
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలతో పాటు చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల విజయవాడ పర్యటనలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy)పై ఐటీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిన్నారిపై ఐటీడీపీ చేస్తున్న విష ప్రచారంపై విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు.
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థిని దేవికారెడ్డిపై ఐటీడీపీ నేతలు సైకోల్లా వ్యవహరిస్తున్నారు.దేవికను మానసికంగా వేధిస్తున్నారు. అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. చిన్న పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు పవన్ మాటలు ఏమయ్యాయి.
దేవికపై తప్పుడు ప్రచారం చేసిన ఐటీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి. గతంలో వైఎస్ జగన్‌వల్లే తనకు ఇల్లు వచ్చిందన్న గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియాలో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇప్పుడు విద్యార్థినిపై అదే తరహాలో సైకోల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
