
బాలీవుడ్ కథానాయకుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దీనిని తెరకెక్కించారు. ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అంటూ చాలామంది సోషల్‌మీడియా వేదికగా డిమాండ్ కూడా చేస్తున్నారు.
దేశం కోసం శౌర్యం చూపిన గొప్ప వ్యక్తుల గురించి అందరికీ తెలిసేలా ఇలాంటి చిత్రాలను అన్నీ భాషలలో విడుదల చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీని తెలుగు హీరోలు తెరకెక్కించాలని అభిమానులు కోరుతున్న సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఛత్రపతి శివాజీగా మహేష్ బాబు అయితే చాలా బాగా సరిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.

సూపర్ స్టార్ కృష్ణకు తన జీవితంలో డ్రీం ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ. భారీ బడ్జెట్‌తో ఈ మరాఠ యోథుడి చరిత్రను తెలుగు ప్రేక్షకులకు ఆయన చూపించాలని ఆశ పడ్డారు. సింహాసనం సినిమా తర్వాత శివాజీ సినిమా గురించి ప్లాన్ చేశారు. కానీ, పలు కారణాల వల్ల ముందుకు సాగలేదు. ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ వంటి లెజండరీ హీరోనే శివాజీ పాత్ర చేయలేకపోయారు. కానీ, కృష్ణ పూర్తిస్థాయిలో ఛత్రపతి శివాజీగా కనిపించకపోయినప్పటికీ చంద్రహాస్,నంబర్-1 అనే సినిమాల్లో చిన్న వేషం వేసి కృష్ణ తన కోరిక నెరవేర్చుకున్నారు.
అయితే, ఇప్పుడు దానిని భర్తి చేసే ఏకైక నటుడు మహేష్‌బాబు అని పరుచూరి గోపాలకృష్ణ ఇలా అన్నారు. 'సూపర్‌స్టార్ కృష్ణ నటించలేని ఒక పాత్ర ఇప్పటికీ అలాగే ఒకటి మిగిలిపోయింది. అదీ ఛత్రపతి శివాజీ. నేను మహేష్ బాబును కోరుతున్నాను. మీరు( అభిమానులు) కూడా కోరండి. శివాజీ గెటప్‌కు వారి తండ్రి కృష్ణ మాదిరి ఆయన అద్భుతంగా సెట్ అవుతారు. శివాజీ పాత్ర మహేష్ చేస్తే భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది. ఛత్రపతి శివాజీగా మహేష్ కనిపించాలని నేను ఆయన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ పాత్రలో ఆయన్ను చూడాలనే కోరిక నాకు ఉంది. ' అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment