సమాజాన్ని మేలుకొలిపే పాట
‘‘మనిషి నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు... మనిషి కష్టాల్లో, దుఃఖాల్లో ఉన్నప్పుడు... మనిషికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు.. ఎదురీదాలనుకున్నప్పుడు.. ఎదురు తిరగాలనుకున్నప్పుడు.. పవన్ కల్యాణ్ ‘గుడుంబా శంకర్’లో ‘లే.. లే.. లేలే..’ పాట వినాలి. ఈ పాట వింటే... చచ్చిపోవాలనుకునేవాడికి బ్రతకాలనే ఆశ కలుగుతుంది. భయపడేవాడికి ధైర్యం వస్తుంది. పారిపోయేవాడికి నిలబడి రొమ్ము చూపించాలని అనిపిస్తుంది. జీవచ్ఛవంగా ఉన్న మనిషిని లేపగలిగే శక్తి సామర్ధ్యం ఈ సాహిత్యంలో ఉంది. మనిషిని మేలుకొలిపే పాట ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘లే.. లే.. లేలే..’ పాటతత్వం గురించి భీమ్స్ మాటల్లో...
ఈ పాటను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. 2004లో విడుదలైందీ సినిమా. అప్పటికి నేనింకా సంగీత దర్శకుడు కాలేదు. సహాయకుడిగా పనిచేసేవాణ్ణి. అసలు సంగీత దర్శకుడు అవుతామా? లేదా? ఎవరైనా అవకాశం ఇస్తారా? లేదా? ఒకవేళ అవకాశం వస్తే, ఈరోజు వస్తుందా? రేపు వస్తుందా? తెలియకుండానే ఒక మానసిక సంఘర్షణ జరుగుతున్న ప్రతిసారీ చంద్రబోస్ గారు రాసిన ఈ పాట నాలో ఎంతో స్ఫూర్తి నింపేవి.
లే.. లే.. లేలే.. ఇవ్వాళ్ళే లేలే/ లే.. లే.. లేలే.. ఈరోజల్లే లేలే
ఈ పల్లవి వింటుంటూనే నాలో ఓ ఉత్సాహం వస్తుంది. మనం చేయాలనుకున్న పనిని ఈరోజు, ఈ క్షణమే చేసేయాలి. వాయిదా వేయడమంటే మనకు వచ్చే అవకాశాలను వృథా చేసుకోవడమే. చిరుతతో పోటీపడే వేగంగానైనా, చిరుగాలిలా అయినా మనం చేయబోయే పనిని ప్రారంభించాలి. అప్పుడే ఆకలి, బాధలు తీరుతాయి. ఎవరైనా ఏదైన సందర్భంలో నీ ఆలోచనలను, శక్తి సామర్థ్యాలను, నిజాయితీని తక్కువ అంచనా వేసినప్పుడు నీ ప్రతిభ ఏంటనేది చూపించాలి. జీవితంలో నిజాయితీగా ఉండడమనేది చాలా ముఖ్యం. కానీ, నీ నిజాయితీ ఎదుటివ్యక్తికి బలహీనత అవ్వకూడదు. ఎప్పుడైతే.. ఎదుటివ్యక్తి నీ నిజాయితీని అలుసుగా తీసుకున్నాడో, శక్తిని తక్కువ అంచనా వేశాడో.. ఎదురీదాలి, ఎదురు తిరగాలి.
నీరల్లే పారాలి.. అందరి దాహం తీర్చాలి.. అణిచేస్తే ముంచేయాలి లే నేలల్లే ఉండాలి.. అందరి భారం మోయాలి.. విసిగిస్తే భూకంపాలే చూపాలే ఈ చరణంలో ప్రజలు ఎలా ఉండాలో వివరించారు. నీరు చేరని చోటు ఉండదు. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. ప్రయత్నిస్తే.. మనమూ చేరుకోలేని చోటు ఉండదు. ఈ ప్రయత్నంలో ఎవరైనా అణిచివేయాలని ప్రయత్నిస్తే.. చేతులు కట్టుకుని కూర్చోకూడదు. చెడు వుంది.. మంచి వుంది.. అర్థం వేరే వుంది..చెడ్డోళ్లకి చెడు చేయ్యడమే మంచి/చేదుంది.. తీపి వుంది.. భేదం వేరే వుంది.. చేదన్నది ఉన్నపుడేగా తీపి
ఈ లోకంలో మంచి చెడులున్నాయి. నువ్వు స్వీకరించే దానిబట్టి నీ ప్రయాణం ఉంటుంది. ఒక మనిషిలో రెండు పార్శ్వాలుంటాయి. చెడు ఉన్నప్పుడేగా అసలు మంచి ఏదో మనకు అర్థమయ్యేది, స్వీకరించేది. ఉదాహరణకు... సమస్య ఉన్నప్పుడేగా పరిష్కారం ఏంటో వెతికేది. పరిష్కారం ఎలా ఉండాలో ఆలోచించేది. మనం మంచిని చూసుకుంటూ చెడుని సవరించుకుంటూ ముందుకు వెళ్లాలి. మనం ప్రయాణించే దారుల్లో కుడి, ఎడమలు సహజమే. ఏది ఎటువైపు వెళ్లినా గమ్యం మాత్రం ఒక్కటే. పని పట్ల మనకు శ్రద్ధ ఉండాలి, కష్టపడాలి. అప్పుడు.. కుడి ఎడమయ్యే గొడవుంది. అంటే దాని అర్థం.. ఎడమ కూడా కుడి అవుతుందని, కష్టపడిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారని. మన కష్టమే గమ్యం వైపు తీసుకువెళ్తుంది. ఇక, చివరి వాక్యంలో ఎంతో అర్థముంది. మరణించిన తర్వాత కూడా మనం జీవించేలా ఊపిరి ఉన్నప్పుడు బతకాలి. బాల కార్మికులు, ఈవ్ టీజింగ్, రాజకీయ పరిస్థితులను వివరిస్తూ చిత్రంలో ఈ పాట సాగుతుంది. కానీ, అంతర్గతంగా చాలా సందేశం ఉంది.
సేకరణ: సత్య పులగం
చంద్రబోస్ గీత రచయిత