డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేత వర్మ సంచలన ట్వీట్‌ | TDP Leader Verma Sensational Tweet On Deputy CM Pawan Kalyan, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

కష్టం నాది.. పదవి ఆయనది!

Published Fri, Feb 21 2025 7:41 AM | Last Updated on Fri, Feb 21 2025 12:54 PM

TDP leader Verma sensational tweet on Deputy CM Pawan Kalyan

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేత వర్మ సంచలన ట్వీట్‌

కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ ఎక్స్‌లో వీడియో

దుమారం రేగడంతో తనకు సంబంధం లేదని వివరణ

పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ సంచలన ట్వీట్‌ చేశారు. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్‌ హ్యాండిల్‌లో విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్‌ కల్యాణ్‌ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది. 

పవన్‌ గెలుపులో తన పాత్రే కీలకం అనే అర్థం వచ్చేలా తయారు చేయించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కేవలం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారాన్ని మాత్రమే పోస్టు చేయడంతో పాటు, పవన్‌ కష్టపడి విజయం సాధించలేదని, తన కష్టంతో ఆయన పదవి సాధించారనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టింగ్‌ జనసేన శ్రేణుల్లో మంట పుట్టించింది. ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ–జనసేన మధ్య ఆధిపత్య పోరు రగులుతుండగా, ఈ పోస్టు మరింత అగ్గి రాజేసిందంటున్నారు. 

ఇదిలా ఉండగా తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్‌ ప్లానెట్‌ సంస్థ నిర్వహిస్తోందని, గురువారం తన ఎక్స్‌ అకౌంట్‌లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్‌లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్‌ ప్లానెట్‌ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్‌ చేయించానని, తన పర్మిషన్‌ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement