
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలలో కాక పుట్టిస్తోంది. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 14 రాజకీయ పార్టీల నేతల సమావేశం ప్రస్తుత జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గట్టిగానే చెప్పగలిగింది. ఈ సమావేశానికి హాజరు కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కూడా తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ కాపీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు పంపించారు.
తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ అంశం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగదని, ఇంకా చర్చ జరగలేదని చెబుతుంటే మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం చెన్నై సమావేశాన్ని దొంగల భేటీగా పోల్చి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సంజయ్ ఇప్పటికీ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై మాట్లాడడానికి నోరు పెగులుతున్నట్లు లేదు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పునర్విభజన వల్ల నష్టం జరుగుతుందని అనుకోవడం లేదని చెబుతున్నారు. వీరిద్దరు బీజేపీతో కూటమి కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
గతంలో చంద్రబాబు నాయుడు తను కూటమిలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోబోనని కనీసం కబుర్లయినా చెప్పేవారు. ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయలేకపోవడం గమనార్హం. పాతికేళ్లపాటు పునర్విభజన వద్దని చెన్నై భేటీలో పాల్గొన్న నేతలు కోరారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వచ్చే సమస్యకు జగన్ తన లేఖ ద్వారా పరిష్కార మార్గాలు వివరించారు. పాతికేళ్ల నిషేధమన్న డిమాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పాతికేళ్లలో ఉత్తరాది జనాభా మరింత పెరగదని ఈ నేతలు గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇప్పుడే పునర్విభజన వ్యవహారానికి ఒక పద్దతైన పరిష్కార మార్గం ఆలోచించాలని చెప్పక తప్పదు.
వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నట్లు ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న వాటాను యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయి. ఇదే ఉద్దేశం చెన్నై భేటీలో పాల్గొన్న నేతలందరికీ ఉన్నప్పటికీ, వారి తక్షణ డిమాండ్ మాత్రం పునర్విభజన వద్దన్నది కావడం గమనార్హం. అయితే, పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా నియోజకవర్గాలు పెరగకపోతే ఎన్నికైన ఎంపీలకు అవి అలవికానివిగా మారతాయి. ఉదాహరణకు ఇప్పుడు 17 లక్షల నుంచి 19 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే, అది పాతిక లక్షలకు ఒక నియోజకవర్గంగా మారవచ్చు. అదే సమయంలో ఏ రాష్ట్రానికి దీనివల్ల నష్టం జరగకూడదన్నది అంతా ఒప్పుకోవాలి.
ఈ సమస్యకు ప్రధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ సరిగా లేకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా జనాభా పెరుగుదలను నియంత్రించడం. దీనివల్ల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను నిర్ణయిస్తే ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మొదలైన రాష్ట్రాలలో కొత్త నియోజకవర్గాలు భారీ ఎత్తున వస్తాయి. దక్షిణాదిలో మాత్రం ఆ స్థాయిలో పెరగవు సరికదా కేరళ వంటి చోట్ల నియోజకవర్గాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 48 సీట్లు పెరిగితే ఆ రాష్ట్రం ఎంపీలు చెప్పినట్టుగా వినాల్సిన పరిస్థితి కేంద్రానికి వస్తుంది. యూపీతోపాటు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొద్ది రాష్ట్రాలే దేశాన్ని శాసించే పరిస్థితి రావచ్చు. ఈ పరిణామం ఒకరకంగా నియంతృత్వ ధోరణికి దారి తీయవచ్చన్నది దక్షిణాది రాష్ట్రాల నేతల భయం.
జనాభా ప్రాతిపదికన పునర్విభజన రాజకీయ నేతలకే కాదు.. దక్షిణాది ప్రజలకు కూడా నష్టం కలిగించే అంశమే. నిధుల పంపిణీ వంటి వాటిలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంటే, ఉత్తరాదికి అధిక వాటా వెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, యూపీ నుంచి కేంద్రానికి అందే రూపాయి పన్ను అందితే, తిరిగి ఆ రాష్ట్రానికి 2.73 రూపాయలు వెళుతున్నాయని తెలిపారు. బీహార్‌కు రూపాయికి ఆరు రూపాయలకు పైగా నిధులు వెళుతుంటే తమిళనాడుకు 29పైసలు, కర్ణాటకకు 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 66 పైసల వాటా మాత్రమే నిధులు వస్తున్నాయని వివరించారు. ఈ వివక్షతో పాటు ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గితే ఉత్తరాది, దక్షిణాది అంతరం బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. దేశ సమగ్రత భావానికి ఇది విఘాతం కలిగిస్తుంది. అనవసరమైన అపోహలకు దారి తీస్తుంది.

కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఉత్తరాదిన నియోజకవర్గాలు పెరిగితే బీజేపీ లబ్ది పొందుతుందని, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెన్నై సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ది పథంలో వెళుతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధంగా కేంద్ర నిర్ణయాలు ఉండరాదని అన్నారు. బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులను ఉత్తరాదికే పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్ అధినేత జగన్ మాత్రం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా చెప్పిన విధంగా దామాషా పద్దతిలో లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ణయించాలని, తదానుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయాలని ప్రతిపాదించారు. చెన్నై భేటీలో తమిళనాడు, కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కూడా హాజరు కావడం విశేషం. పంజాబ్‌లోని పరిస్థితులు, ఐఎన్‌డీఏతో ఉన్న సంబంధాల రీత్యా హాజరై ఉండవచ్చు. నవీన్ పట్నాయక్ వర్చువల్‌గా పాల్గొని తన అభిప్రాయాలు తెలియచేశారు. తదుపరి భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రకటించారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భేటీకి ప్రధాన ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ ఎంతవరకు హాజరు అవుతుందన్నది సందేహమే. ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి పక్షాలు పాల్గొన్న సమావేశానికి బీఆర్‌ఎస్ వెళ్లడంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటేనని విమర్శలు చేస్తుంది. ఒడిషా నుంచి బీజేడీ నేతలు హైదరాబాద్ వస్తారా? రారా? అన్నది చెప్పలేం. ఎటుతిరిగి డీఎంకే, వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసే ఉంటున్నాయి కనుక వారికి ఇబ్బంది ఉండదు. ఇక వైఎస్సార్‌సీపీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించి భేటీకి వెళ్లకుండా, అలాగని తన అభిప్రాయాలు దాచుకోకుండా ప్రధానమంత్రికే ఏకంగా లెటర్ రాశారు. దానివల్ల దక్షిణాదికి అన్యాయం జరగరాదని ఆయన డిమాండ్ చేసినట్లయింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి పక్షాలు అధికంగా ఉన్న భేటీకి ఆయన హాజరు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతవరకు వైఎస్సార్‌సీపీ అటు ఎన్డీయే వైపుకానీ, ఇటు ఇండియాకూటమివైపు కానీ ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది.
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేనలు మాత్రం దీనిపై మాట్లాడలేకపోతున్నాయి. సాధారణంగా అయితే గతంలో తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తే పొత్తుల గురించి పట్టించుకోకుండా మాట్లాడతానని చంద్రబాబు అనేవారు. గుజరాత్ మత కలహాల అంశంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి ఓటింగ్ సమయానికి జారి పోయినప్పటికీ, కొన్నిసార్లు అయినా మాట్లాడేవారు. అలాగే ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ యూపీ, బీహార్ రాష్ట్రాలకు అధిక వాటాలో కేంద్రం నుంచి నిధుల వెళ్లే తీరుతెన్నులపై గతంలో ధ్వజమెత్తేవారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మైనార్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని మాట వరుసకైనా అనేవారు. కానీ, ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అంటే ఏం భయమో తెలియదు కానీ.. ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం స్పందించడం లేదు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడినా, మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోరు. ఆయనకు దీనిపై పెద్దగా అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ, తానే మోదీని ఎదిరించగలనని గతంలో చెప్పుకున్న చంద్రబాబు వంటి సీనియర్ నేత, ఇప్పుడు ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో ఇంత నష్టం జరుగుతుంటే కేంద్రాన్ని గట్టిగా నిలదీయ లేకపోవడం ఆయన ఎంతగా బలహీనపడ్డారో తెలియ చేస్తుంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.