Komminene Srinivas Rao
-
ధిక్కార స్వరాల అణచివేతే.. బాబు లక్ష్యమా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ ద్వంద్వ వైఖరే. ప్రతిపక్షంలో ఉంటే.. పూర్తి స్వేచ్ఛ కావాలంటారు. స్వయంగా కార్యకర్తలను రెచ్చగొడతారు. కళ్లేదుటే పార్టీ కార్యకర్తలు పోలీసులపై దాడులు చేసినా కిమ్మనరు. కానీ.. అధికారంలో ఉంటే మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది. ముఖ్యమంత్రిగా తనను ఎవరూ కించిత్ మాట అనకూడదు. సోషల్ మీడియా కూడా ఏ రకమైన విమర్శ చేయకూడదు. వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. తండ్రి ఇలా ఉంటే.. కుమారుడు ఇంకోలా ఉండేందుకు అవకాశం లేదన్నట్లు లోకేష్ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఐదురోజుల క్రితం వైస్సార్సీపీ రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సంకల్పించింది. కానీ.. ఈ కార్యక్రమం కోసం సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించేశారు. పలుచోట్ల నేతలను గృహ నిర్భంధంలో పెట్టారు. వీటిని ఎదుర్కొంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. రైతులూ వీరికి మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు పడుతున్న ఇక్కట్లు ఇన్ని,అన్నీ కావు. వరికి గిట్టుబాటు ధరలు లేవు సరికదా.. ధాన్యం కొనుగోళ్లలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా ధాన్యం వర్షానికి తడిచి మొలకెత్తి పోతూండటంతో రైతులు నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం దాచుకునేందుకు కనీసం గోనె సంచులను కూడా సమకూర్చ లేకపోతోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు తేమశాతం నెపం చెప్పి బస్తాకు రూ.200 నుంచి రూ.400లు తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు తాను వెళతానని బీరాలు పలికిన చంద్రబాబు రైతుల కళ్లాల వద్దకు మాత్రం వెళ్లడం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని చోట్ల పర్యటిస్తే రైతులు ఆయనను నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్యలు పెద్దగా లేవని, రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయని రైతులు వివరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలను విధ్వంసం చేసే క్రమంలో రైతు భరోసా కేంద్రాలను నీరుకారుస్తోంది. అలాగని ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులిప్పుడు మిల్లర్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ టైమ్ లో పెట్టుబడి సాయం రైతు భరోసా కింద రైతులకు రూ.13,500ల చొప్పున నిర్దిష్ట విడతలలో అందించేవారు. తాము అధికారంలోకి వస్తే రూ.20 వేలు ఇస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా బాబు, పవన్ కళ్యాణ్‌లు ఎవ్వరూ దీని ఊసే ఎత్తడం లేదు. గతంలో ఉన్న ఉచిత బీమా సదుపాయం కూడా ఇప్పుడు రైతులకు లేకుండా పోయింది. తుపానుకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అంతంతమాత్రంగానే అందుతోందని చెబుతున్నారు. టమోట రైతులు కూడా రూపాయికి కిలో చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. జగన్ పాలనలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు గణనీయంగా పడిపోకుండా అడ్డుకోగలిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలాంటి అనేక సమస్యలపై వైసీపీ నేతలు వినతిపత్రాలు ఇవ్వబోతే వాటిని స్వీకరించడానికి ఏమి ఇబ్బంది వచ్చిందో అర్థం కాదు. పార్టీ నేతలు వైఎస్ అవినాశ్ రెడ్డి, సతీష్ రెడ్డి మల్లాది విష్ణు తదితరులను గృహ నిర్భంధం చేసినట్లు వార్తలు వచ్చాయి. అనేక పోలీస్ స్టేషన్లలో వైసీపీ కార్యకర్తలు, నేతలను నిర్భంధించారు. పలు కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనినే ప్రజాస్వామ్యం అనుకోండని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. దీనినే స్వేచ్చ అని భావించాలని చెబుతున్నారు. ఈ పాటి చిన్న నిరసననే అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటే ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులలో ఉన్న అసంతృప్తి బయటపడుతోందని భయపడుతోందని అర్థం. హామీల అమలుపై నిలదీస్తారన్న ఆందోళన కావచ్చు. ఏపీలో పోలీసులు ఈ రకంగా అనేక సందర్భాలలో వైసీపీ వారిని అణచివేయాలని చూస్తున్నారు. పులివెందుల సమీపంలోని వేముల ఎమ్.ఆర్.ఓ. ఆఫీస్ వద్ద నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ వారి అరాచకాలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ వారు దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. రిపోర్టర్లపై దౌర్జన్యం చేశారు. ఇంతకాలం పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. ఇష్టారీతిన కేసులు పెట్టారు. వారిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులను కూడా వేధించడం ఆరంభించినట్లుగా ఉంది. చంద్రబాబు లక్షణం ఏమిటంటే తాను జర్నలిస్టులతో బాగున్నట్లు కనిపించడానికి యత్నిస్తారు. అదే టైమ్ లో తన వైఫల్యాలను రాసే జర్నలిస్టులను మాత్రం రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు. జగన్ టైమ్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు రాసినా, అదే మీడియా స్వేచ్ఛ అని ప్రచారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను, జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఈ సందర్భంలో పలువురిపై వ్యవస్థీకృత నేరాల సెక్షన్ లను కూడా ప్రయోగించడానికి వెనుకాడడం లేదు. నిజానికి సోషల్ మీడియాకు చట్టంలోని ఆ నిబంధనలు వర్తించవు. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. గత పదేళ్లలో ఒకటికి మించి ఛార్జిషీట్లు ఎవరిపైన అయినా ఉంటే, వాటిని మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకుంటే, అప్పుడు ఈ సెక్షన్లు వర్తిస్తాయని తెలిపింది. అయినా చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు మాత్రం చట్టంతో తమకు నిమిత్తం లేనట్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకుపోతున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరులో ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను తెల్లవారుజామున నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి భయపెట్టి తీసుకుపోయారట. దీని గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చూసినా, వైసీపీ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోలీసులను ఎదుర్కున్నారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట మాత్రంగా ప్రస్తావించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నది చంద్రబాబు ,పవన్ కళ్యాణ్‌ల ప్రభుత్వమేనేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?
తిక్కలోళ్లు తీర్ధానికి వెళితే.. ఎక్కా, దిగా సరిపోయిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు చేస్తున్న పనులు, అంటున్న మాటలు గమనిస్తుంటే ఈ సామెత గుర్తుకు వస్తుంది. తోచి, తోయనమ్మ తోడికొడలు పుట్టింటికి వెళ్లినట్లుగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో సమస్యలు ఏవీ లేనట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన సరస్వతి పవర్ కంపెనీకి చెందిన ప్రైవేటు భూములలోకి వెళ్లి గొడవ చేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని ప్రజలు బూతులు తిడుతున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పరువు తీశారు. దీనిపై చంద్రబాబులో అసంతృప్తి ఉన్నా, పవన్ కళ్యాణ్‌ను ఏమీ నేరుగా అనలేకపోయారు. అయినా ఆయన అసహనం ఏదో రకంగా పవన్‌కు తెలిసి ఉంటుంది. దాంతో పవన్ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు సడన్‌గా పల్నాడులోని సరస్వతి పవర్‌కు చెందిన భూలముల సందర్శనకు వెళ్లి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. లేదంటే.. డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ఇద్దరు కలిసి ఈ యాక్టివిటి సృష్టించారని కొందరు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు తనదైన స్టైల్లో ఎమ్.ఆర్.పి.ఎస్ నేత మంద కృష్ణతో పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ మెస్సేజ్ ఇప్పించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబును కలిశాకే మందకృష్ణ ఈ అంశం గురించి మాట్లాడారు. మామూలుగా అయితే ఇలా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా, ప్రత్యేకించి తనకు డామేజీ అయ్యేలా ఏ టీడీపీ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా మాట్లాడితే. వెంటనే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలో ఒక లీక్ వచ్చేది. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, చర్య తీసుకుంటామని హెచ్చరించారని ప్రచారం జరిగేది. కానీ పవన్ అంతగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించినా చంద్రబాబు స్పందించలేకపోయారు. హోం మంత్రి అనిత నిస్సహాయంగా మిగిలిపోయారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై ఏదో తేడా వస్తే.. చంద్రబాబు పోన్ చేసి క్లాస్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ పవన్ విషయంలో అలా చేయడానికి చంద్రబాబు సాహసించలేకపోయారు. అయినా.. పరోక్షంగా మంద కృష్ణతో క్లాస్ పీకించారు. పవన్ కల్యాణ్, ప్రైవేటు సంస్థ భూములలోకి వెళ్లడం ఏ రకమైన అధికారమో తెలియదు. నిజంగా ఆ భూముల విషయంలో ఏదైనా తేడా ఉండి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఊరికే వదిలేసేదా? ఆ సంస్థకు నీరు ఇవ్వడం కూడా తప్పే అన్నట్లు పవన్ ప్రసంగించారు. వెయ్యి ఎకరాలలో ఇరవైనాలుగు ఎకరాలు ఏదో తేడా ఉందని ఈయన కనిపెట్టారు. అధికారులు అంతకుముందు పరిశీలనకు వచ్చి అక్కడ ప్రభుత్వ భూమి లేదని చెబితే.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఈయన వచ్చి 24 ఎకరాల అస్సైన్డ్ భూమి, కుంటలు, చెరువులు ఉన్నాయని చెప్పారు. కేవలం స్థానికులను రెచ్చగొట్టి, అక్కడ పరిశ్రమ రాకుండా చేయాలన్న దురుద్దేశంతో పవన్ వెళ్లినట్లు ఉంది తప్ప, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా చేసినట్లు కనిపించదు. అంటే ఇంకెవరైనా పరిశ్రమలు పెడితే ఫర్వాలేదా? జగన్ మాత్రం పెట్టకూడదా?. ఇక్కడకు సమీపంలోనే ప్రభుత్వం అదానీ, మహా సంస్థలకు భూములు కేటాయించింది. అక్కడకు ఈయన వెళ్లలేదు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే పరిశ్రమలు కొత్తగా పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? నాకు తెలిసి ఒక ప్రైవేటు కంపెనీ భూమిలోకి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లి ఇలా అరాచకం చేయడం ఇదే మొదటిసారి కావచ్చు.ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ అంటూ కొత్త పారిశ్రామికవేత్తలకు భయానక వాతావరణం సృష్టిస్తుంటే, పవన్ తాను వెనుకబడిపోతానేమో అన్నట్లుగా స్వయంగా రంగంలో దిగి పారిశ్రామిక వాతావరణాన్ని చెడగొట్టే పనిలో ఉన్నారు. ఏపిలో జరుగుతున్న ఘాతుకాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంపైనే కాదు.. ఇలా పవన్ అడ్డగోలుగా ప్రవర్తిస్తే కూడా జనం తిడతారన్న సంగతి గుర్తుంచుకోవాలి. పర్యావరణ మంత్రిని అని చెబుతూ ఖాళీగా ఉన్న భూమలులోకి వెళ్లిన పవన్‌కు కర్నూలు జిల్లా దేవనకొండ వద్ద వేలాది మంది ప్రజలు యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కనిపించడం లేదు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాల పంట భూమిని బీడుగా మార్చినా,అక్కడ పర్యవరణానికి ఇబ్బంది లేదని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. వందల ఎకరాల అస్సైన్డ్ భూమిని టీడీపీ పెద్దలు కొట్టేసినా, అక్కడ పవన్‌కు సంతోషంగానే ఉందని అనుకోవాలా? కృష్ణా నది ఒడ్డున అక్రమ భవనాలు ఉన్నాయి కదా! వాటిలో ఒకదానిలో ముఖ్యమంత్రి కూడా ఉంటున్నారు కదా! వాటిని ఖాళీ చేయించి పర్యావరణాన్ని కాపాడానని పవన్ చెప్పగలిగితే అంతా శభాష్ అంటారు. నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?.హోం మంత్రి అనిత ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. ప్రతిపక్షం వారు విమర్శలు చేశారంటే అదొక పద్దతి. కాని ఉప ముఖ్యమంత్రి హోదా లో ఉండి అనితను అవమానించిన తీరు బాగోలేదు. నిజానికి ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకు ప్రత్యేకంగా కొమ్ములేమీ ఉండవు. ఆయన కూడా మంత్రులతో సమానమే. తనకు తాను హోం శాఖ ను తీసుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి పరిధిలో ఉండే అధికారమది. ఆ విషయం పవన్ కు తెలియదేమో! కాకపోతే భాగస్వామి పార్టీగా తనకు హోం శాఖ కావాలని అడిగి తీసుకోవచ్చు. అంతేకాదు.హోం శాఖ ఒక్కటే చేతిలో ఉంటే అన్ని పవర్లు ఉండవు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రత్యేక విభాగం. అది ఎప్పుడూ ముఖ్యమంత్రే ఉంచుకుంటారు.శాంతి భద్రతలు విఫలమైతే అందుకు ప్రధానంగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులంతా బాధ్యత వహించాలి. ఒక పక్క రెడ్ బుక్ అమలు చేయాలని ,టీడీపీ వారు అరాచకాలు చేసినా చర్య తీసుకోరాదని పోలీసులపై ఒత్తిడి తెచ్చేది వారే. ఇంకో పక్క లా అండ్ఆర్డర్ విఫలం అయిందని చెప్పేది వారే. ఇదంతా నాటకీయంగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. కేవలం అనితనే బాధ్యురాలిని చేయకుండా చంద్రబాబు ను కూడా తప్పు పట్టి ఉంటే అప్పుడు పవన్ కల్యాణ్ చిత్తశుద్దితో ఉన్నారని అనుకోవచ్చు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగితే ఎవరో పోలీసు అధికారి చర్య తీసుకోవడం లేదట. దానికి కులం అడ్డం వస్తోందని చెప్పారట. అది నిజమే అయితే వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేయాలి కదా? ఒకరకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నదో ఈ ఉదాహరణ తెలియచేస్తుంది.పవన్ కల్యాణ్ తెలిసి చెప్పారో,లేక తెలియకుండా చెప్పారో కాని ఒక్క నిజం మాత్రం వెల్లడించారు.అదేమిటంటే కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని. వంద అబద్దాలను కవర్ చేసుకోవడానికి పవన్ ఈ ఒక్క నిజం చెప్పారా!అన్న సందేహం కలుగుతుంది.ఇంకో మాట కూడా అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో తన ప్రాధాన్యతతగ్గుతోందని, ఆ నేపధ్యంలో ఆయన చంద్రబాబును బెదిరించడానికి ఈ రకంగా మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు. కాని వవన్ వ్యాఖ్యలతో పరువు పోయిందన్న భావంతో ఉన్న చంద్రబాబు కు కోపం వచ్చిన సంగతి గమనించి,వెంటనే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పల్నాడు టూర్ పెట్టుకుని ఇష్యూని డైవర్ట్ చేసే యత్నం చేసి ఉండవచ్చు. కేవలం ఏపీలో జరుగుతున్న నేరాలు-ఘోరాల గురించే కాదు.ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు కూడా జనం తిడుతున్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి పవన్ యత్నించారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు పదిహేనువేలు, మహిళా శక్తి కింద ప్రతిఇ స్త్రీకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని,నిరుద్యోగ భృతి 1500 ఇస్తామని ..ఇలా అనేక హామీలు ఇచ్చారు కదా..విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు కదా..కానీ ఇప్పుడు దారుణంగా పెంచుతున్నారే. అగ్గిపెట్టెలు,కొవ్వొత్తులకే 23 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వంగా ఇది రికార్డు పొందింది కదా! తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దేవుడికే అపచారం చేశారే! వీటన్నిటిపైన జనం మండిపడుతున్నారు.గతంలో చంద్రబాబు పాలన ఇంత అధ్వాన్నంగా లేదని, ఇప్పుడే మరీ దరిద్రంగా తయారైందని సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు.వీటితో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినా జనం నమ్మరు.ఒక రోజేమో చంద్రబాబు అనుభవం, పాలన అధ్బుతం అని ,మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసి, ఇంకో రోజు తమ పాలన తీరుపై జనం బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కాబట్టి తింగరోళ్లు తీర్ధానికి వెళితే ఎక్కా,దిగా సరిపోయిందన్న సామెత చెప్పవలసి వచ్చింది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నా చోద్యం చూస్తున్న ద్వయం!
ఆంధ్రప్రదేశ్ నేరాలకు రాజధానిగా మారినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమైన రుజువులు కనిపిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే అనేక ఘాతుకాలు చోటు చేసుకోవడం దీనికి కారణం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం విచారకరమైన అంశమని చెప్పాలి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుదో విచిత్రమైన శైలి. ప్రతిపక్షంలో ఉంటే.. ప్రభుత్వంలో ఉన్న వారిని బద్నాం చేసేందుకు ఉన్నవీ లేనివి.. చిన్నా చితకా ఘటనలను కూడా కొండంత చేసి చూపుతూంటారు. అదే అధికారంలో ఉన్నారా...? కొండ విరిగి మీదపడ్డా.. అబ్బే చీమ కూడా కదల్లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం మొత్తం ఇలాంటి ఘటనలతో కూడుకున్నదే. ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వారిని ఇరుకున పెట్టేందుకు ఆయన ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోని సిబ్బంది చిన్నా చితక ఘటనలను చిలువలు వలువలుగా చేసి ప్రచారంలో పెడుతూంటాయి. వాటి ఆధారంగా బాబు ప్రభుత్వంపై బురద చల్లుతూంటారు. అధికారంలో ఉన్నప్పుడు దీనికి పూర్తి రివర్స్ గేర్! అసలు ఏమీ జరగనట్టు, ఒక వేళ ఎక్కడైనా జరిగినా తాను చాలా కఠినంగా వ్యవహరించినట్టు బిల్డప్ ఇస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. విభజన తరువాత కూడా గత 130 రోజుల్లో చోటు చేసుకున్నన్ని హింసాత్మక ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. హింస ఒక ఎత్తు అయితే.. ఇసుక, మద్యం, మాదకద్రవ్యాల ఘటనలు ఇంకో ఎత్తు. ఎవరైనా సరే.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లో పస లేదని ఇప్పటికే స్పష్టమైపోయింది.స్వయానా టీడీపీ ఎమ్మెల్యేలే ఇలాంటి అకృత్యాలకు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా కిమ్మని అనేందుకూ సాహసించడం లేదు బాబు, పవన్ ద్వయం! మద్యం షాపులు, మట్కా నిర్వాహకులు, పేకాట క్లబ్‌లు తమకు ఎంతెంత మామూళ్లు ఇవ్వాలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ప్రకటిస్తూండటం, అభివృద్ధి సాకుతో మున్సిపాలిటీలో సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూండటం బహుశా లోకేష్ రెడ్ బుక్‌ను మించిన వ్యవహారం అనుకోవాలి. రాష్ట్రంలో వివిధ ప్రాంతలలో జరిగిన అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం హిందూపూర్ నియోజకవర్గంలో కొందరు నీచులు అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దారుణం. దుండగులు కుటుంబ సభ్యులను కట్టేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బతుకుతెరువుకోసం వచ్చిన వారిపై పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించడానికి వైఎస్సార్ సీపీ మహిళానేతలు వెళ్లడానికి కూడా పోలీసులు అనుమతించ లేదు. వైఎస్సార్ సీపీ పాలన సమయంలో విజయవాడలో ఒక బాలిక అఘాయిత్యానికి గురైతే పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ బాలికను చంద్రబాబు పరామర్శించడానికి వెళ్లారు. నిజానికి పురుషులు ఎవ్వరూ అలా వెళ్ల కూడదని మార్గదర్శకాలు ఉన్నా చంద్రబాబు అధికారులను బెదిరించి మరీ వెళ్లారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మహిళా నేతలను కూడా పరామర్శించనివ్వడం లేదు.మామూలుగా అయితే హిందూపూర్ జరిగిన ఘటనల్లాంటివి మీడియాలో అత్యంత ప్రముఖంగా కనిపించాలి. కానీ ఈ వార్త ఎక్కువ శాతం మీడియాలో లోపలి పేజీలకే పరిమితమైంది. ఎల్లో మీడియా అయితే సాధ్యమైనంత వరకూ ఇలాంటి ఘటనలను ప్రజలకు తెలియకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ధర్మవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ తల్లి హత్యకు గురైతే పదిరోజుల తర్వాతగానీ ఆమె శవం ఆచూకీ దొరకలేదు. ఇక తిరుపతి జిల్లా వరగాని అనే గ్రామంలో ఒక బాలుడు కిడ్నాప్ అయి హత్యకు గురయ్యాడు. పుంగనూరులో ఒక ముస్లిం బాలికను హత్యాచారం చేసి ఆ తర్వాత కనిపించకుండా మాయం చేశారు. అక్కడ తీవ్రమైన ఆందోళన వచ్చాకగానీ ఆ బాలిక మృతదేహాన్ని కనుగొనలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్కడకు వెళ్లడానికి సిద్ధం కాగా అప్పుడు రాష్ట్ర మంత్రులు హడావుడిగా వెళ్లి కుటుంబ సభ్యులకు హామీలు ఇచ్చి వచ్చారు. నందికొట్కూరు వద్ద ముచ్చుమర్రిలో వాసంతి అనే బాలిక మాయమై శవమైపోయింది. ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం దొరకలేదు. ఇలా ఒకటి కాదు రాష్ట్రంలోని వివిధ ప్రాంతల్లో నిత్యం ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి. డోన్‌లో టీడీపీ నేతలకు చెందిన కొందరు పిల్లలు మైనర్ బాలురపై జరిపిన లైంగిక దాడులు కలకలం రేపాయి. వీటికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఈ ఘటనకు మద్యం సేవించడమే కారణమని తేలుతోంది. కొద్ది రోజుల క్రితం బద్వేల్, తెనాలి వంటి చోట్ల అకృత్యాలు జరిగాయి. గతంలో జగన్ ప్రభుత్వం దిశ యాప్ ద్వారా ఎక్కడ ఏ మహిళకు ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకోవడానికి ఏర్పాటు చేసింది. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. కాని చంద్రబాబు ప్రభుత్వం వాటన్నిటిని నీరుకార్చినట్లుంది. చంద్రబాబుకు జగన్ పై ద్వేషం ఉంటే ఉండవచ్చు కానీ జనానికి మేలు చేసే విషయాలపై ఇలా వ్యవహరించి వ్యవస్థలను ద్వంసం చేయడం మాత్రం దారుణం అని చెప్పాలి.ఏలూరు వద్ద ఒక హాస్టల్ మేనేజర్ 14 మంది బాలికల్ని లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ కేసులు కొన్నిటిలో కొందరిని అరెస్టు చేసి ఉండవచ్చు. సమాజంలో కొన్ని నేరాలు జరుగుతూనే ఉంటాయి. వెంటనే పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వంలో పోలీసులకు ఇలాంటి వాటిని అదుపు చేయడం కన్నా టీడీపీ నేతలు చెప్పిన వారిని వేధించడానికి, వారిపై కేసులు పెట్టడానికే సమయం సరిపోతున్నట్టు లేదు. అదే టైమ్‌లో టీడీపీ నేతల దౌర్జన్యాలను కొన్ని చోట్ల పోలీసులు సైతం భరించక తప్పడం లేదు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఒక ఎస్సై చొక్కా పట్టుకొని నడివీధిలో దౌర్జన్యం చేశారు. రాష్ట్రమంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఒక పోలీసు అధికారి పట్ల ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందీ అందరూ చూశారు. అనంతపురం జిల్లా హనకనకల్లులో శ్రీరాముడి రథానికి కొందరు దుండుగులు నిప్పంటిస్తే దాన్ని వైఎస్ఆర్ సీపీకి పులమడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు. ఈ ఘటనతో రాజకీయాలకు సంబంధం లేకపోయినా ఇలాంటివి చేస్తుండడంతో మొత్తం పోలీసు వ్యవస్థనంతటినీ టీడీపీ నేతలే నడుపుతున్నారనే భావన కలుగుతోంది.ముంబయికి చెందిన మోసకారి నటి జత్వానీకి సంబంధించిన ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్ లను ప్రభుత్వం సస్పెండ్ చేయడం ద్వారా తన కక్ష ధోరణిని బైట పెట్టుకుంది. రఘురామ కృష్ణంరాజు కుల విద్వేషాలను రెచ్చగొట్టారనే కేసులో అరెస్టయినప్పుడు తనపై పోలీసు అధికారులు దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ఆయన ఇప్పుడు కేసు పెట్టారు. అందులో కొంతమంది సీనియర్ అధికారులను ఇరికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై వత్తిడి తెస్తున్నారట. టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందన్న అభియోగం కేసు, నటి జత్వానీ కేసు సీఐడీకి అప్పగించి మరీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం వారు దాడి చేస్తే ఆ కేసును ఏం చేశారో తెలియడం లేదు.గతంలో సుగాలి ప్రీతి కేసులోను, 31 వేల మంది మహిళల మిస్సింగ్ అంటూ జగన్ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా 130 రోజుల్లో జరిగిన అకృత్యాలపై కనీసం స్పందించడం లేదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక వైపు అత్యాచారాలు, మరో వైపు హింసాకాండ, ఇంకోవైపు వేధింపుల పర్వంతో ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఘోరమైన పరిస్థితుల్లోకి కూటమి ప్రభుత్వం తీసుకుపోతోంది. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలను పిచ్చోళ్లుగా, ఏమీ ప్రశ్నించలేని అశక్తులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ఇసుక విషయంలో కూటమి ప్రభుత్వం అందరి కళ్లముందే భారీ మోసానికి పాల్పడే ధైర్యం చేస్తూండటంతో! అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతూంటే ఇప్పటికే ఉచిత ఇసుకను ప్రజలకు దూరం చేసేశారు. తాజాగా ఇసుక రీచ్‌లను ప్రైవేట్ వారికి అప్పగించేస్తున్నారు. మరీ ఇంత మోసమా?. ఇసుక ఉచితంగా దొరక్కపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారని భవన నిర్మాణం రంగం కుదేలైందని ఇదే కూటమి నేతలు జగన్ హయాంలో పెడబొబ్బలు పెట్టిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలిక్కడ. ఇలాంటి కట్టుకథలు, మాయమాటలు చెప్పి... తాము అధికారంలోకి వస్తే అంతా ఫ్రీ అంటూ హామీలతో ఊదరగొట్టారు కూడా. ప్రజలు కూడా బహుశా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు దగ్గరుండి మరీ ఇసుక తవ్వించి ఉచితంగా పంపిణీ చేస్తారు కాబోలు అనుకున్నారు అప్పట్లో. పైసా ఖర్చు లేకుండా ఇళ్ల వద్దకే ఇసుక వస్తుందని భ్రమపడ్డారు. బాబు, పవన్‌ల మాటలు అమాయక ఆంధ్రులు సంబరపడ్డారు. మాటిచ్చి... తూచ్ మనడంలో చంద్రబాబు దిట్ట అన్నది మాత్రం మరచిపోయారు. ఏదైతేనేం... టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల సందర్భంగా కలిసికట్టుగా మేనిఫెస్టోనైతే ప్రకటించాయి. మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించినా ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీకి కూడా బాధ్యత ప్పకుండా ఉంటుంది. అయితే ఏదో ఒకలా కూటమి అధికారంలోకైతే వచ్చింది కానీ.. అప్పటి నుంచే ఒక్కటొక్కటిగా హామీలకు తిలోదకాలు ఇవ్వడమూ మొదలైంది. ఈ క్రమంలో తాజా అంకమే ఉచిత ఇసుక మాటను ఉట్టికెక్కించడం!వాస్తవానికి ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ఇసుక కోసం నానా అగచాట్లూ పడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం మొత్తమ్మీద ప్రజల అవసరాల కోసం ఏకంగా 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేసి ఉంచారు కానీ.. అధికారంలోకి వచ్చీ రాగానే కూటమి నేతలు ఈ ఇసుక నిల్వలతో అయినకాడికి బొక్కేశారు. ప్రజలకేమైనా ఇచ్చారా? ఊహూ అస్సలు లేదు. ముక్కు పిండి మరీ వసూలు చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలు సొంత జేబుల్లో నింపుకున్నారు. నిల్వలు కరిగిపోవడంతో ఇసుక దొరకడమే గగనమైంది. ఒకానొక సందర్బంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘‘ఎవరు కావాలంటే వారు ఇసుక తవ్వుకుని తెచ్చుకోవచ్చు’’ అన్నారు కూడా. టీడీపీ నేతలు స్టాక్‌పాయింట్ల వద్ద పెత్తనం చెలాయిస్తూ ప్రజలను నిలువుగా దోపిడీ చేశారు. పోనీ ప్రభుత్వమైనా ఉచితంగా ఇస్తున్నదా అంటే అదీ లేదు. సీనరేజీ, జీఎస్టీల పేరుతో పెద్ద మొత్తాల్లోనీ ఫీజులు వసూలు చేస్తోంది. లారీ లోడింగ్ ఖర్చుల సంగతి సరేసరి. జగన్ అధికారంలో ఉండగా అవసరమైన వారికి అవసరమైనంత ఇసుక హేతుబద్దమైన రేటుకు దొరికేది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. ఇప్పుడు మాత్రం హళ్లికి హళ్లి... సున్నకు సున్నా! గతం కంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి. మొత్తానికే ఎసరు..ఇసుక ఉచితంగా లభించడాన్ని విజయవంతంగా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎకాఎకి మొత్తం పథకానికి మంగళం పాడేందుకు స్కెచ్ వేసినట్టు ఉంది. నదులలోని 108 ఇసుక రీచ్‌లను గంపగుత్తగా ప్రైవేట్ వారికి అప్పగించేలా గుట్టుచప్పుడు కాకుండా నిర్ణయం చేశారు. వీటి ద్వారా డబ్బై లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తారట. అంతేకాదు...రెండు రోజులలోనే ఈ వ్యవహారం మొత్తాన్ని చక్కబెట్టేయాలన్నది ప్లాన్! టెండర్లు పిలవడం, కేటాయింపులు అన్నీ అన్నమాట! సహజంగానే టీడీపీ వారికే టెండర్లు దక్కే ఏర్పాట్లు ఉంటాయి దీంట్లో! సాధారణంగా టెండర్లలో పాల్గొనేందుకు అందరికీ అవకాశం కల్పిస్తూ కొంత సమయం ఇస్తారు. అలా కాకుండా రెండు రోజుల వ్యవధి మాత్రమే పెట్టడంతోనే ఇందులోని మతలబు ఏమిటన్నది తెలిసిపోతోంది. ఇసుక రీచ్‌లు ప్రైవేట్ వారికి అప్పగిస్తే వారు అక్రమంగా అమ్మకాలు జరపకుండా ఉంటారా? ఇసుక ఉచిత సరఫరా ఎలాగో చెప్పకుండా, విధి, విధానాలను నిర్ణయించకుండా హడావుడిగా టెండర్లు ఏమిటో? ప్రైవేటు వ్యక్తులు ఇసుక తవ్వి ప్రభుత్వానికి అందచేస్తే ,అధికారులు ఉచితంగా ఇస్తారా? లేక ప్రైవేటు వ్యక్తులు తమ రీచ్‌లలో ఇసుక తీసుకుని అమ్ముకునే స్వేచ్చ ఉంటుందా? మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అయితే ప్రైవేటు వ్యక్తులు ఇసుకను అమ్ముకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం వేరే స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినా, అక్కడ ఇసుక ఎంతవరకు ఉంటుంది? మొత్తం రీచ్ లన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్లాక, ప్రభుత్వం ఎక్కడ నుంచి ఇసుక తెచ్చి ఉచితంగా ఇస్తుంది?. ఇప్పటికే టీడీపీ నేతలు అనేక రీచ్‌లను దౌర్జన్యంగా ఆక్రమించారని వార్తలు వస్తున్నాయి. ఇతరులు ఎవరైనా పొరపాటున బిడ్ పొంది రీచ్ కు వెళితే, టీడీపీ నేతలు వారిని బెదిరించి పంపించి వేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఒక టీడీపీ నేత బెదిరింపుల వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. తమ హయాంలో ఏడాదికి రూ.700 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ప్రజలకు రెండు, మూడు రెట్ల భారం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇదే తరహాలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇసుక పాలసీ ప్రకటించకుండా దొంగచాటుగా టెండర్లు ఏమిటని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ టైమ్‌లో మొదటి మూడు నెలలు తప్ప, ఆ తర్వాత పుష్కలంగా ఇసుక దొరికినా, ఇసుక లభ్యం కావడం లేదని, లేదా ఎక్కువ ధర పెట్టవలసి వస్తోందటూ మొసలి కన్నీరు కార్చిన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా, ఇప్పుడు ఇసుక ధరలు రెట్టింపైనా అంతా బాగుందన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మోస్తూ, భజన చేస్తూ ప్రజలను మభ్య పెట్టడంలో ఎల్లో మీడియా విశేషంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈనాడు మీడియా ఇసుక సమస్యకు ఎలా కవరింగ్ ఇచ్చిందో చూడండి. ఆ పత్రికలో 'రీచ్ లలోను కొనుగోళ్లు" అని హెడింగ్ పెట్టి, అదేదో కొత్త సదుపాయం క్రియేట్ చేస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే రీచ్ లకు అనుమతులు ఇస్తారని, ఎవరైనా ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అసలు గుట్టు విప్పారు. అంతే తప్ప కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ హామీకి విరుద్ధంగా ఇసుక బేరసారాలు పెట్టారని ఈనాడు మీడియా రాయలేదు. కూటమి మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి తూట్లు పొడిచారని పేర్కొనలేదు. చంద్రబాబుతో పాటు ఈనాడు మీడియా కూడా జనాన్ని ఎంత అన్యాయంగా మోసం చేస్తున్నది ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు.ఇక మరో మీడియా ఆంద్రజ్యోతి అయితే త్వరలో ప్రైవేటు ఇసుక రీచ్ లు వస్తున్నాయని, మరింత ఇసుక అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి తన వంతు బాజా వాయించింది. ఉచిత ఇసుకకు అదనంగా ఇది ఏర్పాటు అని మళ్లీ కవరింగ్ ఇచ్చారు. ఇదేదో గనుల శాఖ ప్రతిపాదించినట్లు రాశారు తప్ప, చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదన్నట్లు మాయ చేసేందుకు యత్నించారు. ప్రజలకు అవసరమైన ఇసుకను ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యమని కూడా ఆంధ్రజ్యోతి ముక్తాయించింది. దీనిని బట్టి ఈ మీడియా ఎంతగా ప్రజలను చీట్ చేయడానికి కృషి చేస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా కలిసి ఇసుక కొట్టాయని అనుకోవచ్చా!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇసుక.. మందు.. బాబు బ్యాచ్ విందు!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో ఇసుక, మద్యం వంటి వాటిల్లో జరుగుతున్న విచ్చలవిడి దోపిడీని గుర్తించడమే కాకుండా.. దాన్ని సరిదిద్దేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఆయా సందర్భాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ దిద్దుబాటు యత్నాలను తీవ్రంగా వ్యతిరేకించడం అందరూ గమనించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అంశాలపై విధానపరమైన సంస్కరణలు తేవడానికి కేవలం రెండు మూడు నెలలే పట్టినా.. పచ్చపార్టీలు మాత్రం ఈలోపే నానా రచ్చా చేసేందుకు ప్రయత్నించాయి. ఇసుక కొరత ఏర్పడిందని, రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటూ చంద్రబాబు, పవన్‌లు వీధికెక్కారు. తప్పుడు ప్రచారం చేశారు.అంతకుముందు 014-2019 మధ్యకాలంలో మాత్రం అధికారంలో ఉన్న టీడీపీ ఇసుక ఉచితం అంటూనే అయినకాడికి దోచుకున్నారు. సొంతజేబులు నింపుకున్నారు. ఈ దోపిడీలన్నింటికీ జగన్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. పక్కా ప్రణాళికతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇసుక నిల్వకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా నిర్దిష్ట రేట్లు నిర్ణయించారు. అదే సమయంలో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకూ చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ఈ అంశంపై అక్కసంతా వెళ్లబోసుకున్నారు.విశాఖలో ఒక ప్రదర్శన జరిపి ఇసుక కొరతవల్ల భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారని దుష్ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన ఆరోపణలకు అండగా ఎల్లో మీడియా పలు దొంగ కథనాలను కూడా వండి వార్చింది. ఉదాహరణకు పొన్నూరు వద్ద ఒక వ్యక్తి ఇతర కారణాలతో చనిపోతే ఇసుక కొరత వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ అసత్య కథనం రాసింది. ఆ తర్వాత 2024 ఎన్నికల వరకూ టీడీపీ, జనసేన పార్టీలు అదే తరహా ప్రచారం చేయడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే మొత్తం ఇసుకంతా ఫ్రీ, ఫ్రీ అని ప్రచారం చేశారు.ఎలాగైతేనేం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నుంచి ఒకరు మంత్రి అయ్యారు. అప్పటి నుంచీ జనానికి అసలు సినిమా చూపించడం ఆరంభించారు. చంద్రబాబు ఉచిత ఇసుక ఇస్తున్నామని పైకి చెబుతుంటారు కానీ రాష్ట్రంలో ఎక్కడా ఉచితంగా దొరకదు. జగన్ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఇష్టారీతిన ధరలు కట్టి 40 లక్షల టన్నుల అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పోనీ మిగిలిన 40 లక్షల టన్నుల ఇసుకైనా జనానికి ఉచితంగా అందిందా అంటే అదీ లేదు. దీంతో ప్రజలు అధిక ధరలు చెల్లించక తప్పలేదు.ప్రస్తుతమైతే అసలు ఇసుక దొరకడమే గగనమైంది. జగన్ పాలనలో ఆ ప్రాంతాన్ని బట్టి ఇసుక టన్నుకు రూ.300 నుంచి రూ.500లకు దొరికేది. ట్రాక్టర్ ఇసుక రూ.నాలుగు నుంచి రూ.ఐదు వేలకు లభించేది. ఇప్పుడు అదే ఇసుక రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. నదులు, వాగుల దగ్గర నుంచి కొంతమంది అక్రమంగా తవ్వి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత రావడంతో ఒడిషా నుంచి విశాఖ ప్రాంతానికి అక్రమ రవాణా చేసి దండుకున్నారు.ఇసుక లారీ (18 టన్నులు)కి రూ.35 వేల నుంచి రూ.60 వేల వరకు ధర పలుకుతోంది. దీంతో కొన్నాళ్లుగా భవన నిర్మాణాలు తగ్గిపోయాయి. ఈ రంగంపై దాదాపు 45 లక్షల మంది ఆధారపడి ఉండటం గమనార్హం. తాపీ పని, రాడ్ బెండింగ్, ప్లంబింగ్..ఇలా 36 రకాల వృత్తుల వారు భవన నిర్మాణ రంగంలో ఉంటారు. ఇసుక లేకపోవడంతో మొత్తానికే ఎసరు వచ్చినట్టయింది. పనుల కోసం అడ్డాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇసుకను ఆన్ లైన్లో నేరుగా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినా అది ఎప్పుడు ఓపన్ అవుతుందో, ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియడం లేదని అంటున్నారు. పోనీ బుక్ చేసుకోగలిగిన వారికైనా ఇసుక ఉచితంగా వస్తుందా అంటే అదీ జరగడం లేదు.విజయవాడలో బ్లాక్‌లో 18 టన్నుల ఇసుక రూ.30 వేలు పలుకుతోందట. భీమవరంలో రూ.35 వేలు, తాడేపల్లి గూడెంలో రూ.35 వేలు, నరసాపురంలో రూ.26 వేల చొప్పున లారీ ఇసుకకు చెల్లించాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు లారీకి రూ.10 వేలకు పైగా అదనపు భారం పడుతోందని అంచనా. గతంలో భవన నిర్మాణ కార్మికులకోసం అంటూ గొంతు చించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు విప్పడం లేదు. సాక్షి మీడియాలో 18 టన్నుల ఇసుక ధర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ రకంగా ఉందీ తెలిపారు. అందులో అరకులోయ, పాడేరు వంటి చోట్ల అత్యధికంగా రూ. 54 వేలు ఉంటే, గుంటూరు రూ. 30 వేలు పలుకుతోందట.ఈ పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం చక్కదిద్దలేకపోతున్నదంటూ సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు సైతం వాపోతున్నారు. ఇక టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ఉచిత ఇసుక, ధరల మరక అంటూ కథనాన్ని ఇచ్చింది. ఇందులో కూడా పూర్తిగా నిజాలు రాయకుండా చంద్రబాబు భజన చేస్తూనే కొన్ని సమస్యలను ప్రస్తావించింది. ఉచిత ఇసుక ఉద్దేశం ఉత్తమమట. ఆచరణలో బాలారిష్టాలు ఎదురవుతున్నాయని ఆంధ్రజ్యోతి సన్నాయినొక్కులు నొక్కింది.ఐతే జిల్లా ఎడిషన్లలో మాత్రం కొద్దిపాటి వాస్తవాలు రాస్తున్నారు. ఉదాహరణకు భీమవరంలో లారీ ఇసుక రూ.30 వేల ధర పలుకుతోందని తెలిపారు. జగన్ టైమ్ లో రూ.18 వేలకే ఇసుక దొరికిందని అంగీకరించారు. సచివాలయాల్లో చలాన్లు తీసుకొని ఇసుక రవాణా చేసుకోవాలనే ప్రభుత్వం షరతు పెట్టినా దళారులు చలానాలు ముందే కట్టేసుకొని అధిక ధరలకు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. ఇసుక లారీల డ్రైవర్ల బాధలైతే ఇన్నీ అన్నీ కావు. రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతూ వారు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.ఐతే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ లో మాత్రం జగన్ పాలనలో జనం చుక్కలు చూశారంటూ అబద్ధాలు రాయడానికి ఆంధ్రజ్యోతి సిగ్గుపడలేదు. విశేషమేమిటంటే అప్పట్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చిన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని స్కామ్ చేశారంటూ టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగు వేల కోట్లకుపైగా ఆదాయం తెస్తే అది దోపిడీ అట. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు అడ్డంగా దోచేస్తే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక హామీ నిలబెట్టుకున్నారట. ఇలాంటి తప్పుడు రాతలతో జనాన్ని మోసం చేసే యత్నం చేస్తూనే ఆశించిన స్థాయిలో ప్రజలకు ఊరట కలగలేదని కొన్ని చోట్ల గతంకంటే ఇప్పుడే భారంగా మారిందని ఒప్పుకోక తప్పలేదు. ఉచితానికి నిర్వహణ చార్జీల గండం అని రాశారేగానీ, కూటమి నేతల దోపిడీని మాత్రం కప్పిపుచ్చారు. జీఎస్టీ వేయడంపైన జనం ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇసుక కోసమే ఇన్నిపాట్లు పడాల్సి వస్తుంటే ఇక మిగిలిన రంగాల సంగతి చెప్పనక్కరలేదు. మొత్తంమీద చంద్రబాబు ప్రభుత్వం ప్రజలమీద ఇసుకాసురులను ఫ్రీగా వదిలేసింది.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్ ప్రాయశ్చిత్తం.. అసలు దేనికోసం?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినందుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. ఇందులో ఆయన చిత్తశుద్ధి ఎంత ఆ వెంకటేశ్వరుడికే తెలియాలి కానీ.. ఆయన తన వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లు.. పశ్చాతాప పడినట్లు మాత్రం లేరు. జరగని తప్పును జరిగినట్లు చూపించేందుకు పోటీ పడుతున్న పవన్.. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణను పుట్టించింది.. ఆపై ప్రచారం చేస్తూ అపచారం చేస్తున్నదీ చంద్రబాబే అన్నది గుర్తించడం అవసరం. ఎందుకంటే.. ప్రాయశ్చిత్త దీక్షపై వస్తున్న కథనాలు చదివితే అవి.. బాబుకు వంత పాడేందుకు చేస్తున్నవే అన్న సందేహం రాకపోదు.లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో తానెక్కడ ప్రచారం పడిపోతానో అన్న ఆదుర్దాతో పవన్ ఈ దీక్ష హంగామా సృష్టిస్తున్నట్లు అనిపిస్తుంది. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలాగూ నెరవేర్చలేకపోయాం కాబట్టి.. ఆ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఈ డ్రామాకు లేవనెత్తారా? అన్నది సామాన్యుడి ఒక సందేహం.పోనీ.. లడ్డూ ప్రసాదంలో కల్తీని పవన్ కళ్యాణ్ నిజంగానే విశ్వసిస్తున్నాడని అనుకుందాం. స్వామివారిపై భక్తి కూడా నిజమే అని భావిద్దాం. అప్పుడు పవన్ కళ్యాణ్ ముందుగా చేయాల్సిన డిమాండ్ ఏమిటి? కల్తీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించి దోషులెవరో పట్టుకుని శిక్షించాలని కదా? తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలపై దాడు చేసి కల్తీకి సంబంధించిన ఆధారాలు సేకరించాలి కదా? పవన్ ఈ డిమాండ్లేవీ చేయడం లేదు ఎందుకని? నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి సంబంధించిన నెయ్యి నమూనాను పరిశీలించి నిర్దిష్టంగా ఫలానా కొవ్వు కలిసిందని పవన్ నమ్ముతున్నారా?.వెనకటికి దున్నపోతు ఈనిందని ఎవరో అంటే.. దూడను కట్టేయండని అన్నారట. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఘటనకు (ఒకవేళ నిజంగానే కల్తీ జరిగిందని అనుకుంటే) జగన్ ప్రభుత్వానికి ఆపాదించడం ఏమిటి? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాసి కోరినట్లుగానే బాబు, పవన్‌లు కూడా సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు?. ఆ మేరకు కేంద్రానికి లేఖ రాసి ఉండవచ్చు కదా?. పైగా.. తన ఆధీనంలోనే ఉండే సిట్ వేయడం వల్ల బాబుకు కలిగే ప్రయోజనం ఏమిటి?. టీటీడీ ఈవో లాంటి వారే ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా తన మాటలను రోజుకో తీరుగా మార్చేస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఉన్నతాధికారుల మాటలకు తగ్గట్టుగా నివేదిక సిద్ధం చేయరన్న గ్యారెంటీ ఏమిటి?.పాపం పవన్.. ఉపముఖ్యమంత్రిగా చంద్రబాబు వద్ద ఏదో నేర్చుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ.. వాస్తవానికి ఆయన అబద్ధాలు ఎలా చెప్పాలి? మాట తప్పడం ఎలా? వంటివే తన గురువు నుంచి ఒంటపట్టించుకుంటున్నట్లు అర్థమవుతోంది. అసలు విషయాలపై ప్రజల దృష్టిని ఎలా మళ్లించడం అన్న అంశంలో స్పెషలైజేషన్ చేస్తున్నట్లుంది. ఈ విద్య బాబుకు తెలిసినట్టుగా ఇంకొకరికి తెలుసునంటే నమ్మలేము. ఒకటో రెండు పాఠాలూ పవన్‌కూ అబ్బినట్లు కనిపిస్తోంది.కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా ఫలానా మంచి పని చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేక చంద్రబాబు ఈ డ్రామాను సృష్టించారనిపిస్తుంది. సూపర్ సిక్స్ హామీలు ఎప్పటికి నెరవేర్చుతారో చెప్పలేకపోతున్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గప్పాలు పలికిన వీరు ఇప్పుడు నిమ్మకు నీరెత్తారు. చంద్రబాబు అయితే ప్రైవేటీకరణకు అనుకూలంగా గొంతు సవరించుకుంటున్న తీరుపై కార్మిక సంఘాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఈ అంశాలన్నింటీ నుంచి ప్రజల దృష్టిని తప్పించేందుకే బాబు లడ్డూ ప్రసాదం అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నట్లు అర్థమవుతోంది.ఇటీవల విజయవాడకు వచ్చిన వరదల్లో కేవలం తాను నివసిస్తున్న అక్రమ కట్టడాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబు లక్షలాది సామాన్యులను నీట ముంచాడని ప్రజలకూ ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇలాంటి వాటన్నిటిని మర్చిపోయేలా చేయాలంటే ఏదో పెద్ద అంశాన్నే లేవనెత్తాలని అనుకుని మరీ తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో రాజకీయం మొదలుపెట్టారు. చంద్రబాబు లాంటి వారికి దేవుడిపై నిజంగానే నమ్మకం ఉంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే, తిరుమలతోపాటు రాష్ట్రం పరువు పోయేలా కల్పిత గాథలను జనంలోకి వదులుతారా?. చివరికి టీడీపీ మీడియా కానీ, టీడీపీ సోషల్ మీడియా కానీ దారుణమైన, నీచమైన అసత్యాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుందా?నెయ్యిలో కల్తీపై జూలై 23న నివేదిక వచ్చిందని చెబుతున్నారు కదా! నిజాయితీ ఉన్న పాలకులు అయితే ఏమి చేయాలి? వెంటనే సంబంధిత సంస్థపై దర్యాప్తునకు ఆదేశించాలి. దాడులు చేసి ఆధారాలు సేకరించాలి. సాక్ష్యాలు దొరికితే అరెస్టులు చేయాలి. అలాకాకుండా రెండు నెలలు ఏమీ తెలియనట్లు ఉంటారా? ఆ తరువాత తీరికగా.. వైఎస్ జగన్‌పై నీచమైన అభాండాలు వేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తారా?. వైఎస్ జగన్‌పై రాజకీయ ద్వేషం ఉంటే వేరే రీతిలో తీర్చుకోవాలి. అంతేకానీ తిరుమలను అడ్డుపెట్టుకుని ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా?. కల్తీ జరిగి తిరస్కరించామని చెబుతున్న తమిళనాడు కంపెనీ నుంచే మళ్లీ నెయ్యి తీసుకుంటామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు చెప్పడం ఏమిటి? ఇంకోపక్క మంత్రి లోకేష్ టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని చెబుతారు. మీ పాలనలో టీటీడీలో తప్పు జరిగితే దానికి బాధ్యత ఆ సంస్థదే. అటువంటప్పుడు జగన్ పాలనలో తప్పు జరిగితే బాధ్యత ఎవరిది? ఇదెక్కడి తర్కం?.కోట్ల మంది స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అపవిత్రమైందో లేదో తెలియదు కానీ.. పవన్, లోకేష్, చంద్రబాబుల మాటలు, చేష్టలతో మాత్రం కచ్చితంగా అయ్యిందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనసుల్లో ఇప్పుడు వీరు అనుమానాలు లేవనెత్తారు. వాస్తవానికి చంద్రబాబు, పవన్‌లు ఏం కోరుకుంటున్నారు?. తిరుమలలో లడ్డూలు కల్తీవి సరఫరా చేస్తున్నారని డప్పు వేసి చెప్పాలన్నది, ప్రచారం చేయాలన్నది వీరి అభిమతమా? తద్వారా తిరుమలకు భక్తులు తిరుమలకు రాకుండా, లడ్డూలు తినకుండా చేయాలన్నది ఉద్దేశమా? తిరుమలకు ఎంత అప్రతిష్ట వచ్చినా ఫర్వాలేదు కానీ.. వైఎస్ జగన్ బద్నాం కావాలనే వీరు పట్టుపట్టి పనిచేస్తున్నారా?.గతంలో రథాలు తగులు పెట్టారని, దేవాలయాలపై దాడులు జరిగాయని పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వాటిపై సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశిస్తే కేంద్రం ఎందుకు వేయలేదో ప్రశ్నించరు. నిజానికి సోషల్ మీడియాలో ఈయనపై వస్తున్న కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంత హిందూ మతోద్దారకుడినని చెప్పుకునే ఈయన వేరే మతానికి చెందిన మహిళను ఎలా పెళ్లి చేసుకున్నారు? పోనీ చేసుకుంటే చేసుకున్నారు. వారికి పుట్టిన బిడ్డలలో ఒక్కరికి కూడా హిందూ పేరు పెట్టకుండా అన్యమత పేర్లు ఎందుకు పెట్టారని కొందరు అడుగుతున్నారు.అంతేకాదు.. చంద్రబాబు గోదావరి పుష్కర స్నానాలకు వెళ్లి షూటింగ్ పెట్టుకుని తొక్కిసలాటకు కారణమై ఇరవై తొమ్మిది మంది మరణిస్తే అందులో పాపం ఏమి లేదా? అప్పుడు పవన్ నోరు విప్పలేదే!. ఇవన్నీ కాదు.. తన వ్యక్తిగత జీవితంలో భార్య ఇంటిలో ఉండగానే వేరే మహిళను తీసుకు వచ్చి కాపురం చేశారన్న ఆరోపణపై ఎన్నడైనా ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదేదో వేరేవారు అంటే నమ్మలేం. స్వయంగా ఆయన మాజీ భార్యే ఈ విషయం వెల్లడించారే!.పవన్ శిష్యుడు వంటి జానీ మాస్టర్ తాజాగా రేప్ కేసులలో ఇరుక్కుంటే ఆయన ఎందుకు నోరు విప్పి మాట్లాడలేదు. తను పవన్ స్పూర్తితోనే ప్రయాణం చేస్తున్నానని జానీ మాస్టర్ చెబుతుంటే, అతనికి సామాజిక స్పృహ ఉందని ఈయన సర్టిఫికెట్ ఇచ్చారు. వలంటీర్లను కిడ్నాపర్లుగా పోల్చి ముప్పైవేల మంది యువతులకు తరలించారని నీచమైన ఆరోపణ చేశారే. దానిని రుజువు చేయలేకపోయారే. ఇలాంటి వాటికి కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి! బొట్టు పెట్టుకుని, కాషాయ శాలువా కప్పుకుంటే పవిత్రులై పోరు. నిజ జీవితంలో కూడా పవిత్రంగా ఉండాలి. పవన్ ఇది గుర్తిస్తే మంచిది!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు?
కాలం ఎప్పుడూ ఒక్క తీరున ఉండదంటారు పెద్దలు. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఒకప్పుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ చిన్న ఘటన జరిగినా దబాయిస్తూ.. గదమాయిస్తూ రంకెలు వేసిన పవన్ కళ్యాణ్ స్వరం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు మూగ పోయింది మరి!. కూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా ఆయన పెదవి అస్సలు విప్పడం లేదు.టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ విషయమే తీసుకుందాం. తోటి కొరియోగ్రాఫర్‌ను జానీ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. టాలీవుడ్ నటులు చాలా మంది దీనిపై స్పందించారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తనకేమీ పట్టనట్టుగానే ఉన్నాడు. రెండేళ్లుగా తనను జానీ వేధిస్తున్నాడని, అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆ జూనియర్ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ కూడా ఆరోపణలను పునరుద్ఘాటించడం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన వ్యక్తి కావడం గమనార్హం.పూనమ్ కౌర్ గతంలో పవన్ కళ్యాణ్‌పై స్వయంగా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కానీ, రాజకీయ నేపథ్యం లేకపోవడం వల్లనో, సినీ పరిశ్రమలో తగినంత పలుకుబడి లేదనో తెలియదు కానీ ఆ అభియోగాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కొందరిపై అడప దడపా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పటికీ పెద్దలు కొందరు కల్పించుకుని ఏదోలా మేనేజ్ చేసి రక్షిస్తుంటారని పుకార్లు ఉన్నాయి.తెలుగుదేశం ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడి బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం కూడా అలాంటిదే అనుకోవాలి. ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినా ఆయన జైలుకు వెళ్లకుండా పలుకుబడి కలిగిన వాళ్లు కాపాడినట్లు చర్చ ఇప్పటికీ నడుస్తూంటుంది. ‘ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి..’ అంటూ బహిరంగ వేదికపైనే వ్యాఖ్యానించినా మహిళా సంఘాలు పెద్దగా ఆక్షేపించింది లేదు. పైగా ఆయన అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ తిరుగుతుంటారు. పైగా హిందూపురం ప్రజలు ఆయనను మూడుసార్లు శాసనసభకు ఎన్నుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మహిళల విషయంలో చులకన భావంతో వ్యాఖ్యలు చేసే, అనైతిక చర్యలకు పాల్పడే వారి విషయంలో తప్పు ఎవరిదంటే.. ప్రజలదనే చెప్పాలి. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వారిది కాదనే అనుకోవాలి.ఈ ఘటనలన్నీ తెలుగు సినిమా రంగంలోని వికృత, వికారపు చేష్టలకు అద్దంపట్టేవే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై వచ్చిన మత్తుమందు వాడకం ఆరోపణలు, రాజ్‌తరుణ్, అతడి సహజీవన భాగస్వామి మధ్య జరిగిన రచ్చ, ఆ తరువాత ప్రియురాలితో గొడవ వంటివి సినీ అభిమానులకు కనువిప్పు కావాలి. ఒక హత్య కేసులో కన్నడ సినీ హీరో దర్శన్‌ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేయడం ఆ రాష్ట్రంలో సంచలనం రేపింది. కేరళలో ‘హేమ కమిటీ’ నివేదిక సృష్టించిన కలకలం కూడా ఇంకా సద్దుమణగలేదు. మళయాల సినీ రంగంలో ప్రముఖ హీరోలు, నటులు మహిళా నటుల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో ఈ నివేదిక బట్టబయలు చేసింది. మోహన్ లాల్ వంటి ప్రసిద్ధ నటుడు ఈ నివేదిక నేపథ్యంలో తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది.ఇక, తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. గత ప్రభుత్వ హయాంలోనూ పలువురు ప్రముఖ నటులు మత్తుమందుల వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్నారు. కానీ, వారు ఎలాగోలా మేనేజ్ చేసుకున్నారని చెబుతారు. సినిమాల్లో నీతులు చెప్పడం, హీరోయిజం ప్రదర్శించడం వేరు. వాస్తవ జీవితంలో వారు వ్యవహరించే శైలి వేరని అనేక మార్లు రుజువవుతున్నా కొంతమంది కులం పేరుతోనో, లేక ఇతరత్రా అభిమానం పేరుతో విపరీతంగా ఆరాధించడం బాధాకరం. సినిమాను వినోదంగా చూసి సరిపెట్టుకోలేని అభిమానుల బలహీనతను నటులు కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తద్వారా రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొంది కథలు చెబుతున్నారు. అలాంటి వారిలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు కూడా పలువురు ప్రముఖంగా ప్రస్తావిస్తుంటారు.పవన్ కళ్యాణ్ తన కళ్ల ముందే ఇంకో మహిళతో కాపురం చేశారని ఆయన రెండో భార్య రేణూ దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో చెబితే.. అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. పవన్ చేసింది తప్పని మాత్రం అనలేకపోయారు. దానికి తోడు ఒక సామాజిక వర్గం పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తోందన్న బలహీనత నుంచి లబ్ధి పొందేందుకు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవం మొత్తాన్ని వాడుకుని మరీ వ్యూహాలు పన్నాడు. ఎలాగైతేనేం.. వీళ్లిద్దరూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకైతే వచ్చారు. ఆ తరువాతి నుంచి ఏపీలో మహిళలపై ఎన్ని అత్యాచారాలు, దాష్టీకాలూ జరిగినా పవన్ కళ్యాణ్ నోరు పెగలడం లేదని విమర్శకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీకి జానీని దూరం పెట్టినట్లు ఒక ప్రకటనైతే వచ్చింది కానీ.. పవన్ కళ్యాణ్‌తో అతడికి ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిపే అంశాలు ప్రచారంలోకి రావడంతో పార్టీతోపాటు పవన్ పరువు కూడా పోయినట్లు అయ్యింది. పవన్ కల్యాణ్‌కు సంబంధించి జానీ ఒక ట్వీట్ చేస్తూ ‘మీ ప్రోత్సాహంతో మొదలై, మీ స్ఫూర్తితో కొనసాగుతున్న ప్రయాణమిది. అందరి ఆశీస్సులతోపాటు మీ అభినందనలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి. పవన్ కల్యాణ్ అన్నా’ అని వ్యాఖ్యానించాడు. ఒక అవార్డు వచ్చిన సందర్భంగా సామాజిక స్పృహ కలిగిన కళాకారుడు జానీ అని పవన్ కళ్యాణ్ మెచ్చుకోవడం విశేషం. అంతేకాకుండా తాను చేసిన పలు చిత్రాలకు జానీ పని చేశాడని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కూడా ఉన్నాడని గుర్తు చేసుకున్నారు.అవార్డు వచ్చినందుకు పొగిడితే తప్పులేదు కానీ, సామాజిక స్పృహ ఉందనడం, అసలు పని చేయని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఉన్నాడని చెప్పడం ద్వారా వారిద్దరి చిరకాల స్నేహ సంబంధాలు అందరికీ తెలిశాయి. జానీ ఇప్పుడు ఒక జూనియర్ డాన్సర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారన్న అభియోగానికి గురి కావడం సామాజిక స్పృహ ఎలా అవుతుందన్న ప్రశ్న వస్తోంది. పైగా పవన్ స్ఫూర్తితో ప్రయాణిస్తున్నానని జానీ అంతకు ముందు వ్యాఖ్యానించిన వైనం కూడా పవన్‌కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు అందరికీ తెలిసినవే.ఇక, 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో సుగాలీ ప్రీతి అనే యువతి హత్య కేసును వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు పవన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏపీలో వాలంటీర్లుగా పని చేస్తున్న సామాన్యులను అమ్మాయిల కిడ్నాపర్లుగా పోల్చి దారుణంగా అవమానించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మాయిల కిడ్నాప్ గురించి నోరెత్తితే ఒట్టు. అంతే కాదు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే కొంతమంది జనసేన వారు హింసా కాండకు దిగినా, మహిళలపై సైతం రాక్షసత్వంగా వ్యవహరించినా పవన్ కనీసం ఎప్పుడూ ఖండించలేదు. ముచ్చుమర్రి అనే గ్రామంలో ఒక బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ బాలికను హత్య చేసి కృష్ణానదిలో పారేసినా పోలీసులు ఆ భౌతికకాయం ఎక్కడుందో కనిపెట్ట లేకపోయారు. కొద్ది రోజుల క్రితమే మంత్రి లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరిలో రెండు అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే గత నాలుగు నెలల్లో మహిళలపై జరిగిన అకృత్యాల సంఖ్య ఎక్కువే. అయినా పవన్ కల్యాణ్, చంద్రబాబు సరైన రీతిలో స్పందించడం లేదు. కానీ.. పలువురిని మోసం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై నటి ఒకరిని అడ్డం పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారులను కనీస నిబంధనలు పాటించకుండా సస్పెండ్ చేయడం బహుశా ఏపీలో మాత్రమే జరిగి ఉంటుంది.గతంలో ఓటుకు నోటు కేసులోనో లేక స్కిల్ స్కామ్లోనో తనను పట్టుకున్నారన్న కోపంతో పీఎస్ఆర్ ఆంజనేయులుపై చంద్రబాబు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశారని అదే పార్టీకి చెందిన ఒక మహిళా నేత నేరుగా ఆరోపించినా ఆయన్ను అరెస్ట్ చేయకుండా సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఆ కేసును మేనేజ్ చేసే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై సైతం పవన్ కల్యాణ్ కనీసం ప్రశ్నించలేదు. వీటన్నిటి బట్టి అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ ఎలా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చని, తన అభిమానులకు ఆయన ఎలాంటి స్ఫూర్తిని అందిస్తున్నదని తెలుసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా కేవలం సినిమా నటులు అన్న పిచ్చి అభిమానంతో వారు ఎన్ని అరాచకాలు చేసినా, కొన్ని హేయమైన పనులకు పాల్పడినా వారిని తమ దేవుళ్ల మాదిరి చూసుకోవడం తప్పో కాదో అభిమానులే నిర్ణయించుకోవాలి.కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చిల్లర రాజకీయాలే బాబు మార్గమా?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ మరీ చిల్లర రాజకీయాలకు దిగుతున్నట్లు అనిపిస్తోంది. తమ తప్పులను వైఎస్సార్‌సీపీపైకి తోసివేయాలన్న యావతో ఇలా జరగుతున్నట్లు ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత, మూడుసార్లు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ చిల్లర రాజకీయాలకు తెర తీయడం విచారకరమైన విషయం. విపక్షంలో ఉండగా కూడా ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. వైసీపీపై అనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారానికి దిగడానికే బాబు అండ్ కో ప్రాధాన్యమిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అధికారం పోయినందుకు ఇలా చేస్తున్నారేమో అనుకున్నాం కానీ.. అది దక్కిన తరువాత కూడా పెడధోరణల్లో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు ఇంకొంచెం దిగజారి మరీ వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం విజయవాడను వరద ముంచెత్తింది మొదలు.. ఒకవైపు బాధితులు నానా పాట్లు పడుతున్నా వాటిని కాదని.. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపై తుచ్ఛ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం వర్గం వారు. బోట్లు కొట్టుకు రావడం వెనుక జగన్ కుట్ర ఉందన్నది పిచ్చి ఆరోపణ కాకపోతే ఇంకేమిటి? వరద బాధితులను సకాలంలో ఆదుకోలేకపోయిన తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఎదుటివారిపై ఎంతటి దారుణమైన ఆరోపణలు చేయడానికైనా చంద్రబాబు వెనుకాడరు. పిల్లనిచ్చిన మామ పైనే ఎన్నో ఆరోపణలు చేసిన విషయం గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన ప్లేట్ మార్చి ఉండవచ్చు. అది వేరే విషయం. తరువాతి కాలంలో బాబు తన విమర్శలను వై.ఎస్.రాజశేఖర రెడ్డిపై ఎక్కుపెట్టారు. ఆయనపై పలు నిందలు మోపేవారు. రాజకీయంగా ఎవరు తనకు ప్రధాన ప్రత్యర్థి అవుతారో వారిపై ఎల్లో మీడియా అండతో విరుచుకుపడటం చంద్రబాబుకు తెలిసిన విద్య. కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైనా వారిపై అడపదడప చిన్న మాట అనడం మినహా ఘాటైన విమర్శలేవీ లేకపోవడం ఈ విషయాన్ని రుజువు చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో ఓటింగ్ నుంచి తప్పుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించారు కూడా. అదే సమయంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ పై మాత్రం అప్పటి నుంచే నానా రకాల ఆరోపణలు చేస్తూ అప్రతిష్ట పాలు చేసేందుకు విశ్వయత్నం చేశారు. భవిష్యత్తులో జగన్ గట్టి నాయకుడు అవుతాడని, ప్రజాబలం పొందుతారని ఆయన అప్పుడే ఊహించడం ఇందుకు కారణం. నిప్పుకు గాలి తోడైనట్లు.. బాబు వికృత రాజకీయాలకు రామోజీ రావు, రాధకృష్ణ వంటి మీడియా అధినేతలు మరింత ఆజ్యం పోశారు. అయినా సరే.. అన్ని కుట్రలను తట్టుకని జగన్ అధికారంలోకి రాగలిగారు. ఈ విషయాన్ని సహించలేకే.. జగన్‌పై అధికారంలో ఉన్నన్ని నాళ్లూ ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేసింది. 2024లో వైఎస్ జగన్ అన్యూహ ఓటమి తర్వాత కూడా తన పంథాను మార్చుకోలేదు. ఇప్పటికీ ఎల్లో మీడియా, చంద్రబాబులు ఇద్దరూ నిత్యం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికల్లాంటివి ఏవీ లేకుండా బుడమేరు గేట్లను అకస్మాత్తుగా ఎత్తి వేయడం.. ఫలితంగా ముంపునకు గురైన విజయవాడలో బాధితులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేకపోవడం వంటి తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు పడవలు బ్యారేజీకి కొట్టుకు రావడం జగన్ కుట్ర అన్న నీచ రాజకీయాలకు తెరతీశారు. ప్రకాశం బ్యారేజీకి దూరంగా ఇసుక రీచ్ ల వద్ద ఉన్న బోట్లు వరదల వల్ల కొట్టుకు వచ్చిన విషయాన్ని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామా నాయుడు చెప్పిన విషయం గమనార్హం. పడవలకు లంగరేయకుండా.. ప్లాస్టిక్ తాడుతో కట్టారని వరద ఉధృతికి అవి తెగిపోయి కొట్టుకొచ్చాయని కోటిన్నర విలువైన పడవల విషయంలో ఎవరైనా ఇలా నిర్లక్ష్యంగా ఉంటారా? అని కూడా మంత్రిగారు ప్రశ్నించారు. కాకపోతే ఆ పడవలు వైసీపీ వాళ్లవని ఆరోపించారు. తీరా చూస్తే ఆ పడవల యాజమాని ఉషాద్రి పక్కా తెలుగు దేశం నేతగా తేలింది. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమలకు సన్నిహితుడు అని స్పష్టమైంది. ఆ పడవలకు అనుమతులు కూడా తెలుగుదేశం హయంలోనే లభించాయి. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచాక ఈ పడవల్లోనే విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించారు. నాలుగు నెలలుగా కృష్ణా ఒడ్డునే పడవలకు లంగరు వేస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడు అయిన రామ్మోహన్ టీడీపీ ఎన్నారై నేత జయరాం సోదరుడి కొడుకు. విశేషం ఏమిటంటే.. టీడీపీకి చెంది ఆలూరు చిన్న పేరు ప్రస్తావించకపోవడం! మిగతా ఇద్దరిని వైసీపీ వర్గీయులుగా ప్రచారం చేశారు. ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీకి కొట్టుకురావడం యాధృచ్చికం అని నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు చెబుతూ వచ్చినా, ప్రభుత్వ నేతల సూచనలతో వారు కూడా కొత్త పల్లవి అందుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా రాజద్రోహం కేసు పెట్టాలని కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశించారట. చంద్రబాబు ఈ గాత్రం ఆరంభించగానే హోంమంత్రి అనిత తదితరులు పల్లవి అందుకుని ఇదే ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిజానికి వరదల వల్ల ఈ బోట్లతోపాటు వందల బోట్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కొన్ని చిన్న బోట్లు బ్యారేజీ స్పిల్ వే నుంచి బయటకు కొట్టుకుపోయాయట. బలమైన ప్లాస్టిక్ తాళ్లు వేయడం కొత్త కూడా కాదని అమరావతి బోటింగ్ క్లబ్ వీటిని సభ్యులకు సరఫరా చేస్తుందని తెలిసింది. అయినాసరే.. చంద్రబాబు మొత్తం విజయవాడలో మునిగిన లక్షలాది మంది బాధలను, తనపై వస్తున్న వైఫల్య విమర్శలను దారి మళ్లించడానికి ఈ కుట్రను ప్లాన్ ను చేసినట్టు ఉందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే బోట్లకు నీలం రంగు ఉంటే అవి వైసీపీవే అని ఆయన చెబుతున్నారు. బోట్లపై నీలం రంగు మీద పసుపు రంగు ఉన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పరు!! టీడీపీ జెండాలతో ఊరేగింపులు జరిగిన విషయాన్ని దాచేస్తారు. బుడమేరు రెగ్యులేటరీ గేటు ఎత్తితే వరద వస్తుందని తెలుసని, హెచ్చరికలు చేసినా, జనం వినిపించుకోరని భావించామని ఒక సీనియర్ అధికారే స్వయంగా చెప్పారు. అంటే బుడమేరు వరద రావడంలో ప్రభుత్వ కుట్ర ఉందని స్పష్టమవుతోంది కదా. దానికి కారణం ఈ నీరు కృష్ణా నదిలోకి వెళితే అక్కడ కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి మరింత వరద తాకిడి ఉంటుందని, కరకట్ట దాటి అమరావతిని ముంచేత్తుందని భయపడి బుడమేరు వరద సృష్టించారని వైసీపీ ఇప్పటికే ఆరోపించింది. ఇదే వాస్తవమని జనం నమ్ముతున్నారు. అలాగే ఒక మీడియా అధిపతి పవర్ ప్లాంట్ కు కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి బుడమేరు గేట్లు ఎత్తివేశారన్న ప్రచారమూ ఉంది. మొత్తం వ్యవహరం చూస్తే బుడమేరు వరద మానవ తప్పిదం అని, కుట్ర పూరితం అని ప్రజలు నమ్ముతున్నారని అనిపిస్తోంది. అందుకే సుమారు 60 మంది వరకు మరణించిన ఈ విషాద ఘటనలో చంద్రబాబుపై కేసు పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ డిమాండ్ చేశారు. దాన్ని కప్పిపుచ్చడానికే బోట్ల కుట్ర అంటూ ఒక కల్పిత గాధను ప్రచారం చేశారని విశ్లేషణలు వస్తున్నాయి. కాగా బుడమేరులో అక్రమణలు తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విశేషం. ముందుగా కరకట్ట మీద తన అక్రమ నివాసాన్ని కూల్చకుండా, వేరేక్కడో నిర్మాణాలు కూల్చుతాం అంటే జనం నవ్విపోరా? విమర్శించారా? పదిరోజుల తర్వాత చంద్రబాబు కలెక్టరేట్ నుంచి తిరిగి తన కరకట్ట ఇంటికి వెళ్లారు. అంటే తన ఇంట్లో చేరిన వరద నీటిని శుభ్రం చేసుకోవడానికి ఆయనకే పది రోజుల పడితే... బుడమేరు వరదల్లో కూరుకుపోయిన విజయవాడలో సామన్యుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే అనేక చోట్ల డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని జనం వాపోతున్నారు. అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఆహ...ఓహో అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి భజన చేస్తూ జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ఇది ప్రజలకు ద్రోహం చేయడం కాదా ? ఇది కుట్ర కాదా?.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హద్దులు దాటిందెవరు?.. మోసం చేసిందెవరు??
మెగాస్టార్‌గా పేరోందిన ప్రఖ్యాత నటుడు చిరంజీవి కుటుంబం, ఆయన బంధువుల మద్య విభేదాలు ఏర్పడ్డాయా? అనే చర్చ అటు సినీ వర్గాల్లోను.. ఇటు రాజకీయ వర్గాల్లోను జోరుగా సాగుతోంది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమానులకు, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మరో స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మధ్య తీవ్రస్థాయిలో రగడ జరుగుతోంది. దీనికి తొలుత పవన్ కళ్యాణే అజ్యం పోయడం విశేషం. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అర్జున్ ఏమైన పుడింగా అంటూ ప్రశ్నించారు. ఆయనకు తోడుగా మరికొందరు జనసేన నేతలు సైతం అర్జున్ను కించపరుస్తూ విమర్శలు కురిపించారు. దీంతో మెగా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి అనే అభిప్రాయం వచ్చింది. చిరంజీవి సినిమాల్లో స్వయంగానే ఎదిగినా, ఆయన మామ మరో ప్రఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య ప్రభావంతో కూడా బాగా అభివృద్ది చెందారు. అల్లు రామలింగయ్య కుమార్తెను ఆయన వివాహం ఆడారు. బావ మరిది అల్లు అరవింద్‌తో కలిసి పలు హిట్ సినిమాలు తీశారు. చిరంజీవి, అల్లు అరవింద్‌లు ఒక బ్రాండ్‌గా మారారు. ఆ తర్వాత కాలంలో.. చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్‌లు సినీరంగంలోకి రాగా... పవన్ కల్యాణ్ ఒక క్రేజ్ తెచ్చుకున్నారు. తదుపరి తరంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ సినీరంగంలోకి వచ్చి వెలుగొందుతున్నారు. ఇదే కుటుంబంకు చెందిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినీ రంగంలో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. మరోవైపు అల్లు అరవింద్ పెద్ద నిర్మాతగా పెరగడమే కాకుండా, ఆయన కుమారుడు అల్లు అర్జున్ స్టార్ హిరో అయ్యారు. మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల్లోకి వెళ్లారు. గెలుపు ఓటములు చవిచూశారు. అల్లు అర్జున్ రాజకీయాల జోలికి వెళ్లలేదు. కానీ.. ఈ మధ్య నంద్యాలలో ఎన్నికల సమయంలో తన స్నేహితుడు అయిన వైఎస్సార్సీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి వెళ్లి వచ్చారు. కాని అక్కడ ఆయన ఎన్నికల ప్రచారం చేసింది లేదు. ఆయన రాక తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు. అది పవన్ కల్యాణ్‌కు జనసేన మద్దతుదారుల కోపానికి కారణం అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో కూడా అర్జున్ వెళ్లివచ్చినా అప్పుడు విమర్శలు రాలేదు. ఈ సారి ఎందుకో పవన్ కళ్యాణే పరోక్షంగా బయటపడిపోయారు. బెంగుళూరులో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి హోదాలో మాట్లడుతూ, కలప స్మగ్లింగ్ ప్రస్తావన తెచ్చారు. ఆ క్రమంలో సినీ హీరోలు స్మగర్ల పాత్రలు వేస్తున్నారని అక్షేపణ తెలిపారు. ఇది అల్లు అర్జున్ను ఉద్దేశించే అని, అయనపై ద్వేషంతోనే పవన్ కల్యాణ్ మాట్లాడారని అర్జున్ అభిమానులు భావించారు. .. దానిపై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో సాగాయి. దీనికి అల్లు అర్జున్ పరోక్షంగానే సమాధానం ఇస్తూ... తాను తన మిత్రుల కోసం తగ్గేదేలే అని స్పష్టం చేసారు. దీనితో పవన్ అభిమానులు మరింత అగ్రహం చెందారు. ఆ టైంలో అల్లు అర్జున్‌కు మద్దతుగా మామ చంద్రశేఖర్ రెడ్డి టీవీలకు ఇంటర్వూలు ఇచ్చారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. హద్దులు దాటి మాట్లాడారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అని ప్రశ్నించారు. అయనకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు?ఉన్నదంతా మెగా ఫ్యాన్స్. బ్రాంచీలు, షామియానా కంపెనీల గూరించి తెలియదంటూ ఏవేవో మాట్లడేశారు. దీంతో ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. అల్లు అర్జున్ ఒక్క చోటకు వెళితే అక్కడ కూడా ఓటమే జరిగిందని... ఆయన తండ్రి అరవింద్‌ను గతంలో అర్జున్ గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. నిజానికి బొలిశెట్టి ఇలా రియాక్ట్ కానక్కర్లేదు. అర్జున్‌కు కొంత మెగా బ్రాండ్ ఉపయోగపడితే ఉపయోగపడి ఉండవచ్చు. అలాగని ఆయన తండ్రి అరవింద్‌కు ఉన్న సామర్థ్యం తెలియనిది కాదు. ప్రముఖ నిర్మాతగానే కాకుండా సినిమా ఫీల్డ్‌లోని ఇతర విభాగాలలో ఆయనకు చాలా పట్టు ఉంది. అరవింద్ కావాలనుకుంటే అర్జున్‌తో ఎన్నో సినిమాలు నిర్మించగలరు. అలాగే.. అర్జున్‌కు సినీ రంగంలో ఎంతో డిమాండ్ ఉంది. జనసేన నేతలు అలాంటి వ్యక్తిని బెదిరించడం సబబు కాదు. మరో జనసేన నేత అయితే అల్లు అర్జున్ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తామని రెచ్చిపోయారు. ఇది చాలా తప్పు. రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ఆ సంగతి విస్మరించి మాట్లాడితే దానివల్ల పవన్ కల్యాణ్‌కు కూడా నష్టం జరగవచ్చు. కేవలం పవన్ మెప్పు కోసం బొలిశెట్టికాని మరికొందరు కాని అలా మాట్లాడినట్టు అనిపిస్తోంది... అర్జున్ నంద్యాల వెళితే అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్ధి గెలవలేదని వీరు ఎత్తిపొడిచారు. అది ఎలా ప్రామాణికం అవుతుందో అర్థం కాదు. ఆ మాటకు వస్తే, ఎన్నికలలో ఇంతకుముందు చిరంజీవి ఒక చోట, పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. అంత మాత్రాన వారికి అభిమానులు లేరని, పలుకుబడి లేదని ఏవరైన అన్నారా?. సినిమా పాత్రలకు రాజకీయ పాత్రలకు సంబంధం పెట్టదలిస్తే పవన్ కల్యాణ్ సంబంధించి ఎన్నో ఉదాహరణలు దోరుకుతాయి. అయన తన సినిమాల్లో అడపిల్లలను సరాదాగా అయినా వేధించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తప్పు పట్టగలమా? చిరంజీవి నెగెటివ్ రోల్స్ కూడా పోషించారు. మరి సినిమా హిరోలు ఎవరూ అలాంటి పాత్రలు పోషించకూడదు అన్నది పవన్ అభిప్రాయం అయితే.. ఇక నుంచి ఆయన అలాంటి పాత్రలు వేయకూడదు. ఆ మాటకు వస్తే.. సినిమాల్లో హిరోగా ఎన్నో డైలాగ్‌లు చెప్పిన అయన రాజకీయాల్లో పూర్తి విరుద్ధంగా అబద్ధాలు, మాటలు మార్చడం వంటివి ఎన్నో చేస్తున్నారు. అనేక విషయాల్లో పొంతన లేకుండా మాట్లడుతున్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసపూరిత హమీలు ఇచ్చారు. అదర్శాలు వల్లించే ఒక సినీ హిరో ఇలా మోసం చేయవచ్చా? అంటే ఏమని సమాధానం ఇస్తారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో సినీ, రాజకీయ రంగం మధ్య సంబంధాలు పెరిగాయి. ఎన్టీఆర్ కంటే చంద్రబాబు సినిమా వాళ్లను ఎక్కువగా వాడుకోగలిగారని అంటారు. కోట శ్రీనివాస్ రావు అప్పట్లో ఒక రాజకీయ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తే, ఆయన అభిమానులు ఆయనపై దౌర్జన్యం చేసారు. ఆ సంగతి తెలిసిన ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు, కృష్ణకు రాజకీయాల్లో అసలు పడేది కాదు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ విజయ నిర్మల ప్రచారం చేశారు. చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి విభిన్నమైన పాత్రల్లో నటించిన రోజా వైఎస్సార్సీపీ పక్షాన ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. రాజకీయంగా పరస్పర విమర్శలు కూడా సాగాయి. గతంలో మాగుంట సుబ్బిరామి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసినప్పుడు అయనతో వ్యక్తిగత సంబంధాల రిత్యా కొంత మంది సినీ నటులు ప్రచారం చేసేవారు. చిరంజీవి కూడా అలాగే కొందరికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికి ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నట్టుగా లెక్క. కాని ఇటీవలి ఎన్నికలలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, బీజేపీ అభ్యర్ధి సియం రమేష్‌కు ఓపెన్‌గా మద్దతు ఇచ్చారు. మరి దాన్ని సమర్ధించాలా... తప్పుబట్టాలా?. గతంలో విజయశాంతి ఒంగోలులో సుబ్బిరామిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. సినీనటి సౌందర్య రాజకీయాల్లో లేకపోయినా బీజేపీకి ప్రచారం చేయడానికి వస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇలా రాజకీయ, సినీ రంగాలకు అవినాభావ సంబంధాలు కొనసాగుతున్నాయి. అంత మాత్రన వారు నటించిన పాత్రలకు, వారు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు లింక్ చేసి విమర్శించడం అర్థ రహితమే కావచ్చు.ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయన్న భావన వస్తుంది. గతంలో పవన్‌కు, చిరంజీవి, నాగబాబులకు మధ్య గ్యాప్ వచ్చిందని అనేవారు. నాగబాబు అయితే నేరుగా పవన్ అభిమానులపై చిరాకుపడ్డారు. కానీ ఆ తర్వాత వీరంతా కలిసిపోయారు. ఇప్పుడు కూడా అలాగే జరగవచ్చు. అల్లు అర్జున్ తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి, వీళ్లతో రాజీపడతారా? లేదా? అనేది అప్పుడే చెప్పలేం. ఇవి అన్నీ పరిశీలిస్తే పవన్ కల్యాణ్ అభిమానులు ఈ మధ్య మరీ రెచ్చిపోయి ఇలాంటి కామెంట్ల రూపంలో పిచ్చి పనులు చేస్తున్నారేమో అనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు పాలన అనుభవం లేదంటూ మాట్లాడి పరువు తీసుకున్నారు. ముందు ఆయనకు తన అభిమానులుగాని, జనసేన కార్యకర్తలు కాని తగు సలహాలు ఇచ్చి, ఆ తర్వాతే ఇంకెవరి జోలికైనా వెళితే బెటర్.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్.. కేసీఆర్ ప్యూచర్ ప్లాన్ ఏంటి?
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, ఏడుసార్లు గెలుపొందిన ఎన్నికైన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి జంప్ చేయడం భారత రాష్ట్ర సమితికి పెద్ద దెబ్బే అవుతుంది. శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశేష గౌరవమే ఇచ్చారు. సంజయ్ అయితే కేసీఆర్‌కు సొంత మనిషి కింద లెక్క. అయినా వారిద్దరూ పార్టీని వీడారంటే ఏమిటి అర్థం. రాజకీయాలలో తమ వ్యక్తిగత అవసరాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని మరోసారి వెల్లడైంది. ఇందులో కులం లేదు. ప్రాంతం లేదు. సిద్దాంతం లేదు.. తమ స్వప్రయోజనాలే మిన్నగా ఉంటాయి. ప్రత్యేకించి రాజకీయంగా ఇప్పటికిప్పుడు జరిగే నష్టం కన్నా, నైతికంగా పార్టీ క్యాడర్‌పై దీని ప్రభావం పడుతుంది.పెద్ద నేతలు, పలు ముఖ్యమైన పదవులు చేసినవారు సైతం పార్టీని వీడుతున్నారన్న అభిప్రాయం ప్రబలితే కిందిస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. తాము కూడా పక్క చూపులు చూడాలా అన్న ఆలోచనకు వస్తారు. విశేషం ఏమిటంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన పోచారం శ్రీనివాసరెడ్డి తాను కూడా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చెబుతారు. దానికి పోచారం ఉదంతం కూడా ఒక ఉదాహరణే. పోచారం ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఆహ్వానించడం విశేషం. దీని ద్వారా ఆయనకు గౌరవం ఇచ్చినట్లయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా రేవంత్ వెంట వెళ్లారు.ఇప్పటికే మరో సీనియర్ నేత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు వంటివారు కాంగ్రెస్‌లో చేరిపోయారు. బహుశా అలాంటివారి ప్రభావం కూడా పోచారంపై పడి ఉండవచ్చు. 1994లో తొలిసారి శాసనసభకు టీడీపీ పక్షాన ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్ వాడ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేతగా ఎదిగారు. 1995లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలానికి పోచారానికి మంత్రి పదవి వచ్చింది. కాని ఆయన అల్లుడుపై వచ్చిన స్టేషనరీ స్కామ్ కారణంగా పదవికి రాజీనామా చేశారు. ఆ స్కామ్ రుజువు కాకపోవడంంతో సేఫ్‌గా బయటపడ్డారు. 2004లో ఓటమి చెందిన ఈయన 2009లో తిరిగి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవడంతో కెసిఆర్ కోరిక మేరకు ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు.అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఈయన కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి పొందారు. ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉన్న ఆయన 2018లో మరోసారి గెలిచారు. ఈసారి ఆయన తెలంగాణ శాసనసభ స్పీకర్ అయ్యారు. స్పీకర్‌గా ఇతరత్రా పెద్ద వివాదాస్పదుడు కాకపోయినప్పటికీ, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి కొందరుఎమ్మెల్యేలు చేరే క్రమంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ సూచనల ప్రకారమే వ్యవహరించారు తప్ప ఈ విషయంలో స్వతంత్రంగా పనిచేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో విలీనం చేసినట్లు ప్రకటించారు. 2023 ఎన్నికలలో మరోసారి గెలిచారు. నిజానికి పోచారం బదులు ఆయన కుమారుడు 2023 ఎన్నికలలో పోటీచేయవచ్చని అనుకున్నారు. కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈయననే పోటీచేయాలని కోరారు .దాంతో పోటీచేయక తప్పలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోయింది.అయినా గత ఆరు నెలలుగా పార్టీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. పోచారం కదలికలపై కొంత అనుమానం ఉన్నప్పటికీ, ఈ వయసులో పార్టీ మారతారా అన్న భావన ఉండేది. బహుశా ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చి ఉండాలి. అలాగే బీఆర్ఎస్కు మళ్లీ అధికారం వచ్చే అవకాశం లేదని ఆయన భావిస్తుండాలి. ఈ క్రమంలోనే స్థానిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఉండవచ్చు. మరో వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ నుంచి నేతలను, క్యాడర్‌ను ఆకర్షించే యత్నాలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీకి ఎనిమిది సీట్లు రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది.దీంతో రేవంత్, కాంగ్రెస్ నేతలు మరింత అప్రమత్తమై బీఆర్ఎస్ నుంచి వీలైనంతమందిని ఆకర్షించే పనిలో పడ్డారు. వీరు తొందరపడకపోతే బీజేపీ నాయకత్వం గాలం వేసి వారివైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచినా, లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీకి సహకరించారన్న అభిప్రాయం వచ్చింది. బీజేపీ పక్షాన గెలిచింది కూడా ఒకప్పుడు టీఆర్ఎస్లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కావడం గమనార్హం.ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ను ఖాళీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. రేవంత్ చొరవ తీసుకుని పార్టీని బలోపేతం చేసుకోవడం, సొంత వర్గాన్ని పెంచుకోవడం చేయకపోతే కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్న భయం ఉంటుంది. అందుకే టీడీపీ బాగ్రౌండ్ ఉన్న నేతలను ఆకట్టుకునే పనిలో ఉన్నారనిపిస్తుంది. గతం నుంచి తనకు సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతలను ఆయన తనతో పాటు క్యారీ చేస్తున్నారు. ఉదాహరణకు వేం నరేంద్రరెడ్డి వంటివారు సలహాదారు పదవిలో కీలకంగా ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నేత కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి తెచ్చారు.ఆయన కుమార్తెకు ఎంపీ పదవి కూడా వచ్చింది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీని పటిష్టం చేయడం కోసం ఈయనను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చి ఉండాలి. పోచారం కాంగ్రెస్‌లో చేరడంతో ఇబ్బంది రాలేదు కాని, జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లోకి రావడం సీనియర్ నేత టి.జీవన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. కనీసం తనకు చెప్పకుండా చేస్తారా అని తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్దమయ్యారు.అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని ఆయనను చల్లబరిచారు. ఇలాంటి సమస్యలు అక్కడక్కడా ఉన్నా, ఈ నాలుగేళ్లు ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి, బీజేపీకి అవకాశాలు తగ్గించి, బీఆర్ఎస్ను బలహీనపరచడానికి రేవంత్ ఇదే రూట్ లో వెళ్లవచ్చు. కాగా పోచారం తాను ఎందుకు పార్టీ మారింది చెప్పిన విషయాలు వింటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అన్న చందంగా ఉందని చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తోందని, అందుకే కాంగ్రెస్‌లోకి వెళుతున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే మొదలైందని వెల్లడించారు. మరి కొందరు నేతలు కే.కేశవరావు, దానం నాగేందర్ వంటివారు ఇప్పటికే కాంగ్రెస్‌లోకి జారుకున్నారు.వరంగల్ ప్రాంతానికి చెందిన ఎర్రబెల్లి దయాకరరావు కూడా పార్టీ మారవచ్చని ప్రచారం జరిగినా, ఆయనైతే ఖండించారు. పోచారం పార్టీ మారుతున్న సమాచారంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేశారు. పోచారం పార్టీ మారడాన్ని వారు తప్పు పట్టారు. ఆయనకు ఏమి తక్కువ చేశామని పార్టీ ఫిరాయించారని ప్రశ్నించారు. నిజానికి బీఆర్ఎస్ నేతలకు ఇలా ప్రశ్నించే నైతిక హక్కు లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీల నుంచి నయానోభయానో తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అధికారం పోవడంతో ఇప్పుడు అదే పనిని ఇతర పార్టీలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎందరు వస్తే అందరిని, ప్రత్యేకించి ఎమ్మెల్యేలను లాగడానికి కాంగ్రెస్ కృషి చేస్తోంది. పదిహేను నుంచి ఇరవైమంది ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చని చెబుతున్నా, అవన్ని ఒక కొలిక్కి రాలేదు. ఈలోగా బీజేపీ వారు కూడా వలపన్నుతున్నట్లుగా ఉంది.ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఈడి దాడులు ఇందులో భాగమేనా అన్న సందేహం పలువురికి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను బలహీనపర్చితే కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వీక్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నా, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోకూడదని ఏమీ లేదు. ఉదాహరణకు శాసనసభ ఎన్నికల ముందువరకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అయినా సాధారణ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టింది. కాని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ను నైతికంగా దెబ్బతీస్తున్నాయి. అందువల్లే కేసీఆర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలతో భేటీ అవుతూ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుందని వారికి నమ్మకం కలిగించే యత్నం చేస్తున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయో అప్పుడే చెప్పలేం. ప్రజలలో కేసీఆర్ మళ్లీ పట్టు సాధిస్తారన్న విశ్వాసం ఏర్పడడానికి ఇంకా సమయం పడుతుంది. సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ ఏ మేరకు ఈ ఫిరాయింపు రాజకీయాలను తట్టుకుని నిలబడుతుందన్నదానికి కాలమే సమాధానం ఇస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్
-
CM Jagan: ఆరంభం అదరహో! విపక్షాలు బెదరహో!!
బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర చూసిన తర్వాత వైఎస్సార్సీపీ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం ఉంటే పూర్తిగా నివృత్తి అయి ఉంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు జారిపోయి ఉంటాయి. యాత్ర ఆరంభం అదిరిన తీరు అదరహో అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అయి ఉండాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా, అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. చాలామందికి కొన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసేవారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాదానం ఇచ్చారని చెప్పాలి. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాన్ని ఆయన బహిర్గతం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్‌లో ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా, సంస్కారవంతమైన విమర్శలు, అర్దవంతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. చంద్రబాబు నాయుడు ఈ మద్య కాలంలో ఎక్కడ మాట్లాడినా అసభ్య పదాలను వాడుతూ తన పెద్ద వయసుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ద్వేషంతో ఏదేదో మాట్లాడుతూ తన పరువు పోగొట్టుకుంటున్నారు. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటున్నా, ఆయన తన వైఖరి మార్చుకోవడం లేదు. తాము గతంలో ఏమి చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆయనకు దత్తపుత్రుడుగా పేరొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే ధోరణి అవలంభిస్తున్నారు. చంద్రబాబు అసలు పుత్రుడు సంగతి సరేసరి. ఆయన ఎప్పుడూ స్పీచ్‌లో ఉండాల్సిన డీసెన్సీని మెయింటెన్ చేయడం లేదు. వీరికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తాను చెప్పదలచుకున్న విషయాలను సవ్యమైన బాషలో వివరించారు. తొలిరోజు ఆయన తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో నివాళి అర్పించి ప్రారంభించారు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తల్లికి ఏదో అన్యాయం చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసే దిక్కుమాలిన ప్రచారానికి చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ స్వయంగా అక్కడకు వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు'. ఎప్పటిమాదిరి నుదుట ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఆ సన్నివేశం వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. అక్కడ నుంచి బయల్దేరి వేంపల్లి, వీరపనాయుని పల్లి, ఎర్రగుంట్ల తదితర గ్రామాల గుండా ప్రొద్దుటూరు చేరుకునే మార్గమధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు స్వాగతం చెప్పారు. "కొందరైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న బస్తో పాటు పరుగులు తీస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను అభినందించడానికి పోటీ పడ్డారు. మామూలుగా అయితే ఈ దూరం గంటన్నర నుంచి రెండు గంటలలోపు చేరవచ్చు. అలాంటిది సుమారు ఐదారు గంటలు పట్టింది". కడప లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి వివేకా హత్య కేసు గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించి, చిన్నాన్నను ఎవరో చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, కడప జిల్లా ప్రజలందరికి తెలుసునని అన్నారు. 'వివేకాను చంపి, తానే చంపానని చెప్పుకుంటున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు'. ఇద్దరు చెల్లెమ్మలు అంటూ షర్మిల, సునీతలను పేర్లు చెప్పకుండానే వారి గురించి మాట్లాడుతూ, 'రాజకీయ స్వార్దంతో తపిస్తున్న నా చెల్లెళ్లు" అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, చెల్లెళ్లు హంతకులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ఆయన చెల్లెళ్లను తప్పు పట్టారు. ఇదంతా నన్ను దెబ్బతీసే రాజకీయం అని కూడా అంటున్నారంటే.. ఇది కలియుగం అని అనుకోవాల్సి వస్తుందని తాత్వికంగా వ్యాఖ్యానించారు. దీంతో.. "వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి షర్మిల, సునీత మద్దతు ఇస్తున్నారన్న అంశాన్ని ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు. అలాగే వారిద్దరు తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అవడం, చంద్రబాబు చెప్పినట్లు చేయడం వంటి విషయాలను ఆయన వివరించారు. 'తమ కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ద్వజమెత్తారు. అలాగే విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు తనకు సంబందించినవారు ఉన్నారని గుర్తించి, దానని కప్పిపుచ్చేందుకు వెంటనే వైఎస్సార్సీపీపై నెట్టివేస్తూ ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు'. ఈ కేసులో ఉన్నది చంద్రబాబు, ఆయన వదినకు చెందిన బంధువులేనని ఆయన అన్నారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నానని వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు." చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ నలభై ఐదేళ్లుగా కుట్రలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని, వివేకా బతికి ఉంటే శత్రువుగా చూస్తారని, ఆయన చనిపోగానే కొత్త రాగం అందుకుంటారని, ఎన్.టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనవారు, చనిపోయిన తర్వాత ఎన్.టీ రామారావు శవాన్ని లాగేసుకున్నారని, దండలు వేసి, విగ్రహాలు పెట్టారని.. సీఎం ఎద్దేవ చేశారు. చంద్రబాబు గుణగణాలను ఆయా సందర్భాలలో వివరిస్తూ.. చంద్రబాబు నిత్యం అబద్ధాలు, మోసాలపై ఆధారపడి రాజకీయాలను చేస్తారని అని ఆయన ద్వజమెత్తారు. 2014 తెలుగుదేశం మానిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రస్తావించి వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ రుణమాఫి తదితర వాగ్దానాలను ఉటంకించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. టీడీపీ మానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి కూడా గుర్తు చేశారు. 2014లో ఏ మూడు పార్టీల కూటమి అయితే పోటీచేసి ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు కూడా అదే కూటమి పోటీలో ఉందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లపడి పొత్తు పెట్టుకున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవ చేశారు. 2014లోచంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్‌ల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రజలకు చూపిస్తూ, అందులో ఉన్న రుణమాఫీ, నిరుద్యోగ బృతి తదితర హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. వీరు ముగ్గురు మళ్లీ మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు చంద్రబాబు హామీలలోని డొల్లతనాన్ని వివరిస్తూ.., తాను ఏభైఎనిమిది నెలల్లో అమలు చేసిన వాగ్దానాల గురించి వివరించారు. ప్రత్యేకించి ఇళ్లవద్దకే ప్రజలకు అవసరమైన సేవలు అందించడం, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, వృద్దాప్య పెన్షన్, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర స్కీములను తాను అమలు చేశానని ప్రజలకు తెలియచేశారు. దిశ యాప్‌తో సహా పాలనతో తీసుకు వచ్చిన సంస్కరణలను, పేదలకు ఇళ్ల స్థలాలు మొదలైనవాటితో పాటు తన హయాంలో జరిగిన అభివృద్ది పనులను కూడా తెలియచేశారు.17 మెడికల్ కాలేజీలు, కొత్తగా పోర్టుల నిర్మాణం, కడప తదితర జిల్లాలలో వస్తున్న పరిశ్రమలు మొదలైనవాటి గురించ కూడా వివరించారు. "దుష్టచతుష్టయంలో బాగంగా ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 ల పాత్రను విమర్శిస్తూ, ఈనాడు రాస్తున్న రోత రాతలు చూశాక 'ఛీ' అని పారేస్తానని" ఆయన చెప్పారు. పొత్తు ద్వారా ప్రత్యేక హోదాకానీ, ఇతరత్రా కొత్త హామీ ఏదైనా సాధించారా అని మూడు పార్టీలను ప్రశ్నించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ మూడు పార్టీల కూటమిని అభివృద్ది నిరోధక, పేదల వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. 'ఎప్పటి మాదిరి మళ్లీ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని వీరు ప్రజల వద్దకు వస్తారని, వారిని నమ్మవద్దని' వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. చంద్రబాబును పొరపాటున నమ్మితే తమ కంటిని తమ వేలుతోనే పొడుచుకున్నట్లేనని, ఇప్పుడు అమలు అవుతున్న స్కీములు రద్దు అవుతాయని కూడా ఆయన హెచ్చరించారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. 'ఒక మాటలోచెప్పాలంటే ఈ ప్రసంగం అంతా ఒక సమగ్రమైన స్పీచ్' అనిపిస్తుంది. అన్ని కోణాలను గంట సమయంలో సృజించారు. "ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో స్పందన పెద్ద ఎత్తున కనిపించింది. సభ గంటల తరబడి ఆలస్యం అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అంతా అక్కడే ఉండి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను 'సీఎం.., సీఎం..' అంటూ శుభాకాంక్షలు చెప్పిన తీరు కచ్చితంగా ఆయనకు పెద్ద బూస్ట్‌గానే ఉంది. ఇది వైఎస్సార్సీపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటే, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి మరింత కంగారు పుట్టిస్తుంది". ఇదే రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పెట్టిన సభలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభతో పోల్చితే చాలా తక్కువ వచ్చినట్లు చెప్పక తప్పదు. చంద్రబాబు స్పీచ్‌లో కొత్త విషయం ఏమీ ఉండడం లేదు. ఒక అపనమ్మకం కనిపిస్తుంది. అందుకే భయపడి మొదటిసారి కుప్పంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అర్ధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల గురించి ప్రస్తావించడానికి ఆయన వెనుకాడుతున్నారు. చంద్రబాబుకు క్రెడిబిలిటి లేని అంశాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదాహరణంగా వివరిస్తూ ఉంటే, చంద్రబాబు మాత్రం కేవలం దూషణలకే పరిమితం అవుతున్నారు. "ఒక పరిశీలకుడు అన్నట్లు చంద్రబాబు ఇస్తున్న సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు". క్రెడిబిలిటి ఆయనకు లేకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఆ ఇబ్బంది లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా పేదల బవిష్యత్తు కోసం అంతా అండగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు సభలను చూస్తే ఏపీలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, చంద్రబాబు సభలలో ఆ స్పూర్తి కొరవడినట్లు అనిపిస్తుంది'. చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ వల్లో, ఏమో తెలియదు కానీ, 2019లో మాదిరి తొలి దశలో కాకుండా, ఈసారి నాలుగో దశకు ఎన్నికల తేదీలు వచ్చాయి. అంటే సుమారు నెల రోజులు ఆలస్యంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 'చంద్రబాబు తాను, కూటమి పక్షాలు సర్దుకోవడానికి ఈ టైమ్ అవసరం అని భావిస్తుంటే, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఈ టైమ్‌ను తనకు అనుకూలంగా మలచుకుని బస్ యాత్రను పెట్టుకుని జనంలోకి మరింత చొచ్చుకువెళ్లగలిగారు. తద్వారా జనంలో తనకు ఉన్న పట్టు ఏమిటో చూపించగలుగుతున్నారు'. దీని ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం మరోసారి రావచ్చన్న అబిప్రాయం కలుగుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబులోని చీకటి కోణమే ఇది!
"తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఖర్చు కోసం నల్లధనాన్ని సమీకరీస్తున్న వైనం, వడ్డీకి అప్పులు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీని చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాతే ఎన్నికలలో ధన వ్యయం విపరీతంగా పెంచేశారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి లాగేసి తాను ముఖ్యమంత్రి అయ్యాక వచ్చాక జరిగిన కొన్ని ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలోను గెలవవలసిన అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు ఓటర్లకు 500 రూపాయల చొప్పున ఇవ్వడం ఆరంభించారన్నది ఆరోపణ కాదు.. వాస్తవం అని చాలామంది నమ్ముతారు." 1996లో జరిగిన అత్తిలి ఉప ఎన్నికలో కొందరు టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచవద్దని సూచించినా, చంద్రబాబు రిస్క్ తీసుకోలేమని చెప్పి స్వీట్ బాక్స్ తో సహా డబ్బులు పంపిణీ చేశారని ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్న అప్పటి మంత్రి ఒకరు చెప్పారు. ఆ ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచిన దండు శివరామరాజు మాట్లాడుతూ ఈ డబ్బు ఖర్చేమిటి? అయ్యబాబోయ్ .. ఉప ఎన్నికలో ఈ రకంగా వ్యయం చేస్తే, జనరల్ ఎన్నికలో నా పరిస్థితి ఏమిటి? ఈ స్థాయిలో డబ్బు చంద్రబాబు ఇస్తారో, ఇవ్వరో తెలియదు.. అని స్వయంగా నాతోనే అన్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ట్రాక్ రికార్డు అంతా ఎన్నికల మేనేజ్మెంట్లో సిద్దహస్తుడని చెబుతుంది. దొరకకుండా స్కామ్‌లు చేయడంలో కూడా చంద్రబాబు దిట్టే అని అంతా నమ్ముతారు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరిస్తూ తాను టెక్నికల్‌గా, లీగల్‌గా దొరకనని చెబుతుంటారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆ స్థాయిలో డబ్బు రావడం కష్టం కనుక ఎన్నికల సమయంలో డబ్బు పోగు చేయడానికి రకరకాల మార్గాలను ఆయన ఎంచుకుంటారు. అందులో ఒకటి తన మద్దతుదారులైన బడా పెట్టుబడి దారుల నుంచి డబ్బు సమీకరించడం, అందులో అత్యధిక భాగం నల్లధనం అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. అమెరికా వంటి దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులలో టీడీపీ మద్దతుదారులు, సామాజికంగా టీడీపీపై ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బు హవాలా ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో ధనం పోగు చేస్తుంటారు. 2019 ఎన్నికల సమయంలో పవర్లో ఉన్నప్పటికీ ఎన్ఆర్ఐల నుంచి కూడా తిరిగి ఇచ్చివేసే ప్రాతిపదికన డబ్బు తీసుకున్నారని, ఓటమి ఎదురవడంతో వారిలో పలువురికి తిరిగి ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంటుంది. దీనిలో నిజం ఉందో, లేదో తెలియదు కాని టీడీపీ వర్గాలే ఈ విషయాలపై చర్చించుకుంటాయి. మరో కొత్త మార్గం ఏమిటంటే తనను నమ్మిన ప్రముఖ విద్యా సంస్థల అధినేతల నుంచి డబ్బు వచ్చేలా చూసుకోవడం. అందులో భాగంగానే నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ ద్వారా నల్లధనం పెద్ద ఎత్తున వచ్చేలా చూస్తుంటారని అంటారు. దీనిని నిర్ధారణ చేస్తూ మీడియాలో కథనం వచ్చింది. నారాయణ తనకు తెలిసిన వ్యాపారులు, మార్వాడీల నుంచి ఐదు రూపాయల వడ్డీకి రుణం రూపేణా డబ్బు స్వీకరించారట. సుమారు 600 కోట్ల రూపాయల మేర ఇలా జమచేసి, దానిని రహస్య స్థలానికి తరలించారట. 2014లో సైతం నారాయణ తన కాలేజీ సిబ్బందిని, విద్యార్దులను ఎన్నికల ప్రచారానికి, డబ్బు పంపిణీకి వాడుకున్నారు. 2019 లో రెండు రూపాయల వడ్డీ ఇస్తామని చెప్పి 300 కోట్లు పోగుచేశారట. ఈసారి అది ఐదు రూపాయల వడ్డీగా మార్చి వ్యాపారులను ఆకర్షించే యత్నం చేశారట. మీడియాలో వచ్చిన ఈ కథనాలను ఆయన ఎందువల్లో ఖండించలేదు. 2014లో నారాయణ పెట్టిన ఖర్చులకు ప్రతిఫలంగానే ఆయనను మంత్రిగా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చంద్రబాబు చూసుకున్నారని అంటారు. చంద్రబాబు, నారాయణలు అమరావతి రాజధాని భూ స్కామ్‌లో కూడా నిందితులుగా కూడా ఉన్నారు. రాజధాని గ్రామాలలో 58 ఎకరాలను నారాయణ తన బినామీల ద్వారా కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈసారి టీడీపీ గెలిస్తే, ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతో ఆర్ధిక వనరులను కూడా భారీగా సమకూర్చుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తాజాగా వచ్చిన మరో కథనం ప్రకారం చంద్రబాబు తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్‌ను కూడా నల్లధనం మార్పిడికి బాగానే వాడుకున్నారని మీడియాలో ప్రచారం అయింది. దీని ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో రోహిత్ 13 సినిమాలు తీశారు. అంతకు ముందు మూడు, నాలుగు సినిమాలకే పరిమితం అయ్యారు. 2019 తర్వాత దాదాపు సినిమాలు తీయలేదట. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో సినిమాకు 30 కోట్ల పైగా వ్యయం చూపించారట. నిజానికి ఆ సినిమాలకు నాలుగైదు కోట్లకు మించి వ్యయం కాదని సినీరంగ ప్రముఖులు చెబుతుంటారు. అంటే ఆ మేర నల్లధనానికి లెక్కలు తయారు చేయడానికి ఈ సినిమాలను అడ్డుపెట్టుకున్నారన్నది అభియోగంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా పదమూడు సినిమాలు తీసిన వ్యక్తి, ఈ ఐదేళ్లలో ఒక్క సినిమా కూడా తీయకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నది సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న. ఇందులో నిజం ఉంటే మాత్రం ఆందోళనకరమైనదే. అవినీతికి సినిమాల ముసుగు వేస్తున్నారని అర్ధం అవుతుంది. ఈసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలతో విపరీత ప్రచారం చేయిస్తూ, గెలుస్తామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా నిధుల వసూళ్ల కోసమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విడత ఎన్నికలు టీడీపీకి చావో, రేవో తేల్చేవిగా అంతా అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వివిధ పార్టీలను తనవెంటబెట్టుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. బీజేపీతో కాపురం చేస్తున్న జనసేన అక్కడనుంచి లేచి వచ్చేలా చేయగలిగారు. కాంగ్రెస్‌తో పరోక్ష స్నేహం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు సాయం చేయడం కోసం పోటీ నుంచే తప్పుకున్న సంగతి తెలిసిందే. సీపీఐ ఏపీ శాఖ ఎప్పటి నుంచో టీడీపీకి తోకగా మారింది. ఇక బీజేపీని కూడా కాకా పట్టడానికి ఢిల్లీ వెళ్లి నానా పాట్లు పడ్డారు. బీజేపీ పెద్దలు రకరకాల షరతులు పెట్టడంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వైపు ధన సమీకరణ, మరోవైపు ఆయా రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష ఎత్తుల వ్యూహాలతో చంద్రబాబు రాజకీయం సాగిస్తున్నారు. అయినా సఫలం అవుతానన్న నమ్మకం రాక ఆయన బెంబేలెత్తిపోతున్నారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మరాఠీ. ఆయన చెబుతున్నవి వింటుంటే చరిత్రలోకి మనం వెళ్లిపోతున్నాం అనిపిస్తుంది. తెలంగాణ పుట్టుపూర్వోత్తరాలు తనదైన భాషలో చెబుతూ , దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొదలు అనేక మంది కాంగ్రెస్ వారిని ఆయన ఏకిపారేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గురించి కూడా విమర్శలు చేసినా, ఈసారి ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీపైనే దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అది దర్పణం పడుతుందనిపిస్తుంది. మరో మూడు , నాలుగు నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. శాసనసభ సమావేశాలలో ఆయన ఉపన్యాసం ఇవ్వడం ఎప్పుడూ జరిగేదే కాని, ఈసారి చేసిన ప్రసంగానికి నేపధ్యం వచ్చే ఎన్నికలే అని వేరే చెప్పనవసరం లేదు. ఈ టరమ్ కు అసెంబ్లీలో ఇదే చివరి స్పీచ్ కావచ్చు. అందుకే ఆయన కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పదునైన విమర్శలతో ఒక రకంగా విరుచుకుపడ్డారని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రెండు ఉప ఎన్నికలలో బిజెపి గెలవడం, ఒక ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలవడానికి చాలా కష్టపడాల్సిరావడం వంటి కారణాలతో అప్పట్లో తెలంగాణలో బిజెపి బాగా పుంజుకుంటుందని చాలామంది భావించారు. కాని కర్నాటక శాసనసభ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడం, తెలంగాణ వ్యాప్తంగా పార్టీ ఆశించిన రీతిలో క్యాడర్ ను తయారు చేసుకోలేకపోవడం, పార్టీలో చోటు చేసుకున్న విబేధాలు తదితర కారణాలతో బిజెపి వెనుకబడిపోతోందన్న అభిప్రాయం ఏర్పడింది. అదే టైమ్ లో కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కాంగ్రెస్ నేతలకు జోష్ పెరిగింది. అంతవరకు ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయినా, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. దీనిని గమనించిన కెసిఆర్ తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రగతి పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి పురోగతి సాధించింది వివరించడంతో పాటు అసలు తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ అని ఆయన సూత్రీకరించారు. ఇందుకోసం 1956లో ఉమ్మడి ఎపి రాష్ట్రం ఏర్పాటుకు ముందునుంచి జరిగిన ఆయా రాజకీయ పరిణామాలను తనదైన శైలిలో తెలియచేశారు. చరిత్రను ఎవరు ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఒక కోణం ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసినవారిలో కెసిఆర్ ఒకరు. తెలంగాణను తెచ్చిందెవరు అన్నది పక్కనబెడితే, తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని, దానికి నెహ్రూ నిర్ణయమే కారణమని ఆయన స్పష్టం చేశారు. 1956కి ముందు ఉన్నది హైదరాబాద్ రాష్ట్రం. అంటే తెలంగాణ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని జిల్లాలలో రాష్ట్రం ఉండేది. తదుపరి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంశం దేశవ్యాప్తంగా బలీయంగా వచ్చింది. అదే సమయంలో ఆంధ్రలోకాని, తెలంగాణలో కాని తెలుగువారంతా ఒకటికావాలన్న ఆకాంక్ష ఉండేది. తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన మాట నిజం. జవహర్ లాల్ నెహ్రూ ఆశ్చర్యంగా ఒకసారి తెలంగాణకు అనుకూలంగా, మరోసారి సమైక్య రాష్ట్రానికి మద్దతుగా ప్రసంగాలు చేశారు. హైదరాబాద్ శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రాన్ని ఓకే చేశారు. ఆంధ్ర శాసనసభతో పాటు, తెలంగాణ అసెంబ్లీ అభిప్రాయాల ఆధారంగా ఉమ్మడి ఎపి ఏర్పడింది. తదుపరి ఎన్నో పరిణామాలు, 1969 లో ఉద్యమం రావడం, కాని 1972 నాటికి అది పూర్తిగా తగ్గిపోవడం, టిపిఎస్ పక్షాన గెలిచిన ఎంపీలంతా కాంగ్రెస్‌లో కలిసిపోవడం వంటివి జరిగాయి. అయినా కొందరిలో తెలంగాణ ఆకాంక్ష పోలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా వారు దానిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. కాందరు నేతలు ఆ నినాదాన్ని తమ పదవీ రాజకీయాలకు వాడుకున్నది కూడా వాస్తవం. కెసిఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీలో తెలంగాణ డిమాండ్ చేయలేదు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఒకసారి మంత్రి పదవి ఇచ్చి , 1999 ఎన్నికలలో తిరిగి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా ఉప సభాపతి పదవి ఇచ్చి అవమానించారన్న భావన ఆయనలో ఏర్పడి, తెలంగాణ మేధావులతో, ప్రత్యేక రాష్ట్ర వాదులతో ఆయన సమావేశాలు జరిపి ఒక అవగాహనకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ ఆ నినాదాన్ని వదులుకోని మాట నిజం. అప్పడప్పుడు ఆశ, నిరాశలు ఎదురైనా , అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి ఆయన తెలంగాణ తెచ్చిన సారధిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, ముఖ్యమంత్రి కూడా అయి తొమ్మిదిన్నర ఏళ్లుగా పాలన సాగిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన మరో అంశం ఉంది. ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించి ఆమె తెలంగాణను వ్యతిరేకించారని చెప్పారు. అందులో వాస్తవం లేకపోలేదు. కాని అదే సమయంలో ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ గురించి మాట్లాడకపోవడం వ్యూహాత్మకం అనుకోవాలి. తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో ఇదే శాసనసభలో సోనియాగాంధీని ఆయన ప్రశంసించారు. కాని ఇప్పుడు ఆ ఊసే ఎత్తినట్లు కనిపించలేదు. తెలుగుదేశం పాలన, చంద్రబాబు టైమ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం తదితర అంశాలను ఆయన చెబుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడం గమనించవలసిన అంశమే. వైఎస్ అభిమానులను ఆయన దూరం చేసుకోదలచుకోలేదని అర్ధం అవుతుంది. వైఎస్ కుమారుడు జగన్ ను కాంగ్రెస్ వేదించిన సన్నివేశాన్ని వివరించి, ఆంధ్రలో కాంగ్రెస్ దెబ్బతినిపోయింది కాబట్టి, తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణలో అయినా పార్టీని నిలబెట్టుకోవాలని మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది తప్ప చిత్తశుద్ది లేదని కెసిఆర్ వాదించారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు అంటే పొక్లెయినర్‌తో గోకుడు, అవుతలపడుడు. ఇక కాంగ్రెసోళ్లు కాల్వంటూ గెల్కుడు, ఇడ్సిపెట్టుడు అంటూ నాటి నీటిపారుదల ప్రాజెక్టులపై ఎద్దేవ చేశారు. అయితే ఎనభై వేల కోట్లు వ్యయం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తన ప్రసంగంలో అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించలేదు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. తెలంగాణ తలసరి ఆదాయం 3.12 లక్షల రూపాయలుగా ఉన్న విషయం వాస్తవమే అయినా, పొరుగు రాష్ట్రంతో పోల్చుకోవడం సరికాకపోవచ్చు. ఎందుకంటే పొరుగు రాష్ట్రానికి హైదరాబాద్ వంటి నగరం లేదన్న సంగతి మర్చిపోకూడదు. తన ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, దళిత బంధు, తదితర సంక్షేమ పధకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించి మళ్లీ వచ్చే ఎన్నికలలో గెలిచేది తామేనని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రసంగం ద్వారా ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోను, పార్టీ క్యాడర్ లోను ఒక ధీమా కల్పించే యత్నం చేశారు. ఇంతవరకు ఆయన సఫలీకతృతమైనట్లే అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
విలువలతో కూడిన జర్నలిజం అవసరం
-
ఏది సంస్కృతి? ఏది విశ్వాసం?
ఎన్.టి.ఆర్. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆయన పేరు కొనసాగించాలని కోరవచ్చు. కాని అతిగా ప్రభుత్వంపై, జగన్‌పై విమర్శలు చేయడం ద్వారా తమ పాత చరిత్ర అంతటినీ ప్రజల ముందుకు మరోసారి తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఇక విశ్వాసం మాటకు వస్తే.. తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు బాలకృష్ణ ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి తండ్రిని పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది?! ఏపీలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సి టీగా మార్చడంపై ఎన్.టి.ఆర్. కుమారుడు, చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆశ్చ ర్యకరంగా ఉన్నాయి. ఆయన చేసిన ట్వీట్‌ని చూస్తే అసలు ఎన్.టి.ఆర్. పట్ల విశ్వాసం ఉండవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికా? తెలుగుదేశం వారికా? అన్న ప్రశ్న వస్తుంది. ఒక్కసారి బాల కృష్ణ ట్వీట్‌ను పూర్తిగా చూద్దాం. ‘‘మార్చేయడానికి, తీసేయడానికి ఎన్.టి.ఆర్. అన్నది ఒక పేరు కాదు. అది ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు మార్చారు. కొడుకు గద్దె ఎక్కి యూనివర్సిటీ పేరు మార్చుతున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అక్కడ మహనీయుడి భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు. పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు’’.. ఇది ఆయన ట్వీట్. ఎంత అర్థరహితంగా ఉంది! ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్.టి.ఆర్. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించివేసినందుకు, ఆయనపై చెప్పులు వేసినందుకు టీడీపీ నేతలు కనీసం క్షమాపణ చెప్పకపోతే పోయె, బాధపడినట్లు అయినా ఎక్కడైనా చెప్పారా! ఎన్.టి. రామారావు హృదయ విదారకంగా అందరి ముందు విలపించినప్పుడు; తనను తన పిల్లలు, అల్లుళ్లు కలిసి దారుణంగా అవమానించారని కుమిలిపోయినప్పుడు వీరంతా అధికారం లాగేసుకున్నామని పకపకా నవ్వుకున్నారే... అదేనా సంస్కృతి! ఎన్.టి.ఆర్. వేదనతో మరణించినప్పుడు ఆయన అభిమా నులు బాధపడ్డారు కాని ఆయన కుటుంబంగా భావించేవారిలో కొంతమంది లక్ష్మీపార్వతి వర్గంతో గొడవ పడడానికే ప్రాధాన్యం ఇచ్చారు! ఆమెపై రకరకాల వదంతులు సృష్టించే పనిలో పడ్డారు! చివరికి అక్కడ కూడా చెప్పులు విసురుకున్నారు. ఇదా తెలుగు జాతి సంస్కృతి? తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చారని పరోక్షంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించారు. ఎయిర్‌పోర్టు పేరు వ్యవహారం కేంద్రం పరిధి లోనిది. పోనీ బాలకృష్ణ చేసిన విమర్శ కరెక్టే అను కున్నా, 2014 నుంచి నాలుగేళ్లపాటు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే.. అప్పుడు అశోక్ గజపతిరాజు కేంద్ర విమాన యాన శాఖ మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! మరి ఎందుకు మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మి నల్కు ఎన్.టి.ఆర్.పేరు పెట్టలేదు? అంటే వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేనట్లే కదా! పోనీ విజయవాడ విమానాశ్రయానికి అయినా ఎందుకు ఆయన పేరు పెట్టలేదు? రాజధాని ప్రాంతానికి ఎన్.టి.ఆర్. సిటీ అని పేరు పెట్టాలని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఏమి చేశారు? బుచ్చయ్య చౌదరిపైనే ఫైర్ అయ్యారు తప్ప ఎన్.టి.ఆర్. పేరు పెట్టారా? రామోజీ ఆదేశాల మేరకు చంద్రబాబు అమరావతి అనే పేరు పెట్టారు. అంటే రామోజీకి ఇచ్చిన విలువ ఎన్.టి.ఆర్.కు చంద్రబాబు ఇవ్వలేదనే కదా? ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా 1995 ప్రాంతంలో ‘ఈనాడు’ దారుణమైన కార్టూన్లు వేస్తే బాలకృష్ణ కాని, ఆయన సోదరులు కాని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నించారా? తనను తన కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్. వివాహమాడితే ఆయనతో తగాదా పెట్టుకున్నది ఎవరు? అధికారం వచ్చాక లక్ష్మీపార్వతితో ఆదరణగా ఉన్నట్లు నటించింది ఎవరు? ఎన్.టి.ఆర్. మరణం తర్వాత ఆమెను ఎన్.టి.ఆర్. కుటుంబ సభ్యులు ఎవరైనా పట్టించుకున్నారా? ఆమె ఉంటున్న ఇంటి నుంచి ఆమెను తరిమేశారే! మరి ఇదంతా తెలుగు జాతి సంస్కృతి, నాగరికత అని అనుకోవాలా? ‘‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు, పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలకృష్ణ నీచమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ఎన్.టి.రామారావు టీడీపీని స్థాపించి ప్రజలలో తిరుగు తున్నప్పుడు కాంగ్రెస్ వారిని ‘కుక్కమూతి పిందెలు’ అని విమ ర్శించేవారు. విశేషమేమిటంటే అప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండేవారు. ఎన్.టి.ఆర్. తన అల్లుడు మినహా మిగిలిన కాంగ్రెస్ వారికి ఆ తిట్టు వర్తిస్తుందని చెప్పలేదు. పోనీ బాలకృష్ణ చెప్పినట్లు చేరిన పార్టీలోనే ఉండడమే విశ్వాసం అయితే, తొలుత అది వర్తించవలసింది చంద్రబాబుకే కదా! రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ను కాదని, తన ఓటమి తర్వాత మామ ఎన్.టి.ఆర్. స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు కదా. మరి దానిని బాలకృష్ణ ఏమని అంటారు? ఆ మాటకు వస్తే తనకు జన్మనిచ్చిన ఎన్.టి.ఆర్.కు ఆయన ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి ఆయనను పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది? అప్పుడు కుక్కలు వెక్కి రించలేదా? వాటి ముందు తెలుగుదేశం నేతలు ఎవరూ తలదించు కుని సిగ్గు లేకుండా బతకలేదా? తన సోదరి పురందేశ్వరి కాంగ్రెస్‌లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవులు అలంకరించారే... తదుపరి ఆమె బీజేపీలో ఎలా చేరారు? దీనిని విశ్వాసమే అంటారా? తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి, ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామిని చేశారే... తీరా చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గుబాటిని పరాభవించి బయటకు పంపేశారే... మరి బాలకృష్ణకు విశ్వాసం ఏమైంది? ఎన్.టి.ఆర్. పట్ల అందరికీ గౌరవం ఉంది. పేరు మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ తన కారణాన్ని వివరించారు. తమకు ఎన్.టి.ఆర్. అవసరం లేదని, ఆయనకు విలువలు లేవని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే, జగన్ చాలా పద్ధతిగా మాట్లాడారు. తనకు ఎంతో గౌరవం ఉంది కనుకే ఒక జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెట్టానని అన్నారు. అలా పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ కనీసం స్వాగతించలేక పోయారే? నిజానికి ఎన్.టి. రామారావు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ప్రత్యర్ధులు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అయితే ఎన్.టి.ఆర్.తో అసలు సంబంధమే లేదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. ఎన్.టి.ఆర్. పేరు మార్చితేనే మొత్తం జాతి అంతా తల్లకిందులవుతున్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారే మరి చంద్రబాబు టైమ్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి ఎన్.టి.ఆర్. పేరు పెట్టలేదా? రాజీవ్ పేరు మార్చినప్పుడు దేశానికి అంతటికీ అవమానం జరిగినట్లు అను కోవాలా? తెలం గాణలో ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి కాళోజీ నారాయణరావు పేరు పెట్టినప్పుడు టీడీపీ వారు, బాలకృష్ట వంటి వారు కనీసం నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తు న్నారు. ఆ మాటకు వస్తే కాకాని వెంకటరత్నం పేరుతో ఉన్న మెడికల్ కాలేజీని యూనివర్సిటీగా మార్చినప్పుడు ఆయన పేరును ఎన్.టి.ఆర్. ఎందుకు తొలగించారు? తెలుగుదేశం వారికి ఎన్.టి.ఆర్.పేరును వాడుకునే అర్హత లేద న్నది వాస్తవం. ఎన్.టి.ఆర్. తన అల్లుడు చంద్రబాబు నాయుడును దూషిస్తూ, ‘ద్రోహి, ఔరంగజేబు కన్నా నీచం’ అని అన్నారు. అలా తన తండ్రి దూషణలకు గురైన చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడుగా, విధేయుడుగా బాలకృష్ణ వ్యవహరించడం ఏమి సంస్కృతి అన్నదానికి ముందుగా ఆయన వివరణ ఇచ్చి, ఆ తర్వాత ఎదుటివారిపై వ్యాఖ్యలు చేస్తే మంచిది. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
విపక్షాలకు నితీష్ కుమార్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికిందా?
బీహార్ తాజా రాజకీయా పరిణామాల ప్రభావం దేశంపైన, తెలుగు రాష్ట్రాలపైన ఏ మేరకు పడుతుంది? బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ పక్షం బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్లీ ఆర్జేడి, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమిలో భాగం అయింది. ఎన్డిఎలో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ఇప్పుడు ప్రత్యర్ధి కూటమిలో కూడా సీఎం అయి మరోసారి తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. పలు ఆటుపోట్లను చవిచూసిన నితీష్ రాజకీయ చాతుర్యం ఒక విధంగా అసాధారణమైనదే అని చెప్పాలి. చదవండి: గోరంట్ల మాధవ్ వీడియో అంశం: చెత్త వ్యూహంతో టీడీపీ దెబ్బ తిందా? 2024లో నరేంద్ర మోదీ తిరిగి ప్రధాన మంత్రిగా ఎన్నిక కాలేరని చెబుతున్న ఆయన 2014లో కూడా తప్పుడు అంచనాతో బీజేపీకి దూరం అయ్యారు. అయినా బీహారు ప్రజలు ఆయన ఏ కూటమిలో ఉంటే దానికి జై కొట్టారు. మహాకూటమిలో భాగంగా ఉండి 2015లో అధికారంలోకి వచ్చిన నితీష్ , ఆ తర్వాత ఆ కూటమిని వీడి తిరిగి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమిలో భాగస్వామి అయ్యారు. ఒకప్పుడు మోదీని తీవ్రంగా వ్యతిరేకించినా, తదుపరి ఆయన దగ్గరయ్యారు. 2020 లో బీజేపీతో కలిసి అధికారం సాధించిన నితీష్ ఈసారి ఎన్.డి.ఎ.ని వదలిపెట్టి మహాకూటమిలో భాగస్వామి అయ్యారు. 2025లో సాధారణ ఎన్నికలు వచ్చేవరకు ఇదే కూటమిలో ఉంటారా? మరోసారి కూటమి మారతారా అన్నది అప్పుడే చెప్పలేం. మామూలుగా అయితే ఇన్నిసార్లు కూటములు మార్చే నేతలపై ప్రజలలో, ఇతర రాజకీయ పార్టీలలో వ్యతిరేకత వస్తుంటుంది. కాని నితీష్ రెండు కూటములవారిని ఆకర్షించడం ఆయన ప్రత్యేకత. దానికి కారణం ప్రధానంగా ఆయన వ్యక్తిత్వమే అని చెప్పాలి. అవినీతి ముద్ర లేకుండా పోవడం, బీహార్‌లో సంక్షేమ కార్యక్రమాలకు తగు ప్రాధాన్యం ఇవ్వడం, వీలైనంత అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించడం వంటి కారణాల వల్ల ఆయనపై ప్రజలలో మరీ ఏవగింపు లేదు. నితీష్ కుమార్ దేశంలో మరే నేత సాధించలేని విధంగా ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఒకప్పుడు బలం లేకపోయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉండి, మెజార్టీ కొరవడి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. కాని ఆ తదుపరి కేంద్ర మంత్రిగా ఉంటూ పేరు తెచ్చుకున్నారు. బీజేపీతో కలిసి బీహారులో 2005 లో అధికారంలోకి వచ్చింది మొదలు, మధ్యలో కొద్ది నెలలు మినహా ఇప్పటివరకు ఆయనే సీఎంగా ఉన్నారు. ఆయన ఏ కూటమిలో ఉన్నా, తన సొంత పార్టీ అయిన జేడీయూ ఇతర పార్టీలకన్నా తక్కువ సీట్లే సాధించినా, నితీష్ కుమార్ నే ఆయా కూటములు సీఎంగా ఎన్నుకోవడం విశిష్ట పరిణామం. అదే సమయంలో నితీష్ కుమార్ పై అవకాశవాద రాజకీయాలు చేస్తారన్న విమర్శ కూడా ఉంది. గతంలో మహాకూటమిని వదలి ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈయనను పాముతో పోల్చారు. సరిగ్గా ఇప్పుడు అదే పద ప్రయోగాన్ని బిజెపి నేతలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, దేశ వ్యాప్తంగా ప్రతిపక్షానికి నితీష్ లో కొద్ది ఆశారేఖలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్దిగా ఫోకస్ చేయడానికి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న తరుణంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తీరుతో నితీష్ ప్రధాని అభ్యర్ధి కావచ్చనే ప్రచారం ఆరంభం అయింది. నితీష్ మనసులో ఇదే ఉద్దేశం గత కొన్నేళ్లుగా ఉన్పప్పటికీ, మోదీ హవా ముందు తలవంచుకుని కామ్ తన పని తాను చేసుకుపోయారు. మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఇప్పుడు మళ్లీ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోదీని నితీష్ ఎదుర్కోగలుగుతారా ?లేదా అన్న ప్రశ్న ఉన్నప్పటికీ, స్తూలంగా నితీష్ అభ్యర్ధిత్వాన్ని బీజేపీని వ్యతిరేకించే వివిధ రాజకీయ పక్షాలు ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఏమి జరుగుతుందో జోస్యం చెప్పలేకపోయినా, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర రాజకీయ పక్షాలలో నితీష్‌కే ఎక్కువగా గుడ్ విల్ ఉన్నట్లు భావించవచ్చు. కాగా నితీష్ రాజకీయ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండవచ్చు అన్న చర్చ కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో బీజేపీపై ఫైట్ చేస్తున్న మొనగాడుగా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేస్తున్నారు. ఒక దశలో జాతీయ పార్టీని పెట్టుకుని ప్రధాని రేసులో ఉండాలని కూడా ఆయన ఆశించారు. కాని ప్రాక్టికల్ రాజకీయాలలో అది చాలా కష్టమైనదిగా కనిపిస్తుంది. నితీష్ ఉత్తరాది రాజకీయ నేత అవడం ఒక అడ్వాంటేజ్ కాగా, కేసీఆర్ దక్షిణాది నేత కావడం, తెలంగాణలో కేవలం 17 లోక్ సభ స్థానాలే ఉండడం డిజడ్వాంటేజ్ గా భావించవచ్చు. బీహార్‌లో 40 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అయితే కేసీఆర్ బీజేపీపై చేస్తున్న పోరాటానికి నితీష్ కుమార్ తాజా నిర్ణయం నైతికంగా బలం చేకూర్చుతుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో బీజేపీ అనుసరించిన వ్యూహానికి ప్రతిగా బీహార్‌లో నితీష్ ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. తద్వారా ప్రస్తుతానికి తన పార్టీని చీల్చే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడగలిగారు. బీహార్‌లో ఎదురుదెబ్బ తినడంతో తెలంగాణలో బీజేపీ తన గేమ్‌ను చాలా జాగ్రత్తగా ఆడవలసి ఉంటుంది. ప్రధానంగా సీబిఐ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అది టీఆర్ఎస్కు ధైర్యం ఇచ్చే అంశం అవుతుంది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్నందున, టీఆర్ఎస్ బీహార్ రాజకీయాలను ప్రచారంలో వాడుకోవచ్చు. బీజేపీని ప్రజా వ్యతిరేకిగా చూపించడానికి ఈ పరిణామాన్ని వాడుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం నితీ ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా కేసీఆర్ బహిష్కరించారు. కేసీఆర్‌తో పాటు నితీష్ కూడా ఆ సమావేశానికి వెళ్లలేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో ఇప్పటికే కేసీఆర్ సంబంధాలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారితో కలిసి కేసీఆర్ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక రాజకీయంపై పెద్దగా ప్రభావం చూపదుకాని, ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి జగన్‌కు మరింత ప్రాధాన్యత ఏర్పడవచ్చు. జేడీయూ నిష్క్రమణతో రాజ్యసభలో బీజేపీకి అవసరమైన మెజార్టీకి కొంత తక్కువ సీట్లు ఉన్నాయి. కీలకమైన బిల్లులపై ఓటింగ్ వస్తే వైసీపీపైన, ఒడిషాలోని బీజేడీపైన బీజేపీ ఆధారపడవలసి వస్తుందని ఇప్పటికే విశ్లేషణలు వచ్చాయి. బీహార్‌లో ఈ సారి మెజార్టీ లోక్ సభ సీట్లు బీజేపీకి ఎంతవరకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ బీజేపీ కూటమికి గత మాదిరి 39 సీట్లు రాకపోతే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కొంత ఇబ్బంది రావచ్చు. యూపి. ఎంపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా లోక్ సభ ఎన్నికలలో గతంలో వచ్చినట్లుగా ఓవర్ హెల్మింగ్ గా సీట్లు రాకపోవచ్చు. ఆయా రాష్ట్రాలలో సీట్ల సాధనలో వెనుకబడితే, అప్పుడు వైసీపీ వంటి పార్టీలు సాధించే సీట్లకు గిరాకి ఏర్పడుతుంది. అలాగే ఎలాగైనా బీజేపీతో అంటకాగాలని ఆరాటపడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఈ పరిణామం కాస్త ఆశ కలిగించవచ్చు. కానీ బీజేపీ ఏపీకి సంబంధించి వైసీపీపైన ఆధారపడాలా? టీడీపీతో జత కలవాలా అన్నదానిపై ఎన్నికల తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత ప్రబలితే ,అప్పుడు విపక్షాల కూటమికి కాస్త మెరుగైన ఫలితాలు రావచ్చు. అప్పుడు మోదీ అభ్యర్ధిత్వంపై చర్చ జరగవచ్చు. మోదీ ప్రధాని కాకుండా ఉంటే మద్దతు ఇస్తామని కొన్ని పార్టీలు ప్రతిపాదించవచ్చు. ఇలా రకరకాల పరిణామాలు వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలపై దూకుడుగా వెళుతున్న బీజేపీ కొంత తగ్గవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే పనిలో పడవచ్చు. ఏది ఏమైనా ఇంతవరకు మోదీకి ప్రత్యామ్నాయం లేరనుకుంటున్న తరుణంలో నితీష్ కుమార్ రూపంలో విపక్షాలకు ఒక ప్రత్యామ్నాయం దొరికిందని భావించవచ్చేమో! -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
బట్టలైనా ఊడదీసుకుని తిరుగుతామంటారు: కొమ్మినేని విశ్లేషణ
-
ప్రాంతీయం నుంచి జాతీయానికి...
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఎనిమిదేళ్లు పూర్తయింది. కొంతకాలంగా ప్రతిపక్షాల నుంచి పోటాపోటీ పరిస్థితి కొంత ఎదురవుతోంది. అయితే టీఆర్ఎస్కు తాము ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్, బీజేపీ రుజువు చేసుకోవలసి ఉంది. ఇటీవలి కాలంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్నది అప్పుడే చెప్పలేం. కానీ కేసీఆర్‌ను జాతీయస్థాయి నేతగా చూపడానికి టీఆర్ఎస్ గట్టిగా యత్నిస్తోంది. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఇదే వ్యూహం అవలంబించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంపై దాదాపు ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లుగా కేసీఆర్ వ్యవహరి స్తున్నారు. దేశ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి కాస్త చీకాకు తెప్పిస్తున్నాయి. తొలుత మోదీతో కేసీఆర్ సత్సంబంధాలు కొనసాగించారు. నోట్ల రద్దు లాంటి అంశాలలో మద్దతిచ్చారు. కారణం ఏమైనా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న భావన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడింది. ప్రస్తుతం మోదీతో సంబంధాలు ఎంత చెడ్డాయంటే ఒకరినొకరు ముఖం చూసుకోనంతగా అని చెప్పాలి. మోదీ శంషాబాద్ వద్ద రామానుజ విగ్రహ ఆవిష్కరణకు వస్తే, కేసీఆర్ అక్కడకు వెళ్లలేదు. బిజినెస్ స్కూల్లో కాన్వకేషన్‌కు మోదీ హాజరైతే, ఆయనకు స్వాగతం పలకకుండా గైర్హాజరై, అదే రోజు కేసీఆర్ బెంగళూరు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వరకూ కేసీఆర్ వర్సెస్ మోదీ అన్న పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు కనబడుతోంది. తెలంగా ణలో బీజేపీ ముఖాలుగా ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ, ఎన్నికల సమ యంలో మోదీకి ఉన్న పలుకుబడినే బీజేపీ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఏం సాధించారన్నది విశ్లేషించుకుంటే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది సుమారు లక్ష కోట్ల వ్యయంతో అతి భారీ కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును నిర్మించడం. నిజానికి గోదావరి నది తెలంగాణ భూమట్టం కన్నా చాలా దిగువన ఉంటుంది. ఎత్తిపోతల ద్వారానే సాగునీటిని మళ్లించే అవకాశం ఉంది. ఇది వ్యయప్రయాసలతో కూడిన విషయమని తెలిసినా, సాహసంతో చేపట్టారు. కాకపోతే ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టుపై పలు విమర్శలు చేస్తున్నాయి. ప్రాజెక్టుపై పెట్టిన వ్యయానికీ, దానివల్ల వస్తున్న ప్రయోజనానికీ మధ్య చాలా తేడా ఉందన్నది కాంగ్రెస్, బీజేపీ వాదన. అలాగే అవినీతి ఆరోప ణలూ చేస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చేయడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం. అయితే దీనిపై కూడా విమర్శలు లేకపోలేదు. విద్యుత్‌ను అధిక వ్యయంతో కొంటున్నందున వినియోగదారులపై ఎక్కువ భారం పడుతోందన్నది ప్రధానమైన విమర్శ. కేసీఆర్ ఆరంభించిన మరో స్కీమ్... రైతుబంధు. చిన్నా, పెద్ద, ధనిక, పేద రైతులన్న తేడా లేకుండా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ విజయానికి ఇది బాగా ఉపయోగపడింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని ఆయన ప్రభుత్వం కాపాడుకోగలిగింది. మున్సిపల్ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు కె.తారక రామారావుకు ఈ విషయంలో మార్కులు వస్తాయని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతిందన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. అలా అని హైదరాబాద్‌లో సమస్యలు లేవని కాదు. ‘దిశ’ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. దళితబంధు స్కీమును కేసీఆర్ ప్రకటించడం ఒక సంచలనం అని చెప్పాలి. ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమై, కొందరికి అమలు కూడా చేశారు. దీనివల్ల పార్టీకి కొంత నష్టం కూడా జరిగింది. కేవలం ఎస్సీ వర్గాలకే ఈ స్కీము ఇస్తుండటంతో బీసీ, తదితర వర్గాలలో అసంతృప్తి ఏర్పడి హుజూరా బాద్‌లో టీఆర్ఎస్ ఓటమికి ఒక కారణం అయింది. రాజకీయ విషయాలు చూస్తే కేసీఆర్ తొలి పదవీ కాలం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు ద్వారా ఫిక్స్ చేశారు. రాజీ ఫార్ములాలో భాగంగా చంద్రబాబు హైదరాబాద్ వదలి పోయేలా చేయడంలో సఫలమయ్యారు. తెలంగా ణలో ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఇది అనైతికమే అయినా, వర్తమాన రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షాలను బలహీనం చేయడానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గానీ, రాష్ట్రాలలో ఉన్న పార్టీలు గానీ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఈ మాత్రానికే ప్రతిపక్షాలు పూర్తిగా బలహీనం అవుతాయని చెప్పలేం. కాకపోతే దాని ప్రభావం కొంత పడవచ్చు. తొలి టరమ్‌లో ఏ ఎన్నిక అయినా తిరుగులేని విజయం సాధిస్తే, 2019 లోక్‌సభ ఎన్నికలలో తొలిసారిగా కేసీఆర్ ఎదురుదెబ్బ తిన్నారు. స్వయంగా ఆయన కుమార్తె కవిత లోక్‌సభ ఎన్నికలలో ఓటమి చెందారు. అలాగే మరో ముఖ్యనేత వినోద్ కుమార్ కూడా పరాజయం పొందారు. అనూహ్యంగా బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలపడే పరిస్థితి ఉందనుకున్న సమయంలో ఆయన బీజేపీ పెరగడానికి కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉన్నా, ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీల మధ్య విమర్శలు హద్దులు దాటాయనే చెప్పాలి. కాగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించడం, సామాజిక సమీకరణలలో మార్పునకు కాంగ్రెస్ యత్నించడం వంటి పరిణామాలు ఉన్నా, ఇప్పటికైతే కేసీఆర్ పెద్దగా ఇబ్బంది పడక పోవచ్చు. కాగా ప్రభుత్వపరంగా అప్పుల సమస్య కేసీఆర్‌ను వెంటాడుతోంది. గత రెండు నెలలుగా బాండ్లు విక్రయించి రుణాలు తీసుకుందామని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆర్బీఐ గండి కొట్టి, ఎట్టకేలకు నాలుగు వేల కోట్లకు ఓకే చేసింది. కేంద్రంపై ఎంత పోరాడుతున్నట్లు కనిపించినా, ప్రజలలో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. రైతుల ధాన్యం కొనుగోలు అంశం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దానిని కేంద్రంపైకి నెట్టడంలో కొంత సఫలీకృతమైనా, ప్రాథమికంగా టీఆర్ఎస్పై కూడా కొంత బాధ్యత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం వివిధ సామాజిక వర్గాలలో టీఆర్ఎస్ పట్టు ఉంది. దానిని అలాగే కొనసాగించగలిగితే కేసీఆర్‌కు తిరుగుండదు. కానీ ఆ విషయంలో మార్పు తేవడానికి ప్రతిపక్షాలు గట్టిగా యత్నిస్తు న్నాయి. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాలు బలహీనపడటం లాంటి విషయాలు ఎలా ఉన్నా, తెలంగాణవాదం గణనీయంగా తగ్గి ఇతర రాజకీయ, సామాజిక, ఆర్థికాంశాల ప్రాతిపదికగా రాజకీయం మారడం కూడా ఒకరకంగా మంచిదే. కానీ దీనివల్ల కూడా విపరి ణామాలు ఉంటాయని మంత్రి మల్లారెడ్డికి ఎదురైన చేదు అనుభవం చెబుతోంది. కేసీఆర్ తెలివిగా రెడ్డి వర్గాన్ని కూడా తనతో కలుపుకొని వెళ్లే యత్నం చేస్తున్నారు. అలాగే బీసీలనూ, దళితులనూ తనతోనే ఉండేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతూనే, కేసీఆర్‌ను జాతీయస్థాయి నేతగా ప్రొజెక్టు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలే అతి పెద్ద రాజకీయ పరిణామంగా చూడాలి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
చెప్పింది చేసి చూపిన పాలన
సమాజంలో అట్టడుగున ఉన్నవారిని కూడా ఆకట్టుకోవడం అంత తేలిక కాదు. దానిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సాధించారు. అందుకు కారణం– ఆయన తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో అది పాటిస్తున్నారు. ఇచ్చిన తొంభై ఐదు శాతం హామీలు నెరవేర్చడం ఏపీలోనే కాదు, దేశ చరిత్రలో కూడా అపురూపమైన ఘట్టమే. ప్రభుత్వ పాఠశాలలను ‘నాడు–నేడు’ కింద బాగు చేయడం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆశ్చర్యపరిచారు. మంత్రివర్గంలో స్థానాలను డెబ్బై శాతం బలహీన వర్గాలవారికి కేటాయించడం కూడా కొత్త చరిత్రే. చెప్పాలంటే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఎన్నో అపురూప విజయాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సరికొత్త మార్పు చూస్తున్నారా? గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పేదవర్గాలు, ధనిక వర్గాల మధ్య పోటీ వాతావరణం ఏర్పడుతోంది. పేదవర్గాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన వివిధ స్కీములకు సంపూర్ణ మద్దతు ఇస్తుంటే, ధనికులలో కొన్ని వర్గాలవారు వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని ఇందిరా గాంధీ సమయంలో ఇలాంటి వాతావరణం ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లలో సాధించిన అతి గొప్ప విజయం ఇదే కావచ్చు. పేదలు, మధ్య తరగతి వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీ లలో, జగన్ పట్ల విపరీతమైన సానుకూలత ఏర్పడటం పెద్ద విశేషం. అగ్రవర్ణ పేదలలో కూడా జగన్ పట్ల ఆదరణ ఉంది. డబ్బున్నవారిలో మాత్రం ఈ స్కీముల పట్ల కొంత వ్యతిరేకత ఉంది. చెప్పిన నవరత్నాలు అమలు చేయడం జగన్‌కు ఒక సవాలైతే... టీడీపీ, దానికి మద్దతిచ్చే మీడియా సంస్థలను ఎదుర్కోవడం మరింత పెద్ద సవాలుగా మారింది. అయినా మొండిగా ముందుకు కదులు తున్నారు. అనేక కొత్త వ్యవస్థలను తెచ్చి, జగన్ ఇంతటి ఆలోచనా పరుడా అని పలువురు ముక్కున వేలేసుకునేలా చేయగలిగారు. ఎవరైనా నేత ప్రభుత్వంలో ఉండి కొత్త వ్యవస్థలను తీసుకు వచ్చిన ప్పుడు శాశ్వతంగా ప్రజలలో గుర్తుండిపోతారు. జగన్ అధికారంలోకి వచ్చాక సుమారు ముప్పై ఐదు కొత్త స్కీములను ప్రవేశ పెట్టారు. వాటిలో అత్యధికం వేటికవే ప్రాధాన్యం కలిగినవని చెప్పాలి. గ్రామాలలో వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టినప్పుడు ప్రతిపక్ష టీడీపీ మెటికలు విరిచేది. ‘వాలంటీర్లు ఏమి చేస్తారు? ఇళ్లలో మగవారు లేనప్పుడు వెళ్లి ఆడవారిని ఇబ్బంది పెడతా’రని స్వయంగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విమర్శిం చారు. పైగా అవన్నీ గోనె సంచులు మోసే ఉద్యోగాలని ఎద్దేవా చేశారు. కానీ ఆ తర్వాత రోజులలో తన పార్టీ కార్యకర్తలకు ఆ ఉద్యో గాలు ఇస్తానని ఆయనే చెప్పారు. అంటే దీనర్థం ‘ఫాలో ద లీడర్’ అన్నట్లుగా జగన్‌ను అనుసరించడానికి ఒప్పుకున్నట్లే కదా? ‘గ్రామ సచివాలయాలలో లక్షన్నర ఉద్యోగాలా?’ అన్నవారు ఉన్నారుగానీ జగన్ చేసి చూపించి తద్వారా ప్రజలకు పాలనను చేరువ చేశారు. ప్రతి నెలా మొదటి తేదీన వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం సరికొత్త రికార్డు. దాంతో వృద్ధులు తమకు ఇచ్చే పెన్షన్ కోసం రోజుల తరబడి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పింది. అంతేకాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండువేల నుంచి 2,500 రూపాయలు చేశారు. ఇక రేషన్ షాపుల నుంచి బియ్యం తదితర సరుకులు ఇళ్లకే రావడం ఎవరం కలలో కూడా ఉహించి ఉండం. కానీ జగన్ ఆ పని చేసి చూపెట్టారు. పిల్లలను స్కూళ్లకు పంపితే ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఇస్తానని హామీ ఇస్తే అది ఎలా సాధ్యమని అనుకున్నవారు చాలా మందే ఉన్నారు. కానీ అది సాధ్యమేనని జగన్ రుజువు చేశారు. ప్రభుత్వ బడులను ‘నాడు–నేడు’ కింద బాగు చేయడం ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. వాటికి కార్పొరేట్ లుక్ తెచ్చిన ఘనత జగన్‌దే. చేయూత కింద స్వయం ఉపాధి నిమిత్తం మహిళలకు 18,750 రూపాయలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరచింది. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు వంటివాటిని ప్రారంభించి రాజకీయ ప్రత్యర్థులను విస్తుపరిచారు. ఆయా వర్గాలకు నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించడం జగన్ మాత్రమే చేయగలరని అనుకునేలా చేయడం మరో విశిష్టత. కొత్త జిల్లాల ఏర్పాటు, చివరికి ఎన్టీఆర్ పేరును జగన్ ఒక జిల్లాకు పెట్టడం కూడా ఆసక్తికరమైన అంశమే. జగన్ ఇప్పుడు దావోస్‌లో లక్షన్నర కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. విశాఖలో అదానీ డాట్ సెంటర్, కొప్పర్తిలో పారిశ్రామికవాడ, తీరప్రాంతంలో ఫిషింగ్ హార్బర్లు, ఓడ రేవులు మొదలైన వాటిని ఆరంభించారు. ప్రతిపక్షాలు ఈ అభివృద్ధిని ప్రస్తావించకుండా జాగ్రత్తపడతాయి. వైసీపీ నేతలు కూడా సంక్షే మంలో అమలు చేసే స్కీముల గురించే తప్ప, ఇతర నిర్మాణాత్మక ప్రాజెక్టులను ప్రొజెక్టు చేసుకోవడంలో అంతగా సఫలం అయినట్లు కనిపించదు. అందువల్లే టీడీపీ గానీ, వారి మీడియా గానీ ‘అప్పులు, అప్పులు’ అంటూ ప్రచారం చేయడం ద్వారా జగన్‌కు ఉన్న సాను కూల విషయాలను డైవర్టు చేయాలని విశ్వయత్నం చేస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఒకపక్క జగన్ అప్పులు చేశారనీ, డబ్బును పంచేస్తున్నాడనీ తెలుగుదేశంతో పాటు కొన్ని వర్గాలు ఆరోపిస్తుం టాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏభై శాతం పైగా పేదల సంక్షేమానికి ఖర్చుచేశానని వాదిస్తుంటారు. జగన్ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టామని అంటూనే, జగన్ అప్పులు తెస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. జగన్ పాలన మూడేళ్లలో రెండు సంవత్సరాలపాటూ దేశం అంతటితో పాటు ఏపీలో కూడా కరోనా సంక్షోభం అల్లాడించింది. అయినా దానిని తట్టుకుని రాష్ట్రం నిలబడేలా చేశారు జగన్. చంద్రబాబు ఈ విషయం ప్రస్తావించరు. తాను ఉంటే బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్పే చంద్రబాబు తాను ఏపీకి ఏమి చేసింది ఎన్నడైనా చెప్పగలిగారా? అలాగే జగన్ స్కీములు వృథా అనగలిగారా? ఇదంతా జగన్ విజయం కిందే తీసుకోవాలి. గతంలో చంద్రబాబు లక్ష కోట్ల రైతు, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పి చేతులెత్తేశారు. కానీ జగన్ తన హామీలను చేసి చూపించారు. అందుకే మహానాడులో ఈ విషయాలపై కాకుండా, ఏదో జనరల్ ప్రసంగం చేస్తూ విమర్శలు సాగించారు. జగన్ చేసి చూపెట్టిన వాటిని కాకుండా అదనంగా తాము ఏమి చేస్తామో చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ క్యాబినెట్‌లోని బలహీనవర్గాల మంత్రులు, ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు వంటివారు సామాజిక న్యాయ భేరిలో మాట్లాడుతూ... అమృతాన్ని దేవతలూ, రాక్షసులూ పంచుకున్నారనీ, అదే చంద్రబాబుకు అవకాశం వస్తే తన బంధు వులకూ, కుటుంబానికీ ఇచ్చుకుంటారనీ విమర్శించారు. మరి అదే జగన్ అయితే బలహీనవర్గాలవారికి పంపిణీ చేస్తారని అన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల ద్వారా ఆయా స్కీముల లబ్ధి దారులను వేధింపులకు గురి చేస్తే... పార్టీ ప్రాంతం, కులం, మతం వంటివి చూడకుండా జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో లక్షా ముప్పైవేల కోట్ల రూపాయలు జమచేసి చరిత్ర సృష్టించారు. జగన్ చెప్పినట్లుగానే మంత్రివర్గాన్ని రెండున్నర ఏళ్ల తర్వాత మార్పు చేయడమే కాకుండా, డెబ్బై శాతం బలహీన వర్గాలవారికి కేటా యించడం కూడా చరిత్రే. మహానాడులో సైతం చంద్రబాబు వీటికి నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. ఇక ప్రభుత్వపరంగా కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. తొలి రోజులలో ఇసుక విధానంలో మార్పు తీసుకువచ్చే క్రమంలో కొంత ఇబ్బంది అయింది. కౌన్సిల్ రద్దు కాస్త తొందరపాటు నిర్ణయం అన్న అభిప్రాయం ఏర్పడింది. మూడు రాజధానులపై ముందుకు వెళ్లడానికి పలు అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ మూడేళ్లలో జరిగిన అతి పెద్ద ఘటన అమలాపురంలో మంత్రి విశ్వ రూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను దగ్ధం చేయడమే అని చెప్పాలి. కానీ ఈ ఉదంతం వెనుక కూడా టీడీపీ, జనసేన ఉన్నాయని తేల డంతో ఆ పార్టీలే ఆత్మరక్షణలో పడ్డాయి. వచ్చే రెండేళ్లు జగన్ వీరిపై పోరాడుతూనే, తాను ఇచ్చిన హామీలను మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రయత్నించవలసి ఉంటుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
జగన్ స్కీములు చంద్రబాబుకు సవాలే!
శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటూ ఆ దేశానికి వెళ్లి వచ్చింది చంద్రబాబే. తన పదవీకాలం ముగిసేనాటికి వంద కోట్లు మాత్రమే నిధిని మిగిల్చి వెళ్లారు. అంటే ఆయన అప్పటికే ఏపీని శ్రీలంకలాగా మార్చేశారనా? ‘మనమే ఆర్థిక వ్యవస్థను గందరగోళం చేశాం కదా, అయినా జగన్ ప్రభుత్వం ఎలా నడుస్తోంది?’ అన్నది వారి సంశయం అనుకోవాలి. ఆర్థికంగా ఎన్ని అవరోధాలున్నా, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్ మూడేళ్లుగా విజయవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతుండటం వారికి నచ్చడం లేదు. వైసీపీ పాలనలో ఏపీ శ్రీలంకలా మారితే బాగుండు, వైసీపీని కాదని మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవడానికి ఇది ఉపయోగపడితే బాగుండు అని టీడీపీ కోరుకుంటున్నట్టు అనిపిస్తోంది. ‘ఆర్థిక అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారబోతోంది, దివాళా తీయబోతోంది’... ఇదీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. ఆయనకు పవన్ కల్యాణ్ వంత పాడుతారు. చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నేత ఏదైనా వ్యాఖ్య చేస్తే అది సీరియస్‌గా ఉండాలి. దురదృష్టవశాత్తు ఆయన అలా చేయడం లేదు. గమ్మత్తు ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఏ స్కీమ్‌నూ వ్యతిరేకించే ధైర్యం చంద్ర బాబు చేయలేరు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే వాటన్నిటిని రద్దు చేస్తానని చెప్పి, తాను తేబోయే వాటి గురించి చెప్పలేరు. ఇలా డబుల్ గేమ్ ఆడటమే ఆయన బలంగా భావించేవారు ఉండవచ్చు. అది అన్నిసార్లూ కుదరదని 2019 శాసనసభ ఎన్నికలు రుజువు చేశాయి. ఏ సంక్షేమ స్కీమ్‌లోనైనా ఏదైనా మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తే వెంటనే పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తారు. పోనీ ఆ స్కీమ్ కింద ఎలాగోలా డబ్బులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం తలపెడితే అందుకు ఆయా వ్యవస్థల ద్వారా అడ్డుపడుతుంటారు. జగన్ తాను మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా అమ్మ ఒడి, చేయూత, పేదలకు ఇళ్ల స్థలాలు, చేనేత నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆటో డ్రైవర్లకూ, క్షురకులకూ ఇలా వివిధ వర్గాలవారికి ఆర్థిక సాయం ప్రకటించే పథకాలను అమలు చేస్తున్నారు. అవన్నీ వృథా అని చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ గానీ భావిస్తే ఆ మాట చెప్పాలి కదా? స్కూళ్లను బాగు చేయడానికి నాడు–నేడు అమలు చేయడం ఖర్చు దండగ అని టీడీపీ అనుకుంటే ఆ సంగతి వివరిం చాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల అదనపు ఖర్చు అని భావిస్తే ఆ సంగతి చెప్పాలి. తాము అధికారంలోకి వస్తే వాటిని తీసివేస్తామని సవాల్ చేయాలి. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్ వంటివి అనవసరం అనుకుంటే ధైర్యంగా ఆ విషయం తెలపాలి. అలా చేయకపోగా, తమ పాలన వస్తే వలంటీ ర్లుగా టీడీపీ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తుంటారు. తాను చేయలేకపోయిన జిల్లాల విభజన జగన్ చేస్తే తప్పు పడతారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయమనీ, తాము అధికారంలోకి వచ్చాక వాటిని సరిదిద్దుతామనీ అంటారు. అంత నమ్మకం ఉంటే కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని ఎందుకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు? ఆయన దానిని మంజూరు చేశారే. తాను అధికారంలోకి వచ్చేవరకు ఆగి ఉండవచ్చు కదా? అంటే అధికారం లోకి వస్తామన్న నమ్మకం ఆయనకే లేదన్నమాట. ప్రభుత్వం చెత్త పన్ను వేసిందని చెత్త ప్రచారం జరిగింది. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మున్సిపల్ సంస్కరణలలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం కోసం చెత్త కోసం ప్రత్యేక రుసుము వసూలు చేయాలని చెప్పింది. దానిని చంద్రబాబు హయాంలోనే జీవోగా ఇచ్చారు. ఆ సంగతి మరుగుపరచి ప్రస్తుత ప్రభుత్వం ఏదో చేసిందని ప్రచారం చేస్తారు. అసలు ఆస్పత్రులలో గానీ, ఇతరత్రా యూజర్ చార్జీలను ప్రవేశపెట్టిందే చంద్ర బాబు. అప్పట్లో తానే దేశంలోకల్లా సంస్కర ణల ఛాంపియన్ అని ప్రచారం చేసుకునేవారు. ప్రభుత్వరంగ సంస్థల మూసివేతకు చర్యలు తీసుకున్నారు. విద్యుత్‌ను ఉచితంగా ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవలసిందే నని చెప్పేవారు. చివరికి వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ ఇస్తున్నా, మీటర్లు పెడతారా అంటూ హూంక రిస్తారు. కేంద్రాన్ని మాత్రం ఏమీ అనరు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 23 శాతం కాదు, 29 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ సమయంలో మాత్రం ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగిందని అంటారు. వెంటనే టీడీపీ మీడియా ఏవేవో లెక్కలు తీసి, ‘అవును, ఆదాయం పెరిగిం’దని ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం అప్పులు చేయగానే అమ్మో, ఆర్థిక వ్యవస్థ అంతటినీ నాశనం చేస్తున్నారంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పులు చేయకుండా ఉందా? కేంద్రమే ఏటా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నదో తెలియనిదా? పోనీ చంద్రబాబు టైమ్‌లో అప్పులు తీసుకురాకుండా ఉన్నారా? సెస్‌లు వేయలేదా? వాటిని ఆయన చేస్తే అదంతా అభి వృద్ధి కోసం చేసినట్లు జనం భావించాలి. ఎదుటి వారు చేస్తే అంతా నాశనం అని ప్రచారం చేయాలి. ఏపీని శ్రీలంకతో పోల్చే ఈ పెద్ద మనిషి 2014 ఎన్నికల సమ యంలో రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలన్నిటినీ సుమారు లక్ష కోట్లకు పైగా ఎలా మాఫీ చేస్తానని చెప్పారు? లక్షల కోట్లతో అమరావతిని నిర్మించడానికి ఎందుకు పూనుకున్నారు? సాధ్యా సాధ్యాలతో నిమిత్తం లేకుండా వందల హామీలను ఇచ్చి, వాటిని అమలు చేయలేక ఎందుకు చతికిల పడ్డారు? దానిని కదా శ్రీలంక తోనో, మరే దేశంతోనో పోల్చుకోవలసింది! శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటూ ఆ దేశానికి వెళ్లి వచ్చింది చంద్రబాబే కదా? మరి జగన్ ఏమి చేశారు! తాను చెప్పినవి చెప్పినట్లు చేస్తూ పేద ప్రజలకు ఊతం ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్లను ఇళ్లకు తీసుకువెళ్లి ఇచ్చే వ్యవస్థను తెచ్చారు. దానిని తీసి వేస్తామని చంద్రబాబు చెప్పగలరా? కరోనా కాలంలో జగన్ స్కీములు పేదలకు ఎంతగానో మేలు చేయడం వల్లే ఏపీ ప్రజలు సంక్షోభంలో పడలేదన్న సంగతి అర్థం అవుతూనే ఉంది. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత రేషన్ ఇచ్చింది. ఆ కోటాకు అదనంగా ఏపీ ప్రభుత్వం కూడా బియ్యం అందజేసింది. ఆ విషయాలను విస్మరించ గలమా? ప్రజల చేతిలో నగదు చలామణి అవ్వాలని నిపుణులు సూచించేవారు. అప్పటికే జగన్ దానిని అమలు చేశారు. దానికి తగినట్లు సుస్థిరాభివృద్ధి, జీఎస్టీ వంటి వాటిలో దేశం లోనే ఏపీ అగ్రభాగాన ఉంది. చంద్రబాబు పదవీకాలం ముగిసేనాటికి వంద కోట్లు మాత్రమే నిధిని మిగిల్చి వెళ్లారు. అంటే ఆయన అప్పటికే ఏపీని శ్రీలంకలాగా మార్చే శారని అనుకోవాలా? విద్యుత్ డిస్కమ్‌లకు వేల కోట్ల బకాయిలు పెట్టి అధికారం నుంచి దిగిపోయారు. టీడీపీ హయాంలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, అధికారం కోల్పోయాక జగన్ ప్రభుత్వానికి అప్పు ఎవడు ఇస్తాడని చంద్రబాబు, యనమల అన్నా... జగన్ విజయవంతంగా మూడేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతుండటం వారికి సుతరామూ నచ్చడం లేదు. ‘మనమే ఆర్థిక వ్యవస్థను గందరగోళం చేశాం కదా, అయినా జగన్ ప్రభుత్వం ఎలా నడుస్తోం’దన్నది వారి సంశయమనుకోవాలి. నిజానికి ఒక దేశం దెబ్బతినడానికి ఆ దేశ కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణం అవుతాయి. శ్రీలంకలో పేదలకు సంక్షేమ ప«థకాలు అమలు చేయడం వల్ల సంక్షోభం రాలేదు. కరోనా మహ మ్మారి, బాంబు పేలుళ్లు వంటివి వారి ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజంను దెబ్బతీశాయి. వాటికి తోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరిన్ని ఇబ్బందులలోకి నెట్టింది. చైనా నుంచి అప్పులు తెచ్చి మౌలిక వసతుల భారీ ప్రాజెక్టులు చేపట్టడం స్థోమతుకు మించినవి కావడంతో రుణాలు తీర్చలేకపోతున్నారు. ఇలాంటి కార ణాలు అనేకం ఉంటే ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్ పైనే ఆరోపణలు చేస్తూ తన అక్కసు వెళ్లగక్కుకుంటోంది. మన దేశంలో అప్పులు ఎంత మేర చేయాలో అన్నదానికి నిర్దిష్ట చట్టాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఇష్టారాజ్యంగా అప్పులు చేయాలని ఎవరూ సలహా ఇవ్వరు. ప్రభుత్వం తన ప్రాధాన్యత ప్రకారం అప్పులు చేసినా వాటిని సకాలంలో తీర్చే స్థితికి వెళ్లాలి. ప్రభుత్వానికి ఆయా సేవలు అందించినవారికీ, చిన్న చిన్న కాంట్రా క్టర్లకూ బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు తీర్చివేయాలి. పథకాల అమలుతో పాటు ఇలాంటివి కూడా ముఖ్యమే. తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక సూచనలు చేయకపోయినా ఫర్వాలేదు గానీ సంక్షో భంలో కూరుకుపోయిన శ్రీలంకతో పోల్చి ఏపీ ప్రజలను అవమా నించవద్దని చంద్రబాబును కోరుకుందాం. కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
బాబు బ్రాండ్ రాజకీయాలు
మనం మంచి చేయలేనప్పుడు, ఎదుటివారు చేస్తున్న మంచిని నిరాకరిస్తే? మనకు సమర్థత లేనప్పుడు, ఎదుటివారు అసమర్థులని విరుచుకుపడితే? ఇవీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు. నాటుసారా మరణాలంటూ ‘జంగారెడ్డిగూడెం యాగీ’ని సృష్టించింది... అసెంబ్లీలో ప్రభుత్వ పరంగా వచ్చే పాజిటివ్ సమాధానాలను అడ్డుకోవడం కోసమే అన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. తద్వారా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఏర్పడే సానుకూలతను అడ్డే యత్నం అది. ఇందులో సహజంగానే టీడీపీ మీడియా భాగం అవుతుంది. గతంలో సారా నిషేధం అమలులోనూ, అనంతరం దాన్ని ఎత్తివేయడంలోనూ, తిరిగి ఇప్పుడూ టీడీపీ, దాని అనుకూల మీడియా ఆడుతున్నవి కపట నాటకాలే! ఒక పత్రికలో నాటుసారా వల్ల జంగారెడ్డి గూడెం వద్ద పలువురు మరణించారని వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు వెంటనే జంగారెడ్డిగూడెం వెళ్లి పోయారు. ఆయన ఎటూ అసెంబ్లీకి రావడం లేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను సభకు పంపించి రచ్చ చేయిస్తున్నారు. నిజంగానే నాటు సారా వల్ల ఎవరైనా మరణిస్తే విచారించవలసిందే. దానిని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం మాత్రం విచారకరం. సారా వల్ల అందరూ చనిపోలేదనీ, సహజ మరణాలనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తాను స్వయంగా బాధిత కుటుంబాలతోనూ, ప్రభుత్వ వైద్యులతోనూ మాట్లాడానని శాసనసభలో వివరించారు. అయినా తెలుగుదేశం ఎమ్మెల్యేలు శాంతించలేదు. ప్రతి రోజూ ప్రభుత్వ పరంగా వచ్చే పాజిటివ్ సమాధానాలను రానివ్వకుండా చేయడం కోసమే ఇలా వ్యవహరించేవారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఉదాహరణకు ఒక రోజు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించడంపై చర్చ జరగవలసి ఉంది. దానిపై ముఖ్య మంత్రి జగన్ సహజంగానే తన భావాలను పంచుకుంటారు. తెలుగు దేశం నేతలు ఈ స్కీమ్‌కు కోర్టుల ద్వారా ఎలా అడ్డుపడిందీ వివరి స్తారు. దీనికి ఇష్టపడని టీడీపీ ఈ లొల్లిని సాకుగా వాడుకుంది. సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్ర బాబు ఆరోపించారు. నిజంగానే ఇలాంటి మరణాలపై టీడీపీ నాయకత్వానికి సాను భూతి ఉందా అనుకుంటే అదేమీ కనిపించదు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు, ఆయన కుటుంబం పుణ్యస్నానం చేసే సన్నివేశాలను డాక్యుమెంటరీగా చిత్రీకరించడం కోసం సామాన్య భక్తులను అంద రినీ గేటు వద్దే నిలిపివేశారు. వేల సంఖ్యలో జనం గుమికూడటం, ఒక్కసారిగా గేటు తీయడంతో తొక్కిసలాట జరిగి ఇరవై తొమ్మిది మంది నిమిషాలలో మరణించారు. కానీ ఆ కేసులో కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ కాలేదు. చంద్రబాబు కూడా బాధ్యత తీసుకోలేదు. పైగా ఆ ఘటనకు సంబంధించి ఏ విధంగా జవాబు ఇచ్చారో చూస్తే విస్తుపోవాల్సిందే. కుంభమేళాలో చనిపోవడం లేదా? జగన్నాథ ఊరేగింపులో మరణించలేదా? రోడ్డు ప్రమాదాలలో మృతి చెందలేదా అని వ్యాఖ్యానించి పుష్కరాల తొక్కిసలాటను చిన్న సమస్యగా తేల్చేశారు. తన ప్రచార యావ కోసం తొక్కిసలాట జరిగిందన్న సంగతిని పక్కనపెట్టి రోడ్డు ప్రమాదాలతో పోల్చారు. కానీ ఈ మూడేళ్లలో ఎక్కడ ఏ ఘటనలో ఎవరు మరణించినా, తెలుగుదేశ వర్గం మీడియా దానిని వివాదం చేస్తోంది. వెంటనే చంద్ర బాబు లేదా ఆయన కుమారుడు అక్కడకు వెళతారు. తమ తండ్రి చనిపోయిన బాధ కన్నా కొంతమంది దీనిని రాజకీయం చేసి సారా వల్ల చనిపోయారని చెప్పడం మరింత బాధగా ఉందనీ, ఇది అవమానకరమనీ అతడి కుమారుడు, కుమార్తె వాపోయినా వీరికి పట్టదు. అసలు సారా అలవాటే లేని వ్యక్తికి కూడా దీనిని అంటగట్టి అవమానించడానికి ఈ రాజకీయ పార్టీలు వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు జరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. దీనికి ఏకంగా ముఖ్యమంత్రో, మంత్రో రాజీనామా చేయవలసి వస్తే, టీడీపీ హయాంలో జరిగిన వాటికి ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్ని సార్లు రాజీనామా చేసి ఉండాలి! తిరుపతి అడవులలో ఇరవై మంది ఎర్రచందనం కూలీలను ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఒక మహిళా అధికారిని జుట్టుపట్టి కిందపడేసినప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద అక్రమ ఇసుక వ్యవహారంలో లారీతో ఢీకొట్టి సుమారు పదిమందిని దుండ గులు చంపినప్పుడు ఎవరు పదవుల నుంచి వైదొలగాలి? ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇక్కడ ఒక విశేషాన్ని గుర్తు చేసుకోవాలి. సారా నిషేధం కావాలని నెల్లూరు జిల్లాలో దూబగుంట రోశమ్మ నేతృత్వంలో ఒక ఉద్యమం జరిగింది. అది ఇతర ప్రాంతాలకు కూడా పాకింది. ఒక ప్రధాన పత్రిక ఆ అంశాన్ని తన భుజాన ఎత్తుకుని ఒక పేజీ కేటాయించి వార్తలు ఇచ్చేది. ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి సారాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఆ పత్రిక శాంతించలేదు. మొత్తం మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పేజీలకు పేజీలు వార్తలు ఇస్తూ రాష్ట్రం అంతటా అల్లకల్లోలం అవుతున్నట్లు భ్రమలు కల్పించేది. ఎన్.టి.రామారావు కూడా మద్య నిషేధాన్ని ఎన్నికల అంశంగా తీసుకుని ప్రచారం చేశారు. తాను సీఎం అవ్వగానే మద్య నిషేధం అమలు చేశారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎత్తివేశారు. అప్పుడు ఆ పత్రికవారు నామ్ కే వాస్తే ఒక సంపాద కీయం రాసి వదిలేశారు. ఆ పత్రిక తన వ్యాపార, రాజకీయ కారణాల తోనే అలా వ్యవహరించిందని అప్పట్లో అంతా అనుకునేవారు. ఎన్.టి.ఆర్. మద్య నిషేధం సమయంలో కొన్ని డిస్టిలరీలు, బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన లండన్ టూర్ వెళ్లారు. ఆ తరుణంలో చంద్రబాబు టీమ్ ఈ ఉత్తర్వులతో ఏపీ అంతా అలజడి ఏర్పడినట్లు ప్రచారం చేసింది. చివరికి లండన్‌లో ఉన్న ఎన్.టి.ఆర్.తో మాట్లాడి వాటిని కాన్సిల్ చేయించినట్లు చెప్పేవారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబే పలు డిస్టిలరీలకు, బ్రూవరీలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వంపై దాడి చేసే ప్రక్రియలో భాగంగా ఏపీలో ముఖ్యమైన బ్రాండ్ల మద్యం దొరకడం లేదనీ, జె బ్రాండ్ మద్యమే లభిస్తోందంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా చూస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదట. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్... ఇలా రకరకాల పేర్లతో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ ఆయన టైమ్‌లోనే వచ్చినవట. నిజం వెలుగులోకి వచ్చే లోపు అబద్ధం లోకం చుట్టి వచ్చిందట. తెలుగుదేశం వారు తాము చేసిన తప్పులను ఎదుటివారిపై మోపి ప్రచారం చేయడంలో దిట్టలని ఈ ఉదంతం రుజువు చేస్తోంది. 2014లో టీడీపీ తిరిగి ఎన్నికైన తర్వాత బెల్టు షాపులను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించినా, దానిని ఆయన విస్మరించిన ఫలితంగా నలభై ఐదువేల బెల్టు షాపులు అవతరించాయి. ఇక పర్మిట్ రూమ్‌ల పేరుతో ఎంత చెడ్డపేరు తెచ్చుకుందీ అందరికీ తెలుసు. మద్యాన్ని టీడీపీ నేతలు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కానీ జగన్ సీఎం అయ్యాక బెల్టు షాపులు దాదాపు లేకుండా చేశారు. ప్రైవేటు షాపులను ఎత్తివేసి ప్రభుత్వపరం చేశారు. ఇది ప్రజలలోకి బాగానే వెళ్లింది. దీనిని చెడగొట్టడం కోసం తంటాలు పడటంలో భాగంగానే జంగారెడ్డి గూడెం యాగీని టీడీపీ సృష్టించింది. వీరు ఆ ఊరు వెళ్లేవరకూ అక్కడ అంతా ప్రశాంతంగానే ఉండటం గమనార్హం. ఇంకో సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. ఒక నాయకుడు గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన పాతికేళ్ల క్రితం సారా వ్యాపారం చేసేవారు. ఆ సందర్భంలో ఏదో ఘటన జరిగి అసెంబ్లీలో పెద్ద వివాదం అయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక మంత్రికి ఆయన సన్నిహితుడని చంద్రబాబు ఆరోపించారు. దానిపై ఆ మంత్రి మండిపడ్డారు. సీన్ కట్ చేస్తే ఆ వ్యాపార నాయకుడు తెలుగుదేశంలో చేరి అత్యంత ముఖ్యమైన నేతగా ఎదిగారు. చంద్రబాబుకు సన్నిహితుడుగా చక్రం తిప్పారు. తదుపరి టీడీపీ అధికారం కోల్పోయాక పార్టీ వీడారు. చంద్రబాబు రాజకీయాలు ఇలా ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర సంపాదించడం చంద్రబాబు అదృష్టం. ఏపీలో అత్యంత ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పదవులలో ఉండటం కూడా గొప్ప విషయమే. కానీ ఆయన ఆ గొప్పతనం నిలబడేలా వ్యవహరించకుండా, చిన్నబుద్ధులతో ప్రతి దానికీ రాజకీయం పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయబోయి తాను అప్రతిష్టపాలు కావడం ఒక విషాదం. వ్యాసకర్త కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
టికెట్ల ధర సామాన్యుడికి అందకూడదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని కొందరు నటులు విమర్శించడం హాస్యాస్పదం. భారీ పారితోషికాలతో సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణం అవుతున్నవారు మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకోవడానికి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారు. టికెట్ల ధరల విషయంలో పారదర్శకతను తేవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం వీరికి మింగుడుపడటం లేదంటే ఆశ్చర్యం ఏమీలేదు. ఏ ధరలైనా పెరిగితే గగ్గోలు పెట్టే టీడీపీ మీడియా ఈ విషయంలో భిన్నంగా వ్యవహరించడం కూడా ఆశ్చర్యపరిచే సంగతి కాదు. జగన్ ప్రభుత్వంపై ద్వేషమే వారిని నడిపిస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల సగటు ప్రేక్షకులు మాత్రం సంతోషంగా ఉన్నారు. మరి ఆ సామాన్యుడి వైపు సినిమా పరిశ్రమ నిలబడుతుందా, లేదా అన్నది ఆలోచించుకోవాలి. నటుడు నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నాని వివాదాలలోకి ఎన్నడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది మొదటిసారిగా ఏపీ ప్రభుత్వ సినిమా టికెట్ల ధరలను విమర్శించిన తీరుపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆయన వ్యాఖ్యలను సమర్థించేవారు కూడా ఉండవచ్చు. ఆయన థియేటర్ల కన్నా కిరాణా షాపులు పెట్టుకోవడం బెటర్ అన్నారు. కిరాణా షాపులవారిని అవమానించడమే అని కొందరు వ్యాఖ్యానిస్తే, కిరాణా షాపు పెట్టుకుంటే ఎవరు వద్దన్నారని మరికొందరు అన్నారు. సినిమా నిర్మాణాలకు అయ్యే వ్యయంపై ఒక నియంత్రణ లేదు. అవుతున్న ఖర్చు ఎంత అన్నదానిపై వాస్తవాలు వెల్లడించే పరిస్థితి తక్కువే. కానీ థియేటర్లలో టికెట్లను తమ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కూడా సినిమా పరి శ్రమలో రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న సినిమాలు నిర్మించేవారు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సమ ర్థిస్తుండగా, భారీ బడ్జెట్‌తో తీస్తున్న వర్గంవారు వ్యతిరేకిస్తున్నారు. అగ్రశ్రేణి నటులు తీసుకునే పారితోషికం చర్చనీయాంశం అవు తోంది. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతున్నారు. ‘భీమ్లా నాయక్’కు మూలమైన మలయాళ సినిమాకు ఐదు కోట్లు ఖర్చయితే, 43 కోట్ల లాభం వచ్చిందట. దాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వంద కోట్లు ఖర్చు పెట్టారట. అందులో యాభై కోట్లు పవన్ కల్యాణ్‌కే చెల్లించవలసి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంతో పవన్ చెప్పగలిగితే క్లారిటీ వస్తుంది. అది కూడా వైట్‌లో తీసు కుంటారా? బ్లాక్‌లో తీసు కుంటారా అన్నది చెప్పగలగాలి. ఈ నేప«థ్యంలో సినిమా టికెట్ల ధరలను సామాన్యులకు అందు బాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ల ధరలు నిర్ణయిం చింది. ఈ ధరల వల్ల తమకు నష్టం వస్తుందని భావిస్తే, సినీ పరిశ్రమ వారు ప్రభుత్వానికి అందుకు ఆధారాలు చూపి, టికెట్ల రేట్లు మరి కొంత పెంచాలని అడగవచ్చు. కానీ ప్రముఖ హీరోలు ఒకరిద్దరు ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. పవన్ కళ్యాణ్ అవసరమైతే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని అన్నారు. అందుకు ఎవరైనా అభ్యంతరం చెబుతారా? నిజంగా ఆ పని చేయగలరా? నటుడు నాని ధరలు తక్కువ పెట్టడం అంటే ప్రేక్షకులను అవమానించడమని చిత్రమైన సూత్రాన్ని చెప్పారు. ఎంత గొప్ప సినిమా అయినా ఎవరైనా జేబులకు చిల్లు పెట్టుకోవాలని భావిస్తారా? నాని చెప్పిన వాదన కరెక్టు అయితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేయడం వినియోగ దారులను అవమానించినట్లా? కూరగాయల ధరలు పెరిగినా, నిత్యా వసర వస్తువుల ధర పెరిగినా గొడవలు చేసే రాజకీయ పక్షాలు లేదా ఒక వర్గం మీడియా సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నట్లుగా వ్యవహ రిస్తున్నాయి. కొంతమంది నటుల వ్యాఖ్యలను పటం కట్టి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కొన్ని థియేటర్లు మూసివేశారని, అందులో పనిచేసేవారి బతుకు ఛిద్రమైపోతోందని ఒక పత్రిక ప్రచారం చేసింది. ఒకప్పుడు చాలా థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1,100 థియేటర్లు మాత్రమే మిగిలాయి. అప్పుడు ఇలా ఎందుకు కథనాలు ఇవ్వలేదు? కరోనా సందర్భంలో హాళ్లు మూతపడ్డాయి. అప్పుడు ఎందుకు ఆవేదన చెందలేదు? గతంలోనే పలు సినిమా థియేటర్లను కల్యాణ మండపాలుగా మార్చారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై సినిమాలు విడుదల చేయడం థియేటర్లకు నష్టం కాదా? మరి అవి వద్దని ఈ పత్రికలు వార్తలు ఇస్తున్నాయా? సినిమా నటులంటే ప్రజలలో ఉన్న ఆసక్తి మేరకు కథనాలు ఇవ్వవచ్చు. కానీ ద్వేషభావంతో అలా చేస్తు న్నారు. అదే సమయంలో కొందరు మంత్రులు ఇచ్చిన జవాబులకు ప్రాధాన్యం ఇవ్వరు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని తదితరులు ఈ అంశంపై స్పందించారు. సామాన్యుడి ప్రయోజనం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చేశామని వారు అన్నారు. అనిల్ యాదవ్ నేరుగానే ఆయా నటులు తీసుకుంటున్న పారితోషికంపై ప్రశ్నలు సంధించారు. మరో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముందుగా హీరోలు తాము తీసుకుంటున్న పరిహారం గురించి బహిరంగంగా చెప్పి, ఆ తర్వాత టికెట్ల ధరల గురించి అడగాలని, లేకుంటే వారికి నైతిక అర్హత ఎక్కడి దని ప్రశ్నించారు. మరి వీటికి జవాబు వస్తుందా? థియేటర్లలో తనిఖీలపై టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లారని కోపంతో ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లైసెన్సులు లేకపోయినా, అవస రమైన సదుపాయాలు లేకపోయినా, బ్లాకులో టికెట్లు అమ్ముతున్నా వదలిపెట్టాలన్నది బీజేపీ విధానమా? లేక టీడీపీలో ఉన్నప్పుడు సినిమా వారితో ఏర్పడిన అవినాభావ సంబంధం కారణమా? నిజా నికి సినిమా థియేటర్లలో ప్రతి సంవత్సరం తనిఖీలు చేయాలి. తద్వారా అవి అన్నీ సజావుగా నడిచేలా చూడాలి. సంవత్సరాల తర బడి లైసెన్సులు రెన్యువల్ చేయించుకోకుండా థియేటర్లు నడుస్తు న్నాయంటే, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకుండా ఉన్నాయంటే ఏమను కోవాలి? పొరపాటున ఎక్కడైనా ప్రమాదం జరిగితే అప్పుడు వీరే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కదా! ఆన్లైన్ విధానంలో టికెట్ల అమ్మకానికి సినీ పరిశ్రమలో దాదాపు అంతా ఒప్పుకున్నారు. నిజంగానే ఏదైనా సినిమాకు నిర్దిష్ట కారణాల వల్ల ఎక్కువ వ్యయం అయితే దానిని ఆధార సహితంగా చూపి టిక్కెట్ ధర పెంచాలని నిర్మాతలు కోరితే, ఆమోదించవచ్చేమో. ఆ పెంచిన ధరలో కొంత అదనపు పన్ను వసూలు చేయాలి. తద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే సామాన్య ప్రేక్షకులు సినిమా టికెట్ల ధరలు తగ్గినందుకు, బ్లాక్‌లో కొనాల్సిన అవసరం లేనందుకు సంతోషిస్తున్నారు. హీరోలు తమ పారితోషికం కొంత తగ్గించుకుంటే, సినిమా నిర్మాణ వ్యయం తగ్గి, ప్రేక్షకులపై భారం వేయకుండా ఉండవచ్చన్నది పలువురి సలహా. కానీ నటులు అందుకు సిద్ధపడతారా అన్నది సందేహమే. మరో విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల ప్రచారంలో సినిమా నటులపై కూడా అధికంగా ఆధారపడుతుంది. దాంతో చంద్రబాబు టికెట్ల ధరలు పెంచాలో, తగ్గించాలో చెప్ప కుండా మౌనంగా ఉన్నట్లుగా ఉంది. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రధానంగా ఒక్క జగన్ ప్రచారంపైనే ఆధారపడి ఉంది. సినిమావారితో సంబంధం లేకుండా ఆయన జనంలోకి వెళ్లారు. ఎవరైనా కొద్దిమంది సహకరించి ఉండవచ్చు. కానీ స్థూలంగా ఆయన సినిమా వారి మీద ఆధారపడింది తక్కువే అని చెప్పాలి. పవన్ కల్యాణ్ వంటి కొద్దిమంది అటు సినిమాలోను, ఇటు రాజకీయాల లోను ఉంటూ గందరగోళంగా వ్యవహరిస్తున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. సినీ రంగంవారు ఏపీలోని థియేటర్ల ద్వారా ఆదాయం పొందుతూ తెలంగాణలో పన్నులు కడుతున్నారట. దానికి కారణం ఈ థియేటర్లు దాదాపు అన్నీ ఐదుగురు చేతిలో ఉండటమేనట. ఏపీలో షూటింగులు జరిపి, పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ కోరికను వీరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఏపీలో షూటింగులు చేసేవారికి అదనపు చార్జీ వసూలు చేసుకునే అవకాశం కొంతవరకూ ఇస్తే మంచిదే. రికార్డింగ్, డబ్బింగ్ స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నవారికి కొంత రాయితీ ఇస్తే బాగుంటుంది. సినిమా అన్నది సామాన్యుడి వినోద సాధనం. దాన్ని అందు బాటు ధరలో ఉంచాలా? ఖరీదైన వ్యవహారంగా మార్చాలా అన్నది సినీ పరిశ్రమ కూడా ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం సామాన్యుల వైపు నిలబడింది. మరి సినిమా రంగం ఎవరి వైపు ఉంటుందో! కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఇది సెల్ఫ్ గోల్ కాదా బాబూ?
ఏపీ అసెంబ్లీ తాజా ఎపిసోడ్లో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తన సతీమణిని తానే బదనాం చేసుకున్నంత పనిచేయడం అత్యంత దురదృష్టకరం. ఆయన తన సతీమణి ప్రతిష్ఠను పణంగా పెట్టకుండా ఉండాల్సింది. అసెంబ్లీలో ఎవరైనా చంద్రబాబును కానీ, ఆయన కుటుంబ సభ్యులను కానీ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాఖలా లేదు. కాదూ... అలా చేశారని ఆరోపిస్తున్నప్పుడు కనీసం దానిపై సభలోనే నిలదీయాల్సింది. అలా కాకుండా చంద్రబాబు లేచి తాను సీఎం అయ్యేదాక సభకు ఇక రాను అని చెప్పడం ద్వారా ఆత్మరక్షణలో పడే పరిస్థితిని తానే కోరి తెచ్చుకున్నట్లయింది. ప్రెస్మీట్లో విలపిస్తూ, తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కాస్త తొందరపడ్డారు. అసెంబ్లీలో, ఆ తర్వాత జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే ఈ భావన కలుగుతుంది. తన వ్యక్తిగత విషయాన్ని మొత్తం రాష్ట్రానికి వర్తింపచేసి, తాను మళ్లీ సి.ఎమ్. అయ్యాకే సభలోకి వస్తానని చేసిన ప్రకటన, తదుపరి కాస్త సవరించుకుని ప్రజాక్షేత్రంలో తేల్చుకుని వస్తానని చేసిన ప్రకటన తొందరపాటుగా అనిపిస్తాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన తన సతీమణిని తానే బదనాం చేసుకున్నట్లుగా అవడం అత్యంత దురదృష్టకరం. డెబ్బై ఏళ్లు దాటిన ఈ వయసులో, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా చేయడం బాగోలేదు. ఆయన తన గౌరవాన్ని పెంచుకునే విధంగా వ్యవహరించి ఉండాల్సింది. తన సతీమణి ప్రతిష్టను పణంగా పెట్టకుండా ఉండాల్సింది. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు కావచ్చు..మరొకరు కావచ్చు..ఎవరైనా చంద్రబాబును కాని, ఆయన కుటుంబ సభ్యులను కాని ఉద్దేశించి ఎవైనా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే కచ్చితంగా తప్పే అవుతుంది. వాటిని ఖండించాల్సిందే. కాని దానిపై చర్చ కూడా జరగకముందే చంద్రబాబు లేచి ఆవేశంగా తాను సి.ఎమ్. అయ్యేదాక సభకు ఇక రాను అని చెప్పడం ద్వారా ఆత్మరక్షణలో పడినట్లయింది. ఒకవేళ అంబటి రాంబాబు అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటే, వెంటనే టీడీపీ సభ్యులంతా కలిసి అసెంబ్లీలో తేల్చుకుని ఉండాల్సింది. అంబటిపై చర్య తీసుకోవాలని కోరి ఉండాల్సింది. అలాకాకుండా చంద్రబాబు సభా బహిష్కారం ప్రకటన చేశారు. ఆ తర్వాత ప్రెస్మీట్లో విలపించడం ద్వారా తనకు అవమానం జరిగిందని, తన భార్యను అవమానించారని చెప్పడం ద్వారా సానుభూతి రాజకీయానికి ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. అసెంబ్లీలో ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే తప్పు. కాని నిర్దిష్ట ఆధారాలు లేకుండా తన భార్యను ఏదో అన్నారంటూ చంద్రబాబు మాట్లాడడం అంతకన్నా పెద్ద తప్పు అవుతుంది. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మధ్య జరిగిన ఈ న్యూసెన్స్‌ను చంద్రబాబు అసెంబ్లీకి తెచ్చి అక్కడ అందరికి పులిమే యత్నం చేయడం ఎంతవరకు సమంజసం? అలా చేయడం ద్వారా తన రాజకీయం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారు. నిజంగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా అనుచితంగా మాట్లాడి ఉంటే, సంబంధిత వీడియోని చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించి ఉండేవారు. అప్పుడు వైఎస్సార్సీపీ ఆత్మరక్షణలో పడేది. కానీ ఆయన అలా చేయలేదు. పైగా అంబటి రాంబాబు తాను ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అలా చేసి ఉంటే చెప్పుతో కొట్టవచ్చని సవాల్ చేశారు. మరి దీనికీ టీడీపీ సమాధానం చెప్పలేదు. పైగా అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి కన్నబాబు వ్యవసాయరంగంపై మాట్లాడుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆ అంశంతో సంబంధం లేని రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటికి కన్నబాబు కానీ, ఇతరులు కానీ సమాధానం ఇస్తూ వెళ్లారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకు వేసి బాబాయి–గొడ్డలి, తల్లి, చెల్లి అంటూ రెచ్చగొట్టే విధంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించసాగారు. చివరికి బాబు సైతం ఈ వ్యాఖ్యలు అన్నారు. అంటే అది సీఎం జగన్‌ను అవమానించినట్లు కాదా? తల్లికి ద్రోహం చేశారని చంద్రబాబు అనవచ్చా? ఈ క్రమంలో అంబటి లేచి ఏదో సర్దుబాటు ధోరణితో మాట్లాడాలని అనుకుని ఆ ప్రయత్నం చేశారు. కానీ ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే ఎవరో రాంబాబును ఉద్దేశించి అభ్యం తరకర వ్యాఖ్య చేశారు. అది సమంజసమేనని చంద్రబాబు అంటారా? దానికి ప్రతిగా ఆయన అన్నీ మాట్లాడదాం.. అంటూ మాధవరెడ్డి అన్న పదం మాట్లాడారు. ఆ మీదట చంద్రబాబు తన భార్యను కించపరిచారంటూ, ఇది కౌరవ సభ, తాను ఇక్కడ ఉండను, మళ్లీ íసీఎం అయ్యాకే అడుగుపెడతానని శపథం చేసి వెళ్లిపోయారు. నిజానికి చంద్రబాబు మాట్లాడుతుండగా, కొంత వివాదాస్పదంగా ఉందనుకుని స్పీకర్ తమ్మినేని సీతారామ్ మైక్ కట్ చేశారు. కానీ, చంద్రబాబు మాట్లాడిన ఇతర మాటలన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి. దానికి కారణం ఒక టీడీపీ ఎమ్మెల్యే తన సెల్ పోన్లో వాటిని చిత్రీకరించడమేనని తేలింది. నిజానికి ఇలా సెల్ అసెంబ్లీ లోనికి తెచ్చి చిత్రీకరించడం తప్పు. అయినా చేశారు. ఒకవేళ నిజం గానే అంబటి లేదా మరెవరైనా కనుక అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని కూడా టీడీపీ ఎమ్మెల్యే రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలేవారు. చంద్రబాబు మీడియా సమావేశంలో పెట్టి చూపేవారు. అవేవీ చేయలేదు.అంటే వారి వద్ద అలాంటి ఆధారాలూ ఏవీ లేవు. చంద్రబాబు అసంబ్లీకి రాకుండా ఉండాలనుకుంటే అందుకు అనుసరించవలసిన పద్ధతి ఇది కాదు. ఇక ఇప్పుడు చంద్రబాబు చేసిన శపధం నెరవేరాలంటే ఆయన ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. అంటే అసెంబ్లీ ఎన్నికలు రావాలి. అప్పటి వరకు ఆగాల్సిందే. ఆయన దానికన్నా అసెంబ్లీకి రాజీనామా చేసి సవాల్ విసిరి ఉంటే తెలుగుదేశం కార్యకర్తలలో ఒక ఉత్సాహం వచ్చేది. కాని ఆయన అలా చేయకుండా కుట్రపూరిత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ నేత ఒకరు పార్టీ ఆఫీస్‌లో కూర్చుని ఎంత నీచంగా సంబోధించిందీ అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు ఖండించలేదు. వైఎస్ జగన్ కుటుంబంలోని వారందరినీ గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు అవమానిస్తున్నప్పుడు, జేసీ దివాకరరెడ్డి ఆనాటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ని దారుణంగా మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు ముసిముసి నవ్వులతో కూర్చునేవారు. చంద్రబాబు, లోకేష్‌లు జగన్‌ను ఉద్దేశించి సైకో రెడ్డి అని, మరొకటని పలుమార్లు వ్యాఖ్యానించారు. గత టరమ్‌లో నగరి ఎమ్మెల్యే రోజా పట్ల టీడీపీ ఎలా వ్యవహరించింది. ఎంత ఘోరంగా అవమానించిందీ ఆమె చెబుతుంటే ఎవరికైనా బాధ కలిగిస్తుంది. జగన్ కుటుంబంపైన, ఆయన సోదరి షర్మిల పైన బాలకృష్ణకు చెందిన ఒక భవనం నుంచే అసభ్యకర మెస్సేజ్‌లు ప్రచారం అవుతుండేవన్న అభియోగం వచ్చింది. ఆమె స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్.టి.ఆర్ రెండో కళత్రం లక్ష్మీపార్వతిని, చంద్రబాబు వర్గం ఎన్నిరకాలుగా అప్రతిష్టపాలు చేసిందీ ఆమె ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన పరాభవం గురించి ప్రశ్నిస్తున్నారు. దానికి జవాబిస్తారా? ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన ఘట్టం, ఆయన కన్నీటి పర్యంతం అయిన ఘట్టం వంటివి జరిగినా, అప్పట్లో సొంత కుటుంబ సభ్యులు కనీసం ఆయనను పరామర్శించలేదు. ఇప్పుడు చంద్రబాబు భార్యను తాము ఒక్క మాట కూడా అనలేదని వైసీపీ వారు పదేపదే చెబుతున్నా, మీరు అన్నారు... అంటూ టీడీపీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, మరికొందరు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆమెకు తీరని అన్యాయం చేస్తున్నారు. బాబు రాజకీయాలలోకి వీరు రావడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలను పొడిగించుకుంటూ వెళ్లడం సంబంధిత మహిళకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించాలి. అయినా ఆమె కుటుంబ సభ్యులే ఇలా పదేపదే ఉటంకించి ఆమె గురించి ప్రచారం చేయడం బాధాకరం. రాజకీయాల ముందు ఇవేవీ కనిపించవేమో! నేను మాత్రం ఆమె గౌరవానికి భంగం కలగరాదని పేరు కూడా రాయలేదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
మాటలేనా? మద్దతిస్తుందా?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు జాతీయ అంశాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనడం ద్వారా ఏపీ విభజన వ్యవహారం ప్రాముఖ్యతను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లయింది. కానీ ఆ దిశగా చొరవ చూపి, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించినప్పుడే కేంద్రం తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించినట్లు! ఏపీకి ప్రత్యేక హోదా అంశం పట్ల గత సీఎం చంద్రబాబు నాలుగు రకాలుగా స్పందించి నవ్వుల పాలవడం వల్ల అది నాన్ సీరియస్ వ్యవహారానికి తగ్గిపోయింది. అప్పుల విషయంలోగానీ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అన్ని సమస్యల పట్లగానీ జగన్ వైఖరి స్పష్టంగా ఉంది. మరి ఆ దిశగా కేంద్రం కూడా అంతే స్పష్టంగా ఉంటుందా, అన్ని రకాలుగా ఆదుకుంటుందా అన్నది చూడాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు కేవలం ఆ రాష్ట్రాలకే పరిమితం కాదనీ, జాతీయ అంశాలు అనీ అనడం ద్వారా ఏపీ విభజన వ్యవహారం ప్రాముఖ్యతను ఆయన అంగీకరించారు. తద్వారా విభజన సమస్యలకు సత్వరమే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామన్న భరోసా కూడా ఇచ్చినట్లు అయింది. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా ఈ హామీ ఇచ్చారు. నిజానికి ఈ పని ఎప్పుడో జరిగి ఉండాల్సింది. కాలం గడిచేకొద్దీ సమస్యల పరిష్కారం కష్టసాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య పరిస్థితి అదే రకంగా ఉంది. ఒక పక్క విభజన సమస్యలు, మరో వైపు నదీ జలాల వివాదాలు పెరుగుతున్నాయే గానీ తేలడం లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న సంస్థల ఆస్తులపై ఇంత వరకు ఏమీ తేలలేదు. దాంతో తెలంగాణకు పెద్ద నష్టం లేదు. కానీ ఏపీకి వాటిని అనుభవించే అవకాశం లేదు. విక్రయించే అవకాశం లేదు. ఆయా సంస్థలలో ఉన్న నిధుల పంపిణీపై సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినా, అది అమలు కావడం లేదు. ఈలోగా తెలుగు అకా డమీ వంటి సంస్థలలో నిధులను కాజేస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం విభజన చట్టం కల్పించింది. దాని ప్రకారం 2024 వరకు అలాగే ఉండవచ్చు. ఇందుకు తగ్గట్లుగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు భారీగానే ఖర్చు చేసి ఆయా భవనాలను ఆధునీకరిం చారు. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన సెక్రటేరియట్ భవనా లలో కేవలం తన చాంబర్‌కే కోట్ల రూపాయలను చంద్రబాబు వ్యయం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంతలో ఏడాదిలోపే పెద్ద సంచలన ఘటన జరగడం, దాంతో చంద్రబాబు పెట్టేబేడా సర్దుకుని హడావుడిగా విజయవాడ వెళ్లిపోవడం జరిగింది. తెలం గాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు ప్రయత్నించా రన్న ఆరోపణ రావడం, ఆ క్రమంలో అప్పట్లో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు యాభై లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం తెలిసిన సంగతే. ఈ ఒక్క ఘటన ఏపీ భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేసిందంటే ఆశ్చర్యం లేదు. ఉమ్మడి రాజధానిపై హక్కు వదలుకోవడం, రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడం తదితర ఘట్టాలు జరిగాయి. చంద్రబాబు అయితే పైస్థాయిలో పైరవీ చేసుకుని కేసీఆర్‌తో రాజీపడి కేసు నుంచి బయటపడ్డారు గానీ, ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పక్కన బెట్టి ప్యాకేజీని తెరపైకి తెస్తే అంగీకరించారు. పోల వరం ప్రాజెక్టును కేంద్రం చేపట్టవలసి ఉండగా, తమకు కాంట్రాక్టు నిర్ణయాధికారంతో తామే నిర్మిస్తామని తీసుకున్నారు. విజయవాడలో వివిధ ఆఫీసుల ఏర్పాటుకు అద్దె భవనాలను తీసుకున్నారు. అందుకోసం కోట్లు వ్యయం చేయవలసి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాపై స్పష్టత లేకుండా ఆమోదిం చారు. 2013–14 నాటి వ్యయ అంచనాకు ఒప్పు కోవడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ధరల నిర్ణయంపైనా, భూసేకరణకు పరి హారం చెల్లించడంపైనా ఒక స్పష్టమైన అవగా హనను కేంద్రంతో కుదుర్చుకుని ఉంటే ఇప్పుడు వివాదం అయ్యేది కాదు. ఈ అంశాలన్నింటి గురించి ఈ జోనల్ సమా వేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ హుందాగా ప్రసంగిం చారు. అదే సమయంలో ఎక్కడా రాజీపడ కుండా ఆయా అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పగలిగారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఏమి చెబు తున్నారో అదే పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఒకసారి ప్రత్యేక హోదా కావాలనీ, ఇంకోసారి అక్కర్లేదనీ, అదేమీ సంజీవని కాదనీ, మళ్లీ ప్రత్యేక హోదా కావాలనీ కేంద్రం వద్ద నవ్వుల పాలయ్యారు. ఆ అంశానికి సీరియస్‌నెస్ లేకుండా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ కీలక భేటీ లలో ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తా వించకుండా ఉండటం లేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రెండు, మూడు భేటీలలోనూ ఈ అంశం తేల్చాలని గట్టిగా కోరారు. మరో ముఖ్యమైన విషయం. రుణాల పరిమితి, కేంద్రం విధించిన కోత గురించి జగన్ కొన్ని ఆస క్తికర విషయాలు వెల్లడించారు. తెలుగుదేశంకు మద్దతిచ్చే మీడియా ఇన్నాళ్లూ వైసీపీ ప్రభుత్వం రుణాలు ఇష్టం వచ్చినట్లు చేస్తోందనీ, ఫలితంగా కేంద్రం రుణాలలో కోత పెడుతూ షాక్ ఇచ్చిందనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. గత ప్రభుత్వం 2015–16 నుంచి మితి మీరి, ఎఫ్ఆర్బీఎంను అతిక్రమించి అప్పులు చేసిందని జగన్ స్పష్టంగా తన ప్రసంగంలో చెప్పారు. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ ఆ విషయాలను పట్టించు కోకుండా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆనాటి తప్పులకు ఇప్పుడు కోత పెడుతున్నారని వెల్లడిం చారు. 42,447 కోట్ల రుపాయల రుణ పరిమితి ఉంటే, 19,923 కోట్ల రుణా లను మినహాయి స్తున్నట్లు కేంద్రం తెలిపిందనీ, వచ్చే మూడేళ్లు రుణ పరిమితిలో కోత పెడుతున్నామనీ పేర్కొ న్నారని వివరించారు. ఇంత అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఆధారాలు లేకుండా మాట్లాడజాలరు. చంద్రబాబు టైమ్‌లోని అప్పుల గురించి అదరహో అని ప్రచారం చేసి, ఇప్పుడు చేస్తున్న అప్పుల గురించి నెగెటివ్‌గా ప్రచారం సాగించిన టీడీపీ మీడియా దీన్ని పట్టించుకోకుండా వదిలేసింది. వెనుకబడిన జిల్లాల ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రం పట్టించుకోవడం లేదన్న విషయాన్ని జగన్ నొక్కి చెప్పారు. వాస్తవానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సుమారు పాతికవేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇవ్వవలసి ఉండగా, వెయ్యి కోట్ల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. విభజన చట్టం ప్రకారం ఇంకా రావల్సిన సంస్థలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను జగన్ ప్రస్తావించారు. గతంలో ఏపీ సరఫరా చేసిన విద్యుత్తుకు గాను చెల్లించవలసిన బకాయిల విష యంలో తెలంగాణ ప్రభుత్వం మొండికేసిన వైనాన్ని ప్రస్తావించారు. సుమారు ఆరువేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఏపీ వాదిస్తుంటే, మూడు వేల కోట్ల పైచిలుకు మాత్రమేనని తెలంగాణ అంటున్నది. ఈ సమస్యలపై ఒక కమిటీని వేస్తామని అమిత్ షా చెప్పడం ముదావహం. తిరుపతిలో ఈ సమావేశం జరిగింది కనుక ఈ విషయాలకు ప్రాధాన్యత వచ్చింది. అమిత్ షా కూడా కొంత ఎక్కువ దృష్టి పెట్ట గలిగారు. కానీ ఆయన ఢిల్లీ వెళ్లిపోయాక, దీనికి ఫాలో అప్ లేకపోతే ఏపీకి ఒనగూరే ప్రయోజనం ఉండదు. విభజన సమ యంలో తెలంగాణ తలసరి ఆదాయం 15 వేల రూపాయలకు పైగా ఉంటే, ఏపీ తలసరి ఆదాయం 9 వేల లోపే ఉంది. హైదరా బాద్ మాదిరి ప్రధాన నగరం ఏపీలో లేదు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఏపీకి కేంద్రం సాయం చేయాలని జగన్ కోరడం బాగానే ఉంది. వీటితో పాటు విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక కారి డార్ తదితర అంశాలకు కూడా కేంద్రం ప్రాధాన్యం ఇస్తే ఏపీకి ప్రయో జనం ఉంటుంది. అమిత్ షా చెప్పినట్లు ఇవి జాతీయ అంశాలే. విభజన సమయంలో పార్లమెంటులో ప్రకంపనలు వచ్చాయి. తెలం గాణ ఎంపీలు విభజన కోరుతూ, ఏపీ ఎంపీలు వ్యతిరేకిస్తూ ఆందో ళనలకు దిగడంతో పార్లమెంటు స్తంభించింది. అయినా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టడం, దానికి బీజేపీ సహకరించడం, గందరగోళం మధ్యే బిల్లు ఆమోదం పొందడం జరిగాయి. కేంద్రానికి చెందిన కొన్ని విద్యాసంస్థలను ఇచ్చినా, వాటికి అవసరమైన నిధు లను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారన్న భావన ఉంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్రం ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి తగు రీతిలో ఆదు కుంటే ఎపీ నిలదొక్కుకుంటుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు