడుపులో పడ్డాడు. పుట్టబోయే బిడ్డను మంచిగా స్వాగతిద్దాం అని కలుపుకున్నారు. ►రచయితగా మీరు స్ఫూర్తి నింపే పాటలు ఎన్నో రాశారు. మీ వ్యక్తిగత జీవితం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈ దిశగా మిమ్మల్ని మీరు మార్చుకున్న విషయాలేమైనా? బోస్: కళాకారులు ఆదర్శప్రాయంగా ఉండాలని నమ్ముతాను. వ్యక్తిగతంగా మనం ఆచరించనిది మనం ఎవ్వరికీ చెప్పకూడదు. కళాకారులకు చెడు వ్యసనాలు ఉండకూడదు. అయితే నాకు కొన్ని వ్యసనాలు ఉండేవి. సినిమాల్లో బిజీగా ఉండే కొత్తలో పాన్ పరాగ్ తినేవాణ్ణి. మానేయమని మా ఆవిడ పోరు పెట్టేది. ఓసారి సీరియస్‌గా ‘పాన్ పరాగ్ మానేయండి. పాటలు రాయకపోయినా ఫర్వాలేదు, సాయిబాబా గుడి దగ్గర అడుక్కు తిందాం. మీరు కూడా అక్కర్లేదు. నేను అడుక్కుని మీకు పెడతా’ అంది. మానేశా. ఆ తర్వాత సిగరెట్ అలవాటయింది. ఫ్లాస్క్‌లో టీ పెట్టుకుని సిగరెట్లు కాల్చుకుంటూ రాసేవాణ్ణి. ‘నువ్వు ఈ మత్తులో పడిపోయి రాస్తూ ప్రజల్ని మేలుకొలపడం ఏంట్రా’ అనిపించింది. రచయిత గురువు స్థానంలో ఉంటాడు. ఆ ఆలోచన వచ్చీ రాగానే సిగరెట్ మానేశా. ఆ సినిమాకు రాశాను, ఈ హీరోకు రాశాను, ఆ అవార్డు వచ్చింది.. ఇది కాదు.. వ్యక్తిగతంగా మన చెడు అలవాట్లను అధిగమించడమే గొప్ప విజయాలు. మంచి దారిలో ప్రయాణిస్తూ మంచి చెప్పాలి. మనం ముసుగు వేసుకుని ఇతరులను మేలుకొల్పడం ఏంటి? ►డ్యాన్స్ డైరెక్టర్‌గా సుచిత్రగారు రఫ్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. విడిగా ఆమె ఎలాంటివారు? బోస్: టీమ్‌లో చాలామంది డ్యాన్సర్లు ఉంటారు. ఇలా చెయ్ అని చెబుతూ అన్నీ సరి చూసుకుంటూ, బుజ్జగిస్తూ, గద్దిస్తూ ఉండాలి. తనలో నాయకత్వపు లక్షణాలున్నాయి కానీ అవన్నీ కళాకారిణి వరకే. గృహిణిగా తనంత సాత్వికంగా ఉండేవాళ్లను చూడలేం. మా అమ్మానాన్నలను నాకన్నా బాగా చూసుకునేంత మంచి మనసు తనది. మా అమ్మ చనిపోయి 9 నెలలవుతోంది. అమ్మ చనిపోయిందనే నిజాన్ని నేను తీసుకున్నాను. కానీ తను తీసుకోలేకపోతోంది. ►మీది ‘ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్’. పైగా మీకన్నా సుచిత్రగారు కాస్త పెద్ద. మీ వైవాహిక జీవితంలో వీటి తాలూకు ప్రభావం ఎంతవరకూ ఉంటుంది? బోస్: తను ఫార్వార్డ్ క్యాస్ట్. నేను బీసీ. ఒకే రకమైన ఆహారపు అలవాట్లు, ఒకే విధమైన ఆచార సంప్రదాయాలు ఉంటే ఏ సమస్యా రాదు. అయితే భిన్నమైన ఆచారాలు, ఆహారపు అలవాట్లు ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు, గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను నాజ్‌వెజ్ తింటాను. సుచిత్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. తను తినదు. నాకు చేసి పెట్టమని నేను అడగలేదు. అయితే నేను చేయకపోతే మా ఆయన ఎలా తింటారని యూట్యూబ్ చూసి వండటం నేర్చుకుంది. మా పిల్లలు కూడా బాగా తింటారు. ఇలా ఆహారపు అలవాట్ల విషయంలో మాకు అవగాహన కుదిరింది. తను పూజలు చేస్తుంది. నాకూ భక్తిభావం ఎక్కువే. సుచిత్ర: ఆయనకు ఏం ఇష్టమో అది చేసి పెట్టడం నా బాధ్యత. నేను అదే పనిగా పూజలు చేయను. పుట్టింటివారిని, మెట్టినింటివారిని బాగా చూసుకుంటే చాలు.. వేరే ఏ పూజలూ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ►అత్తమామలను చూసుకునే విషయంలో సుచిత్రగారి గురించి? బోస్: 1999 మార్చి 7న భద్రాచలంలో మా పెళ్లి జరిగింది. మా అమ్మానాన్నను మాతో పాటు హైదరాబాద్ తీసుకువచ్చాం. అమ్మ ఈ మధ్య చనిపోయింది. నాన్న ఉన్నారు. అప్పుడప్పుడు మా ఊరికి నాన్న వెళ్లి వస్తుంటారు. అక్కడ మాకు ఇల్లు ఉంది. ఇంకో విశేషం ఏంటంటే.. మా నాన్నగారు, సుచీ నాన్నగారు మాతోనే ఉంటున్నారు. వాళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. మా అమ్మానాన్న... తన అమ్మానాన్న అనే తేడా మాకు లేదు. మా ‘ఇద్దరివాళ్లు’ ‘మావాళ్లే’ అనే ఫీలింగ్‌తో ఉంటాం. సుచిత్ర: కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పేపర్స్‌లో యాడ్స్ ఇవ్వడం, భారీగా తద్దిన భోజనాలు పెట్టడం, దర్పం కోసం గిఫ్ట్‌లు పంచడం చేస్తుంటారు. చనిపోయాక ఇవన్నీ చేస్తే వాళ్లకు తెలుస్తుందా ఏంటి? బతికి ఉండగానే తల్లిదండ్రులకు సేవ చేయాలి. బోస్: చనిపోయాక ఖర్చు చేసే డబ్బులతో వాళ్లు బతికి ఉన్నప్పుడే బాగా చూసుకోవచ్చు కదా. నీతులు చెప్పే చాలామందిని చూశాను నేను. కానీ తల్లిదండ్రులను మాత్రం చూడరు. అమ్మానాన్నలను నిస్వార్థంగా చూసుకోవడంలో ఉన్న సంతృప్తి వేరే ఎందులోనూ దొరకదు. ►మరి.. వయసు వ్యత్యాసం గురించి.. పెళ్లి విషయంలో అబ్బాయికన్నా అమ్మాయి చిన్నగా ఉండాలనే నియమం ఎందుకంటే అబ్బాయికన్నా అమ్మాయికి మానసిక పరిణతి ఎక్కువ ఉంటుందని.. బోస్: అబ్బాయిని పురుషుడ్ని చేసేది సమాజం. అమ్మాయిని స్త్రీగా చేసేది ప్రకృతి. నేచురల్‌గానే తనకు పెద్దరికం వచ్చేస్తుంది. ఆలోచనల్లో, సమయస్ఫూర్తి పరంగానూ అమ్మాయిలు ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. మామూలుగా అబ్బాయి పెద్ద, అమ్మాయి చిన్న అయితే అమ్మాయి ఎక్కువగా అలక పూనుతుంది. అప్పుడు అమ్మాయిని అబ్బాయి బుజ్జగిస్తాడు. కానీ ఇక్కడ నేనే అలుగుతుంటాను. మా ఆవిడ బుజ్జగిస్తుంది. సో.. మాకు ఆ సమస్య లేదు (నవ్వుతూ). సుచిత్ర: మనం ఏదైనా క్షమించగలగాలి. భర్త తప్పులు చేస్తున్నప్పుడు భార్య అతన్ని అమ్మలా ప్రేమించాలి. అమ్మలా ప్రేమిస్తున్నప్పుడు మన కోపంలోనూ ప్రేమే కనపడుతుంది కాబట్టి భర్త ఆ కోపాన్ని పెద్దది చేయడు. ►మీ భార్యని మనసులో పెట్టుకుని రాసిన పాట? బోస్: ‘సీతయ్య’ సినిమాకి రాసిన ‘సమయానికి తగు సేవలు సేయనీ..’ పాట తనని దృష్టిలో పెట్టుకుని రాశాను. ఈ పాట రాసే సమయానికి తను ఇద్దరు పిల్లల్ని కన్నది. కానీ నాకు ఆమెకు సేవ చేసే అవకాశం లభించలేదు. ఆమెను వాళ్ల అక్కయ్యవాళ్లు తీసుకుని వెళ్లారు. ఒకవేళ నేను మా ఆవిడకు సేవ చేస్తే ఎలా చేసి ఉండేవాడిని అనే తలంపుతో ఈ పాట రాశాను. సుచిత్ర: ఆయన సినిమాటిక్‌గా బిహేవ్ చేయరు. కానీ ఆయన గొప్పతనం గురించి చెబుతాను. మా నాన్నగారు నాతోనే ఉన్నారు. ఆయన ఖర్చులన్నీ నేనే పెడుతున్నాను. పెళ్లయ్యాక ఇలా పుట్టింటివాళ్లను చూసే అదృష్టం అందరికీ రాదు. ►ఓకే.. మీ ఇద్దరి పిల్లల గురించి? బోస్: మా అబ్బాయి నంద వనమాలి బీటెక్ మెకట్రానిక్స్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తనకు కార్లు, వాటి డిజైన్ల మీద ఇంట్రస్ట్. గిటార్ ప్లే చేస్తాడు. అమ్మాయి అమృత వర్షిణి స్పోర్ట్స్ పర్సన్. త్రోబాల్‌లో రెండు సార్లు నేషనల్స్ ఆడింది. ఇప్పుడు కూడా ఆడుతోంది. ►ఫైనల్లీ.. మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగాలంటే...? బోస్: అందరిలోనూ మానవ సహజమైన చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ముఖ్యంగా నేనేమన్నా చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని నిండు మనసుతో క్షమిస్తుంది నా భార్య. మా కాపురం ఇంత హాయిగా సాగటానికి ఆమె క్షమాగుణమే ప్రధాన కారణం. సిగిరెట్లు, పాన్‌పరాగ్‌లు తిని నోరంతా పాడు చేసుకుని, వొళ్లంతా పాడైపోయి వారానికో, పదిరోజులకో మందు తాగినా కూడా క్షమించేది. లేడీ ఫ్యాన్స్ అంటూ కొంతమంది ఫోన్ చేస్తారు. అలాంటి సమయంలో కూడా ఏ అపోహలకు తావు లేకుండా క్షమించేస్తుంది. ఆ గుణమే భర్తలో మార్పును తీసుకొస్తుంది. భార్య రెండు సార్లు క్షమించిన తర్వాత భర్తకు ఎంత సిగ్గుగా ఉంటుంది. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో చెడుతనం ఎక్కువ శాతం ఉంటుంది. ఎక్కడన్నా అమ్మాయిలో చెడుతనం ఉంటే అప్పుడు అబ్బాయి క్షమించాలి. ఆ సమతూకం వల్లే కాపురాలు చక్కగా ఉంటాయి. సుచిత్ర: మగవాళ్లు ఎన్ని తప్పులు చేసినా భార్య ఆ తప్పుల్ని క్షమిస్తే ఎరేజర్ (రబ్బర్)లాగా అవుతుంది. కానీ భార్య మాత్రం తప్పు చేయకూడదు. చేయకపోవడం మంచి సంసారానికి పునాది. ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకున్నామో అప్పుడు అతనితో పాటు ఉన్న అన్ని బంధాలూ మనవే అనుకోవాలి. బేసిక్‌గా మేం ఇద్దరం ఎవరిలోనూ నెగటివిటీ చూడం. బోస్: మా కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ముల్లో నేను చిన్నవాణ్ని. నాకు ఓ అక్క. మా అందరి పిల్లలూ కలిపి ఓ పన్నెండు మంది ఉంటారు. పెద్దలు, పిల్లలు మొత్తం ఇరవైమందిమి. మీ ఫ్యామిలీలో ఎవరు బెస్ట్ అని ఒకరికి తెలీకుండా ఇంకొకరిని అడిగితే అందరూ సుచిత్ర పేరే చెప్తారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నమ్మకంగా ఈ వ్యక్తికి చెప్పొచ్చు అనే పేరు తెచ్చుకుంది సుచీ. సుచిత్ర: మళ్లీ అదే చెబుతున్నా.. జీవిత భాగస్వామిని అమ్మలా ప్రేమించాలి. క్షమాగుణం ఉండాలి. ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా ఉండాలి. ►ఒకప్పుడు రచయితగా మీరు బిజీ.. కొరియోగ్రాఫర్‌గా ఆవిడ బిజీ. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నట్లున్నారు? బోస్: వాస్తవం ఏంటంటే 20 ఏళ్లు విరామం విశ్రాంతి లేకుండా పని చేసింది. పనిలోనే పండగ అన్నట్టు పని చేసింది. నేనూ 25 ఏళ్లుగా పని చేస్తున్నాను. మనిషికి పరిగెత్తడం ఒక కళ అయితే పరుగు ఆపడం ఒక గొప్ప కళ. జీవితాంతం పని చేయలేడు. చేయకూడదు. మన శరీరమో, ప్రకృతో వాతావరణం వల్లో పనిలో మనం మందకొడిగా అయ్యే అవకాశం ఉంది. ఇద్దరం పరిగెత్తితే ఇల్లు, పిల్లలు ఏమైపోవాలి అని నెమ్మదించాం. పెద్దవాళ్లను చూసుకునే సమయం ఉండాలి. సుచిత్ర: పెద్దవాళ్లు మనకు చేసింది తిరిగిచ్చేయాలి. పిల్లల భవిష్యత్ కోసం మనం కొంచెం ఖాళీగా ఉండాలి. బోస్: విరామాన్ని కూడా ఆస్వాదించాలి. ►మీ ప్రేమ తాలూకు తీపి జ్ఞాపకాలు పంచుకుంటారా? సుచిత్ర: చెప్పడం కాదు.. చూపిస్తా (నవ్వుతూ). మా ఫస్ట్ ఫ్లయిట్ జర్నీ టికెట్లు, మేం పెళ్లి చేసుకోవడానికి చెన్నై నుంచి తిరుపతి వెళ్లి అటునుంచి వరంగల్ వెళ్లిన జర్నీ టికెట్స్, మేం ఇద్దరం కలిసి ఫస్ట్ వెళ్లిన గుడికి సంబంధించి టికెట్లు.. నా దగ్గర భద్రంగా ఉన్నాయి. పెళ్లయ్యాక ఒకేరోజు కంటిన్యూస్‌గా రెండు సినిమాలు చూశాం. ఆ సినిమా టికెట్లు, నాకు మొదటిసారిగా ఆయన 450 రూపాయలు పెట్టి కొనిపెట్టిన చీర బిల్లు అన్నీ ఉన్నాయి. బోస్: అవును. నాకు పంపిన మొదటి గ్రీటింగ్ కార్డ్ కూడా చాలా జాగ్రత్తగా దాచింది. 1999 మార్చి7న మా పెళ్లి జరిగింది. 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల మా ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ, మమ్మల్ని నమ్ముకున్నవాళ్లకు తోడుగా ఉంటూ ఆనందంగా ఉన్నాం. కావాలనే పని తగ్గించుకున్నాం. తీరిక సమయాలను ఆస్వాదిస్తున్నాం. ►‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మళ్లీ డైరెక్షన్ ఎప్పుడు? సుచిత్ర: మంచి కథ ఉంది. అయితే మంచి నిర్మాత దొరికితే మళ్లీ డైరెక్షన్ చేస్తా. – డి.జి. భవాని -
తెల్లమబ్బుల చాటు చంద్రుడు
‘ఆయన నా ఆదర్శపురుషుడు. ఎందుకంటే, భారతదేశంలో విజ్ఞానశాస్త్రం దాదాపు అంతరించిపోయిందనుకుంటున్న కాలంలో ఆయన విజ్ఞానశాస్త్రాన్ని సృష్టించారు. పరికరాలను ఉపయోగించడమే తెలియని కాలంలో ఆయనే (సైన్స్) పరికరాలను నిర్మించారు. రేడియో అనేది ఉనికిలోకి రాని ఆ కాలంలోనే రేడియో తరంగాల ప్రయాణం గురించిన విషయాల మీద పరిశోధన చేశారు. వృ„ý జీవశాస్త్రం అంటే ఏమిటోఎరుగని కాలంలో ఆ అంశం మీద కృషి చేశారు. జగదీశ్చంద్ర బోస్ పరమాద్భుత సృజనాత్మక మేధస్సు కలిగినవారు.’భారతరత్న, ప్రధాని సలహాదారు ఆచార్య సీఎన్ఆర్ రావు మాటలివి. 2008 నవంబర్‌లో జగదీశ్‌బోస్ 150 జయంతిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) నిర్వహించింది. ఆ సందర్భంగా ప్రచురించిన పుస్తకానికి (రిమెంబరింగ్ సర్ జెసి బోస్) ముందుమాటలో ఆచార్య సీఎన్ఆర్ ఈ వాక్యాలు రాశారు. ‘అదిగో చందమామ!’ అంటూ చంటిపిల్లలకు నింగిని చూపించడంలో చూపుడు వేలు ఏ మేరకు ఉపయోగపడుతుందో, జగదీశ్చంద్రుడి జీవితం, కృషి, ఆధునిక విజ్ఞానశాస్త్రంలో ఆయన స్థానం, విశిష్టతలను తెలియచేయడంలో సీఎన్ఆర్ మాటలు కూడా అంతవరకే ఉపయోగపడతాయి. ఇప్పటి వాతావరణంలో కూడా జగదీశ్ బోస్ జీవితం వేనవేల వ్యక్తిత్వ వికాసాల ఆవాసం. కన్నుమూసిన తరువాత గాని వ్యక్తుల విశిష్టతను, ప్రతిభాపాటవాలను గుర్తించలేని బలహీనత భారతీయుల సహజ లక్షణమని అంటూ ఉంటారు. జగదీశ్ బోస్ విషయంలో ఇది పాశ్చాత్యులకూ వర్తిస్తుంది. ఆయన 150వ జయంతికి కేంబ్రిడ్జ్లోనే క్రైస్ట్స్ కళాశాలలో విగ్రహం ఏర్పాటు చేసి, ఒక సదస్సు నిర్వహించారు. కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రసంగించారు. దీనికి మన ఎంఎస్ స్వామినాథన్ కూడా హాజరయ్యారు. శ్వేతజాతి శాస్త్రవేత్తలంతా జగదీశ్‌బోస్ నోబెల్ పురస్కారం అందుకోలేనందుకు విచారం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయన నోబెల్ బహుమానం అందుకోలేకపోయారా? అందకుండా చేశారా? జగదీశ్‌బోస్ (నవంబర్ 30, 1858– నవంబర్ 23, 1937) అవిభక్త బెంగాల్‌లోని మైమెన్సింగ్ (ఇప్పుడు బంగ్లాలో ఉంది) అనేచోట పుట్టారు. తండ్రి భగవాన్చంద్ర బోస్. తల్లి భామాసుందరీదేవి. తండ్రి బ్రిటిష్ ప్రభుత్వోద్యోగి. కానీ ఆ కాలంలో చాలామంది విశ్వసించినట్టు అక్షరాభ్యాసం కూడా ఆంగ్లంలో జరిగితేనే భావి భారత పౌరుల బతుకులకు నిజమైన సార్థకత చేకూరుతుందని భగవాన్ చంద్ర మాత్రం విశ్వసించలేదు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యను బోధించడం అవసరమని నమ్మారాయన. అలాగే కొడుకు చేత విద్యాభ్యాసం చేయించారు. మూడు అంశాలు జగదీశ్ భవిష్యత్తును నిర్దేశించాయని అనిపిస్తుంది. అవి– ఆయన కలకత్తాలోని సెయింట్ జేవియర్ కళాశాలలో చదివారు. భౌతికశాస్త్రం చదవమని అక్కడే రీడర్‌గా పనిచేసిన ఫాదర్ లెఫాంట్ సలహా ఇచ్చారు. నా నగలు అమ్మయినా డబ్బు ఇస్తాను, ఇంగ్లండ్ వెళ్లి చదువుకోమని తల్లి ఇచ్చిన భరోసా. ఇంగ్లండ్ వెళ్లిన తరువాత కేంబ్రిడ్జ్‌లోని క్రైస్ట్స్ కళాశాలలో చదువుకునేందుకు విద్యార్థి వేతనం మంజూరు కావడం. ఐసీఎస్ పరీక్ష కోసమే ఆయన ఇంగ్లండ్ వెళ్లారు. కానీ వైద్య విద్యలో చేరారు. ఇందుకు తండ్రి ఇచ్చిన సలహా కారణం కావచ్చు. నీ మీద అజమాయిషీ లేని వృత్తిని ఎంచుకోమని ఆయన కొడుక్కి చెప్పారు. అందుకే ఆంగ్ల సామ్రాజ్యంలో ఉద్యోగి కావడం ఎందుకని వైద్యవిద్యలో చేరారు జగదీశ్‌బోస్. కానీ ఒక్క సంవత్సరంతోనే చదువు ఆగిపోయింది. కారణం– అనారోగ్యం. శవాలను కోసేటప్పుడు వచ్చే వాసన, ఆ గదిలో ఉండే వాతావరణం ఆయనకు సరిపడలేదు. తరువాతనే క్రైస్ట్స్ కళాశాలలో జీవశాస్త్రం చదివారు. 1885లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత కలకత్తాలోనే ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. జగదీశ్ బోస్‌కు ఉద్యోగం ఇవ్వవలసిందంటూ వైస్రాయ్ నుంచి ఆ కళాశాలకు సిఫారసు వెళ్లింది. అప్పుడే పదవీ విరమణ చేస్తున్న రిప్ప¯Œ ఆర్థిక సలహాదారు హెన్రీ ఫాసెట్ ద్వారా ఇది జరిగింది. ఇక తప్పక ఉద్యోగంలో చేర్చుకున్నారు. కానీ అప్పుడు పనిచేస్తున్న శ్వేతజాతి బోధనా సిబ్బందికి ఇస్తున్న జీతం కాకుండా, అందులో సగమే ఇస్తానంది బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం. అయినా ఉద్యోగంలో చేరారు జగదీశ్ బోస్. కానీ జీతం నిరాకరించారు. మూడేళ్ల తరువాత తప్పని పరిస్థితులలో ఆంగ్లజాతి బోధనా సిబ్బందితో సమానంగా వేతనం సవరించడమే కాకుండా, పాత బకాయి కూడా చెల్లించారు. అనంతర కాలాలలో భారతదేశ శాస్త్ర పరిశోధనకు ఎనలేని సేవలు అందించిన శాస్త్రవేత్తలు సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాథ్షా ఇక్కడే జగదీశ్‌బోస్ శిష్యులు. తన పరిశోధనా వ్యాసంగాన్ని ఉద్ధృతం చేయాలని 1894లో జగదీశ్ బోస్ నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రెసిడెన్సీ కళాశాలలోనే ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కళాశాలలో అప్పటికి ప్రయోగశాల లేదనుకుంటే పొరపాటు. ఉంది. కానీ అందులోని అన్ని విభాగాలలోకి భారతీయులకు ప్రవేశం మాత్రం ఉండేది కాదు. అందుకే తనకంటూ 24 చదరపు అడుగుల స్థలంలోనే అయినా ఆయన అక్కడే ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి ఎంతమాత్రము చాలని స్థలమది. అది కూడా స్నానాల గది పక్కన. నిజం చెప్పాలంటే జగదీశ్ బోస్‌కు పరిశోధన, విజ్ఞానశాస్త్రం అంటే ఒక మత్తు. అందుకే ఇలాంటివేమీ ఆయన పట్టించుకోలేదు. ఒక పక్క బోధన సాగిస్తూనే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమేగ్నెటిక్ వేవ్స్ మీద దృఢ దీక్షతో పరిశోధనలు చే శారు. అనుభూతులు, ఆనందం, బాధ, విచారం మనుషులకేæ కాదు... మొక్కలకీ, చెట్లకీ కూడా ఉంటాయి అని తేల్చారు జగదీశ్. అవి రాత్రివేళల్లో నిద్రపోతాయి. వేకువనే మేల్కొంటాయి. మన పరిసరాలలో ఉన్న మొక్కలు ఒకదానికొకటి సమాచారం అందించుకుంటాయి. ఎటొచ్చీ దానిని మనం సరిగ్గా కనిపెట్టలేం అంతే. ఇదీ జగదీశ్ బోస్ సిద్ధాంతం. ‘చెట్లకి కూడా మనలాగే ప్రాణం ఉంటుందని మొదట్లో నాకూ తెలియదు. అవి కూడా ఆహారం తీసుకుంటాయి. ఎదుగుతాయి. లేమిని ఎదుర్కొంటాయి. బాధనీ, విచారాన్నీ అనుభవిస్తాయి. అవి కూడా పరస్పరం సహకరించుకుంటాయి. మైత్రిని పెంచుకుంటాయి. సంతానం కోసం త్యాగాలు చేస్తాయి కూడా.’ (‘రిసెర్చెస్ ఆ¯Œ ఇరిటబిలిటీ ఆఫ్ ప్లాంట్స్’) అని రాశారు జగదీశ్. అలా విజ్ఞానశాస్త్రంలో ఒక కొత్త పరిశోధనా స్రవంతిని ఆవిష్కరించారాయన. మొక్కలకు ప్రాణం ఉంటుందన్న మహోన్నత సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి ఆయన కనుగొన్న పరికరం క్రెస్కోగ్రాఫ్. విషపూరిత బ్రొమైడ్ ద్రావణంలో ఒక మొక్కను ఉంచి, దీపంతో చిన్న స్పాట్‌ను వేసి, పొగ నింపిన పళ్లెంలో (స్క్రీన్) ఆ మొక్క అనుభవిస్తున్న మరణ బాధను ఆయన కలకత్తా టౌన్‌హాలులో ప్రయోగం ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రయోగంతో ఒక ఎలుక మరణబాధ దృశ్యం వీక్షకుల కళ్ల ముందు కదిలింది. ప్లాంట్ ఎలక్ట్రోఫిజియాలజీ మీద కూడా ఆయన పరిశోధనలు చేశారు. ప్రెసిడెన్సీ కళాశాలలోని తన పరిమిత పరిశోధనాలయంలో చేసిన కృషితో జగదీశ్‌బోస్ ఒక పరికరాన్ని కనుగొన్నారు. దాని పేరే కొహెరర్. ఇది రేడియో తరంగాలను గుర్తిస్తుంది. అంటే ఇదొక డిటెక్టర్. మెర్క్యురీ కొహెరర్ అని పిలిచే ఈ పరికరాన్ని (టెలిఫోన్ రిసీవర్‌తో సహా) ఆయన కనుగొన్నారు. హెర్టిజియన్ తరంగాల మీద జగదీశ్ చేసిన పరిశోధన విజ్ఞానశాస్త్రంలో ఒక మలుపు. వైర్లెస్ వ్యవస్థ ద్వారా సమాచారాన్ని పంపిణీ చేసేందుకు ఈ తరంగాలను ఉపయోగించుకోవచ్చునని ఆయన ఆనాడు ఊహించారు. దాని ఫలితమే ఈ ప్రయోగం. హెర్టిజియన్ తరంగాలను కోహెరర్ పరికరం గుర్తిస్తుంది. ఆ పరికరాన్ని కనుగొన్న 1895లోనే కలకత్తాలో గవర్నర్ సమక్షంలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు జగదీశ్. తాను ప్రయోగం చేసిన చోటు నుంచి 75 అడుగుల అవతల ఉన్న మరొక గదిలో ఏర్పాటు చేసిన గంట మోగేటట్టు, తుపాకీ మందు పేలేటట్టు ఆయన తరంగాలను పంపించారు. మధ్యలో గోడలు ఉన్నప్పటిMీ తరంగాలతో చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. తనకున్న పరిమిత వనరులతోనే ఆయన ఈ పరికరాన్ని కనుగొన్నారు. ‘సంకేతాలను ఒక మైలు దూరం వరకు జేసీ బోస్ పంపించారు’ అని 1896లో డైలీ టెలిగ్రాఫ్ రాసింది కూడా. 1897లో లండన్‌లోని రాయల్ ఇన్స్టిట్యూట్లో కూడా మరొక ప్రదర్శన జరిగింది. కానీ చాలామంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం పట్ల పెదవి విరిచారు. వివాదాలు లేవనెత్తారు. ఈ అంశంలో జగదీశ్ ఏకాకి అయ్యారు. అయినా వారిని ఎదిరించి పోరాడారు. ఈ విషయంలో ఆయనకు బాసటగా మళ్లీ ఒక ఆంగ్ల మహిళేæ నిలిచారు. ఆమె సిస్టర్ నివేదిత. జగదీశ్బోస్ను చూసైనా భారతీయులు తాము తక్కువ వారము కాదన్న వాస్తవాన్ని గ్రహించాలని, న్యూనతా భావాన్నీ, విదేశీ వ్యామోహాన్నీ వీడాలని ఆమె హెచ్చరించారు కూడా. ఈ సందర్భంగా ఆమె రాసిన వాక్యాలు అద్భుతమైనవి, ‘ఓ భారతదేశమా! ఓ భారతమాతా! నా జాతి మీకు చేస్తున్న అన్యాయాలను ఎవరు సరిచేస్తారు? ధైర్యవంతులు, అనంత మేధాసంపన్నులు అయిన నీ పుత్రులకు జరుగుతున్న ఈ వందల వేల అవమానాలకు ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు?’ తన పరిశోధనాంశాలను ప్రచురించడానికి పాశ్చాత్యులు నిరాకరిస్తున్నారన్న వాస్తవం కూడా ఆయనకు తెలిసింది. ఇంక ఒక్కటే దారి. తన పరిశోధనలను పుస్తకాల ద్వారా ప్రపంచానికి తెలియచేయాలి. ఈ కృషిలో ఆయనకు నివేదిత సహకరించారు. ‘లివింగ్ అండ్ నాన్ లివింగ్, ప్లాంట్ రెస్పాన్స్, కంపారిటివ్ ఎలక్ట్రో ఫిజియాలజీ అనే పుస్తకాలను రచించడంలో జగదీశ్ బోస్‌కు నివేదిత ఎంతో సహకరించారు. వ్రాతప్రతులను పరిశీలించి, అవసరమైతే సరిచేయించేవారు. రాసిన పుస్తకాలను అచ్చు వేయడానికి అవసరమైన డబ్బును కూడా సమకూర్చేవారు. రేడియో తరంగాల ప్రసారం గురించిన ప్రయోగానికే 1909లో నోబెల్ పురస్కారం వచ్చింది. అయితే జేసీ బోస్‌కు కాదు, మార్కోనీకి. బోస్ 75 అడుగుల అవతల ఉన్న గదిలోకి ఈ తరంగాలను పంపించారు. మార్కోనీ ట్రాన్స్ అట్లాంటిక్ రేడియో కమ్యూనికేషన్ ద్వారా 2000 మైళ్లు (యూకే లోని పొల్ధు నుంచి, న్యూఫౌండ్‌ల్యాండ్ వరకు) రేడియో సంకేతాలను పంపించారు. 1901లో జరిగిన ఈ ప్రయోగానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. మార్కోని పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. నోబెల్ పురస్కారం మార్కోనీ అందుకున్నా, ఈ తరంగాలను కనుగొన్న ఘనత ముమ్మాటికీ బోస్దేనని పలువురి వాదన. ఇందులో జరిగిన మతలబును మొదట వెల్లడించినవారు ఇటలీకి చెందిన ప్రొఫెసర్ ఎ. బాంటి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ సంస్థ ప్రచురించిన పత్రాల సంకలనంలో (వాల్యూమ్ 80, 1998) ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్ ఇన్స్టిట్యూట్లో ఈ అంశం మీద ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో మార్కోనీ కూడా ఉన్నాడన్నది మరొక వాదన. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ టాగూర్, సిస్టర్ నివేదితలతో జగదీశ్ బోస్ అనుబంధం అనిర్వచనీయమైనది. 1900 సంవత్సరంలో పారిస్‌లో అంతర్జాతీయ భౌతికశాస్త్ర కాంగ్రెస్ జరిగింది. దీనికి జగదీశ్‌కు ఆహ్వానం వచ్చింది. రెస్పాన్స్ ఆఫ్ ఇనార్గానిక్ అండ్ లివింగ్ మేటర్ అన్న అంశం మీద ఆయన పత్రం సమర్పించవలసి ఉంది. ఈ సమావేశానికి వివేకానంద, సిస్టర్ నివేదిత కూడా హాజరయ్యారు. ఆ తరువాతే ఎప్పుడో భౌతికశాస్త్రంలో చేసిన ప్రయోగాల ఫలితాల మీద పేటెంట్ హక్కు తీసుకోమని వివేకానంద సలహా ఇచ్చారు. ఆ సలహాను జగదీశ్ పాటించలేదు. 1904లో అమెరికాలోని పేటెంట్ హక్కుల కార్యాలయం నుంచి కూడా ఇలాంటి సూచనే వచ్చింది. కానీ జగదీశ్, ‘మేధో సంపదను వ్యక్తుల సొంతం చేయకూడదు’ అని సమాధానం ఇచ్చారు. 1914 నాటికి మొత్తానికి మెయిదావేల్లో బోస్ సొంతంగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. ‘నెర్వస్ మెకానిజం ఇన్ ప్లాంట్స్’ అన్న గ్రంథాన్ని జగదీశ్ ‘ఆజీవనకాల మిత్రుడు’ రవీంద్రుడుకి అంకితం ఇచ్చారు. టాగూర్ రెండో కుమార్తెకు శ్వాస కోశ సంబంధ వ్యాధి వచ్చింది. దీనితో ఆక్సిజన్‌ను ఓజోన్‌గా మార్చే ఒక పరికరాన్ని (ఎలక్ట్రిక్ స్పార్క్స్తో పనిచేస్తుంది) తయారు చేసి ఇచ్చారు. ‘కల్పన’ అనే పత్రికకు రాసిన ఒక కవితలో టాగూర్ ఇలా రాశారు, ‘ఓ నా మిత్రుడా! పశ్చిమంలోని విజ్ఞానశాస్త్రమనే దేవాలయం మొదలు, ఇండస్ వరకు నీవు విజయమనే మాలను గెలుచుకున్నావు. దానిని నీ పేద తల్లి శిరస్సున అలంకరించావు. ఇవాళ నీ తల్లి తన అశ్రువులనే మాటల రూపంలో ఆశీర్వచనాలుగా పంపించింది..... ఆ మాటలు నీ చెవికి మాత్రమే చేరతాయి....’ జగదీశ్చంద్ర కేవలం శాస్త్రవేత్తకాదు. వలస పాలన నాటి చీకటియుగంలో ఆయనొక వెలుగురేఖ. ఆత్మగౌరవానికి చిరునామా. జగదీశ్‌బోస్ ప్రతిభ అమోఘం. ఆయన భౌతికశాస్త్రవేత్త. జీవశాస్త్ర నిపుణుడు. వృక్షశాస్త్రజ్ఞుడు. జీవభౌతిక శాస్త్రవేత్త. పురావస్తుశాస్త్రవేత్త. బెంగాలీ సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ రాసిన తొలి రచయిత. ‘పలాతక్ తుపాన్’ (పలాయనం చిత్తగించిన తుపాను) బెంగాలీలో వెలువడిన తొలి సైన్స్ ఫిక్షన్. దీని రచయిత జగదీశ్ బోస్. తమ పూర్వీకులు చేసిన పనికి కాబోలు, వలస పాలనా కాలంలో జగదీశ్ చంద్రుడిని మబ్బుల చాటున దాచేసిన శ్వేతజాతి చిన్నపాటి పరిహారం చేసుకోవాలని అనుకుంది కాబోలు. చంద్రమండలంలో 90 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఒక బిలానికి జగదీశ్చంద్ర బోస్ అని పెట్టారు. - డా. గోపరాజు నారాయణరావు -
‘హింసను ప్రేరేపించడంలో ఆమె పీహెచ్డీ చేశారు’
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ రాజకీయ హింసను ప్రోత్సహించడంలో పీహెచ్డీ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తీవ్రవాదుల సంస్థ అని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ హింసను ప్రేరేపించడంలో బెనర్జీ మాస్టర్స్, పీహెచ్డీ లాంటి పెద్ద డిగ్రీలు పూర్తి చేశారని చంద్రబోస్ వ్యాఖ్యానించారు. తృణమూల్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, మతాల మధ్య సీఎం మమత చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కార్యకర్తల చేతిలో యాబై మందికి పైగా ప్రజలు చనిపోయారని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను నామినేషన్ వేయకుండా తృణమూల్ అడ్డుకుందని చంద్రబోస్ పేర్కొన్నారు. -
నలుగురు ప్రపూర్ణులు!
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఈసారి నలుగురికి కళా ప్రపూర్ణ, క్రీడా ప్రపూర్ణలతో గౌరవించాలని ఆంధ్రి విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 31న జరగనున్న వర్సిటీ 85వ స్నాతకోత్సవ నిర్వహణపై శుక్రవారం సాయంత్రం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించారు. కళాప్రపూర్ణకు ముగ్గురి పేర్లు, క్రీడా ప్రపూర్ణకు ఒకరి పేరును సభ్యులు ప్రతిపాదించారు. వీటిని గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. కళాప్రపూర్ణకు మ్యాజిక్ మాయిస్ట్రో ఇళయరాజా, ప్రఖ్యాత గాయని రావు బాలసరస్వతి, సినీ గేయ రచయిత చంద్రబోస్.. క్రీడా ప్రపూర్ణకు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ల పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సాహిత్యంలోనూ ఈసారి కళాప్రపూర్ణ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కన్వెన్షన్ సెంటర్లో నిర్వహణపైఅభ్యంతరాలు కొత్తగా నిర్మంచిన కన్వెన్షన్ సెంటర్లో స్నాతకోత్సవం నిర్వహించాలనే నిర్ణయాన్ని పలువురు సభ్యులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాత భవనంలో నిర్వహిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత భవనానికి మరమ్మతులు అవసరమని, వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సర్దిచెప్పారని తెలిసింది. స్నాతకోత్సవ మందిరం మరమ్మతులు నెల రోజుల్లో పూర్తిచేయించాలని సభ్యులు సూచించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రవేశాలు, త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరిశోధన ప్రవేశాల సెట్(ఏపిఆర్‌సెట్)పై చర్చ జరిగింది.. గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీలలో అర్హత కలిగిన వారిని కొనసాగించాలని, అర్హత లేకుండా ప్రవేశం పొందిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన జివోను వర్సిటీ ఆమోదించినట్లు సమాచారం. వీటితో పాటు వర్సిటీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు ఏయూ మైదానం కేటాయించడం తదనంతర అంశాలపై సైతం పాలక మండలి సభ్యులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్పష్టత లేని గవర్నర్ పర్యటన స్నాతకోత్సవానికి గవర్నర్ రాక ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 29 నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. గవర్నర్ వచ్చి.. అన్నీ సజావుగా సాగితే సుదీర్ఘ కాలం తర్వాత పూర్తిస్థాయి స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో 318 మందికి పీహెచ్‌డీలు, అవార్డులు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్ ఆచార్య కె.గాయత్రీదేవి, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వర రావు, సభ్యులు ఆచార్య ఎం.ప్రసాద రావు, జి.శశి భూషణ రావు, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర, డాక్టర్ పి.సోమనాధ రావు, ఆచార్య ఎన్.బాబయ్య, ఆచార్య కె.రామమోహన రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నించేందుకు..!
మనకు అన్యాయం జరిగితేనే ప్రశ్నించాలని ఎవరూ అనుకో కూడదు. ఇతరులకు అన్యాయం జరిగిందని తెలిసినా... ఎవరినైనా ప్రశ్నించి, న్యాయం చేసేలా ప్రతి ఒక్కరూ ముందడుగువేయాలనే సందేశంతో ‘ప్రశ్నిద్దాం’ అనే సినిమా రూపొందనుంది.బద్రీ నాయుడు అబ్బు దర్శకత్వంలో చంద్రబోస్ సేవా సమితి సమర్పణలో శ్రీ వెంకటేశ సాయి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై దాసరి నరసింహ, యార్లగడ్డ లక్ష్మి నిర్మించనున్న చిత్రమిది. ‘‘ప్రశ్నిద్దాం... ఇది మన హక్కు అంటూ నేటి యువత వినిపించే సందేశమే చిత్రకథ. సినిమా ప్రారంభోత్సవాన్ని వినూత్న రీతిలో జరపనున్నాం’’ అన్నారు బద్రీ నాయుడు. -
అమ్మతనాన్ని ఆవహింపచేసుకున్నాను...
‘ఎన్నో సినిమాలకు పాటలు రాశాను. కానీ అమ్మ మీద పాట రాయలేకపోయాను. మన హృదయంలో పవిత్రము, శుద్ధము అయిన కోరిక పుట్టి మనం పడుకున్న వేళల్లో ఆ కోరిక తాలూకు శక్తి, విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విశ్వంలోకి విడుదలవుతుంది. ఆ శక్తి విశ్వశక్తిని కూడగట్టుకుని, మనం మేలుకునే సమయంలో మళ్లీ మన శరీరంలోకి చేరుతుంది. ఆ శక్తి మన కోర్కెను తీర్చడానికి ఉపయోగపడుతుంది. అమ్మ గురించి రాయాలని, ఏఆర్ రెహమాన్ ట్యూన్‌కి రాయాలని రెండు కోరికలు బలంగా ఉండేవి. తమాషాగా ఆ రెండు కోరికలు ఒకేసారి తీరే అదృష్టం ‘నాని’ చిత్రం ద్వారా కలిగింది. ఎ.ఆర్. రెహమాన్... ఒకరోజు రాత్రి 11.30కి ట్యూన్ ఇచ్చారు. మరుసటి రోజు 10.30కి లిరిక్స్ పూర్తి చేయాలి. తగినంత సమయం లేదు. అమ్మ మీద పాట రాయాలి. వెంటనే మా అమ్మని గుర్తు తెచ్చుకున్నాను. అమ్మ నన్ను ఎలా పెంచిందో, ఎన్ని త్యాగాలు చేసిందో... అనుకుంటూ అమ్మతనాన్ని ఆవహింపచేసుకున్నాను.. వెంటనే ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ ...’ పల్లవి వచ్చింది. ప్రతిరోజూ మనం మాట్లాడే కోట్లాది మాటల్లో... తీయనైనది, గొప్పనైనది ‘అమ్మ’... అనే మధురమైన ఆలోచన నుంచి పల్లవి రాసుకున్నాను. ఇంటిల్లిపాదికీ ‘తనలోని మమతే కలిపి పెడుతుంది ముద్దగా’. మమత తాలూకు జీవశక్తి వంటి ఆహారం తిని, మా శరీరాలు వృద్ధి చెందాయి. సంగీత రీతుల్లో లేకపోయినా ఆమె లాలిపాటలు పాడి మమ్మల్ని నిద్రపుచ్చింది. ఆమె పాటలో ప్రేమ, మధురిమ ఉంటాయి. అమ్మ గురించి చెప్పేటప్పుడు ఉత్కృష్టమైన పదాలు ఉపయోగించకూడదు. అమ్మ అనే భావానికి ‘స్వచ్ఛత’ అనేది అలంకారం. స్వచ్ఛంగా సహజంగా అనిపించడంలో గొప్పదనం ఉంటుందని నా అభిప్రాయం. ‘కరుణించే కోపం అమ్మ... వరమిచ్చే తీపి శాపం అమ్మ...’ వాక్యాలు అందరికీ బాగా నచ్చాయన్నారు. అమ్మకు వచ్చే కోపం కరుణతో కూడినది, అమ్మ పెట్టే శాపాలు తీయటి వరాలు. ఏ తల్లికీ పిల్లల మీద ద్వేషంతో కూడిన కోపం ఉండదు. పిల్లలను వినాశనం కోరుతూ ఏ తల్లీ శపించదు. ఆమె తిట్లు పిల్లల పాలిట వరాలు. పాట విడుదల కాకముందే... ప్రముఖ చిత్రకారులు ఎం.ఎఫ్. హుస్సేన్ ప్రశంసలు అందుకున్నాను. ఈ పాట అందరికీ చేరువవుతుంది అనుకున్నాను. పాట వినగానే అందరికీ వాళ్ల అమ్మ, బాల్యం, అమ్మ ప్రేమ భావించుకోవాలనుకున్నాను. సాధించగలిగాను. ఇన్నాళ్ల సాహిత్య ప్రస్థానంలో నేను ఇష్టపడిన పాట, నాకు సంతృప్తిని ఇచ్చిన పాట. – సంభాషణ: డా. వైజయంతి -
పిల్లల పెంపకం సరిగ్గా లేకుంటే?
‘తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే పిల్లల భవిష్యత్ దెబ్బతినడంతో పాటు దేశమే నాశనం అయిపోతుంది’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గీతాపురి కాలనీ’. ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకత్వంలో జి.ఆర్కే ఫిలింస్ సమర్పణలో డికొండ దుష్యంత్ కుమార్, జి.రామకృష్ణ నిర్మించారు. రామ్‌చరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘నేను దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గరా పని చేయలేదు. అయినా.. నాపై, నా కథ మీద నమ్మకంతో దుష్యంత్గారు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. గీతాపురి కాలనీలో జరిగే ఐదు కథల సమాహారమే ఈ చిత్రం. ఐదుగురి పిల్లల్లో రాంకీగారి అబ్బాయి కూడా ఒక కీలక పాత్రలో నటించాడు’’ అన్నారు. ‘బందూక్’ చిత్రంలో తొలిసారిగా నటించా. నటనలో మా నాన్నగారే ఇన్స్పిరేషన్. మా అమ్మగారి సహకారంతో ‘గీతాపురి కాలనీ’ చిత్రం తీశా. రాంకీ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు’’ అని దుష్యంత్ కుమార్ చెప్పారు. -
సమాజాన్ని మేలుకొలిపే పాట
‘‘మనిషి నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు... మనిషి కష్టాల్లో, దుఃఖాల్లో ఉన్నప్పుడు... మనిషికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు.. ఎదురీదాలనుకున్నప్పుడు.. ఎదురు తిరగాలనుకున్నప్పుడు.. పవన్ కల్యాణ్ ‘గుడుంబా శంకర్’లో ‘లే.. లే.. లేలే..’ పాట వినాలి. ఈ పాట వింటే... చచ్చిపోవాలనుకునేవాడికి బ్రతకాలనే ఆశ కలుగుతుంది. భయపడేవాడికి ధైర్యం వస్తుంది. పారిపోయేవాడికి నిలబడి రొమ్ము చూపించాలని అనిపిస్తుంది. జీవచ్ఛవంగా ఉన్న మనిషిని లేపగలిగే శక్తి సామర్ధ్యం ఈ సాహిత్యంలో ఉంది. మనిషిని మేలుకొలిపే పాట ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘లే.. లే.. లేలే..’ పాటతత్వం గురించి భీమ్స్ మాటల్లో... ఈ పాటను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. 2004లో విడుదలైందీ సినిమా. అప్పటికి నేనింకా సంగీత దర్శకుడు కాలేదు. సహాయకుడిగా పనిచేసేవాణ్ణి. అసలు సంగీత దర్శకుడు అవుతామా? లేదా? ఎవరైనా అవకాశం ఇస్తారా? లేదా? ఒకవేళ అవకాశం వస్తే, ఈరోజు వస్తుందా? రేపు వస్తుందా? తెలియకుండానే ఒక మానసిక సంఘర్షణ జరుగుతున్న ప్రతిసారీ చంద్రబోస్ గారు రాసిన ఈ పాట నాలో ఎంతో స్ఫూర్తి నింపేవి. లే.. లే.. లేలే.. ఇవ్వాళ్ళే లేలే/ లే.. లే.. లేలే.. ఈరోజల్లే లేలే ఈ పల్లవి వింటుంటూనే నాలో ఓ ఉత్సాహం వస్తుంది. మనం చేయాలనుకున్న పనిని ఈరోజు, ఈ క్షణమే చేసేయాలి. వాయిదా వేయడమంటే మనకు వచ్చే అవకాశాలను వృథా చేసుకోవడమే. చిరుతతో పోటీపడే వేగంగానైనా, చిరుగాలిలా అయినా మనం చేయబోయే పనిని ప్రారంభించాలి. అప్పుడే ఆకలి, బాధలు తీరుతాయి. ఎవరైనా ఏదైన సందర్భంలో నీ ఆలోచనలను, శక్తి సామర్థ్యాలను, నిజాయితీని తక్కువ అంచనా వేసినప్పుడు నీ ప్రతిభ ఏంటనేది చూపించాలి. జీవితంలో నిజాయితీగా ఉండడమనేది చాలా ముఖ్యం. కానీ, నీ నిజాయితీ ఎదుటివ్యక్తికి బలహీనత అవ్వకూడదు. ఎప్పుడైతే.. ఎదుటివ్యక్తి నీ నిజాయితీని అలుసుగా తీసుకున్నాడో, శక్తిని తక్కువ అంచనా వేశాడో.. ఎదురీదాలి, ఎదురు తిరగాలి. నీరల్లే పారాలి.. అందరి దాహం తీర్చాలి.. అణిచేస్తే ముంచేయాలి లే నేలల్లే ఉండాలి.. అందరి భారం మోయాలి.. విసిగిస్తే భూకంపాలే చూపాలే ఈ చరణంలో ప్రజలు ఎలా ఉండాలో వివరించారు. నీరు చేరని చోటు ఉండదు. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. ప్రయత్నిస్తే.. మనమూ చేరుకోలేని చోటు ఉండదు. ఈ ప్రయత్నంలో ఎవరైనా అణిచివేయాలని ప్రయత్నిస్తే.. చేతులు కట్టుకుని కూర్చోకూడదు. చెడు వుంది.. మంచి వుంది.. అర్థం వేరే వుంది..చెడ్డోళ్లకి చెడు చేయ్యడమే మంచి/చేదుంది.. తీపి వుంది.. భేదం వేరే వుంది.. చేదన్నది ఉన్నపుడేగా తీపి ఈ లోకంలో మంచి చెడులున్నాయి. నువ్వు స్వీకరించే దానిబట్టి నీ ప్రయాణం ఉంటుంది. ఒక మనిషిలో రెండు పార్శ్వాలుంటాయి. చెడు ఉన్నప్పుడేగా అసలు మంచి ఏదో మనకు అర్థమయ్యేది, స్వీకరించేది. ఉదాహరణకు... సమస్య ఉన్నప్పుడేగా పరిష్కారం ఏంటో వెతికేది. పరిష్కారం ఎలా ఉండాలో ఆలోచించేది. మనం మంచిని చూసుకుంటూ చెడుని సవరించుకుంటూ ముందుకు వెళ్లాలి. మనం ప్రయాణించే దారుల్లో కుడి, ఎడమలు సహజమే. ఏది ఎటువైపు వెళ్లినా గమ్యం మాత్రం ఒక్కటే. పని పట్ల మనకు శ్రద్ధ ఉండాలి, కష్టపడాలి. అప్పుడు.. కుడి ఎడమయ్యే గొడవుంది. అంటే దాని అర్థం.. ఎడమ కూడా కుడి అవుతుందని, కష్టపడిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారని. మన కష్టమే గమ్యం వైపు తీసుకువెళ్తుంది. ఇక, చివరి వాక్యంలో ఎంతో అర్థముంది. మరణించిన తర్వాత కూడా మనం జీవించేలా ఊపిరి ఉన్నప్పుడు బతకాలి. బాల కార్మికులు, ఈవ్ టీజింగ్, రాజకీయ పరిస్థితులను వివరిస్తూ చిత్రంలో ఈ పాట సాగుతుంది. కానీ, అంతర్గతంగా చాలా సందేశం ఉంది. సేకరణ: సత్య పులగం చంద్రబోస్ గీత రచయిత -
ఎదురీత ముందు విధిరాత ఎంత!
కొన్నాళ్ల క్రితం ఓ మ్యూజిక్ డెరైక్టర్ నాకు ఫోన్ చేశారు. తన కూతుళ్లిద్దరూ నోట్ బుక్‌లో ఏదో రాసుకుంటుంటే ఏమిటని అడిగారట ఆయన. వాళ్లు సినిమా పాట రాసుకుంటున్నామని చెప్పా రట. ఆడపిల్లలు, నోట్‌బుక్‌లో సినిమా పాట రాసుకోవడమేంటి, ఏదైనా రొమాంటిక్ సాంగ్ గానీ రాసుకోవడం లేదు కదా అని కంగారుపడి ఆయన చెక్ చేశారట. అది అలాంటి పాట కాదు. ‘నింగి నేల నాదే’ సినిమాలోని ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ అనే పాట. పిల్లలకి స్కూల్లో ఆ సినిమా చూపించారట. చాలా గొప్ప పాట, అందరూ తప్పకుండా నేర్చుకుని పాడాలి అని టీచర్ చెప్పిందట. ‘పాఠాలతో పాటు మీ పాటను కూడా నేర్పుతున్నారు స్కూల్లో’ అని ఆయన అంటే సంతోషం వేసింది. ఏ రంగంలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఏదో ఒకదాని నుంచి స్ఫూర్తి పొందిన వాడే అయ్యుంటాడు. మహ్మాతాగాంధీ కూడా స్ఫూర్తి కోసం భగవద్గీత చదివేవారు. స్ఫూర్తి అనేది అంత అవసరం. నేను నా కెరీర్లో స్ఫూర్తిని కలిగించే పాటలు చాలా రాశాను... మౌనంగానే ఎదగమని, చీకటితో వెలుగే చెప్పెను, కొడితే కొట్టాలిలా, నవ్వేవాళ్లు నవ్వనీ... ఇలా! అయితే ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ పాట చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది వికలాంగులకు స్ఫూర్తినివ్వడం కోసం రాసింది. అన్ని అవయవాలూ సక్రమంగా పని చేస్తున్నవారికే స్ఫూర్తి అవసర మైనప్పుడు... శరీరంలో కొన్ని అవయవాలు లేక, తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి స్ఫూర్తి ఎంత అవసరం! అందరితో సమానం కావడానికి ఎలాంటి ప్రేరణ అవ సరం! అలా ఆలోచిస్తూనే పెన్ను పట్టాను. ఈ పాటకు జన్మనిచ్చాను. ఆరాటం ముందు ఆటంకం ఎంత/ సంకల్పం ముందు వైకల్యం ఎంత?/దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత??/ఎదురీత ముందు విధిరాత ఎంత? నమ్మకమూ పట్టుదల/నా రెండు రెక్కలుగా/ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశన్నంతా సాధించాలి అన్న పట్టుదల ఉంటే వైకల్యం అడ్డు కాదు. ఆ నిజం తెలుసుకుంటే విధిరాతను మార్చొచ్చు. దురదృష్టాన్ని పారద్రోలవచ్చు. చేజారెను చేతులు/చెదిరేను గీతలు/ బెదిరించిన బాధలే వివరించెను బోధలు హీరోయిన్ ప్రమాదవశాత్తూ చేతులు కోల్పోతుంది. తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితికొస్తుంది. ఆ బాధ మొదటి రెండు లైన్లలోనూ ఉంటే, క్రమంగా తనలో పెరిగిన పట్టుదలను మూడో లైన్ చెబుతోంది. పాదాలను పిడికిలిగా/నా గుండెను గుప్పిటగా/మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా... పట్టుదలతో తానేం చేయబోతోందో చెబుతోందా అమ్మాయి. చేతులు లేని స్థితిలో అలానే ఉండిపోతే తను అందరిలాంటి అమ్మాయిల్లాగే మిగిలిపోయేది. కానీ తను తన పనులు తానే చేసుకోవడం నేర్చుకుంది. కాళ్లతో వండుతుంది. తింటుంది. కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది. చివరికి స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుంది. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం/ అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం/ చిరునవ్వే స్తుంటే సెలవంది శోకం/సహనంతో ఉంటే దొరికింది సైన్యం/చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం అంటూ తన విజయాన్ని ప్రపంచానికి సగర్వంగా చూపిస్తుంది తను. నిజానికిదో చైనీస్ మూవీ. డబ్ చేశారు. విదేశీ సినిమాల్లో పాటలుండవు. కానీ తెలుగులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వచ్చే ఒకచోట పాట పెట్టా లనుకున్నారు. ఆ సిట్యుయేషన్‌కి పాట కంటే ముందు ఒక మాట వచ్చింది నా మనసులోకి. ఆ అమ్మాయి ఓ యాపిల్‌ను కాళ్లతో తీసుకుని, నోటి దగ్గర పెట్టుకుని తింటుంది. అది తన ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్థిరచిత్తానికి నిదర్శనం. అందుకే ఓ మాట రాశాను... ‘నాకెన్ని కష్టాలు సమస్యలు ఇబ్బందులు వచ్చినా కన్నీరు పెట్టను, పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కాబట్టి!’ ఆ తర్వాత ఈ పాట ప్రారంభమవుతుంది. ఇలాంటి పాటలు రాయాలంటే పాత్ర తాలూకు మనస్తత్వాన్ని, మానసిక స్థితిని తప్ప కుండా అనుభవించాలి. ఆ స్థానంలోకి వెళ్లి ఆ పాత్ర తాలూకు బాధను, సంఘర్షణను అనుభ వించగలిగితేనే ఈ విధంగా రాయగలం. లేక పోతే పాదాలను పిడికిలిగా పట్టుకుంటాను అన్న మాట ఎలా వస్తుంది! గుండెను గుప్పిటగా మలవడం అన్న వాక్యం ఎలా తడుతుంది! నిర్మాత సుధారాణిగారికి ఈ పాట వినిపించ గానే ఆవిడ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నేను కూడా దీన్ని నా జీవితంలో నేను రాసిన ఓ గొప్ప పాటగా భావిస్తాను. అయితే ఇది పాడే సందర్భం మాత్రం రాకూడదని కోరుకుంటాను. ఎందుకంటే వైకల్యం ఎవరికీ ఉండకూడదు. కానీ దురదృష్టం... చాలామంది వికలాంగులు ఉన్నారు. వాళ్లకి స్ఫూర్తి కలిగించే అవకాశం ఎప్పుడు వచ్చినా నేను ఈ పాటే పాడు తుంటాను. వాళ్ల కోసం ఈ పాట రాయగలిగి నందుకు సంతోషపడుతుంటాను! - చంద్రబోస్,గీత రచయిత -
ఫైళ్లు చెప్పిన నిజం
దేనికైనా సమయమూ, సందర్భమూ చూసుకోవడం తెలివైనవారి లక్షణం. ఆ లక్షణం ప్రధాని నరేంద్ర మోదీకి పుష్కలంగా ఉన్నదని నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం బహిర్గతపరిచిన ఫైళ్లు మరోసారి నిరూపించాయి. నేతాజీ కుటుంబసభ్యులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మొత్తం వంద ఫైళ్లను మోదీ విడుదల చేశారు. మొత్తం 16,600 పేజీలున్న ఈ ఫైళ్లు 1956- 2013 మధ్య వివిధ సందర్భాల్లో సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి. ఇవన్నీ ప్రధాని కార్యాలయానికీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలకూ చెందినవి. అసంఖ్యాకంగా ఉన్న మరిన్ని ఫైళ్లను నెలకు 25 చొప్పున విడుదల చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి నేతాజీకి సంబంధించి ఇన్ని దశాబ్దాలుగా రహస్యంగా ఉండిపోయిన ఫైళ్లన్నిటినీ బయటపెడతామని ఏడాదిన్నర క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనే దేశ ప్రజలకు బీజేపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు చేసిందల్లా ఆ హామీని నిలబెట్టుకోవడమే. అయితే ఆ వాగ్దానానికీ...దాన్ని నెరవేర్చుకోవడానికీ మధ్య గల ఈ ఏడాదిన్నర కాలంలోనూ చాలా పరిణామాలు సంభవించాయి. నిరుడు సెప్టెంబర్‌లో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ‘అత్యంత రహస్యమ’ని వర్గీకరించి ఉన్న 64 ఫైళ్ల డిజిటల్ ప్రతులను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఆ చర్య వెనక ఒక నేపథ్యం ఉంది. అంతకు పది నెలల క్రితం నేతాజీ ఫైళ్లన్నిటినీ వెల్లడించాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కింద దాఖలైన దరఖాస్తుకు జవాబుగా ‘విదేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి గనుక...’ బయటపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తాము అధికారంలోకొస్తే అన్ని ఫైళ్లనూ దేశ ప్రజలముందు ఉంచుతామని చెప్పినవారు ఇలా స్వరం మార్చడంపై దేశ పౌరుల్లో, ప్రత్యేకించి బెంగాల్ ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. పర్యవసానంగా ఆ పని తాము చేసి కేంద్రంలోని ఎన్డీయే సర్కారును ఇరకాటంలో పెట్టాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. అందులో భాగంగానే తమ ప్రభుత్వాధీనంలోని ఫైళ్లను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ పని తనకు లాభిస్తుందని ఆమె భావించారు. సరిగ్గా ఆ కారణంతోనే ఎన్డీయే ప్రభుత్వం ఇన్నాళ్లూ వేచి ఉంది. మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఫైళ్ల వెల్లడికి శ్రీకారం చుట్టింది. ఎవరు ఏ కారణంతో చేసినా చరిత్రకు సంబంధించి రహస్యమంటూ ఉండకూడదన్నది నిజం. అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫైళ్లనైనా నిర్ణీత కాల వ్యవధిలో బయటపెట్టడమనే సంప్రదాయం ఉంది. పెద్ద ప్రజాస్వామ్య దే శమని పేరున్న మన దేశంలో మాత్రం రహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతున్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనక ఏం జరిగిందన్నది వెనువెంటనే వెల్లడించకూడదనుకోవడాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు. కానీ ఎన్ని దశాబ్దాలు గడిచినా వాటిని కప్పెట్టి ఉంచాలనుకోవడం మంచిదికాదు. చరిత్రలో ఏం జరిగింది...ఎందుకు జరిగింది అన్న విషయాల్లో అందరికీ అవగాహన కలగడం అవసరం. ఇంతకూ ఇప్పుడు వెల్లడైన నేతాజీ ఫైళ్లలో ఏముంది? ఆయనపైనా, ఆయన మరణంపైనా ఇన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఊహాగానాలూ, అంచనాలే అందు లోనూ ఉన్నాయి. నేతాజీ మరణం సంగతి తేల్చడానికి వేర్వేరు సమయాల్లో నియమించిన షా నవాజ్ కమిటీ(1956), జి.డి. ఖోస్లా కమిషన్(1974), జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్(2005)లు వివిధ ప్రభుత్వాలతో, పౌరులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలున్నాయి. వాటికి అనుబంధంగా అనేక పత్రాలున్నాయి. తొలి రెండు కమిటీలూ 1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైహొకు విమానాశ్రయంలో నేతాజీ విమానం కూలి మరణించారన్న వాదనను సమర్ధించాయి. జస్టిస్ ముఖర్జీ కమిషన్ మాత్రం ఆ వాదనను విశ్వసించలేదు. జస్టిస్ ముఖర్జీ నివేదికను ఆనాటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. సారాంశంలో అన్ని ప్రభుత్వాలూ నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారన్న వాదననే అంగీకరించాయి. అలాగని జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్నాయంటున్న ఆయన అస్థికలను మన దేశం రప్పించడానికీ సిద్ధపడలేదు. అందుకు భిన్నంగా వాటిని అక్కడే ఉంచమని ఆ ఆలయ పూజారినీ, జపాన్ ప్రభుత్వాన్నీ ఒప్పించడానికి మన ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలు కూడా ఇప్పుడు విడుదల చేసిన ఫైళ్లలో ఉన్నాయి. ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదనీ, వేరే ఏదో జరిగి ఉంటుందనీ భావిస్తున్న నేతాజీ కుటుంబసభ్యుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న భయమే అస్థికలు తీసుకురాకపోవడానికి కారణమా... లేక వాటిని పట్టుకురావడం ఒక పెద్ద సందర్భంగా మారి నేతాజీపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయొచ్చునని అప్పటి ప్రభుత్వాలు అంచనా వేయడమా అన్నది తేలవలసి ఉంది. ఈ ఫైళ్ల విడుదల వ్యవహారం బెంగాల్లో కాంగ్రెస్‌కు ఇరకాటం కలిగించిందన్నది వాస్తవం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ అయినా సందేహిస్తుంది. సుభాస్ చంద్ర బోస్ అంటే బెంగాల్ ప్రజలకు గాఢమైన ప్రేమాభిమానాలున్నాయి. ఆయన గురించిన సమాచారాన్ని ఇన్ని దశాబ్దాలపాటు తొక్కిపెట్టి ఉంచింది కాంగ్రెసేనన్న ఆగ్రహం ఉంది. దేశ స్వాతంత్య్రోద్యమానికి నెహ్రూ కుటుంబం చేసిన సేవలను మినహా మిగిలిన నేతల గురించి పెద్దగా పైకి రానీయని కాంగ్రెస్...ఇప్పుడు ఎన్డీయే సర్కారు ఫైళ్ల వెల్లడి వెనక వేరే ఎజెండా ఉన్నదని విమర్శిస్తున్నది. అందులో నిజానిజాల సంగతలా ఉంచి ఆ పని తానే ఎందుకు చేయలేకపోయిందో దేశ ప్రజలకు ఆ పార్టీ సంజాయిషీ ఇవ్వాల్సి ఉంది. నేతాజీకి సంబంధించినంతవరకూ ఇప్పుడు ప్రచారంలో ఉన్న అనేక కీలకాంశాలకు ఈ వంద ఫైళ్లలోనూ జవాబుల్లేవు. రాగలకాలంలో బహిర్గతమయ్యే ఫైళ్లు సందేహనివృత్తి కలిగిస్తాయని ఆశించాలి. -
’నేతాజీ’ మరణంపై భ్రిటన్ వెబ్సైట్ కథనం
-
తాపీ లేని మేస్త్రీ
-
తాపీ లేని మేస్త్రీ
స్టార్ రిపోర్టర్ - చంద్రబోస్ పిడికిళ్లు బిగించి పలుగు, పార పట్టుకున్నా.. వారి చేతి గీత మారింది లేదు. చెమట నీరు చిందించి చలువరాతి మేడను కట్టినా.. వారి నుదుటి రాత బాగుపడ్డదీ లేదు. యజమానికి నచ్చినట్టుగా.. పది మందీ మెచ్చేటట్టుగా ఇళ్లు కట్టే భవన నిర్మాణ కూలీలు భారంగా బతుకీడుస్తున్నారు. పనులన్న రోజుల్లో మస్తుగా ఉండటం.. లేకుంటే పస్తులుండటం వాళ్లకు మామూలే. సిమెంట్, ఇసుక, నీళ్లు సమపాళ్లలో కలిపి ఇంటికి దృఢత్వం తీసుకువచ్చే వీరికి మాత్రం కష్టాల పాళ్లే ఎక్కువ. తాపీతో మెరిసిపోయే ఫినిషింగ్ ఇచ్చే ఈ మేస్త్రీల జీవితాలు మాత్రం తాపీగా సాగడం లేదు.ఈ కష్టజీవులను సాక్షి సిటీప్లస్ తరఫున సినీగీత రచయిత చంద్రబోస్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. చంద్రబోస్: ‘ఈ పేటకు నేనే మేస్త్రీ.. నిరుపేదల పాలిట పెన్నిధి..’ పాట మీరు వినే ఉంటారు. మేస్త్రీ అనే పదం చాలా బలమైనది. ఎంతో బాధ్యత కలది. మీకు గూడు లేకపోయినా మాకు ఇల్లు నిర్మించి ఇస్తారు. మిమ్మల్ని పలకరించడం ఆనందంగా ఉంది. వెంకటేష్: మాక్కూడ చాలా ఆనందంగా ఉంది సార్. చంద్రబోస్: చెప్పు వెంకటేష్ ఎన్నాళ్లయింది ఈ వృత్తిలోకి వచ్చి ? వెంకటేష్: 30 ఏళ్లవుతుంది సార్. చంద్రబోస్: అమ్మో..! ఎంత సంపాదించావ్..? వెంకటేష్: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ప్రస్తుతం దారుణంగా ఉంది సార్. ఆర్నెళ్ల నుంచి రియల్ఎస్టేట్ పడిపోయింది. కట్టే బిల్డింగులు కూడా ఆపేశారు. చేతికి పనిలేదు.. నోటికి బువ్వ లేదు. చంద్రబోస్: అవును కన్స్‌స్ట్రక్షన్ ఫీల్డ్ కొంత డల్ అయినట్టు నేనూ గమనించాను. రాజు: అందుకే.. మీరు ఇంటర్వ్యూ చేస్తారనంగనే.. ఐదుగురిని పిలిస్తే యాభైమంది వచ్చిండ్రు. అందరూ ఖాళీగా రోడ్లెంట తిరుగుతుండ్రు. చంద్రబోస్: ఓకే భయ్యా.. అప్పటికీ, ఇప్పటికీ మేస్త్రిల్లో వచ్చిన తేడా ఏంటి? రాజు: తేడా మాలో రాలేదు సార్. యజమానుల్లో వచ్చింది. ఒకప్పుడు మేస్త్రీ్తక్రి బోలెడంత విలువ ఉండేది. నిర్మాణాలకు తరతరాలుగా ఒకే మేస్త్రి కుటుంబాన్ని పిలిచేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మమ్మల్ని కూడా మిషన్లను చూసినట్టు చూస్తున్నారు. చంద్రబోస్: ఈ వృత్తిలోనే కాదు.. అన్ని రంగాల్లో అనుబంధాలు తగ్గాయి. సరే.. మీ సంపాదన ఎలా ఉంటుంది? మన్నెంకొండ: మగవారికి రోజుకు రూ.450, ఆడవాళ్లకు రూ.250 ఇస్తారు. వారంలో నాలుగైదు రోజులకంటే ఎక్కువ పని చేయలేం. నెలలో అన్ని రోజులు పని ఉంటుందని గ్యారెంటీ లేదు. అప్పుల తిప్పలు తప్పవు సార్. చంద్రబోస్: మీ పనికి శరీరం బాగా అలసిపోతుంది. ఆ బడలిక తీర్చుకోవడానికి మీరు మందు, గుట్కాలను ఆశ్రయిస్తారని విన్నాను. నిజమేనా..? శ్రీనివాస్: అందరూ అలా ఉండరు. కానీ బాగా కష్టమైనపుడు ఒక చుక్క వేయక తప్పదు సార్. చంద్రబోస్: అందరూ పిల్లల్ని చదివిస్తున్నారా? వెంకటేష్: ఎక్కడ చదువులు సార్. పనులు బాగున్నప్పుడు మంచి స్కూళ్లల్లో చేర్పించాం. ఇప్పుడు పనుల్లేవు, డబ్బు లేదు. అలాగే స్కూల్లో ఫీజులడగడం మానరు కదా! ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. మావోళ్లు చాలామంది పిల్లల్ని స్కూల్‌కు పంపడం ఆపేశారు. చంద్రబోస్: అయ్యో...అంత పని చేయకండి. మీరు ఇంత పని చేసేది మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా! రమేష్: ఏం చేస్తాం. ఊళ్లకు తిరిగి పోదామంటే అక్కడ పంటలూ లేవు.. పనులూ లేవు. చంద్రబోస్: మీది ఏ జిల్లా? రమేష్: మహబూబ్‌నగర్. మాలో చాలామంది ఆ జిల్లా నుంచి వచ్చిన వారే ఉన్నరు. చంద్రబోస్: అవును మన రాష్ట్రంలో వలసల జిల్లా అదే. నేను చాలాసార్లు చూశాను, అడ్డంగా కట్టిన ఓ కర్రపై నిలబడి తాపి పని చేస్తుంటారు. పదుల అంతస్తుల పైన మీ పనులు చూస్తుంటే మాకే కళ్లు తిరుగుతుంటాయి. మీ పరిస్థితి ఏంటి..? వెంకటేష్: ఏం చేస్తాం. మా పనే అట్లాంటిది. చంద్రబోస్: భయం వేయాదా? మన్నెంకొండ: ఎందుకు వేయదు సార్. కాకపోతే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి. మనసు కాస్త అటుఇటూ అయిందా.. ప్రమాదం తప్పదు. చంద్రబోస్: అంటే ధ్యానం చేస్తున్నట్టు అన్నమాట. లేకపోతే క్షణం చాలు కదా కాలు జారడానికి, పట్టు తప్పడానికి. రాజు: ఎంత జాగ్రత్తగా చేసినా ఒకోసారి ప్రమాదాలు తప్పవు సార్. దెబ్బలతో ఆగవు ప్రాణాలే పోతుంటాయి. చంద్రబోస్: మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? రాజు: ఈ మధ్యనే ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో కూలీలు పని చేస్తున్నారు. ఓ 35 ఏళ్ల కుర్రాడు ఇసుక బస్తా మోస్తూ వెనక్కిపడిపోయాడు. ఆ బస్తా గుండెపై పడటంతో గుండె ఆగి చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు. మేమే తలో ఐదువందలు, వెయ్యి వేసుకుని లక్ష న్నర రూపాయలు జమ చేసి అతని కుటుంబానికి సాయం చేశాం. చంద్రబోస్: శభాష్ భయ్యా.. పనికి పోతేగానీ పొట్ట నిండని మీరు ఇంత పెద్ద మనసు చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండదా ? శ్రీనివాస్: ఒక్క పైసా రాదు సార్. అసలు మమ్మల్ని ప్రభుత్వం అసలు గుర్తించట్లేదు. అన్ని వృత్తుల వారికీ హెల్త్ కార్డులు, ఇళ్లు కట్టిస్తున్నారు. మాకు మాత్రం ఏం లేదు. చంద్రబోస్: అవును నేను కూడా ఎక్కడో విన్నాను. సర్కస్‌లో పని చేసేవారు, భవన నిర్మాణ కూలీలు ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశం కూడా లేదట. వెంకటేష్: మా కష్టాలకు అంతెక్కడుంది సార్. కొందరు అందంగా ఇల్లు కట్టించుకుంటరా..! పని అయిపోయాక పైసలు మాత్రం సరిగా ఇవ్వరు. మా తరఫున అడిగేటోళ్లు ఎవరుంటరు సార్. అందుకే మేమే సొంతంగా ఓ యూనియన్ పెట్టుకున్నం. చంద్రబోస్: గుడ్.. యూనియన్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. కష్టం వస్తే ఆదుకోవడం ఒక్కటే కాదు.. మీ మధ్య అనుబంధాలు కూడా పెరుగుతాయి. అమ్మా.. మీరు మౌనంగా వింటున్నారు. భవన నిర్మాణంలో మీ పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మీరు మాల్ అందిస్తేనే మేస్త్రీ ఇటుక పేర్చగలడు. ఏమంటారు? లక్ష్మమ్మ: ఔ సార్. చంద్రబోస్: లక్ష్మమ్మ.. ఇటుకలు, ఇసుక, మాలు అన్నీ బరువైనవే. అలాంటివి నెత్తిపై పెట్టుకుని మెట్లెక్కుతారు. ఆరోగ్య సమస్యలు రావా? లక్ష్మమ్మ: ఎందుకు రావు సార్. ఊకె తలనొస్తది, నడుంల నొస్తది, కాళ్లు గుంజుతయి. అట్లాని.. పనికి రాకుంటే రోజెట్ల ఎల్తది సార్. చంద్రబోస్: మా ఇంటి పక్కన బిల్డింగ్ కడుతుంటే చూశాను.. గర్భవతులు కూడా వచ్చి ఈ బరువైన పనులు చేస్తుంటారు. చాలా ప్రమాదం కదమ్మా? లక్ష్మమ్మ: పేదోళ్లకు ప్రమాదం ఏముంటది సార్. బిడ్డను కనే చివరి క్షణం వరకూ కష్టపడి బతికితేనే పుట్టే బిడ్డను పోషించగలదు. గవన్నీ మాకు మామూలే చంద్రబోస్: మీరు ఇన్ని కష్టాలు పడితే గానీ ఇంటికి ఓ రూపం రాదు. మిమ్మల్ని కూడా ఓ విభాగంగా గుర్తించి, ముఖ్యంగా ఆరోగ్య బీమా, హెల్త్‌కార్డ్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాను... ఉంటాను... ..:: భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి -
సాంగు భళా
‘చిన్న చిత్రం’ జేబీ లక్ష్మణ్ జీవితాన్ని పెద్ద వులుపే తిప్పింది. అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడేలా చేసింది. ‘కృతజ్ఞత’ అనే లఘు చిత్రానికి రాసిన పాట యుూట్యూబ్‌లో వేలల్లో హిట్స్ సంపాదించింది. దెబ్బకు మనోడి కెరీర్‌కు సిల్వర్ స్క్రీన్ ‘టచ్’ వచ్చేసింది. కట్ చేస్తే... ప్రస్తుతం ప్రవుుఖ చిత్రాలకు లిరిక్స్ రైటర్‌గా మంచి జోష్ మీదున్నాడీ కుర్రాడు. సినీ రంగంలో లక్ష్మణ్ ‘షార్ట్’ జర్నీ ఇదీ... సొంతూరు కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని కల్వాయి. హైదరాబాద్‌లో ఎంఏ, ఎల్ఎల్బీ చేశా. ఎనిమిదో తరగతి నుంచే పాటలు రాయడమంటే ఆసక్తి. కాలేజీ డేస్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే మనముండాల్సిందే. చిన్న చిన్న కవితలు, పాటలు రాసి ఫ్రెండ్స్‌కు వినిపించేవాడిని. కాలేజీ ఫంక్షన్లలో పాడేవాడిని. పాటలు, సాహిత్యంపై పట్టు సాధించేందుకు సామాజిక తత్వవేత్త బీఎస్ రాములు ఇచ్చిన పుస్తకాలు బాగా ఉపయోగపడ్డాయి. 2009లో హైదరాబాద్‌లో జరిగిన నంది నాటకోత్సవాల్లో నేను రాసి పాడిన ప్రకృతి పాటకు నంది అవార్డుతో పాటు రూ.పదివేల నగదు లభించింది. అప్పటి నుంచి నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సినీ ప్రముఖులు చంద్రబోస్, కాశీ విశ్వనాథ, అనంత్ శ్రీరామ్ వద్ద పాటలు రాయడంలో మెలకువలు నేర్చుకున్నా. అప్పుడే లఘు చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. అదే సవుయుంలో సన్నిహితులు నిర్మిస్తున్న ‘కృతజ్ఞత’, ‘కక్ష’ షార్ట్ ఫిల్మ్స్‌కి పాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ పాటలు సూపర్ హిట్. కెరీర్ కొత్త మలుపు తిరిగింది. దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమయ్యే కాంతిరేఖ టైటిల్ సాంగ్ రాసే అవకాశం వచ్చింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మన ఊరి సాక్షిగా’, ‘ఈజీ మనీ’, ‘ప్రేమించు’ సినిమాలకు పాటలు రాశా. అల్తాఫ్ హుస్సేన్, కృష్ణవేణి హీరో హీరోయిన్లుగా నటించిన ‘మళ్లీ రాదోయ్.. లైఫ్’ సినిమాకు లిరిక్స్ అందించా. ఈ నెల ఏడున విడుదలైన ఈ సినిమా పాటలకు మార్కెట్లో మంచి ఆదరణ కనబడుతోంది. వాంకె శ్రీనివాస్ -
‘బంగారు తెలంగాణే’ లక్ష్యం
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మినీ ఆడిటోరియం ప్రారంభం పూర్వ విద్యార్థుల సేవలు స్ఫూర్తిదాయకం చిట్యాల : బంగారు తెలంగాణ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని చల్లగరిగెలో 1984-85 పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.3 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ ఆడిటోరియంను స్పీకర్ శనివారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో స్పీకర్‌తోపాటు ప్రముఖ సినీ గేయ రచయిత, పూర్వ విద్యార్థి చంద్రబోస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్ఎం మెండు ఉమామహేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ సిరికొండ మాట్లాడారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సినీ పరిశ్రమను తన పాటలతో ఊర్రూతలూగిస్తున్న చంద్రబోస్ తన స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి స్నేహితులతో కలిసి కృషి చేయడం హర్షదాయకమన్నారు. అలాగే పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని, వాచ్‌మెన్‌ను నియమిస్తామని హామీ ఇచ్చారు. సాగర్ జలాలతో నియోజకవర్గంలో పంటలను సస్యశ్యామలం చేస్తామన్నారు. దోపిడీ, అవినీతి లేకుండా తెలంగాణ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. జన్మభూమి రుణం తీర్చుకుంటా..: చంద్రబోస్ జన్మనిచ్చిన ఊరు కన్నతల్లితో సమానమని, అలాంటి గ్రామానికి సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. నా ఊరి కోసం.. నా ఊపిరి ఉన్నంత వరకు సేవ చేస్తూ రుణం తీర్చుకుంటానని అన్నారు. స్నేహితులు పాఠశాల అభివృద్ధి కోసం అన్ని విధాల సహకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 750 సినిమాల్లో 2,900 పాటలు రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాఠశాలలో గేట్, తాగునీటి నల్లాల సౌకర్యం కల్పించానని, మినీ ఆడిటోరియంకు రూ.1.30లక్షలు విరాళంగా ఇవ్వగా.. మిత్రులు రూ.1.70లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన తెలిపారు. అనంతరం తాను రాసిన ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది.. ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది..’, ‘కనిపెంచిన అమ్మకు అమ్మనయ్యానుగా.. నడిపించిన నాన్నకు నాన్నయ్యానుగా..’ అనే పాటలు పాడి విద్యార్థులను, ప్రజలను ఊర్రూతలూగించారు. అనంతరం పూర్వ విద్యార్థులను స్పీకర్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ బందెల స్నేహలత, ఎంపీటీసీ సభ్యురాలు బాలగోని శోభ, పీఏసీఎస్ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ బండిరాజు, టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు సిరికొం డ ప్రశాంత్, సదావిజయ్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, కుంభం రవీందర్‌రెడ్డి, ఆరేపల్లి మల్లయ్య, ఉప సర్పంచ్ అశోక్, పూర్వ విద్యార్థులు అప్పాల వెంకటరమణ, జగదీశ్వర్, రాజిరెడ్డి, లలిత, హైమావతి, విజయ్‌నాయక్, రమేష్, చంద్రమౌళి, మోహన్‌రెడ్డి, సమ్మయ్య ఉపాధ్యాయులు కొమురయ్య, రాము, నర్సయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేపు జిల్లాకు చెంచుల రాక భీమారం : భూపాలపల్లి నియోజకవర్గం రే గొండ మండలంలోని చెంచుకాలనీ వాసుల్లో ఒక్కరు మాత్రమే వరంగల్ నగరాన్ని చూశా రు... నగరానికి కేవలం 45 కిలోమీటర్ల దూ రమే ఉన్నా, వందేళ్లలో ఎవరూ ఇక్కడికి రాలే దు... వారికి పట్టణమంటే ఏంటో కూడా తెలి యదు... ఆ కాలనీని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. భీమారంలోని శ్రీసా యి జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథి గా ప్రసంగించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిపర్యటనలో చెంచుకాలనీకి వస్తానని హామీ ఇచ్చానని, ఈమేరకు అక్క డికి వెళ్లినట్లు స్పీకర్ తెలిపారు. తన తొలి వేతనం కూడా ఈ కాలనీకే అందించిన ట్లు చెప్పారు. వందేళ్లుగా నగరం ఎరుగని చెంచుకాలనీ వాసులకు వరంగల్ నగరాన్ని చూపిం చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ గ్రామస్తులను ఆరు బస్సుల ద్వారా నగరానికి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు చెంచుకాలనీ నుంచి బస్సులు బయలుదేరుతాయని, తొలుత ఖిలావరంగల్‌లోని కాకతీయుల కోటను సందర్శిస్తారన్నారు. రెండు గంటలపాటు కోట అందాల ను తిలకించిన అనంతరం అక్కడే మధ్యా హ్న భోజనం చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి, రాజరాజేశ్వరి ఆలయాలను సందర్శిస్తామని, ఇక్కడ మరో రెండు గంటలపాటు గడిపిన తర్వాత సాయంత్రం కలెక్టర్ కిషన్ ఇంటిలో తేనీటి విందుకు గ్రామస్తులతో సహా హాజరుకానున్నట్లు వెల్లడించారు. అనంతరం రామకృష్ణ టాకీస్‌లో శ్రీరామరాజ్యం సినిమా చూసిన తర్వాత తిరిగి గ్రామస్తులతో సహా చెంచుకాలనీకి బయలుదేరనున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి వివరించారు. -
నిరంతర అధ్యయనంతో ఉన్నత శిఖరాలకు..
సినీగేయ రచయిత చంద్రబోస్ ఏబీవీ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే జనగామ : నిరంతర అధ్యయనమే విద్యార్థులను సమున్నత శిఖరాలకు చేర్చుతుందని సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు. పట్టణంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.కృష్ణయ్య అధ్యక్షతన గురువా రం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్తదనం, నిరంతర ప్రయత్నం, సత్ప్రవర్తనలే విజ యానికి సోపానాలన్నారు. బాధ్యతతో ఉంటూ తల్లిదండ్రులకు, దేశానికి మం చిపేరు తేవాలని విద్యార్థులకు సూచిం చారు. ఏకాగ్రత.. కొత్తదనంతో రాసిన గీతాలు తన గీతను మార్చాయన్నారు. ‘ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..’, ‘తగిలే రాళ్లను పునాదిచేసి ఎదగాలని..’ పాటలు తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయన్నారు. ఇప్పటి వరకు 750కిపైగా పాటలు రాసినట్టు చెప్పారు. గురువుల సూచనలతో ఎదగాలి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన తేజా ఆర్ట్స్ ఫౌండర్ పోరెడ్డి రంగయ్య మాట్లాడుతూ గురువుల సూచనలను పాటించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. మరో అతిథి శ్రీభాష్యం శేషాద్రి మాట్లాడుతూ లక్ష్యం.. కోరిక.. ఈరెండింటినీ ఒకటిలా మార్చుకుని కృషిచేస్తే విజేతలుగా నిలవొచ్చన్నారు. విజ్ఞాన్ సొసైటీ అధ్యక్షుడు తాడూరి సంజీవరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు. విజయాలకు పొంగిపోకుండా మంచి వక్తలతో విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెషర్స్‌డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రబోస్‌ను కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నాగబండి నరసింహారావు, కేవీ రమణాచారి, రామకృష్ణ, తాతాచార్యులు, నర్సింగరావు, ప్రదీప్ పాల్గొన్నారు. -
మహిళలు నిలదొక్కుకోవడం తేలికైన విషయం కాదు
‘‘పురుషాధిక్యతతో కూడిన సినీ పరిశ్రమలో దర్శకురాలిగా సక్సెస్ సాధించడం ఎలా ఉందని చాలామంది అడుగుతుంటారు. కానీ, నాకిది పెద్ద గొప్పగా కూడా అనిపించదు. అందరు దర్శకులు ఎలా ఫీలవుతారో నేనూ అలాగే ఫీలవుతాను. అయితే పరిశ్రమలో స్త్రీలకు సరైన గౌరవం లభిస్తుందా? అనడిగితే కచ్చితంగా లేదనే చెబుతాను. ఇక్కడ సంఖ్యాపరంగా స్త్రీలు తక్కువ ఉండటం కూడా ఇందుకు ఓ కారణం. సినిమా పరిశ్రమలో స్త్రీలు నిలదొక్కుకోవడం కూడా అంత తేలికైన విషయం కాదు. ఒక పురుషుడు ఇక్కడ నిలదొక్కుకోవడానికి పడే కష్టానికి రెట్టింపు కష్టాన్ని అనుభవిస్తే కానీ స్త్రీలు ఇక్కడ నిలదొక్కుకోలేరు. ఇది నిజంగా బాధాకరమైన విషయమే’’. ఆమె రుణం వేయి జన్మలైనా తీర్చుకోలేను! నన్ను ప్రభావితం చేసిన ముగ్గురు స్త్రీ మూర్తులు... అమ్మ, భార్య, కుమార్తె. కష్టపడి పనిచేయడం అమ్మ నేర్పింది... కష్టఫలితాన్ని పదిమందితో పంచుకోవడం భార్య నేర్పింది... కష్టాన్ని మరిచిపోయి నవ్వులతో, కేరింతలతో, సందడిగా జీవితాన్ని మలుచుకోవాలని కూతురు నేర్పింది. ఇది మంచి.. ఇది చెడు అని కౌన్సిలింగ్ పెట్టకుండా... కేవలం ఆచరణతోనే... నాలో కొండంత స్ఫూర్తిని నింపిన నా తల్లి రుణం వేయి జన్మలైనా తీర్చుకోలేను. నాలో సోమరితనాన్ని పారద్రోలింది అక్కే! అమ్మ... భార్య... అక్క. ఈ ముగ్గురూ లేకపోతే నేను లేను. నా జీవితంలో అమ్మ పాత్ర చాలా కీలకం. సంస్కారం అనేది అమ్మ నుంచే నేర్చుకున్నాను. సమాజంలో ఎలా మసలాలి? ఎదుటివారితో ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా కష్టపడాలి? ఎదిగే కొద్దీ ఏ విధంగా ఒదిగి ఉండాలి? ఇవన్నీ నాకు అమ్మే నేర్పింది. ఇప్పటికీ నేను వేసే ప్రతి అడుగులోనూ అమ్మ ప్రభావం ఉందంటే అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఈ రోజు ఇలా విసుగు, విరామం, అలసట లేకుండా రోజుకి 18 గంటలు పనిచేస్తున్నానంటే కారణం మా అక్కయ్యే. తెల్లవారుజామున అయిదింటికే నిద్ర లేపేసేది. నేను ఆర్టిస్టుగా బిజీ అయ్యాక కూడా అక్క ఆ బాధ్యతను మరిచిపోలేదు. చివరకు అది నాకు అలవాటుగా మారింది. ఆ విధంగా నాలోని సోమరితనాన్ని పారద్రోలింది అక్కయ్య. ఇక నా భార్య విషయానికొస్తే... తనను పెళ్లి చేసుకున్నప్పట్నుంచీ నా లైఫే మారిపోయింది. పెళ్లి నాటికే నేను ఆర్టిస్ట్‌గా బిజీ. అయినా... ఆమె నా జీవితంలోకొచ్చాక ఎక్కడలేని పేరు ప్రఖ్యాతులు నా సొంతం అయ్యాయి. నన్ను, నా పిల్లల్ని తాను ప్రేమించే తీరు చూశాకే... ఎదుటివారిని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాను. నాయనమ్మ ప్రభావం నాపై చాలా ఉంది నా జీవితాన్ని ప్రభావితం చేసిన తొలి స్త్రీమూర్తి అమ్మ. చిన్నప్పట్నుంచీ అమ్మ ఎన్నో కష్టాలు చూసింది. కానీ నాకు మాత్రం ఎలాంటి కష్టాన్నీ కలగనీవ్వలేదు. రెండేళ్ల క్రితం నాన్న దూరం అయ్యారు. ఇప్పుడు నాకు అమ్మ, నాన్న.. రెండూ అమ్మే. పని వత్తిడి వల్ల నేను అమ్మకు దూరంగా ఉన్నా... ఆమె దీవెనలు నా వెన్నంటే ఉంటాయి. నా సక్సెస్‌కి కారణం అదే అని నేను నమ్ముతాను. అమ్మ తర్వాత నన్ను ప్రభావితం చేసిన స్త్రీ అంటే... మా నాయనమ్మ. ఆమెకు 90 ఏళ్లు. పేరు కమలమ్మ. నన్ను ఎంతో ముద్దుగా చూసుకునేది. దైనందిన జీవితంలో ఆమె ప్రభావం నాపై చాలా ఉంది. ఇక మూడో స్త్రీ మూర్తి మదర్ థెరీస్సా. సేవాభావం అంటే ఏంటో ఆమెను చూసే నేర్చుకున్నాను. ఎదుటివారికి కొంతైనా ఉపయోగపడాలని ఆమె జీవితం చూసే నేర్చుకున్నాను. -
పాస్టర్ హత్య గర్హనీయం
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ : వికారాబాద్‌లోని చర్చి పాస్టర్‌పై దాడి చేసి హత్య చేయడాన్ని బిషప్ గాలిబాలి తీవ్రంగా ఖండించారు. స్థానిక రింగ్‌రోడ్డులోని బిషప్ హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాలిబాలి మాట్లాడుతూ వికారాబాద్‌లోని ఇవాంజిలికల్ పాస్టర్ సంజీవులుపై ఈనెల 11న నలుగురు వ్యక్తులు దాడి చేశారని, అనంతరం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పాస్టర్ సోమవారం మరణించారని చెప్పారు. క్రైస్తవ సంఘాలన్నీ ఈ దుర్ఘటనను ఖండిస్తున్నాయన్నారు. పాస్టర్లకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు దాటినా ఇప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆరోపించారు. పాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ ఉపాధ్యక్షులు రెవరెండ్ చంద్రబోస్ మాట్లాడుతూ క్రైస్తవ సంఘాల నాయకులు ఈ సంఘటనపై ముఖ్యమంత్రిని కలిసి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. సెక్యులర్ భావాలు ఉన్న అందరూ ఇటువంటి ఘటనలను ఖండించాలన్నారు. సమావేశంలో రెవరెండ్ ఫాదర్ రాయప్ప, రెవరెండ్ ఉదయ్‌కుమార్, రెవరెండ్ రాజేష్, రెవరెండ్ జ్ఞానరత్నం, బిషప్ పీఆర్వో కనపాల జోసఫ్ పాల్గొన్నారు. -
నటుల ఆత్మహత్యలకు వెబ్సైట్లే కారణం: చంద్రబోస్
గుత్తి, న్యూస్‌లైన్: సినీ నటుల ఆత్మహత్యలకు కొన్ని వెబ్సైట్లు కారణమవుతున్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆధారాలు లేకుండానే నటులపై గాసిప్స్ ప్రచారం చేస్తున్నాయని, చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపుతూ వేదనకు గురిచేస్తున్నాయన్నారు. -
గీత స్మరణం
పల్లవి : ఒకే కావ్యం... ఒకే శిల్పం... ఒకే చిత్రం... అదే ప్రణయం మన తనువు మారును తరము మారును స్వరము మార్చదు ప్రేమ ప్రేమ మరణం... ప్రేమ మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి ॥మరణం॥॥కావ్యం॥ చరణం : 1 తనువులేకం కాకముందు మనసులౌను ఏకమే తనువు తనువుకి ప్రాణ ద్వారం ప్రేమే ఎదలు రె ండు దూరమైన పెదవులౌను చేరువే పెదవి ద్వారా ఎదను చేరెను ప్రేమే ముళ్లలాంటి కళ్లతోటి అంతుచూస్తుంది పువ్వులాంటి నవ్వుతోటి ఆయువిస్తుంది ॥మరణం॥ చరణం : 2 ప్రేమ పాట పాతది... పూట పూట కొత్తది గాలిలేని చోటైన మోగేనిది ప్రేమ అంటే విషములే... విషములోన విశేషమే ఇదే జన్మలో మరో జన్మకు మార్గమే బీడుభూమిలో మెట్టభూమిలో మొగ్గ ప్రేమేలే మండుటెండలో ఎండమావిలో నీడ ప్రేమేలే భళా చాంగు భళా చాంగు... భళా చాంగు భళా నా ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ నిను స్మరిస్తేనే నాలో స్వర్ణకళ తరంగంలా... తరంగంలా... రావే రావే... రావే రావే... విహంగంలా... విహంగంలా... చిత్రం : వర్ణ (2013) రచన : చంద్రబోస్ సంగీతం : హారీస్ జైరాజ్, గానం : ఎస్.పి.బాలు, బృందం నిర్వహణ: నాగేశ్