ఎనిమిదేళ్లు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా? | Sakshi interview with sugali preethi mother | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్లు గడిచినా నా బిడ్డకు న్యాయం చేయరా?

Published Sat, Feb 22 2025 4:54 AM | Last Updated on Sat, Feb 22 2025 8:44 AM

Sakshi interview with sugali preethi mother

గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా? 

టీడీపీ కూటమి సర్కారు తీరుపై సుగాలి ప్రీతి తల్లి ఆవేదన

కేసును నీరుగార్చేందుకు చంపడం మినహా అనేక చిత్రహింసలు పెడుతున్నారు 

డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం శూన్యం 

ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది జగనే 

ఆయనే మమ్మల్ని ఆదుకున్నారు.. ఇంటిస్థలం, పొలం, ఉద్యోగం ఇచ్చారు

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై నిందితులు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హతమార్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఈ కూటమి ప్రభు­త్వం ముంబై నటి జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో చూపిస్తే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది. మమ్మల్ని చంపేయడం మిన­హా.. కేసును నీరుగార్చేందుకు ఎన్ని రకాలుగా ప్రలో­భపెట్టాలో, హింసించారో అన్ని రకాలుగా చేశారు. ‘న్యాయం’ చేయమని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, హోంమంత్రి అనితను అర్థించినా ఫలితం లేదు. 

ఈ కేసును సీబీఐతో విచారించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలి’ అని బాధితురాలు సుగాలి ప్రీతి తల్లి పార్వ­తీదేవి డిమాండ్‌ చేశారు. సుగాలి ప్రీతి కేసును విచారణకు స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తూ సీబీఐ తరఫు న్యాయవాదులు ఈ నెల 12న హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించిన నేపథ్యంలో పార్వతీదేవి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుమార్తె హత్యోదంతం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే..  

వ్యవస్థలు నిర్వీర్యం.. 
2017లో చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. నా బిడ్డ 14 ఏళ్ల ప్రీతిపై లైంగిక దాడికి పాల్పడి హాస్టల్‌లో చంపేశారు. ఆర్థికంగా అత్యంత బలవంతులైన నేరస్తులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయి. పోక్సో కేసులో 90 రోజులు బెయి­ల్‌ రాకూడదు. కానీ 8 రోజుల్లోనే  బెయిల్‌ వచ్చిందంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయ్యాయో, వారు ఎంత బలవంతులో అర్థమవుతోంది. 

ఈ కేసు­ను నిర్వీర్యం చేయడం వెనుక పోలీసుల నుంచి ఐఏ­ఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. 2017లో అప్పటి ప్రభుత్వం మాకు న్యా­య­ం చేయలేదు. హక్కుగా రావల్సిన రూ.­8,12,­500 మాత్రమే ఇచ్చారు. మాకు న్యాయం చేయాలని, ఏ గిరిజన బాలికకూ ఇలా అన్యాయం జరగకూడదని అప్పటి నుంచి నుంచి మేం పోరాడుతున్నాం. 

సీబీఐతో ఎందుకు విచారించలేదు? 
చంద్రబాబు హయాంలో 2017 నుంచి 2019 వరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అప్పటి విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పాదయాత్రలో కలిసి కేసు గురించి  వివరించడంతో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 2019లో హైకోర్టులో కేసు వేశాం. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక 2020లో కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను కలసి సీబీఐతో విచారణ చేయించాలని కోరడంతో సానుకూలంగా స్పందించారు. జగన్‌ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. 

2021లో కర్నూలు సిటీలో ఐదు సెంట్ల స్థలం, 5 ఎకరాల పొలంతో పాటు నా భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సీబీఐ స్పందించకపోవడంతో ఢిల్లీ వెళ్లి అధికారులను కలిశాం. ఆ తర్వాత జీవోను అమలు చేయాలని హై­కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాం. 

కేసును ఎందుకు విచా­ర­ణకు తీసుకోలేదని సీబీఐపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. దీంతో ఈ కేసును స్వీకరించేందుకు తగిన వనరులు లేవని, అయినా ఇది సీబీఐ పరిశోధించేంత సున్నితమైనది కాదని, స్థానిక పోలీసులే తేల్చవచ్చు’ అని ఈ నెల 12న హైకోర్టుకు వారి న్యాయవాది చెప్పారు. దీనిపై మేం కౌంటర్‌ దాఖలు చేస్తాం.

డిప్యూటీ సీఎం, హోంమంత్రిని కలిసినా..
పవన్‌ కళ్యాణ్‌ గతంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించినప్పుడు మమ్మల్ని పరామర్శించి న్యాయం చేస్తామన్నారు. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత 2024 జూలై 27న మరోసారి కలిశాం. ఆయన సూచన మేరకు హోంమంత్రి వద్దకు వెళ్లగా సీబీఐతో కాకుండా సీఐడీతో విచారణ చేయిస్తామన్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కూడా ఉన్నందున విచారణ అధికారులుగా సీనియర్లను నియమించాలని కోరాం. 

అనంతరం కేసును విచారణకు స్వీకరిస్తామంటూ కర్నూలు సీఐడీ ఆఫీసు నుంచి మాకు నోటీసు వచ్చింది. అయితే ఇందులో ‘పెద్దల ప్రమేయాన్ని’ మీరు తేల్చలేరని, ఐపీఎస్‌లను మీరెలా విచారిస్తారని, ఉన్నతాధికారులైతేనే మేం విచారణకు సిద్ధమని చెప్పాం. డీఎస్పీ స్థాయిలో అయితే సీఐడీ విచారణ వద్దు అని లిఖిత పూర్వకంగా తెలియచేశాం.

జత్వానీ, ప్రీతి కేసుల్లో ఏది తీవ్రమైంది?
ముంబై నటి జత్వానీని వేధించారని ఈ ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టారు. ఆవిడ ప్రాణాలతోనే ఉంది. కానీ సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలిక. ఘోరంగా అత్యాచారం చేసి చంపారు. నా బిడ్డ ప్రాణాలతో లేదు. జత్వానీ కేసులో ఈ ప్రభుత్వం ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేసి అత్యంత ప్రాధాన్యత కేసుగా విచారిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన ఓ గిరిజన బాలిక కేసును ఇంతే సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదు? ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. 

బాధితురాలిపై అత్యాచారం జరిగిందని, ‘వై’ క్రోమోజోమ్‌ గుర్తించామని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు కూడా నిర్ధారించాయి. కానీ ఇలాంటి కేసును సీబీఐతో విచారణ చేయించడం లేదు. కూటమి ప్రభుత్వం జత్వానీ కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో పెట్టి ఉంటే మాకు ఎప్పుడో న్యాయం జరిగేది’ అని పార్వతీ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడం, న్యాయం చేయడం రెండు వేర్వేరు అంశాలని, ఈ కేసులో న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement